ధర్మస్వరూపుడైన విదురుడు కాలతత్త్వాన్ని తెలిసినవాడై ధృతరాష్ట్రుని సమీపించి ఈ విధంగా ప్రబోధం చేశాడు.
ధృతరాష్ట్ర మహారాజా! ప్రపంచంలోని ప్రాణులైన ఈ మానవులు, బంగారం, భవనాలు, పుత్ర మిత్ర కళత్ర పరివారాన్ని నిరంతరం తమ యెదుట చూస్తూనే ప్రాణాలపై తీపితో ఉన్నారు. వారిని కాలం తప్పక హరించి తీరుతుంది. ఈ కాలాన్ని ఎదిరించే శక్తి ఎవ్వరికీ లేదు. దాన్ని నివారించే దారిలేదు. ఏ ఉపాయాలు కూడా అక్కడ పనిచేయవు. అటువంటి కాలం ఇప్పుడు నీ సమీపానికి వచ్చి నీ కొరకు ఎదురుచూస్తున్నది. దీనికి ప్రతిక్రియ ఆలోచించు.
ఓ కురుకులశ్రేష్టా! నీవు పుట్టుకతోనే గ్రుడ్డివాడవు. వయస్సు దాటిపోయినవాడవు. అనుభవింపదగిన మహాభోగాలా అంతరించినవి. నీ అధికారం, మాట చెల్లుబడి, పట్టుదల, దేహపటుత్వం ఒక్కటేమి అన్నింటిలోనూ నీ పట్టు నశించింది. మోయరాని బరువుగా ముసలితనం పైనపడింది. నీ బంధువులందరూ గతించినారు. ఇప్పుడు భార్యాభర్తలు మీరిరువురు కడగండ్ల కడలిలో గట్టెక్కలేక మునిగి తేలుతున్నారు. అయ్యయ్యో! ఎంత కష్టం. ఇట్టి సమయంలో పగవారి పంచలో పడి జీవించటం ఏమి న్యాయం?
మీరు పాండవుల యింటికి చిచ్చుపెట్టినారు. వారి ఇల్లాలిని నిండు కొలువులో చెరబట్టినారు. వారిని అన్యాయంగా అడవులకు వెడలగొట్టినారు. అప్పుడు అన్ని తప్పు పనులు చేసి ఇప్పుడు వారి అండజేరి, వారు పెట్టిన తిండి తిని ప్రాణాలు నిలుపుకోవలెనా?
రాజా! "ఆనాడు తన బిడ్డలకు బుద్ది చెప్పలేని ఈ గుడ్డివాడు సిగ్గులేకుండ మా ఇంటిమీద పడ్డాడు. వీనికింత పిండం వండి పెట్టండి" అని భీముడు మనస్సు నొప్పించే మాటలు పలుకగా విని కూడా ఆ దిక్కుమాలిన తిండి తినక తప్పదా? ఎందుకా బ్రతుకు?
ఈ జన్మలో ఇకమీద నీకన్న కొడుకులను చూడగలవా? పూర్వంకంటె గొప్పగా ఎక్కువకాలం జీవిస్తావా? మనుమల ముద్దుపలుకులు వినగలవా? బ్రాహ్మణులను పిలిచి దానాలిస్తానని అనగలవా?
ఈ దేహం శాశ్వతం కాదన్న సత్యాన్ని తెలిసికొని, దీనిపై గల భ్రాంతిని వ్యామోహాన్ని పూర్తిగా త్రెంచివేసి ఎంతో సంతోషంతో ఏ మానవుడు సిద్దులు, మునులవలె వర్తిస్తాడో అతడు తప్పక మోక్షలక్ష్మిని తన వశం చేసికొని తీరుతాడు.
ఈ విధంగా విదురుడు ధృతరాష్ట్రునికి వైరాగ్యానికి దారిని ఉపదేశించినాడు. ఆ ప్రబోధంతో ధృతరాష్టుడు జ్ఞాననేత్రుడు అయినాడు. వెంటనే సంసారం వీడినాడు. అంతటితో అతని మోహపాశాలు తెగిపోయినవి. అజ్ఞానం పోయి విజ్ఞానం వికసించింది. ఇక తన నివాసం ఇది కాదని గమనించటానికి వీలుకాని హిమవత్పర్వతంవైపు ప్రయాణం సాగించినాడు.
గ్రుడ్దివాడైన భర్తను ప్రేమించి పతి చూడలేని ప్రపంచాన్ని తాను కూడా చూడరాదని భర్త అనుభూతినే పొందగోరి, కన్నులకు గంత కట్టుకొని, ఎంతో నియమంతో సమస్త ప్రజల మెప్పును పొందిన గాంధార దేశపు మహారాజు గారాబు కూతురు గాంధారి. సాధ్వీమతల్లియైన ఆ ఇల్లాలు కలిసియుండుటంలో అభిలాషగల చిత్తంతో భర్తవెంట బయలుదేరింది.
