Saturday, February 7, 2026

After the Kurukshetra war, Lord Krishna returned to Dwarka - శ్రీకృష్ణుడు ద్వారకానగరంబు ప్రవేశించుట

శ్రీకృష్ణుడు ద్వారకానగరంబు ప్రవేశించుట

తామరపూలవంటి కన్నులను విప్పార్చి కృష్ణుడు ద్వారకానగరాన్ని తేరిపార జూచాడు. అది సువర్ణ కలశాలతో విరాజిల్లే ఎత్తెన మేడలతో కనువిందు చేస్తోంది. నగరం చుట్టూ పెద్ద చెరువులాంటి అగడ్త. ఆ అగడ్తలో బంగారురంగు తామరపూలు. అందు కలహంసలు విహరిస్తున్నాయి. నగరంలో ఎటుచూచినా ఎత్తెన ముఖద్వారాలు. అవి చుక్కలను తాకుతున్నట్లు దర్శనమిస్తున్నాయి. పండ్లతో, పూలతో, చిగుళ్లతో, మొగ్గలతో నిండిన లతానికుంజాలు, గొప్ప వృక్షాలూ ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. నగరంచుట్టూ మణులచే చెక్కబడిన ప్రాకారం. మనోహర ద్వారతోరణాలతో ద్వారకానగరం సార్థక నామధేయమయింది.

ఈ విధంగా ప్రకాశించే, తనకు అత్యంత ప్రీతిదాయకమైన ద్వారకానగరాన్ని సమీపించాడు కృష్ణుడు.

శ్రీకృష్ణుని ధైర్యసాహసాలను ఆత్మీయులేకాక పరులుకూడ అభినందిస్తారు. మురుడనే రాక్షసుని సంహరించడం ఆయన సాహసానికి ఒక నిదర్శనం. ద్వారకానగరం సమీపిస్తూనే ఆయన 
పాంచజన్యాన్ని పూరించాడు. దానినుండి వచ్చే ధ్వని సమస్త ప్రాణులను నిశ్చేష్టులను చేస్తుంది. సమస్త లోకాలవారు ఆ శంఖాన్ని ప్రశంసిస్తారు. ఆ ధ్వనిని వినడంతోనే శత్రురాజుల గుండెలు గుభేలుమంటాయి. వైరిపక్షమైన రాక్షస సైన్యమంతా మూర్చాగ్రస్తమవుతుంది. ఆ ధ్వనిని విని భక్తలోక శిఖామణులైన యదువంశస్థులందరూ ధన్యాత్ములౌతారు. తనపై ప్రీతి కల్గియుండే యాదవులకు సంతోషదాయకంగా కృష్ణుడు ఆ శంఖాన్ని పూరించాడు.

పాంచజన్య శంఖధ్వని వినడానికి యాదవుల చెవులు అలవాటుపడినటువంటివే. ఆ రావం చెవులబడగానే ద్వారకావాసులలో ఉత్సాహం ఉరకలు వేసింది. భక్తి పరవళ్లు త్రొక్కింది. అతిశయించే ఆసక్తితో కృష్ణుని సందర్శించడానికై రాసాగారు. కొందరు వేణువులు ఆలపించారు. మరికొందరు బాకాలు ఊదారు. వేరేకొందరు పెద్ద పెద్ద నగారాలు మ్రోగించారు. కొందరు స్వాగతం పలకడానికై బారులు తీర్చేలా ఏనుగులను సిద్ధం చేశారు. మరికొందరు గుఱ్ఱాల గుంపులతో వచ్చారు. వాటి కాలిగిట్టల చప్పుళ్ళు ఒక్కమారుగా ధ్వనించాయి. యాదవులు ఉపాయనాలుగా బంగారం, అముల్యాలైన వస్త్రాలు, విలువగల వస్తువులు చేకొని గుంపులు గుంపులుగా స్వామిని వీక్షించడానికై వచ్చారు.

కృష్ణుడు కృపకు సముద్రం వంటివాడు. కాబట్టి ఆత్మీయులు, పురవాసులు తనకు సమర్పించిన మత్తేభాలు, ఉత్తమాశ్వాలు మున్నగు ఉపాయనాలు స్వీకరించాడు. ధనకనకవస్తు వాహనాలు ఆయనకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. అయినా భక్తితో వారిచ్చేవి కాదనకుండా కైకొన్నాడు. సూర్యుడు కాంతిస్వరూపుడు. ఆయన నుండే అనంతకోటి దీపకాంతులు వెదజల్లబడుతూ ఉంటాయి. అయినా భక్తులు ఆరాధనలో సమర్పించే దీపపంక్తులను ఆయన గ్రహిస్తాడు. అందువల్లనే సూర్యుడు ఉపమానంగా ఇచట స్వీకరించబడ్డాడు.

