Monday, July 20, 2026

Shravana Nakshatra - శ్రవణ నక్షత్రము

శ్రవణ నక్షత్రము

నక్షత్రం - శ్రవణ

అధిపతి - చంద్రుడు

గణము - దేవ

జాతి - స్త్రీ

వృక్షం - జిల్లేడు

జంతువు - వానరము

నాడి - అంత్య

పక్షి - పింగళ

అధిదేవత - మహావిష్ణువు

రాశి - మకరము

శ్రవణా నక్షత్ర జాతకుల గుణగణాలు:
నక్షత్రములలో శ్రవణా నక్షత్రం 22వది. ఇది శ్రీ మహా విష్ణువు మరియు శ్రీలక్ష్మి యొక్క జన్మ నక్షత్రంగా పేరొందినది. ఇది దోషరహిత నక్షత్రం. శ్రవణానక్షత్ర అధిపతి చంద్రుడు.

అధిదేవత మహా విష్ణువు, గణము దేవగణము, రాశ్యాధిపతి శని, జంతువు వానరం. ఈ నక్షత్ర జాతకులు మితభాషులు. కోపతాపాలు, మొండి వైఖరి, అల్లరితనం ఉన్నా వీరు ధర్మం తప్పక జీవితం సాగిస్తారు. వీరు చక్కని తీర్పులు చెప్పగలరు. వీరి అంతర్గత ఆలోచన, మేధస్సు ఎవరికి అర్ధం కాదు.

ఓర్పు ఉంటుంది కాని దానికి హద్దులు ఉంటాయి. ఎవరికి ఎటువంటి మర్యాద ఇవ్వాలో ఎవరిని ఎక్కడ ఉంచాలో వీరిని చూసి నేర్చుకోవాలి. మనోధైర్యంతో సాహస నిర్ణయాలు తీసుకుంటారు. విజయం సాధించి అఖండమైన ఖ్యాతి గడిస్తారు.

చనువుగా మాట్లాడే స్వభావం ఉన్నా ఎవరిని నెత్తికి ఎక్కించుకోరు. ఊహ తెలిసిన నాటి నుండి ధనానికి లోటు ఉండదు. అంచెలు అంచెలుగా పైకి వస్తారు. శత్రువర్గం అడుగడుగునా ఇబ్బందులు పెడుతుంది.

ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారు. బంధుప్రీతి ఎక్కువ. స్నేహితులకు గుప్తంగా సహకరిస్తారు. చదువు పట్ల శ్రద్ధ, సమాజములో ఉన్నత స్థితి, అవకాశాలను సద్వినియోగపరచుకొనుట, సందర్భానుసారము వ్యూహం చేయుట వీరి స్వంతం. అందరు వీరిని మొండి వాళ్ళు అని భావించినా వీరికి విశాలహృదయం, సున్నిత మనస్తత్వం ఎవరికి అర్ధం కాదు.

వ్యాపారంలో ముందుగా భాగస్వాముల వలన నష్టపొయినా తరువాత మంచి లాభాలు గడిస్తారు. వారసత్వ విషయాలు లాభిస్తాయి. జీవితంలో ఊహించని స్థాయికి చేరుకుంటారు. బాల్య జీవితానికి జీవితంలో చేరుకున్న స్థాయికి ఎంతో తేడా ఉంటుంది. అడుగడుగునా దైవం కాపాడుతాడు. వీరికి దైవానుగ్రహం ఎక్కువ. వీరికి ఉండే దైవభక్తి, గుప్తదానాలు ఇందుకు కారణం. సంతానం వలన ఖ్యాతి లభిస్తుంది.


శ్రవణా నక్షత్ర జాతకులు ప్రతి పనిని ఎంతో సజావుగాను మరియు సమర్థవంతంగాను చేస్తారు. వీరికి జీవితంలో కొన్ని స్థిరమైన సూత్రాలుంటాయి. ఇతరుల సమస్యలను చూసిన వెంటనే, మనస్సు తేలికగా కరిగిపోతుంది.

అతిధులకు స్వాగతం పలకడంలో వీరు నిపుణులు. అదేవిధంగా వీరు ఆధ్యాత్మిక స్వభావం కలిగిన వ్యక్తి మరియు గురువు పట్ల శ్రద్ధాభక్తులను కలిగి ఉంటారు. వీరు 'సత్యమేవ జయతే' పథంలో ముందుకు సాగుతారు. ఎవరైకైనా సహాయం చేసినప్పుడు, వారి నుంచి దేనిని కోరుకోరు.

