Sunday, February 22, 2026

Kardama Created Self-Moving Aerial Mansion (Vimana) with Yogic Powers For his Wife - కర్దమప్రజాపతి యోగప్రభావంబుచే విమానంబు గల్పించి భార్యతో గూడి విహరించుట

కర్దమప్రజాపతి యోగప్రభావంబుచే విమానంబు గల్పించి భార్యతో గూడి విహరించుట

ఈ విధంగా స్వాయంభువమనువు తన కుమార్తె దేవహూతిని కర్దమమునికిచ్చి పెండ్లి జరిపించి తిరిగి తన నగరానికి వెళ్లిపోయాడు. అటు తరువాత దేవహూతి పతిభక్తితో పార్వతీదేవి పరమేశ్వరునికి పరిచర్య చేసినట్లు భర్తయైన క
ర్దమునికి సేవచేయనారంభించింది. భర్తయే తనకు దిక్కు అని భావించింది. భర్త మనస్సులోని అభిప్రాయాలకు అనుగుణంగా రోజురోజుకు ద్విగుణీకృతయైన భక్తి శ్రద్ధలతో, అనురాగంతో మిక్కుటమైన తేజస్సుతో ప్రకాశిస్తూ పతిని సేవిస్తున్నది. కామం క్రోధం కపటం లోభం మొదలైన దుర్గుణాలు లేకుండా శరీరాన్ని పరిశుభ్రంగా, సౌందర్యవంతంగా ఉంచుకొంటూ, చాతుర్యంతో ఆదరణతో ప్రేమతో భర్తనే భగవంతుడుగా భావించి మృదువుగా మధురంగా ఆయనతో మాట్లాడుతూ సేవలో ఎలాంటి ఉపేక్ష లేకుండా ప్రవరిస్తూ ఉన్నది. దైవేచ్చను సైతం తప్పింప సమర్ధుడైన కర్దమముని తనను సేవించడంలో కలిగిన కష్టంతో చిక్కిపోయిన శరీరంగల దేవహూతిని కరుణారసం పొంగిపొరలే కడకన్నులతో చూచి శ్రావ్యమైన మాటలతో ఇలా అన్నాడు.

తనకు శుశ్రూష చేసిన భార్యపై దయతో క
ర్దముడు ఇలా అంటున్నాడు. దేవహూతీ! మాననీయమైన ధర్మమార్గం వల్ల మహిమ కలుగుతుంది. ఆ మహిమాతిశయంవల్ల గొప్పతపస్సు, దానివల్ల ఏకాగ్రత కలుగుతాయి. వాటివల్ల ఆత్మజ్ఞానం లభిస్తుంది. దానివల్ల ఆత్మయోగం సిద్ధిస్తుంది. ఆత్మయోగంతో భగవత్కటాక్షం సమకూడుంది. ఆ కారణంగా పాపరహితమై విరాజిల్లే గొప్ప ఐశ్వర్యాలతో కూడిన అనంతాలైన శుభపరంపరలు సంప్రాప్తిస్తాయి. ఈ విధంగా నాకు సమకూడిన ఐశ్వర్యపరంపరలు నన్ను భక్తితో సేవించిన నీకు సంక్రమిస్తాయి. అంతేగాక నీకు తిరుగులేని దివ్యదృష్టిని కూడా అనుగ్రహిస్తున్నాను.

(క
ర్దముని వర్ణాశ్రమధర్మాలకు ఏ లోపమూ రానీకుండా నియమానుసారంగా దేవహూతి ఆయనను సేవించింది. దానితో కర్దముడు ధ్యాన ఉపాసనాదులు సక్రమంగా అనుష్టించడానికి వీలైంది. ఆ ఉపాసనాదులవల్ల ఆయనకు భగవత్ప్రసాదం, దానివల్ల అనంతాలైన శుభాలు, సంపదలు చేకూరినాయి. ఆయనను సర్వాత్మనా సేవించడంవల్ల అవన్నీ ఆమెకు కూడా లభించాయి. ఆ సిద్దులన్నిటినీ ప్రత్యక్షంగా చూడడానికి కావలసిన దివ్యదృష్టిని ప్రసాదిస్తానంటున్నాడు కర్దముడు.

