మహాత్మా! రాజర్షియైన అంగమహీపతి అశ్వమేధయాగం చేయడం మొదలు పెట్టగా ఋత్విక్కులంతా మంత్రాలతో దేవతల్ని ఆహ్వానించారు. అయితే హవిస్సులు స్వీకరించడానికి దేవతలు దిగిరాలేదు. ఋత్విక్కులు ఆశ్చర్యపోయారు. వారు యజ్ఞకర్త అయిన అంగరాజుతో ఇలా అన్నారు. రాజా! ఈ దేవతలు మనం పిలిచినా రావడం లేదు. హోమంలో ఏ విధమైన లోపమూ లేదు. వారు రాకపోవడానికి కారణం తెలియటం లేదు. ఈ హోమం చెడ్డది కాదు గదా.
ఈ వేదవాదులంతా శ్రద్ధతో దీక్షబూని ప్రయోగించిన వేదాలు శక్తిమంతాలైనవి. ఇందులో, దేవతలపట్ల ఏ విధమైన దోషమూ లేదు. జరిగే ఈ వేదకర్మలన్నిటికీ దేవతలే సాక్షులు. వారు తమ తమ భాగాలను స్వీకరించకపోవడానికి కారణమేమో తెలియడంలేదని ఋత్విక్కులు చెప్పగా అంగరాజు దుఃఖీంచాడు. దానికి కారణమేమిటో సదస్యులను అడిగి తెలుసుకోదలచి వారి అనుమతితో మౌనాన్ని వీడి ఇలా అన్నాడు.
ఓ మహనీయులారా! నేను చేస్తున్న యజ్ఞంలో మనం దేవతలను ఆహ్వానించినా వారు వారి భాగాలను స్వీకరించడంలేదు. దీనికి నేను చేసిన అపరాధమేమిటి? అని అడుగగా వారు ఇలా సమాధానమిచ్చారు. ఓ రాజా! ఇది ఇప్పుడు జరిగిన దోషంకాదు. పూర్వజన్మలో చేసిన పాపము. పుణ్యాత్ముడవైన నీకు సవిస్తరంగా చెబుతాము - అన్నారు సదస్యులు.
నీ వింత గొప్పవాడవైనా నీకు సంతానం లేనందువల్ల దేవతలు నీవుచేసిన ఈ యజ్ఞంలో హవిర్భాగాలు స్వీకరించడంలేదు. దీనికి నీవు "పుత్రకామేష్టి అనే యాగాన్ని చేసి కుమారుని పొందినట్లైతే, దేవతలంతా తమభాగాలను స్వీకరిస్తారు. అలాంటి యజ్ఞపురుషుడైన శ్రీ మహావిష్ణువును సేవిస్తే నీకు అన్నిపనులు సమకూరుతా" యని సదస్యులు చెప్పారు.
సభలోనివారు ఇలా చెప్పగా అంగరాజు సంతానం కోసం శిపివిష్టుడనే పేరుగల విష్ణుదేవుణ్ణి నాహ్వానించి పురోడాశాన్ని హోమంలో అర్పించాడు. ఆ హోమగుండంనుండి జ్యోతిర్మయాలైన బంగారు మాలలు, అంబరాలు, ఆభరణాలు ధరించిన యజ్ఞపురుషుడు బంగారుపాత్రలో సిద్ధంచేసిన పాయసాన్ని తీసుకొని బయల్వెడలాడు. అంగరాజు బ్రాహ్మణుల అనుమతితో ఆ పాయసాన్ని స్వీకరించి సంతోషంతో భార్యకిచ్చాడు. ఆ తరువాత
ఆ అంగుని భార్య కుతూహలంతో ఆ పాయసాన్ని సేవించి భర్తతో దాంపత్య సుఖాన్ని పొంది గర్భం ధరించి కుమారుని ప్రసవించింది. అతడు అధర్మమార్గంలో భూమిపై తిరుగుతూ మాతామహుడైన మృత్యువులాగా తిరుగసాగాడు. అతడే వేనుడు.
(వేనుని తల్లి సునీథ, మృత్యువు పుత్రిక - అందువల్ల వేనునికి మాతామహలక్షణాలు కలిగాయి.)
ఆ వేనుడు బాల్యం నుండి దుష్టస్వభావం కలవాడు. తనయీడు బాలురను ఆటపాటలకని పిలిచి గుంపులు గుంపులుగా చేర్చి విల్లమ్ములు ధరించి వారినందరిని చంపేవాడు. జంతువులను వేటాడు బోయవానివలె వేనుడు అట్టి పాప కృత్యంపై కుతూహలంతో తిరుగుతూ మృగాలను దుష్టమార్గంలో చంపేవాడు.
వేనుని తల్లి సునీథ. ఆమె తండ్రి మృత్యువు చేసిన మహాదోషాల ఫలితంగా వేనుడు ఇలా తయారయ్యాడు. అంగరాజు పాపవర్తనుడైన కుమారుని అనేక విధాలుగా శాసించడానికి, దండించడానికి విఫల ప్రయత్నం చేశాడు. అతని చెడ్డపనులు మాన్పలేక మనసులో చాలా దుఃఖించాడు.
