Thursday, April 16, 2026

Chapter 122 The penance of the Trisirasu - అధ్యాయము 122 త్రిశిరసుని తపశ్చరణము

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము - అధ్యాయము 122

త్రిశిరసుని తపశ్చరణము

ఋషు లిట్లనిరి : 'ఓ సూతమహామునీ! శ్రీవ్యాసముని నోట వెడలిన శ్రీదేవి దివ్యగుణామృతరస మెంతక్రోలినను మాకు తనివితీరుట లేదు. మేము పాపనాశకము-వేదవర్ణితము-సుమనోహరము-సుప్రసిద్ధమునగు శ్రీమద్దేవీ భాగవత పురాణము నింకను నీ వలన వినదలచుచున్నాము. 

తొల్లి విశ్వకర్మ కొడుకు వృత్రాసురు డుండెను. అతడు బలశాలి మహాత్ముడు నైన దేవేంద్రుని చేతిలో నెట్లు హతు డయ్యెను? విశ్వకర్మ దేవతల పక్షమువాడు. అతని కొడుకు విప్రకులజుడు. బలశాలి. అతడింద్రునిచేత నేల మడిసెను? 

సత్త్వగుణమువలన దేవతలు రజోగుణమున నరులు తమోగుణమున తిర్యగ్జంతువులును పుట్టినవని వేదపురాణవేత్తలు వక్కాణింతురు. ఇంద్రుడు శతక్రతువు. ఆతడు వృత్రుని సంహరించెను. ఇందువలన వారిర్వురికిని నేదో గొప్ప విరోధముండియుండునని తోచుచున్నది. విష్ణువు సత్త్వగుణము గలవాడు. అత డింద్రుని ప్రేరించి మోసముతో వజ్రాయుధములో దాగియుండెను. 

వృత్రుడు సంధి కొడంబడిన తఱి నింద్రవిష్ణులు సత్యధర్మము విడనాడి వృత్రుని నీటి నురుగుతో చంపిరి. వారిట్టి దుష్కార్య మేల చేసిరో! గొప్పవారు సైతము మోహవంచితులై పాపమతు లగుదురు. దేవతలు సైత మన్యాయమునకు పాల్పడుదురు. కాని సదాచార సంపన్నులైనవారు శిష్టులన వన్నె కెక్కుదురు. 

ధర్మాభ్యుదయము లేనిచో శిష్టత్వ మెట్లు గల్గును? ఇంద్రుడు వృత్రుని వంచించి చంపెను గదా! ఇంద్రునకు బ్రహ్మహత్యాపాపము చుట్టుకొనెనా లేదా? మున్ను నీవు వృత్రవధ తెల్పితివి. అది శ్రీదేవి వలన జరిగినదని యంటివి. కనుక దేవి దేవేంద్రుడు వీరిర్వురిలో వృత్రుని చంపిన వారెవరు? ఈ విషయము తెలియక మా మది సంశయమున మునుగుచున్నది.''

సూతు డిట్లనెను : మునులారా! వృత్రవధ వృత్తాంతమంతయును ఇంద్రుడు బ్రహ్మహత్యాపాప మనుభవించిన విధమును వినుడు. పూర్వము దీనిని గూర్చి మీ వలెనే జనమేజయుడు సత్యవతీ సుతుడగు వ్యాసు నడిగెను. 

వ్యాస మునివరా! మున్ను వృత్రాసురుడు దేవేంద్రునిచేత నెట్లు చంపబడెను? ఇంద్రుడు విష్ణు సాయుజ్యమంది మోసముతో వృత్రుని చంపెనా? లేక దైత్యుడు శ్రీదేవి చేతిలో చచ్చెనా? ఇద్దఱును కలిసి యొక్కని నెట్లు చంపిరో నాకు విన కుతూహలముగ నున్నది. మహాత్ముల చరితము వినువాడెవ్వడును విసుగు జెందడు. కనుక వృత్రాసురవధను దెలుపునట్టి జగన్మాత పరాక్రమ శ్రీని వివరింపుము అన 

వ్యాసు డిట్లనెను: జనమేజయా! దేవత లమృతము ద్రావి తృప్తి గాంతురు. నీ బుద్ధి పురాణశ్రవణ మెంత జేసినను తనివి జెందుట లేదు. నీవు కడు ధన్యుడవు. నీ యశము ప్రశంసనీయము. శ్రీదేవీకథల యెడల నీ భక్తిభావము దినదినమునకు వర్ధిల్లుచున్నది. శ్రోత యేకాగ్రతతో వినుచో వక్త తప్పక ప్రీతితో నెంతైన చెప్పదలచును. 