భవభవానీ దాంపత్య ఉపమానంవలన వారు అర్ధనారీశ్వర తత్త్వానుసంధానం కలవారయ్యారుకనుక తపస్సు మొదలైనవాని ఫలాన్ని ఏకరూపంగా పొందారు.)

ఓ సుందరీ! నేనిచ్చిన ఆ దివ్యదృష్టివల్ల సర్వమూ నీకు కనిపిస్తుంది చూడు. భగవద్దత్తాలుకాని ఇతర నీచమైన ఐశ్వర్యాలు విష్ణుదేవుడు కనుబొమలు చిట్లించినంత మాత్రాననే నశించిపోతాయి. ఇక ఇతర విషయాలను గురించి వేరే చెప్పడమెందుకు?

(ఇంద్రియాలకు గోచరించనివాటిని కూడా చూడగలిగేశక్తి దివ్యదృష్టి. ఇది దైవసంబంధమైన శక్తి. ఇలాంటి శక్తిగలవారు దివ్యులు. సృష్టి సమస్తం శ్రియః పతి ఆజ్ఞాబద్ధమై ఉంటుందని, ఆయన ఆజ్ఞ లేనిది తృణమైనా చలించదని 'కమలపత్రనయను బొమముడి మాత్రాన నాశమందు' అనడంవల్ల దృఢమవుతున్నది.

'సాటిలేని రాజ్యవైభవాలతో గర్వంతో కనులుమూసుకుపోయి పాప మార్గాలలో పయనించే రాజులు పొందలేని ఈ దివ్యభోగాలు నీ పాతివ్రత్య మహిమవల్ల నీకు లభించాయి. వాటిని సమబుద్ధితో అనుభవించు. నీకు కార్యసిద్ధికూడా కలుగుతుంది' అని యోగమాయలందు సమర్ధుడైన క
ర్దముడు చెప్పగా దేవహూతి తన భర్తను తిలకించింది. ఆమె మనోవ్యథ తొలగిపోయింది. కడకన్నులతో, పాడమిన సిగ్గుతో మోము వంచుకొంది. వినయంతో చనువుతో పారవశ్యంతో ముద్దుముద్దుగా తన భర్తతో ఇలా అన్నది.

'ఓ పుణ్యస్వరూపా! నీవు అమోఘమైన యోగమాయలకు అధిపతివి. సర్వసమర్జుడవు. నీయందు సాటిలేని దివ్య భోగాలుండడం సత్యం. అది నాకు తెలుసు. నీ సాంగత్యంవల్ల ఆ భోగాలన్నీ నాకు లభిస్తాయి. అయినప్పటికీ దేవా! నీవు సంతానం కలిగేవరకే నాతో శరీరసంగమం కలిగి ఉంటానని ఆనాడు ఒక నియమం ఏర్పరచావు. ఆ నియమాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని నీ సాంగత్యాన్ని నాకు దయతో అనుగ్రహించు. నీ సంయోగాభిలాషతో చిక్కిపోయిన ఈ తనువు స్నానపాన భోజనాలవల్ల ఎలా తుష్టిపొందుతుందో. అలాంటి నా కోరికను తీర్చడానికి రతిరహస్యాలను తెలియజేసే కామశాస్త్రపద్ధతులను నాకు బాగా నేర్పు. అందుకు తగిన అనేకవిధాలైన వస్త్రాలు, ఆభరణాలు, పూలదండలు, మైపూతలు, శయనమందిరాలు, ఉద్యానవనాలు మొదలైన ముఖ్యవస్తువులను విరివిగా సమకూర్చి నన్ను దయచూడు' అని పలికిన దేవహూతి మాటలు విని గొప్పవాడైన ఆ క
ర్దముడు తన యోగమాయాబలంతో ఆ క్షణంలోనే ఒక దివ్యవిమానాన్ని సృష్టించాడు.