దుష్టుడగు పుత్రునివల్ల బాధపడడం కంటే సంతానం లేనివాడు కావడమే మేలు. అలా బాధపడే సంతానం లేనివాడు మహావిష్ణువును సేవించినట్టివాడే అవుతాడు.
అని మరలా ఇలా అన్నాడు.
చెడ్డకుమారునివలన అపకీర్తి అధర్మం కలుగుతాయి. అందరితో విరోధం, మానసిక బాధ తప్పక ప్రాప్తిస్తాయి. చెడ్డకుమారునిపై వ్యామోహం విడిచిపెట్టలేక, వానిని ప్రేమగా చూడటానికి ప్రయత్నిస్తూ ఎవడు కాలక్షేపం చేస్తాడో అతని ఇల్లు సకల దుఃఖాలకు స్థానమవుతుంది. అని మళ్లీ ఇలా అనుకొన్నాడు. 'శోకం కలిగించే పుత్రుని వల్ల అనేక కష్టాలు కలుగుతాయి. తండ్రి ఇంటిని కూడా విడిచి వెళ్లిపోతాడు. అందుచేత, జ్ఞానహీనుడైన చెడ్డకొడుకునే మంచి కొడుకుగా భావిస్తున్నాను' అని ఆ రాజు దుఃఖించాడు
అధికమైన సంపదలతో అభివృద్ధి చెందే తన నివాసాన్ని కొడుకును, ప్రజలను, నిద్రించే భార్యనుకూడ వదలిపెట్టి అర్ధరాత్రివేళ అంగరాజు ఎక్కడికో వెళ్లిపోయాడు.
అంగరాజు ఇల్లు వదలి వెళ్లాడనే విషయం తెలిసిన స్నేహితులు, బంధువులు, పురోహితులు, మంత్రులు మొదలైన ప్రజలంతా దుఃఖించారు. లోకమంతా వెదకించారు. ప్రయోజనం లేకపోయింది. సర్వజీవులలో అంతర్యామి అయిన పరమాత్ముని తెలుసుకోలేని భ్రష్టయోగివలె రాజును కనిపట్టలేక అందరు నిరాశులై, నగరానికి తిరిగివచ్చారు. ఆ తరువాత.
బ్రహ్మనిష్ఠాపరులైన మహానుభావులగు భృగువు మొదలైన మహర్షులు లోకాలను రక్షించాలనే ఏకాగ్రబుద్ధితో ఆలోచించారు. కాపాడే రాజు లేకపోతే జనం పశుప్రాయులై ప్రవర్తించటం చూచారు. వేనుని తల్లియైన సునీథతో సంప్రదించి వేనుని రాజ్యపట్టాభిషిక్తుని చేశారు. కాని, ప్రజలకు ఆయన రాజ్యాధికారం ఇష్టం లేదు. ఆ వార్త విని పాములవల్ల భయంతో పారిపోయే ఎలుకలవలె, దేశంలోని దొంగలందరూ అడవులలోకి పారిపోయారు.
(రాజ్యానికి ప్రభువు లేకుండుట మంచిదికాదు. దుష్టుడైన ప్రభువునైనా తాత్కాలికంగా నియమిస్తే ప్రజలకు కొంత ఊరట.)
అష్ట దిక్పాలకుల వైభవం పొంది లోక పరిపాలన చేసే వైభవాన్ని పొందినా, నీచుడైన వేన మహారాజునకు రాజసహజమైన గర్వము బలసింది. నిత్యం రాజ్యంలో పూజార్హులు, గౌరవభాజనులు అయిన సజ్జనులందరినీ అతడు పరాభవించసాగాడు.
(దిక్పాలకులు : వీరు ఎనిమిదిమంది. ఎనిమిది దిక్కులకు అధిపతులు 1. ఇంద్రుడు, 2. అగ్ని 3.యముడు, 4 నిరృతి, 5. వరుణుడు, 6. వాయువు, 7. కుబేరుడు, 8. ఈశానుడు.)
ఆ వేనరాజు భూమ్యాకాశ మార్గాలలో ఒంటరిగా రథంపై తిరిగేవాడు. నిరంకుశుడై మదగజంవలె సంచరిస్తూ పెద్దలు అసహ్యించుకొనేవిధంగా ప్రవర్తించేవాడు. నిరంతరం సజ్జనులకపరాధం చేయడంలో మనసు లగ్నం చేసేవాడు.
దేవతలు భయపడేలా, భూమ్యాకాశాలు బద్దలయ్యేలా భేరిని వాయింపజేసి వేనుడు ఇలా చాటింపు వేయించాడు. "బ్రాహ్మణులు యజ్ఞాలు చేయకూడదు, దానాలు చేయకూడదు, హోమాలు చేయకూడదు."
ఈ విధమైన చాటింపుతో అన్ని ధర్మాలను నిషేధింపగా, అవినీతిపరుడైన వేనుని చెడు ప్రవర్తన ప్రజలకు భయం కలిగించగా మునులు చూచి దయతో ఈ విధంగా అన్నారు. రాజువల్ల, చోరులవల్ల అధికంగా కలుగుతున్న భయాలు ఈ దేశప్రజలను కొయ్యకు ఇరువైపుల ఎక్కువగా అంటుకొన్న అగ్నివలె బాధిస్తున్నాయి
రాజులేకుండా ఉండటం మహాభయంకరమని భావించి, దానిని నివారించడానికై, తెలియక ఈ నీచుని రాజుగా చేశాము. పాలుపోసి పెంచిన పామువల్ల భయం దానిని పోషించినవానికే కలిగినట్లుగా ఈ దుష్కర్మఫలం ప్రజలకు ప్రాప్తించింది.