పరమాత్మ పూర్ణకాముడు. ఆయనకు ఏ కోరికలు ఉండవు. అటుపై ఆత్మారాముడు. బాహ్యవిషయాలపై ప్రీతి కనబరచే ప్రసక్తిలేదు. అంతేకాక పరమేశ్వరుడు. ఏ వస్తులోపం ఆయనకు ఉండదు. అయినా వారిచ్చే కానుకలు స్వీకరించాడు. ఆ కారణంచే పురవాసుల వదనారవిందాలు వికసించాయి. తమ్ము కంటికి రెప్పలాగా కాపాడే నల్లనయ్య వద్దకు చేరారు. కన్నతండ్రివద్దకు ఆప్యాయంగా చేరే చిన్నబిడ్డలలాగా ఆయన చెంత మూగారు. మాట్లాడే సమయంలో వారి కంఠాలు బొంగురుపోయాయి. అందరూ ఆయన పాదాలకు నమస్మరించి ఇలా అన్నారు.

ప్రభూ! నీ చరణారవిందాలు బ్రహ్మపూజ్యాలు. నీ పాదసేవ భవతాపాలను నశింపజేసేది. నీవు శరణుజొచ్చిన వారికి శుభపరంపరలను అనుగ్రహించే కరుణామూర్తివి. కాలస్వరూపా! నీవు కాలాన్నే నియమిస్తావు. అందరినీ కాలం నియంత్రిస్తుంది. నీవు ఆ కాలాన్నే శాసిస్తావు. బ్రహ్మాది దేవతలు అయినా నిన్ను నుతింప సమర్థులు కారు.

కృష్ణా! నీ దయవల్ల మేము క్షేమంగా జీవిస్తున్నాము. నీ ధైర్యపరాక్రమాలను ఎప్పటికప్పుడు వింటూనే ఉన్నాము. నీ అనుగ్రహంవల్ల సిరిసంపదలతో తులతూగుతున్నాము. ఈనాటికి మళ్లీ మాకు నీ పాదపద్మాలను దర్శించే భాగ్యం చేకూరింది.

తామరపూలవంటి కన్నులు కలవాడా! నీ దయావిశేషంవల్ల మనస్సులలో ఏ కలతలు లేకుండా ఉన్నాము. ఇండ్లవద్ద పరస్పరం పొరుగింటి కలహాలు లేకుండా కాలం గడుపుతున్నాము. మన పట్టణంలో ఎక్కడా దొంగల సంచారం లేదు. అయినా నీవు సుదూర ప్రాంతాలకు వెళ్లిపోవడంవల్ల నీ వియోగాన్ని సహించలేకపోతున్నాము.

ఓ తండ్రీ! తండ్రులందరికీ తండ్రి అయిన బ్రహ్మదేవునికి నీవు తండ్రివి. నీవే మాకు తండ్రివంటివాడవు. తల్లివంటివాడవు. నీవే విభుడవు, దైవమవు, స్నేహితుడవు, గురుడవు. ఏ కన్నతండ్రులు నీవిధంగా తమ సంతానం అమితానందం పొందేలా ధన్యం కావించారు? దేవతలయినా మావలె నీవదనారవిందాన్ని వీక్షించి కృతార్థులు కాలేరు.

కృష్ణా! నీవు మాటిమాటికి గజపురికి వెళ్లియున్న ప్రతిక్షణం మాకు వేలయేండ్లతో సమానమవుతోంది. ఇకపై నీవు ఎచ్చటికి వెళ్లకుండా మన నగరమందే ప్రీతితో నివసించవలసింది.

కృష్ణా! చీకటిని పారద్రోలే సూర్యుడు పడమటి కొండ కవ్వలి దిక్కుకు వెళ్లిపోగా, అంధకారంలో జగమంతా మున్గిపోయినట్లు, నిన్ను చూడకున్నచో మేమందరం కటిక చీకటిలో కొట్టుమిట్టాడుతుంటాము.

