నారదా! విద్యావిశారదా! చాలా సమంజసమైన ప్రశ్నలు వేశావు. చెబుతాను. ఏకాగ్రచిత్తంతో ఆలకించు. పాడ్యమినాడు ఆజ్యంతో దేవిని అర్చించి బ్రాహ్మణులకు నెయ్యి దానంచేస్తే దాతకు రోగపీడలు తొలగిపోతాయి. విదియ రోజున చక్కరతో పూజించాలి. విప్రులకు శర్కర దానం చెయ్యాలి. దాత దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. తదియనాడు పాలతో అభిషేకించి బ్రాహ్మణులకు క్షీరదానం చేస్తే దాతలకు సర్వదుఃఖాలూ తొలగిపోతాయి. చవితినాడు పిండివంటలతో దేవిని ఉపాసించి ద్విజులకు వాటిని దానం చేస్తే దాతల కార్యక్రమాలు నిర్విఘ్నంగా జయప్రదమవుతాయి. పంచమిరోజున అరటిపండ్లు నివేదించి అవే విద్వాంసులకు దానం చెయ్యాలి. దాతకు మేదావికసనం కలుగుతుంది. షష్ఠి తిథినాడు తేనెను అమ్మవారికి నివేదన చేసి వేదవిదులకు దానం చేస్తే దాత అంతటి కాంతిమంతుడు అవుతాడు. సప్తమినాడు బెల్లం నైవేద్యం పెట్టి బ్రాహ్మణులకు దానం చేస్తే దాత శోకవిముక్తుడవుతాడు. అష్టమినాడు కొబ్బరికాయలు కొట్టి నివేదించాలి. బ్రాహ్మణులకు దానం చెయ్యాలి. దాతలకు తాపాలు నశిస్తాయి. నవమినాడు పేలాలు నైవేద్యం పెట్టి విప్రులకు ఇస్తే దాతలు ఇహంలోనూ పరంలోనూ సుఖసంపన్నులవుతారు. దశమినాడు నల్లటి నువ్వులను జగదంబికకు నివేదన చేసి బ్రాహ్మణులకు దానం ఇస్తే దాతలకు ఇక యమలోకభయమే ఉండదు. ఏకాదశినాడు పెరుగు నివేదించి దానంచేస్తే అతడు అమ్మవారికి అత్యంతాప్తుడు అవుతాడు. ద్వాదశినాడు అటుకులు నివేదించి వాటిని బ్రాహ్మణులకు సమర్పించినవారుకూడా దేవికి ప్రేమపాత్రులు అవుతారు. త్రయోదశి రోజున సెనగపప్పు నివేదనచేసి దానంగా ఇచ్చినవారికి దుష్టగ్రహపీడలు తొలగిపోతాయి. చతుర్దశినాడు పెరుగులో పేలపిండి కలిపి నివేదన దానాలు చేసినవారు శివుడికి ఆప్తులు అవుతారు. పున్నమినాడు పాయసం వండి అమ్మవారికి నైవేద్యం పెట్టి బ్రాహ్మణులకు సమర్చించినవారు తమ పితృదేవతలను ఉద్ధరించినవారు అవుతారు. అదేరోజున దేవీప్రీతికోసం హవనం చెయ్యాలి.
నారదా! వారాలకుకూడా కొన్ని విశేషాలున్నాయి. ఆదివారంనాడు పాయసం, సోమవారంనాడు. పాలు, మంగళవారంనాడు అరటిపండ్లు, బుధవారంనాడు వెన్న, గురువారంనాడు కలకండ, శుక్రవారం నాడు చక్కెర, శనివారంనాడు ఆవునెయ్యి అమ్మవారికి నివేదనచేస్తే విశేషంగా ఫలప్రదాలు అవుతాయి, అరిష్టాలు తొలగిపోతాయి. ఇరవైయేడు నక్షత్రాలకు కూడా ఇలాగే విశేషార్చనలున్నాయి. పాలు, పెరుగు, చక్కెర, పటికబెల్లం, నెయ్యి, నూలు మొదలైనవి ఆయా నక్షత్రాలలో అమ్మవారికి నివేదనచేసి విప్రులకు దానం చెయ్యాలి. విష్కంభాదియోగాలకూ ఇలాగే బెల్లం నెయ్యి తేనె పాలు పెరుగు చల్లబూరెలు ఉండ్రాళ్ళు కజ్జికాయలు వెన్న దోస గుమ్మడి పనస అరటి నేరేడు మామిడి నారింజ దానిమ్మ రేగు ఉసిరిక కొబ్బరి సెనగలు అటుకులు పాయసం - ఇత్యాదులు నివేదన చెయ్యాలి. లడ్డూలు ఉండ్రాళ్ళు నెయ్యి మొదలైనవి కరణాలలో యోగాలలో నైవేద్యం పెట్టాలి.
