Tuesday, February 3, 2026

Magha Puranam 27 - మాఘ పురాణం 27 ఋక్షక యను బ్రాహ్మణకన్య వృత్తాంతము

మాఘ పురాణం - 27 వ అధ్యాయం

ఋక్షక యను బ్రాహ్మణకన్య వృత్తాంతము

పూర్యము భృగుమహాముని వంశమందు ఋక్షక యను కన్య జన్మించి దినదిసాభివృద్ధి పొందుచుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు. పెండ్లి అయిన వెంటనే పెండ్లికుమారుడు  చనిపోయెను.

ఋక్షక తన దురదృష్టమునకు దుఃఖంచి విరక్తి భావముతో యిల్లు విడిచి గంగానదీతీరమునకు బోయి ఆశ్రమము నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభించెను.

ఆవిధముగా చాల సంవత్సరములు ఆచరించుటవలన ననేక మాఘమాస స్నానఫలములు దక్కెను. ఆమె మనోవాంఛ ఈడేరు సమయము దగ్గర పడినది. ఒకనాడామె తపస్సుచేసుకొనుచూ  ప్రాణములు విడిచెను. ఆరోజు వైకుంఠ ఏకాదశి అగుటవలన వైకుంఠమునకు వెడలెను. ఆమె చాలా సంవత్సరములు వైకుంఠమందే యుండి తరువాత బ్రహ్మాలోకమునకు పోయైను. ఆమె మాఘమాస వ్రత ఫలము కలిగి పవిత్రురాలగుటచే బ్రహ్మదేవుడామెను సత్యలోకములో దేవ కార్యములు తీర్చుటకు అప్సర స్త్రీ గా జేసి "తిలోత్తమ“యను పేరుతో సత్యలోకమునకు పంపెను.

అ కాలంలో సుందోప సుందులనే యిద్దరు రాక్షస సోదరులు బ్రహ్మనుగూర్చి ఘోరతపస్సు చేసిరి.
వారి తవస్సుయొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై "మీ కేమి కావలయునో కోరుకొనుడు” అని యనగా "సామీ! మాకు యితరులవలన మరణము కలుగకుండ నుండునట్లు వరమిమ్ము" అని వేడుకొనగా బ్రహ్మ అటులనే యిచ్చితి" నని చెప్పి అంతర్ధాన మయ్యెను.

బ్రహ్మదేవుని వరము పొందిన నా యిద్ధరు రాక్షసులు మహాగర్వముగలవారై దేవతలను హింసించి, మహర్షుల తపస్సులకు భంగం కలిగించుచుండిరి. యజ్ఞ యాగాది క్రతువులలో మాంసం రక్తం పడవేసి ప్రజలను నానాభీభత్సములు చేయుచుండిరి. దేవలోకముపై దండెత్తి దేవతలందరినీ తరిమివేసిరి.

ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను "మహానుభావా! సుందోప సుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వం గలవారై తపశ్శాలురను బాధించుచు, దేవలోకమునకువచ్చి మమ్మందరను తరిమి చెరసాలలో బెట్టి, నానాబీభత్సం చేయుచున్నారు. గాన వారి మరణమునకేదైనా యపాయమాలోచించు” మని దేవేంద్రుడు ప్రార్థించెను. బ్రహ్మ దీర్ఘంగా ఆలోచించి, తిలోత్తమను పిలిచి "అమ్మాయి! సుందోపసుందులను రాక్షసులను ఎవరివలనను మరణము కలుగదని వరం ఇచ్చియున్నాను. వరగర్వంతో చాల అల్లకల్లోలం చేయుచున్నారు. గాన నీవు పోయి నీచక చక్యముతో వారికి  మరణము కలుగునటల ప్రయత్నించుము” అని చెప్పను, '

తిలోత్తమ బ్రహ్మదేవునకు నమస్కరించి సుందోపసుందులు వున్న యరణ్యమును ప్రవేశించెను. ఆమెచేత వీణవట్టుకొని మధురమైన పాటలు పాడుకొనుచు నా రాక్షస సోదరులున్న నివాసమునకు సమీపములో తిరుగుచుండెను. వీణానాదమును ఆమె మధురగానమును విని సుందోపసుందులు తిలోత్తమును సమీపించిరి. ఆమె ఎటుపోయిన నటు, యెటు తిరిగిన నటులామెను అనుసరిస్తూ ప్రేక్షకులవలె వెంటాడుచుండిరి. ఆమెను "నన్ను వరింపుము, నన్ను వరింపుము" యని తిలోత్తమను యెవరికి వారు బ్రతిమలాడసాగిరి.

ఓ రాక్షసాగ్రేశ్వరులారా! మిమ్ములను పెండ్లియాడుట నాకు యిష్టమే మిరిద్దరూ నాకు సమానులే, నేను మీ యిద్దరి యెడల ప్రేమతోనున్నాను. ఇద్దరిని వివాహమాడుట సాధ్యం కానిది, గాన నా కోరిక యొకటున్నది. అది ఏమనగా మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారినే నేను ప్రేమించగలను" అని తిలోత్తమ చెప్పెను.

ఆమె మాటలకు సుందోపసుందులకు పౌరుషములు వచ్చినవి. మీసములు మెలిబెట్టి 'నేను బలవంతుడను' '
నేను బలవంతుడను' అని ఇద్దరును తొడలు గొట్టుకొనిరి, భుజములు చరిచిరి. మాటలు చేతలవరకు వచ్చి ఒకరినొకరు త్రోసుకొనిరి గ్రుద్దుకొనిరి, మల్లయుద్ధము చేసిరి, ఇక ఆయుధములు పట్టుదశవచ్చిగదలు పట్టిరి. ముద్గరాలూ ఎత్తిరి దెబ్బకు దెబ్బ కొట్టుకొనుచుండిరి. వారి పోరాటము రెండు పర్వతాలు డీకొన్నట్లుగా వున్నది. మేఘాలు ఉరిమినట్లుగా ఉరిమి భయంకరముగా యుద్ధము చేసిరి. గదాయుద్గముమాని కత్తులు దూసిరి. ఆ కత్తి యుద్దములో ఒకరి ఖడ్గము మరొకరికి తగిలినందున ఇద్దరి తలలూ తెగి క్రిందపడినవి. ఇద్దరూ చనిపోయిరి.

తిలోత్తమను "దేవతలందరు దీవించిరి. ఆమె బ్రహ్మలోకమునకు పోయి జరిగినదందా తెలియ పర్చగాబ్రహ్మ సంతోషించి, త్రిలోత్తమా! నీవు మంచి కార్యము చేసితివి. నీ వలన సుందోప సుందులు మరణించిరి. నీకీ బలము వచ్చుటకు కారణము నీవు చేసియున్న మాఘమాస వ్రత పలమే గాన నీవు దేవలోకానికి వెళ్ళు దేవతలు నిన్ను గౌరవిస్తారు. అచ్చట అప్సరసలందరికంటే  నీవే అధికురాలవగుదువు అని దీవించి పంపెను.

No comments:

Post a Comment

Magha Puranam 27 - మాఘ పురాణం 27 ఋక్షక యను బ్రాహ్మణకన్య వృత్తాంతము

మాఘ పురాణం - 27 వ అధ్యాయం ఋక్షక యను బ్రాహ్మణకన్య వృత్తాంతము పూర్యము భృగుమహాముని వంశమందు ఋక్షక యను కన్య జన్మించి దినదిసాభివృద్ధి పొందుచుండెను...