స్వర్గలోకమంతా దైత్యదానవరాక్షస సంఘాల ఆక్రమణలో ఉంది. దేవతలందరూ పలాయనం చిత్తగించారు. ఎవ్వరూ కనపడలేదు. అయ్యో అనుకున్నాడు. మందాకినీతీరంలో బృహస్పతి కనిపించాడు. నీటిలో నిలబడి ధ్యానం చేసుకుంటున్నాడు. తూర్పుముఖంగా నిలబడి ఉన్నాడు. పరమానందంతో పులకిస్తున్నాడు. ఆనందబాష్పాలు రాలుస్తున్నాడు. వరిష్ఠుడు. గరిష్ఠుడు. ధర్మిష్ఠుడు. బంధువర్గానికి ఇష్టుడు. జ్ఞానుల్లో శ్రేష్ఠుడు. భ్రాతృవర్గంలో జ్యేష్ఠుడు. రాక్షసులకు అనిష్ఠుడు. బృహస్పతి ఒక జాముసేపటికి ధ్యానం ముగించి కళ్ళుతెరిచాడు. గట్టుకి వచ్చాడు. ఇంద్రుడు ఎదురువెళ్ళి సవినయంగా నమస్కరించాడు. పాదాల పైపడి బిగ్గరగా విలపించాడు. దుర్వాసో మునిపుంగవుడి శాపమూ జ్ఞానప్రాప్తీ దానవ దురాక్రమణమూ అన్నీ విన్నవించాడు. బృహస్పతికి కోపంతో కన్నులు ఎర్రబడ్డాయి.
శిష్యా! దేవేంద్రా! విన్నాను. అంతా విన్నాను. ఎందుకూ రోదిస్తావ్? ఏడ్చి సాధించేది ఏమీ లేదు గుండెలు చిక్కబట్టుకో. నీతిజ్ఞుడు ఎవడూ ఆపదల్లో బెంబేలుపడడు. సంపత్తికానీ విపత్తికానీ ఏదీ శాశ్వతం కాదు. అన్నీ నశించిపోయేవే. శ్రమనుమాత్రం మిగులుస్తాయి.
పూర్వజన్మల్లో చేసుకున్న సుకృతదుష్కృతాల ఫలాలు జన్మజన్మలకీ అనుభవించాల్సిందే. ఇది ఎవరికీ తప్పదు. చక్రనేమిక్రమంలో సుఖదుఃఖాలూ సంపద్విపత్తులూ వస్తుంటాయి. పోతుంటాయి. దుఃఖించాల్సింది ఎముంది? అనుభవించడమే. అనుభవించకుండా ఏ కర్మమూ క్షయించదు. కల్పకోటి శతజన్మలెత్తినా నశించదు. శుభాశుభకర్మఫలాలు అవశ్యానుభోక్తవ్యాలని వేదమూ చెబుతోంది, కృష్ణపరమాత్ముడూ చెప్పాడు. కర్మఫలానుభవం పూర్తిఅయితే ముక్తి లభిస్తుంది. అణుమాత్రంగా మిగిలిఉన్నా పునర్జన్మ తప్పదు. పూర్వజన్మల కర్మఫలాలను అనుభవిస్తూ ఇహజన్మలో నిష్కామంగా దేవవూజాది శుభకర్మలను చేస్తూ వెళ్ళగా వెళ్ళగా ఎప్పటికో ముక్తి. కర్మఫలానుభవపూర్తి. అలాకాక ఇహజన్మలో మళ్ళీ సకామ - దుష్కర్మలు చేస్తే ముక్తి అసంభవం. జన్మపరంపరలో రకరకాల అవతారాలతో కొట్టుమిట్టాడుతుండవలసిందే.
అందుచేత దేవరాజా! ఒకరి శాపంగానీ ఒకరి ఆశీస్సుగానీ మన కర్మఫలాలే. మహాలక్ష్మి వరించినా మహాదైన్యం లభించినా కర్మఫలమే. కోటి జన్మలనుంచి ముక్కోటి జన్మలకైనా కర్మఫలం నీడలా వెన్నంటి వస్తూనే ఉంటుంది. అనుభవించనిదే వదలదు.
