Saturday, April 18, 2026

Sukanya Pati Seva - సుకన్య పతి సేవ

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - సుకన్య పతి సేవ

వ్యాసుడిట్లనియెను : అట్లు రాజు వెడలిన పిదప సుకన్య ధర్మ తత్పరమతితో పతిసేవా పరాయణయై యగ్నులను సేవించు చుండెను. సుకన్యబాల. ధర్మ తత్పరయై మునిపతికి తీయని ఫలములను కందమూలములను పెక్కులు తెచ్చి యిచ్చెను. 

ఆమె ప్రేమమీర తనపతిని వేన్నీటి స్నానమొనర్చి జింకతోలు ధరింపజేసి దర్బాసనమున కూర్చుండ బెట్టును. ఆ సతీ తిలతము మునితిలకుని సన్నిధిలో తిలలు యవలు దర్బలు కమండలువునుంచి మునీశ ! నిత్యానుష్ఠానమొనరింపుమని యనును. నిత్యానుష్ఠానము పూర్తియైన పిమ్మట సుకన్య తన ప్రియ భర్తను చేతులతో లేపి దర్బలపై గాని వేరొక ఆసనముపై గాని కూర్చుండ పెట్టును. 

ఆ పిదప నా రాచకన్నియు ముదుర పండిన తీయని పండ్లును మంచి నీవారాన్నమును దెచ్చి చ్యవన మునివరునకు తినిపించును. తనపతి తుష్టిగ పుష్టిగ భుజించిన తర్వాత సుకన్య మర్యాదతో నతనికి కమ్మని యాకు వక్కల తాంబూల మందించును ముఖము కడుగుకొని తాంబూలము సేవించిన తన నాధుని సుఖాసనముననుంచి యతని యాజ్ఞతో నామె తన పనులు తాచూచుకొనును. 

తనపతి తినగ మిగిలినది తాను గుడిచి పిదప నతని సన్నిధికేగి నెయ్యము దియ్యము దోప సుకన్య ప్రభూ! ఏమియాజ్ఞ యని యడుగును. మీ యానతియైనచో రాగము తళుకొత్త మీపాదము లొత్తుదును. అని సుకన్య నిత్యము పతిసేవా పరాయణయై పేరుగాంచెను. ముని సాయంకాల హోమము నిర్వర్తించిన మీదట సుకన్య సుందరి మునిపతికి ప్రియ మధురములగు ఫలములు తెచ్చియిచ్చును.

ఆ తరువాత ముని యనుమతితో సుకన్య మిగిలిన ఫలములు తినును. ఆ కోమలాంగి తనపతిని మెత్తని మెత్తని సెజ్జపై సుఖకరముగ పరుండ బెట్టును. అట్లు తన ప్రియకాంతుడు పరుండిన పిదప కృశోదరి యగు సుకన్య కుల కాంతల ధర్మములను గుఱించి యతని నడిగెను. 

ఆమె తన పతి పాదములొత్తి యతడు నిద్రించిన పిమ్మట పతి భక్తి తనరార పతి చరణ సన్నిధిలో నిదురించును. మండు గాడ్పులు చెరగు గ్రీష్మ కాలమున నామె తన భర్తకు చల్లని తాల వృంతముతో కమ్మతెమ్మెరలు వీవ విసరెను. 

ఆ పతిసేవా పరాయణ హేమంత ఋతువునందు చిదుగు పుల్లలు తెచ్చి మంటబెట్టి యిపుడు నీ మదికి వెచ్చవెచ్చగ నున్నదాయని మాటి మాటి కడిగెను. ఆమె తెలతెల వారకముందే లేచి తన పతినిలేపి యతని శౌచక్రియకు నీళ్లచెంబు మట్టి తెచ్చును. ఆమె చెంబును మట్టిని తనపతిదేవుని చెంతనుంచి తానుదూరముగ నుండును. 

శౌచక్రియ పూర్తియైన పిదప ఆమె తన భర్త చేయిపట్టుకొనెను. ఆ పతివ్రత తన పతినొక శుభాసనమున గూర్చుండబెట్టి యతని పాదములను మట్టితో నీళ్లతో శుభ్రముగ యధావిధిగ కడుగును. 