అప్పుడా గాంధారి వెనుతిరుగక ముందుకేగే యుద్ధవీరునివలె, రాజదండనకు జడియక చకచక ముందుకు సాగే ధీరునివలె, తిరుగులేని నిర్భీతితో తరిగిపోని మహాప్రీతితో తన భర్త వెంబడి, హిమవంతం ప్రాంతంలోని దుర్గమారణ్య మధ్య ప్రదేశాలకు వెళ్లింది.
ఈ విధంగా విదురునితో కూడి గాంధారీ ధృతరాష్ట్రులు అడవికి వెళ్లినారు. మరుసటిదినం ఉదయాన ధర్మజుడు, సంధ్యావందనం నిర్వర్తించి ఉత్తములైన బ్రాహ్మణులకు గోవులు, బంగారం, నువ్వులు, వస్త్రాలు మొదలైన దానాలు ఇచ్చి నమస్కారాలుచేసి, పెద్దలైన తల్లిదండ్రులకు నమస్కరించటానికై యథావిధి పెదతండ్రి ఇంటికి పోయినాడు. అక్కడ విదురుడు, గాంధారీ ధృతరాష్ట్రులు కనిపించలేదు. సంజయుడు మాత్రమే ఒక చక్కని పీఠంపై సుఖాసీనుడై ఉన్నాడు. అప్పు డతనితో ధర్మరాజు ఇట్లన్నాడు.
సంజయా! మా తల్లిదండ్రులు ఈ భవనంలో కన్పించటం లేదు. వారిప్పుడు ఎటుపోయినారో తెలియదు. మా తండ్రి కంటిచూపులేని మూడుకాళ్ల ముసలి. ఇక మా తల్లి పుత్రశోకంతో కన్నీరు మున్నీరుగా పొగిలిపోతుంటుంది. మా పినతండ్రిగారు విదురుడు మందబుద్ధులమైన మమ్ము వదలి వెళ్లినాడు. ఆయన ప్రాణసమానుడైన మిత్రుడు. సౌజన్యమూర్తి ఈ ముగ్గురు మమ్మిక్కడ వదలి ఎచ్చటికిపోయిరో తెలియుట లేదు. మా పెదతండ్రి తాను చేసిన తప్పులను తలచుకొంటూ, పశ్చాత్తాపంతో భార్యతోగూడ గంగలో దూకినాడేమో అని అనుమానంగా ఉన్నది. నీకు తెలిస్తే చెప్పవలసింది. ఆయన చాలా అమాయకుడు, కపటం లేనివాడు. కరుణ కలవాడు. మా తండ్రి పాండు భూపాలుడు పరలోకగతుడు కాగా చిన్నపిలలమైన మమ్ము పెంచి పెద్ద చేసినాడు.
ధర్మజుని మాటలు విన్న సంజయుడు ఎంతో జాలి, ప్రేమ నిండిన గుండెతో తన ప్రభువు ఎక్కడికి వెళ్ళినాడో తెలియక మిక్కిలి దిగులుతో కొంతసేపు మౌనం వహించినాడు. ధృతరాష్ష్రుడు వెళ్లినందుకు కన్నీరు పొంగి పొరలిరాగా మెల్లగా తుడుచుకొనినాడు. ఎంతో బుద్ధిబలం కలవాడు కావటంవల్ల తన మనస్సును దిటవుపరచుకొని, ప్రభువు పాదాలనే మనస్సులో స్మరిస్తూ సంజయుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు.
రాజా! మీ పెదతండ్రిగారు ప్రతిదినం వార్తలేమిటి? అని నన్ను అడుగుతుండేవాడు. ఈ రాత్రి నన్ను అడుగలేదు. నిన్న విదురునితో మందిరంలో ఎంతో ప్రీతిగా సంభాషణలు సాగిస్తుండినాడు. కాని నేడు కంటికి కనిపించకుండా వెళ్లినాడు.
"విదురుడు, గాంధారి, ధృతరాష్ట్రుడు ఈ మువ్వురు నాకు చెప్పకుండ నా కన్నుగప్పి ఎక్కడకు వెళ్లిరో తెలియదు. వారు ఎట్టి నిర్ణయమునకు వచ్చి వెళ్లిపోయిరో తెలియుటలేదు" అని సంజయుడు దుఃఖించినాడు. ఇంతలోనే అదే సమయములో నారదుడు తుంబురునితో కలిసి అచ్చటకు వచ్చినాడు. అప్పుడు ధర్మరాజు తన తమ్ములు తాను లేచి వారికి నమస్మరించినారు. పిమ్మట అజాతశత్రువు బ్రహ్మమానసపుత్రుడైన నారదునిట్లు ప్రశ్నించాడు.