దేశ-కాల-పాత్ర భేదాలవల్ల కర్మఫలాల్లో హెచ్చుతగ్గులుంటాయి. వస్తువులను దానం చేస్తున్నపుడు ఏ రోజున చేసినా ఫలం సమానమేకానీ పుణ్యదినాల్లో పుణ్యప్రదేశాల్లో పుణ్యాత్ములకు(పాత్రత) ఇస్తే ఫలం కోటిరెట్లు అధికంగా లభిస్తుంది. రైతులు అందరూ వ్యవసాయంలో కృషి సమానంగానే చేసినా క్షేత్రభేదాన్నిబట్టి (నేల సారవంతము - నిస్సారమూ) పంట దిగుబడిలో హెచ్చతగ్గులున్నట్టే పాత్రభేదాన్నిబట్టి పుణ్యఫలంలోనూ ఆధిక్యన్యూనత్వాలుంటాయి.
మామూలురోజుల్లో విప్రుడికి దానం చేసినదానికంటి ఆమావాన్య - రవిసంక్రమణ దినాల్లో దానాలు చేస్తే నూరురెట్లు ఎక్కువగా పుణ్యఫలం లభిస్తుంది. చాతుర్మాస్యంలోగానీ పున్నమినాడుగాని అయితే అనంతంగా లభిస్తుంది. చంద్రగ్రహణంనాడు కోటిగుణంగానూ సూర్యగ్రహణంనాడు శతకోటిగుణంగానూ దక్కుతుంది. అక్షయతిథినాడైతే అక్తయఫలమే. ఇలాగే ఇంకా పుణ్యదినాల్లో చేసిన దానాలు అధికంగా ఫలాలిస్తూ ఉంటాయి. ఒక్క దానానికేకాదు జపమూ తీర్థస్నానమూ దేవతారాధనమూ మొదలైన సత్కర్మలన్నింటికీ ఇది వర్తిస్తుంది. కుమ్మరి కర్రతో చక్రం తిప్పుతూ మట్టితో కుండలు ఎలా తయారు చేస్తుంటాడో అలాగే బ్రహ్మదేవుడు కర్మసూత్రంతో ఫలాలు అందిస్తుంటాడు. కర్మఫల పరతంత్రుడై జన్మలనూ రూపాలనూ సమకూరుస్తుంటాడు.
ఈ బ్రహ్మదేవుడుకూడా నారాయణుడి ఆజ్ఞమేరకే ఇవన్నీ చేస్తుంటాడు. నారాయణుడు విధాతకు విధాత. రక్షకుడికి రక్షకుడు. సంహర్తకు సంహర్త. కాలానికి కాలం. అతడిని స్మరించుకుంటే ఆపదలు తొలగిపోతాయి. మహావిపత్తిలోనైనా మధుసూదనుడిని తలచుకుంటే అంతటి విపత్తిలోనూ మహాసంపత్తి కలుగుతుందని శంకరు డంతటివాడు ప్రవచించాడు.
బృహస్పతి ఇలా ధైర్యవచనాలు పలికి శిష్యుణ్ణి కౌగిలించుకొని శుభాశీన్సులు అందించాడు.
నారదా! దేవేంద్రుడు మనసారా శ్రీహరిని స్మరించాడు. బృహస్పతిని వెంటబెట్టుకుని దేవగణంతో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. దూర్వాసుడి శాపాన్నీ తవ దురవస్థనూ దేవతల స్థితిగతులనూ విన్నవించాడు. అందరూ శిరసా నమస్కరించారు. రక్ష - రక్ష అన్నారు. చతుర్ముఖుడు మందహాసం చేసి -
బిడ్డా! నా వంశంలో జన్మించావు. నాకు మునిమనుమడివి. ఉచితానుచితాలు తెలిసినవాడివి. విచక్షుణుడివి. పైగా బృహస్పతికి శిష్యుడివి. దేవతలకు అధిపతివి. నీ మాతామహుడు దక్షప్రజాపతి స్వయంగా విష్ణుభక్తుడు. ప్రతాపవంతుడు. ఇలా కులత్రయంలోనూ పవిత్రుడైనవాడు ఎలా అహంకరించగలుగుతాడు? నీ తల్లి పతివ్రత. తండ్రీ పరిశుద్ధుడు. మాతామహుడూ మాతులుడూ (మేనమామ) జితేంద్రియులు. మరి అటువంటివాడు ఎలా ఆహంకృతుడవుతాడు? అసలెలా అహంకరించగలిగావు? దుర్వాసుడిచ్చిన పారిజాతాన్ని - విష్ణుప్రసాదాన్ని - ఏనుగుమీదకి ఎలా విసిరెయ్యగలిగావు? పైతృక - మాతామహ - గురుదోషాలవల్ల మూడింటివల్లా సాధారణంగా మానవుడు హరిదోషి అవుతాడు.
