Tuesday, February 24, 2026

Maha Shiva Siva Ratri Shivaratri- మహా శివరాత్రి

మహా శివరాత్రి

ఒకసారి పార్వతీదేవి పరమశివుని దగ్గర శివరాత్రి గురించి ఆడుగుతుంది. అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమనీ, ఇంకేమి చేయకుండా ఆ రోజు ఒక్క ఉపవాసమున్నాసరే తనెంతో సంతోషిస్తానని చెబుతాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం, ఆ రోజు పగలంతా నియమనిష్ఠలతో ఉపవాసంతో గడిపి, రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో, తర్వాత పెరుగుతో, ఆ తర్వాత నేతితో, ఆ తర్వాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది. మరునాడు బ్రహ్మవిదులకు భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రత సమాప్తి చేయాలి. దీనిని మించిన వ్రతం మరొకటి లేదంటాడు పరమశివుడు.

మామూలుగానైతే ఏ మాసమైనా కృష్ణపక్ష చతుర్దశిని శివరాత్రిగా భావిస్తారు. కానీ, మాఘ మాసపు చతుర్దశికి ప్రత్యేకమైన మహత్తు ఉంటుంది. అందుకే శివరాత్రిని ఆ రోజున బ్రహ్మాండంగా చేసుకుంటారు. మహాశివుడంటే అందరికి తెలుసు. కాని, రాత్రి అంటే ప్రత్యేకార్థము చాల మందికి తెలియదు. “రా” అన్నది దానార్థక ధాతు నుండి “రాత్రి” అయిందంటారు. సుఖాన్ని ప్రదానం చేసేదాన్నే రాత్రి అంటారు. ఋగ్వేద – రాత్రి సూక్తం తాలూకు యూప మంత్రంలో రాత్రిని ప్రశంసిస్తూ యిలా చెప్పబడింది – హే రాత్రే! అక్లిష్టమైన తమస్సు మా దగ్గరికి రాకుండుగాక!… వగైరా

‘ఉప మాపేపిశత్తమః కృష్ణం వ్యవక్తమస్థిత్!
ఉష ఋణేవ యాతయ||’

నిజంగానే రాత్రి ఆనందదాయిని అన్నింటికి ఆశ్రయం ఇవ్వగలది. అందుకే రాత్రిని ప్రశంసించటం జరిగింది. మహా శివరాత్రి వ్రతాన్ని రాత్రిపూటే జరుపుకుంటారు. అందువల్ల కృష్ణపక్ష చతుర్దశి రోజు వచ్చిన రాత్రికి ఓ ప్రత్యేకత వుంది. చతుర్దశి రోజు ఎవరైతే శివపూజను చేస్తారో, ఆ రాత్రి జాగర్ణం వహిస్తారో వారికి మళ్ళీ తల్లి పాలు తాగే అవసరం రాదు. అంటె ఆ భక్తుడు జీవన్ముక్తుడౌతాడని స్కందపురాణంలో స్పష్టంగా చెప్పబడింది. అంతటి మహిమాన్వితమైనది శివపూజ.

‘శివంతు పూజయత్వా యోజా గర్తిచ చతుర్దిశీం!
మాతుః పయోధర రసం నపిబేత్ స కదాచన!!’


అందుకేనేమో గరుడ, స్కంద, పద్మ అగ్ని మొదలైన పురాణాల్లో దీనిని ప్రశంసించడం జరిగింది. వర్ణనలలో కొంత తేడా వుండొచ్చు. ప్రముఖ విషయం ఒకటే. ఏ వ్యక్తి అయితే ఆ రోజు ఉపవాసంచేసి, బిల్వ పత్రాలతో శివపూజ చేస్తారో, రాత్రి జాగరణ చేస్తారో వారిని శివుడు నరకాన్నుండి రక్షిస్తాడు. ఆనందాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తాడు. వ్రతం చేసే వ్యక్తి శివమయంలో లీనమైపోతాడు. దానము, తపము, యజ్ఞము, తీర్థయాత్రలు, వ్రతాలు లాంటివెన్ని కలిపినా మహాశివరాత్రికి సరితూగలేవు.

మహాశివరాత్రి వ్రతం రోజు ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత నిచ్చారు. అలా అని ‘ తిథితత్వం ‘ లో చెప్పబడింది. ఈ గ్రంథంలో భగవాన్ శంకరుడు ఇలా అన్నట్లు వుంది. – ‘ మీరు స్నానం చేసినా, మంచి వస్త్రాలు ధరించినా, దీపాలు వెలిగించినా, పూజ చేసినా పుష్పాలంకరణ చేసినా వీటన్నిటికంటే కూడా ఎవరైతే ఉపవాసం చేయగలరో వారంటేనే నాకిష్టం ‘ అంటాడు శివుడు.

మరి ఉపవాసం అంటే ఏమిటి?
దగ్గర వసించటం, నివశించటం, ఉండటాన్ని ఉపవాసమంటారు. వ్రతం చేసేవారి ఇష్టదైవం దగ్గర ఉండటమే ఉపవాసం – ఉపవాసమంటే ఇంతేనా అని పెదవి విరిచే వారికోసమే ఈ శ్లోకం.