దేవర్షీ! నీవు సర్వజ్ఞుడవు. ముల్లోకాల్లో నీకు తెలియంది లేదు. ఆపద అనే సముద్రాన్ని దాటించటానికి నీవు నిజంగా కర్ణధారుడవు. మహాత్మా! మా తల్లిదండ్రులు ఇంటిలో కనిపించటంలేదు. ఇప్పుడు వారెక్కడికి వెళ్లినారో తెలియటం లేదు. ఎల్లప్పుడు తన బిడ్డలను పేరుపేరున తలచుకొని తల్లడిల్లే మా తల్లి ఇపుడెటుపోయిందో! ఏమయిందో అని ధర్మరాజు అన్నాడు.
ధర్మరాజు మాటలు విన్న సర్వజ్ఞుడైన నారదుడిలా చెప్పినాడు. ఈ జగత్తు మొత్తం ఈశ్వరుని అధీనం. ఆ పరమేశ్వరుడు ఒకదానితో ఒకటి కలిపి, మరల అంతలోనే విడదీస్తాడు. ముక్కులకు బెజ్జంవేసి తాడు దూర్చి దానిని, మెడలకు పలుపులు తగిలించిన ఎద్దులను కర్షకుడు తన స్వాధీనం చేసుకొన్నవిధంగా భగవంతుడు కర్తవ్యాలను అకర్తవ్యాలను తెలపడానికై సలక్షణమైన వేదవాక్యాలనే త్రాళ్లచే ప్రాణులను కట్టివేస్తున్నాడు. అందులో వర్ణధర్మాలు, ఆశ్రమధర్మాలు, వాటి లక్షణాలు, వాటికై వినియోగించే పేర్లచే బద్ధమైన ఈ లోకమంతా ఇంద్రాది దిక్పాలకులతో కూడ ఈశ్వరాధీనమై ఉన్నది. క్రీడాకారుడు తన ఇష్టం వచ్చినట్లుగా పాచికలు, బంతుల వంటి ఆటవస్తువులను కలిపి, అంతలోనే విడదీస్తాడు. ఇదేవిధంగా భగవంతుడు ప్రాణులను కలిపి, విడదీస్తాడు. సృష్టిలో సంయోగ వియోగాలన్నవి సహజం.
సమస్త ప్రాణికోటి జీవులుగా స్థిరాలు, దేహాలుగా అస్థిరాలు అంటే ఆత్మరూపంలో నిత్యం, శరీరరూపంలో అనిత్యం. కాని ఇవి నిజంగా స్థిరాలుగాని, అస్థిరాలుగాని కావు. పరిశుద్ధమైన పరబ్రహ్మం అనిర్వచనీయం. అది నిత్యానిత్యమై ఉంటుంది. కొండచిలువ పట్టుకొన్న మనుష్యుడు, మరో మనుష్యునికి సాయం చేయలేడు. అలాగే పంచభూతాల కలయికయైన దేహం కాలకర్మాధీనం. సంసారపంకనిర్మగ్నం. అది పరులను కాపాడలేదు.
చేతులున్న ప్రాణులకు చేతులు లేని నాలుగుకాళ్ల జంతువులు, కాళ్లుండి కదలగలిగే ప్రాణులకు కాళ్లులేని గడ్డిపోచ మొదలైనవి ఆహారమౌతున్నాయి. పెద్ద జంతువులైన పెద్దపులులు మొదలైనవి చిన్న జంతువులైన జింకలు మొదలైన వాటిని తింటున్నాయి. అన్ని దేహాలలోనూ జీవుడున్నాడు. ఒక దేహాన్ని మరో దేహం తింటున్నందువల్ల జీవికి జీవుడే జీవనాధారమై ఆహారమౌతున్నాడు. చేతులున్న ప్రాణులతో, చేతులు లేని ప్రాణులతో నిండిన ఈ విశ్వాన్నంతటినీ ఈశ్వర స్వరూపంగా తెలిసికో. ఆయనకంటె అన్యంలేదు. తెలిసినవాడికి అన్నీ భగవంతునిలోని భాగాలే. మహామాయావియైన ఈశ్వరుడు గారడీవానివలె తన మాయావిశేషంచేత అనేక రూపాలు ధరించి తానే భోక్తయై, భోజ్యమై వెలుపల, లోపల అంతట తానై విరాజిల్లుతున్నాడు.