కృష్ణుడు ఈ రీతిగా జనులు పలికే భక్తిప్రపత్తులతో గూడిన వచనాలు ఆలకించాడు. అవి మనస్సునకింపై, వినడానికి సొంపై, వీనులవిందు గావించాయి. పరమాత్మ ఆ పలుకులకు ఆనందించి వారిపై క్రీగంటిచూపులు ప్రసరింపజేసి దయావర్షం కురియించాడు. తన ఆగమన వార్త విన్న ద్వారకావాసుల హృదయాలలో ప్రేమ పొంగిపొరలింది. వారు కృష్ణుని చూడాలనే సంరంభంలో స్నానం, భోజనం, నీద్ర మున్నగు అత్యవసర కృత్యాలన్నీ వదలివేశారు. ఉగసేనుడు, అక్రూరుడు, వసుదేవుడు, బలభద్రుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు, చారుధేష్ణుడు, గదుడు మున్నగు యాదవశ్రేష్టులందరూ రథాలను, ఏనుగులను, గుఱ్ఱాలను అధిరోహించినవారై ఒక దిగ్గజం వంటి భద్రగజాన్ని ముందిడుకొని ఎదురువచ్చారు. పౌరాణికులు పురాణస్తోత్రాలను, మాగధులు వంశ కీర్తనాన్ని కావించారు. నటీనటులు విచిత్రవేషాలు అభినయించారు. నర్తకులు నాట్యం చేశారు. వందిజనాలు స్తుతి పాఠాలు కావించారు. ఎటుచూచినా మంగళదాయకాలైన వచనాలే. ఒకవైపు భూసురోత్తముల వేదాశీర్వచనాలు, మరొకవైపు వీణానాదాలు, పిల్లనగ్రోవులు, నగారాలు, తప్పెటలు, శంఖస్వనాలు, బాకాలమ్రోతలు మిన్ను మన్ను మధ్యభాగంలో వ్యాపించాయి. నానావిధాభరణాలు ధరించి వారవనితలు తేరుల పైనెక్కి గానాలు కావించారు. ఈ విధమైన స్వాగతం ఆ సమయంలో కృష్ణునకు వారు అందించి సత్కరించారు. వాసుదేవుడు కూడ తగినవిధంగా వసుదేవాదులకు సాష్టాంగప్రణామాలు ఆచరించాడు. కొందరిని ఆలింగనం చేసుకొన్నాడు. మరికొందరిని హస్తస్పర్శచే గౌరవించాడు. వేరే కొందరిని పలకరించి మన్నించాడు. చిరునవ్వుతోనే కొందరిని సంతోషింపజేశాడు. భుజగశ్రేష్ఠులచే రక్షించబడుచున్న భోగవతీ నగరంలా భాసించే, తనతో సమానమైన బలసంపన్నులైన యదుభోజదాశార్హ
కుకురాంధకవృష్ణి  వీరులచే సంరక్షించబడుతున్న ద్వారకానగరాన్ని శ్రీకృష్ణుడు ప్రవేశించాడు.

ఆ మహానగరం అన్ని ఋతువులలోనూ సమృద్ధిగా లభించే అంకురాలతో, చివుళ్లతో, మొగ్గలతో, పొదలతో, పూలతో, పండ్లగుత్తులతో నిండిన భారంతో వంగిన లతానికుంజాలతో, వృక్షరాజాలతో విలసిల్లే ఉద్యానవనాలతో, మహావనాలతో, ఉపవనాలతో, నయనాభిరామాలుగా భాసించే తోటలతో ప్రకాశమానమై ఉంటుంది. ఆ వనాల నడుమ తీయమామిడి చెట్లయొక్క క్రొత్త చిగుళ్ళను కొరకడం వలన కషాయకంఠం కల్గిన కలకంఠ మిథునాల కుహూనినాదాలు కోలాహలంగా వినవస్తూ ఉంటాయి. పరిపక్వత చెందిన పండ్లలోని రసాలను సంతృప్తిగా ఆస్వాదించిన గోరువంకల, చిలుకల కలకల ధ్వనులు శ్రవణపేయంగా వినవస్తాయి. జలాశయాల్లో కహ్లారపుష్పాలమకరందాన్ని త్రాగి మత్తెక్కిన తుమ్మెద గుంపుల ఝంకారధ్వనులు, సరోవరాలలో బంగారు తామరతూండ్లను తిని మైమరచిన కలహంసదంపతుల క్రేంకారధ్వనులు వీనులవిందు కావిస్తాయి. మిక్కిలి ఎత్తైన మేడల గవాక్షాలలో నుండి బయటకువచ్చే కర్పూరదీపాల, అగరుధూపాల పొగలుచూచి నీలమేఘాలని భ్రమించి పురివిప్పి నాట్యంచేసే మయూరాల కేకారవాలు వినడానికి ఇంపుగా ఉంటాయి. ఎటుచూచినా కనువిందొనరించే సుందర తోరణాలు, విజయధ్వజాలు, వైజయంతికా పంక్తులు, ఆకాశంలో నక్షత్ర గ్రహమండలాలను కప్పివేస్తూ ఉంటాయి. మందిర ద్వారాలు, గడపలు, అరుగులు ముత్యాలముగ్గులతో అలంకరింపబడి ఉంటాయి. పచ్చకర్పూరం, చందనం, కస్తూరివంటి సుగంధద్రవ్యాల పరీమళాలతో వర్తకుల గృహాలు విలసిల్లుతూ ఉంటాయి. ఆ ఇండ్లద్వార బంధాలనుండి ధారాపాత్రలనుండి వెదజల్లబడే పన్నీరుతో రాజమార్జాలు తడుపబడుతూ ఉంటాయి. ప్రతి గృహప్రాంగణంలో చెఱకు గడలు, పండ్లు, పూలు, సుగంధాలు, మంగళాక్షతలు, అగరుధూపాలు, దీపపంక్తులు, పీతాంబరాలు మున్నగు అనేకవిధాలైన వస్తువులు దర్శనమిస్తాయి. పగడాలతో, ఇంద్రనీలాలతో, మరకత వజ్రవైడూర్యమణులతో నిర్మించబడ్డ గోపురాలు, బురుజులు, చంద్రశాలలు అంతటా కానవస్తాయి. ఆ నగరం తన మహావైభవంతో దేవేంద్రుని అమరావతీ పట్టణాన్ని కుబేరుని అలకాపురిని తిరస్కరిస్తున్నట్లు కనిపిస్తుంది. అటువంటి ద్వారకానగరంలో వాసుదేవుడు రాజమార్గం గుండా వస్తున్నాడు.

