Thursday, April 16, 2026

Chapter 126 Sridevi's appearance to the gods - అధ్యాయము 126 శ్రీదేవి దేవతలకు ప్రత్యక్షమగుట

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము - అధ్యాయము 126

శ్రీదేవి దేవతలకు ప్రత్యక్షమగుట

సర్వార్థతత్వవిదుడు మాధవుడునగు హరి చింతాధీనులు ప్రేమభరమున ఉద్ర్భాంతులునగు దేవతలను గాంచి హరి ఇట్టులనియెను : 

ఓ సురలారా! మీరు మౌనముగానుండుటకు కారణమేమో తెలుపుడు. మీకు గల్గిన మంచి చెడ్డలు తెలుపుడు. చెడు తొలగింప యత్నింతును. అన 

దేవతలిట్లనిరి: ప్రభూ! ఈ ముల్లోకములందు నీకు దెలియనిదేమున్నది? అన్ని తెలిసియును మాటామాటికి మమ్మేల ప్రశ్నింతువు? పూర్వము నీవు వామనమూర్తివై త్రిభువనము లాక్రమించి బలిని బంధించితివి. ఇంద్రుని దేవపతిగ జేసితివి. మునుపు దనుజులను మోహపెట్టి వారినణచివేసి యమృతము గైకొంటివి. కనుక సకలదేవతల బాధలు బాపుటకు నీవొక్కడవే సమర్థుడవు. అన 

విష్ణువిట్లనెను : మీరు భయపడకుడు. వగవకుడు. వానిని చంపుటకొక చక్కని యుపాయము నెఱుగుదును. దానివలన మీకు తప్పక సుఖముగల్గును. దానిని తెల్పుదును. వినుడు. బుద్ధిబలము-అర్థము- మోసము-వీనిలో దేనివలననైన మీకు మేలు చేకూర్చుట నా పరమ కర్తవ్యము. సామాది చుతురుపాయములు మిత్రులందును విశేషముగ శత్రులందు నుపయోగించవలయునని తత్త్వవిదులందురు. 

మున్ను వీనిచే బ్రహ్మ యారాధింపబడి వరమిచ్చెను. దాని ప్రభావమున నతడు దుర్జయుడయ్యెను. అతడు విశ్వకర్మచేత సృజింపబడి భూతములన్నిటి కజయుడయ్యెను. ఆ బలమువలన నతడు శత్రులకసాధ్యుడయ్యెను. అమరులారా! అతడు సామాదులచే వశుడుగాడు. మొదట లోభపెట్టి వశము చేసికొని పిదప చంపవలయును. 

కనుక నిపుడు గంధర్వాదులందఱు నతడున్నచోటికేగి యతని పట్ల సామోపాయమవలంబింపవలయును. పిదప నతనిని గెల్చుట సుకరము. మొదట నతడేమన్నను కాదనక నెయ్యము చూపవలయును. పిదప చంపవలయును. నేనింద్రుని వజ్రాయుధములో నదృశ్యుడనై దాగియుందును. ఇట్లు నేనింద్రునకు సాయమొనర్పగలను. విబుధులారా! అతని యాయువు తీరు కాలమున కెదురుచూడుడు. అంతేకాని వేరుపాయమున నతడు చావడు.

ఇపుడు గంధర్వాదులు ఋషులు నింద్రునితోగలిసి వెళ్ళి మంచి మాటలతో నేస్తము చేసికొనవలయును. అతనికి నమ్మకము గల్గించవలయును. అపుడు నే నింద్రుని వజ్రాయుధములో రహస్యముగ దాగియుండి యతనిని చంపింతును. 

విశ్వాసఘాతుకుడనగుదునను పాపభీతి వెనుకకు నెట్టవలయును. అతనికి తనపై నమ్మిక కుదిరిన వెంటనే యింద్రుడతనిని చంపవలయును. ఇతర విధముల నతడు చావడు. నా సాయముగల వజ్రముతో వృత్రుని చంపవలయును. శత్రుడు మోసగాడైనచో వానిని మోసముతోడనే చంపవలయును. బలిశాలియగు వైరి వంచనచే జంపబడును - శూర ధర్మమున చావడు. తొల్లి నేను బలిని వామన రూపముతో మోసగించితిని. 

తొలుత నా మోహినీ వేషమునకు దానవులు మోసపోయిరి. కనుక నిపుడు మీరెల్లరును శ్రీ శివాభగవతీ దేవిని సంసేవింపుడు. ఆ తల్లిని మీరు మంత్ర స్తోత్రములతో శరణుబొందుడు. యోగమాయ మీకు తప్పక తన చేయూత నీయగలదు. నేను ప్రతి దినము దుర్మతుల కలవిగాని పరాప్రకృతిని సిద్ధికామ ప్రదాయినని సర్వకామ కళాస్వరూపిణిని భజింతును. ఆ దేవి నింద్రుడు నారాధించి రణమందున పగఱ గెలువగలడు. ఆ మహామాయా - జగన్మోహినీ దేవి దానవులను మోహపెట్టును. వృత్రుడు మాయామోహితుడైనచో నతడు అనాయాసముగ చంపబడగలడు. 