వీరి చిరునవ్వులో బలమైన ఆకర్షణ ఉంటుంది. అందువల్లనే చిరునవ్వుతో ఎవరినైనా కలిసినట్లయితే, వారు వీరికి అభిమానులు అవుతారు. వీరి జీవితంలో ఎన్ని ఒడుదుడుకులు ఉన్నప్పటికీ వీరు సాధారణ జీవితాన్ని గడుపుతారు. వీరు మంచి కౌన్సిలర్, ప్రజల సమస్యలకు వీరు సహాయపడతారు. వీరు బాగా చదువుకోనప్పటికీ, చక్కటి నైపుణ్యం ఉంటుంది. అదేవిధంగా ఒకేసారి అనేక పనులు చక్కగా చేస్తారు.

ఒకవేళ వీరు ఉన్నత లేదా శక్తివంతమైన స్థానంలో నియమించబడినట్లయితే, చాలా ప్రయోజనాన్ని పొందుతారు. ఇతరులకు సేవ చేయాలనే స్ఫూర్తి వీరికి ఉంటుంది. అందువల్ల వీరు తమ తల్లిదండ్రులకు ఎంతో అంకితభావంతో సేవలందిస్తారు. దేవుడి పట్ల బలమైన విశ్వాసం ఉంటుంది మరియు ఎల్లప్పుడూ సత్యాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తారు.

సరిగ్గా ఆలోచించిన తరువాతే ప్రతి పని చేయడం వీరి స్వభావం యొక్క ప్రత్యేకత. అందువల్ల, వీరు ఎలాంటి తప్పులు చేయరు. వీరికి చక్కటి మానసిక సామర్థ్యం ఉంటుంది, దీని వల్ల వీరు చదువులో ముందుంటారు. వీరికి సహనం మరియు ఆత్మగౌరవం మెండుగా ఉంటాయి. ధైర్యసాహసాలుంటాయి.

ఏ విషయమైనా మనస్సులో పెట్టుకోకుండా స్పష్టంగా బయటకు చెబుతారు. వ్యాపార దృష్టి కోణంలో, ఉద్యోగం మరియు వ్యాపారం రెండూ కూడా లాభదాయకంగా ఉంటాయి. ఈ రెండింటితో పాటుగా, వీరు ఏ రంగాన్ని ఎంచుకున్నా కూడా వీరికి విజయం సిద్ధిస్తుంది.


శ్రవణ నక్షత్రం మొదటి పాదము
శ్రవణ నక్షత్ర అధిపతి చంద్రుడు. వీరి మీద కుజ చంద్ర గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. వీరు దేవగణ ప్రధానులు. కనుక వీరు ధైర్యసాహసాలు కలిగి ఉంటారు.

శ్వేతవర్ణ, రక్త వర్ణ వస్తువులకు సంబంధించిన వృత్తి వ్యాపార ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. సైనిక, ఔషధ సంబంధిత ఉద్యోగాలు కూడా అనుకూలమే. విద్యుత్, అగ్ని సంబంధిత ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

ఈ నక్షత్ర జాతకులకు ఎనిమిది సంవత్సరాల వరకు చంద్ర దశ ఉంటుంది. చంద్ర దశ కాలంలో వీరికి బాల్యంలో ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. తరువాత వచ్చే ఏడు సంవత్సరాల కుజదశ కాలంలో ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.

15 సంవత్సరాలకు వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కాలంలో ఉన్నత విద్యకు ఆటంకాలు ఎదురవుతుంటాయి. కనుక పట్టుదలతో వీటిని అధిగమించి విద్యలో విజయం సాధించాలి. రాహు దశ అనుకూలిస్తే విదేశాలలో విద్యాభ్యాసం కొనసాగించే అవకాశం ఉంటుంది. జీవితంలో స్థిరపడడానికి కొంత జాప్యం జరగవచ్చు.

33 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కాలంలో సమస్యలు క్రమంగా తగ్గుతాయి. సంపాదనలో కూడా మంచి అభివృద్ధి కలుగుతుంది. సంపాదించినది పదిలపరచుకోవాలి. 49 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కాలంలో అభివృద్ధి కొంత తగ్గినా సాఫీగా జరిగిపోతుంది.

అనుకోని ఖర్చులు అధికమవుతాయి. ఇక 68 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కొంత ఉపసమనం కలిగి మిగిలిన జీవితం సాఫీగా సాగిపోతుంది. వృద్ధాప్య దశ సమస్యారహితంగా సాగిపోతుంది.

శ్రవణ నక్షత్రం రెండవ పాదము
శ్రవణ నక్షత్రము రెండవ పాదంలో జన్మించిన వీరు సౌమ్యంగా ప్రవర్తిస్తారు. వీరికి ధర్మం అంటే ఆసక్తి. ధర్మపక్షం వహిస్తారు. వీరికి కొంత స్థిర స్వభావం ఉంటుంది. ఇక వీరు కళాత్మక వస్తువులను సేకరించడానికి ఆసక్తి చూపుతారు.

