Wednesday, October 7, 2026

Numerology - Number 7 - న్యూమరాలజీ - 7వ సంఖ్య

న్యూమరాలజీ - 7వ సంఖ్య

గ్రహము: కేతువు

జన్మదిన తేదీ సంఖ్య: 7, 16, 25

జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 7, 16, 25 ఈ తేదీలలో పుట్టినవారిని జనన సంఖ్య 7 సంఖ్య గలవారని పిలువబడతారు.

ఇచ్చట చెప్పిన 7, 16, 25 తేదీలలో

7వ తేది 7 సంఖ్యకు చెందిందనే విషయం స్పష్టముగానే తెలియు చున్నది.

16వ సంఖ్యను 1 + 6 అని కూడగా 7 వస్తుంది.

25వ సంఖ్యను 2 + 5 అని కూడితే 7 వస్తుంది.

అందుచేత 7, 16, 25 ఈ తేదీలలో పుట్టినవారు ఎవరైనా సరే,వారందరూ ఏడు సంఖ్య వారని తెలుసుకోవాలి,

దీనితో పాటు 7వ నెంబరు అదృష్ట సంఖ్య లేదా ఫేట్ సంఖ్యగా లేదా డెస్టినీ సంఖ్యగా కలవారు కూడా ఈ 7వ నెంబరు క్రిందకు వస్తారు.

దీనితో పాటు ఒకరి పేరులోని అక్షరాలకున్న విలువల సమష్టి సంఖ్య 7గా కలవారు కూడా ఈ 7వ నెంబరు క్రిందకు వస్తారు.

7వ సంఖ్యకు అధిపతి కేతువు, దైవభక్తి కలిగి ఉంటారు. శాంతినికోరుకుంటారు. వీరు ప్రపంచాన్ని తమదైన దృష్టికోణం నుంచిచూసి సొంత అభిప్రాయాలను ఏర్పరచుకుంటారు. అతీంద్రియ, ఆధ్యాత్మికత కలిగి ధ్యాన సంపన్నులై ఉంటారు.

సినిమా రంగాలు, ద్రవ (లిక్విడ్) పదార్థాలకు సంబంధిత వృత్తులు వీరికి అనుకూలం. 7, 8 సంఖ్యలు రెండును మతపరమైనవి. 7 సంఖ్యవారికి వేదాంతములో ఆకర్షణ ఉండదు. యోగము, మంత్రము వంటి రహస్యమైన, ఇతరులకు అంతగా తెలియని మార్గములలోనే తీవ్రమైన ఆసక్తి కలిగి ఉంటారు.

దైవభక్తి కలిగి కఠిన సాధనలు చేయగలిగిన వీరు సన్యాసులు కారు. 7 సంఖ్య మానవశక్తి దైవమునకు లోబడినది అని సూచించునట్లు, మానవుడు క్రమమును దాటి ప్రయత్నింపరాదన్నట్లు ప్రారంభములో దినములను 7 దినములు గల వారములుగా విభజించిరి.

అదే విధముగా దైవపరమైన సంగీతమును సప్త స్వరములతో కూర్చిరి. అటువంటివే సప్త ఋషులు, సప్త సాగరములు, సప్త కన్యలు, సప్తలోకములు, సప్తనాడులు మొదలయినవి.


7వ సంఖ్య వారి సహజ గుణములు:
పరాయి వారికంటే తమ కుటుంబానికి చెందిన వారిని, రక్త సంబంధం కలవారినీ ఎక్కువగా ప్రేమిస్తారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులకు అయినా వీరు బాధపడకుండా సులభంగా వాటిని ఎదుర్కొనగలరు.

మానవాతీత శక్తులను గ్రహిస్తారు. బుద్ధి బలం ఉన్నవారు. ప్రేమ, జ్ఞానం, ధర్మం, దాన గుణాలు కలవారు. పెద్ద మనుష్యులుగా,సంస్కార వంతులుగా ఉంటారు.

ముఖ వర్చస్సు, సొంత దృక్పథం, దివ్యత్వాన్ని ప్రదర్శిస్తారు. సున్నిత స్వభావం కలిగి తమ భావాలను ఇతరులకు తొందరగా తెలియ నీయరు. చూడగానే వీరిని విశిష్టమైనవారిగా గుర్తింపవచ్చును.

