ఈ విధంగా సద్గుణాలచే అధికులైన శౌనకాది మహర్షులు ప్రశ్నించారు. అపుడు రోమహర్షణుని పుత్రుడు, ఉగ్రశ్రవనుడనే నామంతో విరాజిల్లేవాడు, పురాణాలను విశేషవ్యాఖ్యానంతో చెప్పే నేర్పుకలవాడు అయిన సూతమహర్షి
ఎవడు సర్వభూతాలయందు సమభావం కలవాడై, అన్ని కర్మలు వదలి సన్యాసియై ఒంటరిగా వెళ్ళుతుండగా, తండ్రియైన వ్యాసమహర్షి ప్రియమార ఓ కుమారా! అని పిలుస్తూ దగ్గరకురాగా, వృక్షాలన్నీ తన్మయత్వంతో ఓ కుమారా! ఓ కుమారా! అని ప్రతిధ్వనులు చేశాయో-ఆలాంటివానికి, సర్వభూతాలు తానైనవానికి, తపోధనులలో అగ్రగణ్యుడైనవానికి, విద్వాంసులలో శ్రేష్ఠుడైనవానికి, వ్యాసమహర్షి కుమారుడైన శుకమహర్షికి ముందుగా మొక్కుతున్నాను.
కార్యకారణాలకు అతీతంగా ప్రవర్తిల్లే ఆత్మతత్త్వమే అధ్యాత్మం. ఆలాంటి అధ్యాత్మాన్ని ప్రకాశింపచేసే దీపం, సకల వేదసారం, అద్వితీయం, అసాధారణం, మహాప్రభావ సంపన్నం అయిన పురాణమర్మాన్ని - సంసారమనే చీకట్లనుండి బయటపడాలనుకొనేవారికి ఏ మహాతపస్వి దయతో ఉపదేశించాడో, ఎవడు మహానుభావులచే స్తుతింపబడినాడో, ఎవడు నిర్మలమైన బ్రహ్మజ్ఞానంతో ప్రకాశిస్తున్నాడో, ఆలాంటి శుకమహర్షిని ప్రీతితో సేవిస్తున్నాను.
నరనారాయణులకు, వేదమాత సరస్వతికి, వ్యాసమునీంద్రునకు నమస్కరించి, సంసారాన్ని తరింపజేసే ఈ మహాగ్రంధాన్ని భాగవతాన్ని వచిస్తున్నాను.
అని సూతుడు ఈ విధంగా దేవతలకు, గురువులకు కైమోడ్పులర్పించి ఇలా అన్నాడు “శౌనకాది మహర్షులారా! మీరు నన్ను సమస్తలోకాలకు శ్రేయస్సును కలుగజేసే పరమార్థం తెలియజేయుమని ప్రశ్నించారు. దేనివల్ల కృష్ణకథావిషయకమైన ప్రశ్న అడగబడుతుంది? ఏ విధంగా అంతరాత్మ ప్రశాంతత పొందుతుంది? ఏ ఆటంకంలేని, ఏ ఫలాపేక్షలేని విష్ణుభక్తి ఏదోరూపంలో ఏ విధంగా చేకూరుతుంది? అటువంటి ఉత్తమభక్తియే సమస్త జీవులకు ఉత్కృష్టధర్మం అవుతుంది. వాసుదేవునిపై ప్రకటించే భక్తియోగమే వైరాగ్యాన్ని, ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తుంది. గోవిందుని గాథల ద్వారా ఏయే ధర్మాలు తెలియజేయబడతాయో, అవే ప్రయోజనం చేకూర్చేవి. తక్కినవన్నీ నిరర్ధకాలు. ధర్మార్థకామమోక్షాలు అనే చతుర్విధ పురుషార్థాలలో మోక్షాన్ని ప్రతిపాదించే ధర్మమే ఉత్కృష్ట ధర్మమవుతుంది కాని లౌకిక ప్రయోజనాలను కలిగించే ధర్మం ధర్మంకాదు. అదేవిధంగా ఆ పరమధర్మాన్ని అందించే