Monday, April 20, 2026

Rajyadanam - రాజ్యదానం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - రాజ్యదానం

కాని మునికి విరుద్ధముగ మాటాడలేదు. పిదప ముని త్రోవ జూపగ రాజు తన నగర మేగెను. విశ్వామిత్రుడును రాజును వంచించి తన యాశ్రమ మేగును. వివాహ విధి జరిపిన పిమ్మట 

విశ్వామిత్రుడు రాజుతో నిట్లనెను : ఓ రాజా! ఈ యజ్ఞవేదికపై నేను కోరిన దానమిమ్ము. 

రాజిట్లనెను: ఓ బ్రాహ్మణోత్తమా! నీ కోరిక యేమి తెల్పుము. తప్పక తీర్తును. నేను కీర్తికాముడను. ఈ ప్రపంచమం దసాధ్యమైనదైన తప్పక యీయగలను. ఎంత ధనమున్నను కీర్తిలేనిచో వ్యర్థమే గదా! కనుక పరలోకసుఖము గల్గించు యశము సంపాదింపనిచో వ్యర్థమే.

విశ్వామిత్రు డిట్లనెను : ఓ మహారాజా! మీ సర్వస్వమును నీ రాజ్యమంతయును దానమిమ్ము. ఈ పవిత్రవేదిక సమీపమున గజాశ్వరథరత్నములన్నియు దానమిమ్ము. అను ముని వాక్కులకు రాజు మాయామోహితుడయ్యెను. రాజు ముందువెనుక లాలోచింపకయే స్వేచ్ఛగ దానమిచ్చితి ననెను. 

విశ్వామిత్రుడు పుచ్చుకొంటిననుచు నిష్ఠురముగ నిట్లు పలికెను. రాజేంద్రా! మహామనీషీ! దానమునకు యోగ్యమగు దక్షిణనిమ్ము. దక్షిణలేని దానము వ్యర్థమైనదని మనువు పలికెను. కనుక నీవు దానమునకు తగినంత దక్షిణ నిమ్ము. అను ముని వాక్కులకు విస్మయమంది 

రాజు ముని కిట్లనెను: స్వామీ! సాధూ! ఇపుడు నన్ను దక్షిణ నీయగలను. నిశ్చితంగ నుండుము. అది విని 

ముని రాజున కిట్లనెను: ఇప్పుడు నాకు రెండున్నర బరువుల బంగార మిమ్ము. అనగనే రాజు విస్మయమంది యిచ్చితినని మునికి మాట యిచ్చెను. అదే సమయమున సైనికులు రాజును వెదుకుచు వచ్చి చూచి సంతోషించిరి. వారు చింతాతురుడగు రాజునుగాంచి పొగడిరి. 

వారి మాటలు విని రాజు మంచిచెడ్డ లేమియు బలుకక తన చేసిన పనికి చింతించుచు తన యంతిపురము జేరెను. నేనెంత పని చేసితిని! నా సర్వస్వమును దానము చేసితిని. ముని దొంగవానివలె నన్ను వంచించెను. మునికి నా సకల రాజ్యమును రెండున్నర బరువుల బంగారమును దాన మిచ్చెదనని ప్రతిన బూనితిని. 

నా మతి చలించినది. ముని కపటనాటక మెఱుగనైతిని. తబిసి-బాపడు-నగు మునిచే మోసపోతిని. ఇపుడేమి చేతును. దైవయాగ మెఱుగలేకపోతిని. హా! దైవమా! ఇంకేమి జరుగునో! అని విచారించుచు వికలచిత్తముతో రాజు తన యింటి కేగెను.

తన పతి చింతాపరుడగుటగని రాణి కారణ మడిగెను. ఏమి ఫ్రభూ! విచారముగ నున్నారేం? దిగులేల? నా కిపుడు తెలుపుము. ఆ నాడు వరుణుని వలన భయముచే వనములకేగిన మన కుమారుడు వనమునుండి తిరిగి వచ్చెను. మీరు రాజసూయ మొనరించితిరి గదా! 

రాజేంద్రా! ఇక శోకకారణ మేమి? వంతయేలోకో తెల్పుము. నీకు బలశీలిగాని దుర్బలుడు గాని యగు శత్రువులేడు. వరుణుడును నీయెడ ప్రసన్నుడయ్యెను. నీవీ భూతలమున ధన్యభాగుడవు. ఇక దిగులువదలుము. 

నరవరా! చింతచే శరీరము క్షీణించును. చింత చావువంటిది. కనుక చింత వదలుము. వివేకముతో నిశ్చింతగ నుండుము. అను తన ప్రియురాలి మాటలువిని రాజు తన చింతయొక్క మంచిచెడుల కారణము తెలిపెను. రాజు చింతాపరవశుడగుట వలన నతనికి భోజనము రుచించుటలేదు.