శ్రీపరాభట్టారిక యానందించినచో సర్వమును సుసాధ్యముగాగలదు. అట్లుగానిచో నెవని కోరికలు తీరును? ఆమె సర్వకారణ కారణ సర్వాంతర్యామి స్వరూపిణి కావున మీరా త్రిభువన జనయిత్రిని పరాప్రకృతిని పరమభక్తితో సాత్త్వికమగు భావముతో శత్రు నాశమునకు భజింపుడు. పూర్వము నేనైదు వేలేండ్లు దారుణముగ పోరాడి మధుకైటభులను సంహరించితిని. అలనాడు నేను పరాప్రకృతిని సంస్తుతించితిని. 

ఆ తల్లి సుప్రసన్నయయ్యెను. అంత వారు మాయా మోహితులై మోసముతో నాచేత మడిసిరి. ఆ మదమత్త రాక్షసులట్లు నా చేతిలోచచ్చిరి. కనుక మీరును పరమ భావముతో ఆ పరాప్రకృతి నారాధింపుడు. దేవతలారా! ఆ జగన్మాత తప్పక మీకు కార్యసిద్ధి చేకూర్చగలదు అని పల్కిన ప్రభవిష్ణుడగు విష్ణుని ప్రియహిత వచనములు సురలు వినిరి.

అపుడు దేవతలు మందారాదితరువులచే నందమైన మేరుగిరి జేరిరి. వారేకాంతమున దేవిని గూర్చి జపతపో ధ్యానములు చేసిరి. వారు భక్తుల కోరిక లీడేర్చునట్టి సంసార దుఃఖములు బోగొట్టునట్టి జగములేలేతల్లిని - సృష్టిస్థితి సంహార కారిణి నీ విధముగ గొప్పగ ప్రస్తుతించిరి: 

తల్లీ! దేవదేవీ! మేము సమరమున వృత్రునిచేత పీడితులమై సంతప్తులమైతిమి. నీ పదపద్మములపై మా తలలు వంచి శరణువేడుచున్నాము. సర్వవిశ్వజననీ! అమ్మా! ఈ ముల్లోకములందు నీకు తెలియనిది లేదుగదా! దానవపీడితులమగు మమ్మేల యుపేక్షింతువు? మేము నీ కన్నబిడ్డలము. భీకర శత్రువులబారి పడిన వారము. మమ్ము గాపాడగదవే. తల్లీ! ఈ జగములన్నియు నీ వలననే నిల్చియున్నవి. నీవు వేల్పులతల్లివి. హరి హర బ్రహ్మలు వలననే జన్మించి నీ కనుసన్న మాత్రన సర్వ కార్యముల నెరవేర్చి విహరింతురు. వారికి స్వేచ్ఛా స్వాతంత్య్రము లెంత మాత్రమును లేవు. ఒకవేళ పుత్రులేవైన అపరాధములచేసి దీనులై తిరస్కృతులైనచో వారిని తల్లి దయతో గాపాడునుగదా! వారితప్పు మన్నించునుగదా! 

దయారసమయీ! మేము నీ దివ్య పదారవిందములను శరణుపొందిన వారము. నిరపరాధులము. మమ్మేలదయతో నేలవమ్మా! అమ్మా! భవానీ! వీరొకప్పుడు నా పదములు గొలిచి పదములు పడసి సుఖభోగములంది నేడు నా భక్తి మానిరి. వీరినిపుడు నేనెట్లు కటాక్షింతునని మమ్ము గూర్చి దలంతువేని వినుము. అమ్మా! దయామతల్లియగు ఏ తల్లికైన నిట్టి భావము మదిగల్గదు సుమా! జననీ! శుభకామినీ! మేము నిన్ను భజింపక సంవదలం దనురక్తుల మగుటలో మా దోషమేమియును లేదు. ఏలన, నీవు మాయామోహమును రచించి మమ్ము మోహితులనుగ జేసితివి. స్వాభావిక కరుణారూపవగు నీవు దయతో మమ్మాదుకొనవేల? 

తల్లీ! తొల్లి నీవు బలశాలి - దైత్యపతియగు మహిషుని మాకు శ్రేయముగూర్ప నంతమొందించితివి. ఇపుడీ సకలలోక కంటకుడగు వృత్రునేల వధింపవు? దయామయీ! తొల్లి నీవు శుంభనిశుంభులను సోదరులను వారి యనుచరులను చంపివేసితివే. అట్లే మత్తుడు దుష్టుడు దుర్బలుడు నగు వృత్రుని మోహితునిజేసి చంపుము. శుభకారిణీ! జననీ! మేము దానవులచేత బాధింపబడితిమి. వికలాత్ములమైతిమి. మమ్ము బ్రోవగదవే! విబుధుల యార్తిపాపి వారి కడగండ్లనెల్ల బాపు శక్తిగలదానవు. దానవుల నెదిరించు ధీరశక్తివి నీవు; నిన్నెవడు నెదిరి నిల్వలేడు. 