అంతేగాక, ఈ వేనరాజు ముందుగా సునీథాదేవి కడుపున పుట్టిన వాడైనా, చెడు ప్రవర్తనతో ప్రవర్తించసాగాడు. ప్రభుస్థానాన్ని ఆక్రమించాడు. ప్రజలను హింసిస్తున్నాడు.
ఈ వేనుడు జ్ఞానసంపన్నులమైన మనచేత రాజుగా చేయబడ్డాడు. కాబట్టి, ఇప్పుడు వీనిని ప్రార్ధించడం ఒక్కటే మార్గం. లోకరక్షణ బుద్ధితో మనం చేస్తున్నాం కాబట్టి, ఆ దుష్టుని ప్రార్థిస్తే ఆ దోషం మనకు సంక్రమించదు. సమాధానపడే విధంగా వీనిని మంచిమాటలతో చల్లబరచే ప్రయత్నం చేద్దాం. అతడు వినకుంటే, ఇంతకుముందే ప్రజల తిరస్కారాగ్నికి దగ్దుడగుచున్న వీనిని మన ఆత్మతేజస్సుతో భస్మం చేద్దామని పెద్దలు తమ రోషాన్ని దాచుకొని వేనుని దగ్గరికి వెళ్ళారు.
వారు ఇంపుగా "ఓ రాజా! నీకు ఆయువు, సంపద, బలము, కీర్తి సమకూరుగాక! నీవు ఐశ్వర్యంతో వర్ధిల్లెదవుగాక!" అని వేనుని ఆశీర్వదించారు. అంతేగాక మిక్కిలి వినయంతో
పెద్దలందరూ ఇలా ఆశీర్వదిస్తూ వేనునికి ఇలా విన్నవించారు. "రాజా! మాదొక మనవి. కొంచెం శ్రద్ధగా విను. 'మానవుడికి మనస్సు, వాక్కు శరీరము'-అని త్రికరణాలు. ఈ మూడింటిద్వారా పరిశుద్ధంగా చేసేవి ధర్మయుక్తాలైన కర్మలు. అవి అన్నిలోకాలను శోకరహితమైన స్థితిలో నిలుపుతాయి. కోరికలు లేకుండా పనిచేసేవారికి ఈ ధర్మాలే మోక్షాన్ని ఇస్తాయి. ధర్మమే సమస్త ప్రజలకు క్షేమదాయకం. కాబట్టి, అలాంటి ధర్మం నీలో చెడకుండుగాక. ఒకవేళ ఆ ధర్మం నశిస్తే ఆ రాజు ఐశ్వర్యం నశిస్తుంది. దుష్టులైన మంత్రులవల్లగాని, దొంగలవల్లగాని ప్రజలు నశించకుండా రక్షించేవాడే ప్రభువు. అలా రక్షించడానికే న్యాయంగా అతడు పన్ను స్వీకరిస్తాడు. ఇలాంటి రాజు ఇహపరసాఖ్యాలు పొందుతాడు.
అంతేకాక, ఎవని రాజ్యంలో, ఏ నగరంలో యజ్ఞాలకు అధిపతి అయిన భగవంతుడు, తమతమ వర్ణాశ్రమధర్మాలను పాటించేవారిచేత పూజింపబడుతాడో, ప్రజలు వర్ణాశ్రమ ధర్మాలను ఆచరించేటట్లు ఏ రాజు తన శాసనాన్ని అమలుపరుస్తాడో, ఆ రాజువలన అన్ని భూతాలను తనలో భావించేవాడు, మహావైభవంకలవాడు, భగవంతుడు, అన్ని లోకాలకు అధిపతి అయిన పరమాత్మ సంతోషిస్తే - ఆ రాజుకు అన్ని సుఖాలు కలుగుతాయి. ప్రజాపాలకులైన ప్రభువులు ఆ సర్వేశ్వరుని కొరకు బలిదానాలు చేస్తారు. అన్ని లోకాల దేవతల యజ్ఞాదులను గ్రహించేవాడు, అన్ని వేదాల్లో, అన్ని వస్తువుల్లో, అన్ని తపస్సుల్లో నిండి ఉన్నటువంటివాడు అయిన నారాయణుని, ఆశ్చర్యకరాలైన యజ్ఞాలతో పూజిస్తే నీకు భయంలేని స్ధితి ఏర్పడుతుంది. మోక్షం కలుగుతుంది. అందువల్ల నీ రాజ్యంలో యజ్ఞాలు చేయవలసినదని ఆజ్ఞాపించు. ఆ యజ్ఞాలవల్ల విష్ణుకళతో కూడిన దేవతా సమూహాలు ఇష్టంగా సంతుష్టి చెంది నీ కోర్కెలను తీరుస్తారు. దేవతలను తిరస్కరించటం నీకు తగదు. వేదోక్త ధర్మాలపట్ల ఆసక్తి కలవాడవగుము". అని చెప్పగా, ఆ వేనరాజు మహర్షులతో ఇలా అన్నాడు.
