ఆషాడ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అంటారు. ఈ రోజున శిష్యులు తమ గురువులను పూజిస్తారు. నాలుగు వేదాల జ్ఞానాన్ని అందించి మహాభారతం, అష్టాదశ పురాణాలు రచించిన వేదవ్యాసుడు జన్మించిన రోజు ఇదే. అందుకే దీనిని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు.
ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించివందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు. గురువుల పట్ల ఇదే గౌరవం అన్నివేళలా పాటిస్తున్నప్పటికీ ఈ రోజు వ్యాస మహా ముని పుట్టిన రోజు కాబట్టి ఈ రోజుకంత ప్రాధాన్యత ఉంది.
గురువు విశిష్టత
గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరుచుకుని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు. తర తరాలకూ కొనసాగవచ్చు.
వేద వ్యాసుడు
హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తుంటారు. వేదవ్యాసుని మానవజాతి కంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు కాబట్టి ఆయన్ను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు.
వేదాలను నాలుగు భాగాలుగా విభజించి హైందవ సాంప్రదాయంలో కృష్ణద్వైపాయుడుగా పిలువబడే వారు వ్యాసులవారు (12569 BCE). వేదాలను విభజించడం వల్ల వేద వ్యాసుడయ్యాడు. వేదాలతో పాటు మహాభారతం, మహాభాగవతంతో పాటు అష్టాదశపురాణాలు రచించాడు వ్యాసుడు. వ్యాసుడు సప్తచిరంజీవులలో ఒకడు.
వేదవ్యాసుడు జన్మ వృత్తాంతం అష్టాదశ పురాణాలలో పెక్కు మార్లు చెప్పబడింది. ఈ దిగువ నున్న వృత్తాంతం మహాభారతము ఆది పర్వం తృతీయాశ్వాసము నండి గ్రహించబడింది.
పూర్వకాలములో చేది రాజ్యాన్ని వసువు అనే మహారాజు పరిపాలన చేస్తుండేవాడు. ఒకరోజు వేటకు అడవికి వెళ్ళిన రాజు ఆ అడవిలో మునులు తపస్సు చేయడము చూసి తాను తపస్సు చేయడం ఆరంభించాడు. అప్పుడు ఇంద్రుడు అది గ్రహించి "నీ వర్ణాశ్రమధర్మ పరిపాలనకు, తపస్సుకు మెచ్చుకొంటున్నాను. నీవు నాతో స్నేహం చేసి నా వద్దకు వస్తూ పోతూ రాజ్యపాలనం చేస్తూ ఉండు" అని పలికి అతనికి దివ్యత్వాన్నీ, మణి సువర్ణమయమైన దివ్యవిమానాన్నీ, ఎటువంటి ఆయుధాలు తాకలేని వాడిపోని పద్మాలు కల ఇంద్రమాల అనే పద్మమాలను దుష్టశిక్షణకు, శిష్టరక్షణకు సమర్ధమైన వేణుయష్టినీ ఇచ్చాడు. ఆ వసురాజు విమానాన్ని ఎక్కి పైలోకంలో సంచరిస్తూ ఉండడం వలన అతనికి ఉపరిచరుడు అనే పేరు వచ్చింది.
వసువు నివసిస్తున్న నగరానికి ప్రక్కగా "శుక్తిమతి" అనే నది ఉంది. శుక్తిమతి అనే నది ప్రక్కన ఉన్న "కోలహలుడు" అనే పర్వతము "శుక్తిమతి" మీద మోజుపడి ఆ నదిని అడ్డగించగా, ఉపరిచరుడు ఆ పర్వతాన్ని తన కాలితో తొలగించాడు. శుక్తిమతికి, కోలహలుడికి మధ్య జరిగిన సంపర్కము వలన గిరిక అనే కుమార్తె "వసుపదుడు" అనే కుమారుడు జన్మిస్తారు. శుక్తిమతి వారివురిని వసువుకి కానుకగా ఇస్తుంది. వసువు గిరికని వివాహం చేసుకొంటాడు. వసువు వసుపదుడుని సైన్యాధిపతిగా చేస్తాడు.
ఒకరోజు వసువు వేటకు వెళ్తాడు అప్పుడు తన భార్య గిరిక గుర్తు రావడంతో రేతస్సు పడుతుంది. ఆ పడిన రేతస్సుని ఒక దొన్నెలో చేర్చి, ఆ దొన్నెని డేగకి ఇచ్చి తన భార్యకి ఇవ్వమంటాడు. ఆ డేగ ఆ దొన్నెను తీసుకొని పోవుతుండగా మరో డేగ చూసి అది ఏదో తినే పదార్థం అని ఆలోచించి, ఆ డేగతో పోట్లాడూతుంది అప్పుడు ఆ రేతస్సు యమునా నదిలో పడుతుంది.
