Saturday, October 17, 2026

Numerology - Number 8 - న్యూమరాలజీ - 8వ సంఖ్య

న్యూమరాలజీ - 8వ సంఖ్య

గ్రహము: శని భగవానుడు అధిపతి

జన్మదిన తేదీ సంఖ్య: 8, 17, 26

జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 8, 17, 26 ఈ తేదీలలో పుట్టినవారిని జనన సంఖ్య 7 సంఖ్య గలవారని పిలువబడతారు.

ఇచ్చట చెప్పిన 8, 17, 26 తేదీలలో

8వ తేది 8 సంఖ్యకు చెందిందనే విషయం స్పష్టముగానే తెలియు చున్నది.

17వ సంఖ్యను 1 + 7 అని కూడగా 8 వస్తుంది.

26వ సంఖ్యను 2 + 6 అని కూడితే 8 వస్తుంది.

అందుచేత 8, 17, 26 ఈ తేదీలలో పుట్టినవారు ఎవరైనా సరే,వారందరూ 8 సంఖ్య వారని తెలుసుకోవాలి,

దీనితో పాటు 8వ నెంబరు అదృష్ట సంఖ్య లేదా ఫేట్ సంఖ్యగా లేదా డెస్టినీ సంఖ్యగా కలవారు కూడా ఈ 8వ నెంబరు క్రిందకు వస్తారు.

దీనితో పాటు ఒకరి పేరులోని అక్షరాలకున్న విలువల సమష్టి సంఖ్య 8గా కలవారు కూడా ఈ 8వ నెంబరు క్రిందకు వస్తారు.

జన్మతేది 8గా ఉన్నను, తేది, నెల సంవత్సరము కూడగా వచ్చు సంఖ్య 8గా ఉన్నను, శనియొక్క కాలమైన జనవరి, ఫిబ్రవరిలలో జన్మించినచో వారి శరీరమున శని ఆధిక్యత కనబడును.

లేనిచో ఆయా మాసములకు అధిపతి అగు గ్రహముల లక్షణములు కలిసిపోవును. శనియొక్క ప్రభావము యదార్థముగా బాహ్య దృష్టికి కనబడునది కాదు. పుట్టినతేది 8గా ఉండి విధి సంఖ్య 5గా ఉన్నచో వారు ఆకర్షణీయము గాను, అందముగాను ఉందురు.

వీరు ఎంతో కష్టపడి పనిచేస్తారు, అంకితభావం కలిగి ఉంటారు. క్రమశిక్షణ, బాధ్యతాయుతంగా ఉండటం వీరి ప్రధాన లక్షణాలు. వీరు జీవితంలో అనేక ఒడిదుడుకులను, అడ్డంకులను ఎదుర్కొంటారు. ఎంత కష్టపడినా వెంటనే ఫలితం దక్కకపోవచ్చు, ఆలస్యంగా విజయం లభిస్తుంది. నిజాయితీగా ఉంటారు, న్యాయాన్యాయాలను బేరీజు వేసుకోగల సామర్థ్యం ఉంటుంది.

8వ సంఖ్యగా కల వారు ఏకాంత ప్రియులు:
డెస్టిని సంఖ్య 8 గలవారి మనసు సదా ఏకాంతమునే కోరును. ప్రతి చిన్న విషయానికి ఎంతో కష్టపడితేగాని ఫలితం దక్కదు. విచక్షణా జ్ఞానము గల వీరు అన్నిటా నిదానమునే ఆశ్రయిస్తారు.

డబ్బు ఖర్చు చేయుటలో పిసినారితనము కనబడును. జీవితమునకు పనికివచ్చు అన్ని శాస్త్రములను బాగుగా పరిశీలించుటకు ఇష్టపడుతారు. ఎల్లప్పుడు తమను అందరికన్న భిన్నమైన వారుగనే తలచుకొందురు. ఇది వారి మాటలలో, చేతలలో స్పష్టముగా కనబడును.

