Friday, February 20, 2026

Brahma and the devatas (demigods) praying to Yagna Varaha Swamy - శ్రీ యజ్ఞ వరాహమూర్తిని బ్రహ్మాదులు స్తుతియించుట

శ్రీ యజ్ఞ వరాహమూర్తిని బ్రహ్మాదులు స్తుతియించుట

తర్వాత ఆ యజ్ఞవరాహరూపధారియైన శ్రీహరిని బ్రహ్మాదులు ఇలా పొగిడారు.

"దేవ! జితం జితం తే పరమేశ్వర! జితయజ్ఞభావన! శ్రుతిశరీర!”
యనుచుం గారణసూకరాకారుండగు నీకు నతిభక్తి మ్రోక్కెదమయ్య వరద!

భవదీయరోమకూపములందు లీనంబు లై యుండు నంబుధు లట్టీ యధ్వ
రాత్మకమై తనరారు నీ రూపంబు గానంగరాదు దుష్కర్మపరుల

కట్టి నీకుంబ్రణామంబు లాచరింతు, మఖిలజగదేకకీర్తి! దయానువర్తి!
భవ్యచారిత్ర! పంకజపత్రనేత్ర!, చిరశుభాకార! యిందిరాచిత్తచోర!

త్వక్కున నఖిలవేదములు, రోమంబులయందును బర్హిస్సు, లక్షులందు
నాజ్యంబు, పాదంబులందుం జాతుర్హోత్ర కలితంబులగు యజ్ఞకర్మములును,

స్రుక్కు తుండంబున, స్రువము నాసికను, నిడాపాత్ర ముదరకోటరమునందు,
శ్రవణాస్యబిలములంజమసప్రాశిత్రముల్‌, గళమున నిష్టిత్రికంబు, జిహ్వం

దగుంబ్రవర్గ్యము, నగ్నిహోత్రమును నీదు, చర్వణంబును, సభ్యావసథ్యు లుత్త
మాంగ మసువులు చయనము లగుం గిటీశ యనుచు నుతియించి రత్తఱి యజ్ఞవిభుని

అక్కడి మునులు స్వామిని ప్రస్తుతించి, నమస్కరించారు.

దేవా! నీవు జయించావు-జయించావు. నీవు నిరంతరం సత్కర్మ పరాయణుడవు. నీవు వేదమయుడవు. కోరిన వరాలనిచ్చే స్వామీ! ఈ విశ్వంభరను ఉద్ధరించటానికి నీవు వరాహాకృతిని తాల్పావు. నీ వెంట్రుకల మొదళ్ళలో ఉన్న గుంతల్లో మహాసముద్రాలే దాగి ఉన్నాయి. దుష్టులకు నీ యజ్ఞస్వరూప మహిమ అంతుబట్టదు. స్వామీ! నీ కివే మా నమస్మారాలు. ఈ విశ్వమంతటికి నీక్తీర్తి వ్యాపించింది. నీవు దయాపరుడవు. నీ చరిత్ర పవిత్రమైంది. నీ కన్నులు తామరరేకుల్లాంటివి. నీది మంగళకరమైన ఆకారం. నీవు శ్రీదేవి హృదయాన్ని ఆకర్షించిన మహానుభావుడవు.

అంతటితో ఆగక ఆ మునులు ఇంకా స్తోత్రం చేశారు.

'వరాహస్వామీ! నీ చర్మమే సమస్తవేదవేదాంగాలసమూహం. నీ వెంట్రుకల్లో యజ్ఞాగ్నులు దాగి ఉన్నాయి. కన్నుల్లో ఆజ్యం (నేయి), పాదాల్లో యాజకులచే నిర్వహింపబడుతున్న యాజ్ఞికక్రియలు ఉన్నాయి. నీ తుండమే నేతి గరిట (స్రుక్కు), ఘ్రాణేంద్రియమే స్రువం, నీ కడుపే యజ్ఞపాత్ర. చెవి భోజనపాత్ర, నోరు నీరుత్రాగేగిన్నె. నీ గొంతు మూడు యజ్ఞాలకు నిలయం. నాలుక అగ్నిహోమాదులకు అంగభూతం, నీ వారగించే ఆహారం సాక్షాత్తు వ్రేల్చబడిన అగ్నియే. నీ  శిరోభాగం హోమరహిత అగ్నిగృహం, నీ ప్రాణాలు చయనాలు' అని అక్కడచేరిన బ్రహ్మేంద్రాది మునిపుంగవులు స్వామిని ప్రస్తుతించారు.

