Wednesday, February 11, 2026

Shringi Rishi maharshi Curses King Parikshit - శమీకపుత్త్రుండగు శృంగి పరీక్షితుని శపించుట

శమీకపుత్త్రుండగు శృంగి పరీక్షితుని శపించుట

తండ్రీ! భటులు, ఏనుగులు, రథాలు, గుఱ్ఱాలు గల సేనతో రాజ్యాన్ని ఏలే రాజొకడు వచ్చి, నీటికోసమై తహతహపడి, మంచి చెడ్డ ఆలోచింపక నీ తండ్రిమెడలో పామును వేసివెళ్లినాడు.

ఆ మాటలు విని, ముని కుమారులతో ఆడుతున్న శృంగి, కొమ్ములతో రూపం దాల్చినట్లు విజృంభించి, రోషావేశంతో అదరిపడుతూ ఇట్లన్నాడు "ఈ రాజులు బలి పెట్టిన పిండాలు తిని బలిసిన కాకులు. ద్వారాల కడ కాచుకొని ఉన్న కుక్కలు! దాసులైన ఈ క్షత్రియులమని అనుకొనేవారిని భూసురోత్తములు తమ గృహరక్షకులుగా ఎట్లు నియమించినారు? ద్వారపాలకులుగా మాత్రమే ఉండదగినవారు వంట యింటిలో ప్రవేశించి వండిన అన్నం తినటానికి ఎలా అర్హులౌతారు? వారు చేసే ద్రోహకార్యాలకు యజమాని ఎందుకు బాధ్యుడౌతాడు?

మాతండ్రి తనను నిందింపలేదు. ఆశ్రమవాసులతోనే గాని శత్రువులతో కూడలేదు. కందమూలాలు తిని, నిశ్చల సమాధిలో అంతర్దృష్టిని విడువక నిరంతరం తన ఇష్టదైవాన్ని తప్ప అన్య ప్రపంచాన్ని చూడకుండ తానేమో, తన లోకమేమో అన్నట్లున్న ఆయనపై ఆ రాచవాడు అరాజకంగా పామును మెడలో చుట్టడం ఎందుకు?

రాజుల కడకు మేము హిరణ్యదానాలు గ్రహించటానికి పోలేదు. ధనములు తేలేదు. ఆశీర్వాదములని చెప్పి మోసంచేసి వారి ద్వారాల కడ నిలిచి విసిగించలేదు. ఇండ్లపై కూడ ఆసక్తిని వీడి ఆడవులలో పడి ఉన్నాము. అట్టియెడ బ్రహ్మర్షి అయిన మా తండ్రిమెడలో పామును వేయటం తగునా?

ప్రాజ్య సామ్రాజ్యాన్ని ఏలే సమ్రాట్టులు తమ్ము ప్రజలు పొగడగా పంచభక్ష్యపరమాన్నాలు భుజింపవచ్చు. విలువగల వలువలు ధరించవచ్చు. అంతేకాని అడవులలో ఇడుమలుపడే బడుగు (తాపసుల) జడదారుల మెడలో చచ్చిన పామును చుడతారా?

భగవంతుడు శ్రీకృష్ణుడు లోకాన్ని విడిచి వెళ్లిన అనంతరం సమర్థుడైన శాసకుడు లేకపోవటం వలన దుర్మార్గులు చెలరేగి నిరపరాధులైన సాధువులను బాధిస్తున్నారు.

బాలకులారా! నే నిప్పుడే ఆ రాజుకు శాపం పెడతాను అని మునిబాలకుడైన శృంగి ముల్లోకాలను ఏలే వారికే అదరుపాటు కలిగేట్లుగా వడివడిగా వెడలినాడు.

కౌశికి నదికి రోషంతో వెళ్లి, నీళ్లు చేతిలోకి తీసికొన్నాడు.