ఓయమ్మా! ఒకవేళ వృత్రునిమీద నీకు కనికరమున్నచో జగములెల్ల పీడించునతడు నరకములో గూలకముందే నీ పవిత్రశరములతో వానిని చంపి యుద్ధరించుట మంచిది. నీ దివ్యబాణముల తాకిడికి పవిత్రులై చచ్చిన దనుజులు సురవనములందు విహరింతురుగదా! వృత్రుడు నీ శత్రువే. ఐన నతనిని నరకమున త్రోయక కాపాడవలసియుండ చంపవేల? జగన్మాతా! మాకు నీ శుభచరణములు శరణము. వృత్రుడు నిన్ను గొల్వక మమ్ము బీడించువాడు. అట్టి పాపమతి నీకు దాసుడుగాడు, వైరియేయగునని మేముదలంతుము.

తల్లీ! విశ్వజననీ! ఇకమేము నీ పాదపూజమాత్రమెట్లు చేయగలము? ఏలన నీ పూలు ఈ మంత్రములు ఈ మేమందఱము నీ పరిణామమే కదా! నీ పరాశక్తి చైతన్యములోని భిన్నరూపములమే కదా! 

కావున మేము నీ దివ్య పదరాజీవములకు తలలొగ్గి నమస్కారములు మాత్రము చేతుము. ముముక్షువులు మోహరాగవికారములు లేనివారు. పరమయోగులు. వారు తమ చిత్తములందు నిరంతరముగ భవసాగర నౌకవంటి నీ పదనళిన యుగమును పరమభక్తితో సేవింతురు. వారు నీ సుప్రసన్నతతో ధన్యజీవులు వేదవిదులగు యాజ్ఞికులు యాగములందు దేవతలను పితృదేవతలను తృప్తిపఱచు స్వాహా స్వధారూపిణివగు నిన్నే స్మరింతురుగదా తల్లీ! 

నీవు కాంతివి. శాంతివి. మేధవు. ప్రజ్ఞవు. నరులలోని సుబుద్ధివి. శ్రద్ధవు. సర్వము నీవే. ఈ భువనములందు నిన్ను గొల్చువారికి దయతో వైభవము లొసగుతల్లివి నీవే. అని యీ విధముగ విబుధులు ప్రస్తుతింపగా శ్రీదేవి యిట్లు ప్రత్యక్షమయ్యెను: 

శ్రీదేవి పంచదశాత్మైక స్వరూపిణి. దివ్యభూషితరంజిత. పాశ-అంకుశ-వర-అభయములతో నొప్పుకరాంబుజయుత. కింకిణీరశనల నలరు శృంగానర మధ్యమ. కలకంఠకంఠరవ- కనకాంగదకేయూరభకూషిత. చంద్రరేఖ వెలుగొందు రత్నమకుటముచే విరాజిత. చిర్నగవు వెన్నెలలు కురియు తల్లి. విరిసిన తమ్ములవంటి మూడు కన్నులు కలది. పారిజాత కుసుమ స్వచ్ఛనాళ సమానకాంతి. రక్తవసన-రక్త చందన చర్చిత. అవ్యాజకరుణాపూర్ణ - ప్రసాదసుముః సకల శృంగార రసాధిదేవత - అనంతకోటి బ్రహ్మాండ జనని. సర్వజ్ఞ. సర్వకర్త్రి - సర్వాధిష్ఠానదేవత - సర్వవేదాంత ప్రతిసాద్య - సచ్చిదానంద స్వరూపిణి యగు త్రిభువనేశ్వరీదేవి దేవతల ముందు ప్రత్యక్షమయ్యెను. 

దేవతలు శ్రీదేవిని సందర్శించి యామెకు దోసిలొగ్గిరి. అంత దేవి 'మీరు నన్నేల ప్రస్తుతించుచున్నారు? తెలుపడ'నెను. 

దేవతలిట్లనిరి : వృత్రుడు సురలను బాధించుచున్నాడు. అతనిని మోహపఱచుము. అతడు చచ్చునట్లుగ నీవు మా యాయుధములందు నీ దివ్యశక్తినుంచుము.' అంత శ్రీభగవతి యట్లే యని యచ్చోట నదృశ్యురాలయ్యెను. దేవతలు హర్షముతో తమతమ నెలవుల కరిగిరి.

అధ్యాయము 127 శ్రీదేవి వృత్రుని సంహరించుట

No comments:

Post a Comment

Chapter 137 History of the Haihayus - అధ్యాయము 137 హైహయుల చరిత్ర

శ్రీ దేవీ భాగవతం  షష్ఠ స్కంధము  - అధ్యాయము 137 హైహయుల చరిత్ర జనమేజయు డిట్లనెను : వ్యాసమునీంద్రా ! హైహయులను క్షత్రియులు బ్రహ్మహత్యాపాపమునకు ...