సమస్యలతో సతమతం:
వీరు ఎప్పుడూ తలపైకెత్తి చూడకుండా నేలమీదకే చూపులు పెడుతూ, తలవంచుకొని ప్రశాంతంగా నడుచుకుంటే వెళ్ళే స్వభావం కలవారుగా ఉంటారు. ఎల్లప్పుడూ సమస్యలతో పోరాటం సలుపుతారు.

పెద్ద పదవులు నిర్వహిస్తున్నా బాధ్యతలను ఎక్కువగా మోస్తుంటారు. తరచుగా మనస్సులో ఆందోళనలు ఏర్పడి తొలిగిపోతాయి. మేధోలక్షణం ఉంటుంది. ఏదో ఒక సమస్య మనస్సులో ఎప్పుడూ మెదులుతూ ఉంటుంది.

స్నేహాన్ని విరోధాన్ని కూడా మరువనివారు:
వీరితో విరోధం పెట్టుకున్ననూ, స్నేహం పెట్టుకొన్ననూ ఈ రెంటిని జీవితాంతం వరకు మరచిపోయేవారు కాదు. ఎవరైనా వీరిని పొగడితే ఆ పొగడ్తలకు లోబడి వారికి ఏదో విధంగా మంచి చేయాలనే తహతహపడే స్వభావం వీరికి ఉంటుంది.

వీరు విధివంచితులు:
చిన్నతనంలో కుటుంబ సమస్యలతో బాధపడతారు. కొంతమంది తల్లిదండ్రులకు దూరంగా ఉండే అవకాశం ఉంది.బాల్యము కష్టములు నిండినదిగా ఉండును. ఎంతో శ్రమపడి కొందరు పైకి వచ్చుచున్నారు.

వీరికి దొరకు ప్రతి చిన్న సుఖము, జయమును కూడా ఎంతో పోరాడిన మీదట కాని దొరకదు. సంఘములో వీరి అర్హతకు తగ్గ స్థితిని పొందుటకు వీరెంతో పోరాడవలసి యుందును. వీరికి జీవితములో ఆటంకములు కలుగుచునే ఉండును.

మొండితనం కలవారు:
వీరికి మంచి చెడులను బేరీజు వేయగల శక్తి ఉంటుంది. జీవితంలో ప్రగతి సాధించాలన్న తపన ఉంటుంది. మనస్సులో ఎప్పుడు మొండితనం ఉంటుంది. ఏ విషయాన్నైనా స్పష్టంగా బైట పెట్టగలరు. ఏవైనా పనులు నిర్వహించాలంటే వ్యతిరేఖత ఉంటుంది. కాని వెనుకంజ వేయరు.

జాగ్రత్త వహించకున్నచో అపాయము:
8 సూచించు సంవత్సరములైన 8, 17, 26, 35, 44వ యేండ్లలో జాగ్రత్తగా ఉండకపోయిన గొప్ప అపాయములు కలుగగలవు. పేరు సంఖ్య 8గా నున్నవారికి కూడా 8ని సూచించు సంవత్సరములలో ముఖ్య సంఘటనలు జరుగును.

వీరిలో కొందరు కష్టములలో చాలా కాలము జీవిస్తారు. ఇతరులు చేయు నేరములకు కూడా వీరు బాధ్యులుగా తరచుగా భావింపబడుదురు. అతి మంచి వారుగను, గొప్పవారుగను.

మేధావులుగను ఉన్నను వీరికి సమీపమున ఉండువారు సరిగా అర్ధము చేసికొనరు. ఎన్నటికినీ వీరు ఎవరి అండ దండలు ఎదురు చూడరాదు. తమ స్వంత ప్రయత్నముతో అభివృద్ధి సాధింపవలెను.

వాహన ప్రియులు:
ఇతరుల దుఃఖం చూసి చలిస్తారు. పలు కళలను అధ్యయనం చేస్తారు. కళారాధకులు. అన్నిటిలోనూ ఒంటరిగానే వ్యవహారం నడుపుతారు. ఇతరుల సలహాలతో కాక తమకు తాముగా మంచి నిర్ణయం తీసుకోగలరు. వాహన ప్రియులు. వీరు వాహనం నడపడం ఆకర్షణీయంగా ఉంటుంది. భయం లేని వారు.

విచక్షణాజ్ఞానము అధికము:
తక్కినవారికన్న వీరికి విచక్షణాజ్ఞానము అధికము. కాన వీరు ఇతరులతో చేర వీలుకాదు. దీనివలననే వీరు మిత్రులు అధికముగా లేక ఒంటరిగా ఉందురు.

36వ ఏట అదృష్టం:
డెస్టిని సంఖ్య 8 గలవారికి 36 లేదా 42 ఏళ్ల వయసులో అదృష్టం బాగా కలసి వస్తుంది. మీరు 36 ఏళ్ల వరకు చాలా ఇబ్బందులు కూడా పడే అవకాశం ఉంటుంది. కానీ 36 ఏటలోకి అడుగుపెట్టగానే అన్నీ వీరికి అనుకూలంగానే పనులు జరుగుతాయి. ఒకవేళ అప్పుడు రాకుంటే 42 ఏళ్లప్పుడు అదృష్టం కలిసి వస్తుంది. మీరు అనుకున్న రంగంలో రాణిస్తారు.

గొప్ప లౌక్యాన్ని ప్రదర్శించేవారు:
అవినీతి, అక్రమాలను వ్యతిరేకించి వాటిని పారద్రోలుతారు. తప్పు చేసిన వారు ఎవరిరైనా ప్రశ్నిస్తారు. న్యాయాన్యాయాలను ఎరిగిన వారు. లౌక్యాన్ని ప్రదర్శిస్తారు. మనస్సులో ఆలోచనలు నిరంతరం పరిభ్రమిస్తుంటాయి. గొప్ప శాస్త్రవేత్తగా పరిశోధనా తత్పరులుగా ఉంటారు. దేహ సౌఖ్యంలో ఆసక్తి ఉంటుంది.

పరోక్ష శత్రువులను జయించేవారు:
స్థిర స్వభావంతో ప్రవర్తిస్తారు. పారిశ్రామిక రంగాలలో ఆసక్తి ఉంటుంది. ఒంటరితనాన్ని ఇష్ట పడతారు. సంగీతంలో ఆసక్తి ఉంటుంది. చురుకుగా వ్యవహరిస్తారు. ఇతరులకు లోబడక తమకు లోబడే విధంగా చేస్తారు. పరోక్ష శత్రువులు ఉంటారు. వారిని జయించగలరు. ఒక సమస్య పరిష్కారమైతే మరో సమస్య వీరి జీవితంలో మొదలౌతుంది. క్రమంగా అభివృద్ధి సాధిస్తారు. ప్రతి ముందడుగుకు పూర్వం పెద్ద పోరాటం సలిపి విజయం సాధిస్తారు.

శారీరక లక్షణములు:
వీరు చూచుటకు అంత ఎక్కువ ఎత్తుగా కాకుండా మధ్య రకంగా ఉంటారు. వీరి తల వెంట్రుకలు దళసరిగా ఉంటాయి. విశాలమైన భుజాలు, చిన్న కాళ్ళు, పెద్ద చెవులు, చామన చాయ వర్ణములో ఉంటారు. ముఖము పొడవుగా ఉండి సన్నగా ఉందురు. కొందరు కొంచెము లావుగా ఉన్నను, బుగ్గలు అంటుకొనిపోయి ఉండును. కొందరికి లోతుకుపోయి ఉండును.

ఆర్ధిక పరిస్థితి:
డెస్టిని సంఖ్య 8 గలవారి ఆర్థిక స్థితి హెచ్చుతగ్గులతో ఉంటుంది. కొన్ని సమయాలలో ఎక్కువ నష్టం వచ్చినా చివరకు ఆర్థికస్థితి చక్క బడుతుంది. ముప్పది సంవత్సరముల వరకు కొంత శ్రమపడినా వీరి జీవితం బాగుపడుతుంది. అప్పటి నుండి సుఖాలను అనుభవిస్తారు.

ప్రశాంత జీవనాన్ని కోరుకుంటారు:
డెస్టిని సంఖ్య 8 గలవారు, 8 ఈ తేదీన పుట్టినవారు ప్రశాంతమైన జీవనమునే కోరుదురు. పలు కార్యములను చేయుటకు ప్రయత్నించెదరు. పరోపకారమైన పనులందు, స్వసుఖమును త్యాగము చేయు కార్యములందు పాలు పంచుకొనకపోయిన వీరి మన సుకు శాంతి ఉండదు.

మనస్సాక్షి బాగుగా పెరిగియున్నందున నిజాయితీ గల జీవితముండును. వీరు గొప్పగా కష్టపడేవారు. పలు అరుదైన కార్యములు సాధింపగలిగినవారు. సమాజ సంక్షేమమునకై పాటుపడువారు.

దురదృష్టవంతులు:
విచారం, నిర్వేదం, అనుభవ రాహిత్యం, అధికశ్రమ, అధిక ఖర్చులు, తరచు ఏదోక కష్టం, వ్యర్థ ప్రయత్నాలు, నిస్సారమైన జీవితం వీరు గడుపుతుంటారు. రాబడికి మించిన ఖర్చులు, నిర్లక్ష్యం, ప్రాపంచిక విషయాలపై ఆసక్తిని వీరు ప్రదర్శిస్తారు.

ఆర్థికపరంగా ఎన్నో సమస్యలు రావటంవల్ల తమ విజయాలను ఆలస్యంగా అందుకుంటారు. జీవితంలో అన్ని విషయాల్లో ఆలస్యం అవడం, అందరిలోకి వీరు అత్యంత దురదృష్ట వంతులు కావటం మూలాన చివరికి ఒంటరిగా మిగిలిపోతారు.

అదృష్టకాలము:
8, 17, 26 తేదీలలో పుట్టినవారు. పేరు విధి సంఖ్యకు తగినట్లు పెట్టుకొని ఆ సంఖ్యకు గల అదృష్ట దినములందే అన్ని కార్యములను చేయుచుండిన మంచిది. అట్లు చేయుట వలన ఆ సంఖ్య బలము పెరిగి శని యొక్క ప్రభావము తగ్గును. ఇదిగాక వీరికి అదృష్ట దినములు 1.

10, 19, 28 తేదీలు, 8, 17, 26 తేదీలు కూడా మంచివే. కానీ ఇవి దైవిక కార్యాలకు విజయాన్ని ఇచ్చే తేదీలు, తేదీ, నెల, సంవత్సరం కూడిన 1 వచ్చు దినములు

దురదృష్ట 
కాలము:
8, 17, 26 తేదీలు వ్యర్ధముగా వ్యవహారముల నేర్పరచి, కీడును కలిగించును. ప్రయాణములు మున్నగునవి ఈ దినములలో చేసిన అనా రోగ్యమును, అపజయమును వదలవు. తేది, నెల, సంవత్సరము కలిపితే 8 వచ్చు దినములు కూడ వీరికి దురదృష్టకరమైనవే అని గమనించవలెను.

అదృష్టమునిచ్చు రంగులు:
పసుపు రంగు వీరికి శోభించును. ముదురు పచ్చయు, నీలమును మేలు చేయునవియే. విడిగా ఉండునప్పుడు నీలము ధరింపవచ్చును. ఇవి కాక ముదురు బూడిద రంగు, పర్పుల్ రంగులు కూడా ధరించవచ్చును.

వృత్తులు:
పుట్టినతేది సంఖ్య 8గా ఉన్నచో ఇతరులకు గొప్ప విషయములను బోధించుట మూలమునను, శనికి ప్రత్యేకింపబడిన వృత్తియైన, జనులను ఒకచోటి నుండి మరియొక చోటికి తరలించు, బస్సు వంటి సాధనముల వల్లను, లారీ కంపెనీలు నడుపుట చేతను, గనుల ద్వారాను అమితమైన ఐశ్వర్యము కలుగును.

