విశ్వేశ్వర జ్యోతిర్లింగం అనగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి (కాశీ) క్షేత్రంలో వెలసిన ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయం. ఇది పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా మరియు మోక్షప్రదాతగా భక్తులచే పూజింపబడుతోంది. కాశీని మోక్షపురిగా కూడా పిలుస్తారు.
కాశీ లేదా వారణాసి భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రము. ఇది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోవుంది. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులౌతారని హిందువుల నమ్మకం.
వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అంచేత, ఈ క్షేత్రానికి వారణాసి అని కూడా నామాంతరం ఉంది. "కాశీ" అనే పదం "ప్రకాశించడం" లేదా "కనిపించడం" అనే పదం పాత సంస్కృత పదం "కాస్" నుండి ఉద్భవించింది. బ్రిటిషువారి వాడుకలో వారణాసి, బెనారస్ అని మారింది. కాశ్యాన్తు మరణాన్ ముక్తిః - "కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది" - అని హిందువులు విశ్వసిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ ఉంది. బౌద్ధులకు, జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం. వారాణసి ప్రపంచంలోనే అవిచ్ఛిన్నంగా జనావాసం ఉన్న నగరాలలో అత్యంత పురాతనమైంది అని భావిస్తున్నారు.
ఆలయ చరిత్ర అనేక దఫాలుగా నాశనం చెయ్యబడి, పునర్నిర్మించబడిన ఘట్టాలను కలిగి ఉంది. ప్రస్తుత ఆలయం మారాఠా రాణి అహిల్యాబాయి హోల్కర్ 1780లో నిర్మించారు.
గంగా నది, హిందూమతము, హిందుస్థానీ సంగీతము, పట్టు వస్త్రాల నేత, హిందీ, సంస్కృత పండితుల పీఠం - ఇవి వారాణసి నగరపు సంస్కృతీ చిహ్నాలలో ప్రముఖంగా స్ఫురణకు వస్తాయి. హరిశ్చంద్రుడు, గౌతమ బుద్ధుడు, వేదవ్యాసుడు, తులసీదాసు, శంకరాచార్యుడు, కబీర్ దాసు, మున్షీ ప్రేమ్‌చంద్, లాల్ బహదూర్ శాస్త్రి, పండిట్ రవిశంకర్, బిస్మిల్లా ఖాన్, కిషన్ మహరాజ్ వంటి ఎందరో పౌరాణిక, చారిత్రిక, సాంస్కృతిక ప్రముఖులు వారణాసి నగరం లేదా దాని పరిసర ప్రాంతాలతో ప్రగాఢమైన అనుబంధం కలిగి ఉన్నారు. వారణాసికి గంగానది ఆవలివైపున రామనగరం ఉంది. వారణాసి సమీపంలో సారనాథ్ బౌద్ధ క్షేత్రం ఉంది.
విశ్వేశ్వరాలయం, అన్నపూర్ణాలయం, విశాలాక్షి ఆలయం, వారాహీమాతాలయం, తులసీ మానస మందిరం, సంకట మోచనాలయం, కాల భైరవాలయం, దుర్గా మాత దేవాలయం, భారతమాత మందిరం, లోలార్కడు - ఇలా కాశీలో ఎన్నో దేవాలయాలున్నాయి. దశాశ్వమేథ ఘట్టం, హరిశ్చంద్ర ఘట్టం వంటి పలు స్నాన ఘట్టాలున్నాయి.
కాశీ హిందూ విశ్వవిద్యాలయం ఇక్కడి ప్రస్తుత విద్యా సంస్థలలో ముఖ్యమైనది. వారణాసిని "మందిరాల నగరం", "దేశపు ఆధ్యాత్మిక రాజధాని", "దీపాల నగరం", "విద్యా నగరం", "సంస్కృతి రాజధాని" వంటి వర్ణనలతో కొన్ని సందర్భాలలో ప్రస్తావిస్తుంటారు.
అమెరికన్ రచయిత మార్క్ ట్వేయిన్ ఇలా వ్రాశాడు - "బెనారస్ నగరం చరిత్ర కంటే పురాతనమైంది. సంప్రదాయం కంటే పురాతనమైంది. గాథలకంటే ముందుది. వీటన్నింటినీ కలిపినా బెనారస్ నగరం కంటే తరువాతివే అవుతాయి.
వారాణసి
వారాణసి నగరానికి, గంగానదికి అవినాభావ సంబంధం ఉంది.
గంగానదితో రెండు చిన్న నదులు "వరుణ", "ఆస్సి" అనే రెండు నదుల సంగమాల మధ్య ఉన్నందున "వారణాసి" అనే పేరు వచ్చిందని ఒక అభిప్రాయం. వారాణసి నగరానికి ఉత్తరాన వరుణ సంగమ స్థానం, దక్షిణాన అస్సి (ఇది చిన్న నది) నది సంగమ స్థానం ఉన్నాయి.
మరొక అభిప్రాయం ప్రకారం "వరుణ" నదికే పూర్వకాలం "వారాణసి" అనే పేరు ఉండేది. కనుక నగరానికి కూడా అదే పేరు వచ్చింది. కాని ఈ రెండవ అభిప్రాయం అధికులు విశ్వసించడంలేదు.
"వారాణసి" అనే పేరును పాళీ భాషలో "బారనాసి" అని వ్రాసేవారు. అది తరువాత బనారస్‌గా మారింది. వారాణసి నగరాన్ని ఇతిహాస పురాణాలలో "అవిముక్తక", "ఆనందకానన", "మహాస్మశాన", "సురధాన", "బ్రహ్మవర్ధ", "సుదర్శన", "రమ్య", "కాశి" అనే వివిధ నామాలతో ప్రస్తావించారు.
చరిత్ర
ఇది హిందువుల ఏడు పవిత్ర నగరాలలో ఒకటి. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కాంద పురాణం వంటి అనేక భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలలో కాశీనగరం ప్రసక్తి ఉంది. కాశీ నగరం శివుని త్రిశులం ఆధారం చేసుకొని వుంది అని నమ్మకం. కావున, యుగపూర్వం నుండి మరియు యుగాంతం తరువాత కూడా నిలిచే ఏకైక నగరం కాశీ.
విద్యకు, పాండిత్యానికి, శిల్పం, వస్త్రం, సుగంధ ద్రవ్యాలవంటి వస్తువుల వ్యాపారానికి వారాణసి కేంద్రంగా ఉంటూ వచ్చింది. గౌతమ బుద్ధుని కాలంలో ఇది కాశీ రాజ్యానికి రాజధాని. చైనా యాత్రికుడు యువాన్ చాంగ్ ఈ నగరాన్ని గొప్ప ఆధ్యాత్మిక, విద్యా, కళా కేంద్రంగా వర్ణించాడు. ఇది గంగానదీ తీరాన 5 కిలోమీటర్ల పొడవున విస్తరించిందని వ్రాశాడు.
18వ శతాబ్దంలో వారాణసి ఒక ప్రత్యేక రాజ్యమయ్యింది. తరువాత బ్రిటిష్ పాలన సమయంలో ఈ నగరం ఆధ్యాత్మిక, వాణిజ్య కేంద్రంగా కొనసాగింది. 1910లో "రామ్‌నగర్" రాజధానిగా బ్రిటిష్ వారు ఒక రాష్ట్రాన్ని ఏర్పరచారు. కాని ఆ రాష్ట్రానికి వారాణసి నగరంపైన మాత్రం పాలనాధికారం లేదు. ఆ వంశానికి చెందిన కాశీ నరేష్ మహారాజ్ ఇప్పటికీ రామ్ నగర్ కోటలోనే నివసిస్తున్నాడు.