మదూకపూజ అని మరొక విధానం ఉంది. చైత్రశుద్డ తృతీయ మొదలుకొని అన్ని నెలల్లోనూ తదియనాడు శుచిగా మధూకవృక్షం క్రింద (ఇప్పచెట్టు) మహాదేవికి పోడశోపచారపూజలు ఆచరించాలి. తృతీయనాడు పంచఖాద్యాలు నివేదన చెయ్యాలి. వైశాఖశుద్దతృతీయనాడు గుడయుక్తంగా నైవేద్యం పెట్టాలి. తరవాత నెలల్లో వరసగా తేనె. వెన్న, పెరుగు, చక్కెర, పాయసం, పాలు, ఫేణి, దధికుర్చిక, ఆవునెయ్యి, కొబ్బరికాయలతో కూడిన నివేదనలు పెట్టాలి. పన్నెండు నెలలకూ అమ్మవారికి పన్నెండు విశిష్టరూపాలూ నామాలూ ఉన్నాయి. మంగళ - వైష్ణవి - మాయ - కాళరాత్రి - దురత్యయ - మహామాయ - మాతంగి - కాళి - కమలవాసిని - శివ - సహస్రచరణ - సర్వమంగళ ఆనే పేర్లతో మధూకవృక్షం క్రింద అర్చించాలి. ఇలా చేసినవారికి అన్నికోరికలూ తీరుతాయి. అమ్మవారు భక్తుల పాలిటి కల్పవృక్షంకదా ! ఇలా అర్చించి మొక్కినవారికి కొంగుబంగారం అవుతుంది.
అటుపైని మధూకస్థమైన మహేశ్వరిని నర్వకామసమృద్ధికోసం వ్రతపూర్ణత్వ సిద్దికోసం భక్తి ప్రపత్తులతో నమస్కరించి ఇలా స్తుతించాలి.
ఓ పరమా! పాపహంత్రీ ! పరమార్గప్రదాయినీ ! పరమేశ్వరీ ! ప్రజోత్పత్తీ ! పరబ్రహ్మ స్వరూపిణీ! మదదాత్రీ ! మదోన్మత్తా ! మానగమ్యా ! మహోన్నతా ! మనస్వినీ ! మునిధ్యేయా ! మార్తాండసహచారిణీ! లోకేశ్వరీ ! ప్రాజ్ఞా ! ప్రళయాంబుద సన్నిభా ! జగన్మాతా ! మహామోహవినాశం కోరి నిన్ను సురాసురులు అర్చిస్తున్నారు. నువ్వు యమలోకాభావకారిణివి. యమపూజ్యవు. యమాగ్రజవు. యమనిగ్రహరూపవు యజనీయవు. జగజ్జననీ ! నమోనమః
ఓ సమస్వభావా ! సర్వేశీ ! సర్వసంగవివర్జితా ! సంగనాశకరీ ! కామ్యరూపా ! కారుణ్యవిగ్రహ కంకాళక్రూరా! కామాక్షీ ! మీనాక్షీ ! మర్మభేదినీ ! మాధుర్యరూపశీలా ! మధురస్వరపూజితా మహామంత్రవతీ ! మంత్రగమ్యా ! మంత్రప్రియంకరీ ! మనుష్యమానసగమా ! మన్మథారిప్రియంకరీ! అశ్వత్థ వట నింబామ్రకపిత్థబదరీ గతా ! పనసార్కకరీరాది క్షీరవృక్ష స్వరూపిణీ ! దుగ్ధవల్లీనివాసార్హా ! దయనీయా ! దయాధికా ! దాక్షిణ్యకరుణారూపా ! సర్వజ్ఞ వల్లభా ! నమోనమః.
ఇలా స్తుతించిన వారికి వ్రతసాఫల్యం వెంటనే సిద్దిస్తుంది. ఈ స్తోత్రాన్ని నిరంతరం పఠించినవారికి ఆధివ్యాధి శత్రుభయాలు ఉండవు. చతుర్విధపురుషార్ధాలలోనూ ఏది కోరినవారికి అది సిద్దిస్తుంది. చతుర్వర్గాలవారికీ అనుకూలమైన స్తోత్రమిది.
ఇలా అర్చించి స్తుతించినవారు సర్వపాపవిముక్తులవుతారు. మానధనులవుతారు. సర్వత్రా మన్ననలు పొందుతారు. కలలోకూడా యమలోకభయం ఉండదు. మహామాయాప్రసాదంవల్ల పుత్రపౌత్రాదికంగా వృద్ధి చెందుతారు. నారదా ! ఇదంతా నరకోద్దారలక్షణమైన దేవిపూజా విధానం. సర్వమంగళకారకం. మధూకపూజ చేసినవారికి రోగబాధలు ఉండవు. నరకయాతనలు ఉండవు.
అమ్మవారి అనుగ్రహంవల్ల ఇహపరాలలో సకలసుఖాలూ అనుభవించి ముక్తి పొందుతారు. బ్రహ్మనందనా! ప్రకృతిస్వరూపిణిగా అమ్మవారికి ఆయిదు రూపాలున్నాయి. నామ రూప ఉత్పత్తులలో అవి జగదానందదాయకాలు. వాటి మాహాత్మ్యాలనూ వాటి ఆర్బావిధానాలనూ వివరిస్తాను తెలుసుకో. ముక్తిప్రదమే కాదు చాలా కుతూహలంగానూ ఉంటుంది - అంటూ నారాయణమహర్షి రవ్వంత విశ్రాంతి తీసుకున్నాడు.
No comments:
Post a Comment