గనులలో ఉండు ధాతువులు, ఉన్ని బట్టలు, ఇనుప వస్తువులు, ఆయుధములు, మురికిని తీయు సబ్బులు, నూనె మిల్లులు, నూనె వస్తువులు, ప్రింటింగ్ ప్రెస్లు, వీటి వలనను సులభముగా ధనము సంపాదింపవచ్చును.

గొప్ప భూగర్భ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు వంటి పనులుకానీ, కొలువులుగానీ నిర్వహించేవారు సాధారణంగా 8 డెస్టినీ సంఖ్యగలవారుగా ఉంటారు. మంచి నిర్వహణాశక్తి కలవారగుటచే పెద్ద సంస్థలను చక్కగా నిర్వహిస్తారు.


సాధారణంగా 8 డెస్టినీ సంఖ్యగలవారుగా ఉంటారు. మంచి నిర్వహణాశక్తి కలవారగుటచే పెద్ద సంస్థలను చక్కగా నిర్వహిస్తారు. న్యాయము నిర్ణయించు ఉద్యోగములందు ప్రకాశింతురు. పుట్టినతేదిగాని, పేరుగాని 8 అయిన మిక్కిలి బాధ్యతతో రాజ్యమును కూడా ఏలవలసి వచ్చును.

వాణిజ్యమునకు : 1, 4, 5, 6 వారిని వ్యాపారములో చేర్చుకొనవచ్చును.

సహాయపడువారు : 8 సంఖ్య వారికి 1, 4, 8 సంఖ్యలవారే సహాయ పడగలరు.

వైవాహిక జీవితము:
వీరి దాంపత్య జీవితం బాగుగానే ఉంటుంది. అనుకూలవతి అయిన భార్య/భర్త లభిస్తారు. ప్రేమ వ్యవహారాలలో వీరికి ఏమాత్రం అనుకూలత ఉండదు. అనేక ప్రయత్నాలు చేసిన తరువాత తాను చేసినది న్యాయం, సమంజసం కాదు అని తెలుసుకుంటారు.

8 తేదీలలో జన్మించినవారు, 1 గాని 4 తేదీల వారిని వివాహమాడవలెను. వీరికి 8, 4, 1 వారిపైనే ప్రేమ కలుగును. వీరు 2,7,9 తేదీల వారిని వివాహమాడవచ్చు. 6 సంఖ్య వారిని చేసుకొనవచ్చు. వీరికి కుటుంబ జీవితము సుఖమయమైనదిగా ఉండదు.

మంచి తేదీలలో వివాహము చేసికొనిన వచ్చువారి సంఖ్యాబలము వలన సమస్యలు తగ్గును. శని ప్రభావాన్ని తగ్గించే శక్తి శీఘ్ర గ్రహమైన “బుధుడి"కి ఉంది. కనుక వీరు బుధుని సంఖ్య అయిన '5' సంఖ్యలో పేరు పెట్టుకున్నట్లయితే మంచి ఫలితాలను పొందుతారు.

పాజిటివ్ లక్షణాలు:
మంచి నిర్ణయాత్మకక శక్తిని కలిగి ఉంటారు. ఏ పనినైన బాగా ఆలోచించి చేస్తారు. పనిలో మంచి అభిరుచి, లక్ష్యం కలిగి ఉంటారు. అందుచే పనిలో విజయం సాధిస్తారు. అన్ని విషయాలలో మంచి సామర్థ్యం కలిగి ఉండటం.

మంచి పరిపాలనా సామర్థ్యం, అన్నింటా నియంత్రణ కలిగి ఉండటం. మంచి వ్యాపారాలు చేసి ధన సంపాదన చేసి, మంచి ఆర్ధిక వనరులు కలిగి ఉండటం. విచక్షణా జ్ఞానం కలిగి మంచి జడ్జిమెంట్ ఇవ్వగలగడం, మంచి గుర్తింపు పొందటం. నీతిగా, న్యాయంగా వ్యాపారం చేయడం, ఆర్థికంగా, అధికారికంగా మంచి గుర్తింపు లబిస్తుంది.