"మునులారా! మీరు నాకు ఏమేమో బోధించారు. మీ మాటలు బుద్ధి పరిపాకం లేనివిగా ఉన్నాయి. మీ మాటలలో అధర్మముంది. అసలు ధర్మమనేది ఎక్కడవుందో చెప్పండి?
మూఢులారా! మీకు ప్రభు రూపంలో వచ్చిన నన్ను భగవంతుడని గుర్తించ లేకపోతున్నారు. వ్యభిచారిణి అయిన స్త్రీ తనభర్త కన్ను గప్పి ఇంకొకనిని భర్తగా భావించి, వ్యభిచరించినట్లు మీ ఎదుట కన్పించే నన్ను గుర్తించక ఎవడో నారాయణుడని ఇంకొకరిని సేవిస్తున్నారు. అలా చేస్తే మీకు ఇహపరసౌఖ్యా ఎన్నటికీ ఉండవు.
అని మరీ ఇలా అన్నాడు. యజ్ఞపురుషుడనగా ఎవడు? మీకు ఎవరిపై ప్రేమ, భక్తి కలిగాయి? చెడ్డస్త్రీలు భర్తప్రేమకు దూరమై అంకుమగనిపట్ల చూపే విధంగా మీరు మాట్లాడుతున్నారు. అదీగాక
త్రిమూర్తులు, దిక్పాలురు, సూర్యచంద్రాదులు అయిన దేవతలంతా రాజు శరీరాన్ని ఒకమూర్తిగా ప్రజలకు సూచించడానికి రాజులో ఉంటారు.
ఆలోచించి నన్ను కొలవండి. రాజు దేవతలందరి అంశలతో కూడినవాడు. ఈర్ష్యను వదలి పెట్టండి. ఈ నేలమీద నాకంటె మరొకడు ప్రథమ పూజకు తగినవాడు లేడు.
కావున, పూజా పునస్కారాలూ, బలులు - అన్నీ నాకే సమర్పించండి" - అని పాపాత్ముడు, దుర్మార్గుడు, అమంగళుడు, అజ్ఞాని అయిన వేనుడు విపరీతబుద్ధితో మునుల మాటలు నిరాకరిస్తూ మాట్లాడాడు. అప్పుడు, మునులు తమ ప్రయత్నం వృథా అయిందని పరస్పరం ఇలా అనుకున్నారు. భయంకరకృత్యాలు చేస్తున్న ఈ పాపాత్ముడు నశించాలి. వీడు బ్రతికివుంటే వీనివల్ల ఈ లోకాలన్నీ నశిస్తాయి. దురాచారపరుడైన వీడు రాజ్య సింహాసనం అధిష్టించడానికి అర్హుడు కాడు. ఏ భగవంతుని అనుగ్రహంవల్ల వీడు ఇటువంటి భోగభాగ్యాలను పొందాడో ఆ యజ్ఞభర్త అయిన శ్రియఃపతినే వీడు నిందిస్తున్నాడు. కావున, సిగ్గుమాలి శ్రీహరిని నిందించే వీనిని హతమార్చాలని మునులు తమలో పెల్లుబికిన కోపంతో హుంకరించారు. ఆ మహర్షుల హుంకారానికి భగవన్నిందకు పాల్పడిన వేనుని ప్రాణాలు పోయాయి. ఆ తర్వాత
వేనుని తల్లియగు సునీథ చాల దుఃఖించి, కుమారుని శరీరంపై వ్యామోహం వదలలేక తన యోగశక్తితో ఆ శరీరం చెడిపోకుండా కాపాడింది.
ఆ తర్వాత ఒకరోజు మునులంతా సరస్వతీ నదీ జలాలలో స్నానం చేసి నదీ తీరంలో నియమంగా అగ్నిహోత్రాలు ప్రారంభించారు. సత్పురుషుల కథాగానాలతో వినోదించారు. ఇంతలో లోకోపద్రవకారకాలైన అపశకునాలు కనిపించాయి. 'లోకాలకు అశుభాలు కలగకుండుగాక' అని అనుకొంటూ ఉండగానే భీకరంగా అన్ని దిక్కులా ధూళివర్షం కురిసింది. అదే తడవుగా దొంగలు ప్రజల సంపదలను దోచుకొన్నారు.
