Wednesday, February 11, 2026

Parikshit Prepared For Prayopavesam - పరీక్షితుండు విప్రశాపం బెఱింగి ప్రాయోపవిష్టుండగుట

పరీక్షితుండు విప్రశాపం బెఱింగి ప్రాయోపవిష్టుండగుట

నేను వేటకై అడవికి ఎందుకుపోవాలి? ఆ మహాముని నిశ్చల ధ్యానంలో నిమగ్నుడై ఉన్నప్పుడు చచ్చినపామును తెచ్చి ఆయన మెడలో ఎందుకు వేశాను? ఈ విధమైన పాపాకార్యాలు ఎందుకు చేశాను? ఇది కలి ప్రభావమే. దైవసంకల్పాన్ని ఎవరూ దాటలేరు. ఇది తప్పదు. నేను చేసిన పాపానికి ఫలితం అనుభవించి తీరవలసిందే.

తక్షకుని విషాగ్ని జ్వాలలకు నా ప్రాణాలు పోయినా పోనిమ్ము. ఈ సామ్రాజ్యం, ఇందలి భోగభాగ్యాలు ఇప్పుడే నశించినా నశించనీ. మెరుపుతీగెవంటి బ్రతుకు శాశ్వతమని యెంచి, నివారించటానికి సాధ్యంకాని ఆ మునిసత్తముని పుత్రుని నేను ఏమని తిరిగి శపించగలను?

నేను మహారాజును గదా! అని అహంకారంతో వారి తపోవనాన్ని ప్రవేశించి తండ్రిపై చచ్చిన పామును పడవేయగా కొడుకు నన్ను చనిపోవునట్లు శపింపక ఊరక నోరు మూసికొని కూర్చుంటాడా? నిజానికి ఆ బాలుని తప్పు ఏమున్నది?

గోవులకు బ్రాహ్మణులకు, దేవతలకు కారణం లేకుండా దుస్సాహసంతో కీడు కలిగించే దుష్టబుద్ధిని ఏ విధంగా పుట్టకుండ నివారిస్తాను? అని తనలో తాను విశేషంగా తర్కించుకొన్నాడు.

శ్రీకృష్ణభగవానుని పాదపద్మములపై భక్తి ప్రపత్తులు గల పరీక్షిత్తు కామక్రోధాదులైన అంతశ్శత్రువులను జయించినవాడు కావటంవలన కరుణామయుడై తనను శపించిన శృంగిపై ఆగ్రహింపలేదు. శపించు శక్తి సామర్థ్యములుండియు పరమశాంతచిత్తుడు అయినాడు.

మునికుమారుడు శృంగి రాజును శపించిన వార్తను విని తక్షకుడు సమయానికై ఎదురుచూస్తున్నాడు. పరీక్షిత్తు తనకు ఏడవనాడు తక్షకుని దారుణవిషాగ్నిజ్వాలలవల్ల మరణం తప్పదని నిర్ణయించుకొనినాడు. భూలోకభోగాలు, స్వర్గలోకసౌఖ్యాలు పూర్తిగా విడువదగినవని భావించాడు. రాజ్యాన్ని పరిత్యజించినాడు. నిరాహారదీక్షను సాగించటానికి నిశ్చయించుకొన్నాడు.

తులసీదళాలతో విరాజిల్లే శ్రీమహావిష్ణుపాదపద్మాల పుప్పొడితో కలిసి మిక్కిలి ప్రకాశంతో ప్రవహిస్తూ దిక్పాలకులకు సకలసౌభాగ్యసంపదలు కలిగించి, సమస్తదోషాలను కడిగివేసే గంగానదీతీరంలో ప్రాయోపవేశంతో ప్రాణాలు విడవడానికి ప్రభువు సంకల్పించాడు.

ఆ రాజసత్తముడైన పరీక్షిత్తు తన చిత్తమును గోవిందుని పాదములందు నిలిపి, సర్వసంగ పరిత్యాగియై లోపల ఎట్టి వికారాలూ లేకుండా మౌనంతో ఉండినాడు.

