Saturday, March 7, 2026

The Realization of Ajamila - అజామిళుడి పశ్చాత్తాపం

అజామిళుడి పశ్చాత్తాపం

ఋక్‌, యజుస్‌, సామవేదాల సారభూతం, ఆనందకరం, సమస్తశుభప్రదగుణాలకు నిలయం, పరమాత్ముని దర్మప్రబోధం అయిన విష్ణు, యమదూతల సంవాదాన్ని అజామిళుడు శ్రద్దాళువై ఆలకిస్తూ శ్రీమన్నారాయణునిచరణకమలస్మరణమనే నిర్మలజలం అతని మహాపాతక సమూహాలన్నింటినీ కడిగివేసింది. అతని హృదయం నిశ్చలభక్తికి నిలయమై క్షణమాత్రంలో అతనికి జ్ఞానోదయమయింది.

ఇప్పటిజన్మలో తాను చేసినపాపాలన్నీ అజామిళుడికి మాటిమాటికి జ్ఞాపకానికి వచ్చి, బాధపెడుతుండగా, పశ్చాత్తాపహృదయంతో శ్రీహరిని శరణుకోరుకొంటూ, ఆత్మవిమర్శ చేసుకుంటున్నాడు.

నేను ఆ శూద్రకాంతమీద అనురాగం పెంచుకున్నాను. ఆ జారిణియందు సంతానాన్ని కన్నాను. కులగౌరవాన్ని గోదావరిలో కలిపి వేశాను. నా బ్రతుకు రచ్చల కెక్కించాను. సిగ్గుమాలిన పనులకు పాల్పడి సాటివారిలో తలవంపులు తెచ్చుకొన్నాను. వార్ధక్యం పైనబడినప్పటికీ సంసార బంధాలనుంచి బయటపడలేక - లోకనిందలను లెక్క చేయకుండా వారకాంతా పరాయణుండనై ఆ రోత సుఖాల రొచ్చులో మునిగి తేలుతూ నా బ్రతుకంతా పాడుచేసుకున్నాను. పవిత్రమైన జీవితం భస్మమైపోయింది. నా చదువు చట్టుబండలైంది. నా శాస్త్రజ్ఞానమంతా శూన్యమైపోయింది. నా బుద్ధి పురుగు మేసింది. పుణ్యం బుగ్గి అయింది. నీతి అడుగంటింది. నియమం మరుగుపడింది. నా తెలివి తెల్లవారింది.

నిండుయౌవనం కలిగి, నన్ను మక్కువతో మన్నించే భార్యను వదిలిపెట్టి, మోసగత్తె, తాగుబోతు అయిన ఈ నీచస్త్రీ సాంగత్యం పొంది వ్యభిచారినై భ్రష్టుడనయ్యాను.

నేను తప్ప ఏ ఆధారమూ లేని సౌమ్యులు, సాధుజీవనులు, పెద్దలూ అయిన నా తల్లిదండ్రులను నిర్దాక్షిణ్యంగా తీవ్రమైన కష్టాలకు గురిచేసి, ఇంటినుండి వెళ్ళగొట్టిన దుర్మార్గుడిని. అటువంటి ఆ ఘోర పాప ఫలితాలు నన్ను మహాఅగ్నిజ్వాలల్లాగా కాల్చకుండా ఎలా ఉండనిచ్చాయో గదా!

చిన్నప్పటి నుండి ఎటువంటి ఇబ్బందీ కలుగకుండా పెంచి పోషించిన తల్లిదండ్రులను, నా శ్రేయస్సు కోరే చుట్టాలను, నాకు మేలు చేసినవారిని కృతఘ్నుడినై వదలిపెట్టాను.

ఇన్ని ఘోరపాపాలు చేసి భయంకర నరకకూపంలో పడి కొట్టుకొనిపోతున్న నన్ను దయతలచి ఆపదలనుండి రక్షించి, నా పాపాలను పోగొట్టిన ఈ పుణ్యపురుషులు ఎక్కడివారో కదా!

ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ముందు ఏదో కలవలె అనిపించింది. మరుక్షణంలో ప్రత్యక్షంగా కనిపించింది. నన్ను మృత్యుపాశాలతో బంధించి ఈడ్చుకొని వచ్చిన ఆ భయంకర స్వరూపాలు గల మహావీరులు ఆ వికృతాకారులు ఆ వక్రమార్గసంచారులు తమ ఉద్రేకాన్నీ ఉత్సాహాన్నీ వదలిపెట్టి ఎక్కడికి వెళ్లారో కదా!

మిక్కిలి క్రూరమైన యమపాశాలచే కట్టుబడి నరకమనే సముద్రంలో మునిగిపోతున్న నన్ను కాపాడిన సూర్యుతేజులు, పద్మనేత్రులు, సుందర రూపులు దయ కల్గినట్టి ఆ నలుగురు దివ్యులు ఎటువైపు వెళ్ళారో కదా!