మెత్తని సెజ్జపై పరుండినను కంటినిండ నిద్దుర పట్టుట లేదు. మరునాడు వేకువనే రాజు లేచి సంధ్యావందనాదులు నిర్విర్తించుకొనుచున్నంతలో నచటికి విశ్వామిత్రుడేతెంచెను. సర్వము హరించిన మునితన రాక రాజునకు తెలిపెను. రాజు వచ్చి మాటిమాటికి మునికి మ్రొక్కెను. 

అపుడు ముని రాజున కిట్లనెను: రాజా! నీ రాజ్యము వదలుము. నీవు మాట యిచ్చినది నాకిమ్ము. రాజేంద్రా! బంగారము నొసంగుము. సత్యశీలివిగమ్ము. 

హరిశ్చంద్రు డిట్లనెను : విశ్వామిత్ర మునీ! స్వామి! నా రాజ్యమంతయును నీకు దానము చేసితిని గదా! దిగులొందకుము. ఇది వదలి మఱొకచోటి కేగుదును. బ్రాహ్మణుడా! విభూ! నా సర్వస్వమును నీవు గ్రహించితివి. ఇపుడు నేను బంగారమును దక్షిణగ నిచ్చు కశక్తుడను. నాకు దైవయోగమున ధనము లభించినచో నీకు తప్పక దక్షిణ చెల్లింపగలను.

మరియు రాజు మాధవి యను తన భార్యతో తన కొడుకుతో నిట్లనెను. నేనీ మునికి యజ్ఞవేదిక యందు నా రాజ్యము దానము చేసితిని. నా రథ-గజ-తురగములు-బంగారము-రత్నములు సర్వమును సమర్పించితిని. కాని మన మూడు శరీరము లతని కీయలేదు. 

కనుక మన మిపుడీ యయోధ్యవదలి యడవు లందలి గుహలకు వెళ్ళుదుము. ముని సకల సమృద్ధమగు రాజ్యమును గ్రహించుగాక. అని హరిశ్చంద్రుడు తన భార్యాపుత్రులతో బలికి తన భవనము వదిలి ధర్మబుద్ధితో మునిని గౌరవించుచు బయలువెడలెను. అట్లు రాజు వెడలుటగని యతని భార్యాపుత్రులును చింతాతురులై దీన ముఖములతో రాజు వెంట నడచిరి. 

వారట్లు వెడలుట గనిన పౌరులు హాహాకారములు చేసిరి. సాకేతపురవాసు లందఱును గొల్లున విలపించిరి. ఓ రాజా! ఎంత పని జరిగినది! నీకెక్కడి యాపద దాపురించెను! మంచిచెడు లెఱుగని దైవమే నిన్ను వంచించినది గదా! ఇట్లు రాజును నతని భార్యను మహాశయుడగు రాజపుత్రుని చూచిన యన్ని జాతులవారు కడు దుఃఖించిరి. 

పురములోని బ్రాహ్మణులు మున్నగువారు దుఃఖార్తులై ముని దురాచారుడు మోసగాడు అని నిందించిరి. నగరు వెడలి వెళ్ళుచున్న రాజును వెంబడించి 

విశ్వామిత్రు డతనిష్ఠురముగ నిట్లనెను: ఓయి నరపతీ! నాకు దక్షిణక్రింద బంగారమిచ్చి కదలుము. లేదా నాకు చేతకాదని యనుము. నిన్ను వదిలిపెట్టుదును. నీ గుండెలో లోభమున్నచో నీ రాజ్యము తిలిగి నీవే తీసికొనుము. నిజముగ నిచ్చితినని తలంచినచో నీ మాట నిలువబెట్టుకొనుము. 

ఇట్లు విశ్వామిత్రుడు పలుకుచుండగ హరిశ్చంద్రుడు కడు దీనముగ జోడించి నమస్కరించి ముని కిట్లనెను.

హరిశ్చంద్రు డిట్లనెను: ఓ మునివర్యా! నీకు దక్షిణ చెల్లించక భోజనము చేయను. ఇది నా ప్రతిన. ఇక విచారము మానుము. నేను సూర్యవంశజుడను-క్షత్రియుడను-రాజసూయయాగ మొనరించినవాడను. ఎల్లకోర్కెలు దీర్చువాడను. 

ఓ స్వామీ! ఓ ద్విజవరా! నేను మనఃపూర్తిగ దాన మిచ్చితిని. ఇక దక్షిణ యీయ కెట్లుందును? నీ ఋణము తప్పక తీర్చగలను. నీ యష్టానుసారమే బంగార మీయగలను. నాకు ధనము చేతికి వచ్చునంతవఱ కోపిక పట్టుము. దిగు లొందకుము. 

విశ్వామిత్రు డిట్లనెను: ఓ రాజా! నీ రాజ్యము-నీ కోశము- నీ బలము-సర్వము - నిన్ను వదిలిపోయెనే! ఇక నీకు ధన మెక్కడినుండి వచ్చును? రాజా! ధనమును గూర్చిన రిత్తయాస లేల? నీ విపుడు లేనివాడవైతివి. ఇపుడు నేను మాత్రమేమి చేయగలను? నేను మాత్రము నిన్నింతగ లోభముతో నేల పీడింతును? 