పురాణకథనాలు
కాశీ శివస్థాపితమని పురాణకథనాలు వివరిస్తున్నాయి. కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు భాతృహత్య, బ్రహ్మహత్యా పాతకాల నుండి విముక్తులవడానికి సప్తముక్తి పురాణాలలో ఒకటైన కాశీ పట్టణానికి విచ్చేసారు.అయోధ్య, మథుర, గయ, కాశి, అవంతిక, కంచి, ద్వారక నగరాలను సప్తముక్తి పురాలని హిందువుల విశ్వాసం. ఆరంభకాల పూరాతత్త్వ పరిశోధనలు వారణాశి పరిసరప్రాంతాలలో 11-12 శతాబ్ధాలలో నివాసాలు ఆరంభమయ్యాయని తెలియజేస్తున్నాయి. ఇది ఆర్యుల మత, తత్త్వ శాస్త్రాలకు మూలమని విశ్వసించబడుతుంది. ప్రపంచంలో నిరంతరంగా నివాసయోగ్యమైన ప్రదేశాలలో కాశీ ప్రథమ స్థానంలో ఉందని భావిస్తున్నారు.
పురాతత్త్వ అవశేషాలు వారణాశి వేదకాల ప్రజల అవాసమని వివరిస్తున్నాయి. కాశీ పట్టణం గురించి ప్రథమంగా అధర్వణ వేదంలో వర్ణించబడింది. అధర్వణవేదం సుమారుగా వేదకాలంలో ప్రజలిక్కడ నివసించారని భావిస్తున్న సమయానికి సరిపోతున్నాయి. ఈ ప్రాంతంలో స్థానికులు నివసించారని చెప్పడానికి తగిన ఆధారాలు లభిస్తున్నాయి.
8వ శతాబ్దంలో 23వ జైనగురువు, ఆరంభకాల తీర్ధగురువు అయిన పార్శ్వనాథుడి జన్మస్థానం వారణాసి అనడానికి ఆధారాలు లభిస్తున్నాయి.
ఆర్ధికం
వారణాశి పారిశ్రమికంగా కూడా అభివృద్ధి చెందింది. వారణాశి మస్లిన్, పట్టు వస్త్రాలకు, సెంటు, దంతపు వస్తువులు, శిల్పాలకు ప్రసిద్ధి. గౌతమబుద్ధుడు (జననం 567 సా.శ. పూ) నివసించిన కాలంలో కాశీ రాజ్యానికి కాశీ రాజధానిగా ఉండేది. సా.శ.పూ 528 బుద్ధిజం కాశీలో స్థాపించబడిందని అంచనా. గౌతమ బుద్ధుడు కాశీలోని సారనాధ్ వద్ద "ధర్మచక్రం కదిలింది (టర్నింగ్ ది వీల్ ఆఫ్ లా)" మొదటిసారిగా గంభీరఉపన్యాసం ప్రజలకు అందించాడు.
చైనా యాత్రికుడు హూయంత్సాంగ్ సా.శ. 635లో వారణాశిని దర్శించాడు. కాశీ పశ్చిమతీరంలో ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన వారణాశి మతం, కళలకు కేంద్రంగా ఉండేదని హూయంత్సాంగ్ వర్ణించాడు. 7వ శతాబ్దంలో హూయంత్సాంగ్ వారణాశిలో నివసించాడు. హూయంత్సాంగ్ వారణాశిని " పోలనైస్ " అని పేర్కొన్నాడు. 30 సన్యాదులకు సంబంధించిన 30 ఆలయాలను కూడా ఆయన వర్ణించాడు.
8వ శతాబ్దంలో శంకరాచార్యుడు శివారధన విధానాలను సాధికారంగా ఆరంభించిన తరువాత వారణాశి మతపరంగా మరింత ప్రసిద్ధి చెందింది.
ప్రముఖులు
మౌర్యుల కాలంలో తక్షశిల, పాటలీపుత్ర మద్య ఉన్న రహదారితో కాశీపట్టణం అనుసంధానించబడి ఉంది. 1194లో వారణాశి నగరం కుతుబుద్దీన్ ఐబక్ స్వాధీనమైంది. కుతుబుద్దీన్ ఐబక్ ఆదేశంతో నగరంలోని సుమారు 1000 ఆలయాలను ధ్వంసం చేయబడ్డాయి. ముస్లిం ఆక్రమణలో నగరం దాదాపు 3 శతాబ్ధాల కాలం క్షీణావస్థను చవిచూసింది. ఆఫ్ఘన్ దండయాత్ర తరువాత నగరంలో సరికొత్తగా ఆలయాలు నిర్మించబడ్డాయి. ఫెరోజ్ షాహ్ కాలంలో 1376లో వారణాశిలోని మరికొన్ని ఆలయాలు ధ్వంసం చేయబడ్డాయి. ఆఫ్ఘన్ రాజు సికిందర్ లోడి హిందువుల అణిచివేతను కొనసాగిస్తూ 1496లో మిగిలిన హిందూ ఆలయాలను ధ్వంసం చేయించాడు.
ముస్లిం పాలన కాలంలోనే మరొకవైపు వారణాశి మేధావులకు, తాత్వికులకు కేంద్రంగా మారింది. మద్యకాలంలో వారణాశి మతసంప్రదాయాలకు, విద్యకు కేంద్రమై విలసిల్లింది. భక్తి ఉద్యమకాలంలో వారణాశిలో 1389లో రామభక్తుడైన కబీరుదాసు జన్మించాడు. కబీరరుదాసు రచించిన భక్తిరసపూరిత కీర్తనలు 15 వ శతాబ్దంలో భారతదేశంలో కీర్తించబడ్డాయి.
అలాగే 15 వ శతాబ్దంలో సంఘసంస్కర్త, యోగి, కవి, యాత్రికుడు, మతగురువు అయిన రవిదాసు వారణాశిలో జన్మించాడు. రవిదాసు జీవనోధి కొరకు తోళ్ళపరిశ్రమలో పనిచేసాడు. అలాగే భారతదేశం, దక్షిణాసియా అంతటి నుండి అనేక ప్రఖ్యాత విద్యావేత్తలు, బోధకులు వారణాశిని సందర్శించారు. 1507లో గురునానక్ దేవ్ శివరాత్రి సందర్భంగా వారణాశిని సందర్శించాడు. ఈ సంఘటన సిక్కుమత స్థాపనలో అత్యంత ప్రాముఖ్యత వహించింది.
స్వాతంత్రానికి ముందు చరిత్ర
16వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి అక్బర్ పాలనలో వారణాశిలో సరికొత్త సంస్కృతి మొదలైంది. ఆక్బర్ చక్రవర్తి ఆధ్వర్యంలో వారణాశిలో శివునికి, విష్ణుమూర్తికి రెండు పెద్ద ఆలయాలను నిర్మించబడ్డాయి. పూనా రాజు 200 మీటర్ల (660 అడుగులు) ఎత్తైన అన్నపూర్ణాదేవి మందిరం నిర్మించాడు. అలాగే పూనా రాజు పాలనలో శివా - విష్ణులకు అంకితమివ్వబడిన అక్బారి వంతెన కూడా నిర్మించబడింది.
