Thursday, February 19, 2026

The Discussion Between Vidura and the Sage Maitreya - విదురమైత్రేయ సంవాదము

విదురమైత్రేయ సంవాదము

మైత్రేయుని పాదాలకు నమస్కరించాడు విదురుడు. చేతులు జోడించి ఇలా అంటున్నాడు. మహర్షీ! లోకంలో జనులందరూ సుఖాన్ని కోరుకొని దానికి తగిన ఏవో కర్మలు చేస్తారు. దైవం అనుకూలించక సత్ఫలితాన్ని పొందలేకపోతారు. ఇటువంటి కర్మలు దుఃఖాన్ని కలిగించేవే తప్ప పాపాన్ని పోగొట్టలేవు. అంతేగాదు, ఈ లోకులు సంసారచక్రభమణం నుండి బయటపడలేక కామమోహితులై కర్మానుగుణమైన శరీరాలు ధరిస్తూ పుట్టుట చచ్చుటలు పొందుతూంటారు. తల్లి యౌవనమనే అడవిని నరికే గొడ్డలివంటివి అటువంటి వారి పుట్టుకలు. మనుజులుగా పుట్టినా పశువుల్లా ప్రవర్తించే అటువంటి బుద్ధిహీనులను రక్షించడానికే నిరంతరం విష్ణుధ్యానపరాయణులైన మీవంటి పుణ్యాత్ములు ఈ లోకంలో సంచరిస్తుంటారు.

ఓ దయాశాలీ! అవివేకమనే జలంతోను, స్వార్ధమనే చెలియలికట్టతోను విస్తరించి, బంధు, మిత్ర, కళత్ర, పుత్రులనే భయంకర జలచరాలతో నిండియుండే అంతులేని సంసార సముద్రాన్ని దాటాలంటే మీవంటి భగవద్భక్తుల అనుగ్రహమనే నావ ఉండాల్సిందే. దానిని పొందలేని అధములు ఎప్పటికీ ఈ చావుపుట్టుకలనే సముద్రాన్ని దాటలేరు.

మునిశ్రేష్టుడా! సుజనతిలకుడా! మైత్రేయా! నన్ను రక్షించే ఆలోచన మీ మనసులో ఉంటే నా విన్నపాన్ని ఆలకించి, నా కోరిక తీర్చండి.

విదురుడు మైత్రేయునితో ఇలా అంటున్నాడు. మహా
ర్షీ! సత్త్వరజస్తమోగుణాలతోకూడిన మాయను నియంత్రించే భగవంతుడు సర్వస్వతంత్రుడుకదా! అయినా ఎందుకు అవతరించాడు? ఏ యే అవతారాలలో ఏయే కర్మలాచరించాడు? నిష్క్రియుడైన ఈశ్వరుడు ఈ ప్రపంచాన్ని ముందు ఏ విధంగా సృష్టించాడు? ఎలా పాలించాడు? తిరిగి మళ్లీ ఎలా తనలో లయం చేసుకొన్నాడు? ఈ బ్రహ్మాండంలో తాను ఎలా ప్రవర్తించాడు? బ్రహ్మాదిరూపాలతో ఎలా క్రీడించాడు? బ్రాహ్మణులను, గోవులను, దేవతలను రక్షించేందుకు మత్స్యం మొదలైన అవతారాలు ధరించి, ఏ ప్రయోజనాలు సాధించాడు? బ్రహ్మాండంలో లోపలి భాగాలైన ఇంద్రాది లోకపాలురతో కూడిన లోకాలను, లోకాలోక పర్వత ప్రాంతాల బాహ్యరూపాలను ఏ తత్త్వభేదాలతో, ఎలా పుట్టించాడు? సృష్టిలోని జీవకోటి ఎవరిని సేవించి బ్రదుకుతుంది? ప్రజలకు కర్మలలో, పేర్లలో, రూపాలలో భేదాలను ఎలా ఏర్పరిచాడు? ఇదంతా నాకు సవిస్తరంగా వివరించు. ఉత్తమోత్తములకు శిరోభూషణం వంటివాడైన, యోగులకే అధిపతియైన శ్రీహరి చరిత్రను వింటే తప్ప జననమరణరూపాలైన సంసారబంధనాలు వీడవు.

ఓ మునీంద్రా! విష్ణుకథామృతాన్ని నేను చెవులనే దోసిళ్లుగా చేసికొని ఎంత గ్రోలినా తనివితీరదు. భారతకథను చెపుతున్న వంకతో వ్యాసుడు సందర్భానుసారంగా విష్ణుకీర్తన చేసినపుడంతా నా మనసులో ఎంతో పొంగిపోతాను.

మైత్రేయమహ
ర్షీ! ఏవేవో పిచ్చికథలు చాలానే విన్నాను. వాటిమీద నా మనసులో రోత పుట్టింది. మాధవుని చరిత్రమనే అమృతం గ్రోలాలనే కోరికమాత్రమే సంసారలంపటాలను పోగొడుతుంది.

ఓ పుణ్యాత్ముడా! మహావిజ్ఞానసంపన్నులైన నారదాదులకుకూడా వర్ణింపశక్యంకాని విష్ణుకథలను వినడానికి ఆసక్తి చూపించనివాడు నిజంగా తెలివితక్కువవాడే.

శ్రీహరి మరొక అవతారమే అయిన వ్యాసమహర్షి అన్ని వర్ణాల, ఆశ్రమాల ధర్మాలను అందంగా చెప్పదలచినవాడై తన భారతంలో ఎన్నో సామాన్య కథలను కల్పించాడు. కాని అందులో హరిలీలావిశేషాలను నామమాత్రంగానే తప్ప విశేషంగా చెప్పకపోవడంచేత మానసికంగా చింతిల్లుచున్నప్పుడు నారదుడు వచ్చి, విష్ణుకథాలీలలే ప్రధానంగా భాగవతాన్ని రచించుమనుటచే అది రచించి, మహాజ్ఞానిగా లోకంలో ఖ్యాతి పొందాడు.

అందువలన పుణ్యాత్ముడా! శ్రీహరికథామృతం తాగడానికి అలవాటు పడ్డ మనుజుడు ఇతర కథలనే విషాన్ని క్రోలగలడా! హరినామస్మరణం మాత్రమే జీవులకు అన్నివిధాల సుఖదాయకం.

మహా
ర్షీ! శ్రీహరి కథలను వినుటయందాసక్తి లేనివారికి ఇహపరాలు రెండూ క్రమంగా చెడిపోతాయి. తరువాత నరకానికి చేరుకొంటారు. అటువంటివారిని చూచి నేను ఎంతో బాధపడుతుంటాను.

మునినాథా! మైత్రేయా! ఎవడైతే వృథావిషయవాదనలతో కాలం గడుపుతూ, క్షణకాలమైనా శ్రీహరిపాదకమలాలను ధ్యానించుటచే కలిగే ఆనందాన్ని పొందడో అతనికి ఆయుర్దాయం తగ్గిపోతుంది.

తుమ్మెద పువ్వు తేనియను ఆనందంగా ఆస్వాదించేందుకు ఎలా వెళుతుందో అలాగే నేనుకూడా ఆపదలో ఉన్నవారి పాలిటి బంధువు, ఈ ప్రపంచం సృష్టి స్థితిలయాలకు కారణభూతుదడై అవతరించినవాడు అయిన శ్రీహరిగుణకీర్తనామృతాన్ని సంతోషంగా ఆస్వాదిస్తాను. దయచేసి నాకు చెప్పు మహా
ర్షీ!

అలా విదురుడు మైత్రేయుని ప్రార్ధించాడని శుకుడు పరీక్షిత్తుతో చెప్పి, ఇంకా ఇలా చెప్పాడు.

విదురుడు అడిగినమీదట మైత్రేయుడు అందుకొని సున్నితమైన, తియ్యనైన మాటలతో ఇలా అన్నాడు. పుణ్యాత్ముడా! శ్రీకృష్ణుని కథను వినుటయందు మిక్కిలి ఇష్టంతో నీవు నన్నడిగావు. చాలమంచిది. నీవు భగవంతునియందు భక్తిగలవాడవు కనుక శ్రీహరికథలను వినుటయందు ఆసక్తి కలిగియుండుట వింత కాదు. అదీగాక నీవు మాండవ్య మహర్షి శాపము కారణంగా వ్యాసమహర్షివలన శూద్రస్త్రీయందు జన్మించిన యమధర్మరాజువు. శ్రీమన్నారాయణునికి ప్రేమపాత్రుడవు. అందుకనే శ్రీకృష్ణుడు చివరి సమయంలో నాకు తత్త్వజ్ఞానాన్ని అనుగ్రహించి, దానిని నీకు చెప్పుమని ఆదేశించాడు కనుక తప్పనిసరిగా నీకు బోధిస్తాను. సావధానుడవై ఆలకించు.

పుణ్యాత్ముడా! శ్రీమన్నారాయణుని యోగమాయవల్ల ఏర్పడిన జగత్తుయొక్క సృష్టి స్థితిలయాల పద్ధతిని తెలియజేస్తూ ఆ శ్రీహరి మాహాత్యంకూడ తెలియజేస్తాను.

ఈ విశ్వంలోగల సమస్త జీవుల దేహాలూ భగవంతుని స్వరూపాలు. సమస్తమైన ఆత్మలూ ఆయనే. సర్వానికీ ప్రభువు ఆయనే. పరాత్పరుడు. అనేకవిధాలైన బుద్దులకు ఉపలక్షణమైన మహానుభావుడు. అటువంటి భగవంతుడు తన మాయవల్ల తనలోనే లీనమైన ప్రపంచాన్ని తనగర్భంలో ధరించి ఒక్కడుగా వెలుగుతూ ఉంటాడు. ఆ పరమాత్మ పుట్టుకలేనివాడు. సమస్తమూ పైనుండి చూచేవాడైనప్పటికీ వేరే మరేవస్తువూ లేకండా తానే సర్వమూ అయినప్పుడు ఇక ద్రష్టకాడు. కానీ మాయాప్రధాన శక్తి కలవాడై ప్రపంచాన్ని నిర్మించే కోరికతో గొప్ప చిచ్చక్తి గల్గి తనను తాను లేనివాడుగా మనస్సులో భావించుకొంటాడు. సృష్టికి ఉపక్రమించిన పిమ్మట ద్రష్ట అవుతాడు.

ఆ జగన్నాథుడు జగన్నిర్మాణం చేపట్టాలనుకొన్నపుడు కార్యకారణరూపమైన మాయ అనే పేరుగల అవిద్య ఏర్పడుతుంది. దానిలో

జగన్నిర్మాణం చేయాలన్న ఆలోచన కలిగినపుడు తననుండి ఏర్పడిన మాయారూప అవిద్యయందు తన పురుషశక్తిని ప్రవేశపెట్టి పుట్టుకలేనివాడు, పురుషోత్తముడు, పరమేశ్వరుడు అయిన పరమాత్మ తనలో ఇమిడియున్న జగత్తును బాహిరంగా సృష్టించెను.

మాయకు మూడు పేర్లున్నాయి. కాలచోదితం, అవ్యక్తం, ప్రకృతి అని. ఆ మాయనుండి మహత్తత్త్వం పుట్టింది. దానికి కాలం మొదలైన గుణాలున్నాయి. భగవంతునికి మాత్రమే గోచరమయ్యె ఆ మహత్తత్త్వం నుండి కార్యకారణ కర్తృత్వాలనే గుణాలు ఏర్పడ్డాయి. వాటినుండి పంచభూతాలు, ఇంద్రియాలు, మనస్సు ఏర్పడ్డాయి. వాటినుండి సత్త్వరజస్తమోగుణాలతో కూడిన అహంకారం పుట్టింది.

సాత్తికాహంకారం రూపాంతరాన్ని పొంది మనస్సు, దేవతాగణాలు సంభవించాయి. ఇంద్రియాలకు అధిష్ఠాతలైన ఆ దేవతాగణాలనుండి శబ్దం పుట్టింది. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు తైజసాహంకారంనుండి పుట్టాయి. తామసాహంకారంనుండి శబ్దస్పర్శరూపరసగంధాలు పుట్టాయి. శబ్దంనుండి ఆకాశం పుట్టింది. కాలమాయాంశయోగంతో శ్రీహరి దృష్టితో స్పర్శ అనే తన్నాత్రనుండి వాయువు పుట్టింది. వాయువు ఆకాశబలంద్వారా తేజస్సును పుట్టించింది. తేజస్సు వాయువును కలుపుకొని నీటిని పుట్టించింది. నీరు భూమిని పుట్టించింది. ఆకాశానికి శబ్దం, వాయువునకు శబ్దస్పర్శలు, తేజస్సునకు శబ్దస్పర్శరూపాలు, జలానికి శబ్దస్పర్శరూపరసాలు, భూమికి శబ్దస్పర్శరూపరసగంధాలు గుణాలుగా ఉంటాయి. ఆ యా గుణాలకు అధిష్ఠానదేవతలందరూ విష్ణుదేవుని కళలే. అయినా వారంతా వేరువేరుగా ఉండడంచేత ప్రపంచాన్ని సృష్టించే శక్తి లేక శ్రీమహావిష్ణువును నమస్కరిస్తూ ఇలా స్తుతించారు.

దండకము

శ్రీనాథనాథా! జగన్నాథ! నమ్రైకరక్షా! విపక్షక్షమాభృత్సహస్రాక్ష! నీరేజపత్రేక్షణా! దేవదేవా! భవ ద్దాసవర్గోపతాపంబులం బాపంగా నోపు దివ్యాతపత్రంబు నాంబొల్చు యుష్మత్పదాంభోజ మూలంబు పుణ్యాలవాలంబుగాం బొంది యోగీంద్రు లుద్దామ సంసార తాపంబులం బోవంగా మీటి వర్తింతురో తండ్రి! యీశా! సమస్తాఘ నిర్ణాశ! యీ విశ్వమందెల్ల జీవుల్‌ భవోదగ్ర దుర్వార తాపత్రయాభీల దావాగ్నిచేంగ్రాంగి దుఃఖాబ్ధిలోం దోంగి యే కర్మమున్‌ ధర్మముం బొందంగా లేక సంసారచక్రంబునందుం బరిభ్రామ్యమాణాత్ములై యుందు ర మ్మూఢచేతస్కులం జెప్పంగా నేల యో దేవ! విజ్ఞాన దీపాంకురంబైన నీ పాదపంకేరుహచ్చాయం బ్రాపింతు మబ్జాక్ష! సన్మౌనిసంఘంబు లైకాంతిక స్వాంతతం బేర్చి దుర్దాంత పాపౌఘనిర్ణాశకాంబుప్రవాహాభ్ర గంగా నివాసంబు గా నొప్పు నీ పాదయుగ్మంబు యుష్మన్ముఖాంభోజ నీడోద్గతం బైన వేదాండజ శ్రేణిచేతన్‌ గవేషించి సంప్రాప్తలై యుందు; రో నాథ! వైరాగ్యశక్తిస్ఫుట జ్ఞాన బోధాత్ము లైనట్టి ధీరోత్తముల్‌ నిత్య నైర్మల్య భవ్యాంతరంగంబులం దే పరంజ్యోతి పాదాబ్జ పీఠంబు గీలించి కైవల్య సంప్రాప్తులై రట్టి నిర్వాణమూర్తిం బ్రశంసింతు; మింద్రాది వంద్యా! ముకుందా! సమస్తంబుం గల్పింపం బాలింపం దూలింపంగాం; బెక్కు దివ్యావతారంబులం బొందు నీ పాద పంకేరుహ ధ్యానపారీణ సుస్వాంతులై యొప్పు భక్తాళికిన్‌ మోక్షదం బైన మీ పాద కంజాతముల్‌ గొల్తు; మీశా! రమాధీశ! పుత్రాంగనా మిత్ర సంబంధ బంధంబులం జెంది నిత్యంబు దుష్ట క్రియా లోలురై దేహగేహంబుం దోలి వర్తించు దుర్మానవ శ్రేణులం దంతరాత్ముండవై యుండియున్‌ దూరమై తోంచునీ పాదపద్మంబు లర్చింతు; మో దేవ! బాహ్యేంద్రియ వ్యాప్తి నుద్వృత్తులైనట్టి మూఢాత్ము లధ్యాత్మ తత్త్వ ప్రభావా
ఢ్యులై నీ పదాబ్జాత విన్యాస లక్ష్మీ కళావాసముం గన్న యయ్యుత్తమశ్లోకులం గానంగాం జాల; రప్పుణ్యులా దుష్టులం జూడంగా నొల్ల రంభోధిరాట్కన్యకాకాంత! వేదాంత శుద్ధాంత సిద్ధాంతమై యొప్పు నీ సత్కథాపార చంచత్సుధాసారపూరంబులం గ్రోలి, సౌఖ్యోన్నతిన్‌ సోలి, ధీయుక్తులై వ్రాలి, తాపంబులం దోలి, మోదంబులం దేలి, సంపన్నులై మన్న నిత్యప్రపన్నుల్‌ మహోత్కంఠతం బేర్చి వైకుంఠ ధామంబు నల్పక్రియాలోలురై కాంతు; రద్దివ్యవాసైక సంప్రాప్తికిం గోరుచున్నార; మో దేవ! వైరాగ్యవిజ్ఞాన బోధాత్మ యోగక్రియారూఢి నంతర్బహిర్వ్యాప్తిం జాలించి శుద్ధాంతరంగంబు గావించి హృత్పద్మవాసుండవై చిన్మయాకారమై యున్న నీ యున్న తానంత తేజో విలాసోల్లన న్మూర్తిం జిత్తంబులం జేర్చి యానంద లోలాత్మతం బొల్చు యోగీశ్వర శ్రేణికిం 
దావకీనానుకంపానులబ్ధిస్ఫుటజ్ఞానముం గల్గుటం జేసి యాయాసముం జెంద; దో దేవతాచక్రవర్తీ! సదానందమూర్తీ! జగద్గీతకీర్తీ! లసద్భూతవర్తి! భవద్దాసులైనట్టి మమ్మున్‌ జగత్కల్పనాసక్త చిత్తుండవై నీవు త్రైగుణ్యవిస్ఫూర్తిం బుట్టించినం బుట్టుటే కాకనీ భవ్యలీలానుమేయంబుగా సృష్టినిర్మాణముం జేయ నే మెంతవారౌదు? మీ శక్తి యుక్తిన్‌ భవత్పూజ గావింతు; మట్లుండె నీ సత్కళాజాతులై నట్టి మమ్మెన్నంగా నేల? యధ్యాత్మతత్త్వంబ వన్నం బరంజ్యోతి వన్నం బ్రపంచంబ వన్న న్నధిష్ఠాతవన్నన్‌ సదాసాక్షి వన్నన్‌ గుణాతీత! నీవే కదా పద్మపత్రాక్ష! సత్త్వాదిత్రైగుణ్య మూలంబు నా నొప్పు మాయా గుణంబందు నుద్యన్మహా తత్త్వ మైనట్టి నీ  వీర్యముం బెట్టుటం జేసి నీ వింతకుం గారణం బౌదు! వాయాయి కాలంబుల న్నీకు సౌఖ్యంబు లేమెట్లు గావింతు? మే రీతి నన్నంబు భక్షింతు? మెబ్భంగి వర్తింతు? మే నిల్కడన్నుందు? మీ జీవలోకంబె యాధారమై యుండి భోగంబులం బొందుచు న్నున్న యి క్కార్యసంధానులై నట్టి మాకుం జగత్కల్పనా శక్తికిన్‌ దేవ! నీ శక్తిం దోడ్పాటు గావించి, విజ్ఞానముం జూపి, కారుణ్య సంధాయివై మమ్ము రక్షింపు లక్ష్మీమనఃపల్వలక్రోడ! యోగీంద్ర చేతస్సరోహంస! దేవాదిదేవా! నమస్తే నమస్తే నమః.