నన్ను కాపాడిన పుణ్యాత్ములు, తామరులవంటి కన్నులతో, నల్లనిశరీరాలతో ప్రకాశించేవారు, పీతాంబరులు, శంఖచక్రాలను ధరించినవారు, ఆజానుబాహులు, నవ్వు ముఖం కలవారు, వేలాడుతున్న చెవి ఆభరణాలు, బంగారు వన్నెగల వస్త్రాలు ధరించిన ఆ దయాసముద్రులు ఎక్కడికి పోయారో కదా!

మిక్కిలి పాపాత్ముడినైన నాకు నేను పూర్వజన్మలోచేసిన పుణ్య విశేషంచేతనే అట్టి దేవతాశ్రేష్ఠుల దర్శనం కలిగింది. తద్ద్వారా మనస్సుకు ప్రశాంతత చేకూరింది. లేకుంటే నీచస్త్రీ సాంగత్యం వలన పాపాత్ముడినైన నాకు మరణ సమయంలో నారాయణ నామస్మరణం ఎలా సాధ్యపడుతుంది? అంతేకాక

పాపాత్ముడను, బ్రహ్మహత్య వంటి ఘోరపాపాలను చేసినవాణ్ణి, దురభిమానుణ్ణి, లోభిని, కామాతురుణ్ణి, మాత్సర్యం కలిగినవాణ్ణి, ఇలాంటి నా మనసుకు ఆ నారాయణుని పవిత్రమైననామగానం చేయాలనే ఆలోచన ఎలా వస్తుంది?

నీచమైన మోహమనే చీకటిలో మునిగి ఉన్నవాడను, పంచమహాపాపాలను చేసినవాడను, కుటిలుడను, జూద వ్యసనపరుడను, నిందాపరుడను, గుణహీనుణ్ణి, అయిన నాకు అద్భుతమైన, విష్ణునామాన్ని స్మరించే అర్హత ఉందా? కేవలం నేను పూర్వజన్మలలో చేసుకున్న పుణ్యాల ఫలితంవలన మాత్రమే తప్ప, హరినామస్మరణ యోగం ఎలా కలుగుతుంది?

అని పరిపరివిధాల ఆలోచించుకొని, పుణ్యమైన వర్తనంకలదీ, చైతన్యానికి నెలవైన స్థానానికి ఉన్ముఖమైన ఆసక్తి కలదానికీ, మోక్షస్థానంలో అనురక్తితో కూడిందానికీ, సుఖప్రదమైన ప్రయత్న క్రియకు చెందిన సామర్ధ్యం కలదానికి, ధైర్యంతో పొందబడిన శ్రేష్ఠమైనముక్తి కలదానికీ, సమస్త భూమండలాన్నీ ధరించగల ఉత్తమభక్తితో కూడిందానికీ, ఇట్టె విష్ణువ్రతసంపదకై నేను మనస్సును, ఇంద్రియాలను, శ్వాసను నియమించినవాణ్ణై ప్రయత్నిస్తాను.

నారాయణ నామగానంవలన భవబంధాలనుండి విముక్తి పొందాను. మాయవల్ల కలిగిన అజ్ఞానాన్ని పోగొట్టుకున్నాను. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలనే ఆరుగురు అంతశ్శత్రువులను తరిమికొట్టాను. జనన మరణ పరంపర అనే దుఃఖ సాగరాన్ని దాటాను.

దాసీ రూపంలో వచ్చిన స్త్రీ నాలో కోరికలను రగిల్చి నన్ను కోతివలె ఆడించింది. అధోగతికి ఈడ్చిన ఆ మాయ నన్ను తొలగిపోవడం నేను కనుగొన్నాను.

ఈ విధంగా ఆత్మవిమర్శ చేసుకుంటున్న అజామిళునిలో విష్ణుభక్తి అనే జ్ఞానదీపం ఆత్మచైతన్యమనే తైలంతో ప్రకాశించింది.

పునర్జన్మను పొందిన అజామిళుడు ఉత్తముల సాంగత్యంలో ఉంటూ వారితో జరిపే సంభాషణలవలన పవిత్రుడై, ఇహలోక బంధాలమీద విరక్తిచెంది బంధువులను, స్నేహితులను, భార్యాబిడ్డలను వదిలి సర్వేశ్వరుడైన ఆ శ్రీకృష్ణుని దయ అనే మహాభాగ్యంకోసం ప్రయత్నిస్తూ
భాగవతులతో జరిపే సత్సంగచర్చలు ఈ లోకంలో ఎప్పటికీ తరగని పుణ్యమనే సొమ్ముల మూటలు. మోక్షలక్షి యొక్క తరగని విలాసాలు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలనే శత్రువులు దగ్గరకు రాలేని రక్షణస్థావరాలు.

(కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు జీవుడి మనస్సులో దాగి ఉండి, కూడని పనులు చేయిస్తాయి. పతనంవైపు నడిపిస్తాయి. అందువల్ల వాటిని 'అరిషడ్వర్గాలు' అంటారు. జీవుడిలోన ఉండే శత్రువులు కనుక 'అంతశ్శత్రువులు' అంటారు.

ఈ విధంగా అజామిళుడు తననుగురించి తాను విమర్శించుకొని పరమాత్మతత్త్వాన్ని తెలుసుకున్నాడు. సంసార బంధాలను వదిలిపెట్టి హరిద్వారం చేరి ఒక దేవాలయంలో ధ్యానంలో ఉన్నాడు. తదనంతరం తన ఆత్మను యోగసమాధి ద్వారా పరమాత్మలో ఐక్యం చేయగా తనను పూర్వం యమభటుల నుండి రక్షించిన విష్ణుదూతలు సాక్షాత్కరించారు. వారిని చూచి అజామిళుడు వినయంగా నమస్కరించాడు.

ఈ ప్రకారంగా అజామిళుడు యోగమార్గం ద్వారా తన శరీరాన్ని పరిత్యజించి దివ్యదేహం ధరించినవాడై మున్ను తన్ను రక్షించిన విష్ణుకింకరులను తన కనులముందు సందర్శించాడు. వారిని తిలకించగానే అతని దేహం ఆనందంతో పులకించింది. పారవశ్యంతో ఒడలంతా చెమర్చింది. ఆనందం చిగిర్చింది. హృదయం హర్షంతో నిండింది. యోగప్రభావం ప్రకాశించింది. విస్మయంతో, ఉత్సాహంతో కూడిన మందహాసం అతని ముఖారవిందం మీద చిందులు త్రొక్కింది. సమస్త లోకాలనూ ప్రకాశింపజేసేదీ, మంగళప్రదమైందీ అయిన భగవంతుని శుభాకారాన్ని సందర్శించాలనే కుతూహలం మనస్సులో కలిగింది. అజామిళుడు విష్ణుదూతలకు నమస్కరిస్తూ గంగాతీరంలో శరీరం విడిచాడు. వెనువెంటనే అతనికి నారాయణ పార్శ్వచరులైన మహాభక్తుల స్వరూపం ప్రాప్తించింది. అనంతరం అతడు విష్ణుదూతలతో కలిసి రత్నాలు పొదిగిన బంగారు విమానాన్ని అధిష్టించి ఆనందమయం, భోగ భాగ్య నిలయం అయిన వైకుంఠనగరంలో ప్రవేశించి శ్రీమన్నారాయణుని చరణారవిందాలను సేవించే పరిణత దశకు చేరుకున్నాడు. ఈ విధంగా అజామిళుడు సర్వధర్మాలనూ ఉల్లంఘించినవాడు, దాసీపుత్రిని పెండ్లాడినవాడు, దుష్కర్మలచేత భ్రష్టుడైనవాడు అయి నరకంలో పడబోతూ కూడా నారాయణ నామస్మరణంవల్ల క్షణమాత్రంలో మోక్షాన్ని అందుకున్నాడు.

కర్మలన్నీ విడిపోవటానికి వేరే ఉపాయం ఏదీ లేదు. చెప్పిన మాట వినకుండా ఎదురుతిరిగి మనస్సు ఎన్నిమార్గాల్లో పోయినా సర్వదా నారాయణ నామాన్ని ఉచ్చరించటమే కర్మఫరిత్యాణానికి సరైన ఉపాయం.

పాండవ వంశాన్ని పావనంచేసే ఓ మహారాజా! ఈ అజామిళుని వృత్తాంతాన్ని ఎవడైనా సరే ఏకాగ్రచిత్తంతో విన్నా, చదివినా అలాంటి మానవుడు మోక్షలక్షికి నెలవై, యమకింకరులకు కనపడకుండా శాశ్వతవైకుంఠవాసి అవుతాడు.

అజామిళుడు కేవలం తన కొడుకు పేరుతో మాత్రమే చివరిదశలో భగవన్నామం ఔపచారికంగా స్మరించి మోక్షాన్ని పొందాడు. ఇంకా సంపూర్ణమైన భక్తితో పలికితే ఫలితం ఇంకెంత ఉంటుందో చెప్పలేము కదా!

విష్ణునామం తలచిన వారికి ముక్తి ఎంత దగ్గరవుతుందో, ఆ నామాన్ని స్మరించని వారికి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆ ముక్తిపదం దూరంగానే ఉంటుంది.

యమధర్మరాజు తన దూతలకు విష్ణువును గూర్చి దెలుపుట

No comments:

Post a Comment

The vows and worships of the Goddess as prescribed by the Goddess - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల...