నారదుడు తన పూర్వజన్మ వృత్తాంతం ఇలా చెప్పుతున్నాడు. ఓ మహానుభావా! గడచిపోయిన బ్రహ్మకల్పంలో నాదైన పూర్వజన్మలో నేనొక దాసీపుత్రుణ్జి. నా తల్లి వేదవిచారణ చేసే శ్రోత్రియుల ఇండ్లలో పనిచేస్తూ ఉండేది. నేను చిన్నవాడుగా ఉన్నప్పుడు ఆ వేదవేత్తలు వానకాలంలో ఒకేచోట చాతుర్మాస్యవ్రతం చేస్తున్న యోగులకు సేవ చేయటానికి నన్ను పంపారు. నేను సేవ చేస్తుండగా.
పుణ్యాత్మా! నేను భయభక్తులతో అన్నివేళల ఆ పరమహంసలను సేవించాను. ఓర్పు చూపించి నా నేర్పు ప్రకటించాను. చిన్నవయస్సయినా, ఆటపాటలపై ఆసక్తి ఉండే ప్రాయమయినా, నాతోడి బాలురతో ఆవంకకుపోకుండా మనస్సు కట్టడి చేసుకొని, ఎలాంటి సంబంధం ఎవరితో పెట్టుకోకుండా శ్రద్ధాభక్తులతో వారిని ఆరాధించాను.
ఆ సన్న్యాసులు భిక్షాపాత్రలలో మిగిల్చివేసిన ఎంగిలి పదార్థాలను భుజిస్తూ ఉండేవాడిని. ఆ ఉచ్చిష్టం సకలపాపనాశకం, సమస్త మంగళకరమని భావించేవాడిని. వానలో తడిసినా, ఎండలో మాడినా వెనుకాడకుండ వారికి సేవ చేశాను. వారు ఏమి ఆజ్ఞాపిస్తారో అని నిరంతరం వారిముందు నియమనిష్టలతో నిలబడి ఉండేవాడిని. వివేకం ఉన్న వాడనయినా వారేమి చెప్పినా ఇదికాదు, అదికాదని మారుమాటాడక ఒక వెట్టివానిలా ప్రవ ర్తించి పనులు నెరవేరుస్తూ ఉండేవాడిని.
ఈ రీతిగా వర్షాకాల శరత్కాలాలు నాలుగు నెలలూ వారిని భక్తితో ఆరాధించాను. ఆ మహానుభావులు కూడా నాపై దయ చూపించారు. ఆ సమయంలో.
ఆ పరమహంసలు నిత్యం కృష్ణచరిత్రను పఠిస్తూ ఉండేవారు. విశేష వ్యాఖ్యానంతో వివరిస్తూ ఉండేవారు. ఒక్కొక్క సమయంలో నామసంకీర్తనం చేస్తూ ఉండేవారు. ఆ ధ్వనులు అమృతరస ప్రవాహాలై నా చెవులలో నిత్యమూ నిండిపోయాయి. నా హృదయం ఆనందంతో సంతృప్తి చెందింది. క్రమక్రమంగా ఇతర చింతలన్నీ వదలి వేశాను. భక్తితో నారాయణ సేవ ప్రారంభించాను.
ఈ విధంగా నేను అనుష్టించిన విష్ణుభక్తివల్ల నేను ప్రాపంచిక వాసనలకు దూరమయ్యాను. ప్రపంచాతీతుణ్ణిగా మారి బ్రహ్మస్వరూపుడను అయ్యాను. స్త్టూలసూక్ష్మరూపమైన శరీరం నాయందు మాయచే ఆరోపించబడిందని తెలుసుకొన్నాను. ఒక్క విష్ణుభక్తివల్లనే నాకిటువంటి శుద్ధజ్ఞానం ఏర్పడింది. ఆ యోగీంద్రుల అనుగ్రహంవల్ల లోభకారణమైన రజస్సు, అజ్ఞాన హేతువైన తమస్సు అంతరించాయి. ఆ మహానుభావుల చాతుర్మాస్యవ్రతం కూడ పూర్తి అయింది. వారు ఆ ప్రదేశం విడిచి మరోప్రదేశానికి వెళ్లడానికి ఉద్యుక్తులయ్యారు.
బాల్యానికి సహజమైన చపలత్వాన్ని వీడి, భక్తితో ఆ పెద్దలకు పరిచర్యలు చేయగా, వారు సంతృప్తిచెంది, వాత్సల్యంతో, దయతో, అరకొరలు లేకుండ అమోఘం, అతిరహస్యమైన బ్రహ్మవిజ్ఞానాన్ని నాకు ఉపదేశించారు.
నేను కూడా ఆ మహాత్ముల దివ్యోపదేశంవల్ల దేవదేవుడైన వాసుదేవుని మాయాప్రభావాన్ని తెలుసుకొన్నాను. మానవులు ఆచరించే కర్మలు మంచివయితే సత్ఫలితాలను, చెడువయితే దుష్ఫలితాలను అందజేస్తాయి. అవే ఆధ్యాత్మికం, ఆధిదైవికం, ఆధిభౌతికం అనే తాపత్రయాలకు మూలకారణాలు అవుతాయి. జీవులు ఆ కర్మఫలితాలను ఈశ్వర సమర్పణం చేస్తే ఈ మూడురకాల తాపాలు రూపుమాపే పరమౌషధం అవుతుంది. అంటే ఫలేచ్చతో చేసే యజ్ఞాదికర్మలు జన్మకారకాలు అవుతున్నాయి. ఫలకాంక్ష వదలి చేస్తే సమస్త కర్మలు ఈశ్వర సమర్పణంగా కావిస్తే సంసార మోక్షానికి కారణమవుతున్నాయని దీని భావం.
ఈ లోకంలో ఏ పదార్థం తినడంవల్ల ఏ రోగం పుడుతుందో, ఆ పదార్థం మితిమీరి భక్షించడంవల్ల ఆ జబ్బు వృద్ధి పొందుతుందే కాని రూపుమాసిపోదు. కాని అదే పదార్ధాన్ని వేరే పదార్ధంతో కలిపినప్పుడు చికిత్స జరిగి అది ఔషధంగా మారి, తినేవాని రోగం పోగొడుతుంది. ఆ విధంగా సంసారాన్ని ఏర్పరచే కర్మ ఈశ్వరార్పణ బుద్ధితో మిళితమై సంసార నివృత్తి చెసుకోవడానికి కారణమై తన అస్తిత్వాన్ని కోల్పోతుంది.
భగవంతునియందు ఫలసమర్పణచేసే సమస్త కర్మ జ్ఞానప్రాప్తికి కారణ మవుతుంది. ఈశ్వరునకు ఆనందాన్ని కలుగజేస్తుంది. అనన్య నిష్కళంక భక్తియోగాన్ని అనుగ్రహిస్తుంది.
ఈశ్వరాను గ్రహంవల్ల కర్మలాచరించేవారు శ్రీమహావిష్టు గుణనామవర్ణన స్మరణం కావిస్తారు. “ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం అనిరుద్దాయ నమః అని భగవంతుని చతుర్వ్యూహాలకు సంబంధించిన మంత్రాలు నాలుగింటిని మహాభక్తితో పురశ్చరణ చేస్తూ వందనం సమర్పిస్తారు. మంత్రాలే స్వరూపంగా గల్గిన భగవంతుని, భక్తులను అనుగ్రహించడానికి మూర్తిమంతుడైనా, వాస్తవానికి మూర్తరూపంలేని భగవంతుని, “యజ్ఞోవైవిష్ణుః" కావున యజ్ఞస్వరూపుడైన భగవంతుని ఆరాధించి పురుషుడు సమ్యగ్దర్శనం కలిగి ఆత్మజ్ఞాని అవుతాడు.
వ్యాసమునీంద్రా! నేను ఉపాసించిన భక్తియోగానికి నారాయణుడు సంతసించి నాకు తన స్వరూప జ్ఞానాన్ని అనుగ్రహించాడు. నా అనుష్ఠానవిధానం ఆ భగవంతునకు తెలుసు. నీవుకూడా ఆ మార్గంలో శ్రీ మహావిష్ణువును ఉపాసించు.
నీవు మహర్షి మండలిలో అగ్రగణ్యుడవు. గొప్పజ్ఞానం కలవాడవు. నీవు నారాయణ సంకీర్తన ప్రతిదినం కావిస్తూ ఉంటే, వినే సమస్త మానవుల (జీవుల) దుఃఖాలన్నీ పటాపంచలైపోతాయి.
ఈ విధంగా నారదుడు దాసీపుత్రుడుగా జన్మించడం, ఆ జన్మలో ఆతడొనర్చిన సమస్తకార్యాలూ విని, వ్యాసమహర్షి ఇలా అన్నాడు.
నారదమునీంద్రా! నీవా బాలుడవన్నావు. దాసీపుత్రుడవన్నావు. ఆ యతిపుంగవులు నీకు చిన్నతనంలోనే బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించి వెల్లిపోయారన్నావు. ఆ తరువాత నీ వెంతకాలం జీవించావు? నీ బాల్యం ఎలా గడిచింది? ముసలితనంలో ఏ రీతిగా సంచరించావు? ఎవరికైనా పూర్వజన్మస్మృతి కలగడమే కష్టం. కాని నీకు పూర్వకల్ప స్మరణం కలిగింది. అది నీకు ఏ విధంగా స్ఫురించింది? దాసీపుత్రుడవైన నీవు ఏ విధంగా శరీరాన్ని వదలిపెట్టావు. ఆ వృత్తాంతాన్ని అంతా వివరించు.
వ్యాసుడు ఈ విధంగా ప్రశ్నించగా, నారదుడు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఒక దాసీతనూజుడనైన నేను ఆ యతీంద్రులవల్ల ఈశ్వరజ్ఞానాన్ని పొందియుండగా ఇలా జరిగింది.
నా తల్లి తన పనికి మాత్రమే అంకితమైన ఉత్తమవ్యక్తి మమ్ము పోషించేవారి ఇండ్లలోని పనులన్నీ ఒకదాని తరువాత ఒకటి వరుసగా చేసుకొనిపోయేది. తన దాస్యాన్ని గూర్చికాని, తన పరాధీనతను గూర్చికాని ఆమె కించిత్తూ కించపడేది కాదు. నేనంటే నా తల్లికి పంచప్రాణాలు. నేనుకూడా ఆ యజమానులకు అటూ ఇటూ సేవచేస్తూ అలసిపోయానని, సొలసిపోయానని, ఆకలిని పొందానని వాపోయేది. ఉదయం, సాయంకాలం పుత్రప్రేమతో నన్ను ముద్దాడేది. జుట్టు దువ్వేది. మేను నిమిరేది. ఆప్యాయతతో అక్కున చేర్చుకొనేది. ఇట్లు నన్ను ఆదరంతో పెంచుతూ ఉండగా, చేసేది దాస్యమనే విషయం విస్మరించి, ఆమెను విడిచిపోలేక ఇంట్లోనే ఉండిపోయాను. ఆ తల్లి అనురాగంలో నేను సంసారవ్యామోహంలో మాత్రం చిక్కుకోలేదు. కలిగిన ఆత్మజ్ఞానాన్ని విస్మరించలేదు. వేరే ధ్యాసలేక, ఎవరితోను మాట్లాడక, నా తల్లి దగ్గరే కొద్దిరోజులు కాలం గడిపాను. అప్పటికి నాకు ఐదేండ్ల వయస్సు మాత్రమే.
వ్యాసమునీంద్రా! ఒకనాడు నా తల్లి ఇంటినుండి బయలుదేరింది. రాత్రి సమయం. కటిక చీకటి. అలవాటుపడిన మార్గం కాబట్టి దారి తప్పకుండాపోయి ఆవును పాలు పిండబోయింది. దారిలో ఆమె ఒక పామును తొక్కింది. ఆ సర్పం నా తల్లి కాలిమీద కాటు వేసింది.
ఆ సర్పం కాలనాగం. అది చాలా పొడవైనది. దాని పడగకూడ చాలా పెద్దది. దాని ముఖంనుంచి విషాగ్ని జ్వాలామాలికలు వెలువడ్డాయి. ఆ విషంచే దహింపబడి నా తల్లి నేల వ్రాలిపోయింది.
మా అమ్మ నేలపై వ్రాలిపోయి విలవిల తన్నుకొంటూ, బుద్ధి వశం తప్పిపోగా ప్రాణాలు విడిచింది. అప్పుడు నేను ఏమాత్రం కలవరం చెందలేదు. నాతల్లి ప్రాణం పోవటాన్ని కళ్లారా చూచినా నేను వికారాన్ని పొందలేదు. మాతృప్రేమతో వ్యామోహంతో చింతించలేదు. నాకు బంధం తెగిపోయిందని, చాల మేలు జరిగిందని భావించి విష్ణు పాదసేవ చేసుకోవాలని నిర్ణయించుకొన్నాను.
నేను ప్రశస్తమైనదిగా భావించి ఉత్తరదిక్కుగా బయలుదేరాను. విశాలదేశాలు, నగరాలు, పట్టణాలు, గ్రామాలు, పల్లెలు, వ్రేపల్లెలు బోయగూడెములు, భిల్లవాటికలు క్రమంగా దాటిపోయాను. వనాలు, ఉపవనాలు, గైరికాదిధాతు చిత్రితాలైన పర్వతాలు, మదించిన ఏనుగులచే విరుగగొట్టబడిన వృక్షాలు, బాటసారుల మార్గాయాసాన్ని తొలగించే తటాకాలు, బహువిధాలైన పక్షుల కలకల ధ్వనులతో మనోహరాలై, వికసించిన తామరపూలలోని మకరందాన్ని త్రాగి మత్తెక్కి పరిభ్రమించే తుమ్మెదలతో నిండిన సరోవరాలు అతిక్రమించాను. ఆకలి, దప్పిక నాకు ఎక్కువ అయ్యాయి. ఒక నది మడుగులో స్నానంచేసి, శుచినై, నీరుత్రాగి శ్రమను పోగొట్టుకొన్నాను.
ఒక అరణ్యం యొక్క నడిమిభాగంలో కాలుపెట్టాను. ఎటుచూచినా తోడేళ్లు, కోతులు, ఎలుగులు, అడవిపందులు, ఏనుగులు, అడవిదున్నలు, ఏదుపందులు, గుడ్లగూబలు, శరభమృగాలు, పెద్దపులులు, కుందేళ్లు, గవయమృగాలు, ఖడ్గమృగాలు, క్రూరసర్పాలు, కొండచిలువలు మున్నగునవే దర్శనమిచ్చాయి.
ఏ పక్కచూచినా దాటశక్యంకాని గడ్డి తుప్పలతో కూడుకొన్న వెదురుడొంకలు, హోరుగాలితో కూడుకొన్న వెదురువనాలు, పెద్ద పెద్ద తుప్పులు, అల్లుకుపోయిన తీగలు, పెద్ద పెద్ద గుహలు కనిపించాయి. ఒక గుహదగ్గర రావిచెట్టు మూలంలో కూర్చున్నాను. ఆ పరమహంస పరివ్రాజకులు నాకు ఉపదేశించిన భగవత్తత్వాన్ని మననం చేసుకొన్నాను. హృదయమధ్యంలో ఉన్న అంతర్యామి స్వరూపుడైన విష్ణువును ధ్యానం చేశాను.
నా నేత్రాలలో ఆనందబాష్పాలు పొంగిపొర్లాయి. నా శరీరంలో రోమాలు పులకించగా గగుర్పాటు ఏర్పడింది. ఆ సర్వేశ్వరుడే నా గుండెలలో పూర్తిగా నిండిపోయాడు. తదేకధ్యానంతో మునిగిపోయిన నాకు ఆ పరమాత్మ సాక్షాత్కరించినట్లు తోచింది. నేను ఆనందసాగరంలో మునిగి తబ్బిబ్బులయ్యాను. ఆ సమయంలో నేను ఏమిటో నాకు తోచలేదు. హృదయస్థితుడైన పరమాత్మ కూడ కాన్పించలేదు. ఆ స్వరూపం మాయమైపోయింది. అనేక దుఃఖాలను పటాపంచలు చేసే ఆ విష్ణుస్వరూపం కనుమరగైపోయింది. నాకు ఇక దిక్కుతోచలేదు.
హఠాత్తుగా ధ్యానావస్థ నుండి లేచి నిలబడ్డాను. మళ్లీ ఆ దేవదేవుని హృదయంలో దర్శించాలనే ఉత్కంఠతో మళ్లీ ప్రయత్నం చేశాను. గుండెలలో ఆ రూపాన్ని నింపుకొన్నాను. నా యత్నం సిద్ధించలేదు. దుఃఖమే మిగిలింది. చూచికూడా దర్శనం పొందలేకపోయాను. జనసంచారంలేని ఆ అడవిలో పిచ్చిపట్టినవానివలె తిరిగాను. నా పరిస్థితిని శ్రీహరి గమనించాడు. వాక్కులకు గోచరుడు కాని ఆ నారాయణుడు గంభీర మధుర వాక్యాలతో నా దుఃఖాన్ని ఉపశమింపజేస్తూ ఇట్లు పలికాడు.
నాయనా! శరీరాన్ని ఏల శుష్కింపజేసుకొంటావు? వృథాగా మనస్సులో ఏల ఆయాసపడతావు? నీవు ఎంత ప్రయత్నించినా ఈ జన్మలో నా భగవత్స్వరూపాన్ని దర్శించలేవు. కామం మున్నగు అరిషడ్వర్గాన్ని పూర్తిగా జయించి, ప్రారబ్ధకర్మ సంపూర్ణంగా నశింపజేసుకొన్న, మునిముఖ్యులే నన్ను దర్శించగలరు. కాని జితేంద్రియులు కాని యోగులు నన్ను సాక్షాత్కరింపజేసుకోలేరు. నీ మనస్సులోని ఆకాంక్ష కొనసాగుటకై క్షణకాలం నా సగుణరూపన్ని నీకు స్ఫురింపజేశాను.
నన్ను ఉద్ధేశించి కల్గిన అభిలాష వ్యర్థంకాదు. అది సమస్త దోషాలను నాశనం చేస్తుంది. నన్ను సేవించడంవల్ల భక్తి శీఘ్రంగా నీ మనస్సులో పదిల మవుతుంది. స్పష్టంగా విన్నావు కదా!
కుమారా! నాయందు లగ్నమైన నీ బుద్ది జన్మాంతరాలలో కూడా వదలిపోయేది కాదు. నీవీ శరీరం విడిచి మరుసటి జన్మలో నా ఆజ్ఞపై నా భక్తునిగా జన్మిస్తావు.
ఈ మొత్తం సృష్టి నశించి, వేయి మహాయుగాలైన కాలము బ్రహ్మదేవునికి ఒక రాత్రి అయి గడిచిపోతుంది. ఆ రాత్రి కాలం గడిచిపోయిన తరువాత మళ్ళీ సృష్టి మొదలౌతుంది. ఆ సమయాన దోషాలు తొలగి, పూర్వజన్మ జ్ఞానంతో పుట్టి, నా దయతో శుద్ధసాత్వికులలో గణింపదగినవాడవై గొప్పతనాన్ని పొందుతావు.
ఆకాశమే ఆకారంగా, ఋగ్వేదాదులే నిశ్శ్వాసాలుగా ప్రకాశించి, విశ్వమంతటిని నియంత్రించే విష్ణువుయొక్క మహాతేజం - ఈ మాటలు పలికి ఊరకుండగా, నేను ఆ దివ్యతేజస్సుకు శిరస్సువంచి నమస్కరించాను. ఆయన కారుణ్యానికి మిక్కిలి సంతసించాను. కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలను పారద్రోలాను. సిగ్గు వదలివేశాను. ఆ అనంతుని అనేక నామాలను పురశ్చరణ చేశాను. పరమకల్యాణదాయకాలైన హరిగాథావిశేషాలను స్మరించాను. నిత్యసంతుష్టుడనై కాలం గడిపాను. ఆ పరమాత్మను బుద్ధిలో సుప్రతిష్టితం చేసుకొన్నాను. చిత్తవృత్తులను శమింపజేశాను. విషయవాసనలపట్ల వైరాగ్యం అవలంబించాను. కాలంకోసమై ఎదురుచూడసాగాను. ప్రపంచమంతా సంచరించాను. ఇంతలో ఆ శుభసమయం ఆసన్నమయింది. ఒక్కసారి మెరుపు మెరిసినట్లయింది. హఠాత్తుగా మృత్యుదేవత ఎదురైంది. పంచభూతాత్మకమైన, ప్రారబ్ధకర్మానుభవరూపమైన ఆ దేహాన్ని విడిచిపెట్టాను. సత్వగుణాత్మకమైన భాగవతదేహంలో ప్రవేశించాను. అటుపిమ్మట ఏర్పడిన దైనందిన ప్రళయంలో త్రిలోకాలు ఏకార్ణవమైన స్థితిలో శ్రీమన్నారాయణుడు జలరాశి మధ్యంలో శయనించియున్న సమయంలో, నిద్రకు ఉపక్రమించే బ్రహ్మదేవుని ఊర్పులతోపాటు ఆయన ఉదరంలో ప్రవేశించాను. అలా వేయి మహాయుగాలు గడచిపోయాయి. పరమాత్మ అనుమతితో చతుర్ముఖ బ్రహ్మపునఃసృష్టి ప్రారంభించాడు. బ్రహ్మ నిశ్వాసంలోనుంచి, ప్రాణాలలో నుంచి, ఇంద్రియాలలోనుంచి మరీచ్యాది మహర్షులు, నేనూ జన్మించాము. వారిలో నేను అస్ఖలిత బ్రహ్మచారినై సంచరించాను. త్రికాలలోను లోపలా, బయటా పరమేశ్వరుని అనుగ్రహంవల్ల విహరిస్తున్నాను. ఈశ్వరదత్తమైన దేవదత్తమనే నామాంతరంగల “మహతి” అనే వీణపై పరబ్రహ్మను అభివ్యక్తంచేసే సప్తస్వరాలు తమంతట తాము మోగుతూ ఉండగా, హరికథాగానాన్ని అనుసంధానం చేస్తూ ఇలా లోకసంచారం చేస్తున్నాను.