వెండియు ముహుర్ముహు ర్భగవదావిర్భావంబు దీక్షణీయేష్టి యగు. నీదు దంష్ట్రలు ప్రాయణీయంబను దీక్షానంతరేష్టియు, నుదయనీయంబను సమాప్తేష్టియు, యుష్మద్రేతంబు సోమంబును, ద్వదీయావస్థానంబు ప్రాతస్సవనాదులు, నీదు త్వ
ఙ్మాంసాది సప్తధాతువు లగ్నిష్టోమోక్థ్యషోడశీ వాజపేయాతిరాత్రాప్తోర్యామంబులను సంస్థాభేదంబులును ద్వాదశాహాదిరూపంబులైన బహు యాగ సంఘాతరూపంబులు నగు; సర్వ సత్త్రంబులు భవదీయశరీర సంధులు; ససోమాసోమంబులగు యజ్ఞక్రతువులు నీవ; మఱియును నీవు యజనబంధనంబులచే నొప్పుచుందు వదియునుం గాక.

బ్రహ్మాదులు యజ్ఞవరాహావతారాన్ని మరింతగా అభివర్ణిస్తూ స్తుతిస్తున్నారు. "దేవా! మాటిమాటికి పెచ్చరిల్లిన నీ అవతారం" దీక్షణీయేష్టి(సలసల మండుతున్న యాగాగ్ని), నీ కోరలు ప్రాయణీయేష్టి (నిలకడగామండుతున్నఅగ్ని), చివరి యజ్ఞాంతరూపం 'ఉదయనీయేష్టి(ఉపశమించిన యజ్ఞాగ్ని), నీ ఇంద్రియమే సోమరసం. నీ ఉనికి ఉదయకాలపు ధ్యానసంధ్యానుష్ఠానాదులు. శుక్లం, రక్తం, మాంసం, ఎముక, తోలు, చీము, మెదడులతో కూడిన నీ సప్తధాతువులు అగ్నిష్టోమం, ఉక్థ్యం, షోడశి, వాజపేయం, అతిరాత్రం, ఆప్తోర్యామం అనే ఏడు యాజ్జిక విధులూ, ద్వాదశాహం మొదలైన అనేక యాగవిధులూ అవుతాయి. సమస్తయాగాలు నీ శరీరసంధులే. అంతేగాక సోమపానంతోడి యజ్ఞాలు,
సోమపాన రహిత యజ్ఞాలు నీవే అయివున్నావు. నీవు ఎల్లప్పుడు యజ్ఞబంధితుడవై వెలుగొందుతావు అని మునులు దేవాదిదేవుణ్ణి స్తుతించారు.

హవరూపివి! హవనేతవు!, హవభోక్తవు! నిఖిలహవఫలాధారుండవున్‌!
హవరక్షకుండవు నగు నీ కవితథముగ నుతు లొనర్తుమయ్య ముకుందా!


"స్వామీ! నీవు యజ్ఞస్వరూపుడివి. యజ్ఞాధిపతివి. యజ్ఞఫలాన్ని భుజించేవాడివి. సమస్త యజ్ఞఫలాలకు నీవే ఆధారం. యజ్ఞరక్షకుడవు కూడ నీవే. ముకుందా! మచ్చలేని హృదయంతో నిన్ను పూజిస్తాము. 

అక్కడచేరిన మునులు ఫలాకాంక్ష లేనివారై యజ్ఞవరాహస్వామిని వేనోళ్ల ప్రస్తుతించారు. వారి స్తుతివాక్యాల్లో ఏ విధమైన ఫలాసక్తి లేదు.

సత్వగుణమున సద్భక్తి సంభవించు, భక్తియుతముగం జిత్తంబు భవ్య మగును
హృదయపద్మంబునందోలి నెఱుంగంబడిన, యట్టి నీకు నమస్కారమయ్య వరద!


కోరినకోర్కెల నెరవేర్చే ప్రభూ! సత్త్వగుణంవల్లనే ఉత్తమమైన భక్తి కల్గుతుంది. భక్తి గల్గినచో మనస్సు యోగ్యమౌతుంది. గుండెనిండుగ స్మరించుకోదగ్గ నీకు ఇవే మా నమస్మారాలు.

