Thursday, April 16, 2026

Chapter 132 The greatness of Sridevi's name - అధ్యాయము 132 శ్రీదేవీ నామ మాహాత్మ్యము

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము - అధ్యాయము 132

శ్రీదేవీ నామ మాహాత్మ్యము

జనమేజయు డిట్లనెను : ''ఓ ద్విజపరా ! ఈ భూమి భార మణచుటకు శ్రీరామకృష్ణాదు లవతరించి రంటివి. దానిని గూర్చి నా యెడదలో నొక శంక గల్గుచున్నది. భూదేవి ద్వాపరాంతమున భూభరణము సాధ్యముకాక దీనయు నార్తయునై గోరూపమున బ్రహ్మను శరణు పొందెను. అంత బ్రహ్మ కమలాపతియగు విష్ణునిజేరి 

దేవా ! ఈ పుడమి బరువు తగ్గింపుము. సాధువులను పరిరక్షింపుము. ఈ భారతకండమునం దెల్ల దేవతలతో గలిసి వసుదేవు నింట సత్వర మవతరింపుమని ప్రార్థించెను. ఇట్లు బ్రహ్మ సన్నుతింపగ విష్ణువు భూభారము బాపుటకు బలరామునితో దేవకియం దవతరించెను. అపుడు శ్రీ కృష్ణుడు దురాచారులు దుష్టులు పాపులునగు నరపతుల నెందఱనో తునుమాడి కొంత భూభారము తగ్గించెను. 

ఈ చనినవారిలో భీష్ముడు ద్రోణుడు కర్ణుడు ద్రుపదుడు విరాటుడు బాహ్లిక సోమదత్తులు నుండిరి. పెక్కురు దుష్టులు విష్ణు భార్యల నపహరించి వారి సొమ్ములు దోచుకొనిరి. కాని, యీ పాపాత్ములు చంపబడలేదు. ఇంకను పెక్కురు గొల్లలు శకులు వ్లచ్ఛులు నిషాదులు మిగిలిరి. విజ్ఞుడగు కృష్ణుడు వారిని చంపక వదలెను. అందువలన భూభారము పూర్తిగా నెట్లు తగ్గిపోయెను? 

ఈ కలియుగమందలి ప్రాణులు పాపమతులు. కనుక భూభార హరణము గూర్చి నాకు సందేహము గల్గుచున్నది.'' అన 

వ్యాసు డిట్లనెను : ''రాజా! ఏ యుగమందలి ప్రజల స్వభావము లా యుగమునకు సంబంధించి యుండును. దీని కంతటికి యుగధర్మము ముఖ్యకారణము. దీనికి భిన్నముగ నేనాడును జరుగదు. ఎల్లరిని చంపినచో సృష్టి ప్రవాహ మాగిపోవును. అందువలన నతడు తక్కిన వారిని చంపక వదలెను. సత్యయుగమున నెల్లరు ధర్మనిరతులు (ధర్మమందే ఆసక్తి కలవారు) ఉండిరి. త్రేతాయుగమందు ధర్మార్థనిరతు లుండిరి. ద్వాపరమున ధర్మార్థకామనిరతు లుండిరి. కలియుగమునందు కామార్థపరులు సంభవింతురు. యుగధర్మ మేనాటికిని మారదు. ధర్మాధర్మములకు కాలమే కర్త యగును. అన 

జనమేజయుడిట్లనెను : 'మహానుభావా! సత్యయుగమునందు ధర్మపరులు పుణ్యనిరతు లుండిరి గదా! వారిప్పు డెచ్చట నున్నారు? త్రేతాద్వాపర యుగము లందలి దానవ్రతపరు లిపు డెచట నున్నారు? నా కదంతయు దెలుపుము. ఈ కలియుగమందు దేవనిందకులు పాపులు దురాచారులు అసత్యవాదులు సిగ్గులేనివారు గలరు. వీరు సత్యయుగమున నేమగుదురు? 

మహాత్మా! ఈ ధర్మసందేహము లన్నియు వినవేడుక గలుగుచున్నది. నా కన్నియు ససాకల్యముగ నెఱింగింపుము.'' అని యడుగ 

వ్యాసుడిట్లనెను : రాజా! కృతయుగమునందు జన్మించినవారు పుణ్యకార్యము లాచరించి దేవలోకమున సుఖముందురు. బ్రహ్మ క్షత్రియ వైశ్యశూద్రులు స్వధర్మనిరతులై తమ తమ కర్మలకు దగిన లోకముల కేగుదురు. సత్య-దయా-దానములు ఏకపత్నీ వ్రతము సర్వభూతసమత గలిగియుండుట ద్రోహద్వేషములు లేకుండ మున్నగు సామాన్యధర్మము లాచరించిన రజకాదులును కృతయుగమున తమ తమ ధర్మములందు నిరతులై స్వర్గము జేరెడివారు. 