16వ శతాబ్దం నుండి వారణాశికి యాత్రికుల రాక ప్రారంభమైంది. 1665లో ఫ్రెంచి యాత్రికుడైన " జీన్ బాప్టిస్ట్ ట్రావర్నియర్ " ఈ నగరాన్ని సందర్శించి వారణాశిలోని గంగాతీరంలో ఉన్న "బిందు మహాదేవాలయం" సౌందర్యాన్ని వర్ణించాడు. చక్రవర్తి షేర్ షాహ్ సూరి కాలంలో వారణాశి రహదారి పునరుద్దరినబడి కోల్‌కత నుండి పెషావర్ వరకు పొడిగించబడింది.
తరువాత బ్రిటిష్ పాలనా కాలంలో ఈ రహదారి ప్రఖ్యాతమైన " గ్రాండ్ ట్రంక్ రోడ్డుగా " అవతరించింది. 1656లో ఔరంగజేబు పలు ఆలయాలు ధ్వంసం చేయబడి మసీదులు నిర్మించబడ్డాయి. నగరం తిరిగి సంస్కృతి పరంగా వెనుకబడింది. అయినప్పటికీ ఔరంగజేబు మరణానంతరం భారాదేశంలో తిరిగి హిందూ రాజ్యాలు తలెత్తి వర్ధిల్లాయి. ప్రస్తుతం వారణాశిలో ఉన్న ఆలయాలు హిందూ రాజులైన రాజపుత్రులు, మరాఠా రాజులచేత నిర్మించబడ్డాయి.
ప్రస్తుతం వారణాసిలోని పలు నిర్మాణాలు 18వ శతాబ్దానికి చెంది ఉన్నాయి. బెనారస్ రాజు లేక కాశీ నరేష్ తో సహా ఈ రాజులు బ్రిటిష్ పాలనా సమయంలో (సా.శ. 1775-1945) కూడా కొనసాగారు. 1737లో మొగల్ చక్రవర్తుల ఆధ్వర్యంలో " బెనారస్ రాజ్యం (కింగ్డం అఫ్ బెనారస్) " పేరుతో సాధికారంగా ఏర్పాటు చేయబడి 1947 వరకు కొనసాగింది.
18వ శతాబ్దంలో మహమ్మద్ షాహ్ ఆధ్వర్యంలో గంగాతీరంలో ఉన్న మాన్ మందిరం ఘాట్ వద్ద ఒక " అబ్జర్వేటరీ " కేంద్రాన్ని నిర్మించబడింది. ఇది జ్యీతిషశాస్త్ర విషయాల పరిశీలనకు అనుకూలమైంది. 18వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి బ్రిటిష్ గవర్నర్లైన వారెన్ హేస్టింగ్, వారణాశిలో సంస్కృత కళాశాలను స్థాపించిన జూనాథాన్ డంకన్ కాలంలో వారణాశి పర్యాటకం మరింత వర్ధిల్లింది.
1867లో వరణాశిలో పురపాలక సంఘస్థాపన జరిగిన తరువాత వారణాశి నగరంలో మరింత అభివృద్ధి కొనసాగింది.
ప్రత్యేక సంఘటనలు
1897లో మార్క్ ట్వైన్, వారణాశి గురించి వర్ణిస్తూ " బెనారస్ చరిత్రకంటే పురాతనమైనది. సంప్రదాయాలకంటే పాతది, పురాణాలకంటే పురాతనమైనది అలాగే అన్నింటికంటే అత్యంత పురాతనమైనది. 1910లో బ్రిటిష్ ప్రభుత్వం వారణాశిని భారతీయ భూభాగంగా చేసి రామనగరాన్ని రాజధానిగా చేసి తన న్యాయపరిధి నుండి తొలగించింది. అయినప్పటికీ తరువాత కూడా గంగాతీరంలో వారణాశి భుభాగంలో ఉన్న రామనగర్ కోటలో కాశిరాజు నివసిస్తూ ఉన్నాడు. ప్రస్థుతం రామనగర్ కోటలో కాశిరాజులకు చెందిన వస్తుసంగ్రహాలతో మ్యూజియం నిర్వహించబడుతుంది. 18వ శతాబ్దం నుండి ఈ కోటలో కాశీరాజులు నివసిస్తూ వచ్చారని ప్రాంతీయ వాసులు వివరిస్తున్నారు. రాజు మతపరంగా అధ్యక్ష స్థానంలో ఉంటాడు అలాగే ప్రజలు రాజుని శివుని అవతారంగా భావిస్తారు. రాజు స్వయంగా అన్ని మతసంప్రదాయాల సంప్రదాయాలకు ఆధిపత్యం వహిస్తుంటాడు.
1857 లో వారణాశిలో బ్రిటిష్ సామ్రాజ్యానికి చెందిన భారతీయ సైనికులు స్వాతంత్ర సమరయోధుల మీద జరిగిపిన దమనకాండలో సామూహిక హత్యలు జరిగాయి. వారణాశిలో అనీబిసెంట్ దియోసాఫీ సిద్ధాంతం ప్రతిపాదించడమేగాక "సెంట్రల్ హిందూ కాలేజ్" స్థాపన కూడా చేసింది. తరువాత సెంట్రల్ హిందూ కాలేజ్ 1916 నుండి "బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం" గా మారింది. ఇది మతాతీతంగా విద్యాసేవలు అందిస్తుంది. అనీబిసెంట్ సెంట్రల్ హిందూ కాలేజ్ ని అన్ని మతాలకు చెందిన మనుషులు కేంద్రీకృతమై సహోదరత్వంతో కృషిచేసి భారతీయ సంస్కృతిని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో స్థాపించింది.
అలాగే భారతీయ సమూహాలలో ఉన్న మూఢవిశ్వాసాలను తొలగించడం అనీబిసెంట్ లక్ష్యాలలో భాగమే. వారణాశి 1948 అక్టోబరు 15 న యూనియన్ ఆఫ్ ఇండియాకు ఇవ్వబడింది. 2000 లో విభూతి నారాయణన్ సింగ్ మరణం తరువాత ఆయన కుమారుడైన అనంత్ నారాయణ్ సింగ్ రాజయ్యాడు. రాజు కాశీరాజు సంప్రదాయాల ఆచరణ బాధ్యతను వహిస్తాడు.
భౌగోళికం
వారాణసి నగరం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం తూర్పు భాగంలో గంగా మైదానంలో, గంగానది ఒడ్డున ఉంది. ఇక్కడ గంగానది వంపు తిరిగి ఉంది. ఇది వారాణసి జిల్లాకు కేంద్రం కూడాను. వారాణసి నగరం, దాని పరిసర ప్రాంతాలు కలిపి మొత్తం 112.26 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్నాయి. గంగానది వరదలతో ఈ ప్రాంతం నేల సారవంతంగా ఉంటుంది.
వారాణసి నగరం మాత్రం గంగ, వరుణ నదుల మధ్య ఉంది. ఈ నగరం సముద్ర మట్టం నుండి 80.71 మీటర్ల ఎత్తులో ఉంది. పెద్దగా ఉపనదులు, పిల్ల కాలువలు లేనందున ఇక్కడి భూమి అధికంగా పొడిగా ఉంటుంది.