ఆ విమానంలో అందమైన వివిధ మందిరాలు ఉన్నాయి. ఆ మందిరాలన్నీ మణిమయ స్తంభాల కాంతులతో విలసిల్లుతూ ఉన్నాయి. గరుడపచ్చలు పొదిగిన నడవలతో, మంచిరకం వజ్రాలు తాపిన గోడలు తలుపులతో, పగడాలు తాపిన గడపలుగల వీథులతో చూడముచ్చటగా ఉన్నాయి. ఆ మందిరాలపై ఇంద్రనీలమణుల శకలాలు పొదుగబడి మెలిమిబంగారుతో నిర్మితమైన కలశాలు అమర్చబడి ఉన్నాయి. ఆ కలశాలు ధగధగమని మెరుస్తూ ఉన్నాయి. ఆ మెరుపులకు తగినట్లు పద్మరాగాల మొగ్గలు చెక్కిన వైడూర్యపు చూరులు సొగసుగా ఉన్నాయి. మందిరాలపై గాలికి రెపరెపలాడుతూ జెండాలు అమరి ఉన్నాయి. కర్ణపేయంగా ఝంకారం చేసే తుమ్మెదల బృందంతో కూడి వ్రేలాడుతున్న పూలదండల తోరణాలతో ఆ మందిరాలు మనోహరంగా అలరారుతున్నాయి.

(క
ర్దమమహాముని క్షణంలోనే సృష్టించిన దివ్యవిమానంలో అందమైన మందిరాలున్నాయి. ఆ మందిర నిర్మాణంలో వాడబడినవి - మణులు, మరకతాలు, వజ్రాలు, విద్రుమాలు, హరినీలాలు, పద్మరాగాలు, వైడూర్యాలు. ఇవన్నీ ఎంతో విలువైన రత్నాలు. ఇవి నవరత్నాలలోనివి. ఆ మందిరాల నిర్మాణంలో వాడినవి నవరత్నాలలో ఏడుమాత్రమే. ఇక మిగిలిన రెండు - కెంపులు, గోమేధికాలు. భార్య కోరిక మేరకు సృష్టింపబడిన మందిరాలు ఎంత అందంగా ఉంటే ఆమెకంత సంతోషంగా ఉంటుందని భావించి కర్దముడు చేసిన అపూర్వ సృష్టి అది.)

ఆ విమానంలోగల మందిరాలలోని గదులలో జిలుగువస్త్రాలు, చీనాదేశపు పట్టువస్త్రాలు, పట్టు చీరలు, పలురకాలైన వస్త్రాలు అందంగా కనిపిస్తున్నాయి. ఆశ్చర్యకరమైన రంగురంగుల పట్టెమంచాలు అమర్చబడి ఉన్నాయి.

(చీనాంబరమంటే సాధారణంగా పట్టువస్త్రమని అర్థం. చీనా (చైనా) దేశంలో తయారైనది కావడంవల్లనే చీనాంబరమని పేరేర్పడింది. ప్రాచీనకాలంలో తూర్పు ప్రాచ్యదేశాలనుండి అరుదైన వస్తువులను దిగుమతి చేసుకొనేవారు. అలాంటి వస్తువులలో చీనాంబరం ముఖ్యమైంది. ప్రాచీన సాహిత్యంలో చీనాంబరాల ప్రస్తావన కనిపిస్తున్నది.)

అక్కడ సుందరమైన ఉద్యానవనాలలో విలాసంగా విహరిస్తున్న రాజహంసలు, కోయిలలు, పావురాళ్లు, జక్కవపిట్టలు, నెమళ్లు మొదలైన పక్షులు మందిరాల గోడలమీద చెక్కబడిన కృత్రిమపక్షులను చూచి తమ జాతికి చెందిన నిజమైన పక్షులుగానే భావించి ఎంతో ఉత్కంఠతో వాటిని పలుకరిస్తూ అక్కడగల చెట్లకొమ్మల పై అటూ ఇటూ దాటుతూ కేరింతలు కొడుతూ ఆడుతూ ఉంటాయి.

(మూలంలో హంసలు, పావురాళ్లు మాత్రమే చెప్పబడగా పోతన ఇంకా కోయిలలను, చక్రవాకాలను, చిలుకలను, నెమళ్లను కూడా చేర్చి చెప్పడంవల్ల ఆ పక్షులన్నింటి కృత్రిమ రూపాలను గోడలమీద చెక్కినట్లు అర్థమవుతుంది. అందువల్ల మందిరాలగోడలు అందంగా కనిపించాయి. మూలంలో 'వికూజితం' అని ఒకేమాటలో పక్షులు శబ్దం చేస్తున్నాయని వ్యక్తం చేయబడగా పోతన 'కుతూహలియై పల్కుచు నాడుచుండున్‌' అని వ్యాఖ్యానప్రాయంగా వ్రాశాడు.)

