బ్రహ్మ కొడుకు దక్షుడు. మనువు కూతురు 'ప్రసూతి'. వీళ్ళిద్దరికి పదహారుమంది కన్యలు పుట్టారు.
ఇలా పుట్టిన కన్యల్లో శ్రద్ధ, మైత్రి, దయ, శాంతి, తుష్టి, పుష్టి, ప్రియ, ఉన్నతి, బుద్ధి, మేధ, తితిక్ష హ్రీ, మూర్తి అనే పదముగ్గురిని ధర్మునికిచ్చి పెళ్లి చేశాడు. ఒక కుమార్తెను అగ్నిదేవుడికి, ఇంకొక కూతురిని పితృదేవతలకు, మరో అమ్మాయిని శివుడికీ ఇచ్చి పెళ్లి చేసి పంపాడు. శివుడు జననమరణాదులను తొలగించువాడు.
ఆ తర్వాత ఆ ధర్ముని పత్నులవల్ల పుట్టినవారు వీరు. శ్రద్ధవల్ల శ్రుతమూ, మైత్రివల్ల ప్రసాదమూ, దయవల్ల అభయమూ, శాంతివల్ల సుఖమూ, తుష్టివల్ల ముదమూ, పుష్టివల్ల స్మయమూ, క్రియవల్ల యోగమూ, ఉన్నతివల్ల దర్పమూ, బుద్ధివల్ల అర్థమూ, మేధవల్ల స్మృతీ, తితిక్ష వల్ల క్షేమమూ, హ్రీవల్ల ప్రశ్రయమూ, మూర్తివల్ల నరనారాయణులు అవతరించారు. ఈ నరనారాయణులు అన్ని మంచి గుణాల ఉత్పత్తికి నెలవైనవారు. వీళ్లు పుట్టిన సమయంలో
ఓ శుభచరిత్రా! నరనారాయణులు పుట్టినసమయంలో లోకమంతా శుభంగా ఉంది. గాలి మెల్లమెల్లగా అనుకూలంగా వీచింది. నాలుగుదిక్కులూ తేటపడ్డాయి. సమస్తలోకం సంతోషించింది. దేవలోకంలో బాజాలు మార్మ్రోగాయి. సముద్రాల క్షోభ తగ్గింది. ఏరులన్నీ పొంగి ప్రవహించాయి. గంధర్వుల, కిన్నరుల గానాలు వినవచ్చాయి. అప్పరసలు ఉత్సహించి నాట్యాలు చేశారు. దేవతలు చెదురుమదురుగా పూలజల్లులు కురిపించారు. మునులంతా పట్టరాని సంతోషంతో స్తుతించారు.
అదే సమయంలో బ్రహ్మ మొదలైన దేవతలందరు ఆ పుణ్యపురుషులను చేరుకొని ఇలా నుతించారు.
ఆకాశంలో కనిపించే గంధర్వాది నగరాల వివిధరూపాల మాదిరి రూఢం చేసి ప్రతి ఆత్మను మాయతో కప్పి ఈ ప్రపంచం సృజించబడింది. అలాంటి ఆత్మ ప్రకాశం కోసం యముడి ఇంట జన్మనెత్తావు. అలాంటి ఓ ఉత్తమ పురుషా! నీకు మా నమోవాకాలు. అంతేకాక ఈ ప్రజాఉత్పత్తిలో చెడుకర్మకు తావు లేకుండా ఉండేందుకు సత్వగుణంతో మమ్మల్ని పుట్టించావు. అలాంటి మాకు లక్ష్మీనివాసం అయిన పద్మకాంతిని కూడ పరిహసించు నీ కరుణాకటాక్షాన్ని ప్రసాదించు.
(నరనారాయణులిద్దరు. కానీ బ్రహ్మాదులు వారి ఏకాత్ములుగా దర్శించుకుంటున్నారు. అందువలననే పరమపురుషా; నీకు, నీ ఇత్యాదిగా ఏకవచన ప్రయోగం సరిపడుతుంది.)
ఆ తీరుగా దేవతలంతా నరనారాయణుల్ని స్తుతించారు. వారిమీద వారిద్దరి కృపాదృష్టి ప్రసరించింది. అపుడు ఆ నరనారాయణు లిద్దరివల్ల తండ్రియైన ధర్ముని సంతోషం మూడింతలు అయింది. ఆ ఇద్దరూ గంధమాదన పర్వతంవైపు వెళ్ళిపోయారు.
('ముప్పిరిగొను' ఒక జాతీయం. దారం మూడు పొరలతో పేనగా అది బాగా బలపడుతుంది. మూడును కలసి పటిష్ఠం కావడం, అధికమవడం అనేది ఈ పలుకుబడి పరమార్థం. మూడు+పిరి= ముప్పిరి.)
ఆ నరనారాయణులలో భూ భారాన్ని తేలిక పరచడానికి నరుడు అర్జునుడుగా కురువంశంలో పుట్టాడు. కృష్ణుడు యదువంశంలో అవతరించాడు. వీళ్లిద్దరూ సత్త్వగుణసంపన్నులు.
ఇంకా అగ్నిదేవుడికీ, దక్షుడి కూతురు 'స్వాహాదేవి'కి పావకుడు, పవమానుడు, శుచి అనే ముగ్గురు కొడుకులు కలిగారు. వీళ్లవల్ల నలభై ఐదుగురు అగ్నిదేవులు పుట్టుకొచ్చారు. ఈ విధంగా తండ్రి తాతలతో కలుపుకుంటే ఈ అగ్నులు మొత్తం నలభై తొమ్మిది మంది. యాగ విధుల్లో ఈ అగ్నులు దేవతలుగా ఉంటూ, కోరిన కోరికలు తీరుస్తూ ఆ యా పేర్ల మీద బ్రహ్మనిష్ఠులచే అనుష్ఠించబడుతూ ఉంటారు. ఈ అగ్నులు 'అగ్నిష్వాత్తులు, బర్హిషదులు, సౌమ్యులు, పితలు, ఆజ్యపులు, సాగ్నులు, నిరగ్నులు' అని ఏడు రకాలుగా ఉన్నారు. ఈ అగ్నులకు, దక్షుడి కూతురు 'స్వధ'కు వయున, ధారిణి అనే ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఈ పిల్లలిద్దరూ జ్ఞానవిజ్ఞానాలను తుదముట్టిన బ్రహ్మవాదినులుగా ఘనత పొందారు.
No comments:
Post a Comment