Wednesday, February 25, 2026

The destruction of Daksha’s yagna by Veera Bhadra Badra - శివుడు వీరభద్రుచే దక్షయజ్ఞంబు ధ్వంసంబు సేయించుట

శివుడు వీరభద్రుచే దక్షయజ్ఞంబు ధ్వంసంబు సేయించుట

మహోన్నతంగా, నిండుగా, భారీగా ప్రయాణించే కారుమేఘమా అన్పించేటటువంటి నల్లటి నిలువెత్తురూపంతో, కణకణమండే నిప్పుమంటల వరుసల వెలుగులవలె ఒప్పుతున్న తలజుత్తుతో, వేనవేల ఆయుధాల ధారణతో భయంకొల్పే అష్టదిగజాల తొండాల్లాంటి వేయి భుజదండాలతో, లోకుల కళ్లకు మిరుమిట్లు గొలిపే లోకవీక్షణుడి భగభగమండే ఎండవంటి మూడుకళ్ళతో, రంపం పళ్లలా పదనెక్కి ఉగ్రంగా ఉన్న కోరలతో, గట్టి పుచ్చెలదండలూ, ఎముకలపేరులూ, ఆకుల పూలమాలికలూ వేసుకున్న మెడతో వీరభద్రుడు లోకభయంకరుడుగా, మరొక శివుడుగా పుట్టుకొచ్చాడు.

ఆ వీరభద్రుడు పగవారి శుభాలను హతమార్చి తన వేయిచేతులతో ఒక్కసారిగా దండం పెట్టాడు. అతి వినమ్రతతో నేను ఏమి చేయాలో తెలపండి. సెల విప్పించండి అని అడిగాడు. దానికి శివుడు వీరభద్రుడితో ఇలా అన్నాడు.

(వీరభద్రుడు: ప్రతివీరుడుగా భద్రం చేకూర్చేవాడు.)

గొప్ప జబ్బపుష్టిగల ఓ వీరభద్ర! యుద్ధకళాకుశల! నా సమస్తశూరగణానికి నువ్వే సైన్యాధిపతివి. ఆ ఆధిపత్యంతో నువ్వు దక్షయాగవాటికకు పో. చాల శ్రద్దాళువువై యాగంతో సహా దక్షుణ్ణి చంపు. ఆ యాగవాటికలో “బ్రాహ్మణతేజం” ఎదిరించ సాధ్యమా, అని నువ్వు ఏమాత్రం తలంచవద్దు. దుర్లభమైన నా అంశాన జన్మనెత్తిన నీకు సాధ్యంకానిది ఏచోటనైనా ఉంటుందా?

అంటూ శివుడు కోపపడి తీవ్రంగా ఆనతిచ్చిన క్షణాననే ఆ వీరభద్రుడు సరే! అట్లాగే అని చెప్పి

వీరభద్రుడు శివుడి దగ్గరకు పోయాడు. మహా ఆనందంగా శివుడికి ప్రదక్షిణం చేశాడు. పోయి వస్తానని సెలవు తీసుకున్నాడు. పట్టరానంత వేగంతో ఒక్క ఊపున కదిలాడు. ఆ వేగానికి నేల ఊగిపోయింది. కాలి మణిమంజీరాలు ఝళంఝళల మోతలు పెట్టాయి. భయంకరమైన కాంతులు విజృంభించాయి. యముడిని అంతం చేయగల పదునైన, మెరిసిపోతున్న శూలాన్ని బలంగా పైకెత్తి పట్టి మరింత పుంజుకున్న వేగంతో

అంతటి వేగిరపాటుగమనంతో సాగిపోతూ ఉన్న కాలిబంటుల పదాల తొక్కిడికి రేగిన దుమ్ము, ఉత్తరం పక్కన బూడిదవర్ణంగా అలముకుంది. ఆ ధూళి పొగను కొలువులోని సదస్యులూ, దక్షుడూ ఒక్కసారిగా చూచారు. ఎంత 'చిమ్మచీకటి' అనుకున్నారు. అంతలోనే కాదు అది కాలి ధూళి అంటూ అదరిపోయారు. తెలివిని కోలుపోయారు. మరియు

విడ్డూరంగా ఈ దుమ్ము ఇంత ఎత్తున ఎగయడానికి కారణం ఏమిటి? ప్రళయం నాటి విసురు గాలియా? ఈ అసమయంలో వీచదు కదా!, మరి చోరులగుంపు వచ్చిపడే సమయమా! గొప్ప చండశాసనుడైన ప్రాచీనబర్హిరాజు పరిపాలనంలో దొంగలముఠా దాడికి దిగేపని కాదు. మరి ఆలమందల గుంపులు వెనక్కి మళ్లిపోయే సమయమా? కాని ఇది గోధూలివేళ కాదు. కాన ఇపుడు విలయసమయం కావచ్చును. లేకపోతే ఇంతటి పెద్ద ఉపద్రవంగా ధూళి ఎక్కణ్ణుంచి వచ్చిపడుతుంది అనుకుంటూ ఆ ప్రదేశంలో పోగయిన మానవసమాజమూ, దేవతలూ, దక్షుడూ పెద్దగా వణకిపోయారు. ఈ లోగా ప్రసూతి (దక్షపత్ని)మొదలైన బ్రాహ్మణ స్త్రీలు మళ్లీ ఇలా అనుకున్నారు.

