నారాయణమహర్షీ! ఇంతకీ ఈ సురభి ఎవరు? గోలోకంనుంచి వచ్చిందన్నావుగదా! ఆ గోవు చరిత్రను తెలియజెప్పమన్నాడు నారదుడు.
నారదా! సురభి అంటే గోమాత. గోవులకు అధిష్టానదేవత. గోవులకు కన్నతల్లి. సృష్టిలో మొట్టమొదటి గోవు. గోలోకంలో ఆవిర్భవించింది.
సృష్టి తొలినాళ్ళల్లో శ్రీకృష్ణుడు గోలోకంలో రాధికాసహితుడై గోపాంగనా పరివృతుడై బృందావనానికి వెళ్ళాడు. రహఃక్రీడలతో వినోదించసాగాడు. అలసిపోయాడు. పాలుతాగాలి అనిపించింది. అనిపించడమేమిటీ వెంటనే తన శరీరంలో ఎడమభాగం నుంచి లీలావిలాసంగా దూడతోసహా ఒక పాడిఆవును సృష్టించాడు, కొత్త కుండలోకి పాలు పితికాడు. అమృతంకన్నా రుచికరమైన పాలు. జన్మ మృత్యు జరా వ్యాధి నివారకమైన క్షీరం. కడుపునిండా పుచ్చుకున్నాడు. మిగిలిన పాలతో కుండను ఒక చదువైన ప్రదేశంలో విడిచిపెట్టాడు. అక్కడ శతయోజన విస్తీర్ణమైన క్షీరసరోవరం ఏర్పడింది. చుట్టూ రత్నాలు తాపించిన గట్లు, బంగారుమెట్లు. రాధాదేవికీ గోపికా బృందానికీ అది క్రీడా సరోవరమయ్యింది.
ఆ గోవే కామధేనువు. సురభి. దాని రోమకూపాలనుంచి కోట్ల సంఖ్యలో కామధేనువులు ఆవిర్భవించాయి. ఒక్కొక్క గోపకుడికీ ఒక్కొక్క సురభిగా అవతరించాయి. కాలక్రమాన దూడలు పుట్టి పెరిగి అసంఖ్యాకంగా అభివృద్ధి చెందాయి.
శ్రీకృష్ణుడే మొట్టమొదటిసారిగా సురభిని పూజించాడు. అటుపైని ముల్లోకాలలోనూ గోపూజ ఆచారంగా స్థిరపడింది. ధ్యానమూ స్తోత్రమూ మూలమంత్రమూ పూజావిధానమూ - ఇత్యాదులన్మీ వేదోక్తంగా ఉన్నాయి. చెబుతాను గ్రహించు.
ఓం సురభ్యై నమః అనేది షడక్షరమూలమంత్రం. లక్షసార్లు జపిస్తే సిద్ది కలుగుతుంది. బుద్ధి వృద్ధులను కలిగించే ధ్యానశ్లోకాలున్నాయి.
లక్ష్మీస్వరూపాం పరమాం రాధాసహచరీం పరామ్ ।
గవామధిష్ఠాతృదేవీం గవామాద్యాం గవాం ప్రసూమ్ ॥
పవిత్రరూపాం పూతాం చ భక్తానాం సర్వకామదామ్ ।
యయా పూతం సర్యవిశ్వం తాం దేవీం సురభిం భజే ॥
ఘటంలోగానీ ధేనుశిరస్సునగానీ కట్టుగొయ్యనుగానీ(బంధస్తంభం) సాలగ్రామంలోగానీ సురభిని ఆవాహనచేసి పూజించాలి. ప్రాతస్సాయంసంధ్యల్లో ఈ పూజ నిర్వహించాలి.
వరాహావతారకాలంలో విష్ణుమాయవల్ల సురభులు ఒక్కసారిగా అన్నీ వట్టిపోయాయి. పాలచుక్క దొరక్క దేవతలు కటకటలాడారు. నెయ్యిలేక యజ్ఞాలు ఆగిపోయాయి. అందరూ వెళ్ళి బ్రహ్మతో మొరపెట్టుకున్నారు. ఆయన చెప్పిన ఉపాయం ప్రకారం దేవేంద్రుడు సురభిని స్తుతించాడు.
నమో దేవ్యై మహాదేవ్యై సురభ్యై చ నమో నమః ।
గవాం బీజస్వరూపాయై నమస్తే జగదంబికే ॥
నమో రాధాప్రియాయై చ పద్మాంశాయై నమో నమః ।
నమః కృష్ణప్రియాయై చ గవాం మాత్రే నమో నమః ॥
కల్పవృక్ష స్వరూపాయై సర్వేషాం సతతం పరే ।
క్షీరదాయై ధనదాయై బుద్దిదాయై నమో నమః ॥
శుభాయై చ సుభద్రాయై గోపప్రదాయై నమో వమః ।
యశోదాయై కీర్తిదాయై ధర్మదాయై నమో నమః ॥
ఈ స్తోత్రానికి సురభి సంతుష్టి చెందింది. ప్రత్యక్షమై ఇంద్రుడికి వాంఛితార్థసిద్ధిగా వరమిచ్చి గోలోకానికి వెళ్ళిపోయింది. దేవతలు తమ లోకానికి వచ్చేశారు. సురభులన్నీ మళ్ళీ పాడి ఆవులై క్షీరధారలు కురిపించాయి. దేవతల యజ్ఞయాగాదులు హాయిగా సాగాయి.
ఈ స్తోత్రాన్ని భక్తితో పఠించిన వారికి గో ధన ధాన్య సమృద్ధి లభిస్తుంది. కీర్తి లభిస్తుంది. పుత్రపౌత్రాభివృద్దిగా వంశం పరిఢవిల్లుతుంది. పరలోకంలో కృష్ణమందిరంలో నివాసమూ కృష్ణసేవాభాగ్యమూ దొరుకుతాయి.
No comments:
Post a Comment