ఈ విధంగా పాండవపౌత్రుడైన పరీక్షిత్తు హరిచరణారవిందములకు ప్రణమిల్లుతూ ఆనందాన్ని పొందిన హృదయపద్మం కలవాడై, విష్ణుపాదాలనుండి పుట్టిన గంగ గట్టున ప్రాయోపవిష్టుడై ఉన్నాడన్న సంగతి విన్నవారై, సకలలోక పవిత్రులై, మహోదార చరిత్రులై, తీర్థములకు తీర్ధత్వమును ప్రసాదించే సర్వసమర్దులైన, అత్రి, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, భృగువు, వసిష్టుడు, పరాశరుడు, చ్యవనుడు, భరద్వాజుడు, పరశురాముడు, దేవలుడు, పర్వతుడు, నారదుడు మొదలైన బ్రహ్మర్షులు, దేవ
ర్షులు, రాజర్షులు, అరుణుడు మొదలగు కాండర్షులు ఇంకను వివిధ గోత్రాలలో పుట్టిన మహర్షులు శిష్యులతో ప్రశిష్యులతో కలిసి అచ్చటికి విచ్చేసినారు. పరీక్షిన్నరేంద్రుడు ఆ విధంగా అక్కడికి వచ్చిన మునీంద్రులకు ఎదురేగి, అర్ఘ్యపాద్యాదులిచ్చి, అర్చించి, సాష్టాంగ నమస్మారాలు చేసి, సుఖాసీనులను గావించినాడు.

ఆ మహారాజు ఆనందబాష్పాలు పొంగిపారలగా, మరల ఆ మునీశ్వరులముందు చేతులు మోడ్చి ఈ విధంగా విన్నవించుకొన్నాడు.

దయానిధులైన తపోధనులారా! నేను ఓర్పును కోల్పోయి, కోపాన్ని ఆపుకోలేక చచ్చిన పామును తెచ్చి మునీంద్రుని మూపుపై వేసిన క్రూరచిత్తుణ్ణి, మదించినవాడను, మహాపాపిని మీరు పాపాలనే గడ్డిని దహించే అగ్నిహోత్రులు, ఉత్తములు, సంయమిసత్తములు. అయ్యలారా! నా పాపం పరిహారమయ్యే దారిని నిర్ణయించి చెప్పండి.

మహీసురులారా! మహనీయులైన మహర్షుల పాదధూళి లేశమైనను మహీపతుల పాపాలను పారద్రోలి పవిత్రులను చేస్తుంది. మీ పాదరేణువులు తగిలినంతనే నా పాపం పటాపంచలయింది. నేను కృతార్థుడ నయ్యాను. ఇప్పుడు నేనేమి చేస్తే వెంటనే నాకు ముక్తి లభిస్తుందో దయచేసి తెలపండి.

మిక్కిలి భయంకరమైన సంసారబంధంలో చిక్కుకొన్న చీకాకుతో, విసిగి వేసారి, త్వరగా శరీరం విడిచే దారి వెదకుతున్న నాకు తక్షకుని మహావిషం మోక్షహేతువైనది.

అతిశయించిన అహంకారపు నడవడితో సంసారంలో మునిగి ఉన్ననాకు నా పాలిటి భగవంతుడు బ్రాహ్మణ శాపం అనే మిషతో సంసారబంధ ముక్తిని ప్రసాదించినాడు.

తక్షక విషాగ్నికి నా దేహమును తప్పక అప్పగిస్తాను. ఇందులో సందేహంలేదు. ఈశ్వర సంకల్పం నేడు జరిగి తీరుతుంది. రాబోయే అనేక జన్మలలో శ్రీకృష్ణుని(హరి) చింతనయందు ఆసక్తి, శ్రీకృష్ణుని స్తోత్ర వాఙ్మయ శ్రవణాభిలాష, శ్రీకృష్ణచరణ కమలసేవకలిగి ఉండేట్లు మీరు అనుగ్రహించండి.

మీరు నా శ్రేయస్సును కాంక్షించండి. ఆ గోవిందుని మీది గీతాలు పాడండి. హరిభక్తుల చరిత్రలు వినిపించండి. ఏడుదినాలలో నాకు కైవల్యప్రాప్తి కలిగించండి.

అమ్మా! గంగమ్మా! నీ అలలు ఎంత అందంగా ఉన్నాయి తల్లీ! నిన్ను దర్శించిన వారిని దయతో దారి తెలిపి మోక్షానికి చేరుస్తావని విన్నాను. కదలిపైకి లేచి రావమ్మా! నీ రూపంతో ఎదురుగా వచ్చి సాక్షాత్కరింపవమ్మా!

