Monday, February 2, 2026

Magha Puranam 18 - మాఘ పురాణం 18

మాఘ పురాణం - 18 వ అధ్యాయం

పిసినిగొట్టు వ్యాపారికి మాఘమాస ఫలము కలుగుట

వశిష్ఠ మహాఋషి దిలీపునకు పార్వతీదేవితో వరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును యిట్లు తెలియజేసెను.

“పార్వతీ! చాలాకాలం క్రిందట దక్షిణ ప్రాంత మందలి వసంతవాడయను నామముగల పెద్దపల్లె యుండెను. అందోక బంగారు శెట్టి అను వైశ్యుడొకడు వుండెను. అతని భార్య పేరు తాయారమ్మ.

బంగారు శెట్టి వట్టి పిసినిగొట్టు. తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగానున్నది. కాని అతడు ఇంకనూ ధనాశకలవాడై తన వద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్ను డయ్యెను. కాని ఒక్కనాడైనా హరిని ధ్యానించుటగాని, దానధర్మాలు చేయుటగాని యెఱుంగఁడు. అంతేగాక బీదప్రజలకు వారిఆస్తులపై వడ్డీలకు ఋణాలిచ్చి అనుకున్న గడువుకు ఋణము తీర్చనందున తప్పుడు సాక్షాలతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తులు సైతం స్వాధీన పరుచుకొనేవాడు.

ఒకనాడు బంగారు శెట్లి గ్రామాంతరము వెళ్ళెను, ఆరోజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు  బంగారు శెట్టి భార్యను చూచి "తల్లీ నేను ముసలివాడను నా గ్రామము చేరవలయునన్న ఇంకనూ పది ఆమడలు వెళ్ళవలసియున్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది, ఆకాశంలో మేఖాలు  ఉరుము తున్నాయి, చల్ల గాలికి వణికిపోతున్నాను. మియింటివద్ద ఈ రాత్రిగడువనియ్యి. నీకెంతైనా 
పుణ్యముంటుంది. నేను  సద్బ్రాహ్మణుడను, సదాచారవ్రతుడను, ప్రాతఃకాలమున మాఘస్నానం చేసి వెళ్ళిపోదును” అని బ్రతిమలాడెను.

తయారమ్మకు జాలి కలిగెను. వెంటనే తన అరుగుమూల శుభ్రముచేసి అందొక తుంగచాపవేసి కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పండుకొనుడని పలికెను. ఆమె దయార్ద్రహృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మాణుడు సంతసమంది విశ్రాంతి తీసుకొనుచుండగా తాయారమ్మ ఒక ఫలము ఇచ్చి దానిని భుజించమని చెప్పి ఆర్యా! మాఘస్నానము చేసివెళ్ళెదను, అని అన్నారుగదా ఆ మాఘస్నానమనగానేమి? దాని వలన కలుగుఫలితమేమి? సెలవిండు వినుటకు కుతూహలంగా నున్నది. 

అని యనగా నావృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని "అమ్మా! మాఘమాసము గురించి చెప్పుటకు నశక్యముగాదు. ఈ మాఘమాసములో నదియందుగాని, తటాకమందు
గాని, లేక నూతియందుగాని సూర్యోదయము అయిన తరువాత చన్నీళ్ళుస్నానముచేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసీ దళములతోను, పూలతోను, పండ్లతోను పూజచేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలెను. తరువాత మాఘపురాణము పఠించవలయును. ఇట్లు ప్రతిదినము విడువకుండా నెల రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణునకు సమారాధన, దానములు యివ్యవలెను. ఇట్లు చేసినయెడల మానవునికున్న రౌరవాది మహా పాపములు వెంటనే నశించిపోవును. ఒకవేళ యీ నెలరోజులూ చేయ లేనివారు, వృద్ధులు, రోగులు ఒక్క రోజయిననూ అనగా ఏకాదశి రోజునగాని, ద్వాదశినాడుగాని లేక పౌర్ణమి దినమునగాని పై ప్రకారముగా చేసినచో సకలపాపములు వైదొలగి సిరిసంపదలు పుత్రసంతానము కలుగును. ఇది నా అనుభవముతో తెలియజేయుచున్నాను అని చెప్పగా, ఆ బ్రహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలిసంతసించి తాను ప్రాతః కాలమున బ్రాహ్మణునితో నదికిపోయి స్నానము చేయుటకు నిశ్చయించుకొనెను.

అంతలో పొరుగూరికి వెళ్ళిన తన భర్తయగు బంగారు శెట్టి ఇంటికివచ్చినాడు. అతడు రాగానే మాఘస్నానము గుఱించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోవుదునని తెలియ జేసెను,

భార్య చెప్పినమాటలకు బంగారు శెట్టికి కోపమువచ్చి వంటి నిండా మంటలు బయలుదేరినట్లుగా పళ్ళు 
పటపట కొరికి ఓసీ వెఱ్ఱిదానా! ఎవరు చెప్పినారే నీకీసంగతి? మాఘమాసమననేమి? స్నాన 
మేమిటి ? వ్రతము దానము. లేమిటి? నీకేమైనా పిచ్చిపట్టినదా? చాలు, చాలు అధిక ప్రసంగము  చేసినచో నోరు నొక్కి వేయుదును. డబ్బును సంపాదించుటలో పంచప్రాణాలు పోవుతున్నవి. ఎవరికిని ఒక్కపైసా కూడా వదలకుండా వడ్డీ వసూలు చేస్తూ కూడ బెట్టిన ధనము దానము చేయమనెదవా? చన్నీళ్లు స్నానము చేసి పూజచేసి దానములు 
చేస్తే వళ్ళూ, ఇల్లూ, గుల్లయి నెత్తిపైన చెంగు వేసుకొని "భిక్షాం దేహి" యని అనవలసినదే, జాగ్రత్త వెళ్ళిపడుకో అని భర్త కోపగించినాడు.

