హే బ్రహ్మన్! భయపడకు. దేవతలారా! ధైర్యంగా ఉండండి. నేనుండగా భయమెందుకు! మీ లక్ష్మిని మళ్ళీ మీకు సమకూరుస్తాను. అయితే నా మాట కాస్త వినండి. హితమూ సత్యమూ సారభూతమూ పరిణామంలో సుఖావహమూ చెబుతున్నాను. ఆసంఖ్యాక విశ్వాలూ ఆ విశ్వాల్లో ఉన్న జనాలూ నాకు అధీనులయినట్లే నేనూ నా భక్తులకు పరాధీనుడిని. అస్వతంత్రుణ్ణి. నా భక్తుడు ఎవరిమీదనైనా అలిగితే నేనింక వారి గృహాల్లో ఉండను. నా లక్ష్మితో సహా వచ్చేస్తాను. దీనికి తిరుగులేదు. దూర్వాసుడు శంకరాంశ సముద్భవుడు. నాకు అత్యంతాప్తభక్తుడు. వైష్ణవుడు. మత్పరాయణుడు. ఆతడిచ్చిన శాపం కారణంగా నేనూ లక్ష్మీదేవీ మీ గృహాలు విడిచి వచ్చేశాం. శంఖధ్వని, తులసి, శివారాధన, బ్రాహ్మణదేవతార్చన లేనిచోట లక్ష్మీదేవి క్షణకాలమైనా నిలవదు.
నా భక్తులను నిందించినా నన్ను నిందించినా రమాదేవికి భరించరాని కోపంవస్తుంది. తనకే పరాభవంగా భావిస్తుంది. హరివాసరానగానీ నా జన్మతిథినాడుగానీ ఉపవాసం ఉండక భుజించిన మూఢుని ఇంటిలో నిముషం ఉండదు. నా దివ్యనామాలను అమ్ముకునేవాడూ కన్యావిక్రయం చేసేవాడూ అతిథిని సత్కరించనివాడూ లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతాడు. అతడి గుమ్మమైనా తొక్కదు. పాపాత్ముల ఇళ్ళకు వెళ్ళదు సరే, పాపాత్ముల ఇళ్ళకు వెళ్ళేవారి ఇళ్ళకుకూడా తాను వెళ్ళడు ఆచారభ్రష్టులూ ధర్మభ్రష్టులూ అయితే వారి గృహాలనుంచి తక్షణం నిర్గమిస్తుంది. సూపకారులుగా వృషవాహకులుగా అశుద్ధ హృదయులుగా పరదూషకులుగా మారిపోయిన బ్రాహ్మణులంటే భయపడుతుంది. వారి చేతినీళ్ళు తాకవలసి వస్తుందని పారిపోతుంది. అభక్ష్యభక్షకులన్నా అగమ్యాగాములన్నా ఎంత అసహ్యమో చెప్పలేను.
గోటితో గడ్డిపరకలు తుంపుతూ నేలపైరాస్తూ నిరాశా నిస్పృహలకు లోనైనవారి ఇంట లక్ష్మి నిలవదు. సూర్యోదయ సమయాన భుజించడం, పగటిపూట నిద్రించడం, దివామైధునం - ఇలాంటి అపరాధాలు చేసే బ్రాహ్మణుడి ఇంట అస్సలు ఉండదు.
సంధ్యావిహీనుడూ అదీక్షితుడూ ఆచారవర్జితుడూ అయిన విప్రుడు లక్ష్మికి ప్రథమశత్రువు. తడికాళ్ళతోగాని నగ్నంగాగానీ నిద్రించేవారి ఇంటినుంచి వెంటనే వెళ్ళిపోతుంది. వాచాలుడి ఇంటిలో కాలుమోపదు. అభ్యంగనస్నానం చేసి అపరిశుద్ధుణ్ణి తాకినా తొడలపై మద్దెలవాయించుకున్నా లక్ష్మికి కోపం వస్తుంది.
వ్రతోపవాసహీనుడూ విష్ణుభక్తివర్జితుడూ అశుచీ అయితే విప్రుడైనా అతడి ఇంట పద్మ ఉండదు. బ్రాహ్మణుల్ని ద్వేషించినా నిందించినా దయాహీనుడై జీవహింస చేసినా అటువంటివారి లోగిళ్ళనుంచి జగన్మాత లక్ష్మి కోపంతో పారిపోయివచ్చేస్తుంది.
హరిభక్తి హరిసేవ హరిగుణకీర్తన ఉన్నచోటల్లా తాను సర్వమంగళ ప్రదాయినిగా ఉంటుంది. శ్రీకృష్ణ ప్రశంసగానీ కృష్ణభక్తుల ప్రశస్తులుగానీ వినిపించేచోట స్థిరంగా నిలుస్తుంది. శంఖధ్వని సాలగ్రామ శిల తులసి ఉన్నచోటా వాటికి ధ్యానవందనాది సేవలు జరిగేచోటా తానై వెళ్ళి నిలుస్తుంది. శివలింగార్చన శివగుణస్తోత్రం దుర్గార్చన దుర్గాస్తుతి జరిగేతావుల్లో విప్రార్చన విప్రసేవ దేవతాపూజాదికం జరిగే గృహాలలో ఆలయాలలో స్థిరనివాసం ఎర్పరుచుకుంటుంది.
దేవతలకు వాస్తవాలను ఇలా ప్రబోధించి శ్రీమన్నారాయణుడు రమాదేవివైపు చూశాడు. చిరునవ్వులు చిందించాడు. ప్రియా! నువ్వు కళాంశరూపంతో క్షీరసాగరంలో జన్మించు - అని ఆజ్ఞాపించాడు. మళ్ళీ బ్రహ్మవైపు చూపులు త్రిప్పి - చతుర్వదనా! క్షీరసాగరాన్ని మథించి లక్ష్మీదేవిని దేవతలకు ఇప్పించు - అని చెప్పేసి చటుక్కున లేచి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు.
కొంతకాలానికి దేవతలు క్షీరసముద్రతీరం చేరుకున్నారు. మందరపర్వతాన్ని కవ్వంగా చేసి శేషుణ్ణి తాడుగా పూని కూర్మాన్ని మట్టుచుట్టుగా నిలిపి దేవదానవులు ఇరువైపులా నిలిచి క్షీరసాగరమథనం చేశారు. ధన్వంతరి అమృతం ఉచ్చైఃశ్రవం చింతామణి ఐరావతం సుదర్శనం లక్ష్మీదేవి ఆవిర్భవించాయి. లక్ష్మీదేవి స్వయంగా వనమాలను తెచ్చి విష్ణుమూర్తికి అలంకరించింది.
బ్రహ్మేశానాది సకలదేవతలూ లక్ష్మీదేవిని స్తుతించారు. సంతుష్టాంతరంగయై వారివైపు వారి గృహాలవైపూ క్రీగంటి చూపులు ప్రసరింపజేసింది. అందరూ మునుపటి శోభతో తేజస్సుతో ఆభరణాలతో వాహనాదులతో కళకళలాడారు. వారి గృహాలలో కళాకాంతులు మళ్ళీ వెల్లివిరిసాయి. ఇంద్రుడు తన అమరావతినీ స్వర్గలోకాన్నీ స్వాధీనం చేసుకున్నాడు.
No comments:
Post a Comment