విలాస జీవితం పట్ల వీరికి ఆసక్తి ఉంటుంది. వీరికి శ్వేతవర్ణ సంబంధిత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలిస్తాయి. జల సంబంధిత, పర్యాటక సంబంధిత, ఔషధ సంబంధిత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కూడా వీరికి అనుకూలం.

ఈ జాతకులకు 6 సంవత్సరాల వరకు వీరికి చంద్రదశ ఉంటుంది. చంద్రదశలో వీరికి బాల్యంలో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. తరువాత వచ్చే 7 సంవత్సరాల కుజ దశ కాలంలో ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.

13 సంవత్సరాలకు వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో మాధ్యమిక విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయత్నపూర్వకంగా వీటిని అధిగమించి విద్యలో విజయం సాధించవచ్చు. రాహు దశ అనుకూలిస్తే విదేశాలలో విద్యాభ్యాసం కొనసాగించే అవకాశం ఉంది. జీవితంలో స్థిరపడడానికి కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి.

31 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కాలంలో సమస్యలు తగ్గుముఖం పట్టడమే కాక సంపదలో, సంపాదనలో మంచి అభివృద్ధి కలుగుతుంది. సంపాదించింది పదిలపరచుకుని ఇబ్బందులను ఎదుర్కొవాలి.

47 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కాలంలో అభివృద్ధి కొంత తగ్గినా సాఫీగా జరిగిపోతుంది. అయినప్పటికీ అనుకోని ఖర్చులు అధికమవుతాయి. సంపాదనకు మించిన ఖర్చులు ఉంటాయి. 66 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కొంత ఉపసమనం కలిగి మిగిలిన జీవితం సాఫీగా జరిగిపోతుంది.


శ్రవణ నక్షత్రం మూడవ పాదము

శ్రవణ నక్షత్రము మూడవ పాద జాతకులు సౌమ్యంగా ప్రవర్తిస్తారు. వీరికి ధర్మం అంటే ఆసక్తి ఉంటుంది. ధర్మపక్షం వహిస్తారు. వీరు బుద్ధి కుశలత కలిగి ఉంటారు.

వీరికి వ్యాపారం అంటే ఆసక్తి. వీరికి విద్యా సంబంధిత, భూ సంబంధిత, ఔషధ సంబంధిత వ్యాపారం, ఉద్యోగం, వృత్తులు అనుకూలిస్తాయి.

ఈ జాతకులకు 4 సంవత్సరాల వరకు చంద్ర దశ ఉంటుంది. చంద్రదశలో వీరికి బాల్యంలో ఆరోగ్య సమస్యలు ఉంటాయి. తరువాత వచ్చే 7 సంవత్సరాల కుజ దశ కాలంలో ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.

11 సంవత్సరాలకు వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయత్నపూర్వకంగా వీటిని అధిగమించి విద్యలో విజయం సాధించవచ్చు. రాహు దశ అనుకూలిస్తే విదేశాలలో విద్యాభ్యాసం కొనసాగుతుంది.

29 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కాలంలో సమస్యలు తగ్గుముఖం పట్టడమే కాక సంపదలో, సంపాదనలో మంచి అభివృద్ధి కలుగుతుంది. సంపాదించింది. పదిల పరుచవలసిన అవసరం ఎంతో ఉంది.

45 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కాలంలో అభివృద్ధి కొంత తగ్గినా సాఫీగా జరిగిపోతుంది. అయినప్పటికీ అనుకోని ఖర్చులు అధికమవుతాయి. సంపాదనకు మించిన ఖర్చులు ఉంటాయి. 64 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కొంత ఉపశమనం కలిగి మిగిలిన జీవితం సాఫీగా జరిగిపోతుంది.

శ్రవణా నక్షత్రం నాలుగవ పాదము
శ్రవణా నక్షత్రం నాల్గవ పాద జాతకులు సౌమ్యంగా ప్రవర్తిస్తారు. వీరికి ధర్మం అంటే ఆసక్తి ఉంటుంది. ధర్మం పక్షం వహిస్తారు. వీరికి తల్లితో అనుబంధం అధికం.

శ్వేతవర్ణ వస్తువులకు సంబంధించిన వృత్తులు, వ్యాపారం, ఉద్యోగం వీరికి అనుకూలం. ఔషధ రంగానికి సంబంధించిన వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి.

ఈ నక్షత్రంలో జన్మించిన వారికి 2 సంవత్సరాల వరకు వీరికి చంద్రదశ ఉంటుంది. చంద్రదశలో వీరికి బాలారిష్టాలు సమస్యలు ఉంటాయి. తరువాత వచ్చే 7 సంవత్సరాల కుజ దశ కాలంలో ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.