దక్షుడు తన తక్కిన ఆడుసంతానం ముందు ఏ అపరాధం ఎరుగని తన అమ్మాయి 'సతి'ని అన్యాయంగా అగౌరవించాడు. ఈ ఘోరానికి మారు ఫలితమే ఈ దుమారం కాబోలు నన్పిస్తుంది అని అంటూ

ఇంకా ఇలా చెప్పుకున్నారు. ఆగ్రహించిన దక్షుడు తన సొంతబిడ్డతో పగ చాలదన్నట్టు విశ్వవినాశకారకుడైన శివుడు చిటపటలాడేలా చేశాడు. ఆ పరమపురుషుడు ఎలాంటి వాడంటే, ప్రళయం ముంచుకొచ్చినపుడు మంచి పదనుగల తన త్రిశూలం మొనలతో దిగ్గజాలన్నింటిని గుదిగుచ్చుతాడు. అతిభీషణంగా, కర్ణకఠోరంగా ఉరుము గర్జిల్లినట్టు, దిక్కులు బద్దలై పోయేట్టు గంభీరంగా అట్టహాసం చేస్తాడు. వెఱపు పుట్టించేంత వెడల్పుగా విప్పిన కోరల దెబ్బలతో నక్షత్రరాశులను కుప్పలు పడేలా కిందికి జారుస్తాడు. చురుకైన భుజదండాలకు అలంకరణగా తళతళకాంతులు విరజిమ్మే రకరకాల ఆయుధాలు పట్టీ ఉంటాడు. మించిన కోపంతో కనుబొమలు ముడివేసినపుడు సహించశక్యంకాని తేజస్సుతో అతిశయించి ఉంటాడు. ఒత్తుగా కిందికి వేలాడుతున్న జుత్తు అల్లిన జడలముడి జారిపోయేంతగా ప్రళయానికి మూలభూతుడై తాండవం చేస్తాడు.

అలాంటి తాండవళివుడు, శ్రేష్ఠదేవుడు. త్రిపురాలనూ మట్టు పెట్టినవాడు, చంద్రకళాధరుడు, సత్త్వవంతుడు, పుట్టువు లేనివాడు. అంతటి శివుని మనస్సును కెలికి కోపింప చేస్తే క్షేమంగా ఉండగల్గడం చివరకు ఆ విధాతవల్లా కానిదే అవుతుంది. ఇక ఇతరుల గురించి మాటాడే పనేముంటుందని భావం.