ఎప్పుడు వీరు సింపుల్ గా ఉంటారు. కాని కొంత మంది సుగంధ ద్రవ్యాలు ధారాళంగా వాడతారు. వీరు ఎక్కువగా అలంకార ప్రియులు కారు. ఆకర్షణీయమైన ముఖముతో పొడగరిగా ఉందురు.

కలుపుగోరుతనముగా ఉండరు. మాటలను తూచి తూచి వాడతారు. ఆత్మవిశ్వాసము ఎక్కువగా ఉన్నప్పుడు అధికముగా మాట్లాడుతారు. ఆత్మవిశ్వాసము తక్కువయినప్పుడు మౌనము పాటిస్తారు.

7వ సంఖ్య వారికి 30వ ఏట అదృష్టం కలసి వస్తుంది:
7 ఈ నెంబర్ వారికి 20వ ఏటలో మంచి రోజులుంటాయి. అలాగే 30వ ఏటలో కూడా మంచి అదృష్టం కలసి వస్తుంది. 38, 44 ఏళ్ల వయస్సుల్లోనూ వీరికి అనుకూలంగానే పనులు జరుగుతాయి.

ఒంటరితనాన్ని ఇష్టపడతారు:
ఒంటరితనాన్ని ఇష్టపడతారు. ధ్యాన, యోగ, మంత్ర శాస్త్రాలలో చక్కని అభినివేశం ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు కల్పనా శక్తి వృద్ది చెందుతుంది. మాట్లాడడం కంటే ధ్యాన స్థితిలో ఉండటానికి ఇష్టపడతారు. తమ సంతోషం గురించి, జయాపజయాల గురించి ఎవరితోనూ చెప్పరు. మనసులోనే దాచుకుంటారు.

కళాప్రియులు:
కళలకు సంబంధించినమటుకు వీరిని రెండు రకములుగా విభజించవచ్చును. ఒక రకమువారు పుట్టుకతోనే కళలపై అభిమానముతో పుట్టి కళలనే జీవిత లక్ష్యముగా ఎంచుకొందురు.

మరియొక రకమువారు కళల గురించి కొంచెమయినా తెలియక, అవి సమయమును వృధా చేయు వ్యర్ధమైన కాలక్షేపములు అనుకొంటారు. సంగీతము, కవిత్వము, రసాయన పరిశోధనలు, భ్రమింపజేయు రచనాశక్తి ఇవి అన్నియు వీరికి పుట్టుకతో వచ్చిన శుభలక్షణములు. పుట్టిన తేదీలు మాత్రము 7, 16, 25గా ఉండినవారు గాఢమైన దేశాభిమానులుగా ఉండి పిదప మారిపోవుదురు.

కష్టసుఖాలు ఎదుక్కొనే తత్వం:
వీరి జీవితంలో కష్టసుఖాలు, కష్టనష్టాలు, హెచ్చుతగ్గులూ చక్రంలా తిరుగుతూ వస్తూ, పోతూ ఉంటాయి. వాటిని సహజ సంభవాలుగానే భావించి వీటిని ఎదుర్కొనే స్వభావం వీరికి ఉంటుంది.

అతీంద్రియ శక్తులపై ఆసక్తి:
వీరికి అతీంద్రియ శక్తులపై ఆసక్తి ఉంటుంది. చిన్న ప్రయత్నంతోనే వాటిపై పట్టు సాధిస్తారు. ప్రధానంగా మార్మిక, అతీంద్రియ శాస్త్రాల యందు వీరు సిద్ధహస్తులు. వీరి ఉత్సాహంతా దేనినైనా ఎదురించటములోనే ఉంటుంది.

వ్యతిరేకత వీరికి బలమునిస్తుంది. వ్యతిరేకత అనునది వీరికి అన్ని రంగములలోను తప్పక కలుగును. వీరి న్యాయమైన విజయములు కూడా ఇతరులు వీరిని చూసి అసూయ చెందునట్లు చేయును.