ఇంకా ఆ విమానంలోపలి భవనాలు శయ్యలతో, గద్దెలతో, క్రీడాగ్భహాలతో, కల్పితమైన క్రీడాపర్వతాలతో, పాలరాతిభవనాలతో ఫలవృక్షాల వనాలతో కూడి ఉన్నవి.

సమస్తఋతువులశోభలతో, సకలసుఖాలతో, సర్వసంపదలతో సమస్త సుఖాలు అనుభవించడానికి యోగ్యమై, ఎల్ల కోరికలను నెరవేర్చగలదై, అందమైన అలంకారాలతో ఒప్పుతున్నది.

అలాంటి సర్వసంపదలతో, అలంకారాలతో ఒప్పుతున్న మహిమాన్వితమైన విమానాన్ని సృష్టించిన క
ర్దమమహాముని అందులో కంటికింపైన చిత్రచిత్రపు శోభావిశేషాలను నిర్మాణం చేసిన తానుకూడా తెలుసుకోలేనంతటి ఆశ్చర్యకరమై నిర్మాణపు పనితనం గలిగిన ఆ విమానాన్ని తనభార్య దేవహూతికి చూపించాడు. ముగ్ధయైన దేవహూతి ఆ విమానాన్ని చూచి సంతోషపడలేదు. ఆ విషయం తెలిసి సమస్తప్రాణుల అంతరంగాలలోగల అభిప్రాయాలను గ్రహించగలవాడూ, సంతోష హృదయుడూ అయిన కర్దమమహాముని దేవహూతితో ఇలా అన్నాడు.

ఓ సుందరీ! భగవంతుడు నిర్మించినది, సమస్తశుభాలకు ఆకరమైనది అయిన ఈ జలాశయం బిందుసరోవరమనే సరస్సు. ఆసక్తితో ఈ సరస్సులో స్నానం చేసిన ప్రాణులకు కోరిన కోరికలు నెరవేరుతాయి. కావున నీవు కూడా.

'దేవహూతీ! సిగ్గుపడకు. నీవు ఈ సరస్సు నీళ్లలో ఎంతో భక్తితో స్నానంచేసి సంతోషంగా ఈ విమానాన్ని అధిరోహించు' అని క
ర్దమమహాముని బుజ్జగిస్తూ పలికాడు.

కలువరేకులవంటి కనులుగల దేవహూతి భర్తమాటలు విన్నది. ఆమె పతిని సేవించడంలో అలసిపోయింది. చీరమాసిపోయి ఉంది. వెండ్రుకలు జడలు కట్టినాయి. శరీరం ధూళిధూసరితమై కృశించింది. వక్షస్థ్సలం వివర్ణమైపోయింది(ఎండిపోయినట్లయింది). తన భర్త ఆజ్జననుసరించి ఆమె సరస్వతీనది జలాలతోను, జలచరాలతోను నిండిన బిందుసరోవరంలో స్నానం చెయ్యడానికి దిగింది. ఆ సమయంలో ఆ జలప్రవాహంలో అందమైన వలిపములు కట్టుకొన్నవారూ, నవయౌవనంలో ఉన్నవారూ, కలువపూల పరిమళం కలవారూ అయిన కన్యలు వేలమంది దేవహూతిని చూచి ఆమెతో ఇలా అన్నారు.

ఓ యువతీ! మేము ధర్మకార్యాలను ఆచరిస్తూ ఉంటాం. నీకు నిర్మలమైన భక్తితో సేవ చేయగలం. మమ్ములను దయతో కూడిన చూపులతో వీక్షించు.

(వేలమంది కన్యలు పరిచారికలుగా దేవహూతికి సేవలు చేస్తామన్నారు. ఆ సేవకూడా ధర్మాచరణే. వాళ్లదగ్గర సంచిత ధర్మముంది. ఎప్పుడూ ధర్మాచరణ చేస్తూ ఉంటారు కాబట్టి ధర్మం వాళ్లదగ్గర మిగిలే ఉంటుంది. అలా మిగిలిన ధర్మం సంచిత (కూడబెట్టుకొన్న) ధర్మంగా ఉంటుంది.)