ఆ రాజకన్య మునిరాజునకు ఆచమనము చేయించి పండ్లుతోము పుల్లతెచ్చి యిచ్చును. ఆమె ముని స్నానమునకు వేడినీరుతెచ్చి కూర్మి పేర్మి నతనితో నిట్లనును : 

ఓ బ్రాహ్మణోత్తమా! ఏమియాజ్ఞ! పండ్లు తోముట పూర్తియైనదా? వేడినీరు సిద్ధముగ నున్నది. సమంత్రకముగ స్నా వ మొనరింపుము.

తూర్పున సంజకెంజాయ విరియుచున్నది. హోమసమయము సమీపించినది. యథావిధిగవేల్చి దేవతార్చన చేయుము ఈ చందముగ సుకన్య మునిపతిని పతిగ బడసి యనిందిత చరిత్రయై నిత్య మతనికి నియమనిష్ఠలతో ప్రేమమీర పరిచర్యలు చేసెను. ఆ శుభాసన యీ విధిగ అగ్నులను అతిథులను అభ్యాగతులను సేవించుచు చ్యవనుని ముదమార కొల్పుచుండెను. 

అంత నొకనాడు సూర్యపుత్రులగు అశ్విను లిర్వును చ్యవనముని యాశ్రమము పొంత స్వేచ్చగవిహరించుచుండిరి. నీట స్నానమాడి తన యాశ్రమము వైపుగ నేతెంచుచున్న సర్వాగసుందరియగు సుకన్యను రవిపుత్రులు చూచిరి. దేవకన్యను బోలు సుకన్యనుగాంచి వారు విమోహితులై యామె సన్నిధికేగి యిట్లనిరి: 

వరారోహా! గజగామినీ! శుచిస్మితా! క్షణమాగుము. మేము దేవసుతులము. మే మడిగిన దానికి నిజము పలుకుము. చారునేత్రీ! నీ వెవ్వని కూతురవు? నీ పతి యెవరు? నీవొంటరిగ స్నానమున కీతటాకమున కేల వచ్చితివి? 

శోభనాంగీ! కమలాక్షీ! నీ కాంతిచే లక్ష్మికి ప్రతిరూపముగ వెల్గుచున్నావు. నిన్ను గూర్చి తెలిసికొనదలచితిమి నిజము చెప్పుము. 

చంచలాక్షీ! సుందరీ! నీ యింత మెత్తని పాదములు పాదరక్షలు తొడు గులు లేకున్నవేమి! ఈ కటికి నేలపై నీ యగుడులు పడినంతనే మా గుండెలు వ్రయ్యలగుచున్నవి. 

తన్వంగీ! నీవు విమాన మెక్క తగినదానవు. వట్టి కాళ్లతో నీ చిట్టడివిలో గ్రుమ్మరుదు వేల?

వరాననా! దాసీ సహస్రములు కొలుచుచుండగ వెడలవేమి? నీవు రాచపట్టివో! దేవకన్యనో నిజము పలుకుము. ఓ యనఘురాలా! నిన్ను గన్న తల్లి ధన్య! నీ తండ్రి ధన్యుడు. ఇక నిన్ను చేపట్టిన భర్త యదృష్టమేమని తెలుపగలము! సులోచనా! ఈ భూలోకము స్వర్గసీమకంటె మహోన్నతతరమైనది. 

నీ పవిత్రపాదములు పడుటవలన ఈ భూతలమంత యును పవిత్రమై ధన్యమైనది. ఈ వనమందు నిన్ను గన్నులార చూచు జంతువులు మిక్కిలి యదృష్టము గలవి. పక్షులు నదృష్టము గలవి. ఈ వనభూమియు పావనమైనది. 

సులోచనా! ఈ పొగడ్త లన్నియు నెందులకు! నీ తండ్రి యెవరో నీ పతి యెవరో నిజము చెప్పుము. వారిని చూడదలచితిమి. అను వారి మాటలువిని సుందరాంగియగు సుకన్య సిగ్గుతో దేవ కుమారుతో నిట్లు చెప్పెను. 

నేను శర్యాతి కూతురను. ఈ చ్యవనముని భార్యను. కులసతిని నా తండ్రి నన్నీ మునికి తన ఇచ్ఛతో దానము చేసెను. నే నీ మునికి సహధర్మచారిణిని. నా పతిదేవుడు తాపసుడు; వృద్ధు; గ్రుడ్డివాడు. నేను ప్రేమ భక్తితో నిరంతరము నా పతిని సేవించుచుందును. 