లేశమైన సంకోచం లేకుండ చచ్చిన పామును తీసికొని వచ్చి మా తండ్రి భుజంపై పడవేసి దురహంకారంతో కన్ను మిన్ను కానని ఆ రాజు హరిహరులు అడ్డుపడినా నేటికి ఏడవ దినం తక్షకుని విషాగ్ని జ్వాలలకు దగ్ధమయిపోతాడు.

అని శమీక మునీంద్రుని కొడుకు పరీక్షిన్మహారాజును శపించి ఆశ్రమం చేరి ధ్యాన నిమగ్నుడైన తండ్రిని చూచినాడు. అప్పుడు ఆయన మెడలో ఆ చచ్చినపాము వ్రేలాడుతూనే ఉన్నది.

అయ్యో! తండ్రీ! ఈ సందర్భంలో నీ మెడలో చచ్చిన పామును పడవేసిన ఆ దొరగారిని ఏమి చేస్తాను? రాజులకు స్నేహధర్మాలు లేవు సుమా!

ఓ తాపసులారా! ఎవరో రాజు వేటకైవచ్చి నిరపరాధియైన నా తండ్రిమీద నిష్కారణంగా నిర్దయుడై ఈ చచ్చిన పామును మెడలో పడవెసి వెళ్ళినాడు. భయంకరమైన సర్పం మరలా బ్రతుకుతుందో ఏమో! క్రూరమైన కోరలతో కాటు వేస్తుందో ఏమో! మీకు నమస్కరిస్తున్నాను. రండి, ఈ పామును తీసి పారవేయండి. మా తండ్రిని కాపాడండి.

అట్లు పలుకుతూ భయంతో ఆ పామును తొలగించే నేర్పు లేక బిగరగా కొడుకు ఏడ్చినాడు. ఆ కుమారుని ఆక్రందన ధ్వని విని, శమీక మహాముని తన సమాధి చాలించి మెల్లగా కన్నులు తెరచినాడు. భుజంపై వ్రేలాడుతున్న భుజంగాన్ని తీసి దూరంగా పారవేసి, కొడుకును జూచి

నాయనా! మనం ఎవరికీ ఏ కీడు చేసినవారము కాము. లోకులందరినీ సమానంగా ఆదరిస్తాము. నీవు ఎందుకు ఏడుస్తున్నావు? ఈ సర్పం నా మెడకు ఎలా వచ్చింది?

అనీ ప్రశ్నించినాడు. అప్పుడు కుమారుడు శృంగి, రాజు వచ్చి పాము వేయటం, తాను ఆ రాజును శపించటం తెలిపినాడు. వెంటనే శమీకుడు తన దివ్యదృష్టితో ఆ రాజు పరీక్షిన్మహారాజని తెలుసుకొని, కొడుకు చేసిన పనికి బాధపడి ఇట్లన్నాడు.

కుమారా! ఇంతటి కఠోర శాపాన్ని పెట్టటానికి అంతటి గొప్ప కీడు ఆ మహారాజు ఏమీ చేయలేదు. తక్షక విషాగ్ని జ్వాలలపాలు కమ్మని ఆ ధరణీనాథుని అయ్యయ్యో! ఎందుకు శపించినావు?

సమర్థుడవైన బ్రహ్మచారీ! పాపము! పరీక్షిత్తు తన తల్లి గర్భమునందే దహింపబడి, శ్రీకృష్ణుని అనుగ్రహంతో బతికి బయటపడినాడు. ఇప్పుడు పరాక్రమంతో ప్రజలను పరిపాలిస్తున్నాడు. అటువంటి రాజును శపించవచ్చునా?

బాలకా! ప్రభువైన కృష్ణుడు లేకపోవటంచేత లోకము పుష్టిని కోల్పోయి ఏపు చెడినది. ప్రజలు కాపరిలేని గొర్రెలవలె కడగండ్లకు లోనైనారు. దొంగలు, దుండగులు విచ్చలవిడిగా చెలరేగినారు. ఇట్టి స్థితిలో మహారాజు అందరిని సమదృష్టితో ఎంతో సమర్థంగా పాలిస్తున్నాడు. ఏదో జరిగిన చిన్న తప్పిదానికి అయ్యో! రాజును ఎందుకు శపించినావు?