ఓ శ్రీవల్లభా! భువననాయకా! ఆశ్రితరక్షకా! శత్రుపర్వతాలను కూల్చే ఇంద్రా! పద్మనేత్రా! దేవదేవా! నీ దాసుల తాపాన్ని పోగొట్టే గొడుగువంటి నీ పాదపద్మాలను ఆశ్రయించి, యోగీంద్రులు సంసారతాపాలనుండి విముక్తులవుతారు. సమస్త పాపాలను నశింపజేసేవాడవు. ఈ ప్రపంచంలోని జీవులు సంసారమనే భయంకర దావాగ్నిలో పడి మాడిపోతూ మంచికర్మలుగాని, మంచి ధర్మాచరణంగాని లేక సంసారచక్రంలోనే పడి తిరుగుతుంటారు. జ్ఞానజ్యోతితో అజ్ఞానాంధకారాన్ని పారద్రోలే నీ పాదపద్మాలనే ఆశ్రయిస్తాం. సకలపాపాలను కడిగివేసే గంగకు నీ పాదాల జంట పుట్టినిల్లు. నీ ముఖమనే గూటినుండి బయలువెడలిన పక్షులవంటివి వేదాలు. సన్మునులు వేదాలద్వారా వెదకి నీ పాదాలను పట్టుకొంటారు. వైరాగ్యంతో జ్ఞానంతో ధీరులైనవారు నిర్మలమైన మనసులందు ఏ మహాజ్యోతిరూపాన్ని నిలుపుకొని కైవల్యాన్ని పొందారో అట్టి మోక్షమూర్తివైన నిన్ను ప్రశంసిస్తాం. సృష్టి స్థితి లయాలను గావించేందుకు ఎన్నో అవతారాలను ధరించి, ధ్యానించువారికి మోక్షాన్ని ప్రసాదించే నీ పాదాలనే ఆశ్రయిస్తాం. నిత్యం పుత్రమిత్రకళత్రాది బంధాలలోనే మునిగి, చెడ్డపనులు చేస్తూండేవారి అంతరంగాలలో ఉండికూడా దూరంగా తోచే నీ పాదపద్మాలను అర్చిస్తాము. ఇంద్రియలోలురు, వేదాంతజ్ఞానులైన నీ పాదార్చకుల గొప్పతనాన్ని గ్రహించలేరు. అటువంటి దుష్టులను నీ భక్తులు చూచేందుకుకూడా ఇష్టపడరు. వేదాంతానికే అంతఃపురంవంటి నీ కథామృతాన్ని ఆస్వాదించినవారు ఎంతో సౌఖ్యాన్ని పొందుతారు. సులభంగా వైకుంఠాన్ని పొందుతారు. అటువంటి స్థితిని మేము కోరుకొంటున్నాము. నీ అనుగ్రహంవలన లభించిన ఆత్మజ్ఞానం కలవారు ఎటువంటి బాధలను పొందరు. నీవు పుట్టిస్తే ఈ ప్రపంచం పుడుతుంది తప్ప సృష్టినిర్మాణం చేయడానికి మేమెంతవారం? ఏదో నిన్ను అర్చించుకొంటూ కాలం గడిపేవారమే తప్ప నీ కళయొక్క అంశనుండి పుట్టిన మేమేపాటివారం? అధ్యాత్మతత్త్వమన్నాా పరంజ్యోతివన్నా, ప్రపంచమన్నా అధిష్ఠాతవన్నాా సదాసాక్షివన్నా, నీవే కదా. సత్త్వరజస్తమోగుణాలకు మూలమయిన మాయలో నీ తేజస్సును ప్రవేశపెట్టి, ఈ సృష్టికి మూలకారణమయ్యావు. నీకు మేము ఎలాంటి సుఖాలను కలిగించగలము? మా ఆహారమేమిటి? మేమెలా ప్రవర్తించాలి? ఎట్టి నిలుకడను కలిగి ఉండాలి. ఈ జీవలోకమే ఆధారంగా భోగాలను పొందుతూ ఇటువంటి సృష్టికార్యానికి పూనుకొన్న మాకు జగన్నిర్మాణ విషయంలో నీ తోడ్పాటు కావాలి. తగిన జ్ఞానాన్ని నీవే ప్రసాదించాలి. దయామయుడవై మమ్మల్ని రక్షించు. లక్ష్మీదేవి మనస్సనే జలాశయంలో విహరించే మహావరాహమూర్తి! యోగుల మానస సరోవరాలలో సంచరించే హంసమా! దేవాదిదేవా! నీకు నమస్మారం.

మహత్తు మొదలైన శక్తులన్నీ అలా స్తోత్రం చేయగా శ్రీహరి ప్రసన్నుడయ్యాడు. ఆ శక్తులకు పరస్పర మేళనం లేకపోవడం వల్ల జగన్నిర్మాణం కుదరడం లేదని గ్రహించాడు. అపుడు ప్రకృతితో తాను ఒక్కటి అయ్యాడు. తన తేజస్సును ఇరువదియేడు తత్త్వాలలో నిక్షేపించాడు. విడిగా ఉన్న ఆ శక్తులకు ఏకత్వాన్ని కలిగించాడు.
(పృథివి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, గంధం, రసం, రూపం, స్పర్శ, శబ్దం, నేత్రం, నాసిక, శ్రోత్రం, రసన, చర్మము, వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థ, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, కాలం, ప్రకృతి, మహత్తు, ఇవి ఇరవై ఏడు తత్త్వాలు. మొదటి ఐదు పంచభూతాలు. తరువాతి ఐదు పంచతన్మాత్రలు. తరువాతి ఐదు జ్ఞానేంద్రియాలు. తరువాతి ఐదు కర్మేంద్రియాలు. తరువాతి నాలుగు అంతఃకరణచతుష్టయం. కాలం, ప్రకృతి, మహత్తులతో కలిపి మొత్తం ఇరువదియేడు తత్త్వాలు.

అలా ప్రపంచాన్ని ఏర్పరచడంలో ఆ తత్త్వాలకు శక్తిని కలిగించాడు శ్రీమన్నారాయణుడు. స్వామి ప్రేరణతో తత్త్వాలన్నీ ఒకదానితో మరొకటి కలిసి మరొక రూపాన్ని ధరిస్తూ అలా విశాలవిశ్వం ఏర్పడింది. ఆ విధంగా ఏర్పడిన జగత్తులోని అన్ని జీవరాసులలోనూ తాను అంతర్యామిగా ఉన్నాడు స్వామి.

విశ్వమంతా జలమయంగా ఉంది. అందులోనే అంతర్లీనమై బ్రహ్మాండం ఉంది. అందులో వేయి సంవత్సరాలు శ్రీమన్నారాయణుడు ఉండి బాహ్యప్రపంచాన్ని సృష్టించాడు.

పరమాత్మ దైవం, కర్మ, ఆత్మ అనే శక్తులతో కూడుకొని తనకు తానుగా దైవంగా వెలుగొందుతాడు. కల్పాంతంలో శరీరం లేని చేతనారూపంగా ఉంటాడు.

ఆ చైతన్యశక్తికి రూపాలను ధరించే శక్తి ఏర్పడుతోంది. అందువల్ల కర్మలను చేసే శక్తి వస్తోంది. ప్రవృత్తి భేదంవల్ల పదిరకాలైన ప్రాణాలు స్పందించి తనను తాను గ్రహించే శక్తి ఏర్పడుతోంది.
(పది విధములైన ప్రాణాలు. ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం, నాగం, కూర్మం, కృకరం, దేవదత్తం, ధనంజయం - మొత్తం పది ప్రాణాలు.)

ఆ పరబ్రహ్మతత్త్వమే ఆధ్యాత్మ, ఆధిభౌతిక, ఆధిదైవికములనే రూపాలు కలిగి, ఆధ్యాత్మిక భేదాలను రూపుమాపి, అన్ని ప్రాణులకూ తానే ఆత్మస్వరూపంగా వెలుగొందుతుంటుంది.

జీవస్వరూపమై, పరమాత్మకు స్థానమై, ఆద్యవతారమూర్తియైన పరమాత్మ గర్భవాసంనుండి సకల జీవరాసులతోకూడిన ఈ ప్రపంచం ఉద్భవించింది.

అలా స్ఫురించిన పరమాత్మ ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతికాలనే భేదాలతో ప్రకాశిస్తూంటాడు అని మైత్రేయుడు విదురునకు తెలియజేశాడు అని చెప్పి మళ్లీ శుకమహర్షి పరీక్షిన్మహారాజుతో ఇలా చెపుతున్నాడు.

విష్ణువు, పరబ్రహ్మ, ప్రభువు, పుట్టుక లేనివాడు, సంపన్నుడు, అంతం లేనివాడు, అంతంలేని శరీరం కలవాడు, సముద్రుని పుత్రికయైన లక్ష్మీదేవి హృదయానికి అధీశుడు, ఎటువంటి మార్పులు లేనివాడు, ఎల్లవేళలయందును శుభాలకు నిలయమైనవాడు, దయాసముద్రుడు, కపటంలేని మనస్సు కలవాడు, సకల శక్తిస్వరూపుడు, పద్మాలవంటి కన్నులు కలవాడు, జ్ఞానులందరూ గౌరవించే పావనమైన నడవడిక కలవాడు, ఈ విధంగా సుఖంగా ఉండేవాడు శ్రీహరి.

ఈ విధంగా జగన్నాథుడైన విష్ణువు మహదాది తత్త్వాల మనస్సులోని ఆలోచనలను గ్రహించాడు. ఆ యా తత్త్వాలు వివిధములైన ప్రవృత్తులను పొందేందుకు తన శక్తితో ఇలా చేయాలని ఆలోచించి తన కళలతోకూడిన విరాట్‌ స్వరూపంలో అగ్ని మొదలైన దేవతలందరికీ నివాసం కల్పించాడు. ఆ విరాట్‌ పురుషుని ముఖము మొదలైన అవయవాల స్వరూపాలను వివరిస్తాను. ఏకాగ్రతతో ఆలకించు అని మైత్రేయుడు విదురునితో చెప్పుచున్నాడు.

విదురా! పరమాత్మలో కొంతభాగం అవయవాలుగా రూపొందాయి. అందులో ముఖభాగాన్ని వాయుసఖుడైన అగ్ని ఆశ్రయించి సరస్వతికి అనుకూలించుటచే జీవుడు నోటితో ధ్వనిని ఉచ్చరించగలుగుతున్నాడు. అలాగే సూర్యుడు చక్షురింద్రియరూపంగా నేత్రాలలో ప్రవేశించుటచేత జీవుడు రూపాలను గ్రహించగలుగుతున్నాడు. వాయువు త్వగింద్రియరూపంలో చర్మాన్ని ఆశ్రయించాడు. అందువలన జీవునకు స్పర్శజ్ఞానము కలుగుచున్నది.

చర్మంలో వాయువు ప్రవేశించి జీవునికి స్పర్శజ్ఞానాన్ని కలిగిస్తాడు. దిక్కులు చెవులను చేరి శబ్దజ్ఞానాన్ని కలిగిస్తున్నాయి. వరుణుడు నాలుకను ఆశ్రయించుటచే జీవుడు రుచులను తెలుసుకొంటున్నాడు. అశ్వినీదేవతల స్థానమైన ముక్కువాసన చూడగలుగుతోంది. చర్మం, ఓషధులు పరమాత్ముని కేశాలను పొందుటచే దురద ఏర్పడుతోంది. పురుషాంగం ప్రజాపతి రేతస్సుతో సంయోగమందుటచే జీవునకు ఆనందం కలుగుతోంది. మలరంధ్రంలో సూర్యుడు, వాయువు చేరుటచేత మలవిసర్జన శక్తి కలుగుతోంది. ఇంద్రునివలన చేతులకు ఇచ్చిపుచ్చుకొనే శక్తి కలుగుతోంది. విష్ణువువలన పాదాలకు నడచే శక్తి కలుగుతోంది. మనస్సులో చంద్రుడు ప్రవేశించడంచేత సంకల్పవికల్పాలు కలుగుతున్నాయి. అహంకారంలో రుద్రుని ప్రవేశంవలన కర్తవ్యనిర్వహణ కలుగుతోంది. బుద్ది వాగీశ్వరుని ఆవాసమై గ్రహణశక్తి కలుగుతోంది. చిత్తం బ్రహ్మావాసమై విజ్ఞానం ఏర్పడుతోంది.

విరాట్‌పురుషుని శిరస్సునుండి స్వర్గం, పాదాలనుండి భూమి, నాభినుండి ఆకాశం ఏర్పడ్డాయి. సత్త్వరజస్తమో గుణాల మార్పుచేత జీవులు అమరులయ్యారు. సత్వగుణం అధికంగా ఉన్నవారు అమరులై స్వర్గాన్ని పొందారు. రజోగుణం ఎక్కువగా ఉన్న జీవులు గోవులు, మానవులు మొదలైన రూపాలతో భూమిని చేరారు. తామసగుణం అధికమైనవారు భూతాదులైన ప్రమథగణాలై భూమ్యాకాశమధ్యభాగాన్ని పొందారు. విరాట్పురుషుని ముఖంనుండి వేదాలు పుట్టాయి.

సద్గుణనిలయుడవైన పరీక్షిన్మహారాజా! విరాట్పురుషుని మోమునుండి వేదాలు పుట్టాయి. ఆదే మోమునుండి విప్రులు ఉద్భవించారు. అందువల్ల భూసురుడు అందరికీ గురువు, శ్రేష్టుడు అయ్యాడు.

నీతివిచక్షణా! ఈ లోకంలో బ్రాహ్మణాది సర్వజాతులవారికి దొంగలవలన, దుర్మార్గులవలన భయంలేకుండా వారిని రక్షించేందుకు విరాట్పురుషుని భుజాలనుండి క్షత్రియజాతి ఏర్పడింది.

వ్యవసాయం, గోపరిపాలనం, వ్యాపారం మొదలైన కార్యకలాపాలతో సమాజసేవ చేసేందుకుగాను పరమాత్మ తొడలనుండి వైశ్యజాతి ఆవిర్భవించింది.

సమాజసేవాధర్మంతో విరాట్పురుషుని పాదాలనుండి శూద్రులు అనుపేరు గల జాతి ఉదయించింది. వారు భగవంతుడు నిర్ధేశించిన విధంగా ఆ యా విధులను జగత్పిత, విశ్వగురుడు ఆచరించాడు.

వారంతా జగన్నాథుడైన విరాట్పురుషుని పాదపద్మాలను ఆశ్రయించి, వేదోక్తవిధానంతో భక్తియోగనిపుణులై ఎల్లవేళల సేవిస్తుంటారు.

మహనీయచరితుడా! భగవంతుడు తన మహిమ వ్యక్తమయ్యేలా కాలకర్మస్వభావాలే శక్తిగా చేసికొని యోగమాయతో విజ్బంభిస్తుంటాడు. వాని ప్రవర్తనను ఎవరు గ్రహించి స్తుతించగలరు? ఎవరూ గ్రహింపలేరు.

విదురా! ఇంతకాలం ఏవేవో కాకమ్మకథలతో నా నాలుక మలినమైపోయింది. ఆత్మశోభ అణగారిపోయింది.ఈనాడు శ్రీహరి దివ్యకథావిశేషాలను చెప్పి సౌజన్యాన్ని పొందింది. మా గురువు నిర్దేశించిన ముక్తిమార్గంలో ప్రయాణించుటకు తగినట్లుగా హరికథామృతంతో కూడి నా నాలుక చక్కని చరిత్ర కలదయ్యింది.

శ్రీమహావిష్ణువు మహిమను తెలియజేసే మంచి కథలనే అమృతాన్ని త్రాగేందుకు అలవాటుపడిన సజ్జనుడు పనికిమాలిన కథలనే ఉప్పునీటిని త్రాగడానికి ఇష్టపడతాడా? పారిజాతపుష్పాలలోని మకరందాన్ని ఆస్వాదించేందుకు అలవాటుపడిన తుమ్మెద వేపచెట్టునుండి వచ్చే చేదుగాలికి ఆకర్షింపబడి అటు పరుగెత్తుతుందా? (పరుగెత్తదనుట,)

వేదాంతజ్ఞానవిశారదుడవైన విదురా! నారాయణుని మహిమలను ఆయన నాభికమలంనుండి పుట్టిన బ్రహ్మయే పరిపూర్ణంగా తెలుసుకొనలేడన్నచో సాధారణమానవులకు హరిమహిమ తెలియసాధ్యంగాదని వేరే చెప్పవలెనా? 

ఉత్తములందరూ కీర్తించే చరిత్ర కలవాడు, పద్మంవంటి నేత్రాలు కలవాడు, దేవతలంతా మొక్కే పాదాలు కలవాడు అయిన శ్రీమహావిష్ణువును వేదాలు వాటిలో అవి తర్కించుకొని వెదకినా కనుగొనలేవని పండితులు చెపుతారు.

విదురా! శ్రీమహావిష్ణువు తన మాయయొక్క ప్రవర్తనను తానే గమనించలేడు. ఎందుకంటే అది పరిమితి లేనిది. అటువంటప్పుడు బ్రహ్మాదిదేవతలు ఎలా తెలిసికోగలుగుతారు?