కనుక రాజా! నే నిపుడీయలేనని యొక్క మాట చెప్పుము. నా కొండొంతయాస వదలుకొని స్వేచ్ఛగ వెళ్ళుదును. ఇపుడు నా యెద్ద ధనము లేదు. ఇక మీ కేమి యీయగలనను నొక్కమాట పల్కి నీ భార్యాపుత్రులతో స్వేచ్ఛగ నరుగుము. రాజు వెళ్ళిపోవుచు మునినుండి మరల ఈ మాటలు విని 

ముని కిట్లనెను: ఓ బ్రాహ్మణోత్తమా! ధైర్యము పూనుము. తప్పకిత్తును. నా దేహము-భార్యా దేహము-కొడుకు దేహము- ఇవి యే రోగములు లేకున్నవి. వీని నమ్మి నీ ఋణము దీర్చుకొందును. ఓ విప్రవరా! ఈ పవిత్ర కాశీపురిలో మమ్ము కొను వాని నెవనినైన చూడుము. అతనికి నేను నా భార్యాపుత్రులతో నమ్ముడుపోదును. మమ్మెవరికైన నమ్మి నీ రెండున్నర బరువుల బంగారము తీసికొమ్ము. మా యెడల ప్రసన్నుడవు గమ్ము.

ఇట్లు పలికి అన్నపూర్ణతో విశ్వేశ్వరుడు వసించు కాశికి రాజు తన భార్యపుత్రులతో నేగెను. ఆ రమ్యమైన మనసున కింపైన కాశీనగరమును గని నే నీ కాశిని దర్శించి-ధన్యభాగుడనైతినని రాజు తలంచెను. అటు పిమ్మట హరిశ్ఛంద్రు పావనగంగలో మునిగి పితృదేవతలకు తర్పణమిడి దేవతార్చన చేసికొని నలువైపుల కలయజూచెను. 

రాజు దివ్యకాశీపట్టణముజేరి దీనిని శూలపాణియగు విశ్వేశ్వరుడే పాలించగలడు గాని నరమాత్రుడు పాలించలేడు. అని తలంచి దుఃఖార్తితో తన భార్యాపుత్రులతో కాలి నడకను కాశీపురి ప్రవేశించి యందు నివసింపదలంచెను. ఇంతలో దక్షిణకోరు మునివరుడు తన వెంటవచ్చుట గనెను. 

హరిశ్చంద్రుడు మహామునికి దోసిలోగ్గి యిట్లనెను: ఇవిగో ఇవి నా ప్రాణములు. ఈమె నా భార్య. ఇతడు నా కొడుకు. ఓ ద్విజవర్యా! మాలో నెవరివలన నీ పని నెఱవేరునో వారిని తీసికొనుము. కాదేని మమ్మేమి చేయుమందువో చెప్పుము. 

విశ్వామిత్రు డిట్లనెను: రాజా! నీవు పెట్టిన నెలగడువు నిండినది. అపుడు నా కిచ్చిన మాట జ్ఞాపకమున్నచో ఇపుడు నాకు దక్షిణ యిమ్ము. 

రాజిట్లనెను: జ్ఞానతపోబలా! నెల పూర్తి కాలేదు. ఇంకను సగము దినము మిగిలియున్నది. అదియు పూర్తియగువఱ కెదురుచూడుము. అటు తరువాకాదు.

విశ్వామిత్రు డిట్లనెను: రాజా! సరే! అట్లే కానిమ్ము. మఱల వత్తును. ఈసారి ఈయకున్నచో శాప మీయగలను. అని ముని వెళ్లగనే రాజిట్లు చింతింపసాగెను. ఇతనికి నేనెట్లు దక్షిణ చెల్లింపగలను. దక్షిణ యిత్తునని మాట యిచ్చి యుంటినే! కాశీపురిలో ధనము బొందుటకు నాకు నెచ్చెలికాండ్రెవరును లేరే! నే నొకనిని యాచింపరాదే! ఒకనిముందెట్లు చేయి చాపగలను? 

రాజులకు ధర్మశాస్త్రాముసారముగ యజనము-అధ్యయనము-దానము-అను మూడు ముఖ్య కర్తవ్యములు. ఇతనికి దక్షణ యీయక నేను ప్రాణములు వదలినచో నమగును? అపుడు నేను వచ్చు జన్మములో బ్రహ్మ హంత-కీటకము-పాపి-అధమాధముడను గాగలను. అవి కానిచో పిశాచము నగుదును-వీటన్నిటికంటె నేనెవనికైన అమ్ముడుపోవుట మంచిది. 

భార్యావిక్రయం

శ్రీ దేవీ భాగవతం ప్రథమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము

శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment

Wife-selling - భార్యావిక్రయం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - భార్యావిక్రయం అని రాజు తల నేలకు వేసికొని చింతాతరుడై యుంటగని యతని భార్య కన్నీరుగార్చుచు డగ్గుత్తికతో నిట్టుల...