అర్థమే ప్రయోజనకారి అవుతుంది కాని కేవలం కోరికలు తీర్చుకొనే అర్థ సంపాదన నిరర్థకమే. అదేరీతిగా ధర్మార్థాలతో మోక్షానికి అర్హమైన కామానుభవం సంభావ్యమవుతుంది కాని, కేవలం విషయభోగపరిమితమైన కామం దుష్కామమే. ఎంతకాలం జీవించి ఉంటామో, అంతకాలమే ఇంద్రియాలకు సంతృప్తి. కాబట్టి మోక్షగామి అయిన కామమే సత్కామం అనబడుతుంది. నిత్యనైమిత్తిక కర్మలద్వారా లభించే స్వర్గాది లోకప్రాప్తి ఏదయితే ఉందో, అది తత్త్వజిజ్ఞాస కల జీవులకు పరమప్రయోజనం కాదు. తత్త్వజిజ్ఞాస అంటే ధర్మజిజ్ఞాస అని కర్మవాదులు వచిస్తారు. వారి అభిప్రాయప్రకారంగా ధార్మికవిజ్ఞానమే తత్త్వం అనబడుతుంది. కాని తత్త్వం తెలిసిన వేదాంతులు జ్ఞానమనే పేరుతో రెండు కాకుండా ఎల్లప్పుడూ ఒక్కటై భాసించి నిలిచియుండే దానినే తత్త్వమని చెబుతారు. ఆ తత్త్వమే ఉపనిషత్తులు అధ్యయనం చేసే ఔపనిషదులచే "బహ్మం" అనబడుతుంది. అదే హిరణ్యగర్భోపాసకులచే "పరమాత్మగా" వ్యవహరించబడుతుంది. అదే సాత్త్వతులచే "భగవంతుడు"గా పిలువబడుతుంది. నిరంతరం ఉపనిషద్వాక్యాలను అనుసంధానం చేస్తూ ఉంటే జ్ఞానం, వైరాగ్యం చేకూరుతాయి. అపుడు వారికి నిర్మలమైన భక్తి ఉదయించి "బ్రహ్మం" గూర్చి మాత్రమే ఆసక్తి కలిగినవారవుతారు. ఆ తత్త్వవేత్తలు దేహాన్ని భోగసాధనమైన దాన్నిగా గుర్తిస్తారు. తమ ప్రత్యగాత్మలో పరమాత్మను దర్శిస్తారు. మానవులు ఆచరించే కర్మరూప ధర్మంద్వారా భక్తి చేకూరడమే పరమప్రయోజనం అవుతుంది. వారి వారి వర్ణాశ్రమ ధర్మాలద్వారా మానవులు కావించే సకల కర్మలకు మాధవుడు సంతోషించడమే సిద్ధి అవుతుంది. ఎల్లప్పుడూ మనస్సును ఏకాగ్రంచేసి నారాయణుని కథలను వినడం కీర్తించడం చేస్తూ ఉండాలి. చక్రాయుధ ధ్యానమనే పెద్దకత్తితో అహంకర్తృత్వమనే కర్మబంధాన్ని ఖండించివేయాలి. భగవంతునిపై అతిశయించే భక్తి కలిగి ఉండాలి. ముక్తిదాయకాలైన విష్ణుగాథలను మిక్కిలి ఆసక్తితో వినాలి. పవిత్రనదులలో స్నానం ఆచరించాలి. పూజార్హులైన వారిని సేవించాలి. కర్మబంధాలను పూర్తిగా తొలగింపజాలిన పుండరీకాక్షు చరిత్రలను వినడానికి అనురక్తి చూపించాలి. ఇటువంటి మానవునికి ఇతర ప్రాపంచిక విషయాలపై అభిరుచి జనించదు. పుణ్యశ్రవణ కీర్తనుడైన విష్ణువు తన గాథలను వినేవారి గుండెలనిండా స్థిరంగా ఉండిపోతాడు. అలా నిలిచి శుభాలు నెరవేరుస్తాడు. అశుభాలు