Saturday, April 18, 2026

The Surya Dynasty Chronicles - సూర్య వంశ రాజ వృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - సూర్య వంశ రాజ వృత్తాంతము

రాజా! ఒకానొకప్పు డష్టక శ్రాద్ధము జరుపుటకు వికుక్షిని ఇక్ష్వాకుడు మాంసము తెమ్మని యాజ్ఞాపించెను. కుమారా! నీ విపు డడవికేగి శ్రాద్దమునకు సాదరముగ మాంసము తెమ్మని ఇక్ష్వాకు డనగా వికుక్షి యట్లే యని యస్త్రము దాల్చి యడవి కేగెను. 

అతడు తన బాణములతో పందులను జింకలను కుందేళ్లను వేటాడి యాడి యలసిసొలసి యాకలి గొనెను. అత డాకలిమంటచే అష్టకశ్రాద్ధము మాట మఱచి యడవిలో కుందేటి మాంసముతిని మిగిలిన చెడిన మాంసమును తండ్రి కిచ్చెను. 

దానిని ప్రోక్షించుటకు తెచ్చినపుడు గురుడు చూచి యీ మాంసము పనికిరాదని గ్రహించి కోపించెను. ఈ మాంసము భుక్తశేషము; ప్రోక్షింపదగదు; దీనివలన శ్రాద్ధ పాకమంతయును చెడునని వసిష్ఠుడు రాజునకు తెలిపెను. రాజు తనగురుని మాటలువిని తన కొడుకు విధిలోపమున కర్మలోప మొనరించినందులకు కోపించి యతనిని దేశ బహిష్కృతుని చేసెను. 

శశమాంసము దినుటవలన నతడు శశాదుడన బరగెను. అతడు తన తండ్రి కోపమునకు గురియై కాఱడవులందు ద్రిమ్మరియై తిరుగుచుండెను. అతడు ఫలమూలములు దినుచు ధర్మతత్పరుడై కాలము గడపెను. కొంతకాలమునకు తన తండ్రి మరణించుటవిని వచ్చి రాజ్యము స్వీకరించెను. 

శశాదు డయోధ్యాపతియై రాజ్యము చేసెను. అతడు సరయూనదీతీర మున పెక్కు యజ్ఞములు పూర్ణముగ గావించెను. శశాదునకు కుకుత్థ్సుడను కొడుకు గల్గెను. అత డింద్రదాహుడు పురంజయు డను పేర్లతో విఖ్యాతి గాంచెను. 

జనమేజయు డిట్లనెను: ఆ రాకుమారునకిన్ని పేరు లేయే కారణములవలన నేయే కర్మల వలన గలిగెనో నాకు వివరించి దెలుపుము. అనగా-

వ్యాసు డిట్లనెను : శశాదుడు స్వర్గము జేరగా కుకుత్థ్సుడు రాజై ధర్మముతో తన తండ్రితాతల రాజ్య మనుభవించెను. ఆ సమయమున దేవతలు దానవుల చేతులం దోడిపోయిరి. అంత దేవతలు త్రిలోకాధిపతియు-అవ్యయుడు-నగు విష్ణుని శరణువేడగ మహావిష్ణువు దేవతల కిట్లనెను : 

అమరవరులారా! మీరు కుకుత్థ్సుని పార్శ్యరక్షకునిగ నుండుమనుడు. అతడు యుద్దమందు దానవులను చంపగలడు. అతడు ధర్మాత్ముడు. అతడు విల్లునములు దాల్చి మీకు సాయము రాగలడు. శ్రీపరా శక్తి దయవలన నతని కమితశక్తి గలదు. 

మహారాజా! అపుడింద్రాది దేవత లెల్లరును హరిమాట ప్రకార మయోధ్యకుజని కుకుత్థ్సుని గాంచిరి. ఆ వచ్చిన దేవతల నెల్లరిని రాజు ధర్మమతితో వారి రాకకు కారణ మడిగెను. నేను కడు ధన్యుడను. నేను నేడు పవిత్రుడనైతిని. నా జీవితము సాఫల్యము జెందెను. దేవతలు నాయింటి కేతెంచి నాకు దర్శనభాగ్య మిచ్చినారు. 