తొల్లి ఇంద్రవృత్రులకు ఘోరయుద్ధము సంఘటిల్లెను. ఇంద్రుడు విశ్వకర్మ తనయుని చంపి దుఃఖముల పాలయ్యెను. మునీంద్రులును పాపమునకు భయపడుదురు. వారును మాయామోహితులై నింద్యము లొనరింతురు. ఇంక విష్ణువాసవులు త్రిశిరోవృత్రులను వంచించి చంపుటలో చిత్ర మేమున్నది? 

విష్ణువు సత్యమూర్తి. ఐన నతడు ననాదియగు మాయకు లొంగి కపటముతో దానవులను సంహరించును. ఇంక సకల జగన్మోహిని-మహామాయయగు భగవతిని గెల్చుట కెవ్వ డోపును? నారాయణుడు నరసఖుడు. అతడును దేవీ నియుక్తుడై మత్స్యాది రూపములు దాల్చి మంచిచెడులు చేయుచుండును. 

జీవుడు మాయాగుణబద్ధుడై ధన-పశు-మిత్ర-వనితా గృహములందు దగుల్కొని పుణ్యపాపము లొనర్చుచుండును. మాయ కార్యకారణాతీతము కనుక నెంతటి కార్యకారణవిదుడైనను త్రిగుణవశుడై మోహితుడై మాయను త్రోసివేయజాలడు. కావుననే విష్ణువాసవులు మాయామోహితులై స్వార్థబుద్ధితో కపటముతో వృత్రుని దెగటార్చిరి.

ఇంద్ర వృత్రుల పూర్వ వైరకారణము వినిపింతును. వినుము. త్వష్ట ప్రజాపతి మహాతపస్వి దేవబ్రాహ్మణ ప్రియుడు సురశ్రేష్ఠుడు దేవకార్య నిర్వాహకుడు. అతడు చతురుడగు అమరశిల్పి. అతడింద్రునిమీది పగవలన త్రిశిరసుడు విశ్వరూపుడునను పేర్లుగల చక్కని కొడుకును గనెను. 

త్రిశిరసుడు చక్కని మూడుమొగములతో భిన్నకార్యములొనర్చుచుండెను. అతడొకేసారి యొక ముఖముతో వేదపఠనము వేరొక దానితో సురాపానము మరొక్క దానితో దెసలు పరికించుట చేయుచుండెను. ఆ కోమలాంగుడు ధర్మదమము లాశ్రయించి భోగములుడిగి తీవ్రతపమొనర్చెను. 

అతడు పంచాగ్నుల మధ్యమునను చెట్టు చివరలందును హేమంత శిశిరములందు నీటి నడుమనుండియు తపమొనర్చెను. ఇట్లతడు తెల్వితో నిరాహారుడై జితాత్ముడై పరిగ్రహము లన్నిటిని విడనాడి దుష్కరమగు ఘోరతపమొనర్చెను. ఇంద్రుడతనిని గని యతడింద్రపదవిని గాంచునేమోయని విషాదగ్రస్తుడయ్యెను. 

అతని సత్వ తేజము తపశ్శక్తిగాంచి యింద్రుడిట్లు చింతాక్రాంతుడయ్యెను. త్రిశిరసుడు పెరిగి చివరకు నన్ను వధింపగలడు. కావున పండితుడెన్నడును శత్రువర్ధనము నుపేక్షింపరాదు. ఇపుడతని తపోభంగమునకు యత్నింపవలయును. తపమునకు కామము శత్రువు కనుక తపము కామము వలన నశింపగలదు. అతనిని భోగాసక్తునిగ జేయవలయును అని యింద్రుడు దలచెను.