అరవిందోదర! తావకీనసితదంష్ట్రాగ్రావలగ్నక్షమా
ధరనద్యబ్ధినదాటవీయుతసమిద్ధక్ష్మాతలంబొప్పె భా
సురకాసారజలావతీర్ణమదవచ్చుండాలరాడ్దంత శే
ఖరసంసక్త సపత్రపంకజము రేఖంబొల్పు దీపింపంగన్‌


పద్మనాభా! పర్వతాలు, నదీనదాలు, సముద్రాలు, అడవులు మొదలైన వాటితో కూడిన ఆ భూమి, నీ తెల్లని కోరపైన విశ్రమించటం ఎలా ఉందంటే, ఒక మదపుటేనుగు సరోవరంలో ప్రవేశించి పత్రభరితమైన తామరని తన దంతాలపై పొదువుకొన్నట్లు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంది.

చతురామ్నాయవపుర్విశేషధర! చంచత్సూకరాకార! నీ
సిత
దంష్ట్రాగ్ర విలగ్నమైన ధర రాజిల్లెం గులాద్రీంద్ర రా
జితశృంగోపరిలగ్నమేఘముగతిం జెల్వారి, విద్వజ్జనాం
చితహృత్పల్వలలోల! భూరమణ! లక్ష్మీనాథ! దేవోత్తమా! 


దేవా! నీవు నాల్గువేదాలు శరీరంగా కలవాడవు. నీది దేదీప్యమానంగా వెల్గుతున్న వరాహరూపుడవు! నీవు విద్వాంసుల హృదయాలనే పడియల్లో దాగినవాడవు. భూదేవికి ప్రియుడవు. ఉత్తమదైవమవు. ఇందిరభర్తవు. నీ కోరపై ఒదిగిన భూదేవి కులపర్వతశిఖరం పై తగుల్కొన్న మేఘంలాగా ఉంది.

సమధికస్థావరజంగమాత్మకమైన వసుమతీచక్ర మవక్రలీల
నుద్ధరింపుము; కరుణోపేతచిత్తుండ వగుచు నస్మన్మాత యయ్యె ధరణి;
మాతయౌ టెట్లని మదిందలంచెదవేనిం జర్చింప మాకు విశ్వమున కీవు
జనకుండ వగుట యుష్మత్పత్ని భూదేవి యగుట మాకును దల్లి యయ్యె; నిపుడు

ధరకు నీతోడంగూడ వందన మొనర్తు, మరణియందును యాజ్జికుం డగ్ని నిలుపు
కరణి మీ తేజ మీ ధరాకాంతయందు, నిలుప ధరణి పవిత్రయై నెగడుం గాన. 

“ఓ యజ్ఞవరాహమూర్తీ! దేవా! ఈ చరాచరాత్మకమైన భూచక్రాన్ని దయతో అవలీలగా పైకెత్తు. ఈమె మా తల్లి. 'మీకు తల్లి ఎట్లయింద'ను కొంటావేమో! చూడు. మాకు మరియు ఈ విశ్వానికంతటికి నీవే తండ్రివి. ఈ భూదేవి నీ భార్య. కాబట్టి ఆమె మాకు తల్లి అయింది. అందువల్ల ఇప్పుడు నీతోపాటు ధరిత్రీమాతకు కూడ నమస్కరిస్తాం. యజ్ఞకర్త 'అరణి' యందు అగ్నిని వ్రేల్చునట్లు, మీ దివ్యతేజస్సును ఈమె యందు నిల్పినట్లయితే ఈమె మహాపవిత్రురాలవుతుంది" అని మునీంద్రులు వరాహరూపుణ్ణి కొనియాడారు.

(అరణి: ఇది ఒక కర్ర-యజ్ఞంచేసే యాజకుడు రెండు అరణుల్ని రాచి అగ్నిని రగుల్కొల్పుతాడు. ఆ అగ్నిమూలంగా యజ్ఞకుండం ధగద్ధగాయమానమౌతుంది. అలా పుట్టించిన అగ్నిని 'ఆహవనీయం' అని పేర్కొంటారు.)