వారాణసి నగరం రెండు సంగమ స్థానాల మధ్య ఉన్నట్లుగా చెప్పబడుతుంది. (1) గంగ, వరుణ నదుల సంగమం (2) గంగ, అస్సి నదుల సంగమం. అస్సి నది చాలా చిన్నది (కాలువ వంటిది) ఈ రెండు సంగమాల మధ్య దూరం సుమారు 2.5 కిలోమీటర్లు. ఈ రెండు సంగమ స్థానాల మధ్య (5 కిలోమీటర్ల) యాత్ర "పంచ క్రోశి యాత్ర" పవిత్రమైనదిగా భావిస్తారు. యాత్రానంతరం సాక్షి వినాయకుని మందిరాన్ని దర్శిస్తారు.
సంస్కృతి
గంగా నది ఒడ్డున ఉన్న వారణాసి ప్రతి సంవత్సరం వేలాది మంది హిందూ యాత్రికులను ఆకర్షిస్తుంది.
వారాణసి సమకాలీన జనజీవనం తక్కిన నగరాల వలెనే ఉంటుంది. అయితే వారాణసికి హిందూమతంలో ఉన్న ప్రాధాన్యత వలన ఇక్కడి గంగానది, స్నానఘట్టాలు, దేవాలయాలు, హిందూ మత సంస్థలు సంస్కృతీ చిహ్నాలుగా ప్రముఖంగా ప్రస్తావించబడుతాయి. ఇంతే కాకుండా పట్టు చీరల నేత, హిందూ-ముస్లిమ్ సహ జీవనం (మత కలహాలు కూడా), హిందూస్తానీ సంగీతం, ఘరానా, పెద్ద సంఖ్యలో వచ్చే పర్యాటకులు నగర జీవనంలో ప్రముఖంగా కానవచ్చే అంశాలు. గంగానది తీరాన, పాత నగరంలో ఇండ్లు, ఆలయాలు, దుకాణాలు ఇరుకు ఇరుకుగా ఉంటాయి. అధిక జనాభా నగరంలో ఇతర ప్రాంతాలలో నివసిస్తున్నారు.
గంగానది
గంగానదికి, వారాణసికి హిందూ మతంలో ఉన్న ప్రాముఖ్యత వలన ఈ రెండింటికి అవినాభావమైన సంబంధం ఉంది. ప్రధానమైన విశ్వేశ్వరాలయం, మరెన్నో ఆలయాలు గంగానది వడ్డున ఉన్నాయి. అనేక స్నాన ఘట్టాలు గంగానది వడ్డున ఉన్నాయి. గంగానదిలో స్నానం కాశీయాత్రలో అతి ముఖ్యమైన అంశం. ఈ మత పరమైన అంశాలే కాకుండా నీటి వనరుగా కూడా ఇది చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది.
వారణాసిలో స్నానఘట్టాలు
వారణాశిలో గంగా తీరమంతా స్నానఘట్టాలతో నిండి ఉంటుంది. స్నాఘట్టాలలో రాతిపలకతో నిర్మించబడిన మెట్లు ఉంటాయి. యాత్రీకులు స్నానం ఆచరించడానికి, సంప్రదాయక ఆచారాలను అనుష్ఠించడానికి అనువైన ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి. వారాణసిలో సుమారు 84 ఘాట్‌లు ఉన్నాయి.
వీటిలో చాలా వరకు ఇక్కడ మరాఠా పరిపాలనా కాలంలో అభివృద్ధి చేయబడ్డాయి. ఈ స్నానఘట్టాలు మరాఠీలు, సింధీలు (సింధియాలు), హోల్కార్లు, భోంస్లేలు, పెషావర్లు నిర్మించబడ్డాయి. కొన్ని ఘాట్‌లు ప్రైవేటు ఆస్తులుగా ఉంటున్నాయి. ఉదాహరణకు "శివాలా ఘాట్", "కాళీ ఘాట్"లకు స్వంతదారు కాశీ మహారాజు.
ఎక్కువ ఘాట్‌లు స్నానానికి, దహనకాండలకు వాడుతారు. కొన్న ఘాట్‌లు పురాణ గాథలతో ముడివడి ఉన్నాయి. ఆధ్యాత్మిక, భౌతిక భావాలతో కూడిన పవిత్రభావాలకు ఈ స్నానఘట్టాలు ప్రతీకలుగా ప్రశంశించబడుతున్నాయి. ఈ స్నానఘట్టాలు పురాణ ఘట్టాలతో ముడివడి ఉన్నాయి. వీటిలో దశాశ్వమేధఘట్టం, పంచగంగ ఘట్టం, ధహనసంస్కారాలు జరిపించే మణికర్ణికా, హరిశ్చంద్రా ఘాట్లు ప్రత్యేకమైనవి.
ఉదయం బోటులో స్నానఘట్టాలను దర్శించడం యాత్రీకులను ఎక్కువగా ఆకర్షించే విషయాలలో ఒకటి. స్నానఘట్టాలలో అనేక ఆలయాలు కూడా ఉంటాయి.
తులసీ ఘాట్
తులసీ ఘాట్ వద్ద తులసీదాసు తులసీ రామాయణాన్ని రచించాడని విశ్వసిస్తున్నారు.
దశాశ్వమేధ ఘాట్
కాశీ విశ్వనాధ మందిరం ప్రక్కనే ఉన్న దశాశ్వమేధ ఘాట్ వారణాశిలో ఉన్న స్నాన ఘట్టాలలో అతి పురాతనమైనదిగా భావిస్తున్నారు. ఇది యాత్రికులతోను, పూజారులతోను, అమ్మకందారులతోను ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. వెనుక ప్రక్కనే అనేక మందిరాలు దర్శనమిస్తూ ఉండడంతో ఇది ఫొటోలు తీసికొనేవారికి చాలా ప్రియమైన స్థలం. బ్రహ్మ స్వయంగా ఇక్కడ పది అశ్వమేధ యాగాలు చేసి శివుడిని ఇక్కడ కొలువుండమని కోరాడని పురాణ గాథ.
ప్రతి రోజూ సాయంకాలం పూజారులు ఇక్కడ అగ్ని పూజ చేసి, శివుడిని, గంగమ్మను, సూర్యుడిని, అగ్నిని, విశ్వాన్ని కొలుస్తారు. ఇక్కడ శూలకంథేశ్వరుడు, బ్రహ్మేశ్వరుడు, వరాహేశ్వరుడు, అభయవినాయక ఆలయాలతో గంగా, బండిదేవి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి రోజు నిర్వహించే హారతి నదిలో నుండి చూడడానికి యాత్రీకులు ఇక్కడి ఇక్కడ ఉన్న పడవలను మాత్రమే ఎక్కాలి. వారు ఒకసారి ఘాట్లన్నింటిని చూపించి తిరిగి ఘాటు వద్దకు బోట్లను తీసుకువచ్చి నదిలో నిలిపి వేస్తారు. యాత్రీకులు అక్కడి నుండి హారతి చూడవచ్చు.