విశ్వాసపాత్రులుగా:
మిత్రుల వద్ద, బంధువుల వద్ద విశ్వాసంతో ప్రవర్తిస్తారు. సాయం అడిగిన వారికి తమకు సాధ్యమైనంతలో సాయపడగలరు. ఆదరణలో ప్రత్యేకత కన్పిస్తుంది. కష్టాలున్నప్పుడు తీవ్రవాద ధోరణిలో ఉంటుంది. వీరి విజయాలను చూసి ఇతరులు అసూయపడతారు.


వైవాహిక జీవితము:
వీరికి సంసార జీవితం మిశ్రమంగా ఉంటుంది. 7 సంఖ్య కలిగిన వారు ముఖ్యంగా వివాహ జీవితములో అంతగా సుఖపడరు. మొత్తము మీద వీరికి ఆనంద దాయకమయిన వివాహజీవితము లభించదు. ఈ సంఖ్యగల స్త్రీలలో కొందరికి తమకన్న పై అంతస్థు వారు భర్తలుగా దొరుకుతారు.

2 సంఖ్యవారిని వివాహము చేసికొన్న మనసులు కలిసిన మనువగును. 4 సంఖ్యలో పుట్టినవారిని వివాహం చేసుకుంటే వీరు సుఖిస్తారు. వీరు 8 సంఖ్యవారిని వివాహమాడితే దురదృష్టమే.

1 సంఖ్యవారిని వివాహమాడుట మంచిది కాదు. సంతానము ఆలస్యముగా కలుగును.ఈ సంఖ్యగలవారు మంచి పనిమంతులు.

నిరంతరం పనిలో మునిగి ఉండమన్నా ఉంటారు. పరిసరాలు తగినవిగా ఉంటే ఎంత గొప్పకార్యమైనా సాధిస్తారు. ఆథ్యాత్మిక ప్రవృత్తిక గల వారగుటచేత కుటుంబ సుఖాలకోసం అంతగా తాపత్రయపడరు.

ప్రకృతి ప్రేమికులు:
నదులు, సముద్రాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలను చూసి వీరి మనసు పరవసిస్తుంది. ప్రయాణాలు, వాహనాలు నడపడం మొదలైనవి ఇష్టపడతారు. ప్రయాణాలు వీరికి ప్రీతి పాత్రమైనవి. ఇంట్లో కుక్కలు, పిల్లులు, పశువులు, మేకలు, కోళ్ళు, పావురాలు, కుందేళ్ళు వంటి ప్రాణులను పెంచుకుంటారు. వాటి అనురాగాన్ని ప్రదర్శిస్తారు.

స్వతంత్ర దృక్పథము:
మామూలుగా వీరు ఇతరులను అనుసరించరు. ఏ వృత్తిలో ఉండినా స్వంత అభిప్రాయములను, స్వతంత్ర దృక్పథమును చూపుతారు. వీరిని ప్రజలు సులభముగా, మార్గదర్శకులుగా ఎన్నుకొని అనుసరిస్తారు.

వీరి జీవితమును పరిశీలించిన, వీరివద్ద గల ఆకర్షణ శక్తి స్పష్టముగా కనిపించును. వీరి జీవితము ఇతరులను ఎంతో ఆకర్షించును. ఇంత ఉన్నా వీరిలో అనేకులు దురదృష్టవంతులుగనే అగుపడుచున్నారు.

అవిరామకృషితో ఉన్నతి:
జన్మతః అపూర్వశక్తులు (మేధస్సు) కలిగిన వీరిలో కొందరు అవిరామకృషితో గొప్పవారగుచున్నారు. మహాత్ములుగాను, మేధావులు గాను కనుపించువారు కూడా అదృష్టవశాత్తూ గొప్పవారైనవారు కారు. కష్టపడి ప్రగతి సాధించినవారే. బాల్యములోనే సంగీత విద్వాంసులు గను, గొప్ప బాలనటులుగను, లేక మేధావులుగా ప్రసిద్ధికెక్కినవారు ఈ సంఖ్యవారే.

లౌకిక జ్ఞానం:
ప్రపంచ వ్యవహారాలన్నిటిని తెలుసుకుంటారు. లౌకిక జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. స్నేహ భావం కలవారు. స్త్రీ పురుషుల ఇరువురికి మిత్రులు చాలా మంది ఉంటారు. అంతకు పూర్వం ఏ మాత్రం పరిచయం లేని వారితోనైనా స్నేహాన్ని నెరపగలరు.