దూరం చేస్తాడు. అమంగళాలు నశించిపోతే, భగవంతుని గూర్చి వివరించే గ్రంథాలు చదవాలని, భగవంతుని భజించే భక్తులను సేవించాలనే సంకల్పం కలుగుతుంది. అప్పుడు మాత్రమే నిశ్చలభక్తి ఏర్పడుతుంది. అచంచల భక్తి ప్రభవించడంతోనే రజోగుణ తమోగుణాలవల్ల కలిగే కామలోభాదులు నశించిపోతాయి. అపుడు మనస్సు సాత్వికగుణంచే ప్రసన్నమవుతుంది. మనస్సు ప్రసన్నమయితే దేనియందు సంగం లేనివాడవుతాడు. ముక్తసంగుడయితే భగవంతుని గూర్చి తెలుసుకోవాలనే ఇచ్చ జనిస్తుంది. ఈశ్వరుని గూర్చిన జ్ఞానం తెలిస్తే జ్ఞానాజ్ఞానాలకు కూర్చబడిన గ్రంథి విడివడిపోతుంది. అపుడు అహంకర్తృత్వభావన భిన్నమైపోతుంది. అహంప్రవృత్తి పటాపంచలు కాగా సర్వసంశయాలు తొలగిపోతాయి. సంశయాలు విచ్చేదంకాగా ప్రారబ్ధసంచితాగామి కర్మలన్నీ ఏవీ మిగలకుండా నశించిపోతాయి.
కాబట్టి నిరంతరం ధ్యానంచేసే తపశ్శ్రేష్ఠులు తమ అంతరంగాన్ని పరిశుద్ధం చేసుకోవడానికై, హరిపై అచంచలమైన భక్తి కలవారై తమను తాము పూర్తిగా అర్పణం చేసుకొంటారు.
అంతటా, అందరిచే ధ్యానించబడే ఉత్తమ పురుషుడు (పరమాత్మ) ఒక్కడే. అతడే సృష్టిస్థితి లయములను క్రమంగా కావిస్తాడు. సృష్టి సమయంలో బ్రహ్మ, స్థితివేళలో హరి, లయకాలంలో రుద్రుడు అనే నామాలు ధరిస్తాడు. ప్రకృతిగుణాలైన రజస్సత్త్వతమస్సులను గ్రహిస్తాడు. ఈ మువ్వురిలో అనంతసత్త్వ సంపన్నుడైన హరి చరాచరాలకు సమస్తశుభాలను ప్రసాదిస్తాడు.
అంతేకాకుండా మరో విశేషం కూడ ఉంది. అగ్నితో కలసి మండి ప్రకాశించే కొయ్యకన్న నలుపు ఎరుపు కలిసిన రంగుతో కూడుకొన్న పొగ విశిష్టమయింది. ఆ పొగకన్న ఆహవనీయ గార్హపత్య దాక్షిణాత్య రూపయజ్ఞ సాధకమైన వహ్ని విశిష్టమయింది. అదేవిధంగా ప్రవృత్తిరహితమైన తమోగుణంకన్న ప్రవృత్తి సహితమైన రజోగుణం విశిషమయింది. సోపాధిక జ్ఞాన హేతువైన కించిద్బ్రహ్మదర్శనసత్త కల్గిన రజోగుణంకన్న సాక్షాద్బ్రహ్మదర్శనసత్త కల్గిన నత్త్వగుణం మహావిశిష్టముయింది. ఆదికాలం నుండి యోగీశ్వరులు, జితేంద్రియులకు మాత్రమే ప్రత్యక్షమయ్యే షడ్గుణైశ్వర్య సంపన్నుడైన శ్రీమహావిష్ణువును సత్త్వమయునిగా ఉన్నాడు కాబట్టి సేవించారు. కొందరు సంసారంలోని సుఖాన్ని కోరుతూ ఇతర దేవతలను కొలుస్తారు. కాని ముక్తిని కోరేవారు మాత్రం విష్ణువును భజిస్తారు. వారు వివిధరూపులైన గణాధిదేవతలను విడిచి, ఇతర