మణికర్ణికా ఘాట్
మణి కర్ణికా ఘట్టం ఎంతో పావనమైనదిగా హిందువులు భావిస్తారు. ఒక గాథ ప్రకారం శివుని సమక్షంలో విష్ణువు ఇక్కడ తన సుదర్శన చక్రంతో ఒక గోతిని తవ్వాడు. దానిని తన స్వేదంతో నింపుతుండగా విష్ణువు చెవి కుండలం (మణి కర్ణిక) అందులో పడింది.
మరొక కథ ప్రకారం పార్వతీదేవి తన చెవిపోగు (మణికర్ణిక)ను ఇక్కడ దాచిపెట్టి, దానిని వెతకమని శివుడిని కోరింది. దానికోసం వెతుకుతూ అక్కడే శివుడు ఉండిపోవడం వల్ల అతడు దేశద్రిమ్మరి కాడని పార్వతి ఆలోచన అట. ఇక్కడ దహనమైన శరీరం తాలూకు ఆత్మను శివుడు స్వయంగా మణికర్ణిక కనిపించిందేమోనని అడుగుతాడట.
పురాణ కథనాల ప్రకారం ఈ మణికర్ణికా ఘాట్ యజమానే హరిశ్చంద్రుడిని కొని, హరిశ్చంద్ర ఘాట్‌లో కాటిపనికి నియమించాడు. మణి కర్ణికా ఘాట్, హరిశ్చంద్రఘాట్‌లలో అధికంగా దహన సంస్కారాలు జరుగుతుంటాయి. మణికర్ణికాఘాటుకు మహాశ్మశానమని మరొక పేరుకూడా ఉంది. ఈ ఘాట్ గురించి మరొక కథనం కూడా ప్రచారంలో ఉంది.
ఈ తీర్థమును ఈశ్వరుడు చూడాలని అనుకుని పరమేష్టికై 1008 సంవత్సరములు తపస్సు చేసాడట. ఈశ్వరుడు ప్రత్యక్షమై, ఆ తీర్థం విశిష్టతను తెలుసుకుని చాల సంతోషించి తల ఊపాడట. అలా ఊపినప్పుడు కుడి చెవి మణి జారి సరస్సు మధ్యలో పడింది. కావున దాని పేరు మణికర్ణికా ఘట్టంగా పేరు.
ప్రస్తుత ఘాట్ 1032 లో నిర్మించబడింది. 4వ శతాబ్దంలో గుప్తుల కాలంలో ఈ ఘాట్ ప్రస్తావన ఉంది. ఈ ఘాట్ వద్ద ఉన్న తారకేశ్వరాలయంలో నుండి పరమశివుడు మరణిస్తున్న వారి చెవిలో తారకనామం ఉపదేశిస్తుంటాడని విశ్వసించబడుతుంది. ఇక్కడ మరణించిన వారికి మోక్షం ప్రసాదించమని పరమశివుడు విష్ణువును కోరిన ప్రదేశమిదే ఈ మణికర్ణిక ఘట్టములో మిట్ట మధ్యాహ్నం మణికర్ణిక స్తవం చదువుకుని, స్నానం చేసిన చాలా పుణ్యం వస్తుందని శంకర భగవత్పాదులవారు శివా నంద లహరిలో చెప్పారు అంతటి పుణ్యం కాశీలోని మణికర్ణిక ఘట్టంలో మధ్యాహ్న స్నానం చేసిన కలుగుతుందని, ఈ పుణ్య ఫలం కాశీలో ఒక యజ్ఞం చేసిన దాని కంటే కూడా ఎక్కువని చాగంటి తన శివ వైభవ ప్రసంగంలో చేప్పారు అని ప్రజల విశ్వాసం.
సింధియా ఘాట్
150 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఘాట్ బరువుకు ఇక్కడి శివాలయం కొంతవరకు నీట మునిగి ఉంటుంది. ఇది అగ్ని దేవుని జన్మ స్థలమని పురాణ కథనం. మగ సంతానం కావాలని కోరేవారు ఇక్కడ వీరేశ్వరుని అర్చిస్తారు. సింధియా ఘాట్‌కు ఉత్తరాన మణికర్ణికా ఘాట్ ఉంది. వెనుక ప్రక్క సిద్ధక్షేత్రంలో అనేక ముఖ్యమైన అలయాలున్నాయి.
మన మందిర్ ఘాట్
1770లో జైపూర్ రాజు మహారాజా జైసింగ్ ఈ మన మందిర్ ఘాట్‌ను, దాని వద్ద యాత్రా మందిరాన్ని నిర్మింపజేశాడు. యాత్రా మందిరం రాజస్థాన్-ఢిల్లీ శైలిలో చక్కని అలంకృత గవాక్షాలతో ఉంటుంది. ఇక్కడ భక్తులు సోమేశ్వరుని అర్చిస్తారు.
మానస-సరోవర్ ఘాట్
అంబర్ రాజు మాన్‌సింగ్ మానస-సరోవర్ ఘాట్‌ను నిర్మింపజేశారు.
దర్భంగా ఘాట్
దర్భంగా మహారాజు దర్భంగా ఘాట్‌ను నిర్మింపజేశారు.
లలితా ఘాట్
ఇది నేపాల్ రాజుచే నిర్మింపజేయబడింది. ఇక్కడ నేపాలీ శైలిలో చెక్కతో నిర్మించిన గంగా కేశవ మందిరం ఉంది. ఈ విష్ణ్వాలయంలో పాశుపతేశ్వరస్వామి విగ్రహం ఉంది.
అస్సీ ఘాట్
ఇది చాలా సుందరమైనది. అన్ని ఘాట్‌లకు చివర ఉంది. ఇది ఫొటోగ్రాఫర్లు, చిత్రకారులు, వాద్య బృందకారులతో కోలాహలంగా ఉంటుంది.
బచరాజ్ ఘాట్
జైన భక్తులు బచరాజ్ ఘాట్‌ను సందర్శిస్తారు. అక్కడ నది వడ్డున మూడు జైనాలయాలున్నాయి. తులసీ ఘాట్ వద్ద గోస్వామి తులసీ దాస్ రామచరిత మానస్ కావ్యాన్ని రచించాడు.
ఆలయాలు:
వారణాసి ఆలయాలకు నెలవు. చరిత్రలో వివిధ కాలాల్లో నిర్మించబడ్డ పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయి. ఇంకా ప్రతీ వీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించవచ్చు. చిన్న ఆలయాల్లో కూడా దైనందిన ప్రార్థనలు, కార్యక్రమాలు జరుగుతుంటాయి. వారణాశిలో అనేక (దాదాపు 23,000) ఆలయాలు ఉన్నాయి. అయినప్పటికీ అత్యధికంగా ఆరాధించబడే ఆలయం విశ్వనాధ మంధిరం, హనుమాన్ మందిరం, దుర్గా మందిరం (ఈ మందిర సమీపంలో నివసిస్తున్న అనేక ఉన్న కోతుల కారణంగా ఈ మందిరం కోతుల ఆలయంగా కూడా పిలువబడుతుంది).
విశ్వనాధ మందిరం
కాశీ విశ్వనాధ మందిరం వారాణసిలో ప్రధాన ఆలయంగా చెప్పుకోవచ్చును. దీని గోపురంపైన పూసిన బంగారు పూత కారణంగా దీనిని "బంగారు మందిరం" అని కూడా అంటుంటారు. ప్రస్తుతం ఉన్న మందిరాన్ని 1780లో ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ కట్టించింది. ఇందులో లింగాకారంగా కొలువై ఉన్న దేవుడు "విశ్వేశ్వరుడు", "విశ్వనాధుడు" పేర్లతో పూజలందుకొంటుంటాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశ్వేశ్వర లింగం దర్శనం తక్కిన లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రథమని భక్తుల విశ్వాసం.