నెగటివ్ లక్షణాలు:
వీరికి నాయకత్వం కోసం అధికారపై ఎక్కవ ఆశ కలిగి నిరంతరం దానికోసం ఎలాంటి పనినైనా చేయటానికి వెనుకాడరు. అధికార దాహం, అధికార దుర్వినియోగం చేయడం, కఠినంగా వ్యవహరించడం, అత్యాశ, లాభాలకోసం తాపత్రయం, స్వార్థబుద్ధిని కలిగి, నియంత్రణ లేకపోవడం, మొరటుతనం, జాలి, దయలేకపోవడం, పగ, ప్రతీకారం కలిగి ఉండటం మొదలైన లక్షణాలను కలిగి ఉంటారు. వీరు డబ్బుదగ్గర పిసినారి తనంగా ఉంటూ ఇరతులకు సహాయపడకుంటా ఉంటారు.

ధరించవలసిన రత్నము:
దోషములేని మంచి లక్షణములు గల జాతి నీలము ధరించిన మంచి అదృష్టము కలుగును. ఆరు సూత్రములు గల నీలములు వీరికి మిక్కిలి తగినవి. ధనవంతులయినచో దొరికితే ఇంద్రనీలము ధరింపవచ్చును.

లక్కీ & పోజిటివ్ నెంబర్స్: 5, 6, 8,

అన్ లక్కీ నెంబర్స్: 9

లక్కీ వారాలు: బుధ, గురు, శుక్ర, శని

డైరెక్షన్: వెస్ట్.

మెటల్: ఐరన్.

పూజించవలసిన దేవతలు: విష్ణు, బ్రహ్మ, శివ, శివారాధన.

గ్రహప్రీతి, గ్రహశాంతి: ఎనిమిది సంఖ్యగలవారు..

శనిదేవునికి ప్రీతిగా శనిస్తోత్ర పారాయణము, శనివార వ్రతము. దుర్గాస్తోత్రపఠనము, శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనము, నవగ్రహ ప్రదక్షణము, శని గ్రహానికి మంచినూనె దీపారాధన ఇవన్నీ చేస్తుంటే గ్రహప్రీతి కలిగి శనిదేవుడు కరుణించగలడు.

ఉత్తమమైన సమయము:
ప్రతి సంవత్సరము 20 జనవరి నుండి 20 ఫిబ్రవరి వరకు వృత్తి, వ్యాపారము, ఉద్యోగము మొదలైన వాటికి ఉత్తమ మైన సమయము.

కేతుజాతకులైన వారు 20 జూన్ నుండి 20 జులై మధ్యకాలంలో సోమవారం రోజున కానీ శుక్రవారం రోజున గానీ జన్మించినవారికి కేతుజాతకుల లక్షణాలు ప్రస్పుటంగా ఉంటాయి.

జన్మదినం తేది సంఖ్య 8, 17, 26 లలో జన్మించిన వారికి పై విధమైన సాధారణ లక్షణములు ఉన్నప్పటికి ఇతర గ్రహములు చేరిన కారణంగా 17, 26 తేదీలలో జన్మించినవారికి మరి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. వాటి వివరాలు.

17వ తేదీన జన్మించిన వ్యక్తి లక్షణాలు:
వీరు నాయకులుగా ఎదుగుతారు. వీరు జీవితంలో క్రమంగా అభివృద్ధి చెందుతారు. స్వేచ్ఛా భావాలు కలిగి ఉంటారు. బాధ్యతలు తమపై వేసుకుంటారు. జీవిత ప్రధమంలో కష్టాలు, తరువాత విజయాలు, మంచి జీవితం ఏర్పడుతుంది.

17వ తేదీన జన్మించిన వీరు, జీవిత ప్రధమంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. క్రమక్రమంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. వీరికి వ్యాపార, ఆర్థిక విషయాలలో మంచి అవగాహన ఉంటుంది.