దేవతలనేలే ఇంద్రుడు కాని, దిక్కులనేలే దిక్పాలకులుగాని, బ్రహ్మగాని, ఉమావల్లభుడు గాని దర్శింపలేని శ్రీవల్లభుడైన నారాయణుని పాదాలజంటను మనసులో ధ్యానిస్తాను.

ఈ విధంగా మైత్రేయుడు విదురునకు చెప్పిన విషయమంతా మనోహరంగా అర్జునుని మనుమడైన పరీక్షిన్మహారాజుకు పరాశరమహర్షి మనుమడైన శుకుడు చెప్పి.
(అర్జునుని కుమారుడు అభిమన్యుడు. అతని కుమారుడు పరీక్షిత్తు. పరాశరుని కుమారుడు వ్యాసుడు. అతని కుమారుడు శుకమహర్షి 'పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్‌” అని ప్రసిద్ధ శ్లోకం. వక్త శ్రోత ఇద్దరూ వంశగౌరవం కలవారైతే ఆ విషయం ప్రామాణికమవుతుంది. అందుకని తాతలను ప్రస్తావించడం.)

శుకమహర్షి పరీక్షిన్మహారాజుతో చెపుతున్నాడు. రాజా! మైత్రేయుడలా శ్రీహరి దివ్యగుణలీలామాహాత్యాన్ని చెప్పగా విని విదురుడు ఇంకా ఇలా అడుగుతున్నాడు.

సౌజన్యమూర్తివైన మైత్రేయా! పరమాత్మ నిర్గుణుడు కదా! మరి సృష్టిస్థితిలయాలనే కర్మలు, లీలలు ఎలా వీలుపడుతున్నాయి? అసలు నిర్గుణ పరబ్రహ్మ సగుణమూర్తిగా ఉండడం ఎలా పొసగుతుంది చెప్పు అని విదురుడు అడిగాడు.

అలా అడిగిన విదురుడు ఒకవేళ పరమాత్మ ఒక బాలుడులాగ ఈ జగత్తుతో ఆడుకొంటున్నాడా? అనుకొని మళ్లీ మైత్రేయుని అడుగుతున్నాడు. మహర్షీ! నిజంగా భగవంతుడు పసివాడిలా ఈ ప్రపంచంతో ఆడుకొంటున్నాడనుకొంటే అపుడా ఆటలయందు ఆయనకు కోరిక ఉండాలి. భగవంతుడు కోరికలు లేనివాడు గదా! ఆ ఆటలవల్ల అతనికి ఆనందం కలగాలి. భగవంతుడు నిత్యసంతోషి కదా! ఆడుకోవాలంటే వేరు వేరు వస్తువులు కావాలి. ప్రపంచమంతా ఒకటే వస్తువైతే ఎలా ఆడుకొంటాడు? అయినా నిర్గుణుడైన పరమాత్మ త్రిగుణాత్మకమైన మాయతో కలిసి ప్రపంచాన్ని సృష్టించడమేమిటి? అని.

పుణ్యాత్మా! మైత్రేయా! తన మాయతో ఈ జగత్తును సృష్టించి, పోషించి, చివరకు లయం చేసే పరమాత్మ ఆయా జీవులలో జ్ఞానస్వరూపంతో సర్వదేశకాలావస్థలలోనూ ఉంటాడు కదా! తాను జీవులలో ఏకమై ఉన్నపుడు ఆ యా జీవులకు దారుణమైన కష్టాలు ఎందుకు కలుగుతున్నాయి? ఏ కర్మమువల్ల సంభవిస్తున్నాయి? ఈ సందేహాలతో నా మనస్సు వ్యాకులపడుతోంది. అజ్ఞానావస్థనుండి బయటపడలేకపోతున్నాను అన్నాడు విదురుడు.

కావున పండితాగ్రేసరుడవైన నీవు నా సందేహాలను తొలగించేందుకు సమర్దుడవు అని విదురుడు మైత్రేయుని అడిగాడని శుకమహర్షి పరీక్షిన్మహారాజుతో చెప్పి, ఇంకా ఇలా అంటున్నాడు.

సుజనతిలకుడవైన పరీక్షిన్మహారాజా! హరికథామృతపానలోలుడైన విదురునితో మైత్రేయుడు అప్పుడు ఇలా చెప్పనారంభించాడు అని శుకమహర్షి అన్నాడు.

విదురా! పిడివాదాలతో భగవత్తత్త్వం తెలుసుకోవాలనుకోవడం వెర్రితనం. ఆ వాదాలకు పరమాత్మతత్త్వం అందదు. ఆయన ఆద్యంతరహితుడు, నిత్యమంగళస్వరూపుడు కనుక ఏ బంధాలు, ఏ బాధలు అతనిని అంటవు. స్వామి అన్నింటికీ అతీతుడు.

విదురా! నిద్రపోవునపుడు కలలో మానవునికి ఎన్నో సుఖాలు కలుగుతాయి. అవి ఆనందంగా అనుభవిస్తాడు. కొన్ని మారులు తనను ఎవరో చంపినట్టు, తన తల నరికివేసినట్లు కలగంటాడు. అపుడు ఎంతో విచారిస్తాడు. మెలకువ వచ్చాక ఆ సుఖంగాని, కష్టంగాని అంతా కలయే తప్ప నిజం కాదని గ్రహిస్తాడు. భగవంతుని లీలకూడా అట్టిదే. ఆయన జీవుడుగా నటిస్తున్నాడు తప్ప నిజం కాదు గనుక ఆయనను ఏమీ అంటవు. మానవుడు మెలకువ వచ్చాక అసత్యమని తెలుసుకొన్నా కలగంటున్న సమయంలో సుఖమైతే ఆనందాన్ని, కష్టమైతే విచారాన్ని పొందుతాడు కదా! అలాగే భగవంతునికి కూడా జీవుడుగా నటించే సమయంలోనైనా వచ్చే కష్టసుఖాలు అంటకుండా ఎలా ఉంటాయని సందేహిస్తున్నావా! అయితే విను.

ఆ రకమైన సుఖదుఃఖాలు పరమాత్మకు అంటవు. ఎందుకంటే.

నిర్మలమైన నీటిలో నిండు జాబిల్లి ప్రతిబింబిస్తూ ఉంటుంది. నీటిలో అలలు నెమ్మదిగా కదలుతుంటే చంద్రుడు కూడా కదలుతున్నట్లనిపిస్తాడు. కాని నిజానికి ఆకాశంలోని చందమామ కదలదు కదా! అలాగే శరీరధర్మాలన్నీ కలిగి, ఒక శరీరిగా క్రీడారూపంగా సుఖాదులనుభవించే పరమాత్మకు కూడా ఏ కర్మబంధాలూ అంటవు.

కాబట్టి జీవాత్మస్వరూపుడైన మానవునికి అజ్ఞానమనేది ఉంటుంది కనుక దానివల్ల కర్మలు చేయడం, వాటివల్లనే బంధనాలలో పడటం వంటివి ఉంటాయి. కాని అన్ని జీవులలో అంతర్యామిగా ఉండే  పరమాత్మకు ఆ అజ్ఞానం ఉండదు. అందువల్ల ఆ సర్వజ్ఞునికి ఎటువంటి కర్మబంధాలు అంటవు.

మానవునికి తన దేహంనుండి పుట్టె అవాంఛనీయ గుణాలను పోగొట్టుకోవాలంటే నారాయణునిపై భక్తి ఉంటే చాలు. అలాగే సంసారంలో వచ్చే రకరకాల ఈతిబాధలనుండి బయటపడాలంటే ఇంద్రియచాపల్యం విడిచిపెట్టి, మనస్సును నిశ్చలం చేసి స్వామిసంకీర్తనం చేస్తే సరిపోతుంది.

పండితులుకూడా పొగడే విదురా! ఎవరైతే నారాయణ పాదపద్మాలను అర్చిస్తూ, స్తుతిస్తూ నిరంతరమైన భక్తియోగంతో ఉంటారో వారు శివబ్రహ్మలకు కూడా పొంద సాధ్యంకాని పరంధామాన్ని పొందుతారు. అటువంటి పుణ్యాత్ముల పూర్వజన్మ సుకృతం ఇట్టిది అట్టిది అని పొగడుట ఎవరికిని సాధ్యం కాదు.

మైత్రేయ మహర్షి అలా చెప్పగా విదురుడు రెండుచేతులూ జోడించి ఆ మునీంద్రుని చూస్తూ శ్రీహరిని ధ్యానిస్తూ ఇలా అంటున్నాడు. మునీంద్రా! నీ మాటలవల్ల నా సందేహాలు తొలగిపోయాయి. నారాయణుడు లోకనాథుడు ఎలా అయ్యాడో, శరీరధారులైన జీవులకు కర్మబంధాలు ఎలా అంటుతున్నాయో అన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. నారాయణుడు సర్వస్వతంత్రుడనీ, ఆయనమీద భక్తిమాత్రమె అవిద్యానాశనానికి మూలమనీ తెలిసింది.

తనకు ఏ ఆధారం అవసరం లేకుండా తానే విశ్వమంతటికీ ఆధారమై ఎలా ఉంటున్నాడు నారాయణుడు, ఎటువంటి దేహాభిమాని సంసారంలోనే పడి కొట్టుకుంటుంటాడు, ఎటువంటివాడు భక్తిమార్గంతో పుండరీకాక్షుని పొందగలుగుతాడు, నిజానికి ఇద్దరూ సుఖాలు అనుభవిస్తుంటారు కాని ఎవడు సుఖదుఃఖాలవల్ల కలిగే సంతోషవిచారాలతో కూడుకొని ఉంటాడో, ఎవడు నారాయణ సేవతో సకల దుఃఖాలనుండి బయటపడతాడో, ఇదంతా నా సేవవల్ల నాకు బోధపడింది. కాని, లేని ప్రపంచం ఉన్నట్లుగా మనకు గోచరిస్తోందన్నావు. అందుకు కారణం నాకు తెలియడం లేదు.

జ్ఞానులు ప్రశంసించే పద్మనాభుడు కొద్దిపాటి తపస్సు మాత్రమే కలవారి ఆలోచనలకు లభించడని క్రమంగా నేను నా మనస్సులో భావిస్తుంటాను అని విదురుడు అన్నాడు.

పుణ్యాత్ముడవైన మైత్రేయా! భగవంతుడు ఇంద్రియాలతో మహదాదులకు పరస్పర సంబంధం కలిగించి వాటినుండి విరాడ్దేహాన్ని పుట్టిస్తాడు. అందులో తాను కూడా ప్రవేశిస్తాడు. అతడు వేయి వేయి శిరస్సులు, పాదములు, హస్తములు కలవాడని జ్ఞానులు చెపుతుంటారు. ఈ లోకాలన్నీ ఆ విరాట్పురుషునిలో ఉండి, ఎటువంటి ఆపద లేకుండా హాయిగా ఉంటాయి. పది ప్రాణాలు, ఇంద్రియ విషయాలు, ఇంద్రియ అధిదేవతలు మువ్విధములుగా మారి అందులోనుండి బ్రాహ్మణాదిజాతులు ఆవిర్భవించాయి.

ఈ లోకంలో కొడుకులు, వారి పిలలతోకూడిన వంశాలలో జనులు ఎలా ఏర్పడ్డారు? వారితో ఈ ప్రపంచం ఏ విధంగా ప్రవర్తిస్తోంది?

ప్రజాపతులకే పతియైన లక్ష్మీపతి చాతుర్యం మెరిసేటట్లుగా బ్రహ్మ మొదలగువారితో ఈ ప్రపంచాన్ని ఎలా సృష్టింపజేశాడు?

సృష్టిభేదాలు, మనువంశాలు, వంశాధిపతులు, వంశానుచరితలు ఇవన్నీ భగవంతుడు ఎలా ఏర్పరిచాడో నాకు స్పష్టంగా తెలియజేయి.
(మనువులు పదునలుగురు. స్వాయంభువుడు, స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుషుడు, వైవస్వతుడు, సూర్యసావర్ణి, దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, ధర్మసావర్ణి, రుద్రసావర్ణి, రౌచ్యుడు, భౌత్యుడు. వారి ఏలుబడిలోనివె ఆ యా మన్వంతరాలు. ప్రస్తుతం నడచుచున్నది వైవస్వత మన్వంతరం.)

జగమెరిగిన పవిత్రమైన నడత గల మైత్రేయా! భూలోకానికి క్రింద ఎన్ని లోకాలున్నాయి, పైన ఎన్ని లోకాలున్నాయి, వాటి వాటి సంగతులు, వాటిలో క్రమంగా వచ్చే మార్పులు నాకు తెలియజెయ్యి.

మునిశ్రేష్ఠుడా! దేవతలు, పశుపక్ష్యాదులు, మనుజులు, రాక్షసులు, గరుడులు, ఉరగులు, సిద్దులు, సాధ్యులు, గంధర్వులు, ఖేచరులు మొదలైన జన్మములను గురించి, అలాగే గర్భంనుండి పుట్టే ప్రాణులు, గుడ్డునుండి పుట్టే ప్రాణులు, చెమటనుండి పుట్టె ప్రాణులు వాటిని గురించి తెలియజేయి.

మునివర్యా! సత్త్వరజస్తమోగుణాల ఆధారంగా ఏర్పడే భగవదవతారాలు, సమగ్రరూపాన్ని సంతరించుకొన్న ఈ ప్రపంచంయొక్క పుట్టుక, మనుట, పోవుటలు గురించి, వేదాలగురించి, వాటి నిలుకడలను గురించి నాకు వివరంగా తెలియజెయ్యి.

మైత్రేయ మహర్షీ! చక్రియొక్క అందచందాలు, వీరత్వం మొదలైన గుణాలు, బ్రాహ్మణులు మొదలగు నాలుగు వర్ణాలవారి విధానాలు, బ్రహ్మచర్యం మొదలైన నాలుగు ఆశ్రమాలు, వారి వారి ధర్మాచరణములు, స్వభావాలు, నడతలు, అభిప్రాయాలు ఇవన్నీ సవివరంగా తెలియజేయవలసింది.

మహర్షీ! యోగవిద్య, దాని మహిమలు, యాగాదికర్మకాండలు, జ్ఞానమార్గాలు, విజ్ఞానసాధనాలైన సాంఖ్యయోగాలు, శ్రీమన్నారాయణుని స్మరణమాత్రంచేత పుట్టిన శాస్త్రాలు వీటన్నిటిని గురించి తెలియజేయి.

మహర్షీ! నాస్తికవాదమంటే ఏమిటో, అశాస్త్రీయ వివాహంవల్ల కలిగే సంతానం ఏ విభాగంలోకి వస్తుందో, జీవుల గుణకర్మాలు ఏమిటో, పలుకుల గతులేమిటో, ధర్మమోక్షాలకు పరస్పర వైరుద్ధ్యం లేని సాధనాలేమిటో, రాజనీతి, దండనీతి వాటి విధానమేమిటో, వేర్పాటువిధానమేమిటో, పితృయజ్ఞాలు, తర్పణాల విధానమేమిటో, తారాగ్రహాలు కాలచక్రంలో ఎలా నిలుకడను పొందగలుగుతున్నాయో, తపోదానఫలాలు ఎటువంటివో, విశేషధర్మాలేమిటో, ప్రజలు చేసే కర్మలు వాటి ఫలితాలు ఏమిటో అవన్నీ నాకు తెలియజెప్పు.

మహార్షీ! మానవులకు వచ్చే ఆపద్ధర్మాలు ఏమిటి, ఎలా ఉంటే శ్రీహరి సంతోషిస్తాడు, ఎవరి మేలు ఎల్లపుడూ కనపడుతుంది, గురుసేవ చేయడంవల్ల వారు శిష్యులకు ప్రయోజనం కలిగించే అంశాలను ఎలా బోధిస్తారు అవన్నీ నాకు చెప్పు.

మునీశ్వరా! ప్రళయం మొదలైన భేదాలు ఏమిటో, అలాగే ఎటువంటివారు పురుషోత్తముడైన శ్రీహరిని అచంచల భక్తితో అర్చిస్తారో, ఎవరిలో జీవతత్త్వం నిత్యవికాసంతో ఉంటుందో అదంతా విపులంగా తెలియజెయ్యి.

ఆర్యస్తవనీయుడవైన మైత్రేయా! గోవిందుని రూపం ఎటువంటిదో, జీవాత్మ పరమాత్మలకు ఐక్యభావం ఎలా కలుగతుందో, ఉపనిషత్తుల సారాంశరూపమైన పారమార్థికజ్ఞానం ఎటువంటిదో నాకు తెలియజెయ్యి.

మైత్రేయా! గురువులను సేవించే ఉత్తమ శిష్యులకు కలిగే ప్రయోజనాలు ఏమిటో, సజ్జనులవలన లభించే విజ్ఞాన సాధనాలు ఏమిటో, వైరాగ్యంవల్ల వచ్చే భక్తి ఎటువంటిదో తెలియజేయి.

మహర్షీ! ఇంతవరకు నేను అడిగినవాటినన్నిటినీ వివరంగా తెలియజేసి జ్ఞానార్తితో ఉన్న నన్ను జ్ఞానభీక్షద్వారా రక్షించు. యజ్ఞాలు, దానాలు చేయడం వలన వచ్చే పుణ్యఫలంగాని, వేదం చదవడంవలన వచ్చే పుణ్యఫలంగాని దీనులను రక్షించడంవలన వచ్చే పుణ్యఫలంతో సమానం కానేకావు.

ఆ విధంగా మైత్రేయమహర్షిని విదురుడు వినయంగా తెలిసికోవాలనే కోరికతో అడిగిన విధానమంతా వ్యాసుని కుమారుడైన శుకమహర్షి అభీమన్యుని కుమారుడైన పరీక్షిత్తునకు తెలియజేసి ఇంకా ఇలా చెపుతున్నాడు.

పరీక్షిన్మహారాజా! పూరువంశమంటేనే లోకులందరూ కొనియాడే వంశం. అటువంటిదానిని మరింత పవిత్రం చేయడంకోసమే నీవు జన్మించావు. నిత్యం సద్గుణాలతోకూడి కీర్తిపుష్పాలతోకూడిన లతలకు విష్ణుకథామృతాన్ని పోసి మరింత వృద్ధిని కలిగిస్తూ పోషిస్తున్నావు అని శుకమహర్షి ప్రస్తుతించాడు.

అల్పసుఖాలకోసం వెంపర్లాడే జనాల దుఃఖాన్ని పోగొట్టగలిగినదీ, శ్రీమన్నారాయణుని గుణకథలనే దారాలతో అల్లబడిన వస్త్రంవంటిదీ, వేదసారమైనదీ అయిన భాగవతాన్ని నీకు తెలియజేస్తాను.