వ్యాసమునీంద్రా! పరమపవిత్రాలైన పుణ్యతీర్థాలు పాదాలందు గల దేవుడు శ్రీ మహావిష్ణువు. ఆయనయందు మనస్సు లగ్నంచేసి ఆయన లీలలను గానం చేస్తూ ఉండగా, పిలిచినట్లుగా వచ్చి ఆ పరమపురుషుడు నా గుండెలలో నిండిపోయేవాడు.
మహర్షీ! ఈ సంసారమనే సముద్రంలో మునిగితేలుతూ, విషయవాంఛలతో కర్మలు ఆచరిస్తూ మనోవేదన అనుభవించేవాడికి గోవిందనామ సంకీర్తనం, దాన్ని తరించడానికి ఉపయోగపడే తెప్పవంటిది సుమా!
మునిగణాభరణుడవైన ద్వైపాయనా! కొందరు మనస్సును నియంత్రించడానికి యమం, నియమం మున్నగు యోగసాధనలు కావిస్తారు. కాని అది నిరోధింపబడ్డట్లు కనబడుతుందే కాని కామం, క్రోధం మున్నగు వాటిచేత పునః ప్రేరేపింపబడి సాధన వ్యర్థమైపోతుంది. ఒక్క నారాయణ సేవద్వారా మాత్రమే ఇంద్రియాలు క్రమంగా శాంతి వహించి, చిత్తానికి ఉపశమనం చేకూరుతుంది. నీవు వివరింపుమని కోరగా నా జన్మరహస్యం, కర్మరహస్యం అంతా తెలియజేశాను.
అనీ ఈ విధంగా నారదుడు వ్యాసునకు చెప్పవలసిందంతా చెప్పి వీడ్కోలు తీసుకొని వీణ వాయించుకొంటూ తనదారిని తాను వెళ్లిపోయాడు. అనంతరం సూతుడు శౌనకాదులతో ఇలా అన్నాడు.
నిరంతరం తన మహతీవీణపై స్వరరాగాలను పలికిస్తాడు. ఆ నాదానుకూలంగా హరిక్తీర్తనలు ఆలపిస్తాడు. ముజ్జగాలకు వీనులవిందు కావిస్తాడు. సమస్త పాపాలు తొలగిస్తాడు. అటువంటి మేటి భక్తుడు మరెందైనా ఉన్నాడా? ఆ నారదమహర్షికి సాటి మరెవ్వరూ లేరు.
