Thursday, April 16, 2026

Chapter 135 The story of Vasishtha's previous birth - అధ్యాయము 135 వసిష్ఠుని పూర్వజన్మ వృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము - అధ్యాయము 135

వసిష్ఠుని పూర్వజన్మ వృత్తాంతము

జనమేజయు డిట్లనెను : ఓ వ్యాస! మహాత్మా! వసిష్ఠుడు బ్రహ్మ మానస పుత్త్రుడు కదా! అతనిని మైత్రావరుణుడని యంటివి. అతనికా పేరెట్లు వచ్చెను? వాక్య విశారదా! అతనికా పే రతని కర్మ వలన గలిగెనా? లేక గుణము వలన గలిగెనా? ఆ కారణము నాకు విశదీకరించుము. 

వ్యాసుడిట్లనెను : 'ఓ రాజా! వసిష్ఠుడు బ్రహ్మమానస పుత్త్రుడు. అతడు నిమిశాపమున తన మేను చాలించి పునర్జన్మమందెను. ఆ మఱుజన్మలో నతడు మిత్రావరుణులకు జన్మించుటవలన లోకమున మైత్రావరుణి నామధేయముతో ప్రసిద్ధి కెక్కెను.' 

రాజిట్లనెను : 'వసిష్ఠుడు బ్రహ్మతేజోబలుడు బ్రహ్మజుడు ధర్మ స్వరూపుడు. అట్టి వాడొక రాజు శాపమునకు దారుణముగ గురియగుట వింతగనున్నది. ఏ పాప మెఱుగని బ్రహ్మర్షిని రాజేల శపించెనో యా కారణమును వినిపింపుము.' అన 

వ్యాసుడిట్లనెను : 'రాజా! నేనీ యింతటికిని కారణము పూర్వమే తెల్పితిని. ఈ జగములు త్రిగుణములచే వ్యాపించియున్నవి. పూర్వము తెలిపిన రాజులు ధర్మమాచరించి యుందురుగాక! తబిసి తపము చేసియుండుగాక! కాని, వారి వారి కర్మములు మాయాగుణబద్ధములయ్యెను. కనుక నవి సాత్త్వికత్వము గాంచలేకుండెను. 

రాజులను మునులును కాలక్రమమున కామక్రోధములకు లోభాహంకారములకు లోనై దారుణ తపము లొనర్చిరి. రాజులు రజోగుణముతో యాగము లొనర్చిరి. విప్రడెవ్వడును సత్త్వగుణముతో వెలుగొందలేడు. కనుక నిమివలన మునియు ముని వలన నిమియును పరస్పరము విధివశమున శపించుకొని క్లేశములు కొనితెచ్చుకొనిరి. ఈ జగము గుణత్రయ బద్ధము కనుక నెల్ల జీవులకు చిత్తశుద్ధి క్రియాశుద్ధి మనఃశుద్ధియును మూడును దుర్లభములు. 

ఇదంతయు నా దివ్యపరాశక్తి మాయాప్రభావమున గల్గును. దానినెంత వాడును మీఱజాలడు. ఆ దయామయి యెవని ననుగ్రహించునో వాడు ముక్తుడగును. ఇంతయేల? ఆ మాత దయలేనిచో హరి హర బ్రహాదులును ముక్తులు గాజాలరు. పామరులు సత్యవ్రతాదులవలె దేవి దయవలన తరింతురు. ఆ సర్వేశ్వరి హృదయపులోతు లెఱుగువా డీ ముల్లోకములలో లేదు. ఐనను ఆ తల్లి దేవీ భక్తులకు వశమై యుండును. కనుక దోషములెల్ల తొలగుటకు సాత్త్విక శాశ్వత భక్తి ముఖ్యాతిముఖ్యము. భక్తిలో రాగదంభములు తావు చేసికొన్నచో నది దుఃఖదాయక మగును.

పూర్వ మిక్ష్వాకు వంశమునందు నిమియను రాజుండెను. అతడు రూపగుణసంపన్నుడు; ధర్మజ్ఞుడు; లోకరంజకుడు. అతడు సత్యవాది దాత జ్ఞాని పవిత్రుడు యాజకుడు ధీశాలి ప్రజాపాలనతత్పరుడు. తన తండ్రికి పండ్రెండవ తనయుడు. అతడు గౌతమాశ్రమముచెంత జయంతు పురమను నగ్రహారమును బ్రాహ్మణుల మేలుగోరి వారికై నిర్మింపజేసెను. 

అతనికి భూరిదక్షిణలతో రాజసూయాగము చేయవలయుననెడు కోరిక చాలకామునుండి యుండెను. అంత నతడు తన తండ్రి యాజ్ఞ బడసి గొప్పవారి నుండి కావలసిన యాగ సామగ్రి సమకూర్చుకొనెను. పిమ్మట నతడు భృగువు అంగిరుడు వామదేవుడు గౌతముడు వసిష్ఠుడు పులస్త్యుడు పులహుడు ఋచీకుడు క్రతువు మున్నగు వేదపారగులు సర్వజ్ఞులు యజ్ఞ విద్యానిపుణులు తాపసులునగు వారిని యజ్ఞమున కాహ్వానించెను. 