ఇటులే త్రేతా ద్వాపరములందలి వారును స్వధర్మపరులై స్వర్గసీమ లలంకరించిరి. కాని, కలియుగమందలి వారు పాపాత్ములై నరకయాతన లనుభవింతురు. వారు యుగము మార్పుజెందువఱకు నరకమున బాధలు పడిపడి తిరిగి మనుజులై పుట్టుదురు. కలియుగ మంతమై సత్యయుగము ప్రారంభమగునపుడు స్వర్గమందలి పుణ్యాత్ములు తిరిగి జన్మింపగలరు. ద్వాపరము చివరలో గలియుగారంభమున పాపులు నరకములనుండి లేచి నరులై జన్మింతురు.

కాలగతి యీ గతిగ నుండును. దీనికి భిన్నముగ నేనాడును జరుగదు. కలియుగము చెడుపనులు చేయించును. కలియుగ ప్రజలు కలి ప్రభావమున చెడుభావములు గల్గియుందురు. ఒకప్పుడు దైవయోగముచే వీరి జన్యములలో వ్యత్యాసములును గలుగును. కలిలోని సాధు సజ్జనులు కొందఱు ద్వాపరమున జన్మింతురు. 

మఱికొందఱు త్రేతాయుగమునను నింకను కొందఱు సత్యయుగమునను జన్మింతురు. సత్యయుగమందలి దుర్మార్గులు కలియుగమున బుట్టుదురు. ప్రాణులు తమ పూర్వ కర్మానుసారముగ సుఖదుఃఖము లనుభవింతురు. ఐనను వారు యుగప్రభావమున యుగధర్మము లాచరింతురు. 

అన మహాత్మా! నాకు యుగధర్మములన్నిటిని వివరింపుము. ఏ యుగమందెట్టి ధర్మము నడచునో యెఱుగగోరుచున్నాను. అను ప్రశ్నమునకు వ్యాసుడిట్లనెను : రాజా! యుగధర్మము వివరింతును. ఆలింపుము. ఎంతటి సత్పురుషుల చిత్తమైనను యుగధర్మానుసారముగ చలించుచుండును. నీ తండ్రి మహాత్ముడే. ధర్మాత్ముడే. ఐనను నతడు కలిప్రేరణమున నొక విప్రుని నవమానించెను. 

కలిప్రేరణలేనిచో యయాతివంశజుడు సుక్షత్రియుడునగు నొక రాజొక తబిసి మెడలో నేల చచ్చిన పామును వైచును? కనుక నంతటికి యుగబలము కారణమని పండితులు వాక్రుత్తురు కావున ధర్మకర్మములు జక్కగ పూనికతో నాచరింపవలయును. సత్యయుగమునందలి బ్రాహ్మణులు వేదపారగులు శ్రీదేవీదర్శన లాలసులు శ్రీపరాశక్తి పూజా తత్పరులు నిరంతర గాయత్త్రీజప నిరతులు శ్రీగాయత్త్రీధ్యాన పరాయణులు ప్రణవ నిమగ్నులు మాయా బీజ తప తత్పరులు. నయియుండిరి. 

ఆ యుగమున గ్రామ గ్రామమున శ్రీ మాతృ మందిర నిర్మాతలు-దేవిమహోత్సవౌత్సాహికులు - స్వధర్మనిరతులు - సత్యశౌచదయాన్వితులు వెలసిరి. క్షత్త్రియులు తత్వజ్ఞాన విశారదులు - వైదిక ధర్మానుష్ఠానపరులు-ప్రజాపాలన తత్పరులు నై యొప్పెసగిరి. వైశ్యులు వ్యవసాయము-వ్యాపారము-గోరక్షణము మున్నగు పనులు నిర్వర్తించిరి. శూద్రులు తక్కిన మూడు వర్ణములవారికి సేవలు సేయుచు నుండిరి.

సత్యయుగమున నెల్ల వర్ణములవారును పరాభట్టారికా పూజాతత్పరులై యుండిరి. త్రేతాయుగమున ధర్మస్థానము కొంత తగ్గెను. సత్యయుగధర్మములు ద్వాపరమున నింకను తగ్గెను. వెనుకటియుగాల రాక్షసులు కలియుగమున బ్రాహ్మణులైరి. వీరు పాషండ మతస్థులు మోసగాండ్రు వేదధర్మరహితులు కల్లలాడువారు దంభాచారులు అభిమానమత్తులు లోకజ్ఞానమున నేర్పరులు శూద్రసేవాపరులు నానాధర్మప్రవర్తకులు వేదనిందకులు క్రూరాత్ములు ధర్మకర్మభ్రష్టులు అతివాదులునై యుందురు. 

కలికాల మధికముగ పెరుగుచుండుకొలది సత్యమూలమగు ధర్మము నంత యధికముగ క్షీణించును. ఇక క్షత్రియ వైశ్య శూద్రులు ధర్మరహితులై వర్తింతురు. తక్కిన వర్ణములవారు పాపుల కల్లబొల్లి మాటలాడువారు నగుదురు. విప్రులు శూద్ర ధర్మమాచరించువారు దాన ప్రతిగ్రహీతలు నగుదురు. ఇట్లు కలికాలమున నధర్మము పెచ్చు పెరుగును. యువతులు కామలోభమోహములు ముప్పిరిగొన కామచారలై వర్తింతురు. 