సేవలు చేస్తామని చెప్పిన కన్యలు దేవహూతి వద్దకు వెళ్లారు. ఆమెకు నలుగు పెట్టారు. బంగారు బిందెలలో నింపిన చందన కర్పూర పరిమళాలు వెదజల్లే నీళ్లతో ఆమెకు స్నానం చేయించారు. శరీరంమీద తడిని తెల్లని వస్త్రాలతో తుడిచారు. అగరు ధూపం వేశారు. కస్తూరి పంకంతో ఒడలికి పూతలు పూశారు. మధురంగా ధ్వనించే మణిమంజీరాలు పాదాలకు తొడిగారు. చిరుగంటల సవ్వడితో కూడిన ఒడ్డాణం నడుముకు అలంకరించాడు. రత్నాలు తాపిన ఆభరణాలను చెవులకు అలంకరించారు. ఉంగరాలు, కంకణాలు మొదలైన సముచితమైన విలువైన బంగారు ఆభరణాలను కైసేశారు. మంగళప్రదమైన పూలమాలలు సమర్పించారు. మైపూతలు, విలువైన వస్త్రాలు ఇచ్చారు. షడ్రసోపేతమైన పలురకాల భోజనంతో సంతృప్తి పరిచారు.

డ్రసోపేత భోజనంతో దేవహూతిని సంతృప్తిపరిచి ఆ కన్యలు ఆమెకు బంగారు పళ్లెరాలలో శాంత్యుదకాలు నింపి అందులో కర్పూరం వెలిగించి హారతులు పట్టారు. మనోహరమైన పీఠంమీద కూర్చుండబెట్టి అద్దం చేతికిచ్చారు. దేవహూతి ఆ అద్దంలో ప్రతిఫలించిన తన రూపం చూచుకొని భర్తయైన కర్దముని మనస్సులో భావించింది. ఆ క్షణంలోనే కర్దముడూ, వేల కన్యలూ ఆమెముందు సాక్షాత్కరించారు. తన భర్త యోగమాయా ప్రభావానికి ఆమెకు ఆశ్చర్యం కలిగింది. అప్పుడు కర్దముడు స్నానం చేసి ఉన్న దేవహూతిని చూచాడు. పెండ్లికి ముందు ఆమె ఏ విధంగా ఉండినదో ఇప్పుడూ అలాగే చక్కదనంతో ఉన్నందుకు కర్దముడు ఆనందభరితుడయ్యాడు. కన్యలందరూ భార్యనూ, తననూ సేవిస్తూ ఉండగా సతీసమేతుడై తన విమానం ఎక్కి చుక్కలతో చుట్టబడిన రోహిణీ సహితుడైన చంద్రుని వలె ప్రకాశించాడు. ఆ తరువాత-

నిత్య మంగళస్వరూపుడైన ఆ క
ర్దమముని సమస్త దిక్పాలురూ విహరించడానికి యోగ్యమైనది, మనోహరంగా వీచే మందమారుతంతో శోభించేది, సమీపంలో గైరికాది ధాతుమయములైన సెలయేళ్ల నీళ్లతో ప్రవహించే నీళ్లతోనూ, చల్లని మంచుతోనూ ఒప్పునట్టి మేరుపర్వత గుహకు వెళ్లి దేవవనితలతో కూడిన కుబేరునివలె విహరించాడు.

(కుబేరుడు యక్షరాజు. యక్షుడు అంటే పూజింపబడువాడు. ఇతనికి ధనాధిపుడని మరొకపేరు. ధనాధిపుడంటే ధనాన్ని రక్షించువాడని అర్థం. పైగా శివుని సఖుడు. అందువల్లనే క
ర్దముడు కుబేరునివలె విహరించాడని చెప్పబడింది.