తలంప రసాతలాంతరగతక్షితింగ్రమ్మఱ నిల్పినట్టి నీ
కలితన మెన్న విస్మయము గాదు; సమస్తజగత్తు లోలిమైం
గలుంగంగం జేయు టద్భుతము గాక, మహోన్నతి నీ వొనర్చు పెం
పలరిన కార్యముల్‌ నడప నన్యులకుం దరమే రమేశ్వరా?


ఓ లక్ష్మీపతీ! పాతాళం చేరిన భూదేవిని తిరిగి పైకి లేపటంలో నీవు చూపిన చొరవ ఏమంత ఆశ్చర్యకరం కాదు. నీవు లోకాలన్నింటిని సృజించటం చాల గొప్పవిషయం. అంతేకాదు నీవు చేసే ఘనకార్యాలు మరి ఇతరులెవ్వరైనా చేయగలరా? (అసంభవమని భావం).

సకలజగన్నియామకవిచక్షణలీలం దనర్చునట్టి నం
దకధర! తావకస్ఫురదుదారత మంత్రసమర్థుండైన యా
జ్ఞికుండరణిన్‌ హుతాశనుని నిల్పిన కైవడి మన్నివాస మౌ
టకుందలపోసి యీ క్షితి దృఢంబుగ నిల్పితివయ్య యీశ్వరా! 

"నందకమనుపేరుగల ఖడ్గాన్ని చేత ధరించిన ఓ ప్రభూ! నీవు ఈ పదునాల్గు లోకాలను నియమించగల సమర్థుడవు. వేదమంత్రోచ్చారణలో నిష్ణాతుడైన యాజకుడు అరణిలో అగ్నిని నిల్పినరీతిగా ఈ భూమిని నీవు మాకు శాశ్వతనివాస యోగ్యంగా నిల్పావు" - అని మునులు కృతజ్ఞతతో పల్కారు.

సలలితవేదశాస్త్రమయసౌకరమూర్తిం దనర్చుచున్‌ రసా
తలముననుండి వెల్వడు నుదారత మేను విదుర్పం దత్సటో
చ్చలితములైన బిందువుల సాధుతపోజనసత్యలోకవా
సులమగు మేము దోంగి పరిశుద్ధి వహించితిమయ్య మాధవా!


"ఓ మాధవా! వేదశాస్త్రమయమైన యజ్ఞవరాహరూపుడవు నీవు. పాతాళలోకం నుండి భూమిని ఉద్ధరిస్తూ, ఒక్కపెట్టున ఉదారబుద్ధితో నీ మేనును విదిల్పినపుడు నీ జూలు కంటిన నీటి బిందువుల్లో మునిగి తపోలోక, జనలోక, సత్యలోక వాసులమైన మేమెల్లరం పరిశుద్దులమయ్యాము” అని మునులు కృతజ్ఞతను చాటారు.

(సౌకరమూర్తి : సూకరసంబంధమూర్తియే సౌకరమూర్తి సూకర మనగా వరాహమని అర్థం. తత్సంబంధమైన విగ్రహం 'సౌకరమూర్తి' అవుతుంది.

విశ్వభవస్థితిప్రళయవేళలయం దవికారసత్త్వమున్‌
విశ్వము నీవ యీ నిఖీలవిశ్వము లోలి సృజింతు విందిరా
ధీశ్వర! యీశ! కేశవ! త్రయీమయ! దివ్యశరీర! దేవ! నీ
శాశ్వతలీల లిట్టి వని సన్నుతి సేయంగ మాకు శక్యమే?


ఓ శ్రీనాథా!, ఈశ్వరా! సుందరమైన శిరోజాలు గలవాడా! ఋక్‌, యజుస్‌, సామవేదాలు స్వరూపంగా వెలసిన ప్రభూ! దేదీప్యమానమైన దేహంతో ప్రకాశించువాడా! యజ్ఞవరాహస్వామీ! ఈ విశ్వసంబంధమైన త్రిమూర్తులు చేసే సృష్టిస్థితిలయాల్లో నీవు ఏవికారాలు లేని శాంతస్వరూపుడవుగా ఉంటావు. సమస్తవిశ్వాన్ని వ్యాపించి ఉంటావు. ఈ లోకాలన్నింటిని ఒకక్రమపద్ధతిలో సృష్టించే వాడివి నీవే. నీవి శాశ్వతమైన చర్యలు. వాటి స్వరూపాన్ని ఇదమిత్థమని మేము స్తుతింపగలమా?

