Saturday, April 18, 2026

Sukanya wins with the grace of a goddess - దేవీమహిమతో పరీక్షలో నెగ్గిన సుకన్య

దేవీమహిమతో పరీక్షలో నెగ్గిన సుకన్య

అశ్వినుల మాటలు విని మితభాషిణియగు సుకన్య వణకుచు ధైర్యముబూని వారి కిట్లు పలికెను: మీరు దేవతలు - రవిపుత్రులు - సర్వజ్ఞులు-దేవప్రియులు. అట్టి మీరు ధర్మశీలనుకులసతినగు నన్నిట్లు బలుకదగునా? 

సుర శ్రేష్ఠులారా! నాతండ్రి నన్ను యోగనిష్ఠుడగు మునివరునకు ప్రదాన మొనరించెను. అట్టి నేనొక సామాన్యకులట మార్గ మెట్లు పొందుదును? సూర్యుడు-కర్మసాక్షి-సర్వలోకచక్షువు-కశ్యపసుతుడు. అతనికి పుట్టిన మీరిట్లు పలుకదగదు. 

ఒక కులకన్య తన ప్రాణ నాధుని విడనాడి పరపురుషునెట్లు చేరగలదు? ఈ సంసారము సారహీనము. మీరు సూక్ష్మధర్మము నిర్ణయింపజాలుదురు. 

అనఘులారా! నేను శర్యాతిపుత్రిని. సుకన్యను-పతిభక్తి పరాయణను. మీరికస్వేచ్ఛగవెళ్లవచ్చును. లేనిచో మిమ్ముశపింతును. అను సుకన్య వాక్కులు నివి యశ్విదేవతలు విస్మయ మందిరి. వారు ముని వలన భయము నూహించి 

సుకన్యతోనిట్లనిరి: ఓ వరవర్ణినీ! సుశ్రోణీ! రాజపుత్రీ! నీ పతి ధర్మమునకు ప్రసన్నులమైతిమి. నీ శుభముగోరి వరము నిత్తుము కోరుకొనుము. ప్రమదా! మేము దేవవైద్యులము. నీ పతిని నవయువకునిగ సురూపసంపన్నునిగ జేయగలము. 

చతురగుణశీలా! మేము మువ్వురము సమానముగ వయోరూపదేహములు గలవార మగుదుము. మాలో నొక్కని పతిగ వరింపుము. అను వారి మాటలువిని సుకన్య విస్మయమంది తన పతినిజేరి యతనితో వారు పల్కిన విచిత్ర వాక్కు లిట్లు పలుకసాగెను.

భృగునందనా! మీ యాశ్రమ సమీపమున సూర్యపుత్రులు తేజస్స్వరూపులై వచ్చియున్నారు. నేను వారిని జూచితిని. వారిర్వును సర్వాంగ సుందరినగు నన్ను గాంచి కామపరవశులైరి. నీ పతిని నవయువకునిగ జేయుదుమని మాటయిచ్చిరి. నీ మునిపతికి చూపు నిత్తుము. దివ్య దృఢకాయుని జేతుము కాని నీవు మేము చెప్పిన నియమమును పాటించవలయును. 

మేము నీ పతికి మాతో సరిసమానమైన రూపము వయస్సు అవయవములు నొసంగుదుము. అపుడు మా ముగ్గురిలో నొక్కని పతిగ వరింపుము అనిరి. 

సాధుపుంగవా! వారిమాటలు విని యీ యద్బుత విషయము నీకు దెల్పుటకు వచ్చితిని. ఈ కార్య సంకటమునందేమి చేయవలయునో తెలియ జెప్పుము. 

సర్వజ్ఞా! దేవతల మాయ తెలియరాదు. వారి కపటము నెఱుగని దానను కనుక నీవు చెప్పినట్లు నీ కోర్కి తీర్తును ఆజ్ఞాపింపుము అన 

చ్యవనడిట్లనియెను: ''సాధుశీలా ! కాంతా! నీ విపుడు శీఘ్రమే వెళ్ళి నా మాటగ దేవ వైద్యులగు సూర్యపుత్రుల నిచటికి గొని రమ్ము, వెంటనే వారి మాట పాటింపుము. దీనికి విచారింపదగదు.'' 

అను పతి యనుమతిబడసి సుకన్య వారి చెంత కేగి ''ఓ యశ్వి కుమారులారా! మీరు సురోత్తములు. నేను మీ నియమము పాటింపగలను.'' అనెను. ఆమె మాటలు విని యశ్వినులు 

ముని సన్నిధి కరిగి ఇట్లనిరి : ఓ రాజ కన్యా! ఇపుడు నీపతి నీటిలో మునుంగవలయును. అపుడతనికి చక్కని రూపము ¸యవనము గల్గును. అని యశ్వినులనగనే చ్యవనుడు నీట మునిగెను. ఆ పిమ్మట అశ్వినులు సైతము కొలనులో మునిగిరి. తర్వాత ఆ సరస్సునుండి మువ్వురు దివ్య పురుషులు బయలు వెడలిరి. 