దేవతానింద చేయక శాంతస్వభావులై నారాయణ కథలయందే ప్రవర్తిస్తూ ఉంటారు. మరికొందరు రజోగుణంతోను, తమోగుణంతోను కూడుకొన్నవారై సిరిసంపదలను, సిద్ధులను, సంతానమును వాంఛించి పితృదేవతలను, భూతదేవతలను, ప్రజాపతులను ఆరాధిస్తారు. నారాయణుడు ముక్తిప్రదాతగా సర్వజనులచే పూజించబడుతున్నాడు. వేదాలుకాని, యాగాలుకాని, యోగంకాని, కర్మకాని, జ్ఞానంకాని, తపస్సుకాని, గమ్యంకాని, ధర్మంకాని వాసుదేవపరంగా సార్థకమవుతున్నాయి. నిర్గుణంబైన పరబ్రహ్మ నివృత్తితో ఉన్నా ఒకప్పుడు ప్రవృత్తిని వహిస్తూ, త్రిగుణాలతో కూడిన తన ప్రకృతిచే ఈ విశ్వాన్ని అంతా సృజిస్తాడు. సగుణుడై విరాజిల్లుతూ ఉంటాడు. అగ్ని ఒకటే అయినా, అది అనేక వృక్షాల్లో వివిధ రూపాలతో ప్రకాశిస్తున్నట్లుగా, విశ్వమయుడైన పరమాత్మ ఒక్కడే అయినా నానావిధరూపాలుగా ఏర్పడిన అనంతభూతకోటిలో అంతర్యామిగా ప్రకాశిస్తూ ఉంటాడు. స్థూలములు, సూక్ష్మములు, ఇంద్రియాలు, త్రిగుణాలు, వాటి తత్త్వాలద్వారా తనచే సృజింపబడిన భూతకోటిలో చిక్కుపడక ఆయాగుణానుభవం పొందుతున్నట్లుంటాడు. విశ్వకర్తయైన ఆ భగవంతుడు దేవతలలోను, పశుపక్ష్యాదులలోను, మానవులలోను లీలావతారంగా క్రిందకు దిగివచ్చి సమస్త జగత్తులను కాపాడుతాడు అని సూతుడు వచిస్తూ ఇంకా ఇలా చెబుతున్నాడు.
ఆ పరమాత్మయే మహత్తత్త్వం, అహంకారం, శబ్దస్పర్శరూపరస గంధాలనే పంచతన్మాత్రలు, అంతఃకరణ చతుష్టయం, పంచేంద్రియాలు అనే సూక్ష్మాలైన పదునారు అంశలతో కూడుకొన్న వాడై, స్థూలాలైన భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనే ఐదు మహాభూతాలతో విరాజిల్లుతున్నవాడై, సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనే త్రిగుణాలకు అతీతంగా ఉండే శుద్ధసత్త్వంతో భాసిస్తున్నవాడై, చరణాలు, ఊరువులు, భుజాలు, ముఖాలు, శ్రవణాలు, నయనాలు, నాసారంధ్రాలు, శిరస్సులు వేలకు వేలు ప్రకాశిస్తున్నవాడై, పచ్చని పట్టువస్త్రాలు, కేయూరాలు, కాంచనహారాలు, శ్రవణ కుండలాలు, రత్నకిరీటాలు వేలకువేలు కాంతులీనుచుండగా, ఆ ఆద్యంతరహితుడైన పరబ్రహ్మమే సగుణరూపుడై మనుష్యాకార పురుషోత్తమ రూపం ధరించి సమస్త భువనభాండాలను ప్రవర్తింపజేసే మహాయత్నంతో, అందరిచే ఆరాధించబడే గొప్పదైన (క్షీర) సముద్రమధ్యభాగంలో యోగమాయానిద్రాముద్రతో ప్రకాశిస్తూ ఉంటాడు.
No comments:
Post a Comment