‘ఉప – సమీపే యో వాసః జీవాత్మ పరమాత్మనోః
ఉపవాసః సవిఘ్నేయ సర్వభోగ వసర్జిత్: ||’ (వరాహోపనిషత్తు)


భవిష్య పురాణంలో కూడా అలాగే చెప్పబడింది.

‘ఉపావృత్తస్య పాపేభ్యోయస్సు వాసో గుణైః సహా!
ఉపవాసః స విఘ్నేయ సర్వభోగ వివర్జిత్: ||’

మహాశివరాత్రి వ్రతంలో జాగరణ అవసరము. వ్రతానికి యోగ్యమైన కాలము రాత్రి. ఎందుకంటే రాత్రిపూట భూత, శక్తులు, శివుడు తిరిగే సమయమన్నమాట. చతుర్దశి రాత్రి ఆయనను పూజించాలి. భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో ఇలా స్పష్టంగా చెప్పడు. ‘సమస్త ప్రాణుల నిగ్రహ పురుషుడు రాత్రి కాలంలో మేల్కొని తిరుగుతుంటాడు. అతనిలోని ప్రాణులన్నీ జాగృతంగా ఉంటాయి. అంటే భోగ, సంగ్రహంలో మునిగి ఉంటారు. తత్వాన్ని అర్థం చేసుకోగల మునులు దృష్టిలో రాత్రి అది.

‘యానిశా సర్వ భూతానం తస్యాం జాగర్తి సమ్యమీ
యస్యాం జాగృతి భూతాని సానిశాపశ్యతో మునే ‘


విషయాసక్తుడు నిద్రళొ వుంటే అనుద్లో నిగ్రహస్తుడు ప్రబుద్ధంగా ఉన్నడు. అందువల్ల శివరాత్రి రోజు జాగరన ముఖ్యమన్నమాట. శివునితో ఏకీకరణమవటమే నిజమైన శివ – పూజ. ఇంద్రియాభిరుచుల్ని నిరోధించి పూజించటమే శివవ్రతము.

శివరాత్రి ఎలా చేసుకోవాలంటే –
గరుడ పురాణంలో ఇలా వుంది – త్రయోదశి రోజునే శివ – సన్మానము గ్రహించి, వ్రతులు కొన్ని ప్రతిబంధకాల్ని గమనించాలి. అంటే కొన్ని నియమాల్ని మనసులో నిర్ధారించుకుని పాటించాలి.

మీ విన్నపం ఇలా ఉండాలి – ‘హే మహాదేవా! నేను చతుర్దశి రోజు జాగరణ చేస్తాను. నా భక్తి సామర్ధ్యాన్ని బట్టి దాన, తప, హోమాన్ని చేయగలను. నేను ఆ రోజు నిరాహారిగా ఉంటాను. రెండవరోజు మాత్రమే తింటాను. ఆనంద, మోక్షాలను అనుగ్రహించు శివా!”

శివరాత్రికి లింగోద్భవకాలమని కూడా పేరు. ఆ రోజు అర్థరాత్రి జ్యొతిర్మయమైన ఒక మహాలింగంగా శివుడు ఆవిర్భవించాడు. పరమేశ్వరుడు లోకానికి తన స్వరూప దర్శనం చేయించి జగత్తంతా దేదీప్యమానం చేసిన ఆ సమయంలో మనం జాగరణకు చేయడం మంచిది.

శివరాత్రినాడు పధ్నాలుగు లోకాలలోని పుణ్యతీర్థాలు ‘ బిల్వ ‘ మూలంలో ఉంటాయనీ, శివరాత్రినాడు ఉపవసించి ఒక్క బిల్వమైన శివార్పణ చేసి తరించమని శాస్త్రం చెబుతోంది. కనీసం జన్మకొక్క శివరాత్రి అయినా చేయమని పెద్దలు చెబుతుంటారు. సమస్త ప్రాణికోటిలో సూక్ష్మజ్యోతిరూపంలో ఉండే శివుడు భూమిపై పార్థివలింగంగా ఆర్చింపబడుతుంటాడు. శివరాత్రినాడు ఫలం, ఒక తోటకూర కట్ట అయినాసరే శివార్పణం అని దానం చేయడం ముక్తిదాయకం.

శివరాత్రినాడు ఉపవసించి త్రికరణ శుద్ధిగా శివుని ఆరాధిస్తే, ఒక సంవత్సర కాలం నిత్యం శివార్చన చేసిన ఫలం కలుగుతుందని సాక్షాత్తు శంకరుడు బ్రహ్మదేవునికి చెప్పినట్లు పెద్దలవాక్కు.

No comments:

Post a Comment

Sri Shani Ashtottara Shata Sata Naamavali - శ్రీ శని అష్టోత్తర శతనామావళి

శ్రీ శని అష్టోత్తర శతనామావళి ఓం శనైశ్చరాయ నమః ఓం శాంతాయ నమః ఓం సర్వాభీష్టప్రదాయినే నమః ఓం శరణ్యాయ నమః ఓం వరేణ్యాయ నమః ఓం సర్వేశాయ నమః ఓ...