అతి సామాన్య జీవనం:
వెనుకకు తగ్గు గుణము కూడా వీరియందు కలదు. గొప్ప పనులను సాధించే వీరు తమ తాహతుకు తగని చిన్న పసులు చేస్తారు. గొప్ప స్థితిలో జీవించినవారు పిదప అతి సామాన్యులవలె జీవించెదరు.

లోకజ్ఞానం ఎక్కువ:
నిస్వార్థమైన, న్యాయమైన, లోకోపకారమైన ఏ కార్యము చేపట్టినను వీరికి మహోన్నత విజయము లభించును. పేరు అమరత్వము చెందును. కీర్తి అష్టదిక్కులకు వ్యాపించును, శరీర సుఖమును త్యాగము చేస్తూ, ఉండగా వీరి కీర్తి ప్రతిష్టలు, లోకజ్ఞానం ఎక్కువగును.

కల్లాకపటం లేనివారు:
వీరికి గల మేలైన అభిలాషలన్నియు వెంటనే నెరవేరును. కళంకము లేని ఆశలన్నియు చక్కగా పూర్తియగును, కల్లాకపటములేక పసిబిడ్డల మనస్తత్వము కలవారైనచో వీరు తలచినవన్నీ సమకూరును.


ముఖ లక్షణములు:
కేతు భగవానుడు మన శ్వాసకోశములకు, శ్వాసనాళము, శ్వాసము లకు అధిపతి. పొడగరులుగనే కన్పట్టు వీరు చక్కని ముఖ లక్షణములు కలవారు.

కొద్దిగా వంపుగల ముక్కు, దృఢమైన గడ్డమును కలిగి ఉందురు. కనుబొమలు తీరిదిద్దినట్లుండును. తక్కిన భాగములు విధి సంఖ్యలను అనుసరించి ఉండును. ఏదైనా కఠిన పరిశ్రమయో లేక శరీర వ్యాయామమో చేయుట మంచిది.

ఆహారపు అలవాట్లు:
ఆహారములో వీలైనంతవరకు ఆకుకూరలు చేర్చుకొనుట మంచిది. తక్కిన వానికన్న క్యాబేజి, తోటకూర, కొయ్యతోటకూర ముంచివి. మంచి గుమ్మడి, బూడిద గుమ్మడి, దోస ఒకింత ఉల్లిగడ్డలు కూడా మిక్కిలి మంచి చేయును.

పండ్లలో రసముగల పండ్లు మంచివి. ముఖ్యముగా ద్రాక్ష, అనాస, ఎండుద్రాక్ష, అరటిపండ్లు కూడా మంచివే. వీరి జీర్ణవ్యవస్థ సున్నితమైనది.

ఆర్థిక పరిస్థితి:
డెస్టిని సంఖ్య 7 గలవారి ఆర్ధిక పరిస్థితి జీవితాంతము హెచ్చు. తగ్గులు, లాభనష్టాలతో కూడి ఉంటుంది.

కానీ అవసరానికి సాయం అందటం వలన ఆర్ధిక సౌష్టవం లేకపోయినా అంతగా వీరు ఆర్థిక సమస్యలు వీరిని చుట్టుముట్టవు, వ్యాపారరీత్యా వీరు చేసే ప్రయత్నాలు లాభదాయకంగా ఉంటాయి.

వృత్తులు:
సామాన్యంగా 7వ అంకె వ్యక్తులు రచన, చిత్ర లేఖనం, సంగీత, నాట్య, నటన, దర్శకత్వ రంగాలలో ప్రసిద్ది గడించగలరు. రచనా సామర్థ్యం, వాక్చాతుర్యం హెచ్చుగా ఉంటుంది. ఆ కారణంగా ధనాన్నిసంపాదించగలరు.

వీరి చేతిలో సంజీవని యోగం ఉంటుంది. అందువలన వీరు డాక్టర్లుగా కూడా రాణించగలరు. కమ్యూనికేషన్ రంగాలు వీరికి అనుకూలం. విదేశములతో సముద్రము ద్వారా జరుపు ఎగుమతి, దిగుమతి వ్యాపారములు, విదేశములను గురించి అక్కడి విషయములను ప్రచురించు పుస్తకములు, పత్రికల మూలముగను, ఎలక్ట్రికల్ పరికరముల వ్యాపారమునందును లాభములుండును.