మీరెవ్వరు? ఏ పనిమీద వచ్చితిరి? నా నాధు డాశ్రమమందు గలడు. మీరచటి కేతెంచి యాశ్రమమును పావనము చేయుడు. అను సుకన్య పలుకులువిని వారిట్లనిరి: కల్యాణీ ! నీవు నీ తండ్రిచే యీ తబిసి కెట్లు దానము చేయబడితివి?

భామినీ! నీ వీ వనప్రదేశమునందు మెఱుపుతీగవోలె వెల్గుచున్నావు. దేవగణములందును నీపాటి యందగత్తె కనబడలేదు. నీవు దివ్యమాల్యాంబరంబులు దివ్యనానా భరణములు ధరింపదగినదానవు. నల్లని ముంగురుల దానవు. ఈ నార చీరలు నీకు తగవు. 

రంభోరూ! విశాలాక్షీ! ముదుసలివానిని గ్రుడ్డివానిని భర్తగబొంది యీ నట్టడివిలో నేల బాధలు పడు చున్నావు? అక్కట విధివిలాసమెంత విపరీతమైనదే! నర్తన చతురులారా! ఇంతటి మిసమిసలాడు నిండుజవ్వనము పొంగులు పారుదానవే! ఆ ముసలిని వరించి యేమి సుఖము బొందుదువు? 

మన్మథుడు ప్రయోగించినవాడి ముల్కులింకెవ్వనిపై బడును! చారునేత్రీ! నల్లని వాశాలమయిన కురులుకలదానా! అందమైన కనులదానా! విధాత నవ¸యవనమందున్న నిన్ను గ్రుడ్డివానికి భార్యనుగ చేసినాడు. నీకితడు తగిన జంటగాడు. ఇంకొకని పతిగ వరింపుము. 

కమలనయనా! నీ జీవితమంతయు వ్యర్థమే కదా! ముసలి గ్రుడ్డివానిని భర్తగ బొందుట అరణ్యనివాసము జింకతోలు దాల్చుట ఇవన్నియు నీకు తగినవి గావని దలతుము. మానినీ! సుందరాంగీ! సులోచనా! 

శుభాంగీ ! ఈ పండుముసలి మునిని వ్యర్థముగా సేవించి నీకేమి సుఖము? దోర వయసును వ్యర్థము చేయకుము. మాలో నొకనిని వరింపుము. శోభనాంగీ! నిన్ను పోషించి రక్షించుటకు చేతకాని వానిని నీలోని కోర్కెలు తీర్చజాలని వానిని భాగ్యహీనుని మునిని వదలి మా యిర్వురిలో నీ నచ్చినవానిని వరింపుము. 

కాంతా మణీ! మానినీ! ఈ ముసలి చీకుతో కాలమెట్లు గడుపుదువు? నీవు సుందర నందన వనమందు చైత్రరథమునందు స్వేచ్ఛగ విహరింపుము. నీవు రాచపట్టివి. శుభలక్షణవు. ఆలుమగలు కలిసి మెలసి మసలు టెఱిగినదానవు. ఓపలేని వలకాకతో తపించు దానవు. 

ఈ వనమందు సరిగ తగిన జంటలేక ప్రొద్దెట్లు పోవును? పికవాణీ! ముద్దు పల్కుదాన! రాజకన్య! ముసలి మునిని వదలుము. రారమ్ము. మాలో నొక్కని సేవించుకొమ్ము! స్వర్గమందలి దేవగృహములలో సుఖసీమలలో మైమఱచిపొమ్ము. 

ఓ రాజకుమారీ! సుకేశీ! మృగాక్షీ! ఈ గ్రుడ్డివృద్దుతో ఈ యొంటరి యడవిలో నీకేమి సుఖము గల్గును? నీ పందెముగాయు పడుచుతన మేడ! ఈ ముదుసలి గ్రుడ్డి సేవ యేడ! దుఃఖములనిన నీ కిష్టమా యేమి? చంద్రముఖీ! నీ నెమ్మేను కుసుమ కోమలము. పండ్లు నీరు తెచ్చుటకు తగినదికాదు.

దేవీమహిమతో పరీక్షలో నెగ్గిన సుకన్య

No comments:

Post a Comment

Aruna's moral teaching - అరుణుడు చేసిన నీతిబోధ

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - అరుణుడు చేసిన నీతిబోధ పుత్రా! ధర్మమందు బుద్ధి నిల్పుము. విప్రులు గౌరవపాత్రులు. న్యాయముగ ధనము సంపాదించవలయును...