పంకజోదర నీ వపారకర్ముండవు భవదీయకర్మాబ్ధిపార మేద
నెఱింగెద నని మది నిచ్చగించిన వాండు పరికింపంగా మతిభ్రష్టు గాక
విజ్ఞానియే? చూడ విశ్వంబు నీ యోగ మాయాపయోనిధి మగ్న మౌటం
దెలిసియుం దమ బుద్ధిం దెలియని మూఢుల నేమన నఖిలలోకేశ్వరేశ!

దాసజనకోటి కతిసౌఖ్యదాయకములు, వితతకరుణాసుధాతరంగితములైన
నీ కటాక్షేక్షణములచే నెఱయ మమ్ముం, జూచి సుఖులను జేయవే సుభగచరిత?


ఓ పద్మనాభా! నీవు చేసే పనులకు అంతు లేదు. ఈ కర్మరూప సముద్రాన్ని తరించగలనని ఏ మతిహీనుడైనా అనుకొంటే వాడు అజ్ఞానియే. ఈ విశ్వమంతా నీ యోగమాయ అనే సముద్రంలో మునిగివుంది. ఓ దిక్పాలాధిపతీ! ఈ వాస్తవం తెలిసికూడ తెలియనట్లు వ్యవహరించే అవివేకుల్ని ఏమని పిలవాలి? స్వామీ! సుందరాకారా! నీ కడగంటి చూపులు భక్తులకు అనంతసుఖాన్ని ఇస్తాయి. అంతేగాదు కరుణామృతరసంలో ఓలలాడిస్తాయి. అలాంటి చల్లని చూపుల్ని మాపై పరపి సుఖంగా జీవించేలా చేయవా? (చేయగలడనే విశ్వాసం).

అని బ్రహ్మవాదు లగు స, న్మునివర్యులు భక్తియోగమున వినమితులై
మనమున మోదము ముప్పిరి, గొనం బొగడిరి ఖురవిదళితగోత్రిం బోత్రిన్‌.


బ్రహ్మజ్జులైన అక్కడి మునీంద్రులందరు భక్తిభావంతో తలలువంచి మహానందభరితులై గిట్టలతాకిడిచేత భూమిని పాతాళం నుండి పైకి లేవనెత్తిన ఆ యజ్ఞవరాహస్వామిని వేనోళ్ళ కొనియాడారు.

లోకాల్ని ఆత్మగా తాల్చినవాడును, సత్త్వరజస్తమోగుణాలకు నెలవైనవాడును అగు ఆ యజ్ఞవరాహమూర్తి సవిలాసంగా లోతైన సముద్రపు నీటిని తన గిట్టలచే ఎగమీటి, ఆ తర్వాత దాన్ని నీటిపై నిల్పి అంతర్జానం చెందాడు.

ఈ యజ్ఞవరాహస్వామి కథ చాల శుభప్రదమైంది. దీన్ని ఎవరైనా మహాభక్తితో చదువుతూ ఉంటే, విన్నవారికి (శ్రోతలకు) ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహం కల్గుతుంది. ఆ విధంగా ఆ స్వామియొక్క దయకు పాత్రులైన భక్తులకు సమస్త శుభాలు ఒనగూడుతాయి. ఏ మాత్రం సందేహం లేదు అని మైత్రేయుడు విదురునితో చెప్పాడు. అనుగ్రహఫలమే కాదు-మరేదోకూడ ఉన్నాయంటున్నాడు.

విష్ణుమూర్తి ప్రసన్నుడైతే సర్వశుభాలు చేకూరటమే కాదు. మరిన్ని లాభాలున్నాయి. ఆ స్వామి తన భక్తుల హృదయాల్లో పదిలంగా నివాసముంటాడు. సజ్జనులకు తాము కోరిన వస్తువులు లభిస్తాయి. వారికి శాశ్వతమైన మోక్షపదవి కైవసమౌతుంది. ఇక ఇన్ని ఉత్తమ ఫలితాలు చేకూరుతాయన్నప్పుడు అస్థిరమైన తాత్కాలిక సుఖభోగాల గూర్చి చింతించటం దండుగ సుమా!