పూర్వం బ్రహ్మ శాపం వలన "అద్రిక" అనే అప్సరస యమునా నదిలో చేపగా మారి తిరుగాడుతున్నది. ఆ యమునా నదిలో ఉన్న ఒక చేప ఆ రేతస్సుని భక్షిస్తుంది ఆ భక్షించడం వల్ల అది అండంతో కూడి పిండంగా మారుతుంది. పదినెలల తరువాత ఒకరోజు బెస్తవారు చేపలు పట్టు తుండగా ఈ చేప చిక్కుతుంది. దాని కడుపును చీల్చి అందులో ఒక కొడుకును ఒక కూతురును కనుగొని వారిని భద్రంగా తెచ్చి వెంటనే దాశరాజు నకు ఇస్తారు. అద్రిక అనే పేరుకల ఆ చేపరూపంలో ఉన్న అప్సర; మనుష్యులను కంటే తనకు శాపవిమోచనం తీరిపోతుందని బ్రహ్మ చెప్పిన విధంగా మత్స్య గర్భాన్ని వీడి దివ్యవనితగా మారి దేవలోకానికి వెళ్ళిపోతుంది.
ఆ మగ బిడ్డ పెద్దవాడై ఆ రాజ్యానికి రాజయ్యాడు. ఆ బాలిక మత్స్యగంధి పేరుతో పెద్దదయ్యింది. మత్స్యగంధి తండ్రి లేనప్పుడు యమునా నది పై నావ నడుపుతుండేది.
ఇలా జరుగుతుండగా ఒక రోజు వశిష్ట మహర్షి మనమడు, శక్తి మహర్షి కుమారుడైన పరాశరుడు ఆ నది దాటడానికి అక్కడకు వస్తాడు.
అక్కడ కనిపించిన మత్స్యగంధిని చూసి మోహించే రతి సుఖాన్ని ఇవ్వమంటాడు, అప్పుడు మత్స్యగంధి తన శరీరం అంతా చేపల వాసనతో ఉంటుందని, కన్యత్వం చెడిన తాను తన తండ్రికి ఏవిధంగా మొగము చూపగలని ప్రశ్నిస్తుంది.
అప్పుడు పరాశరుడు మత్స్యగంధి వసువు వీర్యానికి అద్రిక నే అప్సరసకి జన్మించినదని జన్మ వృత్తాంతం చెబుతాడు. చేపల వాసన పోయేటట్లుగా ఒక యోజన దూరము వరకు సుగంధం వెదజల్లేటట్లు వరాన్ని ఇస్తాడు. అప్పటి నుండి యోజన గంధిగా పేరు పొందింది. అప్పటి రతి జరపడానికి సంకోచిస్తున్న మత్స్యగంధితో పరాశరుడు ఆమె కన్యత్వం చెడకుండా ఉండే వరాన్ని ఇస్తాడు. పగటి పూట రతి సలపడం అనే విషయం వ్యక్తపరిస్తే, అక్కడా ఉన్న ప్రదేశాన్ని మేఘాలతో కప్పేస్తాడు. ఆ విధంగా రతి జరపగా ఒక తేజోవంతుడైన వ్యాసుడు జన్మిస్తాడు. ఆ శిశువు పుట్టిన వెంటనే క్షణమాత్రమున పెద్దవాడై తల్లికి తండ్రికి నమస్కరించి తపస్సుకి వెళ్ళి పోతాడు. తల్లికి ఎప్పుడైన మననం చేసుకొంటే ప్రత్యక్షమయ్యే వరాన్ని ఇస్తాడు.
ఆ తరువాత సత్యవతీ శంతనుల వివాహం జరిగింది.
సత్యవతీ శంతనుల వివాహకాలంలో దాశరాజు విధించిన షరతుల కారణంగా భీష్ముడు ఆమరణాంతం బ్రహ్మచర్య వ్రతం అవలంబిస్తానని భీషణ ప్రతిజ్ఞ చేశాడు. శంతనుని మరణం తరువాత వారి కుమారులైన చిత్రాంగదుడు బలగర్వంతో గంధర్వుని చేతిలో మరణం చెందాడు. విచిత్రవీరుడు సుఖలాలసతో అకాలమరణం చెందాడు.