ఆ మువ్వురును దివ్య దేహాలు - నవ యువకులు - దివ్యకుండల మండితులు - సమాన రూపావయవములు గలవారు.

అపుడు వారు ముగ్గురేక కంఠముతో నిట్లనిరి : వరవర్ణినీ! కమలాననా! మాలో నీ కిష్టుడైన వాని నొక్కని పతిగ వరింపుము. నీకు మేలగుత ! వరాననా! మాలో నెవని యందు నీకెక్కువ మక్కువ యుండునో యతనినే వరింపుము.'' 

అపుడు సుకన్య సమాన వయో రూపములుగల వారిని గాంచెను. రూపమునందు వేషమందు కంఠ స్వరమందు నెంత మాత్రమును భేదము లేకవెలుగుచున్న దేవ సుతులనుగాంచి యామె సందేహములో బడెను. 

వారిలో తన పతిని గుర్తించలేక సుకన్య వ్యాకులత్వముతోనిట్లు చింతించెను: 

''ఇపుడేమి చేయుదును. మువ్వురును సమానులు. ఎవరిని వరింపవలయునోతోచుట లేదు. వీరు దేవ కుమారులు. వీరిలో నాపతిని తెలియక సంశయమున బడితిని. ఇందంతయు దేవతలు పన్నిన పన్నుగడ- ఇంద్రజాలము. ఇపుడు నాకర్తవ్యమేమి? నా పతిని దక్క వేరొక్కని వరింపను. 

అట్లయిన నాకు చావు నిక్కము. వీరిలో మూడవ వ్యక్తి యును దేవ పుత్రుడనియే భావించుచున్నాను.'' అని తలపోసి సుకన్య విశ్వేశ్వరి పరాశివదేవి భగవతి నీ విధముగ ధ్యానించి నుతించెను: 

ఓ జగన్మాతా ! నేను దుఃఖార్తనై నిన్ను శరణు వేడుచున్నాను. నీ చరణ కమలములకు మ్రొక్కుచున్నాను. నాపాతివ్రత్యము నిలువబెట్టుము. ఓ హ్రీంకార కమలాలయా! దేవీ! నీకు మనస్కారము. 

ఓ హరి ప్రియా లక్ష్మీ దేవి! వేద మాతా! సరస్వతీ! ఈ చరాచరమైన జగమంతయు నీచేత సృజింపబడెను. నీవు జగముల బ్రోతువు. శాంతికై లోకములు సంహరింతువు. 

ఓ తల్లీ! నీవు బ్రహ్మ విష్ణు మహేశులకు తల్లివి గదమ్మా! ఆజ్ఞానులకు బుద్ధి సుజ్ఞానులకు ముక్తిని నీవు ప్రసాదింతువు. నీవు పరా ప్రకృతివి- అజ్ఞవు- పురుషులకు ప్రియ దర్శినివి. తల్లీ! నీ వెల్ల విజ్ఞులకు భుక్తి ముక్తులు ప్రసాదింతువు. అజ్ఞులకు దుఃఖము గల్గింతువు. భూత జాలములకు సుఖము గల్గించుటే నీ పని.

ఓ యమ్మా! నీవు యోగులకు సిద్ధిదాయినివి- జయదాయినివి- కీర్తిదాయినివి. నే నిపుడు విస్మయముతో ప్రసన్ననై నిన్ను శరణు వేడుచున్నాను. 

ఓ మాతా! నే నిపుడు శోకసాగరమున మునిగితిని. దేవతల మోసములో జిక్కితిని. మాయా బ్రాంతి జెందితిని. వీరిలో నెవని వరింపవలయునో తోచుటలేదు. నా పతిదేవుని నాకు చూపింపుమమ్మా! 

దేవీ! నీవు సర్వజ్ఞు రాలవు. నా సతీవ్రతము నీకు దెలియును. నా పతి నెఱిగింపజేయుము.'' అని సుకన్య శ్రీత్రిపురసుందరీదేవిని ప్రస్తుతించెను. సుకన్య హృదయమున సుఖోదయమగునట్లు చ్వవనుని గుర్తించునట్లు దేవి జ్ఞాననేత్ర మొసంగెను. 