ప్రధాతునిర్ఝర - సెలయేరు కొండలపై నుండి గైరికాది ధాతువులను తనలో కలుపుకొని క్రిందికి ప్రవహిస్తుంది. గిరౌ భవం గైరికం(పర్వతమున పుట్టినది) అని గైరిక శబ్దానికి వ్యుత్పత్తి. హరిదళం, గంధకం మొదలైన శిలావికారాలు ధాతువులు. హరిదళం ఎరుపుగా, గంధకం పసుపుపచ్చగా ఉంటాయి కాబట్టి గైరికాది ధాతువులంటే పర్వతాలమీద గల ఎర్రని పసుపుపచ్చని మట్టి విశేషాలని చెప్పవచ్చు.)

ర్దమమహాముని భార్యాసమేతుడై కామగమనంగల విమానం ఎక్కి దేవతల ఉద్యానవన భూములను తిలకించాడు. కొత్త పూదోటలున్న ప్రదేశాలు సందర్శించాడు. వికసించిన కలువలతో పద్మాలతో విరాజిల్లుతూ ఉన్న మానససరోవర తీరాలను చూచాడు. మదికింపైన పొదరిండ్లను అవలోకించాడు. కుబేరుని ఉద్యానవనమైన చైత్రరథాన్ని సంతోషంతో దర్శించాడు.

(దేవతల ఉద్యానవనం నందనవనం. నందనవనం దేవేంద్రుని స్వాధీనంలో ఉంటుంది. ఈ వనంలోకి వెళితే ఆనందం కలుగుతుంది. అందుకని దీనికి నందన(నందయతీతి నందనం = సంతోషింపజేయునట్టిది) వనమనిపేరు. ఇక్కడ చెప్పబడినవన్నీ విహారానికి అనువైన ఆరామాలు, పూపొదరిండ్లు, సరోవరతీరాలు. భర్తతో కలసి విహరించాలనే కోరికగల దేవహూతిని ఈ విహారయోగ్యమైన ప్రదేశాలకే క
ర్దముడు తీసుకొని వచ్చాడు. విస్రంభంతో, నెయ్యంతో చూచాడనడం ఎందుకంటే తొందరలేకుండా, ఎవరి బెదిరింపు లేకుండా సావకాశంగా తిలకించాడని చెప్పడానికి.)

ఈ విధంగా క
ర్దముడు భార్యతో కలసి విమానంమీద వాయువేగంతో, కలయదిరిగి విమానమెక్కి సంచరించేవాళ్లందరిని మించి లోకాలన్నీ సంచరించాడు. మోక్షప్రదాత, పరమపూజ్యుడు అయిన విష్ణుదేవుని స్తుతించి సేవించే పుణ్యాత్ములకు పొందరాని వస్తువులుంటాయా? ఇలా కర్దముడు దేవహూతికి సమస్త భూమండలం చూపించి మరల తన నివాసానికి తీసుకొని వచ్చాడు. తనభార్య కామకేళీ వినోదానికి ఇష్టపడుతున్నట్లు గుర్తించాడు. రతిక్రీడాపరాయణుడైనాడు. ఆ దంపతులు పలువిధాలైన సుఖభోగాలను అనుభవిస్తూ అనేక సంవత్సరాలు క్షణాలవలె గడిపారు. సరసమైన చూపులతో, తగిన కౌగిలింతలతో, సంభాషణలతో, కాలం గడవడమే తెలియకుండా వారు నూరేండ్లు గడిపారు.

ఒకనాడు క
ర్దమముని కుతూహలంతో తనదేహాన్ని తొమ్మిది దేహాలుగా చేసుకొని క్రమంగా తన వీర్యాన్ని తన భార్య దేవహూతి గర్భంలో తొమ్మిది విధాలుగా నిలిచేటట్లు చేశాడు.

ఆ కారణంగా క
ర్దమమునివల్ల దేవహూతి తొమ్మిదిమంది కూతుండ్రను కన్నది. ఆమె తనమనస్సులో ఎంతో సంతోషించింది. తరువాత కర్దమముని -

దేవహూతి తొమ్మండుగురు కూతుళ్లను కన్నతరువాత క
ర్దమముని సన్యాసం తీసుకోవాలనుకొన్నాడు. ఆ విషయం తెలుసుకొన్న దేవహూతికి మనస్సులో ఆవేదన అధికమైంది. చింత కలిగింది. చెక్కిలిమీద చేయిచేర్చి కాలివేళ్లతో నేలపై రాస్తూ భర్తతో ఇలా అన్నది.