ఆ పట్టణంలోని నగరకాంతలు నిరంతరం నయనపర్వంగా కృష్ణుని చూచేవారయినా, వారికి తృప్తి కలుగలేదు. కొంగ్రొత్త కోరికతో పండుగ జరుపుకొనే విధంగా, అందరూ ఎత్తయిన మేడలు అధిరోహించారు. వాటి పైభాగంలో నిటారుగా నిలబడ్డారు. చేతి సంజ్ఞలతో తమలోతాము చూపుకొంటూ కృష్ణుని సోయగాన్ని వీక్షించసాగారు.

ఏ మహావిష్ణువు ఎదపై సిరిసంపదలు వర్షించే నారీరత్నమైన లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పరచుకొందో, ఏ మహానుభావుని పవిత్రవదనం చూచేవారి చూపులనే చకోరపక్షులకు అమృతపానం చేయడానికి వీలైన చంద్రబింబమో, సమస్త దిక్పాలురకు ఏ పరమేశ్వరుని బాహుదండాలు పట్టుకొమ్మలవుతాయో, సకల భక్తబృందాలకు ఏ పుణ్యపురుషుని పాదపద్మాలే శరణ్యాలో, ఎవడు ఈ సమస్తలోకాలలో మోహనరూపుడో, అట్టి పురుషోత్తముడు రాజమార్దంలో, కొందరు చంద్రవదనలు సౌధాగ్రాలపై విలసిల్లి పుష్పవృష్టి కురియించగా, సాగిపోయాడు.

శిరస్సుపైన శ్వేతచ్చత్రం, ఇరువైపులా వింజామరలు, శరీరంపై వర్షింపబడిన పూలతో నిండిన పట్టువస్త్రం. కంఠంలో రత్నాభరణాలు  వీటితోకూడియున్న పద్మాక్షుడైన కృష్ణుడు సూర్యబింబంతోను, చంద్రమండల ద్వయంతోను, నక్షత్ర సమూహంతోనున్న ఇంద్రధనుస్సుతోను, మెఱపు తీగతోను భాసిల్లే నీలమేఘంలా విలసిల్లాడు.

శ్రీకృష్ణుడు జననీజనకుల మందిరానికి చేరాడు. దేవకి మున్నగు ఏడ్గురు తల్లులకు నమస్కరించాడు. వసుదేవుడు వృకదేవ, ఉపదేవ, దేవరక్షిత, శ్రీదేవ, శాంతిదేవ, సహదేవ, దేవకి అనే ఏడుగురిని వివాహమాడాడని విష్ణుపురాణ వచనం.

పరీక్షిన్మహారాజా! (శౌనక మునీంద్రా!) కొడుకావిధంగా నమస్కరించగా, దేవకి మున్నగువారు తటాలున ఆయనను ఒడిలోనికి తీసుకొన్నారు. పుత్రవాత్సల్యంతో వారి చన్నులలో పాలు స్రవించినట్లయింది. కుమారునిపై ప్రేమతో ఆనందబాష్పాలు చిందించారు.

శ్రీకృష్ణుండంతఃపురకాంతలం జూడంబోవుట

No comments:

Post a Comment

Sree Maha Bhagavathamu Part 2 - శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము శ్రీ మహా భాగవతము ద్వితీయ స్కంధము ప్రారంభము శుకుడు పరీక్షిత్తునకు ముక్తి మార్గంబుందెల్పుట