ఆ భాగవతాన్ని నీకు తెలియజేస్తానని శుకమహర్షి పరీక్షిన్మహారాజుతో ఇంకా ఇలా అంటున్నాడు.

ఈనాడు వాసుదేవుడుగా కనబడుతున్న ఆ పరమాత్మ ఒకనాడు వేదరూపమైన మహాభాగవతాన్ని తీసికొని పాతాళానికి వెళ్లిపోయి, అక్కడ తదేకదీక్షతో ధ్యానమగ్నుడై ఉన్నాడు. ఆ సమయంలో అక్కడికి సనందాది మహర్షులు వచ్చారు. వారికి మేలు చేయడానికి కళ్లు తెరిచాడు పరమాత్మ. వెంటనే వారందరూ స్వామిని ప్రస్తుతించసాగారు. అంతలో నాగకన్యలు ఆకాశగంగలో స్నానంచేసి, తడిసిన జటాబంధాలతో స్వామిని భర్తగా చేసుకోవాలనే కోరికతో అక్కడికి వచ్చి ఆయన పాదపద్మాలకు నమస్కరించారు.

ఆ నాగకన్యలు భక్తితో శ్రీహరిని సేవించారు. అనేకవిధాలైన పూజలతో, కానుకలతో, వినయప్రకటనలతో, స్తుతులతో ఆ స్వామి మనస్సులో స్థానాన్ని పొందారు. అదే సమయంలో సనందనుడు మొదలగువారు ఆ మహనీయుని స్తుతించారు.

ఆ పరమాత్ముడు సహస్రశీర్షుడు. వేయితలలకు వేయి కిరీటాలున్నాయి. వాటిలో నవరత్నాలు పొదగబడి ఉన్నాయి. వాటినుండి వెలువడుతున్న కాంతులతో స్వామికి గొడుగులాగ అమరి ఉన్న ఆదిశేషుని పడగలు మరింత ప్రకాశిస్తున్నాయి. ఆ మహనీయుని అవతారాలను, ఆ యా అవతారాలలో స్వామి చేసిన ఘనకార్యాలను సనందనాదులు ఎంతో భక్తిగా ప్రస్తుతించారు. అతిశయించిన అనురాగంతో వారు అలా ప్రస్తుతిస్తున్నపుడు వారి మాటలు తడబడుతున్నాయి. వారి అచంచల భక్తిప్రపత్తులకు స్వామి ఎంతగానో సంతోషించాడు.

పరమాత్మ బ్రహ్మదేవుని కుమారుడైన సనత్కుమారునికి వేదార్థసారమైన భాగవతాన్ని ఉపదేశించాడు. దానిని అతడు సాంఖ్యాయనమహర్షికి ఉపదేశించాడు.
(భాగవతమనునది కేవలమొక గ్రంథం కాదు. అది భగవత్తత్త్వం. అది ఉపదేశరూపంలో ఒకరినుండి ఒకరికి పరంపరగా రావలసినది. కనుక ఇది చదవడంకంటె పండితులద్వారా వినుటవలననే ఆధ్యాత్మిక ప్రయోజనం సాధింపబడుతుంది.)

సనత్కుమారుడు ఉపదేశించిన భాగవతాన్ని సాంఖ్యాయనుడు పరాశరునకు ఉపదేశించాడు. అతడు దానిని దేవతల గురువైన బృహస్పతికి ఉపదేశించాడు. దేవగురువు నాకు (మైత్రేయునికి) ఉపదేశించాడు. నేను దానిని స్వీకరించి నీకు చెపుతున్నాను అని విదురునితో పలికాడు.

విదురా! అలా బృహస్పతిద్వారా నాకు లభించిన భాగవతాన్ని నీకు ఉపదేశిస్తాను విను. వారిజాక్షుడూ, కీర్తనీయుడూ అయిన శ్రీహరి చరితామృతవర్షంలో తడిసిపోయి ఆనందంగా జీవించు.

ఈ విధంగా భగవంతునిచే చెప్పబడినది, మునీశ్వరులనుండి సంప్రదాయసిద్ధంగా పరంపరగా వచ్చినది, పరమపురుషుని కీర్తించేది, మిక్కిలి పవిత్రమైనది, సంసారబంధమనే లతను ఛేదించే కొడవలివంటిది అయిన భాగవత కథాసర్వస్వాన్ని శ్రద్దాభక్తులు గల నీకు వివరిస్తాను విను అని మైత్రేయమహర్షి విదురునితో పలుకుచున్నాడు.

పుణ్యాత్ముడవైన విదురా! సృష్టికి ముందు విశ్వమంతా కేవలం జలమయంగా ఉంది. ఆ కడలి నడుమ వేయిపడగల ఆదిశేషువు పరమాత్మకు శయ్యగా ఏర్పాటై ఉన్నాడు. దానిపై స్వామి పవ్వళించి ఉన్నాడు. సముద్రజలంగా ఉన్న అమృతంనుండి నురుగులు వస్తున్నాయి. అది స్వామి శరీరంపై పడి శ్రీహరి తెల్లని కాంతితో ప్రకాశిస్తున్నాడు. ఆదిశేషుని వేయి తలలపై ఉన్న వేయి రత్నాలుకూడా తెల్లని కాంతులను ప్రసరిస్తున్నాయి. ఆ కాంతులు పరస్పరం స్నేహం చేసుకొంటున్నట్లున్నాయి. స్వామి కోరికలయందు అనురక్తుడై ఉండికూడా ఏమీ ఎరుగనట్లు, అగ్నిని కడుపులో దాచుకొన్న కొయ్యలాగా జ్ఞానకాంతితో ప్రకాశిస్తూ, రాని నిద్రను నటిస్తూ కన్నులు మూసుకొని ప్రశాంతమైన ఆకారంతో ఆనందభరితుడై ఉన్నాడు.

పరాత్పరుడు యోగామాయా ప్రభావానికి దూరంగా వేయి యుగాలు లోకాలన్నిటినీ తన ఉదరకోశంలో ఇమిడ్చి అతిశయించి తగిన కాలం, శక్తి - వీటి పెంపొందించటంలో సృష్టి కార్యక్రమానికి సిద్ధపడ్డాడు.

పరమాత్మ తన గర్భంనందు సూక్ష్మరూపంలో ఉన్న విశ్వాన్ని మనస్సుద్వారా గమనించాడు. దానిని బయటకు తీసుకొనివచ్చి భౌతికమైన జగత్తును సృష్టించాలనుకొన్నాడు. అందుకు తగినట్లుగా సకాలానికి ప్రవర్తించాల్సిన రజోగుణాన్ని పుట్టించాడు.

శ్రీమన్నారాయణుడు రజోగుణాన్ని పుట్టించాడు. దానివల్ల తన బొడ్డునుండి ఒక తామర మొగ్గ ఉదయించింది. సృష్టికి అనుకూలమైన కాలంలో స్వామి తన తేజస్సుతో సూర్యుడు కమలాన్ని వికసింపజేసినట్లు ఆ మొగ్గను వికసింపజేశాడు. లోకాలకు ఆశయమైన అన్ని గుణాలతో కూడిన ఆ పద్మంలో తన కళను నిక్షిప్తం చేశాడు. దానివలన వేదమయుడైనవాడు, స్వయంభువుడు అయిన బ్రహ్మ నాలుగు మోములతో ఆ పద్మంనందు ఉదయించాడు.

బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణుని బొడ్దుతామరదుద్దునందే ఉండి, కన్నులు విప్పార్చి, లోకాలనన్నిటినీ గమనించాడు. అలాగే దిక్కులను, ఆకాశాన్ని తన ఎనిమిది కళ్లతో బాగా పరికించాడు.

విస్తారమైన ప్రళయకాలపు పెనుగాలుల తాకిడికి అంతులేని నీటిలోని అలలు ఎగసిపడుతున్నాయి. అటువంటి నీటిలో ఒక పద్మం ఉంది. దాని కర్ణికాస్థానంలో ఉన్న బ్రహ్మ తనను తాను దర్శించాడు. లోకతత్త్వాన్ని మనించాడు. ఏమి చేయాలో పాలుబోక విచారపడ్డాడు.

అప్పుడు బ్రహ్మ ఈ విధంగా ఆలోచించాడు.

బ్రహ్మ తనలో తాను తర్కించుకోసాగాడు. ఈ నీరేమిటి! నీటిలోకి ఈ పద్మం ఎలా వచ్చింది. దీనిలోకి ఒంటరిగా నేనెలా వచ్చాను. అసలు నా పేరేమిటి. నేనిలా పుట్టడానికి కారణమేమిటి. ఎన్ని రకాలుగా ఆలోచించినా నాకేదీ అంతుపట్టడం లేదనుకొని ఆశ్చర్యంలో మునిగిపోయాడు.

బ్రహ్మదేవుడు తానున్న పద్మానికి గల తూడు ఎంత ఉంది? అసలు దాని మొదలు ఎక్కడో చూడాలనుకొన్నాడు. అనుకోవడమే తరువాయి, ఆ తూడులోని రంధ్రంద్వారా మొదలువైపు ప్రయాణించాడు.
('వన' శబ్దానికి నీరు అని అర్ధం. 'వనజము' అంటే పద్మం. 'వనజాతభవుడు' అంటే బ్రహ్మ.)

బ్రహ్మ తనకు జన్మనిచ్చిన పద్మపు నాళం మొదలు ఎక్కడుందో చూడాలని నీటి లోలోపలకి ప్రయాణించాడు. అలా వేయి దివ్యసంవత్సరాలు గడచిపోయాయి కాని తామరతూడు మొదలుమాత్రం కానరాలేదు. భగవంతుని మాయ వాని బుద్ధిని కమ్మేసింది. భయపడ్డాడు. తిరిగి తన నివాసస్థానమైన పద్మాన్ని చేరుకొన్నాడు.

బ్రహ్మదేవుడు తిరిగి తన జన్మస్థానమైన పద్మపీఠాన్ని చేరుకొన్నాడు. అక్కడ అష్టాంగయోగసమ్మతమైన యోగవిద్యతో ఊపిరి బిగబట్టి తపస్సు చేయనారంభించాడు. అలా వంద సంవత్సరాలు గడచిపోయాయి.
(యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం అనునవి యోగానికి సంబంధించిన ఎనిమిది అంగాలు.)

అష్టాంగయోగంతో తపస్సు చేయడంవలన గొప్ప తత్త్వజ్ఞానం లభించింది బ్రహ్మకు. అయినా నారాయణ దర్శనం కలుగలేదు. అప్పుడు దృష్టిని తన హృదయంలోకి మరల్చాడు. ఆ హృదయకమలంలో తనను కన్న తండ్రి శ్రీమన్నారాయణమూర్తిని దర్శించగలిగాడు.

బ్రహ్మదేవుడు తన హృదయంలోనికి దృష్టిని సారించాడు. అక్కడ పవిత్ర చరిత్రుడు, జగత్తును పవిత్రం చేయువాడు, కాంతిమతియైన లక్ష్మీదేవి భార్యగా గలవాడు. దేవతాసంస్తవాలకు యోగ్యమైనవాడు, రాక్షససేనను జయించేవాడు, వికసించిన పద్మంవలె ఉన్న అందమైన కన్నులు కలవాడు, అప్పుడే ఏర్పడిన అందమైన నల్లని మబ్బువంటి శరీరపు రంగు కలవాడు, గరుత్మంతుడు వాహనముగా కలవాడునైన శ్రీమన్నారాయణమూర్తిని దర్శించాడు.

అంతేగాకుండా

బ్రహ్మదేవుడు తన హృదయపద్మంలోకి దృష్టిని సారించి శ్రీమన్నారాయణుని దర్శించాడు. ఆయన కడలి నడుమ ఆదిశేషువును పానుపుగా చేసుకొని పరుండి కనిపించాడు. ఆ నీళ్లు నిర్మలంగా ప్రకాశిస్తున్నాయి. ఆ ఆదిశేషుడు కొత్త తామరతూడులాగ తెల్లని దేహకాంతితో ఉన్నాడు. తన పడగలపైనున్న రత్నాల కాంతులతో ప్రళయకాలపు చీకట్లను పోగొట్టి ఆ ప్రదేశమంతా వెలుగులతో నింపుతున్నాడు.

ఆదిశేషుడు పానుపుగా పవ్వళించిన శ్రీహరి కట్టిన పచ్చని పట్టుపంచె సాయంకాలపు మబ్బుల కాంతిలా ఉంది. కిరీటం బంగారు పర్వత శిఖరంలాగా ఉంది. గుండెపై వేలాడే ముత్యాలహారాలు కొండచరియలనుండి జాలువారే సెలయేరుల్లా ఉన్నాయి. తులసిమాలలు ఓషధీలతలవలె ప్రకాశిస్తున్నాయి. ఉన్నతమైన భుజాలు వెదురుబొంగులులాగా ఉన్నాయి. పాదాలు ఏటి ఒడ్డున మొలిచిన చెట్లలాగా ఉన్నాయి. వెరసి ఆతడు మరకత పర్వతంలా ఉన్నాడు. అటువంటి మహానుభావుడైన శ్రీహరిని దర్శించాడు బ్రహ్మ

బ్రహ్మ దర్శించిన శ్రీమన్నారాయణమూర్తి దేహం విశ్వానికి వేరు కానిది, సాటిలేనిది, మొత్తం జగత్తును తనలో ఇముడ్చుకొన్నది, విశాలంగా గుండ్రంగా ఉన్నది, విచిత్రమైన అందమైన ఆభరణాల కాంతుల చిందుతున్నది, పుణ్యపురుషుల కోరికలు తీర్చే కామధేనువువంటి పాదద్వయం కలిగినది, నుదుటి అందానికి ఓడిన చంద్రుడు ఆశ్రయించినట్లనిపించే కాలిగోళ్లు కలిగినదిగా ఉంది.

ఆయన తొడలు శ్రీదేవీభూదేవులకు తలగడలా అన్నట్లు నల్లని అరటిస్తంభాలను పోలి ఉన్నాయి. కటిప్రదేశం బంగారపు మొలనూలుతో అందంగా ఉంది. కడిమిపూవుల కేసరాలతో అందగిస్తున్న పట్టుపీతాంబరం కట్టిన నడుము శోభాయమానంగా ఉంది. నాభి ప్రదేశం శృంగార ప్రవాహంలో ఏర్పడ్డ సుడిగుండంవలె ఉంది. లోపలి భువనాలు మళ్లీ మళ్లీ పుడుతుండడంతో కృశించినట్లుగా ఉంది నడుము.

గుండె లక్ష్మీదేవి విలాసమందిరంలా ఉంది. ముత్యాలమాలలు ఆ మందిరం ముంగిట తీర్చిన రంగవల్లులులా ఉన్నాయి. తులసీమాలలు చిగురుపాన్పులా ఉన్నాయి. పూలదండలతో, పచ్చకర్పూరంతో, కస్తూరి గంధలేపనాలతో కౌస్తుభరత్న కాంతులతో శ్రీవత్సశోభితమై ఉంది. కౌగిలింత సమయంలో లక్ష్మీదేవి చేతులకున్న మణిస్థగితమైన బంగారు గాజులు ఒత్తుకొన్నట్లుగా కంఠంపై రేఖలు కనిపిస్తున్నాయి.

రత్నాలు పొదిగిన బంగారపు భుజకీర్తులతో, కంకణాలతో చేతులు శోభిస్తున్నాయి. అద్దాలవంటి చెక్కిళ్లు లోకుల బాధలను బాపే చిరునవ్వు వెన్నెలలతో, చెవులకున్న కుండలాలు మణికాంతుల నర్తనాలతో ముచ్చట గొలుపుతున్నాయి. పెదవి దొండపండులా, పగడంలా, చిగురుటాకులా ఎర్రగా ఉంది. లోకపాలనకు సమర్థత నాకుందంటే నాకుందని కలహించే కన్నులకు మధ్యలో పెట్టిన సరిహద్దు స్తంభంలా ఆయన ముక్కు ఉంది. కన్నులు కలువలలాగా, కమలాలలాగా, ఉన్నాయి. వాటినుండి కరుణామృతం పొంగి పొర్లుతోంది. కడగంటి చూపులు చెవులదాకా వ్యాపిస్తున్నాయి. శ్రీకారాలలాగా ఉన్నాయి. కనుబొమలు మన్మథుని ధనుస్సులాగా ఉన్నాయి. నొసటిభాగం అష్టమినాటి చంద్రరేఖలా ఉంది.

తలపై ఉన్న పద్మరాగమణులు పొదిగిన బంగారు కిరీటం నీలాద్రిపైనున్న బాలసూర్యుని తిరస్కరిస్తున్నది. సూర్యుడు, చంద్రుడు, వాయువు, అగ్నుల కాంతులకు అవకాశమివ్వకుండా ముల్లోకాలకూ వ్యాపించే కాంతితో చెలువాందుతూ, యుద్ధంలో రాక్షససమూహాన్ని చీల్చిచెండాడే  సుదర్శనాది దివ్యాయుధాలను ధరించి, దివ్యరూపంతో ప్రకాశిస్తున్నాడు శ్రీహరి.

బ్రహ్మ శ్రీహరిని దర్శించాడు. ఆ స్వామి హారాలు అలంకారంగా ధరించాడు. పూలదండలు ధరించాడు. వేయి చేతులు కలిగియున్నాడు. అన్ని చేతులకూ రత్నాలు పొదిగిన బంగారు ఉంగరాలూ, భుజకీర్తులూ ఉన్నాయి. భువనమే బీజంగా కలిగి, మూలం కనబడని, పాము చుట్టుకొన్న శ్రీచందనవృక్షంలాగా స్వామి ప్రకాశిస్తున్నాడు.

శ్రీమహావిష్ణువు మైనాకపర్వతంలాగా కనిపిస్తున్నాడు. పర్వతంపై పాములుంటాయి. ఆదిశేషుడు శ్రీహరికి తన పడగను గొడుగులా పట్టి ఉన్నాడు. పర్వతం భూభారాన్ని మోస్తుంది కనుక భూధరమంటారు. స్వామికూడా భూభారాన్ని వహిస్తున్నాడు. వేయి శిరస్సులపై వేయి బంగారు కిరీటాలున్నాయి స్వామికి. పర్వతంపై బంగారంలా మెరిసే ఎన్నో శిఖరాలున్నాయి. మైనాకపర్వతం సముద్రమధ్యంలో ఉంది. స్వామికూడా సముద్రమధ్యంలోనే ఉన్నాడు. స్వామి కౌస్తుభమణితో ప్రకాశిస్తున్నాడు. మైనాకపర్వతం రత్ననిలయమై ఉంది. అటువంటి మైనాకపర్వత సదృశుడైన చూడదగిన శ్రీహరిని దర్శించాడు బ్రహ్మ.