చిత్రలేఖనము, శిల్పము, సంగీతము, నాట్యము మొదలైన వాటియందు లేక బాల్యము నుండి దేనియందు ఆసక్తి గలదో అట్టి వృత్తిని అవలంబించిన కీర్తి, ఐశ్వర్యము కలుగును. రాజకీయ మందు వీరు ప్రముఖులు కాగలరు.

హఠాత్తుగానే వీరికి సంపద వచ్చి పడును. మందుల వ్యాపారము కూడ వీరికి తగినదే. వీరికి అతీంద్రియ శక్తులుంటాయి కాబట్టి, జరగబోయేది ముందుగానే ఊహించగలరు కాబట్టి జ్యోతిష్యం, న్యూమరాలజీ మంచి అనుకూలమైన వృత్తులు.

భాగస్థులతో కలిసి చేయు వ్యాపారములలో 1, 2, 5, 7 సంఖ్యలలో జన్మించినవారిని కలుపుకొనవచ్చును. పుట్టినతేది 7 సంఖ్య అయినచో 1, 2, 5, 7 వారు సహాయము చేయుదురు.

రంగులు:
తెలుపు వీరిని ఎక్కువగా ఆకర్షించును. అయినా వీరు తెలుపుకన్నా లేత పసుపు, లేత పచ్చ, లేత నీలము వంటి రంగులు ధరించుటయే మేలు కలిగించును. లేతవైన అన్ని రంగులను వీరికి తగినవే.

తగని రంగులు:
అన్ని ముదురు రంగులు వీరికి కీడు కలుగచేయునవే. ముఖ్యముగా ఎఱుపు, నలుపు రంగులు దురదృష్టకరమైనవి. వైఢూర్యము వీరికి అదృష్టకరమైనది. దీనిని ధరించుటచే ధైర్యమును, దైవబలమును ఎక్కువగును. ఇదిగాక మంచి ముత్యము, చంద్రకాంత శిల అనబడు Moon stones కూడా మంచివే. వీరికి లోహముల కన్నా మట్టి ఎక్కువ మేలు చేయును. కనుక వంటకు మట్టిపాత్రలు ఉపయోగించుట వలన శరీరారోగ్యమును వృద్ధి చేయును.

పాజిటివ్ లక్షణాలు:
అతీంద్రియ శాస్త్రాలలో పట్టుకలిగి ఉదటం. వేదాంత శక్తి కలిగి ఉండటం, ఆత్మజ్ఞానం, తాత్విక జ్ఞానం కలిగి ఉండటం. ఏకాంతానికి ఎక్కువ ప్రాముఖ్యత. పరిశీలన, పరిశోధన బాగా చేయగలగడం. ఏ పని చేసినా ఖచ్చితంగా చేయడం.

మంచి ఆలోచనా విధానం, నమ్మింది ఆచరించడం, నిబ్బరంగా ఉండటం, విజ్ఞానదాయకమైన రచనలు చేయగలగడం, నిరంతర పఠనం, జ్ఞానం. ఆత్మాభిమానం కలిగి ఉండి, ఉన్నత స్థానంలో ఉండగలగడం. ప్రతీ విషయాన్ని సూక్ష్మంగా పరిశీలించి, లోతుగా ఆలోచించే శక్తి కలిగి ఉండటం.

నెగిటివ్ లక్షణాలు:
వీరు ఆర్థికపరంగా ఎలాంటి పొదుపులు చేయకపోవటం వలన ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని సందర్భాలలో మితి మీరిన కోపం తెచ్చుకుంటారు. కాని వెంటనే సర్దుకుంటారు. మానసిక వైకల్యములు, తికమక పడటం, విచారం, నిర్వేదం.