అనఘా! సంతానం కలిగేవరకు నాతో కలసి ఉంటానని ముందు నీవు చెప్పావు. కొమార్తెలను ప్రసాదించావు. ఇప్పుడు ఈ యువతులు తమకు తామే భర్తలను ఎలా వెదకుకోగలరని భయపడుతున్నాను. కావున ఈ పుత్రికలకు తగిన పెండ్లికొడుకులను వెదకి వాళ్లకు పెండ్లిండ్లు చేసి, నాకు తత్త్వవిషయాలు తెలియజేయగల కుమారుని ప్రసాదించు. సాధుజనస్తవనీయా! సంసారదుఃఖాన్ని తొలగించడానికి సమర్థుడవు నీవే. గడచిన కాలమంతా కామసుఖంపైగల మోహంతో ముక్తిమార్గాన్ని గురించి ఆలోచించకుండా వ్యర్థంగా గడచిపోయింది.

మహాత్మా! నాకు ఈ లోకసంబంధాలైన సుఖానుభవాలలో ఆసక్తి నశించింది. ముందు నేను చంచలభావంతో నీతో రతిసాంగత్యాన్ని అపేక్షించి స్వచ్చమైన నీ భావాన్ని తెలుసుకోలేక ఏ వేవో కోరాను. ఆ కోరికలను తీర్చావు. నిన్ను నిర్మలమైన భక్తితో సేవిస్తే ముక్తి లభించదా? తప్పక లభిస్తుంది.

('అచ్చపుందలంపు' అంటే క
ర్దముని యోగమాయాతత్త్వం. దాన్ని పూర్తిగా తెలుసుకోవడం. అన్ని సంవత్సరాలు కర్దమునితో కలసిఉన్నా దేవహూతికి ఆయన మహత్తు పూర్తిగా తెలియలేదు. దానికి కారణం ఆమెకుగల కామభోగాసక్తత. ఆయనను కామదృష్టితోనే ఇన్నాళ్లూ చూచింది. ఇప్పుడామెకు భోగదృష్టి పోయింది. అనుభవించాలనే ఆసక్తి నశించింది. ఆమె మనోనేత్రం మేలుకొంది. గడచినకాలం ఎంత వృథాగా పోయిందో అర్థమైంది. అప్పుడామెకున్నది చంచలస్వభావం. ఇప్పుడు ముక్తిని గురించి ఆలోచించే స్థిరచిత్తంతో ఉంది. కర్దముడే ముక్తి నివ్వగల మహత్తు కలవాడని గ్రహించగలిగింది.)

అంతేగాక అందరియెడల సమానబుద్ధితో ప్రవర్తించే సజ్జనులమైత్రి ఉత్తమగతికి కారణమవుతుంది. అల్పబుద్ధిగల చంచలచిత్తులైన దుష్టపురుషుల మైత్రి దుర్గతికి కారణమవుతుంది. యోగిజనసన్నుతా! ఈ విషయాన్ని మనస్సులో భావించి నిన్ను నేను సేవిస్తాను. ప్రాణుల సమాగమంవల్లనే ఎట్టివారికైనా పుణ్యాలో పాపాలో ప్రాప్తిస్తాయి.

(దేవహూతి వైరాగ్యభావంతో మాట్లాడుతూ ఉంది. సజ్జనులతో సాంగత్యం కలిగి ఉంటే అది పుణ్యహేతువు అవుతుంది. అంటే- సంసార క్లేశనివారణ హేతువవుతుంది. అదే అసజ్జనులతో సాంగత్యం ఏర్పరచుకొంటే ఆ సంబంధం పాపానికి దారితీస్తుంది. అంటే - సంసార దుఃఖం కలుగుతుంది. అందరి దుఃఖాన్ని నిశ్శేషంగా నశింపజేసి వారికి ఆనందాన్ని ఇవ్వగల సమర్థుడు కర్దముడు. ఇన్నాళ్లూ ఆయనతో కలసి ఉండినా ముక్తిని గురించి మాట్లాడక పోవడం ఎంతో దుఃఖం కలిగించే విషయమని దేవహూతి బాధపడుతూ ఉంది.)