విపులార్థవంతమైన జ్ఞానజపస్తుతులనెడి మకరందాన్ని తాగి సంతోషించిన వేదాలనే తుమ్మెదలతో చుట్టబడిన కాంతిమంతమైన కీర్తి అనే పూలదండలు కల విష్ణువును బ్రహ్మదేవుడు కనుగొన్నాడు.

అలా కనుగొన్న బ్రహ్మ.

పుణ్యాత్ముడు, సృష్టికి ప్రభువు, ఆద్యంతాలు లేనివాడు, ధన్యుడు, సకలలోక మాన్యుడు అయిన శ్రీహరిని బ్రహ్మ దర్శించాడు. అంతే కాదు, ఆయన పద్మంవంటి నాభినుండి పుట్టిన పద్మాన్ని నీళ్లను, గాలిని, ఆకాశాన్ని భువన నిర్మాణదృష్టితో పరికించాడు. కాని అవి తప్ప ఇంకేమీ కనబడలేదు. అప్పుడు తనలో బీజరూపంలో ఉన్న సృష్టినిర్మాణ జ్ఞానాన్ని రజోగుణంతో గమనించాడు. అప్పుడు మొక్కవోని విధంగా సృష్టి కార్యక్రమంలోకి దిగాలనుకొన్నాడు. వెంటనే అస్పష్టగోచరుడైన హరియందు తన హృదయాన్ని చేర్చాడు. ఆ మహాత్ముడు, పరుడు, అనంతుడు, అభవుడు, అప్రమేయుడు అయిన హరిని ఇలా స్తుతించసాగాడు.

వారిజాక్షా! మాయాగుణసంపర్కంతో చేయాల్సిన సృష్టికార్యక్రమంలో ప్రకాశించే నీ రూపవైభవం ఇట్టిదని నిరూపించడం శరీరధారులకు సాధ్యం కాదు. నీ స్వరూపంకంటె ఇతరమైనది ఏదీ లేదు. అటువంటి నీ దివ్యరూపం నా కన్నులకు గోచరించింది. అంతే గాక, నాకు జ్ఞానోదయంకూడా కలిగింది. ఎందువల్లనంటే నీవు నిరంతరాయంగా వెలుగొందేవాడవు కనుక నీ రూపం అజ్ఞానమనే గాఢాంధకారాన్ని పటాపంచలు చేస్తుంది.

శ్రీహరి! సజ్జనులను అనుగ్రహించేందుకు ఎత్తే ఎన్నో అవతారాలకు మూలరూపమైనది నీ స్వరూపం. అది శుభంకరం. నీ నాఖికమలంనుండి.

జగత్తును పవిత్రం చేయు జనార్దనా! మిక్కిలి మనోజ్ఞమై, స్వయంప్రకాశకమైన నీ రూపం నాకు జన్మించడానికి ముందుగానే పూర్తిగా దర్శించే అవకాశం లభించింది.

అంతేకాక, నీ రూపం జ్ఞానం, ఆనందం పరిపూర్ణంగా కలిగినది. ఎల్లపుడూ (శాశ్వతంగా) ప్రకాశించేది. ఎటువంటి భేదం లేనిది. విశ్వసృష్టికి కారణమైనది. ప్రపంచంకంటె భిన్నమైన లక్షణం కలది. పంచభూతాలైన పృథివ్యప్తేజోవాయ్వాకాశాలు, వాటి విషయాలైన గంధ, రస, రూప, స్పర్శ, శబ్దాలు కలిగినది. అయినా పొడగానలేనిది. అటువంటి శరీరాన్ని ధరించిన నిన్ను ఆశ్రయిస్తాను.

అంతే కాదు, పుట్టుకతోటే మంగళస్వరూపుడవు నీవు. నిన్ను ఆరాధించే మాకు శుభాలు కలుగుటకై మేము ధ్యానం చేయగా నీ దివ్యమంగళరూప దర్శనాన్ని మాకు అనుగ్రహించావు. ఎవరైతే నరకానికి పోదలంచి, దేవుడు లేడంటూ వాదించి, కువిమర్శలు చేస్తుంటారో అటువంటి భాగ్యహీనులను నీవు ఆదరించవు.

అంతే కాక, సార్ధకజన్ములైన కొంతమంది మహనీయులు వేదమనే గాలిచేత తీసుకురాబడిన నీ పాదపద్మాల సుగంధాన్ని వారి వారి చెవిగోళాలద్వారా గ్రహిస్తారు. వారి హృదయపద్మాలలో ఉన్న భక్తిపారవశ్యంచేత వారిచే స్వీకరించబడిన పాదారవిందాలు కలిగినవాడవై సాక్షాత్కరిస్తావు. శరీరులకు ధనం, ఇల్లు, స్నేహితులు మొదలైనవాటివల్ల ఏర్పడే భయం, అవి దూరం కావడంవల్ల ఏర్పడే దుఃఖం, వస్తువులపై కోరిక, వాటివలన ఏర్పడే పరాభవం, ధనాదులయందు ఆశ, వాటిని సంపాదించుటలో ఏర్పడే కష్టంవలన కలిగే ఆర్తి అందువల్ల అనవసరమైన కోపం, నీ దివ్యపాదాలపై అనురక్తి లేకపోవుట ఎంత కాలమో అంత కాలం ధనాదులు మాత్రమే  లభ్యమవుతాయి. కాని సర్వేశ్వరుడవైన నిన్ను ఆశ్రయిస్తే భయరహితమైన మోక్షం లభిస్తుంది.

ఇంకా కొంత మంది సమస్తపాపాలనూ పోగొట్టె నీ నామస్మరణ, నీ గుణకీర్తనం వంటి వాటియందు వైముఖ్యంతో, కోరికలు తీర్చే కర్మలయందు ప్రావీణ్యం పొంది, మందబుద్దులై ఇంద్రియచాపల్యంతో చెయ్యకూడని పనులు చేస్తుంటారు. అందువల్ల వాతపిత్తకఫాదులకు మూలమైన ఆకలి దప్పికలతోను; చలి, వేడి, వాన, గాలి మొదలైన వాటివలన ఏర్పడే దుఃఖాలతో అతిదీర్ఘమైన కోరికలనే అగ్నితోను, ఎడతెగని కోపంతోను తపించిపోతుంటారు.

అటువంటి మందబుద్ధులను చూస్తే నా మనస్సు వికలమవుతుంది. జీవుడు నీ మాయచేత భ్రాంతచిత్తుడై శరీరం వేరు, ఆత్మ వేరని తెలిసేంతవరకూ నిష్ప్రయోజనమూ, తరింపశక్యంకానిదీ అయిన సంసారసాగరాన్ని దాటలేకపోతాడు. గొప్ప మునీశ్వరులైనా నీ నామస్మరణ మరచిపోయి ఇతర విషయాలలో ఆసక్తిని చూపిస్తే అటువంటివారు పగటివేళ పనికిరాని పనులలో నిమగ్నమై, రాత్రులు నిద్రావశులై కలలో కనిపించే రకరకాల సంపదతో ఆనందిస్తూ, శరీరంలో వచ్చే మార్పులకు, పీడలకు బాధపడుతుంటారు. వారు చేసే అన్ని ప్రయత్నాలూ వ్యర్థమై, భూలోకంలో సంసారులుగా జీవిస్తారు. ఎటువంటి కోరికలూ లేకుండా కేవల ధర్మపరాయణులై నిన్ను సేవిస్తూ ఉండే సజ్జనుల చెవులద్వారా ప్రవేశించి నీ భక్తియోగంచేత పరిశోధింపబడిన హృదయపద్మం దుద్దుపై నీవు నివాసముంటావు. అంతే కాక.

శ్రీహరీ! యోగీంద్రులు యోగమార్గంలో ఏ రకమైన నీ మనోహర రూపాన్ని నీ గుణగణాలను ధ్యానిస్తారో వారిని అనుగ్రహించేందుకు పరమోత్సాహంతో అటువంటి రూపాన్నే ధరించి వారికి సాక్షాత్కరిస్తావు కదా!

దేవా! పరికించి చూస్తే నిష్కాములైన భక్తులను అనుగ్రహించినట్లుగా సకాములైన దేవతలను కూడా నీవు అనుగ్రహించవు.

దేవదేవా! అన్ని జీవరాసులలోనూ ఒకేరూపంతో ప్రకాశిస్తావు. అయినా నీయందు అనురాగం కలవారికే నీవూ అనుకూలంగా వ్యవహరిస్తావు. చెడ్డవారికి నీ దర్శనం సాధ్యం కాదు. సర్వభూతదయ కలవారికే నీవు సాక్షాత్కరిస్తావు.

రాక్షసవైరీ! దేవగణశిరోభూషణమా! శ్రీహరీ! మనస్సును పూర్తిగా నీ పాదపద్మయుగళిపై ఉంచి సకల కార్యాలూ నీ సేవగానే భావించే భక్తుని ఆదరించినట్లుగా యాగాలు, తీవ్రతపస్సులు, సమాధ్యవస్థలు, జపాలు, కర్మకాండలు, అగ్నికార్యాలు, రకరకాల వ్రతాలు చేసేవారిని కూడా ఆదరింపవు.

శ్రీహరీ! నీ రూపం శాశ్వతమైనది. దానికి గల చేతనాశక్తితో అందరి రాగద్వేషాది భేదభావాలు, అసత్తును సత్తుగాను, సత్తును అసత్తుగాను భావించే భ్రాంతి పోతుంది. సంపూర్ణజ్ఞానానికి ఆధారమైన నీకు ఇష్టంతో నమస్కరిస్తున్నాను.

పుణ్యాత్ముడవైన శ్రీహరీ! సృష్టిస్థితిలయాలు మూడింటికీ మూలకారణం మాయ. దానిని నీ అధీనంలో ఉంచుకొని జగన్నాటకమాడే నీకు నేను నమస్కారాలర్పిస్తున్నాను.

పుణ్యాత్ముడవు, సచ్చరిత్ర కలవాడవు, దివ్యమంగళ విగ్రహుడవు, నిత్యలక్ష్మీ విహారుడవు, భక్తులపాలిటి కల్పవృక్షంవంటివాడవు, దుస్తరమైన సంసారభయాన్ని పోగొట్టేవాడవు, జననరహితుడవు అయిన శ్రీహరీ! ఏ నీ అవతారాల గుణకర్మల అనుకరణకు మూలహేతువులైన రామకృష్ణాది నామాలను అంత్యకాలంలో సంస్మరించిన మనుజులు జన్మజన్మాంతరాలలో చేసిన పాపాలను పోగొట్టుకొని కైవల్యాన్ని పొందుతుంటారో అటువంటి నీకు నమస్కరించుచున్నాను.

(కర్మలు మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రారబ్ధం. అనగా శరీరాన్ని పొందేందుకు ఉపకరించేది. రెండు సంచితం. అనగా ప్రోగుచేసికొని ఉంచుకొన్న కర్మ. మూడు ఆగామి. రానున్న కాలంలో లేదా జన్మలలో అనుభవించుటకు దాచి ఉంచబడింది.)

శ్రీహరీ! విశ్వమనే మహావృక్షానికి నేను, నీవు, శివుడు మూడు ప్రధానమైన కొమ్మలు. పదునలుగురు మనువులు, మరీచి మొదలైన దేవతలు దానికి చిరుకొమ్మలు. నీ ఆత్మయే దానికి మూలం. ఈ విధంగా జగద్వృక్షాకృతిని ధరించిన నీకు ఇదే నా నమస్కారం.

పురుషోత్తమా! ఎవరైతే నీ పాదాలను సేవించుటలో ఆసక్తిని కనబరచరో అటువంటి మూఢులు జంతుసమానులు. మనుష్యులలో అధములు. తిరుగులేని కాలం వారిని ముదుసలితనంతోను, మరణంతోను నశింపజేస్తుంది. అటువంటి కాలమే స్వరూపంగా కల నీకు ఆనందంగా మనస్సులో నమస్కరిస్తాను.

సర్వేశ్వరుడా! ప్రళయకాలంలో కూడా చెక్కు చెదరక నిలిచే పద్మంలో జన్మించిన నేను నా జన్మకు కారకుడవైన నిన్ను దర్శించాలని ఎన్నో ఏళ్లు తపస్సు చేశాను. యజ్ఞాలూ, యాగాలూ చేశాను. అయినా నిన్ను దర్శించలేక భయపడిన నేను బుద్ధితో ఆలోచించి హృదయపద్మంలోకి దృష్టి సారించాను. అక్కడ అవ్యాజమైన దయతో నాకు నీ దర్శనాన్ని అనుగ్రహించావు. ప్రసన్నమైన, సుకుమారమైన మోముతామరతో కూడిన నీ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించగలిగాను. భక్తుల ఆర్తిని పోగొట్టే దేవా! విశ్వంభరుడా! నీకు నమస్కారం.

శ్రీహరీ! నీవు భక్తులను పోషించి ఆనందిస్తావు. పురుషోత్తముడవు. దివ్యమంగళాకారుడవు. సంసారభయాన్ని పోగొట్టేవాడవు. పశువులు, పక్షులు, మనుష్యులు అని లేకుండా స్వీయసంకల్పంతో ఏ రూపాన్నైనా ధరిస్తావు. దివ్యమంగళాకారుడవై ధర్మానికి వంతెనగా ప్రశస్తిని పొందావు. ఇంద్రియలోలుడవుకాక శాశ్వతానందానుభవంతో ఉంటూ పురుషోత్తముడనే పేరు తెచ్చుకొన్నావు. అటువంటి నిన్ను కొనియాడుతుంటాను. కోరికతో నీ పాదాలను ఆశ్రయిస్తాను. పూర్ణభక్తితో నీకు నమస్కరిస్తాను.

తెలదామరలవంటి కన్నులు కల శ్రీహరీ! పంచభూతాలతో కూడిన ఈ ప్రపంచాన్ని మాయకు లోనుకానీకుండా నీ గర్భంలో దాచుకొని భయంకరమైన తరంగాలతో కూడిన సముద్రమధ్యంలో శేషశయ్యపై యోగనిద్రలోనికి జారుకొని; కొంతకాలం తరువాత మహావైభవంతో ప్రకాశిస్తూ అసాధారణమైన నీ నాభికమలంనుండి ముల్లోకాలను, అందులోని జీవులు బతికేందుకు కావలసిన ప్రకృతి సాధనాలతోపాటుగా తిరిగి సృష్టిస్తావు.

(ఆషాఢ శుద్ధ ఏకాదశినాడు శ్రీమహావిష్ణువు యోగనిద్రలోనికి జారుకొంటాడు. తిరిగి కార్తిక శుద్ధ ఏకాదశినాడు మేలుకొంటాడు. నిద్రలోనికి వెళ్లే ఏకాదశిని 'శయన ఏకాదశి' అని, మేల్మొనే ఏకాదశిని 'ఉత్థాన ఏకాదశి' అని వ్యవహరిస్తారు. ఈ నాలుగు మాసాలకాలం సన్వ్యాసాశ్రమవాసులు చాతుర్మాస్యదీక్షలో ఉంటారు.)

వేదాలచే కొనియాడబడే శ్రీపతీ! సర్వాంతర్యామివై తగిన విధంగా నీ ప్రభుత్వాన్ని చూపుతూ అన్ని జీవులకూ సాటిలేని సుఖాల అనుభవాలను అందిస్తావు కదా!

తామరలవంటి కన్నులు కలిగి, వేదాలచే పొగడబడుతూ, మిక్కిలి దయగలవాడవై, దేవతలకు చక్రవర్తివై, వరదుడవైన శ్రీహరీ! ఎటువంటి విశేష జ్ఞానబలంతో నీవు ఈ లోకాలను సృష్టిస్తున్నావో అటువంటి జ్ఞానాన్ని నాకు ప్రసాదించు. నేను సృష్టికార్యక్రమం చేసేందుకు ఉత్సాహపడుతున్నాను. అయితే జగన్నిర్మాణ విషయంలో చేసే పనులలో ఏవో ఎక్కువ తక్కువలు ఉంటాయి. దానివలన ఎటువంటి పాపమూ నన్నంటకుండా ఉండే ఉపాయాన్ని కూడా నాకు అనుగ్రహించాలి. ఆ విధంగా సంకల్పసిద్ధిని నాకు ప్రసాదించు.

భక్తుల కోరికలను తీర్చే స్వామీ! నీ గర్భంనుండి కమలం జనించింది. అందులో ఉంటున్న నేను నీ అంశతో ఒప్పే జగత్తును పూనికతో నిర్మించాలనుకొంటున్నాను. అలా నిర్మించే సమయంలో నేను బహువిధాలుగా చేసే వేదనాదాలు మంగళకరాలై ఫలించేవిధంగా నన్ను అనుగ్రహించు.

జగన్నిర్మాణం చెయ్యాలన్న ఆసక్తితో ఉన్న నన్ను కాపాడటానికి, పద్మాలవంటి అందమైన కన్నులతో ప్రత్యక్షమైన శ్రీమహావిష్ణువు దయతో ఎల్లప్పుడు నా దుఃఖాన్ని పోగొట్టుగాక అని బ్రహ్మ కరుణ ఉట్టిపడేటట్లుగా, సవినయంగా సాగిలపడి నమస్కారం చేశాడు.

శ్రీహరికి వినయంతో నమస్కరించి బ్రహ్మ ఎంతో ఆనందించాడని మైత్రేయ మహర్షి విదురునికి స్పష్టంగా, వినయంగా వివరించి, ఇంకా ఇలా చెపుతున్నాడు.

పద్మసంభవుడైన బ్రహ్మ కేవలం తపస్సునందే ఆసక్తి కలవాడై వారిజాక్షుడు, గోపాలుడు, అనంతుడు, గొప్పవాడు అయిన శ్రీహరిని తన మాటల పాటవంతో స్తుతించాడు. దేవతాస్తుతులందుకొనే హరి అప్పుడు అనుగ్రహించి, సకల జగన్నిర్మాణ దృష్టితో మహాప్రళయ హేతువైన జలరాశిని క్షణంలో చూచాడు.

(గోవిందుడు అంటే ఆవులను కాచేవాడు అనే కాదు. గోశబ్దానికి వాక్కు అని కూడా అర్థం. ఆదివాక్కులైన వేదాలను రక్షించే శ్రీహరి అని అర్థం.)

అలా మహాజలరాశిని చూచి, ఆ తరువాత సృష్టి నిర్మాణం ఎలా చేయాలా అని పరితపిస్తున్న బ్రహ్మాదేవుని కోర్కె తీర్చాలని భావించి, అతని మోహం పోయేవిధంగా అమృతంవంటి తియ్యని మాటలను పలికాడు శ్రీహరి.