చుట్టు ప్రక్కల ఏం జరుగుతుందో తెలిసికోలేకపోడం, అమాయకత్వం, తడపాటు, నిరాశ, నిస్పృహ. విమర్శలు చేయడం, దెప్పి పొడవడం, భయం, ఆందోళన. వీరు ఇతరులు వీరిని అర్ధం చేసుకోలేక పోవడం. ఇతరుల అభిప్రాయాలను నిందిస్తూ చివరికి తమచుట్టూ గిరిగీసుకుని కూర్చుంటారు.

16వ తేదీన జన్మించిన వ్యక్తి లక్షణాలు:
16వ తేదీన జన్మించినవారు తక్కిన (7, 25) వారికన్న గొప్ప మనోశక్తులు కలవారుగా ఉంటారు. వీరు దైవభక్తి కలిగి ఉంటారు. శాంతిని కోరుకుంటారు. అతీంద్రియ, తాత్వికత, ఆధ్యాత్మికత కలిగి ధ్యాన సంపన్నులై ఉంటారు. రచనలు, సంగీతం, జ్యోతిష్యం, బోధనా వృత్తులు, ద్రవ (లిక్విడ్) పదార్ధాలకు సంబంధిత వృత్తులు అనుకూలం.

16వ తేదీన జన్మించిన వారు ఎందరో బాల విద్వాంసులు, బాల్య మందే ప్రసిద్ధులయిన కవులు, నటకులు ఉన్నారు. తాత్విక, ఆధ్యాత్మిక భావనలు కలిగి ఉంటారు.

ప్రతీ విషయంలో విశ్లేషణా శక్తి, పరిశీలన కలిగి ఉంటారు. ఇది కేతు గ్రహ సంఖ్య కనుక వీరికి అసాధారణ స్ఫురణ, మానసిక దివ్యశక్తులు ఉంటాయి. వీరిలో ఎక్కువమంది ఏకాంతంగా ఉండటానికే ఇష్టపడతారు. దానగుణం, దయ, జాలి కలిగి సమాజంలో గౌరవ ప్రద మైన జీవితం గడుపుతారు.

వీరు సున్నిత మనస్కులు. వీరు చాలా గుప్తంగా ఉంటారు. వీరు తమ మనసులోని భావాలను అస్సలు బయటకు తెలియనీయరు. జీవితంలో కొన్ని విషయాలలో చాలా రహస్యంగా, గోప్యంగా ఉంటారు. కొంతమందిలో రహస్య ప్రేమ వ్యవహారాలు ఉంటాయి. వీరికి ప్రేమ వివాహాలు అంతగా సరిపడవు.

వీరు 1, 2, 4 సంఖ్య వారిని వివాహమాడితే జీవితం బావుంటుంది. 8, 9 సంఖ్య వారిని పెళ్ళి చేసుకోకుండా ఉంటే మంచిది. ఏదైనా వీరి వైవాహిక జీవితం కొంత అసంతృప్తిగానే ఉంటుంది.

వీరికి సంగీతం, సాహిత్యం, రచనలు, కళాకారులుగా, నటులు, గాయకులుగా పేరు పొందుతారు. వీరి చేతిలో సంజీవనీ యోగం ఉంటుంది. కనుక వీరు డాక్టర్లుగా, జ్యోతిష్యులుగా, తాంత్రికవేత్తలుగా, గురువులుగా, ఉపాధ్యాయులుగా చాలా ప్రఖ్యాతి పొందుతారు.

వీరి వాక్కు ఫలిస్తుంది కాబట్టి వీరు అందరి బాగు కోసం పాజిటివ్ మాట్లాడితే ఎదుటివారికి మంచి శుభం కలుగుతుంది. వీరి పేరుని న్యూమరాలజీకి అనుగుణంగా సరిచేసుకున్నట్లయితే వీరు కూడా జీవితంలో మంచి ఉన్నత స్థాయికి చేరతారు.

25వ తేదీన జన్మించిన వ్యక్తి లక్షణాలు:
25వ తేదిన పుట్టినవారు తన మతమే గొప్పదని బహిరంగముగా వాదిస్తారు. వీరిని అనేకులు అనుసరిస్తారు. వీరు తెలివితేటలు, దైవభక్తి కలిగి ఉంటారు. శాంతిని కోరుకుంటారు. అతీంద్రియ, మానసిక శక్తులు, ఆధ్యాత్మిక కలిగి ఉంటారు ఆయా రంగాలలో బాగా రాణిస్తారు.