ఇలా మిక్కిలి బాధతో పరితపిస్తూ పలికిన దేవహూతిని చూచి శ్రీహరి మాటలు తలపుకు తెచ్చుకొని కర్దముడు ఆమెతో ఇలా అన్నాడు.

దేవహూతీ! నీవు మనస్సులో దుఃఖించవద్దు. భగవంతుడు, అనఘుడు, అక్షరుడు, జనార్దనుడు అయిన శ్రీహరి అచిరకాలంలోనే తప్పక నీ గర్భంలో ప్రవేశిస్తాడు.

(తన కాలమంతా వృథాగా గడచిపోయిందని, ముక్తిమార్గాన్ని గురించి తెలుసుకొనే అవకాశాన్ని ఉపయోగించుకోలేక పోయానని పరితపిస్తూ ఉన్న దేవహూతికి క
ర్దముడు కలిగించిన సాంత్వనమిది. ఆమె తనకు తత్త్వబోధ చేయగల కొడుకును ప్రసాదించమన్నది. శ్రీహరే ఆమెకు కుమారుడుగా అవతరింబోతున్నాడని చెప్పి కర్దముడు ఆమెను సంతోషపరిచాడు.)

నీవు ఉత్తమనియమాలు, వ్రతాలు, నిష్ఠలు - ఇవన్నీ ఆచరించు. గొప్ప నిగ్రహంతో కూడిన మనస్సు కలదానివై నిండైన తపస్సు, ధనత్యాగం, దానం చేస్తూ శ్రద్ధాభక్తులతో కూడినది కాగా.

(తపోధన - అన్నపుడు తపోధనం అని అర్ధం చెప్పవచ్చు. ఇలా చెప్పడమే సమంజసంగా కూడా ఉంటుంది. అయితే మూలంలో 'తపోద్రవిణదానైశ్చ' అని తపస్సు, ధనం (ద్రవిణం) దానం వేరువేరుగా స్ఫురింపజేయడంవల్ల ప్రతిపదార్థంలో తపస్సు, ధనం వేరువేరుగా చూపబడినాయి. ఇవన్నీ 'నియుక్త అంతరంగంతో' నిర్వర్తించుమని ఉండడంవల్ల ధనం సంగ్రహించుకోవడం కాకుండా ఉన్నధనాన్ని కూడా వదిలించుకోవలసిన అవసరముంది. బాహ్యేంద్రియ నియమం, ఆంతరికమైన నియమం కలసి నియుక్త అంతరంగం. ఇలాంటి అంతరంగాన్ని సాధించాలంటే ధనత్యాగం చేయాలి. అందుకని 'ధన' కు ధనత్యాగం అని అర్థవివరణ చేయబడింది.)

శ్రీమన్నారాయణుని పాద పద్మాలను నిండైన భక్తితో పూజించు పురుషోత్తముడైన ఆ భగవంతుడు మనస్సులో నీ పూజకు సంతృప్తిచెంది నీ గర్భంలో నివసించి (నీ పుత్రుడుగాపుట్టి) నీ మనస్సులో ఏర్పడిన సందేహాల ముడులను ఛేదిస్తాడు.

(ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకొని ముక్తిమార్గానుగాములైన వాళ్లకు మనస్సులో అనేక సందేహాలుంటాయి. ప్రతి సందేహమూ ఒక ముడిలాంటిదే. ఒక సందేహంతీరితే మరొక సందేహం కలుగుతుంది. అందుకే శంకాగ్రంథిని సందేహాలముడులు అనడం.)

దేవహూతి గర్భంబున విష్ణుండు గపిలాచార్యుండుగా నుదయించుట

No comments:

Post a Comment

Kardama Created Self-Moving Aerial Mansion (Vimana) with Yogic Powers For his Wife - కర్దమప్రజాపతి యోగప్రభావంబుచే విమానంబు గల్పించి భార్యతో గూడి విహరించుట

కర్దమప్రజాపతి యోగప్రభావంబుచే విమానంబు గల్పించి భార్యతో గూడి విహరించుట ఈ విధంగా స్వాయంభువమనువు తన కుమార్తె దేవహూతిని కర్దమమునికిచ్చి పెండ్లి ...