కాబట్టి ఓ ధర్మరాజా! దీనులు, దిక్కులేనివారు, అనాథులు నన్ను వదలి వారు ఏమౌతారో, ఎలా జీవిస్తారో! ఎక్కడున్నారో ఏమో అనే విచారం విడిచిపెట్టు. అజ్ఞాన కారణంగా ఈ దేహాలపై మమకారం పెంచుకొని అనవసరంగా మనస్సును కలతపరచుకొని దుఃఖించవద్దు. ఈ మనోవ్యాకులతను పూర్తిగా తొలగించుకో.
అట్టి కాలస్వరూపుడు, సర్వాంతర్యామియైన విష్ణువు రాక్షసులను సంహరించటానికై అవతరించినాడు. దేవకార్యాలను నెరవేర్చినాడు. ఇప్పుడు మిగిలిన పనికై వేచియున్నాడు.
శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమి మీద ఉన్నంతకాలం మీరందరు ఉండండి. ఆయన తన అవతారం చాలించగానే అటుపైన మీరు ఉండవలసిన పనిలేదు. మహారాజా! భ్రాంతిని విడిచిపెట్టు. ఎంతవారయినా కాలాన్ని తప్పించుకోలేరు. నీకీ విచారం ఎందుకు? ఏమి జరిగిందో సమస్తం నీకిప్పుడు చెపుతాను. విను.
ధృతరాష్ట్రుడు విదురునితో తన భార్య గాంధారితో కలిసి హిమగిరికి దక్షిణ దిక్కున గల ఋషుల ఆశ్రమానికి వెళ్లినాడు. అచ్చట ఆకాశగంగయైన మందాకిని సప్తర్షుల సంప్రీతికై ఏడుపాయలుగా చీలిపోయి ప్రవహిస్తుండగా సప్తస్రోతస్సు అనే పుణ్యతీర్థంలో స్నానం ముప్పూటలా చేసి, అగ్నికార్యాన్ని యథావిధిగా నిర్వరిస్తూ నీటిని మాత్రమే త్రాగుతూ, పుత్రాదులపై ఆసక్తిని వీడినాడు. క్రమంగా ఆసన స్థితిని పొంది, ప్రాణాయామం చేయుచు, ఇంద్రియాలను, మనస్సును విషయాలపై ప్రవర్తింపనీయక, నివృత్తిచేసి, శ్రీహరిని ధ్యానిస్తూ సత్వరజస్తమోగుణాల మాలిన్యాలను పూర్తిగా నశింపజేసి గుణాతీతుడయినాడు.
యోగమార్గంలో ఇప్పుడు మనస్సును విజ్ఞానాత్మలోను, దాన్ని క్షేత్రజ్ఞునిలోను, ఆ ద్రష్టను ఘటాకాశమనే మహాకాశంలోవలె అంతటికి ఆధారమైన బ్రహ్మమందు విలీనం చేసి వాసనలు పూర్తిగా నశింపజేసినాడు. ఇంద్రియాలను, మనస్సును నిరోధించి, పూర్తిగా ఆహారాన్ని విడిచిపెట్టి, అంతరింద్రియ, బాహ్యేంద్రియ సంక్షోభం లేకుండా మాయను నిరోధించి మోడు (స్థాణువు) వలె పర్ణశాల వేదికపై నిశ్చలంగా ఉన్నాడు.
మహారాజా! మీ తండ్రి ధృతరాష్ట్రుడు నేటికి అయిదవనాడు యోగాగ్నిలో దేహత్యాగం చేయటానికి సంసిద్దుడై ఉన్నాడు. ఆ విధంగా యోగాగ్నిలో కాలిపోవటం చూచి మహాపతివ్రత అయిన గాంధారి ఇటు అటు అని తట పటాయించక, తన ప్రాణేశ్వరునితో ఆ అగ్నిజ్వాలలో పడి బూడిద కావటానికి నిర్ణయించుకొన్నది.
అప్పుడు అన్నవదినెలైన ఆ యిరువురి మరణాన్ని కన్నులార చూచిన విదురుడు ఆ వింత సన్నివేశానికి ఆశ్చర్యచకితుడై కొంతసేపు చింతాక్రాంతుడై, అటుపై సంతోషస్వాంతుడై తీర్థయాత్రలకు బయలుదేరనున్నాడు.
ఈ విధంగా విదుర గాంధారీ ధృతరాష్ట్రుల వృత్తాంతాన్ని సమస్తం సవిస్తరంగా వివరించిన నారదుడు తుంబురునితో కలిసి స్వర్గలోకానికి వెళ్లినాడు. అటుపైన అజాతశత్రువు తన తమ్ముని భీముణ్జి చూచి ఇలా అన్నాడు.

No comments:
Post a Comment