పద్మసంభవా! నీవు చేయాల్సిన పని మాని విచారంలో మునిగిపోకు. నా లీలలో ప్రధానమైనది జగన్నిర్మాణం. అందుకోసం నీవు సృష్టి చేయటానికి సంబంధించిన ఆలోచనను హృదయంలో స్థిరంగా నిలుపుకో. నీ తపస్సుతో, సమాధితో, నిష్ఠతో, సంకీర్తనంతో, భక్తితో నన్ను ప్రసన్నుని చేసుకో. నీ జగన్నిర్మాణవాంఛ నెరవేరుతుంది.

లోకులందరిచే కొనియాడదగిన పద్మసంభవా! తపస్సుతోను, విద్యావైభవంతోను మాత్రమే చేయగలిగిన జగన్నిర్మాణాన్ని ప్రారంభించు. నీవు సృష్టించిన అన్ని లోకాలలోను నన్ను దర్శింపగలవు.

లోకస్తుత్యుడవైన బ్రహ్మదేవా! నాలో బీజరూపంగా ఉండే జీవకోటులన్నిటినీ తప్పకుండ నీవు దర్శింపగలవు. కొయ్యలో దాగియున్న అగ్నివలె నాలో దాగియున్న జీవకోటిని ఇదిగో ఇప్పుడు వీక్షించు.

పద్మసంభవా! ప్రాణికోటి సమస్తంలోను నేనుంటాను. ఆ విషయం గుర్తెరిగి నన్ను సేవించు. అందువలన సృష్టికార్యంలో అనుకోకుండగా ఏర్పడే దోషాలు పోతాయి. ఇంద్రియ వశమై ఉన్న శరీరాలలో ఉన్నా పరిశుద్ధంగానే ఉండే జీవాత్మనూ, స్వచ్చమైన అంతరాత్మ గల నన్ను (పరమాత్మను) ఒకే రీతిగా చూచేవాడు మోక్షాన్ని పొందుతాడు. ఈ బ్రహ్మాండంలో ప్రాణులుచేసే కర్మలు పెక్కుగతులుగా ఉంటాయి. వాటికి తగినట్లుగా రకరకాల శరీరాలతో ప్రాణులు పుడుతుంటాయి. ఆ విధంగా కర్మానుగుణంగా నీవు సృష్టిస్తున్నపుడు నా పాదపద్మాలయందే దృష్టిని నిలుపుతావు కనుక రజోగుణసంబంధమయిన పాపము నిన్నంటదు.

సృష్టికర్తవగుటచే లోకంలోని తండ్రులందరికీ తండ్రివైన పితామహా! ఇంకా చెపుతున్నాను విను. నేను జీవులకు అగోచరుడను. ఏ పాపమూ అంటనివాడను. మిక్కిలి తేజోవంతుడను. సర్వేశ్వరుడను. అటువంటి నేను నీకు సాక్షాత్కరించాను. దర్శిస్తున్నావు గదా!

అంతే కాదు. పంచభూతాలకు, పది ఇంద్రియాలకు, సత్త్వరజస్తమోగుణాలకు నేనే ఆత్మనని, విశ్వమయుడనని, నన్నుగూర్చి నీ మనస్సులో భావించు. ఏ రూపం చూడాలని ఆనాడు ఈ తామరపద్మం తూడుగుండా కిందికి వెళ్ళి, అక్కడి నీళ్లల్లో వెదికావో (ఆ నా రూపాన్ని నీవిప్పుడు దర్శిస్తున్నావు).

నా రూపరమ్యత్వం దేవతలకు గాని, వేయి తలలున్న ఆదిశేషునికి గాని, సర్వజ్ఞుడైన పరమేశ్వరునికి గాని మాటలకందనిది. మనస్సుకు తోచనిది. అటువంటి రూపాన్ని నీవిప్పుడు దర్శించావు.

పద్మసంభవా! నా చరిత్ర కథతో వెలుగొందే నీవు చేసిన గొప్ప స్తుతి పరమ పవిత్రమైనదై లోకాన్ని పవిత్రం చేస్తుంది. అన్ని సందేహాలనూ విడిచిపెట్టి ఈ స్తుతిని బుద్ధియందు జాగ్రత్తగా నిలుపుకో.

సరోజసంభవా! నేను గుణాతీతుడనై ఏదో వినోదం కొరకు లోకాలను నిర్మించేందుకు ఆలోచించే నైపుణ్యం కలవాడను. అటువంటి నన్ను సగుణపరబ్రహ్మగా తగిన విధంగా కీర్తించావు. నాకు చాల సంతోషం కలిగింది.

విశేషమైన బుద్ధికలవాడా! నీవు చేసిన ఈ మనోహరమహాస్తోత్రాన్ని చింతలన్నిటినీ పక్కన పెట్టి, భక్తితో హృదయంలో నిలుపుకో. దానివలన నీ మనస్సులో కోరుకొన్న కోరికలన్నీ తీరుతాయి సుమా.

ఈ త్రిభువనపావనమైన మంగళస్తోత్రాన్ని ఎవరైతే నిత్యం చదవడం కాని, ఆలకించడం కాని చేస్తారో, అటువంటి భక్తులకు కోరికలు తీరుస్తూ నేను దర్శనమిస్తాను.

గ్రామాలలో తోటలు నిర్మించినా, చెరువులు తవ్వించినా, పేద బ్రాహ్మణులకు వడుగు చేయించినా, పేదవారికి పెండ్లి జరిపించినా, దేవాలయాలు కట్టించినా, భూదానంవంటి వివిధ దానాలు చేసినా, జపం, తపస్సు, వ్రతం, యోగం, యాగం వంటివి చేసినా ఎటువంటి ఫలితం కలుగుతుందో అది నా స్తవం  ( 
ఆదినారాయణ స్తవం , బ్రహ్మకృత నారాయణస్తవం) వినుట, చదువుట వలన కలిగే ఫలానికి సమానం కాదు.

బ్రహ్మదేవా! నేను అన్ని జీవరాసులను సృష్టిస్తుంటాను. వాటిలో దాగి ఉంటాను. ప్రాణులకు ఇష్టమైన వస్తుసమూహంలో నేను ఇష్టమైన వస్తుసమూహంగా ఉంటాను. అటువంటి నన్ను ఇష్టంగా తలచుకో.

జగన్నిర్మాణకారణుడవైన బ్రహ్మదేవా! నన్ను సర్వాంతర్యామిగా భావించు. నా ఆనందంకోసం నీకు జన్మనిచ్చాను. నా గర్భంలో లోకాలున్నాయి. కాని అణగి, ఒకే ముద్దగా ఎటువంటి చైతన్యమూ లేకుండా పడి ఉన్నాయి. వాటికి నీవు బాహిరమైన జన్మనివ్వాలి.

పుణ్యాత్ముడవైన విదురా! తగిన విధంగా అహంకార రూపమైన మొదటి స్థితిని పొంది ప్రాణికోటిని సృజించుమని బ్రహ్మకు ఆదేశాన్నిచ్చి, పుట్టుకయే లేని ఆ శ్రీమన్నారాయణుడు అంతలో అదృశ్యమయ్యాడని మైత్రేయమహర్షి చెప్పాడు.

(అహంకారం అనగా మనం అనుకొనే గర్వం కాదు. మనోబుద్ధి చిత్తాహంకారాలలోనిది. మహత్తత్త్వంవల్ల పుట్టి పంచతన్మాత్రలకు కారణభూతమైన తత్త్వభేదం.

మైత్రేయ మహర్షి ఆ విధంగా విషయాన్ని విస్తరించగా విదురుడు చాల ఆనందపడి, ఇంకా ఇలా అడుగుతున్నాడు. జనవందనీయా! శ్రీమన్నారాయణుడు సృష్టికార్యానికి పూనుకొమ్మని బ్రహ్మను ఆదేశించి, ఆ పద్మభవుడు అంతర్హితుడయ్యాడు.

శరీరసంబంధంతో ముడిపడిన మానవసంబంధం కల ఈ సృష్టిని బ్రహ్మ ఎలా చేశాడో చక్కని ఆలోచనా శక్తిగల మహార్షీ! కరుణాసముద్రుడవై అదంతా ఆహ్లాదకరంగా నాకు తెలియజేయుమని విదురుడు మైత్రేయుని ప్రార్ధించాడు.

విదురుని ప్రార్ధనమేరకు మైత్రేయమహర్షి ఇలా చెపుతున్నాడు. విదురా! శ్రీమన్నారాయణుని వరదాన ప్రభావంతో బ్రహ్మ నూరు దివ్యసంవత్సరాలు భగవంతునిగూర్చి తపస్సు చేశాడు. ఆ సమయంలో వాయువు గట్టిగా వీచింది. దానివలన తన నివాసస్థానమైన పద్మం కదిలిపోయింది. తన చుట్టూ ఉన్న నీళ్లుకూడా కదిలిపోతున్నాయి. వెంటనే తన తపశ్శక్తివల్ల తనకు లభించిన విద్యాబలంతో పద్మసంభవుడు వాయువును వీచకుండా చేశాడు. మొత్తం నీరంతా ఒక్క గుక్కలో తాగేశాడు. కాని అంతలోనే ఆకాశంలో వ్యాపించే నీటిని చూచాడు.

మొత్తం నీటిని తాగేసినా మళ్లీ ఆకాశంలో నీరు కనిపించే సరికి విషయం అర్ధంకాని బ్రహ్మ మళ్లీ వెంటనే మనసులో- రాక్షసులను సంహరించేవాడు, నీటిలో విహరించేవాడు, అందమైన హారాలు ధరించేవాడు, దేవతల నమస్మారాలు అందుకొనేవాడు, లక్ష్మీమానసచోరుడు, ఉదారగుణసంపన్నుడు, సంసారదుఃఖాన్ని దూరం చేసేవాడు, సంసారబంధాన్ని తెంచేవాడు, పండితులచే నిత్యనూతనంగా స్తుతింపబడేవాడు, పాపాలను పటాపంచలు చేసేవాడు అయిన శ్రీహరిని ధ్యానం చేశాడు.

బ్రహ్మ శ్రీహరిని ఆ విధంగా స్తుతించాడు. ఆ తరువాత పద్మంలో పుట్టిన తాను ఆకాశంలో మరొక పద్మాన్ని దర్శించాడు. ఆ పద్మంలో దాగివున్న అన్ని లోకాలనూ గమనించాడు. తాను హరిచే సృష్టిని బహిర్గతం చేసేందుకు నియమింపబడినవానిగా గ్రహించాడు.

తాను శ్రీహరిచే ఏ కార్యానికి నియమితుడయ్యాడో అర్థం చేసుకొన్నాడు బ్రహ్మ. ముందుగా ఆకాశంలోని పద్మంలోనికి ప్రవేశించి, అందులో గూఢంగా ఉన్న ముల్లోకాలనూ దర్శించాడు. తరువాత తపస్సువలన తనకు ఏర్పడిన మహిమతో చక్కగా పదునాలుగు లోకాలను సృష్టించాడు.

బ్రహ్మ తన ప్రతిఫలాపేక్షరహితమైన ధర్మకృత్యానికి సిద్ధించిన ఫలరూపంగా దేవతలు, పశుపక్ష్యాదులు, మానవులు, చెట్లు, కొండలు, నదులు మొదలైన అనేకమైన స్థావరాలతో కూడిన గొప్ప జగత్తును నిర్మించాడు.

ఈ విధంగా చతుర్దశభువనాలను బ్రహ్మ సృష్టించాడని మైత్రేయుడు విదురునకు తెలియజేశాడు.

పాపాలనే కొండలను చీల్చివేయడంలో వజ్రాయుధం అయినవాడైన విదురుడు మైత్రేయమహర్షిని చూచి, మనసులో ఎంతో ఆనందం కలిగి ఏ మాత్రమూ అంతుచిక్కని శ్రీమహావిష్ణువు మహిమవల్లనే గదా చతుర్దశ భువనాలూ ఏర్పడ్డాయి అని అన్నాడు.

వివకవంతమైన నడివడిక గల మహర్షీ! శ్రీమన్నారాయణుని మహిమవల్లనే ఈ పదునాలుగు లోకాలూ ఏర్పడ్డాయి కదా! వాని కాలస్వరూపం ఎలా ఉంటుందో, ముఖ్యమైన వాని గుణగణాలు ఏమిటో వాత్సల్యంతో నాకు తెలియజేయుమనగా మైత్రేయమహర్షి విదురునితో ఇలా అన్నాడు.

సదాచారసంపన్నుడవైన విదురా! మొదలు, తుది అంటూ లేని ప్రపంచ తత్త్వం ఒకటుంది. అదే సృష్టికి మూలకారణం. 24 గుణాలు, 10 ఇంద్రియాలు, మహత్తు, పంచభూతాలు, పరమాత్మను ఆశ్రయించాయి. ఆయన సమయానుకూలంగా వాటిని స్వీకరించి, తనను తానే సృష్టించుకొన్నాడు. లోకాలన్నిటిలో పరమాత్మ ఉంటాడు. పరమాత్మలో విశ్వమంతా అంతర్లీనంగా ఉంటుంది. కాబట్టి ప్రపంచానికి కారణమూ, కార్యమూ రెండూ నారాయణుడే. ఆ పరమపురుషుని తనువునుండి విడివడి ప్రత్యేకంగా ఈ జగత్తు ఏర్పడింది. ఇది ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రపంచమని మైత్రేయుడు చెప్పాడు.
(రూపం, రసం, గంధం, స్పర్శ, సంఖ్య, పరిణామం, పృథక్త్వం(విడివడుట), సంయోగం(కలియుట), విభాగం, పరత్వం, అపరత్వం, గురుత్వం, ద్రవత్వం, స్నేహం, శబ్దం, బుద్ధి, సుఖం, దుఃఖం, ఇచ్చ (కోరిక), ద్వేషం, ప్రయత్నం, ధర్మం, అధర్మం, సంస్కారం అనేవి 24 గుణాలని తర్మశాస్త్రం.)

విదురా! ఆ నారాయణుని మాయవలన ఈ ప్రపంచమంతా అలా ఏర్పడింది. ఇంతకుముందు కూడా అలాగే ఏర్పడింది. ఇక పైన కూడా అలాగే ఏర్పడుతుంది. ఎప్పటికప్పుడు పరమాత్మ మాయతోనే ఈ జగత్తు పుడుతుంటుంది. పెరుగుతుంటుంది, తిరిగి నశించిపోతుంటుంది.

అటువంటి సృష్టి తొమ్మిది రకాలుగా ఉంటుంది. వాటిలో ప్రాకృత వైకృతాలు, కాలద్రవ్యగుణాలనే మూడు రకాల భేదంతో పరస్పరం కలుస్తుంటాయి. వాటిలో మహత్తత్త్వం మొదటి సృష్టి. అది నారాయణుని సన్నిధానంలో గుణవైషమ్యాన్ని పొందుతుంటుంది. ద్రవ్యం ఙ్ఞానం క్రియ అనే మూడింటితోకూడిన అహంకార తత్త్వం రెండవ సృష్టి, శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనే పంచతన్మాత్రల శక్తితో కూడిన నింగి, గాలి, నిప్పు, నీరు, నేల అనే పంచభూతాలు మూడవ సృష్టి జ్ఞానేంద్రియాలైన కన్ను ముక్కు చెవి, నాలుక, చర్మం అనేవి, అలాగే కర్మేంద్రియాలైన నోరు, చేతులు, కాళ్లు, మలవిసర్దనావయవం, మూత్రవిసర్జనావయవం అనే పది ఇంద్రియాలు నాల్గవసృష్టి, సాత్త్వికాహంకారంవల్ల పుట్టే దేవతాగణం ఐదవసృష్టి. అది మనోమయంగా ఉంటుంది. ప్రాణుల బుద్ధిని మందగింపజేసే ఆవరణవిక్షేపాలతోకూడిన తామసం ఆరవది. ఈ ఆరును భగవంతుని లీలావిశేషాలతోకూడిన ప్రాకృతసృష్టులు.

ఏడునుండి వైకృత సృష్టులు. పూలు లేకుండా ఫలాలనిచ్చే రావి, మేడి, పనస, మట్టి మొదలైన వనస్పతులూ; పూయడం, ఫలించడం, వెంటనే నశించిపోవడం జరిగే వడ్లు, యవలు, పెసలు మొ
 ఓషధులూ; పైకి నిలబడి ఎదగలేని మాలతి, మల్లి మొ తీగలు; గట్టి బెరడు కలిగిన వెదుళ్లు, నేలలో గట్టి వేళ్లు కలిగి, నేలపై విస్తరించే దుబ్బులు, పొదలు; పుష్పించి ఫలాలనిచ్చే మామిడివంటి చెట్లు; ఇవన్నీ చైతన్యంతో పైకి ఎదుగుతూ తమోమయాలై లోపల స్పర్శజ్ఞానం కలిగికూడా కదలిపోలేనివి; ఈ ఆరునూ ఏడవ సృష్టి.

ఎనిమిదవ సృష్టి 28 భేదాలతో ఉంటుంది. మరునాటి ఆలోచన లేక తిండివంటివాటిపైనె దృష్టి కలిగి వాసనద్వారా అన్నిటినీ తెలిసికొంటూ ఏ ఆలోచనలూ లేకుండా చీలిన గిట్టలతో ఉండే ఎద్దు, ఎనుము, మేక, జింక, పంది, ఒంటె, గురుపోతు, దుప్పి, పొట్టేలు, ఈ తొమ్మిది; చీలని గిట్టలు గల గాడిద, గుఱ్ఱం, కంచరగాడిద, గౌరమృగం, శరభమృగం, చమరీమృగం, ఈ ఆరు; ఐదుగోళ్లుండే కుక్క నక్క తోడేలు, పులి, పిల్లి, కుందేలు, ఏదుపంది, సింహం, కోతి, ఏనుగు, తాబేలు, ఉడుము ఈ పన్నెండు; ఇవన్నీ నేలమీద తిరిగేవి. ఇవికాక మొసలివంటి జలచరాలు, రాబందు, గద్ద, కొంగ, డేగ, తెల్లపిట్ట, గబ్బిలం, నెమలి, హంస, బెగ్గురుపక్షి జక్కవపిట్ట, కాకి, గుడ్లగూబ మొ॥ గగనచరాలైన పక్షిజాతి ఇదంతా ఎనిమిదవ సృష్టి.