అతనిని కామమోహితునిగ జేయుట కింద్రుడూర్వశి మేనక-రంభ-ఘృతాచి తిలోత్తమలను రావించెను. వారు రూపగర్వితులు. 

ఇంద్రుడు వారికిట్లనెను : నాకిపుడొక కార్యము ఏర్పడినది. మీరు నాకిపుడు ప్రియుము గూర్చవలయును. నాకొక గొప్ప శత్రువు గలడు. అతడు ఘోరముగ తపము చేయుచున్నాడు. మీరచటికేగి యతని తపమును భంగపఱచుడు. మీరు వివిధ శృంగార వేషములు దాల్చి మీమీ వంపుసొంపులతో హావభావ విలాసములతో నతనిని మోహపెట్టుడు. నా యెదలోని కుందు మాన్పుడు, మీకు మేలగుత, ఓ యచ్చరలారా! వాని తపోబలము వలన నేనస్వస్థుడనైతిని. అతడు వెంటనే నా యింద్రాసనము చేజిక్కించుకొన జూచుచున్నాడు. కనుక నా భయముడిపి నా పనినెరవేర్చి నాకు పకారము సేయుడు అను నింద్రుని మాటలు విని వారు నమస్కరించి యిట్లనిరి : 

దేవేశ! భయపడకుము. అతనిని మోహవశుని చేయుటకు యత్నింపగలము. నీ భయము తొలగునట్లుగ మా నృత్యగీత విహారాదులచే మేమతనిని ప్రలోభింపజేతుము. మా కడగంటి చూపులతో అంగవిన్యాస విశేషములతో నతనిని ప్రలోభపెట్టి మా కైవసము చేసికొందుము.

అని వారు త్రిశిరునికి మిక్కిలి చేరువగ నేగిరి. కామశాస్త్రమున చెప్పిన చొప్పున తమలోని వంపు సొంపులను వలపు బింకములను వారు బయట పెట్టిరి. వారాముని ముందట తాళగతులతో నాడిరి. రాగభావములు వెల్లడించిరి. అతనిని మోహపెట్ట యత్నించిరి. 

కాని యా తపోనిధి వారి విలాసములను కన్నెత్తియైనను జూడలేదు. అతడింద్రియములు విగ్రహించుకొని చెవిటి - మూగ - చీకు పగిది నుండెను. ఆ విలాసినులు మున్యాశ్రమములో మోహకరములగు నృత్యగానములు సల్పుచు కొన్ని దినములు గడిపిరి. 

కాని వారు త్రిశిరుని మనస్సును ధ్యాననిష్ఠనుండి చలింప జేయలేక తిరిగి యింద్రుని చెంత కేగిరి. వారు దీనముగ భయముతో వెలవెలబోయి చేతులు మోడ్చి యింద్రుని కిట్లనిరి : 'దేవ దేవా! మహారాజా! మేము మా శక్తి కొలది ప్రయత్నించి చూచితిమి - కాని మునీశు నాత్మధైర్యమును చలింపజేయలేకపోతిమి. మాకు విజితేంద్రియుని చలింపజేయుశక్తి లేదు. 

కనుక వేరొక యుపాయ మాలో చింపుము. ఆ నిప్పువంటి మహాముని మా యదృష్టవశమున మమ్ము శపింప కూరకుండెను. అది విని ఇంద్రుడు వారిని పంపివేసెను. మందమతి పాపబుద్ధియగు నింద్రు డతనిని చంపు నుపాయము తలపోసెను. ఇంద్రుడు లోకనింద పాపభీతి విడనాడి త్రిశిరుని వధింప నిశ్చయించుకొనెను.

No comments:

Post a Comment

Chapter 137 History of the Haihayus - అధ్యాయము 137 హైహయుల చరిత్ర

శ్రీ దేవీ భాగవతం  షష్ఠ స్కంధము  - అధ్యాయము 137 హైహయుల చరిత్ర జనమేజయు డిట్లనెను : వ్యాసమునీంద్రా ! హైహయులను క్షత్రియులు బ్రహ్మహత్యాపాపమునకు ...