ఈ ఆలయం పలుమార్లు విద్వంశం చేయబడి తిరిగి నిర్మించబడింది. ఆలయసమీపంలో ఉన్న "గ్యాంవాపీ" మసీదు ప్రాంతమే అసలైన ఆలయం ఉన్న ప్రదేశం. 1785లో అప్పటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ సూచనల మేరకు కలెక్టర్ మొహమ్మద్ ఇబ్రాహీమ్ ఖాన్ ఈ ఆలయం ముందు భాగంలో ఒక "నౌబత్ ఖానా" కట్టించాడు.
1839లో పంజాబ్ కేసరిగా పేరొందిన మహారాజా రంజిత్ సింగ్ ఈ ఆలయం రెండు గోపురాలకు బంగారపు పూత పూయించడానికి సరిపడా బంగారం సమర్పించాడు. 1983 జనవరి 28న ఈ మందిరం నిర్వహణా బాధ్యతలను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం హస్తగతం చేసుకొని అప్పటి కాశీ రాజు డా. విభూతి నారాయణ సింగ్ అధ్వర్యంలోని ఒక ట్రస్టుకు అప్పగించింది.
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో అప్పటి మందరిరం విధ్వంసం చేయబడింది. తరువాత సమీపంలో మరొక మందిరం కట్టబడింది. ఈ విషయం హిందూ-ముస్లిమ్ వర్గాల మధ్య ఘర్షణలకు దారితీసే విభేదాలలో ఒకటి.
అన్నపూర్ణామందిరం
కాశీ విశ్వనాథాలయానికి సమీపంలో అన్నపూర్ణాదేవి ఉంది. విశ్వనాథుని దర్శించుకున్న తరువాత భక్తులు అన్నపూర్ణాదేవిని దర్శించడం ఆచారం.ఈ దేవాలయం లోపలనే ఉచిత అన్నదానం,దేవాలయం వారిచే నిర్వహించ బడుచున్నది.
విశాలాక్షిమందిరం
కాశీ విశ్వనాధ ఆలయానికి సమీపంలో విశాలాక్షి అమ్మవారి మంధిరం ఉంది. విశ్వనాధుని దర్శించుకున్న తరువాత భక్తులు విశాలాక్షిదేవిని దర్శించడం ఆచారం. ఈ దేవాలయ పూజలు రెండు వేళల నాట్టు కోట్టై నగర సత్తరం వారిచే నిర్వహించబడుచున్నది.
శాంక్తా మందిరం
సింధియా ఘాట్ వద్ద శాంక్త మందిరం ఉంది. శాంక్తామందిరంలో పెద్ద సింహంశిల ఉంది. అలాగే ఈ ఆలయంలో నవగ్రహాల మందిరం కూడా వున్నది.
దుర్గా మందిరం
వారణాశిలో రెండు దుర్గామందిరాలు ఉన్నాయి. 500 సంవత్సరాలకు ముందు నిర్మించిన దుర్గామందిరం ఒకటి. రెండవది "కోతుల గుడి"గా కూడా ప్రసిద్ధమైన దుర్గా మందిరం 18వ శతాబ్దంలో ఒక బెంగాలీ రాణిచే నిర్మింపబడింది. ఇక్కడ చాలా కోతులు ఉండడంవల్ల కోతుల గుడి అని కూడా అంటుంటారు. ఇక్కడ అమ్మవారు స్వయంభూమూర్తి అని భక్తుల నమ్మకం. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆలయం గోపురం ఉత్తర భారత " నాగర"శైలిలో నిర్మింపబడింది. గుడి దగ్గరున్న కోనేరును "దుర్గా కుండ్" అంటారు. ఈ కోనేరు ఇదివరకు నదితో సొరంగమార్గం ద్వారా కలపబడి ఉండేది కాని ఆ సొరంగాన్ని తరువాత మూసివేశారు. నాగపంచమి నాడు ఇక్కడ విష్ణువు శేషశాయిగా ఉండే దృశ్యాన్ని ప్రదర్శిస్తారు.
సంకట మోచన్ హనుమాన్ మందిరం
కాశీలో ఉన్న పవిత్రాలయాలలో సంకట్ మోచన్ హనుమాన్ మందిరం ఒకటి. ఈ మందిరం "బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం" ఆవరణలో ఉన్న దుర్గా, కొత్త విశ్వనాథ్ మందిరాలకు పోయే మార్గంలో అసినదీ తీరంలో ఉంది. ప్రస్తుత ఆలయం 1900 లో విద్యావేత్త, స్వాతంత్య్ర సమరవేత్త, "బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం" వ్యవస్థాపకుడూ అయిన మదనమోహన్ మాలవ్యా చేత నిర్మించబడింది.
మద్యయుగానికి చెందిన, రామాయణ (తులసి రామాయణం) సృష్టికర్త అయిన తులసీదాసుకు హనుమంతుడు ప్రత్యక్షమైన ప్రదేశంలో నిర్మించబడినట్లు విశ్వసిస్తున్నారు. ఈ ఆలయంలో హనుమంతునికి ప్రధానమైన మంగళ, శనివారాలలో హనుమతునికి విశేష పూజలు నిర్వహించబడతాయి కనుక ఈ రెండు దినాలలో ఆలయానికి వేలాది భక్తులు వస్తుంటారు. కష్టాలనుండి భక్తులను కడతేర్చే దేవునిగా ఇక్కడ కొలువైయున్న హనుమంతుని భక్తులు ఎంతో భక్తితో ఆరాధిస్తారు. ఇక్కడ అనేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి.
2006 మార్చి 7 న ఈ మందిరంలో ఉగ్రవాదులు హనుమంతునికి హారతి ఇస్తున్న సమయంలో బాంబులు పేల్చారు. అప్పుడు ఆలయంలో వివాహబృందం పూజలు నిర్వహిస్తున్న కారణంగా అధికసంఖ్యలో భక్తులు గాయాలపాలయ్యారు. అయినప్పటికీ మరునాడు ఆలయంలో పూజాదికాలు నిర్వహిచి హనుమాన్ చాలిసా, సుందరా కాండ పారాయణం నిర్వహించి తులసీదాసు విరచిత హనుమాన్ చాలిసా, సుందర కాండ పుస్తకాలు ఉచితంగా అందించబడ్డాయి. తీవ్రవాదుల దాడి తరువాత ఆలయంలో పోలీస్ రక్షణ ఏర్పాటు చేయబడింది. ఈ ఆలయ ప్రాంగణంలో హనుమంతుని ఆరాధ్యదైవాలైన సీతారాముల ఆలయం ఉంది.
తులసీ మానస మందిరం
ఇది పాలరాతితో కట్టబడిన ఆధునిక మందిరం. ఆలయం గోడలపైన తులసీదాసు రామచరిత మానస్ కావ్యం వ్రాయబడింది. రామాయణం పెక్కు చిత్రాల ద్వారా కూడా చూపబడింది. పాలరాతితో నిర్మించబడిన ఈ ఆలయం కుడ్యాల మీద తులసీ రామాయణం లిఖింపబడి ఉంది. ఈ ఆలయ దృశ్యాలు శిల్పాలరూపంలో ప్రదర్శించబడుతున్నాయి. అలాగే రామాయణ కావ్యసంబంధిత తామ్రఫలకాలు కొన్ని కూడా ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి.