25వ తేదీన జన్మించినవారు గొప్ప ఆధ్యాత్మిక వేత్తలుగా, సునిశిత బుద్ధి, మేధాశక్తి, దైవభక్తి, అసాధారణ స్ఫురణ (ఇంట్యూషన్) కలిగి ఉంటారు. ఏ విషయమైన తార్కికంగా, విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తారు. ఏకాంతంగా పనిచేయడానికి ఇష్టపడతారు. నీతి, నిజాయితీ, నియమ నిబద్ధనలతో జీవితం గడుపుతారు.

25వ తేదిలో పుట్టినవారు వందనీయులగుచున్నారు న్యాయాధిపతులుగను, సభానాయకులుగను, తక్కిన వారిచే గౌరవింపబడి జీవించుచున్నారు. వీరు భిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు.వీరిని అనేక మంది గౌరవిస్తూ అనుకరిస్తారు. వీరి ఆలోచనలు, సృజనాత్మకత అన్నీ పరిశోధనాపరంగా ఉంటాయి. స్వయంకృషితో ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు. ప్రారంభించిన పనిని మధ్యలో ఆపరు.

వీరికి ప్రేమ విషయంలో చేదు అనుభవాలూ చాలా ఉంటాయి. వీరి వైవాహిక జీవితం అసంతృప్తిగా ఉంటుంది. వీరు విజ్ఞానశాస్త్రం, తత్త్వశాస్త్రం, తర్కశాస్త్రం, మానసికశాస్త్రం, డాక్టర్లుగా, గొప్ప సైంటిస్ట్లుగా, ఇన్వెంటర్స్, గొప్ప ఆధ్యాత్మిక వేత్తలుగా, గుర్తింపు పొందుతారు.

శాస్త్రవేత్తలుగా ఎదుగుతారు. సినిమా రంగాలు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాలు, భౌతికశాస్త్రం రంగాలలో బాగా రాణిస్తారు. అనేకులు వీరి సహాయము, మార్గదర్శకత్వము కొరకు ఎదురుచూస్తారు.

సాధారణ లక్షణములు:
ఈ సంఖ్యలోని మేలైన వారిని, కరుణ, దయ, పరుల కష్టము చూసి సహింపలేకుండుట, సమాజములోని అవినీతిని ఎదురించి పోరాడుట, జంకులేక చెడును ఖండించుట, వేదాంత శాస్త్రములందు శ్రద్ధ, నిగూఢ కళాజ్ఞానము నిండిన సంస్కర్తలుగా ఉండుటచే గుర్తింపగలుగుచున్నాము. అతి తక్కువ శాతమే ఇట్టివారు.

వీరి తరువాత అతి గౌరవముగా మర్యాదస్తులుగా కనబడువారిని చూసినట్లయితే వీరి గొప్పతనము అంతయు పైపై వేషమే.

సహజ గుణములు:
వీరు అమితమైన మనోశక్తులు, స్పష్టమైన తెలివి, మిక్కిలి పదునైన బుద్ధి కలవారు. సదా ఆలోచనలలో మునిగి ఉందురు. అతి పెద్ద సమస్యలతో మనసు సతమతమగును. మనసులో ఉత్సాహముండదు. ఎప్పుడూ దేనినో కోల్పోయినట్లు కనబడుతారు. సుఖమును కూడా మనసారా అనుభవింపలేరు.

ఈ సంఖ్యలోని అయోగ్యులు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. ఎంతమేరకు సుఖములనుభించినా వీరికి తృప్తి కలుగదు. వీరికి ఆత్మవిశ్వాసము అతి తక్కువ. జీవితములో విజయములు గలిగిన పిదపనే వీరికి ధైర్యము వచ్చును. పరులను కూడ సులభముగా నమ్మరు. ఇతరులతో మసలునపుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు.

No comments:

Post a Comment

Numerology - Number 7 - న్యూమరాలజీ - 7వ సంఖ్య

న్యూమరాలజీ - 7వ సంఖ్య గ్రహము: కేతువు జన్మదిన తేదీ సంఖ్య: 7, 16, 25 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 7, 16, 25 ఈ తేదీలలో పుట్టి...