కలిపురుషు౦డు ధర్మదేవతను దన్నుట
కైలాస పర్వతంవలె తెల్లగా గంభీరంగా ఎత్తుగా ఉన్న శ్రేష్ఠమైన వృషభాన్ని, కాలునివలె క్రోధం కలవాడు, కఠోరచిత్తుడు, దండహస్తుడు, రాజవేషధారి, బలిష్ఠమైన పిక్కలతో వడివడిగా నడిచేవాడు ఐన ఒక శూద్రుడు కటిక రాక్షసునివలె కనికరం లేకుండా త్వరత్వరగా వచ్చి కాలితో తన్నినాడు. పిడుగుపాటువంటి ఆ తన్నుకు ఆ ఎద్దు నేలమీద కూలబడింది. మూత్ర విసర్జన చేసింది.
వాడు అంతటితో ఊరకుండలేదు.
ఒడలెల్ల గడగడ వడకుతూ కన్నుల వెంబడి ఏకధారగా కన్నీరు కారుస్తూ ఉన్నదానిని, గొంతెత్తి గట్టిగా "అంబా అని అరచే దానినీ, జంపుగా పెరిగిన లేత పచ్చికను మేయటానికి నాలుక చాచిన దానినీ, చెదరిన గుండె కలదానినీ, లేగదూడ లేక ఒంటరిగా ఉన్నదానినీ, పొంగిపొరలి వచ్చే ఏడ్పు కలదానినీ చెమటనీటితో నిండిన దేహం కలదీ భయోపేత అయినదీ ఐన ఆ గోమాతను ఆ పాపాత్ముడు పైకెగిరి వడిగా తన్నినాడు.
ఈ విధంగా ఆ ఎద్దును ఆవును రెండింటిని తన ఎదుటనే కాలితో తన్నుచున్న రాజలాంఛనాలు గల కంటకుడైన శూద్రుని చూచి, కాంచన రథారూఢుడై ఉన్న పరీక్షిన్నరేంద్రుడు విల్లెక్కుపెట్టి మేఘ గంభీర వాక్కులతో ఈ విధంగా అన్నాడు.
దుర్మతీ! ఎవడవురా నీవు? నిన్ను కొమ్ములతో పొడిచిందా? నిన్నెదుర్కొన్నదా? ఏ పాపమూ ఎరుగని ఈ గోవులను అన్యాయంగా ఎందుకు తన్నినావు? నా భుజాదండంతో సంరక్షింపబడే ఈ భూమండలంలో ఎప్పుడు ఎవ్వరు ఎట్టి నేరాలు చేయరాదని నీకు తెలియదా? మోసపు వేషాన్ని ధరించి ఇప్పుడు ఇక్కడ రాజువలె రాజసం ఒలకబోస్తున్నావు? నిన్ను కఠినంగా శిక్షిస్తాను.
గాండీవాన్ని ధరించిన అర్జునుడు, చక్రాన్ని ధరించిన శ్రీకృష్ణుడు ఈ భూమండలాన్ని విడిచివెళ్లగానే, నీవు మదంచే ఉన్మత్తుడవై దండింప తగని సాధువులను దండిస్తున్నావు. నీవే దండనార్హుడవు, నీకిప్పుడు ప్రచండమైన రాజదండన తప్పదు.
అని పలికి పరీక్షిన్మహారాజు ఎద్దునుచూచి ఈ విధంగా అన్నాడు.
ఈ వృషభరూపంలో ఉన్న శ్రేష్ఠుడవైన ధర్మదేవా! కురువంశ క్షత్రియుల బాహుదండాలనే కోటగోడల నడుమ సురక్షితమై ఉన్న ఈ భూమండలంలోని ప్రజలు నీ కన్నులనుండి జాలువారే కన్నీటి ధారలు తప్ప అధర్మ బాధితులైన మరి యే ఇతర జీవుల కన్నీటిధారలు ఇంతవరకు చూచి ఎరుగరు. ఇదిగో చూడు. ఇప్పుడే ఈ దుర్మార్గుణ్ణి పటిష్ఠమైన నా పరాక్రమంతో చీల్చి చెండాడుతాను.
ఓ ధర్మస్వరూపా! నీవు దిగులు పడవద్దు. నా బాణపరంపరలతో ఈ పాపాత్ముని రూపుమాపుతున్నాను. నిన్ను ఇప్పుడే ఈ భూమిపై నాలుగుపాదాలతో నడిపిస్తాను సుమీ!
నీవు నీ నోటికి రుచించే పచ్చిగడ్డిని అడవులలో మేసి, అక్కడనే నదుల్లో స్వచ్చమైన నీరు త్రాగి స్వేచ్చగా జీవిస్తుండగా ఏ పాపాత్ముడు నీ పాదాలు ఈ విధంగా విరుగగొట్టినాడో వాడు ఖేచరుడయినా, భూచరుడైనా నింగిపైకి పారినా, నేలలోకి దూరినా ఆ దుష్టుని మణికంకణ మండితములైన రెండుచేతులనూ ఇప్పుడే ముక్కలు ముక్కలుగా ఖండించి వేస్తాను.
అని పలికి పరీక్షిత్తు గోరూపధారిణియగు భూదేవితో ఈ విధంగా అన్నాడు.
అమ్మా! కల్యాణదాయినివైన ఓ భూదేవీ! అనంతవైభవాలు గల శ్రీకృష్ణస్వామి ఈ లోకాన్ని వదలి వెళ్లినాడనే ఆవేదనతో కృశించి కన్నీరు మున్నీరుగా ఏడువకు తల్లీ! మనసులో దిగులు పడవద్దు. భయాన్ని వీడు. నా బాణాలతో వాని నిప్పుడే నేలకూల్చివేస్తాను చూడు తల్లీ!