వారు పాపిష్ఠురాండ్రు బూటకములాడువారు నిత్తెము వంతలగుందువారు తమ పతులను మోసగించువారు నయియు ధర్మపన్నాలు వల్లించువారగుచు పాపచిత్తలై వర్తింతురు. సాత్త్వికాహారమున చిత్తశుద్ధి గల్గును. చిత్తశుద్ధివలన ధర్మబుద్ధి గల్గును. వృత్తిసంకరమున ధర్మసంకరమును గల్గును. ధర్మసంకరమున వర్ణసంకరము గల్గును. ఇట్లు కలియుగము పుణ్యధర్మ శూన్యమగును.

కలిలో స్వధర్మవర్ణముల రక్షణ ప్రసక్తి లేకపోవును. ధర్మ మెఱింగిన మహాత్ములు నధర్మ మాచరింతురు. ఇదంతయును కలి స్వభావప్రభావమున గల్గును. దీనిని తొలగింప సాధ్యముగాదు. కలిమాయా ప్రభావమును బట్టి నరులు పాపకార్యము లొనర్తురు. ఇట్టి పాపములకు ప్రాయశ్చిత్త మేయుపాయమునను లేదు.'' అన 

జనమేజయు డిట్లనెను : 'మహాత్మా! నీవు సర్వధర్మజ్ఞుడవు. సర్వశాస్త్రవిదుడవు. ఇట్టి అనీతి అధర్మము గల కలియుగమున మనుజులకు సద్గతి ఎట్లు? దీని కేదే నుపాయ మున్నచో దయతో సెలవిమ్ము.'' అన 

వ్యాసుడిట్లనెను : 'రాజా! దీని కొకే యొక యుపాయము గలదు. అది కా కింకొకటి లేనేలేదు. సర్వకలిదోషములు నశించుటకు శ్రీదేవీ పాదపద్మములు భక్తిప్రేమములతో ధ్యానింపవలయును. ఈశ్వరీ దివ్యనామమున నెంతటి పాపరాసులైన దహించు మహత్తరశక్తి గలదు. ఆ శక్తిచే నశించని పాపము లీ లోకాలలో లేనేలేవు. ఎంతటి మహాపాపమైనను శ్రీదేవి మధురనామమున నాశము గాగలదు. ఇక భయమేల? 

ఎంతటి పాపియైనను స్వాధీనము తప్పికాని విలాసమునగాని శ్రీమాతృ దివ్యనామ మొక్కసారియేని నుచ్చరించినచో నతనికే మేమి సత్ఫలములు గలుగునో వానిని శివాదులు నెఱుగజాలరు. శ్రీదేవి మధురనామ సంస్మరణము సకల పాపములకు ప్రాయశ్చిత్తము. కలిభయముగలవారు పుణ్యతీర్థములందు నివసింపవలయును. 

వారు నిరంతరము శ్రీపరాంబానామ సంస్మృతి యొనరింపవలయును. ఒక డీ జగమందలి ప్రాణులను హింసించి చంపవచ్చును. కాని యతడు శ్రీదేవిని భక్తి శ్రద్ధలతో ప్రపత్తి జెందినచో వానిని పాపము లంటజాలవు. ఇది సకల శాస్త్రరహస్యము. దీనిని నీకు తెలిపితిని. ఇది అంతయును చక్కగ నెమ్మది నాలోచించుకొని శ్రీదేవీ దివ్యపాదకమలము లాశ్రయింపుము. 

ప్రాణు లెల్లరును సహజముగ నిత్యమా జపాగాయత్త్రిని జపించుచుందురు. కాని యా దేవి మహిమ నొక్కడు నెఱుగడు. దానికి కారణ మా దేవి మాయా ప్రభావమే. బ్రాహ్మణు లందఱును శ్రీగాయత్త్రీమాతను తమ హృదయసీమలందు జపింతురు. వాస్తవముగా గాయత్త్రీ మహిమ నెవరు నెఱుగరు. దీనికి కారణ మా దేవీమాయా ప్రభావ వైభవమే. 

రాజా ! ఇట్లు నీ వడిగిన ప్రశ్నల కన్నిటికిని సమాధానము లొసంగితిని. యుగధర్మ వ్యవస్థలు తెలిపితిని. ఇంకేమి వినగోరుదువో తెలుపుము.

అధ్యాయము 133 హరిశ్చంద్ర కథారంభము

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము

No comments:

Post a Comment

Kings of the Surya Dynasty - Sukanya Vritthanamu - సూర్య వంశ రాజులు - సుకన్యా వృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము -  సూర్య వంశ రాజులు - సుకన్యా వృత్తాంతము జనమేజయు డిట్లనెను : ఓ మహానుభావా ! సూర్యవంశమునందు బుట్టిన ధర్మజ్ఞులగ...