దేవేశులారా! మీ వచ్చిన పని తెలుపుడు. అదెంతటి దుస్సాధ్యమైనదైనను మీ మహాకార్యము చేయగలను. ఆన 

దేవత లిట్లనిరి: రాజేంద్రా: నీ సహాయసంపదనిమ్ము. ఇంద్రునకు మిత్రుడవు గమ్ము. యుద్దమున ధుర్జయులగు దానవులను జయింపుము. శ్రీపరాశక్తి యనుగ్రహమున నీకు దుర్లభమైన దేదియును లేదు. మేము విష్ణుప్రేరితులమై నీ సన్నిధికి వచ్చి తిమి. అన-

రాజిట్లనెను: ఓ సురవరులారా! ఇంద్రుడు వాహనముగ నున్నచో నేను మీకు పార్శ్వరక్షకుడుగ నుండగలను. ఇపుడు జరుగనున్న దేవదానవ యుద్దమందు దేవేంద్రునిపై నారోహించి పోరుదును. నా మాట నిజము. అపుడు దేవత లింద్రునితో నిట్లనిరి. 

ఓ యింద్రా! నీవా రాజునకు వాహనము గమ్ము. అభిమానము వీడుము. ఈ యద్బుతకార్య మొన ర్పుము. అట్లు దేవేంద్రుడు హరిచే ప్రేరితుడై సిగ్గుజెందుచు శివునికి వృషభమువలె తాను వృషభమై రాజునకు వాహనముగ నుండెను. రాజు యుద్దభూమి కేగుట కింద్రుని మూపుపై గూర్చుండెను. 

అందువలన నతడు కుకుత్థ్సుడన విఖ్యాతి గాంచెను. అతడింద్రుని వాహనముగ జేసికొనుటచే నింద్రువాహు డయ్యెను. దైత్యులపురము ధనరాశిజయించుటవలన పురంజయు డయ్యెను. అట్లుకకుత్థ్సుడు దైత్యులను గెలిచి వారి ధనరాసులు దేవతలకొసంగెను. 

ఇట్లు రాజర్షి కింద్రునితో స్నేహముకుదిరెను. కుకుత్థ్సుని వంశజు లెల్లరును భూమిపై కాకుత్థ్సు లన వన్నెయు వాసియు గాంచిరి. కకుత్థ్సున కతని భార్యయందు కాకుత్థ్సుడు-అతనికి పరాక్రమశాలియగు పృథుచక్రవర్తి జన్మించి ప్రసిద్ధిబడసిరి. 

పృథుచక్రవర్తి దేవీపదభక్తుడు. అతనికి విశ్వరంధియను పుత్రుడు గల్గెను. విశ్వరంధి కొడుకు చంద్రుడు. అతడు శ్రీమంతుడు-వంశకరుడు. అతని సుతుడు తేజముబలముగల యువనాశ్వుడు. 

యువనాశ్వుని తనయుడు శావంతి. అతడు యజ్ఞములు నిర్వహించినవాడు. అత డింద్రపురమును బోలు శావంతీపురమును నిర్మించెను. మహాత్ముడగు శావంతుని కొడుకు బృహదశ్వుడు. అతని కుమారుడు కువలయాశ్వుడు.

ధుంధువను దైత్యుని చంపుటచే నతడు ధుంధుమారుడను పేర ప్రఖ్యాతి గాంచెను. అతని కుమారుడు దృఢాశ్వుడు. అతని కొడుకు హర్యశ్వుడన పేరొందెను. అతని కొడుకు నికుంభుడు - అతని కొడుకు బర్హణాశ్వుడు. 

అతని తన యుడు ప్రేసేనజిత్తు. అతడు మహాబలశాలి అతని కొడుకు ¸యవనాశ్వుడన బరగెను. అతని నందనుడు శ్రీమాంధాతృ చక్రవర్తి. అతడు శ్రీజగదీశ్వరికై నూటయెనిమిదివేలు మందిరములు పుణ్యతీర్థములందు శ్రీదేవీప్రీతికై కట్టించెను. 

అతడు తన తల్లి గర్బమున బుట్టక అద్బుతముగ తన తండ్రి పొట్ట చీల్చుకొని బయటి కేతెంచెను. అన విని 

రాజిట్లనెను : నీవు చెప్పిన విషయము నేను మున్ను కనివిని యెఱుగను. ఓ మహానుభావా! నీవు పల్కినట్లు జన్మించుట సంభావ్యముగాదు. కనుక నిపుడు మాంధాతృ జన్మ వృత్తాంతము వివరించి తెల్పుము. రాజు పొట్టనుండి సర్వాంగసుందరుడగు పుత్రు డెట్లు గల్గెను? 

తండ్రికి పుట్టిన తనయుడు - మ౦ధాత

No comments:

Post a Comment

Aruna's moral teaching - అరుణుడు చేసిన నీతిబోధ

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - అరుణుడు చేసిన నీతిబోధ పుత్రా! ధర్మమందు బుద్ధి నిల్పుము. విప్రులు గౌరవపాత్రులు. న్యాయముగ ధనము సంపాదించవలయును...