భరతవంశం వారసులను కోల్పోయిన తరుణంలో సత్యవతి భరతవంశ పునరుద్ధరణ కొరకు తన పుత్రుడైన వ్యాసుని మనన మంత్రం చేత తన వద్దకు రప్పించింది. భరతవంశాన్ని నిలపమని వ్యాసునికి ఆదేశించింది. తల్లి ఆదేశాన్ననుసరించి వ్యాసుడు అంబికకు దృతరాష్ట్రుని, అంబాలికకు పాండురాజుని, దాసికు విదురుని ప్రసాదించి తిరిగి తపోవనానికి వెళతాడు.
ఆ తరువాత వ్యాసుడు గాంధారి గర్భస్రావం సమయంలో వచ్చి గాంధారి మృత పిండం నూట ఒక్క నేతికుండలలో పెట్టి వాటిని పరిరక్షించే విధానాన్ని చెప్పి తిరిగి తనదారిన తాను వెళతాడు.
దుర్యోధనుడు భీమునిపై మూడుమార్లు హత్యాప్రయత్నం జరిపిన పిమ్మట తన తల్లికి కురువంశంలో రానున్న పెను దుష్పరిణామాలు సూచించి వాటిని ఆమె తట్టుకోవడం కష్టమని తపోవనానికి వెళ్ళి ప్రశాంత జీవితం గడపమని సూచించి తిరిగి తనదారిన తాను వెళతాడు.
తరువాత లక్క ఇంటి దహనం తరువాత హిడింబాసురుని మరణానంతరం హిడింబి భవిష్య సూచనపై శాలిహోత్రుడు నివసించిన ఆశ్రమప్రాంతంలో పాండవులు నివసించే సమయంలో వ్యాసుడు పాండవుల చెంతకు వచ్చి వారికి ఊరట కలిగించాడు.
ఆ ఆశ్రమ మహత్యం చెప్పి అక్కడ సరస్సులో జలము త్రాగిన వారికి ఆకలి దప్పులు ఉండవని, అక్కడి వృక్షముకింద నివసించే వారికి శైత్య, వాత, వర్ష, ఆతప భయములుండవని సలహా అందించాడు. భీముని వివాహమాడ కోరిన హిడింబను కోడలిగా చేసుకోవడానికి సంశయిస్తున్న కుంతీదేవికి హిడింబ పతివ్రత అని ఆమెను కోడలిగా చేసుకోవడం శుభప్రధమని ఆమె సంతానం ద్వారా పాండవులకు సహాయమందగలదని సూచించి తనదారిని తాను వెళతాడు.
ఆ తరువాతి కాలంలో ద్రౌపది స్వయంవరానికి ముందుగా పాండవులకు దర్శనమిచ్చి వారికి ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతం వివరించి స్వయంవరానికి వెళ్ళమని వారికి శుభంకలుగుతందని చెప్పి ద్రౌపది వివాహం తీరు ముందుగానే సూచించి అంతర్ధాన మయ్యాడు.
ఇలా మహాభారతాన్ని రచించిన వ్యాసుడు భారతకథలో ఒకభాగమై ఉన్నాడు. అయినప్పటికీ వ్యాసుడు కర్తవ్యనిర్వహణ మాత్రమే చేస్తూ మిగిలిన వారికి కర్తవ్యబోధ చేస్తూ తిరిగి తనదారిన తాను వెళ్ళిపోతాడు.
బోనాలు:
తెలంగాణ ప్రాంతంలో బోనాలు(నైవేద్యం) సమర్పిస్తారు.
బోనం అనే పదం భోజనం అనే పదం యొక్క సంకోచం , ఇది సంస్కృత రుణ పదం, దీని అర్థం తెలుగులో భోజనం లేదా విందు. ఇది మాతృమూర్తికి సమర్పించే నైవేద్యం. మహిళలు తమ తలపై కుండలను మోస్తూ, ఆలయాల మీదుగా ఉన్న అమ్మవారికి పసుపు-కుంకం, కంకణాలు మరియు చీరలతో పాటు బోనం సమర్పిస్తారు. బోనాలలో మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ, నూకలమ్మ వంటి ప్రాంతీయ రూపాలలో మాతృమూర్తిని పూజిస్తారు.
ఆషాడ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం; అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ, ఊరపండుగ వంటి పేర్లతో పిలిచేవారు. ఊరడే తర్వాతి కాలంలో బోనాలుగా మారింది.