కుమారా! నీ మూలంగా మనకు పాపం ప్రాప్తించింది. రాజు మరణింపగా ఆ రాజ్యంలో అరాచకం హద్దులు మీరుతుంది. బలం కలవాడు బలంలేని వానిపైబడి అతని సర్వస్వాన్నీ అపహరిస్తాడు. జారులు, చోరులు ఎచ్చట చూచినా బారులు తీరి విచ్చలవిడిగా విహరిస్తారు. ప్రజల్లో పరస్పర కలహాలు పెరిగిపోతాయి. వైదికములైన వర్ణాశ్రమములు, ధర్మాలు పూర్తిగా నశిస్తాయి. ధర్మం నశించిపోగా అర్ధ కామాలపై ఆసక్తి పెరుగుతుంది. చివరకు రాజ్యమంతటా కోతుల్లో, కుక్కల్లోవలె వర్ణసంకరం ఏర్పడుతుంది.

ఆ రాజు పవిత్రమైన భారత వంశంలో పుట్టినవాడు. పరమ భాగవతుడుగా పేరు కెక్కినవాడు, అశ్వమేధం చేసినవాడు, సదాచార సంపన్నుడు. గొప్ప రాజనీతిజ్ఞుడు. రాజకులాలంకారుడు అంతటి మహారాజు దప్పిక చెంది నీటికోసం మన తపోవనానికి విచ్చేయగా ఎంతో ఆదరంతో అతిథిసత్కారాలు చేయక ఊరక పంపటం ఉచితం కాదు. సత్కారం చేయకపోగా శపించటం యేమి న్యాయం? ఇది ధర్మమా?

ఓ పరమేశ్వరా! శ్రీకృష్ణా! హరీ! మా పిల్లవాడు బుద్ధిచాపల్యంతో నిరపరాధియైన పరీక్షిన్మహారాజునకు శాపం పెట్టి పాపం కట్టుకొన్నాడు. వీడు చేసిన దోషాన్ని తొలగించుము తండ్రీ!

కుమారా! పరమభక్తులైనవారు కొట్టినా, తిట్టినా శాంతంతో సహిస్తారే కాని ప్రతీకారం చేయటానికి సమ్మతింపరు. ఆ మహారాజు నీకు కించిత్తుకూడా కీడు చేయడు.

సాధుస్వభావంగల సజ్జనులు ఇతరులు చేసిన ఉపకారానికి పొంగిపోరు, అపకారానికి క్రుంగిపోరు. మహనీయుల ఆత్మలను సుఖదుఃఖాలు ఆవహింపవు.

అని ఈ విధంగా శమీక మహాముని తన కుమారుడు గావించిన తిరుగులేని శాపరూపమైన పాపానికి మిక్కిలి తాపం చెందినాడు. వెంటనే తన శిష్యుడైన ఒక మునిపుత్రుని పిలిచి జరిగిన వృత్తాంతమంతా మహారాజుకు తెలిపి రమ్మని పంపినాడు. అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్తు మునిశిష్యునివలన శమీక మహామునికుమారుని శాపవృత్తాంతం విని, కామ క్రోధాది విషయజాలంలో తగుల్కొన్న తనకు తక్షకుని విషజ్వలనజ్వాలలు వైరాగ్యానికి మూలమైనవని భావించి, హస్తినాపురి చేరి ఒంటరిగా ఉండినాడు.

No comments:

Post a Comment

Sree Maha Bhagavathamu Part 2 - శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము శ్రీ మహా భాగవతము ద్వితీయ స్కంధము ప్రారంభము శుకుడు పరీక్షిత్తునకు ముక్తి మార్గంబుందెల్పుట