ఇలా లోకానికి కష్టం కలుగగా వారంతా దానిని గమనించి చూస్తూ ఉండిపోయారు. రాజు చనిపోవడంతో గ్రామాలు అరాచకమై జనాలు ఒకరినొకరు హింసించుకోసాగారు. దొంగల బాధలు అధికమయ్యాయి. దానిని నివారించటానికి సమర్థులైనప్పటికీ మునులు చూస్తూ ఊరకుండిపోయారు. సమదర్శనం గలవాడు, శాంతస్వభావి, పరిస్థితి నర్ధంచేసుకొనేవాడైన బ్రాహ్మణుడు దీనులైన ప్రజలకు బాధలు కలిగినపుడు చూస్తూ మిన్నకుండరాదు. అలాచేస్తే వాని తపస్సు పగిలిపోయిన కుండలో పాలవలె నశిస్తుంది. అంతేగాక, అంగరాజు వంశకర్తలైన పూర్వీకులు విష్ణుభక్తులు. కాబట్టి, వేనుని వంటి వాడు పుట్టినంత మాత్రాన వంశనాశనం కాకూడదని తమలో తాము తర్కించుకొని ఆ మునులంతా ఆ వంశాన్ని నిలబెట్టడానికి బద్ధకంకణులయ్యారు. వేనుని కళేబరంవద్దకు వెళ్లి తొడను మథించారు. అందులో
అప్పుడు వేనుని తొడనుండి నల్లని మబ్బురంగు, కాకిరంగుగల ఒకనిషాదుడు పుట్టాడు. మఱుగుజ్జు అవయవాలు, కురచచేతులు, కురచపాదాలు, పొట్టి చేతులు, కాళ్లు, సొట్టముక్కు ఎర్రని కండ్లు, రాగిరంగు వెంట్రుకలు, మీసాలు కలిగిన అతని ముఖం నిస్సహాయస్థితిని తెలుపుతోంది. అతడు “నేనేమి చేసే"దని దీనంగా అడుగగా. మునులు వానిని చూసి 'నిషీద' అన్నారు. ఆ మాటతో వాడు నిషాదుడను పేరుగలవాడైనాడు. ఆ నిషాదుని వంశం వారంతా కొండ కోనల్లో తిరుగుతూ వేనరాజు పాపాన్ని ప్రచారం చేయసాగారు.
ఆ మునులంతా మళ్లీ బిడ్డలులేని ఆ వేనరాజు బాహువులను మథించారు. అందులో నుంచి పవిత్రులైన దంపతుల పుట్టారు. లోకమంతా సంతోషించింది.
ఆ బాహుమథనం వల్ల నారాయణుని అంశలో ఒక పురుషుడు, వానిని ఎల్లప్పుడూ వీడని లక్ష్మీదేవి అంశగల ఒక అందగత్తె జన్మించింది. ఆమె సద్గుణాలకు అలంకారాలకు శోభ కల్గించింది. పెద్ద చెవులు, గొప్పకీర్తిగల అతడు 'పృథుచక్రవర్తి' అనే పేరుతో ప్రసిద్ధికెక్కాడు. ఆమె 'అర్చి' అనే పేరుతో దిన దిన ప్రవర్థమానయై అతణ్జి వివాహమాడింది. అప్పుడు
ముని శ్రేష్ఠులు సంతోషించేవిధంగా దేవతలు అంతటా పూలవాన కురిపించారు. అమరావతీ పట్టణంలో అప్సరసల నృత్యాలు ఆనందంగా కొనసాగాయి. కిన్నర బృందాల గీతాలు చెవులకింపుగా వినిపించాయి. దేవతలు నగారామోత కొనసాగించారు. ఋషుల స్తోత్రాలు అధికమైనాయి. అగ్నిగుండాలలో అగ్నులు వెలిగాయి. అప్పుడు అక్కడికి గరుడ గంధర్వ కిన్నరగణాలతో సంతోషంగా చతుర్ముఖుడు వచ్చాడు.
వేనుని కుమారుడైన పృథుచక్రవర్తి కుడిచేతియందు విష్ణుమూర్తి ఆయుధాల గుర్తులు గల రేఖలు కనిపించాయి. పాదాలలో హల, అంకుశ, వజ్ర, ధనుస్సు, పద్మ, శంఖరేఖలు విస్పష్టంగా ముద్రించబడి ఉండటం చూచి బ్రహ్మాదులు ఎంతో ఆశ్చర్యం చెందారు.
ఈ పృథుచక్రవర్తి నారాయణుని అంశలో పుట్టాడు. ఈయన భార్య అర్చి లక్ష్మీదేవి అంశలో పుట్టిందని నిర్ణయించి వేదవేత్తలైన బ్రాహ్మణులు ఆయనకు శాస్రోక్తంగా రాజ్యాభిషేకం చేశారు. ఆ తరువాత
నదులు, సముద్రాలు, మృగాలు, పక్షులు, భూమి, ఆకాశం, పర్వతాలు మొదలైన సర్వ జీవరాశులన్నీ పృథుచక్రవర్తికి క్రమంగా కానుకలు తెచ్చియిచ్చాయి.
అధికమైన కీర్తిగల ఆ పృథుచక్రవర్తి తన భార్య అర్చితో కలిసి దివ్యవస్త్రాలు, గంధమాల్యాభరణాలు ధరించి అగ్నిహోత్రునివలె ధగద్ధగాయమానంగా ప్రకాశించాడు.
మరియు ఆ పృథుమహారాజుకు కుబేరుడు బంగారుతో జేసిన వీరోచిత సింహాసనాన్ని వరుణుడు నీటి బిందువులు జాలువారే పూర్ణచంద్రునివంటి గొడుగును, వాయుదేవుడు చామరాలు, ధర్మువు కీర్తిమయ నూత్న పుష్పమాలిక, ఇంద్రుడు కిరీటం, యముడు సర్వజీవులను నియమించే రాజదండం. చతుర్ముఖ బ్రహ్మ వేదమయ కవచం, సరస్వతి నిర్మలహారాన్ని కానుకలుగా ఇచ్చారు.
పద్మపాణియైన విష్ణువు సుదర్శనచక్రాన్ని లక్ష్మీదేవి అధికసంపదలను, శివుడు అర్ధచంద్రరేఖగల ఒరగల ఖడ్గాన్ని అంబిక శత చంద్రమనే డాలును, చంద్రుడు అమృతమయమైన తెల్లనిగుర్రాలను, త్వష్ట రథాన్ని సూర్యుడు కిరణమయమైన వెండి బాణాలను, మేక, ఎద్దుకొమ్ములతో నిర్మితమైన అజగవమనే ధనుస్సును అగ్నిహోత్రుడు, భూదేవి దివ్యపాదుకలను, ఖేచరులు గీతాలను కానుకలుగా అర్చించారు.
(అజ - గవ - అస్థి వికారత్వాద్ అజగవః - మేక, ఎద్దు ఎముకలతో చేసిన శివుని ధనుస్సు.)
మరియు ఆకాశం రోజూ పూలు కురిపించింది. ఋషులు సత్యవాక్కులతో ఆశీర్వదించారు. సముద్రుడు శంఖాన్ని ఇవ్వగా నదినదాలు, పర్వతాలు రథానికి దారి ఇచ్చాయి. వందిమాగధులు, సూతులు కీర్తించారు. ప్రతాపశాలియైన పృథుచక్రవర్తి చిరునవ్వుముఖంతో అందంగా కనిపించాడు. చమత్కారభరిత భాషణలతో మేఘగంభీర నిస్వనంతో ఇలా అన్నాడు.
ఓ వందిమాగధ సూతశ్రేష్ఠులారా!, నాలో మెచ్చుకొనే గుణాలు ఉంటే మీరు స్తుతించడం తగును. అలాంటి గుణాలు నాలో లేవు. అందువలన మీ పొగడ్తలు వ్యర్థం. మీకు సద్గుణాలను పొగడాలని ఉంటే సభాసదుల అనుమతితో మీ చాతుర్యాన్ని చూపి విష్ణుని స్తుతించండి. ఆయన సుగుణాలు పొగడ శక్యంకానివి.
ఎవరైనా మహాత్ముల గుణాలను తమయందు ఉన్నట్లు భావించి అలాంటి గౌరవం పొందినా, మహాత్ముల గుణాలు ప్రసిద్ధాలు కాబట్టి వాళ్లతో సమానంగా ఎలా నుతించడానికి సాధ్యం అవుతుంది? శాస్త్రాలు చదవడంవల్ల తనకు విద్యాతపోయోగ గుణాలు కలిగాయని ఎవడైనా అన్నా అతనిని చూచి సభ్యులు నవ్వుకొంటారు. చెడ్డస్వభావం కలవాడు ఆ విషయాన్ని తెలుసుకోలేడు.
అధికమైన ఖ్యాతి కలిగి, వినయపూర్వకలజ్జ కలిగిన విశాలహృదయులు, నిర్మలస్వభావులు, ఆత్మస్తుతి, పరనింద నీచములైనవని మనసులో ఎప్పుడూ భావిస్తారు.
లోకంలో నిత్యం రాజులను పొగడే వంది మాగధులకు మంచి పనులంటే ఏమో తెలియని రాజులను సంతోషపెట్టటం అవసరమే అయినా, చిన్నపిల్లలవలె పొగడకూడదు.
సూత వందిమాగధజనులు ఆ పృథుచక్రవర్తి మాటలు వినికూడా మునులచే ప్రేరేపింపబడినవారై తిరిగి ప్రేమలు మొలకలెత్తగా ఆ రాజును అమృతంతో సమానమైన తియ్యని మాటలతో ఇలా అన్నారు.
"నీవు వేనుని పుత్రుడవు. విష్ణుని కళాంశంతో జన్మించినవాడవు. శాశ్వత గుణాలతో సన్మానయోగ్యుడవు. ఊహకు కూడ అందని నీ గొప్పతనాన్ని పొగడ మాతరమా!"
అని, మరల ఈ విధంగా అన్నారు. "అయినా, నీ గొప్పచరిత్ర అనే అమృతాన్ని తాగి, ఈ మహర్షుల మాటలు విని మిమ్మల్ని సంతోషపెట్టటానికి మరొకమార్గం ఉంది.
పొగడదగిన నీ గాథలను మేము పొగడుతామని ఇలా అన్నారు.
ఈ పృథుచక్రవర్తి అన్ని లోకాలను ధర్మమార్గంలో నడుపుతాడు. ధర్మప్రభువులలో ధన్యుడై ఎంతో ఆసక్తితో ధర్మసేతువును రక్షిస్తాడు. అష్టదిక్పాలుర అంశలు ధరించి ధర్మాన్ని వ్యతిరేకించేవారిని దండిస్తాడు. ఆయాకాలాలలో మంచి మాటలతో దానాలతో ప్రజారంజకుడవుతాడు. యజ్ఞయాగాలుచేసి చక్కని వర్షాలు కురిపించి ఇహపరలోకాలకు ప్రీతిని కలిగిస్తాడు. సూర్యుడు జలాన్ని పీల్చి మేఘంగా మార్చి వాన కురిపించే విధంగా ఈ రాజు ప్రజలనుండి పన్నురూపంలో ధనం పుచ్చుకొని, అవసర సమయంలో ఆ ధనాన్ని మళ్లీ వాళ్లకిచ్చి రక్షిస్తాడు.