9 సంవత్సరాలకు వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో విద్యలో ఆటంకాలు ఉంటాయి. ప్రయత్న పూర్వకంగా వీటిని అధిగమించి విద్యలో విజయం సాధించవచ్చు. రాహు దశ అనుకూలిస్తే విదేశాలలో విద్యాభ్యాసం కొనసాగించే అవకాశం ఉంటుంది. జీవితంలో స్థిరపడడానికి కొంత జాప్యం జరగవచ్చు.

27 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కాలంలో సమస్యలు తగ్గుముఖం పట్టడమే కాక సంపదలో, సంపాదనలో మంచి అభివృద్ధి కలుగుతుంది. సంపాదించినది పదిల పరచుకుని ఇబ్బందులను ఎదుర్కొనవలసిన అవసరం ఎంతో ఉంది.

43 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కాలంలో అభివృద్ధి కొంత తగ్గినా సాఫీగా జరిగిపోతుంది. అయినప్పటికీ అనుకోని ఖర్చులు అధికమవుతాయి. సంపాదనకు మించిన ఖర్చులు ఉంటాయి. 62 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కొంత ఉపసమనం కలిగి మిగిలిన జీవితం సాఫీగా జరిగిపోతుంది.


శ్రవణా నక్షత్ర జాతకులు పెంచవలసిన చెట్టు:
శ్రవణం నక్షత్రం వారు జిల్లేడు చెట్టును పెంచడం, పూజించడం ద్వారా మానసిక సమస్యలు దూరమవుతాయి. అలాగే ధనపరమైన సమస్యలు తొలగుతాయి. కార్యజయం సిద్ధించడానికి ఉపయోగపడుతుంది.

శ్రవణా నక్షత్ర జాతకుల తారా ఫలాలు:
తార నామం - తారలు - ఫలం
జన్మ తార - రోహిణి, హస్త, శ్రవణం - శరీరశ్రమ

సంపత్తార - మృగశిర, చిత్త, ధనిష్ట - ధన లాభం

విపత్తార - ఆర్ద్ర, స్వాతి, శతభిష - కార్యహాని

సంపత్తార - పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర - క్షేమం

ప్రత్యక్ తార - పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర - ప్రయత్న భంగం

సాధన తార - ఆశ్లేష, జ్యేష్ట, రేవతి - కార్య సిద్ధి, శుభం

నైత్య తార - అశ్విని, మఖ, మూల - బంధనం

మిత్ర తార - భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ - సుఖం

అతిమిత్ర తార - కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ - సుఖం, లాభం

నక్షత్ర శాంతి: శ్రీ వెంకటేశ్వర క్షేత్రానికి వెళ్లి విష్ణు దర్శనం, విష్ణు భక్తుల దర్శనం చేసుకోవాలి.

నక్షత్ర మంత్రం:
।। ఓం ।।
శృణ్వన్తి' శ్రోణామమృత'స్య గోపామ్ ।
పుణ్యా'మస్యా ఉప'శృణోమి వాచమ్” ।
మహీం దేవీం విష్ణుపత్నీమజూర్యామ్ ।
ప్రతీచీ' మేనాగ్మ్ హవిషా' యజామః ॥త్రేధా విష్ణు’రురుగాయో విచక్రమే ।
మహీం దివం' పృథివీమంతరి'క్షమ్ ।
తచ్ఛ్రోణైతిశ్రవ’-ఇచ్ఛమా'నా ।
పుణ్యగ్గ్ శ్లోకం యజ'మానాయ కృణ్వతీ ॥

నక్షత్ర గాయత్రి
ఓం మహాశ్రేష్ఠాయై విద్మహే 
పుణ్యశ్లోకాయ ధీమహి 
తన్నో శ్రవణ ప్రచోదయాత్

దర్శించవలసిన ఆలయములు
మొదటి పాదం – వానపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా సమేత శ్రీ వైద్యనాధీశ్వర స్వామి.
రెండవ పాదం – మాదిపల్లి (మాడుపల్లి)లో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి.
మూడవ పాదం – వాడపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ వీరేశ్వర స్వామి.
నాలుగవ పాదం – వీరపల్లిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి.

No comments:

Post a Comment

The Story of Svaha - స్వాహా వృత్తాంతం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - స్వాహా వృత్తాంతం నారదా ! సృష్టి ఆరంభంలో దేవతలు ఆహారంకోసం అలమటించి బ్రహ్మదేవుణ్ణి శరణువేడారు. బ్రాహ్మణక్షత్రియ...