భారతమాత ఆలయం
భారతదేశం జాతీయ మానవీకరణ అంకితం భారత మాతా ఆలయం, 1936 లో మహాత్మా గాంధీ చేత ప్రారంభించబడింది. ఇక్కడ పాలరాతితో చెక్కిన భారతదేశం చిత్రపటం ఉంది. బాబు శివ ప్రసాద్ గుప్తా, దుర్గా ప్రసాద్ ఖత్రీ, ప్రముఖ, పురాతన వస్తువులను అధ్యయన శాఖ, జాతీయ నేతలు, దాని నిర్మాణం కోసం విరాళంగా నిధులను అందించారు.
బిర్లా మందిరం
కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో కట్టిన ఆధునిక మందిరం ఇది. బిర్లా కుటుంబంచే ఈ విశ్వనాధ మందిరం పురాతన మందిరం శైలిలోనే నిర్మించబడింది. ఈ ఆలయం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ ఆవరణలో బిర్లాకుంటునబం చేత నిర్మ్ంచబడింది. ఈ ఆలయానికి ప్రణాళిక వేసింది పండిట్ మదన్ మోహన్ మాలవ్యా అన్నది మరొక ప్రత్యేకత.
కాలభైరవ మందిరం
కాలభైరవుడు కాశీక్షేత్రానికి క్షేత్రపాలకుడు. విశ్వేశ్వర దర్శనం చేసుకోవడానికి ముందుగా కాలభైరవుని దర్శించుకుని ఆయన అనుమతి తీసుకుని విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలని పురాణకథనం వివరిస్తుంది. కనుక భక్తులు విశ్వేశ్వర దర్శనానికి ముందుగా కాలభైరవుని దర్శించుకుని విశ్వనాథ దర్శనానికి అనుమతి ఇవ్వమని ప్రార్ధిస్తారు. ఈ ఆలయం విశ్వేశ్వర్ గంజ్ ప్రధాన తపాలాఫీసు సమీపంలో ఉంది. ఈ అలయం నుండి దారానగర్ పోయే మార్గంలో మృత్యుంజయ (శివుడు) మందిరం ఉంది. ఆలయసమీపంలో ఉన్న బావికి ఒక ప్రత్యేకత ఉంది. బావిలోకి పలు అంతర్గత ప్రవాహాలనుండి నీరు ఊరుతుందని ఈ జలాలకు రోగవిముక్తి చేసే శక్తి ఉందని విశ్వసిస్తున్నారు.
కవళీ మాత
కవళిమాత ఒకప్పుడు కాశిలో నివసిస్తూ ఉండేది. ఆమె జీవనోపాధి కొరకు గవ్వలను అమ్ముతూ ఉండేది. ఆమె సదా విశ్వేశ్వరుని భక్తిశ్రద్ధాసక్తులతో ఆరాధించేది. శివారాధనకు ముందుగా గంగానదిలో స్నానం ఆచరించేది. గంగాస్నానం తరువాత విశ్వేశ్వర దర్శనం అయిన తరువాత ఆమె ఆహారాన్ని స్వీకరించేది. ఒకనాడు ఆమె స్నానంచేసి గట్టుకు రాగానే ఒక హరిజనుడు ఆమెను స్పృజించాడు. హరిజన స్పర్శ కారణంగా ఆమె తిరిగి గంగలో స్నానానికి వెళ్ళింది. అలా ఆమె స్నానం చెయ్యడం తిరిగి హరిజనుడు స్పృజించడం తిరిగి గంగాస్నానానికి పోవడం చేస్తుండగా రాత్రి అయింది. ఆమె ఆరోజంతా భోజనం చేయలేదు. కాశీ అన్నపూర్ణా మాత క్షేత్రం కనుక ఆక్షేత్ర సరిహద్దులలో ఎవరూ భోజనం చేయకుండా ఉండకూడదు కనుక అన్నపూర్ణాదేవి స్వయంగా కవళీకి ప్రత్యక్షమై తనక్షేత్రంలో ఎవరూ పస్తులు ఉండదు కనుక భోజనం చెయ్యమని చెప్పింది. కవళీ మాత్రం విశ్వేశ్వర దర్శనం చేయకుండా భోజనం చెయ్యనని చెప్పింది. అన్నపూర్ణా మాత కోపించి ఆమెను కాశీ సరిహద్దులు దాటి వెళ్ళమని ఆదేశించింది. కవళీ కాశీ సరిహద్దులు దాటి వెళ్ళిన ఆమె విశ్వేశ్వర దర్శనం చెయ్యలేక పోయినందుకు చింతిస్తూ శివుని గురించి తపసు చేసింది. ఆమెకు శివిడు ప్రత్యక్షం కాగానే ఆమె " ఈశ్వరా! నాభక్తిలో లోపమేమిటి. నన్నిలా కాశీనుండి పంపిన తరువాత నేనిక నీదర్శనం ఎలాచేయగలను." అని ఆవేదనపడింది. ఈశ్వరుడు "కవళీ! నీ భక్తి తిరుగులేనిది అయినప్పటికీ హరిజనుడు స్పృజించాడని తిరిగి స్నానం చేయడం అపరాధమే. నాకు హరిజనులు, పురజనులే కాదు. సకల ప్రాణులూ ఒకటే. ఎవరైనా నన్ను స్పృజించి నమస్కరించడానికి అర్హులే. నీవు హరిజన స్పర్శ అపవిత్రమని భావించి చేసిన అపరాధానికే ఈ దండన లభించింది. అయినప్పటికీ నీభక్తికి, తపసుకు మెచ్చి నీకు ఒక వరం ఇస్తాను. ఇక మీదట నా భక్తులు నన్ను సందర్శించిన ఫలితం నీకు ఇస్తాను. భక్తులు నీకు కానుకలు సమర్పించి వారి దర్శన ఫలితాలను తిరిగి పొందగలరు" అని చెప్పి అదృశ్యం అయ్యాడు. అప్పటి నుండి కవళీ "కవళీ మాత" అయింది. కనుక భక్తులు కాశీ విశ్వేరదర్శనం చేసుకున్న ఫలితం కవళీ మాతకు దక్కుతుంది. అందుకు పరిహారంగా భక్తులు కవళీమాత దర్శనం చేసుకుని ఆమెతో "ఈ గవ్వలు నీకు సమర్పిస్తున్నాము. కాశీ ఫలితం నాకు ఇవ్వు" అని ప్రార్థించిన భక్తులకు కాశీ పోయిన ఫలితం దక్కుతుందని విశ్వశించబడుతుంది. కనుక కాశీవిశ్వేశ్వర దర్శనం చేసుకున్న భక్తులు కవళీమాతను కూడా దర్శించుకుంటారు.