ఆ విధంగా రాబోయే జన్మలలో తనకు భగవద్భక్తి సౌజన్యాలు ప్రాప్తించుగాక అని ప్రార్ధించినాడు. అప్పుడు తన తనయుడైన జనమేజయుని రప్పించి రాజ్యభారం అతనికి అప్పగించినాడు. గంగానదీ దక్షిణ తీరంలో తూర్పువైపు దర్భల కొనలు ఉండేట్లుగా ఆసనం వేయించి, దానిపై ఉత్తరాభిముఖంగా కూర్చున్నాడు. తన చిత్తాన్ని సంసారబంధాల నుంచి మరలించి పరమేశ్వరాయత్తం కావించినాడు. ఇలా భాగవతోత్తముడైన పాండవపౌత్త్రుడు ప్రాయోపవిష్టుడై ఉన్న సమయంలో.

దేవతలు ఆకాశంనుండి పూలవానలు కురిపించినారు. అంతేకాదు ఎంతో పొగడుతూ, గుణగణాలుగానం చేస్తూ, దుందుభులు మ్రోగించినారు.

ఆ సందర్భమున సభలో కూర్చున్న మహర్షులు ఆ రాజర్షితో ఇట్లు పలికినారు.

రాజశ్రేష్ఠ! నీ చరిత్ర చిత్రమైనది మీ పితామహులు మహాతపస్సంపన్నులు, వారు వాసుదేవుని నిత్య సాన్నిధ్యాన్ని వాంఛించి, నానా రాజకిరీట రత్నప్రభారాజితో రాజిల్లే రాజపీఠాన్ని విడిచి మహాత్యాగ విరాజితులైనారు. వారెంతో ఉన్నతులు అనుకొంటిమి కాని నిరంతర నారాయణ నామ పారాయణుడవైన నీవు వారికంటె మహోన్నతుడవు.

మహీపాలా! నీవు మనుష్యదేహాన్ని వదలి, శోకం, వ్యసనం, రజోగుణంలేని పుణ్యలోకాన్ని చేరేంతవరకు, మేము ఎక్కడికి పోము. నీ మాటలు వింటూ నీ దివ్యప్రభావాన్ని తిలకిస్తూ ఇక్కడనే ఉంటాము.

అని యిట్లు నిష్పక్షపాతంగా మహర్షులు పలికిన మధురగంభీరాలైన మంచిమాటలు విని, ముల్లోకములకు అవతల గల సత్యలోకంలో ఆకృతులు దాల్చి వెలుగు వేదములవలె విరాజిల్లు మహర్షులకు మహారాజు నమస్కరించి విష్ణుకథలు లీలలు వినే ఆసక్తితో ఇట్లు అన్నాడు.

తండ్రులారా! వేదవాక్యాలు బాగా పరిశీలించి ఏడు దినాలలో ఏ విధంగా ముక్తి పొందవచ్చునో తెలపండి. గురుతరమైన ఈ సంసార క్రీడనుండి ఎల్లా విడివడాలో ఆలోచించి ఆదుకొనండి.

(మా తండ్రులారా!) మీరు ఆర్యులు, ఆనందస్వరూపులు, బ్రహ్మజ్ఞానపారీణులు, ఆత్మ తేజోవిరాజిత విజ్ఞానులు, ఆత్మతత్త్వజ్ఞులు, దయార్ద్ర హృదయులు, మనస్సులో దాచబడిన సకలార్థ సమూహం కలవారు. మీరు తపశ్శక్తిచేత అన్నింటిని స్పష్టంగా చూడగలవారు. ఏడు దినాలలో మోక్షం ప్రాప్తించే ఉపాయాన్ని బాగా విచారణ చేసి నాకు తెలపండి.

అని పలుకుతున్న ఉత్తరానందనుని ప్రశ్నలకు సరియైన ప్రత్యుత్తర మివ్వడానికి మహ
ర్షులందరు సమాలోచనలు జరుపుతున్నారు. ఆ సందర్భంలో ధైవయోగం వలన

No comments:

Post a Comment

Sree Maha Bhagavathamu Part 2 - శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము శ్రీ మహా భాగవతము ద్వితీయ స్కంధము ప్రారంభము శుకుడు పరీక్షిత్తునకు ముక్తి మార్గంబుందెల్పుట