వీరు మంచి నిర్ణయాత్మక శక్తి, స్వేచ్చా భావాలు కలిగి ఉంటారు. బాధ్యత మొత్తం తమపైనే వేసుకుంటారు. బాధ్యతతో పాటు అధికారాలు వస్తాయి. కొందరు నియంతలాగా మారే అవకాశం ఉంది.

గౌరవప్రదమైన జీవితం, పేరు ప్రతిష్టలు, మరణానంతరం కూడా కీర్తి లభిస్తాయి. వీరు కళాత్మక హృదయం కలిగి ఉంటారు. ఇంటిని, కుటుంబాన్ని ప్రేమిస్తారు. పాజిటివ్ ఉంటే మంచి కష్టార్జితం చేసి ధనం బాగా సంపాదిస్తారు.

వీరికి శని సక్రమంగా లేకపోయినా, పేరు సక్రమంగా లేకపోయినా ఉన్నది వదిలేసి ఇక్కట్ల పాలు కావడం, కుటుంబంలో అవకతవకలు, వీరు పేరుని న్యూమరాలజీ ప్రకారం సరిచేసుకున్నట్లయితే మెరుగైన జీవితం ఏర్పడుతుంది.

26వ తేదీన జన్మించిన వ్యక్తి లక్షణాలు:
వీరికి మనీ మేనేజ్మెంట్ బాగా తెలుసు. వీరు శ్రమజీవులు. ఓర్పు తక్కువ. సంపద ఉంటే అన్ని సుఖాలు అనుభవిస్తారు. జీవిత ప్రధమంలో కష్టాలు, తరువాత విజయాలు. 26వ సం|| నుండి అభివృద్ధి ఉంటుంది 26వ తేదీన జన్మించినవారు ఎక్కువగా ఒంటరితనాన్ని అనుభవిస్తారు.

డెస్టినీ సంఖ్య 8 గల విభాగంలో 8, 17 కన్నా ఈ 26 సంఖ్య కొంచెం దురదృష్టకరమైనది. వీరి జీవిత ప్రథమార్ధంలో కష్టనష్టాలు, ఒడిదుడుకులు, కార్యసాధనలో ఆలస్యాలు ఎదురౌతాయి. వీరికి అతిగా నమ్మిన మిత్రులవలన లేదా వ్యాపార భాగస్వాముల వలన నష్టాలు కలుగుతాయి.

వీరికి పరోక్ష శత్రువులు ఏర్పడతారు. వీరీపై అపవాదులు ఉంటాయి. వీరికి వ్యాపార మెళకువలు, మనీ మేనేజ్మెంట్ (ధన నియంత్రణ) బాగా తెలుసు. చిన్నతనంలోనే కష్టనష్టాలనోర్చుకుని బాగా రాటుదేలి ఉంటారు. మంచి నిర్ణయాత్మక శక్తి కలిగి ఉండి, మంచి ఉన్నతి, అభివృద్ధి సాధించ దానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తారు. బాగా శ్రమించి ప్రగతి సాధిస్తారు.

వీరికి అనుకూలమైన నామ సంఖ్య ఉంటే మంచి అభివృద్ధి సాధిస్తారు. సంపద లభించిన తరువాత ఆడంబరంగా జీవిస్తారు. వీరికి 26 సం॥రాల వయస్సు నుండి అభివృద్ధి ఉంటుంది. కొందరు పూర్తిగా విజయాలను పొందితే మరికొందరు పూర్తిగా అపజయాలను పొందుతారు.


No comments:

Post a Comment

Triratra Vrathadeeksha - త్రిరాత్ర వ్రతదీక్ష

త్రిరాత్ర వ్రతదీక్ష ఆ జగన్మాత దయతోనే సర్వ జగత్తూ నడయాడుతోంది. ఆ అమ్మ కరుణావల్లి, ఆ తల్లి అమృతహృదయ, ఆమె చల్లని చూపులకోసం ముల్లోకాలు ఎదురు చూస...