తొమ్మిదవదే మానవసృష్టి. ఈ జాతి రజోగుణప్రేరితమై కర్మనైపుణ్యంతో దుఃఖంలో కూడా సుఖాన్ని కోరుతుంది. ఈ మూడు వైకృతసృష్టులు.

దేవసర్గం ఎనిమిది రకాలుగా ఉంటుంది. విబుధులు, పితృదేవతలు, సురలు అని మూడు తెగలూ; గంధర్వులూ, అప్సరసలూ ఒక తెగ; యక్షులూ, రాక్షసులూ ఒక తెగ భూతప్రేతపిశాచాలు ఒక తెగ; సిద్ధచారణవిద్యాధరులు ఒక తెగ; కిన్నర, కింపురుషులు ఒకటి; ఈ ఎనిమిదీ కలిస్తే దేవసర్గం అవుతుంది. ఇలా బ్రహ్మ పదిరకాలైన సృష్టులను నిర్మించాడు.

ఇక మనువులూ, మన్వంతరాల విషయానికి వస్తే, కల్పారంభాలలో ఇదే విధంగా పరమాత్మ తనను తాను సృజించుకొంటూ, మొక్కవోని సంకల్పంతో రజోగుణంతో కూడినవాడై సృష్టికర్తయై తన స్వరూపమే అయిన జగత్తును కల్పించాడు. వాని మాయవలన ప్రాణులన్నీ నదులలో నదిసుడులలో పడి తిరిగే చెట్లలాగ భ్రమిస్తూ ఉంటాయి. ఇప్పుడున్నట్లే ప్రతి కల్పంలోను దేవతలు, రాక్షసులు, మానవులు మొదలైనవారు ఉంటారు.

కౌమారసర్గం దేవసర్గంలో ఒక భాగమే అయినా ప్రాకృత వైకృతముల రెండింటి స్వభావం కలిగి ఉంటుంది. అందులో దైవత్వ మనుష్యత్వాలు రెండూ కలిసి ఉంటాయి. అదే సనత్కుమారాది సర్గం. సంకల్పబలం కల పురుషోత్తముడు ఈ విధమైన భేదాలతో ఈ జగత్తును కల్పించాడు అని చెప్పి మైత్రేయుడు కాల లక్షణం తెలియజేయాలనుకొన్నవాడై ఈ విధంగా చెపుతున్నాడు.

పుణ్యాత్ముడవైన విదురా! భగవంతుడు చేసే సృష్టికార్యానికి అంతు లేదు. మరొక వస్తువుతో పనిలేదు. కుండ చేయాలంటే మన్ను కుమ్మరి, అలాగే బట్ట నేయాలంటే ప్రత్తి, నేతగాడు కావలసినట్లుగా జగన్నిర్మాణానికి పరమాత్మకు ఉపాదానకారణమో, నిమిత్తకారణమో అక్కరలేదు. తానే సమవాయకారణమై అనగా నిత్యసంబంధం కలవాడుగా ఉంటాడు. ఒక కిటికీగుండా సూర్యకాంతి పడుతుంటే అందులో ఎగురుతూ కనిపించే మట్టికణం ఎంత ఉంటుందో అందులో ఆరవ వంతును పరమాణువు అంటారు. ఆ పరమాణువును దాటేందుకు కాంతికి ఎంత సమయం పడుతుందో దానిని సూక్ష్మకాలం అంటారు. అది పన్నెండు రాసులు, సూర్యమండలంతో కూడిన జగత్తులో ప్రయాణించే ఏడాది కాలాన్ని మహత్కాలం అంటారు.

రెండు పరమాణువులు ఒక అణువు. అణువులు మూడు కలిస్తే త్రసరేణువు. అవి మూడైతే త్రుటి. నూరు త్రుటులు వేధ. వేధలు మూడైతే లవం. మూడు లవాలు నిమేషం. మూడు నిమేషాలు క్షణం. ఐదు క్షణాలు కాష్ట పది కాష్టలు లఘువు. పదునైదు లఘువులు నాడి. రెండు నాడులు ముహూర్తం. నాడులు ఆరు లేదా ఏడైతే మానవునకు ప్రహరం. దానినే యామం అంటారు. దినపరిమాణాన్ని తెలియజేసే నాడిని ఎలా కొలవాలో చెపుతాను విను. ఆరు పలాల రాగితో పాత్రను సిద్ధం చేసి, నాలుగు మినపగింజల బరువు గల బంగారంతో నాలుగు అంగుళాల పొడవైన కాడను తయారుచేసి, దానితో ఆ పాత్ర కింద రంధ్రం చేస్తే దానిగుండా తూమెడు నీరు పూర్తిగా కిందికి కారేందుకు ఎంతకాలం పడుతుందో ఆ కాలాన్ని నాడి అంటారు.

నాలుగు యామములైతే ఒక పగలు. అంతే కాలం ఒక రాత్రి. ఆ రెండూ కలిస్తే ఒక దినం. అవి పదునైదు కలిస్తే పక్షం. శుక్ల, కృష్ణ అనే రెండు పక్షాలు కలిస్తే మాసం. రెండు నెలలు ఒక ఋతువు. ఆరు నెలలు ఒక అయనం. ఉత్తర దక్షిణ అయనాలు రెండు కలిస్తే అనగా పన్నెండు నెలలు జరిగితే ఒక సంవత్సరం. ఆ సంవత్సరం దేవతలకు ఒక దినం. నూరు సంవత్సరాలు మానవులకు పరమాయువు.

కాలాత్ముడైన సూర్యుడు గ్రహ నక్షత్రాలతో తారలతోకూడినవాడై పరమాణువునుండి సంవత్సరంవరకూ పట్టే కాలంలో పన్నెండు రాసులనూ చుట్టివస్తాడు. సూర్యగమనంవల్ల సౌరమానం, చాంద్రమానం, నక్షత్రమానం అనే భేదాలతో ఏడాది కాలం ఏర్పడుతుంది. ఇది సంవత్సరం, పరీవత్సరం, ఇడావత్సరం, అనువత్సరం, వత్సరం అనే భేదాలు కలిగి ఉంటుంది. ఈ ఐదు వత్సరాలను ప్రవర్తింపజేసే సూర్యుడు విత్తనాలనుండి మొలకలు వచ్చినట్లు కాలరూపమైన స్వీయశక్తితో జీవసృప్టిని అనుకూలం చేసికొంటూ మానవులకు ఆయువు తరిగిపోతుంటుంది కనుక భోగాలపై కోరికలు తగ్గిస్తూ, కోరికలు కలవారికి యజ్ఞాలద్వారా స్వర్గాది ఫలాలను అందిస్తూ ఆకాశంలో సంచరిస్తుంటాడు. ఈ విధంగా ఐదు రకాలైన వత్సరాలను ప్రవర్తింపజేసే ఆదిత్యునకు నమస్కరించు అని మైత్రేయుడు విదురునకు చెప్పాడు.

మైత్రేయమహర్షీ! నీవు నాకు మానవులు, పితృదేవతలు, దేవతలు వారి వారి ఆయుర్దాయ వివరాలను తెలియజేశావు. అలాగే ముల్లోకాలను, వాటి పైనుండే లోకాలను సందర్శించే భాగ్యవంతుల వివరాలనుకూడా తెలియజేయుమని విదురుడు అడిగాడు.

మహర్షీ! యోగసిద్ధిద్వారా విశేష నేత్రశక్తి కలిగి అన్ని లోకాలను దర్శించగలిగిన మహానుభావుల కాలవిశేషాలనుగూర్చి నాకు తెలియజేయవలసిందని అడిగిన విదురుని వాత్సల్యపూర్వకంగా చూచి జ్ఞానియైన మైత్రేయుడు ఇలా పలుకసాగాడు.

పుణ్యాత్ముడా విదురా! చెపుతున్నాను విను. కృతయుగం పరిమాణం నాలుగువేల దివ్యసంవత్సరాలు. అది గడిచాక త్రేతాయుగం రావడానికి ఎనిమిది వందల ఏండ్లు పడుతుంది. త్రేతాయుగం మూడువేల దివ్యసంవత్సరాలు. తరువాత ద్వాపరం రావడానికి ఆరువందల ఏండ్లు పడుతుంది. ద్వాపరం రెండువేల దివ్యసంవత్సరాలుంటుంది. తరువాత కలియుగం వచ్చేందుకు నాలుగు వందల ఏండ్లు పడుతుంది. కలియుగం వేయి దివ్యసంవత్సరాలుంటుంది. మళ్లీ కృతయుగం వచ్చేందుకు రెండువందల ఏండ్లు పడుతుంది. యుగానికి యుగానికి మధ్యకాలాన్ని సంధ్యాకాలం అంటారు. యుగాలు నడిచేకాలంలో ధర్మం విస్తారంగా ఉంటుంది. యుగానికి యుగానికి మధ్యనున్న సంధ్యాకాలంలో ధర్మం స్వల్పంగా కనిపిస్తుంది.

ధర్మదేవత కృతయుగంలో నాలుగు పాదాలతో నడుస్తుంది. త్రేతాయుగంలో మూడు పాదాలతో నడుస్తుంది. ద్వాపరయుగంలో రెండు పాదాలతో నడుస్తుంది. కలియుగంలో ఒకే పాదంతో నడుస్తుంది. అందువలన 

కలియుగంలో ధర్మదేవత ఒకేపాదంతో ఉంటుంది. అందువలన మానవులు కట్టుబాటులను అతిక్రమించి ప్రవర్తిస్తుంటారు. ధర్మం తగ్గినంత మేరకు అధర్మం పుట్టి పెరుగుతుంటుంది. ఈ నేలపై బ్రాహ్మణులు పాపకర్మాచరణాలందు ఆసక్తులవుతుంటారు.

భూలోక, భువర్లోక, స్వర్గలోకాలకంటె పైన సత్యలోకం ఉంటుంది. ఆ లోకంలో బ్రహ్మదేవుడుంటాడు. నాలుగు మహాయుగాలు గడిస్తే ఆయనకు ఒక పగటిభాగం. మరో నాలుగు మహాయుగాలు గడిస్తే రాత్రిభాగం. బ్రహ్మ రాత్రివేళ నిద్రలోనికి జారుకొంటే అదే లయం. లోకాలన్నీ నశించిపోతాయి. తిరిగి మేలుకొని కన్ను తెరవగానే అవే లోకాలు మళ్లీ పుడుతుంటాయి. బ్రహ్మయొక్క పగటిభాగంలో ఏర్పడే లోకాలన్నిటినీ పరిపాలించేందుకు మనువులు పుడుతుంటారు. వారు పదునలుగురు. వారి వారి పరిపాలన కాలాన్ని మన్వంతరం అంటారు. ఒక్కొక్క మన్వంతరం డెబ్బదియొక్క మహాయుగాల కాలం ఉంటుంది. దేవతలు, మునులు, సప్తమహర్షులు భగవదంశతో జన్మించి మనువులై లోకాలను పరిపాలిస్తుంటారు.

శ్రీమహావిష్ణువు పదునాలుగు మన్వంతరాలలోనూ పితృదేవతలుగా, దేవతలుగా, పశుపక్ష్యాదులుగా, మానవులుగా తానే జన్మిస్తుంటాడు. తన ఆత్మశక్తితో ఈ లోకాలను నీతిమార్గంలో పరిపాలిస్తుంటాడు.

విదురా! తిర్యక్కుల, నరుల, పితృదేవతలకు సంబంధించిన సృష్టిని గురించి నీకు క్రమంగా చెప్పాను. పగటిభాగం పూర్తి కాగానే బ్రహ్మకున్న సృష్టినిర్మాణశక్తి అంతరించిపోతుంది. ఆ రాత్రి అతడు నిద్రలోకి జారుకొంటాడు.

బ్రహ్మ నిదురించిన రాత్రి సూర్యచంద్రులతో పాటుగా లోకాలన్నీ చీకటిలో కూరుకుపోతాయి. సర్వాత్ముడైన శ్రీహరియొక్క సంకర్షణమనే అగ్ని బయలుదేరి ముల్లోకాలనూ తపింపజేస్తుంది. ఆ వేడికి తట్టుకోలేక మహర్లోకవాసులంతా జనలోకానికి వెళ్లిపోతారు. అపుడు భయంకరమైన గాలులతో ఉవ్వెత్తున ఎగసిపడే అలలతో సముద్రం అన్ని లోకాలనూ ముంచివేస్తుంది. ఆ సముద్రమధ్యంలో శ్రీమహావిష్ణువు శయనించి ఉంటాడు.

అందమైన మంచిగంధం, వజ్రం, కర్పూరం, మంచు, హంస, పండువెన్నెల, తామరతూండ్ల హారం, నిండు చంద్రుడు, రెల్లుపూవు, మల్లిపూలచెండు - వీటిలాగ తెల్లని శరీరంతో సొగసులు చిందుతున్న ఆదిశేషునిపై సమస్త భువనాలు కడుపులో దాచుకొన్న హరి ప్రళయకాలంలో సముద్రంలో శయనించి ఉంటాడు.

జనలోకంలోనివారందరూ భక్తిగా ప్రార్ధిస్తూండగా సాటిలేని తేజస్సుతో కన్నులు మూసుకొని శేషశయ్యపై యోగనిద్రలో ఉంటాడు శ్రీమహావిష్ణువు.

ఈ విధంగా ఎన్నో రీతులుగా సాగే కాలగమనంలో రేయింబవళ్లు సాగిపోతుంటాయి. మానవునకు వందేళ్లు పూర్ణాయువైనట్లే బ్రహ్మకు నూరు దివ్యసంవత్సరాలు పూర్ణాయువు. అందులో మొదటి సగానికి పూర్వ పరార్థమని, రెండవ సగానికి ద్వితీయ పరార్ధమని పేరు. ఇప్పుడు మనం ద్వితీయ పరార్థంలో ఉన్నాం. పూర్వపరార్థకాలంలోనే బ్రహ్మ ఉదయిస్తాడు కనుక దానిని బ్రహ్మకల్పమని, శబ్దబ్రహ్మకల్పమని వ్యవహరిస్తారు.

పుణ్యాత్ముడవైన విదురా! విను. ఏనాడైతే శ్రీమహావిష్ణువుయొక్క నాభి అనే సరస్సునుండి లోకాశ్రయమైన మహాపద్మం ఆవిర్భవిస్తుందో, ఆ కాలం పద్మకల్పమనే పేరు కలిగి ఉంటుంది.

విదురా! పూర్వపరార్థం మొదటిదైన బ్రహ్మకల్పాన్ని గూర్చి విన్నావు గదా! ఇక ద్వితీయపరార్ధంగురించి విను. ఈ పరార్ధంలో శ్రీహరి ఎప్పుడైతే వరాహరూపాన్ని ధరిస్తాడో అది వరాహకల్పం అవుతుంది. ఇప్పుడు ఆ కల్పమే జరుగుతోంది.

నారాయణుడే కాలస్వరూపుడు. ఆయనకు ఆద్యంతాలు లేవు. లోకాలన్నిటికీ ఆయనే ఆత్మ. పరమాణువును దాటే కాలంనుండి యుగాల పరార్థాలు పూర్తయ్యేంతవరకూ పట్టె సమయం ఆ పరమాత్మకు ఒక్క నిమేషం. కాబట్టి భగవంతుడు కాలానికి కర్త అవుతాడు కాని కాలం ఆయనకు కర్త కాలేదు. అంతే కాదు. శరీరం, గృహం, సంపద ఇటువంటివాటియందు ఆసక్తి కలవారికి కాలం ఆశ్రయమై ఉంటుంది. భగవంతుడు అటువంటి కోరికలు లేనివాడు కనుక ఆయనే కర్తయై కాలాన్ని నడిపిస్తుంటాడు.

అంతే గాక ఈ బ్రహ్మాండమనే కోశం పదహారు రకాలైన రూపాలు కలిగి, నేల, నీరు, నిప్పు, గాలి, నింగి అనే పంచభూతాలతో కూడి, పది ఆవరణములు కలిగి ఏబదికోట్ల యోజనాల వైశాల్యం కలిగియుంటుంది.
(షోడశ వికారాలు : జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, ప్రాణాది వాయువులు 5, చిత్తం 1)

శ్రీహరి పరమాణుస్వరూపంతో ఆ బ్రహ్మాండంలో విరాజిల్లుతుంటాడు. లెక్కలేనన్ని బ్రహ్మాండాలన్నీ ఆయన గర్భంలోనే లీనమై ఉంటాయి. నవకమలదళాక్షుడైన నారాయణునికి అంతం లేదు. అన్నిటికీ తానే మొదలు. నాశంలేనివాడు. కారణాలన్నింటికి కారణమైనవాడు. పరిమితులు లేనివాడు.

విదురా! విశేషమైన తేజస్సుతో వెలుగులీనే నారాయణుడు పరమపురుషుడు. పురుషోత్తముడు. ఆ నారాయణుడు ఇట్టివాడు, అట్టివాడని వర్ణించడానికి బ్రహ్మకైనా, ఈశ్వరునికైనా సాధ్యమంటావా చెప్పు. (సాధ్యం కాదని అర్థం)

అలా పలికిన మైత్రేయుడు విదురుని చూచి మళ్లీ చెపుతున్నాడు. ఇంతవరకూ కాలస్వరూపుడైన నారాయణుని మహిమలను తెలియజేశాను. ఇక సృష్టియొక్క మహిమలను తెలియజేస్తాను విను.

బ్రహ్మ సృష్టికార్యానికి పూనుకొన్నాడు. వెంటనే నేను సృష్టిస్తున్నాను అనే అహంకారరూపంలో దేహాభిమానం కల మోహం పుట్టింది. అలాగే స్త్రీ సంగమం, మాలలు ధరించడం, చందనాదులు పూసుకోవడం మొదలైన గ్రామ్యభోగాలపై కోరికలు కల మహామోహం పుట్టింది. వీటితో మనోవ్యాకులత ఏర్పడింది. ఈ విధంగా అవిద్యాపంచకంతోకూడిన జీవులు ఏర్పడ్డారు. అటువంటివారిని పుట్టించి పాపం చేశాననే పశ్చాత్తాపం కలిగింది బ్రహ్మకు. వెంటనే భగవంతుని ధ్యానించాడు. ఆ ధ్యానమనే అమృతంతో పవిత్రం చేయబడ్డ మనసుకలవాడై మరికొందరిని సృష్టించాడు. వారే ఊర్ధ్వరేతస్కులు, పరమపవిత్రులు అయిన సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు. వారు మహాసత్త్వగుణ సంపన్నులు, ధీరజనశ్రేష్ఠులు, మాన్యులు. వారికి దివ్యదృష్టిని కూడా కల్పించాడు. మీ మీ అంశలతో ప్రజలను పుట్టించి ప్రపంచాన్ని వృద్ధి చేయండని అన్నాడు.