(సూర్యుడు వేసవికాలంలో జలాలు గ్రహించి మళ్లీ వర్షాలు కురిపిస్తాడు. సూర్యుడే నరజాతికి ఆత్మ తేజస్సుగా అవతరించి ప్రభువై పాలనచేస్తాడు. అష్టదిక్పాలకుల అంశలతో బ్రహ్మదేవుడు, రాజును సృష్టించినాడని మనుస్మృతి (7-3,4) లో చెప్పబడినది.
ఇంకా పృథుచక్రవర్తి అన్ని ప్రాణులపట్ల సమానుడుగా వర్తిస్తాడు. ధర్మ వ్యతిరేకులయినవారిని, తప్పులు చేసినవారిని శాంతితో సహిస్తాడు. బాధలలో నున్నవారిని దయతో చూస్తాడు. మానవరూపంలో ఉండే విష్ణుమూర్తి గాబట్టి, వర్షాలతో ఇంద్రుడు ప్రజలను రక్షించినట్లు రక్షిస్తాడు. చంద్రునితో సమానమైన ముఖపద్మంతో, చిరునవ్వుతో ప్రేమాభిమానాలు కలిగిన చూపులతో ప్రజలందరికి సంతోషం కల్గిస్తాడు. ఆయన మనస్సు తెలుసుకోవడం దుష్కరం. శత్రువులకు అతడు అసాధ్యుడు.
(సూర్యుని లక్షణాలు అందరిని సమానంగా చూడటం. ప్రజలకు సంతోషం కలిగించేవాడు చంద్రుడు. రెండు లక్షణాలు రాజుకుండాలి. సూర్యునివలె తీక్ష్ణంగాను, చంద్రునివలె ప్రజలయెడ ప్రసన్నంగానూ ఉండాలి. సూర్యచంద్రాత్మకుడై పాలించేవాడు ప్రభువు. "నా విష్ణుః పృథివీపతిః" అని ధర్మశాస్త్రం.)
రహస్యంగా, నేర్పుగా కార్యక్రమాలు నిర్వహించేవాడు, లెక్కలేనన్ని గొప్పగుణాలు కలవాడు, సముద్రునివలె గంభీరమైన మనస్సు గలవాడు, చక్కగా దాచిన సంపదకలవాడు, వరుణునివల అగుపించని ఆత్మకలవాడు, శత్రువులకు సహింపరాని శౌర్యంతో కూడినవాడు, సమీపించడానికి సాధ్యంకానివాడు, దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నవానివలె నడచుకొనేవాడు, వేనరాజు అనే అరణియందు జన్మించిన అగ్నికావటంచేత అన్యులు స్పృశింపసాధ్యం కానివాడు అయిన పృథు చక్రవర్తి - వేగులవలన సకలప్రాణులు బాహ్యంగా, రహస్యంగా జరిపే చర్యలు తెలుసుకొంటూ, దేహధారులకు ఆత్మవంటివాడైై, అందరిని ఆడించే సూత్రధారి అయిన వాయువువలె ప్రవర్తిస్తూ, స్తుతి నిందలను పట్టించుకోకుండ, ధర్మమార్గంలో వ్యవహరిస్తూ, తన ఆత్మీయులు, మిత్రులు, బంధువులు తప్పుచేసినా దండిస్తూ తనకు శత్రువులైనా దండించతగనివారిని దండించకుండా ధర్మమార్గాన నడుస్తూ, తన ఆజ్ఞలు తిరుగులేనివై మానసాచలం వరకు వర్తిల్లగా, సూర్యుడు తన కిరణాలతో ఎంత దూరం భూమిని ప్రకాశింపచేస్తాడో, అంతదూరం తన సుగుణాలచేత లోకాలను సంతోషపరుస్తూ, ప్రజారంజకాలైన గుణాలచేత కఠిన నియమాలుకలవాడై, సత్యాన్నే చెప్పేవాడై, బ్రహ్మజ్ఞానంకలవాడై, సమస్త జీవులు శరణువేడదగినవాడై, పెద్దలను సేవించేవాడుగా, వారికి మర్యాద ఇచ్చేవాడుగా, దీనులపట్ల దయచూపేవాడుగా, పరస్త్రీలయందు మాతృభావన కలవాడుగా, (అర్ధనారీశ్వరునివలె) తన భార్యను తన శరీరంలో సగభాగంగా భావించేవాడుగా, ప్రజలను తండ్రివలె ప్రేమతో రక్షింపసాగాడు. అంతేకాక
(1. సముద్రావరణంచేత వరుణుని లాగా నాల్గు సముద్రాలచే లేక జలప్రాకారాదులచే పరివేష్టిత మూర్తి అని వీరరాఘవ వ్యాఖ్య.
2. సూత్రాధిపుడైన వాయువులాగా - లోపల ప్రవేశించి వాయువులాగా చరించేవాడు.