ఆ రాత్రి తాయారమ్మకు నిద్రవట్టలేదు. ఎప్పుడు తెల్లవారునా ఎప్వుడు నదికి వెళ్ళి స్నానము చేతునా? యని ఆత్రుతగా వున్నది కొన్ని ఘడియలకు తెల్లవారినది. తాను కాలకృత్యములు తీర్చుకొని యింటికి వచ్చియున్న వృద్ధబ్రహ్మణునితో మగనికి చెప్పకుండ నదికిపోయి స్నానము చేయుచున్నది. ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దుడ్డుకఱ్ఱ తీసుకొని నదికిపోయి నీళ్ళలోదిగి భార్యను కొట్టబోవుచుండగా ఆ ఇద్దరూ కొంతతడవు నీళ్ళలో పెనుగులాడిరి. అటుల పెనుగులాడుచుండగా ఇద్దరూ నీళ్ళలో మునగవలసి వచ్చెను. అటుల మునుగుగుటచే యిద్దరికీ మాఘమాస ఫలము దక్కినది భార్యను. కొట్టి ఇంటికి తీసుకువచ్చినాడు.

కొని సంవత్సరములు జరిగిన తరువాత  ఒకనాడు ఇద్దరకు ఒక వ్యాధి సోకినది. మరికోన్ని రోజులకు యిద్దరూ చనిపోవుటచే బంగారు శెట్టిని తీసుకు పోవుటకు యమభటులు వచ్చి కాలపాశము వేసి 
తీసుకొనిపోవుచుండిరి. తాయారమ్మను తీసుకొనిపోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రధముపై  ఎక్కించుకొని తీసుకొనిపోవుచుండిరి. అప్పుడు తాయారమ్మ యమభటులతో యిట్లు పలికెను.

"ఓ యమభటులారా? ఏమిటి అన్యాయము? నన్ను వైకుంఠమునకు తీసుకుపోవుట ఏమిటి? నా భర్తను యమలొకమునకు తీసుకుపోవుట ఏమిటి? ఇద్దరమూ సమానమేగదా" అని వారినుద్దేశించి అడుగగా, "ఓయమ్మా నీవు మాఘమాసములో, నొక దినమున స్నానము చేసితివి అదియు నావృద్ధ బ్రాహ్మణునివలన విని స్నానము చేయగా నీకీ ఫలం దక్కినది. కాని నీభర్త అనేకులను హింసించి,
అన్యాయముగా ధనార్జన చేసి, అనేకులవద్ద అసత్యములాడి నరకమన్న భయంలేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందుననే యమలోకమునకు తీసుకొనిపోవుచుము" అని యమభటులుపలికిరి.

ఆమె మరల వారినిట్లు ప్రశ్నించెను. నేను ఒకే ఒక దినమున స్నానము చేసినందున పుణ్యఫలం కలిగినప్పుడు. నన్ను కొట్టుచు నాతో నాభర్త కూడ నీటమునిగినాడుకచా! శిక్షించుటలో యింత వ్యత్యాసమేల కలిగెను? అని అనగా, ఆ యమభటులు సంశయము కలిగి ఏమియు తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్లి జరిగిన సంగతి, ఆమె వేసిన ప్రశ్నయు తెలియజేసిరి.

చిత్రగుప్తుడును వారి పాపపుణ్యముల పట్టికచూడగా సమానమైన పుణ్య ఫలము వ్రాసియున్నది. జరిగిన పౌరపాటునకు 
చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టినికూడా వైకుంఠమునకు తీసుకొని
పొమ్మని విష్ణుదూతలతో చెప్పెను.

విష్ణులోకమునకు ముందుగా వెళ్ళియున్న తాయారమ్మ తన భర్తగతి ఏమయ్యేనో యని ఆత్రుతతో వుండగా బంగారుశె
ట్టిని పుష్పకవిమానముమీద తెచ్చి వైకుంఠములో విడిచిరి. భార్యా భర్తలిద్దరూ మిక్కిలి సంతసమందిరి.

రాజా వింటివా! భార్యవలన భర్తకుకూడ యెటుల మోక్షం కలిగెనో? భర్త దుర్మార్గుడ్తె పిసినిగొట్టుగా వ్యవహరించిననూ భార్య యధాలాపంగా ఒక్క రోజు మాఘస్నానం చేసినందున ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగినదికదా! గనుక మాఘస్నానము నెలరోజులు చేసినచో మరింత మోక్షదాయకం మగుననుటలో సందేహంలేదు.

No comments:

Post a Comment

Magha Puranam 27 - మాఘ పురాణం 27 ఋక్షక యను బ్రాహ్మణకన్య వృత్తాంతము

మాఘ పురాణం - 27 వ అధ్యాయం ఋక్షక యను బ్రాహ్మణకన్య వృత్తాంతము పూర్యము భృగుమహాముని వంశమందు ఋక్షక యను కన్య జన్మించి దినదిసాభివృద్ధి పొందుచుండెను...