బ్రహ్మ పలుకులాలించిన సనకసనందనాది మునులు పరిహసించారు. మోక్షమే కోరుకొంటూ, నారాయణ పరాయణులైన వారు సృష్టికి ప్రతికూలంగా మాట్లాడారు. తన మాటను కాదన్నందుకు బ్రహ్మకు క్రోధం ఏర్పడింది. ఎంతో బలంగా తన కోపాన్ని నిగ్రహించుకొన్నాడు. అయినా ఆ సమయంలో ఆయన కనుబొమల నడుమనుండి క్రోధస్వరూపుడై సర్వదేవతలకు అన్నగారిగా నీలలోహితుడు జన్మించాడు. పుడుతూనే పెద్దగా ఆక్రందనం చేశాడు.

(నీలలోహితుడనగా శివుడు. బ్రహ్మ లలాటంనుండి రాలిన చెమటబిందువు అగ్నిలో పడి ముందు నీలంగా మారి తరువాత ఎర్రబడింది. అందుండి పుట్టినవాడు కనుక నీలలోహితుడు.

అవిద్యాపంచకం ; మోహం, మహామోహం, తామిస్రం, అంధతామిస్రం, చిత్తవిభ్రమం. ఇవియీ వచనంలో వివరణకు వచ్చాయి.

అప్పుడే పుట్టిన నీలలోహితుడు బ్రహ్మను చూచి, నా పేర్లేమిటి? నా నివాసస్థలాలేమిటి? దేవా! వెంటనే అవి నాకు తెలియచేయుము అని కోరాడు. అపుడు బ్రహ్మ వాత్సల్యంతో నాయనా! నీవు పుడుతూనే ఏడ్చావు.

రోదనం చేస్తూ పుట్టావు కనుక నీకు రుద్రుడనే పేరు వస్తుంది. ఇక నీవు నివాసముండేందుకు పదునొకండు స్థానాలను కల్పిస్తున్నాను. అవి చంద్రుడు, సూర్యుడు, అగ్ని, వాయువు, జలం, ఆకాశం, భూమి, ప్రాణాలు, తపస్సు, హృదయం, ఇంద్రియాలు.

ఇంకా మన్యువు, మనువు, మహాకాలుడు, మహత్తు, శివుడు, ఋతధ్వజుడు, ఉరురేతసుడు, భవుడు, కాలుడు, వామదేవుడు, ధృతవ్రతుడు, అని నీకు పదునొకండు పేర్లు ఉంటాయి. ధీ, వృత్తి, అశన, ఉమ, నియుత్‌, సర్పిస్సు, ఇల, అంబిక, ఇలావతి, సుధ, దీక్ష అనే పదకొండుమంది భార్యలుగా ఉంటారు. ఆయా పేర్లతో ఆయా భార్యలతో నివసిస్తూ, ప్రజలను సృష్టించుమని ఆజ్ఞాపించగా, భగవంతుడైన నీలలోహితుడు విశ్వగురుడైన బ్రహ్మచేత నియమింపబడినవాడై సాత్వికమైన రూపం, స్వభావాలలో తనతో సమానులైన ప్రజలను పుట్టించాడు.

అలా నీలలోహితుడు లోకప్రసిద్ధంగా పుట్టించిన రుద్రగణాలు అడ్డూ అదుపూ లేకుండా వేడివేడి చూపుల నిప్పులతో లోకాలను మాడ్చేస్తుంటే, ఆ భయంకరమైన ప్రమాదాన్ని గమనించి బ్రహ్మ వారిని పిలిచి, "నాయనలారా! మీ తీవ్రమైన చూపుల నిప్పుల వేడికి లోకాలన్నీ మాడిపోతున్నాయి" అన్నాడు.

బుద్ధిమంతులైన రుద్రగణములారా! వినండి. ఇంతవరకు మీరు చేసిన ప్రజాసృష్టి చాలు. ఇంక ధీరతతో మీ మనస్సును తపస్సుపై లగ్నం చేయండి. మీ అందరికీ నిశ్చయంగా చక్కని శుభాలు కలుగుతాయి.

సత్పురుషులు తపస్సుచేసి జ్ఞానం పొంది, ఆ జ్ఞానంతో భగవంతుడు, పురుషోత్తముడు, దయాసముద్రుడు, లక్ష్మీవల్లభుడు, మంచిగుణాలతో ప్రకాశించేవాడు, చ్యుతి లేనివాడు, పరాత్పరుడు, పరంజ్యోతిస్స్వరూపుడు, జగన్నాథుడు, సర్వాంతర్యామి, ఇంద్రియనిగ్రహం కలవాడు, ఆశ్రయించినవారిని రక్షించేవాడు, విశ్వాత్ముడు అయిన శ్రీమన్నారాయణుని దర్శిస్తారు.
అని చెప్పగా విని.

ఆ రుద్రగణాలు బ్రహ్మదేవుని ఆదేశాన్ని శిరసావహించి, రౌద్రాన్ని విడిచిపెట్టి, ధీరులై, అతిశయించిన చరిత్ర కలవారై తపస్సు చేసేందుకు అడవులకు వెళ్లారు. అప్పుడు బ్రహ్మ ప్రపంచ నిర్మాణముపై దృష్టి పెట్టి, బుద్ధిమంతులను, జనలోకంలో నివసించేవారికి ఆశయులు కాగలవారిని సృష్టించాడు.

విదురా! విను. భగవద్బలంతో కూడిన సద్గుణులు, లోకంలో సంతానం కలిగేందుకు హేతువులైనవారు, బ్రహ్మతో సమానమైన శక్తియుక్తులు కలవారు, గొప్ప యశోవంతులునైన పదిమంది కుమారులు పుట్టారు.

బ్రహ్మ బొటనవ్రేలినుండి దక్షుడు, తొడనుండి నారదుడు, బొడ్డునుండి పులహుడు, చెవులనుండి పులస్త్యుడు, చర్మంనుండి భృగువు, చేతినుండి క్రతువు, ముఖంనుండి అంగిరసుడు, ప్రాణంనుండి వసిష్ఠుడు, మనస్సునుండి మరీచి, కన్నులనుండి అత్రి ఇలా పదిమంది కుమారులు ఉదయించారు. ఇంకా కుడిస్తనంనుండి ధర్మం, వెన్నునుండి లోకభయంకరమైన మృత్యువూ, అధర్మమూ జన్మించాయి. ఆత్మనుండి మన్మథుడు పుట్టాడు. అంతే కాక.

బ్రహ్మాదేవుని కనుబొమలనుండి క్రోధం పుట్టింది. క్రింది పెదవినుండి లోభం పుట్టింది. ముఖంనుండి సరస్వతి ఆవిర్భవించింది. పురుషాంగంనుండి సముద్రాలు పుట్టాయి. అపానంనుండి పాపాశ్రయుడైన నిరృతి, నీడనుండి దేవహూతి, ఆమె భర్తయైన కర్దముడు ప్రభవించారు. తరువాత బ్రహ్మ తన దేహంనుండి పుట్టిన సరస్వతిపై మరులుగొన్నాడు. మన్మథభావాలకు లోనై ఆమెను జతగూడాలనుకొన్నాడు. ఆ పరిస్థితిని గమనించిన మరీచి మొదలైన మునిముఖ్యులు తమ తండ్రియైన బ్రహ్మను చూచి, ఇలా అన్నారు.

చాలు చాలు బ్రహ్మదేవా! మంచిమార్గాన్ని విడిచిపెట్టి, దుశ్శీలుడవై కుమార్తెతోనే జత గూడేందుకు ప్రయత్నించడం ధర్మపద్ధతియేనా? మూఢుడవైపోయావు. నీ న్యాయం, పెద్దరికం నేలపాలై శీలం పోయేలా ప్రవర్తిస్తున్నావు. ఇంతకుముందు ఎవరైనా ఇంతటి పాపానికి ఒడిగట్టినవారున్నారా?

బ్రహ్మదేవా! నీవు మహానుభావుడవు, ఎవరూ వేలెత్తి చూపలేని గొప్ప చరిత్ర కలవాడవు. కాని ఇటువంటి విషయాలలో బ్రహ్మదేవుడంతటివాడే కృత్యాకృత్యాలు తెలియక మన్మథబాధకు తట్టుకోలేక వావివరుసలుకూడా గణించకుండా తన కుమార్తెతోనే జతకట్టాడని లోకులు చెడదిట్టరా!

పాపకార్యమని ఆలోచించకుండా క్షణికసాఖ్యానికి లొంగిపోయావు. అవును. కామాంధుడు కళ్లున్నా చూడలేడనే ఆర్యోక్తి ఉందనే ఉన్నది కదా!

అలా మునీంద్రులు పలికిన నిష్టురాలు చెవులలో పడేసరికి బ్రహ్మ సిగ్గుతో తలదించుకొన్నాడు. ఇంక బ్రతుకెందుకని వెంటనే శరీరాన్ని విడిచిపెట్టేశాడు. అపుడా శరీరాన్ని దిక్కులు స్వీకరించాయి. అప్పుడు ఆ దిక్కులనుండి చీకటి, మంచు పుట్టాయి.

అటు పిమ్మట.

బ్రహ్మ అంతటితో మానుకోకుండా మళ్లీ మరొక శరీరాన్ని ధరించాడు. తిరిగి సృష్టి చేయాలనుకొన్నాడు. కానీ వెనుకటి సృష్టినిర్మాణ నైపుణ్యం లేకుండా పోయింది. ఇలా ఎందుకు జరిగిందా అని ఆలోచిస్తున్న సమయంలో బ్రహ్మ నాలుగు మోములనుండి నాలుగు వేదాలు ధర్మంతో కూడినవై సమగ్రరూపాలతో ఆవిర్భవించాయి.

ఇంకా ఆ నాలుగు మోములనుండి యజ్ఞాలు, వైదికకర్మలు, ఉభయార్థసాధకాలైన ఉపాయాలు, ఆచారాలు, బ్రహ్మచర్యాది ఆశ్రమాలు ఆవిర్భవించాయని చెప్పగా విని విదురుడు మైత్రేయమహర్షితో ఇలా అంటున్నాడు.

మహర్షీ! అప్పుడు బ్రహ్మ బుద్ధిమంతుడై తన నాలుగు మోములలో ఏ యే మోమునుండి ఏమేమి సృష్టించాడో ఆ విధానమంతా నాకు తెలిసేట్టుగా చెప్పు అని విదురుడు అడిగాడు.

విదురుడు అడిగినదానికి మైత్రేయుడు చెపుతున్నాడు. బ్రహ్మ నాలుగు మోములనుండి యజ్ఞానికి సంబంధించిన హోత, అధ్వర్యుడు, ఉద్గాత, బ్రహ్మ అనబడే ఋత్విక్కు వీరు పఠించాల్సిన, గానం చేయాల్సిన ప్రశంసాత్మక మంత్ర స్తోత్రాలు, ఇజ్య, స్తోమాలు, ప్రాయశ్చిత్తకాండ ఉద్భవించాయి. ఉపవేదాలలో ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వవేదం, విశ్వకర్మకు సంబంధించిన స్థాపత్యం (శిల్పవేదం) సంభవించాయి. పంచమవేదమయిన ఇతిహాసపురాణసముచ్చయం బ్రహ్మ నాలుగుమోములనుండి ఉత్పన్నమయింది. ఇంకా షోడశి, ఉక్థ్యం - చయనం, అగ్నిష్టోమం - ఆప్తోర్యామం, అతిరాత్రం, వాజపేయం, గోసవం అనే కర్మతంత్రాలు, ధర్మపాదాలైన విద్య, దానం, తపస్సు, సత్యం, బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్న్యాసాశ్రమం ఏర్పడ్డాయి. వీటికి ఒక్కొక్కదానికి నాలుగు రకాలైన వృత్తులుంటాయి. వాటిలో బ్రహ్మచర్యాన్ని పాటించడం సావిత్రం. ఉపనయనమైన నాటినుండి మూడు రోజులు గాయత్రి జపించటం ప్రాజాపత్యం. వేదవ్రతాలు అన్నీ ఏడాదిపాటు ఆచరించటం బ్రాహ్మం. వేదాభ్యాసానంతరం ఆచరించేది నైస్ఠికం. ఇలా బ్రహ్మచారి వృత్తులు నాలుగు రకాలు. అలాగే గృహస్థవృత్తులు నాలుగుంటాయి. వ్యవసాయం చేసి జీవించడాన్ని వార్త అంటారు. యజ్ఞయాగాలు చేసేందుకు కావలసిన సాధనాలను సంపాదించి కూడబెట్టడం సంచయం. ఎవరినీ నోరు తెరిచి అడుగకుండగా అయాచితంగా లభించినదానిని తినడం శాలీనం. పొలాలలో రాలిన ధాన్యపు గింజలను ఏరుకొని వాటిని రాళ్లపై నూరుకొని తినడం శిలోంఛం. ఈ నాలుగూ గృహస్థవృత్తులు. అలాగే వానప్రస్థులుకూడా నాలుగు రకాలు. దుంపలు త్రవ్వుకొని తినేవారు వైఖానసులు. కొత్తపంట వచ్చినపుడు పాతవాటిని తినకుండగా ఇతరులకు పంచిపెట్టేవారు వాలఖిల్యులు. ఉదయం నిద్రలేస్తూనే ఏ దిక్కును చూస్తారో అటే వెళ్లి అక్కడ లభించే పదార్థాలను తినేవారు ఔదుంబరులు. పండి నేలపై రాలినవాటిని మాత్రమే తినువారు ఫేనపులు. సన్యాసులు కూడా నాలుగు రకాలు. తన ఆశ్రమకర్మలను ఆచరించడమే ప్రధానంగా కలవాడు కుటీచకుడు. కర్మకంటె జ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చేవాడు బహూదుడు. కేవలం జ్ఞానసముపార్జనయందే నిష్ఠ కలిగి ఉండేవాడు హంసుడు. కర్మాచరణం, జ్ఞానసముపార్జాన రెండిటినీ విడిచిపెట్టి కేవలం పరమాత్మధ్యానంనందే నిమగ్నమయ్యెవాడు నిష్కాయుడు.

ఆత్మానాత్మ వివేకాన్ని కలిగించే అన్వీక్షకి, స్వర్గాది ఫలాలనిచ్చి కర్మవిద్యారూపమయిన త్రయి, జీవనోపకరణమై వ్యవసాయాధిరూపమైన వార్త, అర్ధసంపాదనమే ముఖ్యప్రయోజనమైన దండనీతి ఇవి వరుసగా మోక్షానికి, ధర్మానికి, కామానికి, అర్థానికి ఉపయోగపడే నాలుగు న్యాయాలు. 'భూః, భువః, సువః' అనే వ్యాహృతులు బ్రహ్మ తూర్పు మొదలుగా గల మోములనుండి ఆవిర్భవించాయి.

ఇంకా బ్రహ్మ హృదయాకాశంనుండి ప్రణవం పుట్టింది. వెండ్రుకలనుండి ఉష్ణిక్‌ ఛందస్సు, చర్మంనుండి గాయత్రీ ఛందస్సు, మాంసంనుండి త్రిష్టుప్‌ ఛందస్సు, స్నాయువునుండి అనుష్టుప్‌ ఛందస్సు, ఎముకనుండి జగతీ ఛందస్సు, మజ్జనుండి (ఎముకలనుండి ఏర్పడే నేయివంటి పదార్థం) పంక్తి చందస్సు, ప్రాణంనుండి బృహతీ ఛందస్సు, కకారంనుండి మకారం వరకూ గల స్పర్శలు అనే పేరుగల అక్షరాలనుండి జీవుడు, అకారాది అచ్చులనుండి శరీరం, ఊష్మములనబడే శషసహ అనే అక్షరాలనుండి ఇంద్రియాలు, అంతస్థాలనబడే యరలవ అనే అక్షరాలనుండి షడ్జం మొదలైన సప్తస్వరాలు, ఆత్మబలంతో శబ్దబహ్మం బ్రహ్మయొక్క లీలావిశేషంతో ఉత్పన్నమయ్యాయి.

పరమాత్మ వ్యక్త, అవ్యక్తరూపుడుగా ఉంటాడు. వాక్కు పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని నాలుగు రకాలు. అందులో చివరిదైన వైఖరి వ్యక్తం. మొదటి మూడు అవ్యక్తం. వ్యక్తరూపవైఖరి వాక్కుగా ఉండే ఓంకారస్వరూపమైన శబ్దబ్రహ్మంవల్ల పరమాత్మ అవ్యక్తుడు (నాదరూపమే కాని శరీరరూపం లేకపోవుటచేత). వ్యక్తరూపుడుగా ఇంద్రాది శక్తిసంయుతుడై కనిపిస్తాడు.

వీర్యవంతులైన ఋషుల సంతానం తగినంత విస్తారం కాలేదని భావించి, పూర్వశరీరాన్ని విడిచిపెట్టి, నిషిద్ధం కాని కామంనందు ఆసక్తమైన వేరే శరీరాన్ని స్వీకరించి, నిత్యం సంతానసృష్టియందే లగ్నమైనా, ప్రజాభీవృద్ది జరుగకపోవడానికి కారణం ఏమై ఉంటుందా అని ఆశ్చర్యపడి, ప్రజావృద్ధికోసం ఆలోచించి, దైవం అనుకూలం కాకపోవడమే కారణమని భావించి, దైవానుకూల్యం తప్పనిసరియని తలచి, దానికోసం ఎదురుచూస్తూ, ఉచిత కార్యకలాపాలతో సాగుచుండగా బ్రహ్మదేవుని శరీరం రెండు భాగాలయింది. అందులో ఒకటి స్వరాట్టు అయిన స్వాయంభువ మనువైతే రెండవది అతని భార్యయైన శతరూప అయింది. ఆ దంపతులకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు, ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు కుమార్తెలూ ఉద్భవించారు. ఆకూతిని రుచిప్రజాపతికి, దేవహూతిని కర్దమప్రజాపతికి, ప్రసూతిని దక్షప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారు. వీరివలన కలిగిన సంతానంతో లోకాలు పరిపూర్ణమయ్యాయి.

స్వాయంభువమనువు ప్రజావృద్ధి సేయుట

No comments:

Post a Comment

Kanu Disti Ganapathi - కంటి దృష్టి గణపతి

మహా గణపతికి 33వ రూపమే శుభదృష్టి గణపతి (కంటి దృష్టి గణపతి) 'నరుడు దృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది' అంటారు. దీని అనుభవం పొందిన వారిక...