ముఖ్య శివ లింగాలు
వారాణసిలో ఉన్న కొన్ని ముఖ్యమైన శివ లింగాల స్థలాలు
విశ్వేశ్వరుడు - గంగానది ఒడ్డున దశాశ్వమేధ ఘాట్ వద్ద
మంగళేశ్వరుడు - శంక్తా ఘాట్
ఆత్మ విశ్వేశ్వరుడు - శంక్తా ఘాట్
కుక్కుటేశ్వరుడు - దుర్గా కుండ్
త్రి పరమేశ్వరుడు - దుర్గా కుండ్
కాల మాధవుడు - కథ్ కీ హవేలీ
ప్రయాగేశ్వరుడు - దశాశ్వమేధ ఘాట్
అంగారకేశ్వరుడు - గణేష్ ఘాట్
ఆంగనేశ్వరుడు - గణేష్ ఘాట్
ఉపస్థానేశ్వరుడు - గణేష్ ఘాట్
పరమేశ్వరుడు - శంక్తా ఘాట్
హరిశ్చంద్రేశ్వరుడు - శంక్తా జీ
వశిష్టేశ్వరుడు - శంక్తా జీ
కేదారేశ్వరుడు - కేదార్ ఘాట్
నీల కంఠేశ్వరుడు - నీల కంఠా
ఓంకారేశ్వరుడు - చిట్టన్ పురా
కాశేశ్వరుడు - త్రిలోచన్
శ్రీ మహా మృత్యుంజయుడు - మైదాగిన్
శుక్రేశ్వరుడు - కాళికా గలీ
ఉత్సవాలు
మహాశివరాత్రి పర్వదినంలో శివరాత్రి ఊరేగింపు మృత్యుంజయ ఆలయం నుండి విశ్వనాథ ఆలయం వరకు కొనసాగుతుంది.
తులసీ ఘాట్ వద్ద ద్రుపదునికి అంకితం ఇవ్వబడిన ఉత్సవాలు ఐదు దినాలపాటు నిర్వహించబడుతుంది. ఇది ఫిబ్రవరి- మార్చి మాసాల మద్య నిర్వహించబడతాయి.
సంకట్ మోచన్ హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి (మార్చి-ఏప్రిల్) హనుమంతునికి ప్రత్యేక పూజలు, హారతి, ఊరేగింపు నిర్వహించబడతాయి. 1923 నుండి హనుమాన్ సంగీత సమారోహ్ పేరిట ఐదు దినాలపాటు సాస్కృతిక సంగీతం, నృత్య ప్రదర్శనలు నిర్వహించబడుతున్నాయి. ఈ ప్రదర్శనకు దేశం అంతటి నుండి ప్రముఖ కళాకారులు ప్రదర్శనలివ్వడానికి ఆహ్వానించబడుతుంటారు.
రామనగర్ రామలీలా వద్ద రామచరితమానసలో వర్ణించినట్లు రామాయణం ప్రదర్శించబడుతుంది. రామనగర్‌లో 31 దినాలు ప్రదర్శించే ఈ ప్రదర్శనకు కాశినరేష్ చేత నిధిసహాయం అందుతూ ఉంది. ఈ ఉత్సవాలకు రావణసంహారంతో ముగింపు పలుకుతారు. కాశీనరేష్ చేత 1830లో ఆరంభించబడిన ఈ ఉత్సవాలను ఇప్పటికీ విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
భారత్ మిలాప్ పేరిట 14 సంవత్సరాల వనవాసం తరువాత రామ భరతుల సమావేశం ఉత్సవం ఘనంగా నిర్వహించబడుతుంటాయి. ఈ ఉత్సవాలను విజయదశమి మరునాడు నిర్వహించబడుతుంటాయి. కాశీరాజు తనపరివారంతో రాజరీక అలంకారలతో ఈ ఉత్సవాలలో పాల్గొంటాడు. ఈ ఉత్సవాలు అధిక సంఖ్యలో ప్రజలను ఆకర్షిస్తున్నాయి.
కార్తికమాస కృష్ణచవితి నాడు కాళీయుని మీద కృష్ణుని విజయానికి సంకేతంగా కాళీయమర్ధన దృశ్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమం కొరకు గంగాతీరంలో కదంబ వృక్ష శాఖను నాటి దాని సమీపంలో నిర్వహిస్తారు. ఈ ప్రదర్శనలో పాల్గొనే బాలలు కాళీయుని శిరసులపై నృత్యం చేసి వేణుగానం వినిపిస్తుంటాడు. ఈ దృశ్యాన్ని ప్రజలు గంగాతీరం, పడవలలో ఉండి చూస్తుంటారు.
గంగామహోత్సవాల పేరిట ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక శాఖ చేత నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవాలను కార్తిక పూర్ణిమనాడు నిర్వహించబడుతుంటాయి. పంటల కొరకు గంగాదేవికి కృతఙత తెలుపుతూ ఈ ఉత్సవాలు నిర్వహించబడుతుంటాయి.
గంగా హారతి. గంగామాతకు నదీతీరక్షేత్రాలలో నిర్వహించే ఈ హారతి పవిత్ర కాశీలో కూడా ఘనంగా ప్రతిరోజూ నిర్వహిస్తుంటారు. ఈ హారతి దృశ్యాలను పతిరోజూ వేలాది మంది తిలకిస్తుంటారు. వీరిలో విదేశీయులు అధికంగా ఉండడం ఒక ప్రత్యేకత. ఈ హారతులను దశాశ్వమేధ్ ఘాటులో నిర్వహిస్తారు కనుక యాత్రీకులు దశాశ్వమేధ ఘాటుకు చేరుకోవడం అవసరం.
ఈ హారతి దృశ్యాన్ని గంగాతీరంలో, పడవలలో కూర్చుని వేలాదిమంది యాత్రికులు తిలకిస్తుంటారు.
ఈ హారతి దృశ్యాన్ని గంగాతీరంలో, పడవలలో కూర్చుని వేలాదిమంది యాత్రికులు తిలకిస్తుంటారు.
విశేషాలుప్రాముఖ్యత: ఈ క్షేత్రాన్ని ముక్తిధామం అని పిలుస్తారు. ఇక్కడ మరణించిన వారికి శివుడు తారక మంత్రం ఉపదేశిస్తాడని నమ్ముతారు.
దర్శనం: ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం వలన సకల పాపాలు హరిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలో ప్రతి రోజు వేలాది మంది భక్తులు శివ దర్శనం కోసం విచ్చేస్తారు. కాశీ విశ్వనాథ దర్శనం చేసుకోవడం వల్ల పాప విమోచనం, ఆత్మశుద్ధి, మరియు మోక్ష ప్రాప్తి కలుగుతాయని పూరాణిక విశ్వాసం.
ఇది శైవ సంప్రదాయానికి కేంద్ర బిందువుగా నిలిచిన అత్యంత పవిత్రమైన క్షేత్రం.
మన దేవాలయాలు చారిత్రక నగరాలూ
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
దర్శనం: ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం వలన సకల పాపాలు హరిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలో ప్రతి రోజు వేలాది మంది భక్తులు శివ దర్శనం కోసం విచ్చేస్తారు. కాశీ విశ్వనాథ దర్శనం చేసుకోవడం వల్ల పాప విమోచనం, ఆత్మశుద్ధి, మరియు మోక్ష ప్రాప్తి కలుగుతాయని పూరాణిక విశ్వాసం.
ఇది శైవ సంప్రదాయానికి కేంద్ర బిందువుగా నిలిచిన అత్యంత పవిత్రమైన క్షేత్రం.
మన దేవాలయాలు చారిత్రక నగరాలూ
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
No comments:
Post a Comment