బోనాల సందర్భంగా వనస్థలిపురంలో పొట్టేళ్ళ రథం పై అమ్మవారి ఊరేగింపు
పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. నేడు దున్నపోతులకు బదులు కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది. కొంతమంది స్త్రీలు తలపై కుండని (బోనం) మోస్తూ డప్పుగాళ్ళ లయబద్ధమైన మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు.
ఆడి పూర్ణిమ
దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా తమిళనాడు పరిసర ప్రాంతములలో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇది ఆధ్యాత్మిక సాధనలకు మరియు శక్తి దేవి ఆరాధనకు అత్యంత శుభప్రదమైనది.
అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు.
పులిహోర (Chitrannam): చింతపండు, నిమ్మకాయ లేదా మామిడికాయ పులిహోర అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది.
దద్ధోజనం (Curd Rice): ప్రశాంతతను చేకూర్చే పెరుగు అన్నం తాలింపుతో నివేదిస్తారు.
పరమాన్నం / చక్ర పొంగల్ (Sweet Pongal): బెల్లం, బియ్యం, నెయ్యితో చేసే తియ్యటి ప్రసాదం.
రాగి జావ / అంబలి (Ragi Koozh): ఆడి మాసంలో అమ్మవారికి గ్రామ దేవతల ఆలయాలలో రాగి అంబలిని ప్రత్యేకంగా వండుతారు.
పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు.
ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి, చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు.
ఈ రోజున చేయాల్సిన పనులు
గురు పూర్ణిమ రోజున విష్ణువును పూజించి. మీ శక్తి మేరకు దానం చేయండి. ఈ రోజున పసుపు మిఠాయిలు, వస్త్రాలు దానం చేస్తే మంచిది. ఇలా చేయడం వల్ల జాతకంలో గురుదోషం తొలిగిపోయి అదృష్టం కలిసివస్తుంది.
మీ పెళ్లికి ఇబ్బందులు ఎదురవుతున్నట్లయితే గురు పూర్ణిమ రోజున గురు యంత్రాన్ని స్థాపించండి దీని వల్ల మీ ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగుతాయి.
చదువులో విజయం సాధించలేకపోతున్నారా? అయితే గురు పూర్ణిమ రోజున గోవును పూజించండి. ఈ రోజున భగవద్గీతను పఠించడం ఎంతో మంచిది.
పౌర్ణమి రోజున కొన్ని పనులు చేయడం ద్వారా సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. దీని కోసం, ఒక కుండలో మంచినీటిని తీసుకొని రావి చెట్టుకు ఆ నీటిని సమర్పించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు.
సాయంత్రం వేళల్లో భార్యాభర్తలు కలిసి చంద్రుని దర్శనం చేసుకుని పూజిస్తే వారి దాంపత్య జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయి.
పౌర్ణమి సాయంత్రం తులసి మొక్క ముందు ఆవు నెయ్యి దీపం వెలిగించడం వలన అదృష్టం కలిగిస్తుంది.
గురువు అనుగ్రహం:
మహాభారతాన్ని మనకు అందించిన రోజు ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజు కనుక ఆ రోజును గురుపౌర్ణమిగా జరుపుకుంటారు. మహర్షి వేదవ్యాసుడు మానవాళికి మొదటిసారిగా నాలుగు వేదాల జ్ఞానాన్ని అందించాడు. దాని కారణంగా అతనికి మొదటి గురువు బిరుదు లభించింది. పూర్ణిమ తిథి విష్ణువుకు అంకితం చేయబడింది. ఈ రోజున శ్రీ హరిని పూజించడం చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. గురు పూర్ణిమ రోజు ప్రజలు తమకు విద్యా బుద్ధులు నేర్పించిన గురువులను పూజిస్తారు.
చేయవలసిన దానాలు:
గురు పూర్ణిమ నాడు కొన్ని దానాలు చేయడం మంచిదని నమ్ముతారు. శనగపప్పు, పసుపు మిఠాయిలు, పసుపు రంగు వస్త్రాలు దానం చేస్తారు. అలాగే తిలకం ధరించి భగవద్గీత పఠనం చేయాలి. లక్ష్మీనారాయణ ఆలయంలో కొబ్బరికాయను సమర్పించడం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది.
ఆర్.యస్.యస్. సంస్థాగత స్థాయిలో అధికారికంగా జరుపుకునే ఆరు పండుగలలో ఇది ఒకటి. ఇతర ఐదు పండుగలు హిందూ సామ్రాజ్య దినోత్సవం, మకర సంక్రాంతి, దశమి, ఉగాది, రక్షాబంధన్ మహోత్సవ్ గా ఉన్నాయి.
No comments:
Post a Comment