సూతమహర్షి నారదుని హరికథాగానాన్ని ప్రశంసించాడు. ఆ మహర్షి చెప్పిన మాటలను శౌనకుడు ఆలకించి ఆయనను ఒక ప్రశ్న వేశాడు. నారదుని పుట్టుపూర్వోత్తరాలు, ఆయన ఉపదేశాలు విన్న వ్యాసుడు ఆ తరువాత ఏం చేశాడని అడిగాడు. దానికి సూతుడు ఇలా సమాధానం చెబుతున్నాడు. నదులలోకెల్ల సరస్వతీనది పరమపవిత్రమైనది. అది బ్రహ్మదేవతాకమైన నది. ఆ కారణంచే యజ్ఞాదులకు, జపతపాలకు ఆలవాలమై బ్రహ్మవేత్తలకు కూడ నిరంతర స్నానయోగ్యమైనది అయింది. ఆ నదికి పడమటితీరంలో “శమ్యాప్రాసం” అనే ప్రసిద్ధమైన ఋష్యాశ్రమం ఒకటి ఉంది. అది విష్ణువుచే రక్షించబడి ఉంటుంది. ఆ కారణంవల్ల సదాచార సంపన్నులైన మునీశ్వరులకు అది నిలయంగా భాసిస్తుంది. అది పెక్కు రేగుచెట్లచే అలంకరించబడి దర్శనీయమై ప్రకాశిస్తుంది. అట్టి పవిత్ర ప్రదేశంలో ఆ నదీజలాలను ఆచమించి, వ్యాసుడు సుఖాసనంలో కూర్చున్నాడు. మనస్సును పదిలపరచుకొన్నాడు. తదేకనిష్ఠతో ధ్యానం కావించాడు. చిత్తంలో అంతర్యామి రూపంలోనున్న పరమాత్మను దర్శించాడు. ఆ పరాత్పరుని అధీనంలో మాయ ఉన్నట్లుగా గ్రహించాడు. కాని జీవుడు మాత్రం ఆ మాయయొక్క అధీనంలో ఉన్నట్లుగా గుర్తించాడు. జీవుడు మాయాసంబంధం కలిగి ఇంద్రియాలతో సంబంధం పెట్టుకొంటున్నాడని తెలుసుకొన్నాడు. త్రిగుణాలకు అతీతుడైన జీవుడు మాయాప్రభావంచే త్రిగుణాభిమానం కలవాడవుతున్నాడని, ఆ అభిమానం వల్లనే “నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను” అనే కర్తృత్వభోక్తృత్వ రూపమైన అహంకారాన్ని పొందుతున్నాడని నిర్ణయించాడు. ఆ అనర్ధం ఉపశమించాలంటే “హరిభక్తి” అనే యోగం తప్ప మరొక్కటి ఏదీ లేదని నిశ్చయించాడు.
ఈ భూమండలంలో ఏ మానవుడు ఏ గ్రంథంలోని విషయాన్ని శ్రవణం చేసినంతమాత్రంచేతనే శ్రీమహావిష్ణువు పై అచంచలమైన భక్తి కలిగి జన్మబంధాలు తొలగిపోతాయో, అట్టి సమస్తలోక కల్యాణప్రదమైన “భాగవతం” అనే మహాగ్రంథాన్ని వ్యాసమహర్షి ఎంతో నేర్పుతో రచించాడు.
వ్యాసుడు ఆ విధంగా భాగవతం వ్రాసి ముముక్షువైన శుకునిచే చదివించాడని సూతుడు చెప్పగా, శౌనకుడు ఇలా అన్నాడు. శుకపరబ్రహ్మం కేవలం స్వస్వరూప జ్ఞానంకలవాడు కదా! విశ్వంలోని సమస్త విషయాలపట్ల ఉపేక్షాభావం వహించేవాడు కదా! అట్టివాడు భాగవత గ్రంథాధ్యయనం మాత్రం ఎలా చేశాడు? చాలా ఆశ్చర్యంగా ఉందయ్యా! అని ప్రశ్నించగా సూతమహర్షి ఇలా సమాధానమిచ్చాడు.
పవిత్ర చరిత్రా! భగవంతునియందే తప్ప మరే విషయంలోను ఆసక్తిలేనివారు, ప్రాపంచిక విషయాలయందు అనురక్తిలేనివారు, ఆత్మయందే రమించేవారు అయిన యోగీంద్రులు నిర్వ్యాజమైన భక్తితో హరి సంకీర్తనం చేస్తూ ఉంటారు. శ్రీమన్నారాయణుడు అట్టి యోగ్యత కలవాడు.
శుకయోగి శ్రీహరి దివ్యనామాలను, గుణాలను గానం చేయుటయందు ఆసక్తి కలవాడు. ఆయనయందే ఏకాగ్రమైన చిత్తం కలవాడు. ఆయన భాగవతసంహితను మూడులోకాలకు శుభదాయకమయినదిగా భావించాడు. శుభం కలగాలనే, దాన్ని అధ్యయనం చేశాడు.
శౌనకమునిపండితా! వేలకొలదిగానున్న వేదశాఖలనన్నింటిని అధ్యయనం చేసినా ముక్తిసంపద సులభంగా లభించేది కాదు. కాని భాగవతసంహితను అభ్యసిస్తే కైవల్యం సులభంగా లభిస్తుంది.
No comments:
Post a Comment