ఆ మువ్వురను సమానమైన రూప¸యవనముగల్గినవారిని సుకన్య గనెను, వారందఱిని చక్కగ పరిశీలించి సుకన్య వారిలో తన పతి ఎవరో గుర్తించెను. అట్లామె తన పతినే వరింపగ దేవతలు సంతుష్టులైరి. 

ఆ సురోత్తములు భగవతిప్రసాదమున ప్రసన్నులైరి. సుకన్య పరమపాతివ్రత్యమునకు సంప్రీతులైరి. వారు వారికి వరములు గురిసిరి. వారు పిదప మునిని వీడ్కొని వెళ్ళుటకు సిద్దముగ నుండిరి. 

అపుడు కన్నుల చూపును మదనసుందరదేహమును యువశక్తిని భార్యనుబడసి సంతోషించి 

చ్యవనుడు కిట్లనియెను: ఓ యశ్వినులారా ! మీ యిర్వురివలన నేను మహోపకారము పొందితిని. ఈ భోగ్య సంసారమునందు సుకేశియగు భార్యను బొందియు సుఖమొందలేకపోతిని. ప్రతిక్షణము దుఃఖమనుభవించితిని. 

ఈ నట్టడివిలో కన్నుల వెల్గుపోయి ముసలి వాడనై భోగభాగ్యములు లేక క్రుంగికృశించిన నాకు కన్నుల వెల్గును ¸యవనమును సురూపమును మీరొసంగితిరి. కనుక నేను మీకే కొంచెమైన ప్రత్యుపకారము చేయదలచితిని. 

ఒక మిత్రు డుపకారముచేసిన నతనికి మరల నుపకారము చేయకున్న దోషము. ఆ కృతఘ్నుడు వ్యర్థుడు. భూమిమీద వాడు ఋణగ్రస్తుడు. కనుక నే నిపుడు మీ వాంఛితమే కొద్దిగనైన తీర్చదలచితిని.

దేవేశులారా! మీరు నాకు సురాసురుల కలవిగాని ¸యవనము ప్రాసాదించితిరి. మీ యేదైన కోర్కె దీర్చి నేను మీకు ఋణముక్తుడ గాగలను. మీ సుకృతికి ప్రీతుడనైతిని. మీ మనోవాంఛ దెలుపుడు. అను ముని వాక్కులువిని వారు తమలోతామాలోచించుకొనిరి. 

సుకన్యకు సరిజంటగ వెలయు మునివరునితో వారిట్లనిరి: మా తండ్రి దయవలన మా కోర్కె లన్నియు తీరినవి. కాని మేము దేవవైద్యులమని యింద్రుడు మమ్ము సోమపానము చేయనిచ్చుటలేదు. మా కా దేవతలతో గూడి సోమపానము చేయు కోర్కె గలదు. 

మున్ను కనకాచలముపై బ్రహ్మ జరిపిన యాగమున నింద్రుడు వైద్యులమగుటచే మాకు దేవతలతో సరిగా సోమపానము తగదనెను. కనుక ధర్మజ్ఞా తాపసా! నీకు శక్తియున్న మమ్ము సోమపాయులను జేయుము. ఈ మా వాంఛిత మీడేర్పుము. ఈ పని నెఱవేర్పుము. 

ఓ బ్రాహ్మణోత్తమా! ఇది అంతయు నెఱింగి మేము సోమపానము చేయునట్లు చేయుము. మాకు సోమపానమునకై దప్పిక మిక్కుటమైనది. నీవు మా దప్పిదీర్పగల దిట్టవు. అను వారి మాటలువిని 

చ్యవనుడు వారి కిట్లనెను: నే నొకప్పుడు ముసలివాడను. ఇప్పుడు మీ దయవలన రూపమును ¸యవనమును చక్కని భార్యను బడయగల్గితిని. కనుక దేవరాజు నెదుట మీరు సోమరసము ద్రాగునట్లు జేయగలను. నిజము బల్కుచున్నాను నా మాట నమ్ముడు. 

శర్యాతి రాజు గొప్ప తేజోవంతుడు. అతని యజ్ఞమున మీ కోర్కె దీర్చగలను. అను మాటలకు వారు ప్రీతులై దివికేగిరి. అంత చ్యవనుడు తన భార్యనుగొని తన యాశ్రమము జేరెను.

శర్యాతి సుకన్యను శంకించడం

No comments:

Post a Comment

Revathudi's Satya Loka Yatra - రేవతుడిసత్యలోకయాత్ర

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము -  రేవతుడిసత్యలోకయాత్ర జనమేజయ డిట్లనెను: ఓ వ్యాసమహర్షీ ! రేవతుడు రేవతిని తీసికొని బ్రహ్మలోక మేగెనను విషయము ...