శ్రీహరి కథలు లోకవిఖ్యాతి గాంచినట్టివి. అట్టి కథామృతాన్ని చవి చూచిన భక్తులనాలుక అనుచితమైన అన్యకథలనే ఉప్పునీటిని రుచిచూడ నొల్లదు. కల్పతరువుయొక్క తేనెలోని తియ్యదనాన్ని ఆస్వాదించే జుంటీగ వేపచెట్ల దరికి చేరుతుందా?

మై
త్రేయముని విదురునికి చెప్పిన ఈ కథ శ్రీశుకుడు పరీక్షిన్నరేంద్రునికి వివరించి, ఇంకా ఈ విధంగా అన్నాడు.

యజ్ఞవరాహుణ్ణి గూర్చి వివరించిన మైత్రేయునితో విదురుండు "ఓ మహానుభావా! రాక్షసజాతిని తుదముట్టించిన ఆ విష్ణుమూర్తి గొప్పచరిత్ర విన్నా నా మనస్సుకు సంతృప్తి కలుగలేదు" అని అన్నాడు.

"మునులలో మేటివాడవైన మైత్రేయా! నీ దయవల్ల ఆ యజ్ఞవరాహస్వామి వృత్తాంతం అంతా విన్నాను. అయినా మరింత వివరంగా వినాలని ఉంది. ఆ శ్రీహరియొక్క అమృతాయమానమైన కీర్తనల్ని చెవికింపుగా వింటేగాని ప్రజల జన్మసంబంధులైన బాధలు తీరవు" అని విదురుడు మైత్రేయునితో అన్నాడు. కావున 

వివరంగా శ్రీహరికథల్ని వినాలని ఉంది కాబట్టి వాటిని సమగ్రంగా విన్పించమని విదురుడు మైత్రేయుణ్జి అర్ధించాడు.

విదురుడు మైత్రేయుణ్ణి "మునీంద్రా! దామోదరుడు యజ్ఞవరాహరూప మెత్తి హిరణ్యాక్షుడనే రాక్షసుణ్ణి మట్టు పెట్టాడని ఇంతకు ముందే నీవు నాతో అన్నావు. ఆ వరాహం తనకోరపైన భూమిని ఎలా ధరించింది? నారాయణునికి హిరణ్యాక్షునితో విరోధమెందుకు కల్గింది? ఆయన వాణ్ణి ఎలా సంహరించాడు? ఈ కథను నాకు సవిస్తరంగా చెప్పు" అని కోరాడు. అప్పుడామైత్రేయుడు "అయ్యా! హరికథలను వినాలని ఉత్సాహంతో ఉన్న నీకు జన్మఫలం తప్పక సిద్దిస్తుంది. అనుమానం లేదు. విష్ణమాయని తెలిసికోవటం ఆ బ్రహ్మకు కూడ అసాధ్యమే" అని విదురునితో అన్నాడు.

ఓ అనఘాత్మా! నీవు అడిగిన విధంగానే పూర్వం ఇదే కథను ధ్రువుడు విష్ణుకీర్తన తత్పరుడైన నారదమునీంద్రుణ్ణి అడిగాడు. ఆ మహర్షి తెలిపిన ఆ శ్రీహరికథలను చెవులారా విని, ఆ రాజు తరించాడు.

"అయ్యా విదురా! ధ్రువుడు శ్రీహరి పంపిన విమాన మెక్కబోతూ తన్ను సమీపించిన మృత్యుదేవత తలపై అవలీలగా ఎడమకాలు మోపి ఇహపరలోకాలలో కీర్తిగడించాడు. బ్రహ్మ విష్ణుసంకీర్తన మహిమను దేవతలకు చెప్పాడు. దాన్ని నీ కిప్పుడు విన్పిస్తా నని మైత్రేయుడన్నాడు.

ఆ తర్వాతి కథను శ్రద్ధగా విను.

No comments:

Post a Comment

The Battle Between Boar Varaha Avatar and Hiranyaksha - హిరణ్యాక్షుండు యజ్ఞవరాహంబగు హరినెదిరించి పోరుట

హిరణ్యాక్షుండు యజ్ఞవరాహంబగు హరినెదిరించి పోరుట నారదుడు పాతాళానికి పొమ్మని చెప్పగానే హిరణ్యాక్షుడు అగ్గిలాగ మండి పడ్డాడు. విష్ణువుతో తలపడి తీ...