3. పృథుచక్రవర్తియొక్క ఆజ్ఞాచక్రం, రథచక్రం అప్రతిహతాలై మానసాచలందాకా వ్యాపించి ఉంది. (వీరరాఘవవ్యాఖ్య))
బ్రహ్మవిద్యాపారంగతుల కితడు దాసుడు. సమస్తజీవుల శరీరాలలో తానే ఉన్నట్లు ఆప్తులకు, మిత్రులకు, జనులకు ఆనందాన్ని కలిగిస్తాడు. సంసార బంధంతోకూడిన కామ్యకర్మలతో సంబంధంలేని మహానుభావుల సత్సాంగత్యాన్ని ఇష్టపడతాడు. దుష్టులకు యమునివలె భయంకరుడు. ప్రకృతినీ, జీవులను ఆవేశించి ఉండేవాడు దేవుని అవతారంగా ప్రసిద్దుడు. అందంగా ఉన్న పృథువు అలా సంతోషంతో తిరుగుతాడు.
ఇతడు త్రిగుణాలకు అధిపతి. మూలపురుషుడు. పరమాత్మ పరబ్రహ్మతత్వమే రూపుదాల్చినవాడు అని పెద్దలు గ్రహిస్తారు.
ఈ పృథుచక్రవర్తి ఉదయపర్వతం హద్దుగాగొని సమస్త భూతలాన్ని ఏకైకవీరుడై రక్షిస్తాడు. ఇంకొకనాడు విల్లంబులు ధరించి మణిమయ రథారూఢుడై శత్రురాజులనే చీకట్లను పారద్రోలుతూ భూప్రదక్షిణ చేస్తాడు. అలా అతడు విజయయాత్ర చేసే సమయంలో సర్వదిక్పాలకులతోకూడిన, రాజులందరూ కానుకలిచ్చి విష్ణుమూర్తితో సమానమైన మొదటి చక్రవర్తివని స్తుతిస్తారు.
ఈ రాజు భూచక్రాన్ని ధేనువుగా చేసి సమస్త వస్తుజాలాన్ని పిండుతాడు. విద్వాంసులు తనను గౌరవింపగా ప్రజలకు జీవనోపాధులు సమకూరుస్తాడు.
ఇతడు ఇంద్రుడు కొండలను కొట్టినట్లు శత్రురాజుల వంశాలను నశింపచేస్తాడు. అజగవమను పేరు గల తన వింటి అల్లెతాటిని ధ్వనింపజేసి, శత్రువులను భయపెట్టి అవక్రపరాక్రమంతో సింహసముడై తిరుగుతాడు.
(పృథువును ఇంద్రునితో పోలుస్తూ గోత్రభేదనము-అనేమాటను కవివాడాడు. ఇక్కడ శేష పర్వతములు, రాజుల గోత్రములు అని రెండర్దాలు చెప్పవలె. శత్రురాజుల గోత్రాలు బ్రద్దలుగొట్టడంలో ఇంద్రసమానుడు. మేక ఎముకతోను, ఎద్దు ఎముకతోను, తయారుచేయబడిన విల్లు పేరు అజగవం.)
ఈ పృథుచక్రవర్తి సమస్తలోకాలచే స్తుతింపబడి గొప్ప యశస్సు గడిస్తాడు. పరమపవిత్రమైన సరస్వతీ నదీతీర ప్రదేశంలో నూరు అశ్వమేథయాగాలు చేస్తాడు. చివరియాగసమయంలో యజ్ఞాశ్వాన్ని దేవేంద్రుడు నేర్పుగా, హఠాత్తుగా హరించివెస్తాడు.
ఒకరోజు ఆ పృథువు తన మందిర సమీపంలోని ఉద్యానవనంలో మహనీయుడైన సనత్కుమారుని దర్శించి, ఆయన బ్రహ్మకుమారుడని తెలిసి భక్తితో పూజించి. ఆయన ద్వారా ఉత్తమ జ్ఞానాన్ని పొందుతాడు. అక్కడుండిన బ్రహ్మవేత్తలు సనత్కుమారుని ఉపదేశంతో తత్త్వజ్ఞానం పొంది ప్రవర్తిస్తారు. ఈ మహారాజు భూమిపై ప్రసిద్ధిపొందిన పరాక్రమంగల వీరుడై తన వీరగాథలను లోకులు ప్రస్తుతిస్తూ ఉండగా అక్కడక్కడా వింటూ, శౌర్యంతో అన్ని దిక్కుల్ని జయించి శాశ్వతమైన కీర్తితో సంచరిస్తాడు.
(సనక, సనందన, సనాతన, సనత్కుమారులు నలుగురు బ్రహ్మమానసపుత్రులు.)
ఈ విధంగా శత్రువులనే శల్యాలను తొలగించినవాడు పృథువు. దేవదానవులచే కీర్తింపబడ్డ వైభవంతో పృథుచక్రవర్తి భూమినంతా పరిపాలించాడు. ఆ సమయంలో తనను పొగడిన వందిమాగధ సూతజనులను సన్మానించాడు. బ్రాహ్మణులను, సేవకులను, మంత్రులను, పురోహితులను, పురజనులను, జానపదులను అభ్యంగనం చేయించేవారిని, తాంబూలా లందించేవారిని మొదలైనవారిని తగినవిధంగా గౌరవించాడని మైత్రేయుడు విదురునితో చెప్పాడు.
No comments:
Post a Comment