భగవంతుడు శ్రీహరి సర్వాంతర్యామి. సర్వదేహాలలోనూ (ఆత్మగా) ఉంటాడు. అతడు దేహం విడిచి వెళ్ళిపోతే అది ఆక్షణంలోనే శవమైపోతుంది. ప్రాణికోటిలో నేనే ఇంద్రియాధిపత్యం వహించే మనస్సును. శంకరుడు జ్ఞానస్వరూపుడు. విష్ణుమూర్తి ప్రాణం. ప్రకృతిదేవి - బుద్ధి స్వరూప. నిద్రాదిశక్తులన్నీ ఆ ప్రకృతిమాత కళలే. జీవుడంటే భోగశరీరధారి. పరమాత్మకు ప్రతిబింబం. ఆత్మస్వరూపుడైన ఈశ్వరుడు శరీరంనుంచి వెళ్ళిపోతే హడావిడిగా అందరూ వెళ్ళిపోతారు. మహారాజు ముందుకి కదిలితే పరివారమూ కదులుతుంది.
శివుడూ ఆదిశేషుడూ విష్ణువూ ధర్ముడూ మహావిరాట్స్వరూపుడూ నువ్వూ నేనూ అందరమూ ఆ శ్రీకృష్ణపరమాత్మ అంశలమే. భక్తులమే. అటువంటి పరాత్పరుడి ప్రసాదంగా నీచేతికి వచ్చిన పుష్పాన్ని ధిక్కరించావా? ఆ పుష్పంతోనేకదా శివుడు నిరంతరం శ్రీకృష్ణుడి పాదపద్మాలను పూజించేది. అది దుర్వాసుడి చేతులమీదుగా నీకు అందితే తిరస్కరించావా? అయ్యయ్యో! ఎంత అపరాధం! ఎంత దురదృష్టం! శ్రీకృష్ణుడి పాదపద్మాలనుంచి నేరుగా జారివచ్చిన ఆ పారిజాతాన్ని శిరసావహించినది ఏనుగైతే మాత్రమేమి అదే పరమపూజ్యం. దేవతలమందరమూ ముందుగా దాన్ని పూజించాలి. నువ్వు నిజంగా దైవవంచితుడివి. దైవమేకదా అన్నింటికన్నా బలీయం. నీలాంటి దురదృష్టవంతుణ్జి ఎవరూ రక్షించలేరు.
నువ్వు చేసిన పిచ్చిపనికి అలిగి స్వర్గలక్ష్మి ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళిపోయింది. నీ రాజ్యం రాక్షసుల పాలయ్యింది. పద, అందరమూ ఆ వైకుంఠానికే వెడదాం. శ్రీహరిని ప్రార్థిద్దాం. సేవిద్దాం. అతడు కరుణిస్తే నీ అదృష్టం బాగుంటే మళ్ళీ నీ స్వర్గలక్ష్మి నీకు దక్కుతుంది - అని అందరినీ వెంటబెట్టుకుని చతుర్ముఖుడు వైకుంఠానికి వెళ్ళాడు.
భగవంతుడూ, సనాతనుడూ తేజస్వరూపుడూ అయిన శ్రీకృష్ణపరబ్రహ్మను దర్శించారు. కోటి గ్రీష్మాదిత్యమండలాల్లాగా ప్రకాశిస్తున్నాడు. శాంతస్వరూపుడు. ఆదిమధ్యాంతరహితుడు, లక్ష్మీకాంతుడు. చతుర్భుజులైన పార్షదులూ సరస్వతీదేవీ సేవిస్తున్నారు. చతుర్వేదాలూ భక్తితో కీర్తిస్తున్నాయి. గంగాదేవి పరిచర్యలు చేస్తోంది. బ్రహ్మాదిదేవతలు అందరూ సాష్టాంగనమస్కారాలు చేశారు. అందరికీ కన్నులు చెమర్చాయి. మైమరిచి స్తుతించారు. బ్రహ్మదేవుడు వృత్తాంతమంతా విన్నవించాడు. దేవతలు ఒక్కపెట్టున బిగ్గరగా దుఃఖించారు. శ్రీమన్నారాయణుడు తేరిపారజూశాడు. దేవతల ముఖాల్లో భయమూ దైన్యమూ తాండివిస్తున్నాయి. కళాకాంతులు లేవు. పదవీచ్యుతులై వాహనాది వివర్జితులై శూన్యదేహలతో బోసిబోతున్నారు.
No comments:
Post a Comment