మాటిమాటికి ఆ బ్రాహ్మణ స్త్రీలు ఈ క్రమాన భయంచేత చలిస్తున్న కండ్లతో మొరపెడుతూనే ఉన్నారు. ఆ తరుణంలో ఉదార స్వభావుడు అయిన దక్షుడికీ దడ పుట్టించేవిధంగా మహోపద్రవాలు నేలనించి నింగిదాకా వేల లెక్కన కంటికి తోస్తున్నాయి. ఆ సమయంలోనే శివప్రమథగణం రకరకాల ఆయుధాలను చేపట్టారు. వాళ్లు రకరకాల వికృత ఆకారాల్లో ఉన్నారు. చామనచాయ, పసిమిచాయవాళ్లు కొందరైతే, మరికొందరు పొట్టిగా ఉన్నారు. కొందరు మొసలి కడుపువలె బాన కడుపుతో ఉన్నారు. ఇంకొందరు మొసలి ముఖం (నోరు) వంటి ముఖం (నోరుతో ఉన్నారు. వీళ్లంతా దక్షయజ్ఞ వాటికలోకి ఉరుకుతూ దాదాపుగా చేరుకున్నారు. దక్షయాగస్థలం చుట్టూ ఉన్న కంచెలను, నడవలను, ఇళ్లభాగాలను అస్తవ్యస్తం చేసేస్తున్నారు. కొందరు ప్రధాన యాగగ్భహం వెన్నుగాడిని తన్నేవారు. కొందరు కొందరుగా ధర్మగేహినులుండే పాకను, సభతీర్చేపాకను, అగ్నివహులైన ఋత్విక్కులుండే పాకను, యాగయాజమాని పాకను, వంటశాలలనూ, కూల్చేవారు. కొంచెం ఆగి కొందరు అక్కడి యాగపాత్రలను వహ్నులను పాడుచేశారు. ఇంకా కొంచెం సేపటికి అగ్నిహోత్రాలను ఆర్పేశారు. కొందరు అగ్నిగుండాల్లో మూత్రాలను విసర్జించారు. కొందరు ఉత్తరం పక్కగా తీర్చిన వేదికల సోమసూత్రాలు తెంపేశారు. కొందరు మునుల్ని కష్టపెట్టారు. కొందరు మునిపత్నుల్ని గజగజలాడించారు. ఇంకొందరు దేవతలను నిలువరించారు. ఆ సమయంలో భృగుఋషిని మణిమంతుడూ, దక్షుణ్ణి వీరభద్రుడూ, పూషుణ్ణి చండీశుడు, భగమునిని నందీశ్వరుడూ నిర్భంధించారు. ఇలాగున సభ్యుల, దేవతల, ఋత్విక్కుల, వర్గాలపైకి రాళ్లు విసరి, మోకాళ్లతో కుమ్మీ, అరచేతులతో చరచి, మోచేతులతో పొడిచీ పెక్కురకాలుగా పీడించారు. వాళ్లంతా భయంతో దిక్కుతోచక తలకొక దిక్కుకు పరుగు తీశారు. తరువాత

అప్పట్లో యాగవాటికలో దక్షుడు శివుణ్ణి తిట్టిపోశాడు. అప్పుడు కనుసైగచేసిన భగుణ్ణి, ఇపుడు నందీశ్వరుడు పట్టి కట్టేశాడు. రెండుకళ్లూ పెరికి వేశాడు. ఇదంతా చూస్తున్న జనంలో ఆర్తనాదం చెలరేగింది.

దక్షుడు శివుణ్ణి దూషించినపుడు పూషుడు పల్లికిలిస్తూ నవ్వాడు. ఆకారణంగా ఇపుడు అలనాటి కళింగదేశం రాజు దంతవక్త్రుడి దంతాలు బలరాముడు కుతుకం కొద్దీ రాలగొట్టిన విధంగానే పూషుడి దంతాలను చండీశుడు ఊడపీకాడు.

దక్షుడు ధర్మం తప్పి ఆనాటి కొలువులో శివుని నిందించేటపుడు అక్కడ భృగుముని మీసం, గెడ్డం మెలిపెడ్తూ నవ్వాడట. ఆ ద్వేషంతో వీరభద్రుడు ఆ ముఖమీసం, గెడ్డం మెలి తిప్పి పెరికివేశాడు.

ఆ వీరభద్రుడు విర్రవీగినవాడై దక్షుణ్ణి అధీనం చేసుకున్నాడు. అతడి ఉదరభాగాన్ని తన కాలితో తొక్కిపట్టాడు. పదను దేరిన కొనలుగల కత్తిపట్టుకుని ఒళ్లంతా గాయపరచాడు. మంత్రపూతమైన శస్త్రశక్తితో దక్షుడిచర్మం చీల్చబడలేదు. దానికి వీరభద్రుడు ఎంతో విభ్రాంతి పొందాడు. అతణ్ణి చంపే ఉపాయం మనస్సున యోచించుకున్నాడు. గొంతు నులిమి చంపే మార్గం తట్టింది. అంతే దక్షుడి తలకాయ తెగిపడేలా నరికాడు. కోపం ఆపుకోలేక దక్షిణాగ్నికి ఆహుతి చేశాడు. ఆ వీరభద్రుడి పరివారం ఎగిరి గంతులేసింది. అక్కడే ఉన్న బ్రాహ్మణులందరూ లోలోపల కుమిలిపోతూ ఉండగా.

ఇలా భద్రంగా ఆ వీరభద్రుండు దక్షుడి అధ్వరాన్ని నాశనంచేసి తన కైలాసవాసానికి తిరిగిపోయాడు. అపుడు

No comments:

Post a Comment

After Virabhadra Destroyed Daksha's Yagna, Demigods, Priests Approached Lord Brahma - దేవతలు వీరభద్రాదులచే బరాజితులై బ్రహ్మతో విన్నవించుట

దేవతలు వీరభద్రాదులచే బరాజితులై బ్రహ్మతో విన్నవించుట శివుడి ప్రమథసేనలచే దేవతలంతా వాళ్ల కత్తులు, గదలు, చురకత్తులు వంటి పోటు ముట్టుల తాకిళ్లకు ...