తల్లీ! నిరపరాధులైన సాధువులను బాధించి వేధించే దుర్మార్గులను రాజైనవాడు తప్పక శిక్షించి తీరవలెను. అలా శిక్షింపక ఉపేక్షిస్తే ఆ రాజాధముని ఆయుస్సు, ఐశ్వర్యం స్వర్గసుఖంతో కూడ సర్వమూ వ్యర్థం. అది ముమ్మాటికి యథార్థం.
సాధ్వీమణివైన ఓ పృథ్వీమాతా! బ్రహ్మదేవుడు దుష్టశిక్షణకు శిష్టరక్షణకు ప్రభువులను సృష్టించెనని ప్రాచీనులైన శాస్త్రవేత్తలు చెపుతున్నారు. కావున రాజునైన నాకు ఆర్తరక్షణ అనేది పరమధర్శం.
ఇట్లు పలికిన ధర్మనందనుని మనుమడగు పరీక్షిత్తుకు ఎద్దురూపంలో ఉన్న ధర్మదేవుడు ఈ విధంగా అన్నాడు.
రాజశ్రేష్ఠుడవైన పరీక్షిన్నరేంద్రా! నీవు దుర్జనులను నిగ్రహించి సజ్జనులను అనుగ్రహించే పురువంశంలో పుట్టినవాడవు. ఎంతో అదృష్టవంతుడవు. మీ పూర్వులింతటి ధర్మస్వరూపులగుట వలననే భగవంతుడైన శ్రీకృష్ణుడు మీ వారి భక్తికి ఎంతో సంతోషించి, దూతయై రాయబారం నిర్వహించినాడు.
"రాజా! మేము ఇతర ప్రాణులను బాధపెట్టము. మా వలన ఏ ప్రాణికిగాని ఎట్టి ఆపద కలుగదు. నానావిధ వాదోపవాదాలకు సమ్మోహితులైన యోగీంద్రులు ఆత్మయే సుఖదుఃఖ కారకుడగు ప్రభువని అంటారు. దైవజ్ఞులు గ్రహాలకు, దేవతలకు ప్రభుత్వాన్ని ఆపాదిస్తారు. మీమాంసకులు కర్మ ప్రాధాన్యాన్ని అంగీకరిస్తున్నారు. స్వభావమే ప్రధానమన్న లోకాయతికులు ప్రకృతికే ప్రాధాన్యమంటారు. కాని ఇందెవ్వరికి కూడా సుఖం దుఃఖం కలిగిందని, మరి ఎవరో కీడు చేసినారని తలంచుట పొరపాటు. బుద్ధికి మనస్సుకు అతీతుడైన పరమేశ్వరుని వల్లనే సర్వమూ నిర్వహింపబడుతుంది” అని పలికిన ధర్మదేవతతో ధర్మరాజు మనుమడైన పరీక్షిత్తు ఈ విధంగా అన్నాడు.
ఎద్దు రూపంలో ఉన్న ఓ ధర్మజ్ఞుడా! నీవు ధర్మమూర్తివి. నీవు పలికే తీరు పరమధర్మం. పాపాత్ముడు చేసే పాపాన్ని తెలుపుటకు కూడా నీవు ఇష్టపడవు. పాపకర్ముల పాపాన్ని ప్రకటించే వారికి ఆ పాపఫలం తప్పక అంటుకొంటుందని పెద్దలు చెపుతారు.
వాక్కుకు, మనస్సుకు అతీతమైన దైవమాయవలన జీవులకు చంపదగినవాడు, చంపేవాడు అనే వీరిద్దరి స్వరూపం అంత సులువుగా తెలియదగింది కాదు. నీవు ధర్మదేవతవు. కృతయుగంలో నీకు తపము, శౌచం, దయ, సత్యం అనే నాలుగు పాదాలు ఉండినవని చెపుతారు. త్రేతాయుగంలో ఆ నాల్లింటిలో ఒకటి నశించింది. ద్వాపరయుగం రాగానే రెండు పాదాలు లోపించినవి. ఇప్పుడు కలియుగంలో మూడుపాదాలు భగ్నమైనవి. సత్యం ఒక్కటే మిగిలి ఉన్నది. దానిని కూడా కలియుగం చివరలో అధర్మం ఆక్రమించి శిక్షించటానికి కాచుకొని ఉన్నది. ఇదిగో ఇటు చూడు.
ధర్మాన్ని తెలిసిన ఓ ధర్శదేవా! శ్రీకృష్ణుడు అవతరించి భూభారాన్ని తొలగించినాడు. ఆయన దివ్యపాదస్పర్శతో భూదేవి ఎంతో సంతోషించి, పులకింతలతో మైమరచిపోయింది. ఇప్పుడు అట్టి పాదస్పర్శకు దూరమై పాపాత్ములు తనపై క్రూరంగా పెత్తనం చూపిస్తారేమోనని భీతిచెంది కన్నీరు కారుస్తున్న భూమాతను చూచినావా!
Subscribe to:
Post Comments (Atom)
Sree Maha Bhagavathamu Part 2 - శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము శ్రీ మహా భాగవతము ద్వితీయ స్కంధము ప్రారంభము శుకుడు పరీక్షిత్తునకు ముక్తి మార్గంబుందెల్పుట
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
ఆదిత్యహృదయం తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 01 || దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో ...
-
శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః | ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫ...
No comments:
Post a Comment