అట్లు రాజు యాగసామగ్రి నంతయు సమకూర్చుకొని సవినయముగ తన గురువగు వసిష్ఠుని పూజించి యిట్లనియెను : మునివరా! దయామయా! నేను యజ్ఞ మాచరింతును. యాగ మొనరింపజేయుము. నీవు సర్వవిదుడవు. నాకు కులగురుడవు. ఆప్తుడవు నా కార్యము నెఱవేర్చుము. నేను యాగ ద్రవ్యము లన్నియు చక్కగ సమకూర్చుకొంటిని. ఐదువేలేండ్లు పూర్తిగ యాగదీక్ష వహింపదలచితిని. నేను శ్రీ జగదంబికా దేవి నారాధింపగలను. దేవీ ప్రీత్యర్థముగ దేవీ మహాయజ్ఞము విధివిధానముగ నాచరింపగలను'' అను నిమి వాక్కులు విని 

వసిష్ఠుడిట్లనెను : 'ఇంద్రు డింతకు పూర్వమే నన్నొక యాగమున కాహ్వానించెను. అతడైదువందల యేండ్లవఱకు శ్రీపరాశక్తి మహాయజ్ఞమాచరింప బద్ధకంకణు డయ్యెను. అతని యజ్ఞము పూర్తియగువఱ కెదురు చూడుము. ఇంద్రుని యాగము పూర్తిచేసి వత్తును. అంతవఱ కోపికపట్టుము.'

రాజిట్లనెను : ''నే నీ యజ్ఞమున కితరమునుల నెల్ల నాహ్వానించితిని. యజ్ఞసంభారము లెల్ల తెచ్చుకొంటిని. ఇప్పుడు దాని నెట్లు మానుకొందును? విప్రవరా! నీవు వేదవిదుడవు. ఇక్ష్వాకుల కులగురుడవు. ఇపుడు నా కార్యము వదలి నీ వెట్లు వెళ్ళగలవు? ద్విజవరా! నా యాగము వదలివెళ్ళుట నీకు తగదు. నీవు లోభముతో ధనాశతో వెళ్ళుచున్నావు' అని నిమి యెంతయో వారించెను. ఐనను వసిష్ఠుడింద్రుని యాగమునకు వెళ్ళెను. అపుడు రాజు విమనస్కుడై తన యజ్ఞము కొనసాగింప గౌతముని నియమించెను. 

అతనిని పూజించి సత్కరించి హిమాలయముచెంత గల సాగరతీరమున జన్నమునకు పూనుకొనెను. ఆ యజ్ఞమునందు నిమి విప్రులకు భూరి దక్షిణ లొసంగెను. అట్లు నిమియైదు వేలేండ్లు దీక్షతో దేవీ మహాయజ్ఞమాచరించెను. అందు రాజు ఋత్విజులను చక్కగ బూజించి వారికి విశేషముగ గోధనము లొసంగెను. 

అట నింద్రుని యైదు వందల యేండ్ల దేవీయాగము పూర్తి యయ్యెను. ఆ పిదప వసిష్ఠుడు నిమి యాగము గాంచుటకు వచ్చి రాజదర్శనము కెదురు చూచుచుండెను. ఆ సమయమున నిమి గాఢనిద్రలో నుండుటచే సేవకు లతనిని మేలుకొల్పలేదు. కనుక రాజు ముని చెంతకు రాలేకపోయెను. 

అంత మునిసత్తముడగు వసిష్ఠునకు కోపము తీవ్రరూపము దాల్చెను. అతడు నిమిని నేను నీ గురుడను. నన్ను త్రోసిరాజని వేరొక్కని గురువుగ నెన్నుకొంటివి. మందమతీ! నేనెంతజెప్పినను నా మాట కాలదన్ని యోపిక లేక నీవు దీక్ష వహించితివి. నన్ను నిందించితివి. కాన నీవు నీ శరీరము పడిపోయి విదేహుడవగుము' అని యెలుగెత్తి శపించుట సేవకులు వినిరి.

వారు రాజును మేలుకొల్పి వసిష్ఠుడు కోపముతో నతనిని శపించిన తెఱుంగెఱింగించిరి. నిమి యే కల్మషములేని శుద్ధాత్ముడగు రాజు. అతడు యుక్తి యుక్తముగ సహేతుకముగ సవినయముగ నిట్లనెను : 

ఓ ధర్మజ్ఞా! ఇందు నా దోషమావంతయును లేదు. నీకు ధనకాంక్ష మెండయ్యెను. నేను నీ యజమానుడను. నేనెంతయో ప్రార్థించితిని. ఐనను నీవు నన్ను లెక్కచేయక వెళ్ళితివి. ఇట్టి నింద్యకర్మ మొనరించియు నీకు సిగ్గు గల్గుటలేదా? బ్రాహ్మణుని ముఖ్య ధర్మము సంతోషము అని వేదవేదాంత విదుడవు బ్రహ్మపుత్త్రుడవునగు నీ వెఱుందువు. 

కాని, విప్రధర్మములలోన ధర్మ సూక్ష్మ మెఱుగలేకపోతివి. నీ దోషము నాయందారోపించి వ్యర్థముగ నన్ను శపించితివి. క్రోధము చండాలునికంటె చెడ్డది. సజ్జనులు దానిని చెంతకు చేరనీయరు. నీవు పట్టరాని కోపముతో వట్టిగ నన్ను శపించితివి. క్రోధము చండాలునికంటె చెడ్డది. సజ్జనులు దానిని చెంతకు చేరనీయరు. నీవు పట్టరాని కోపముతో వట్టిగ నన్ను శపించితివి. కోపముతో భగ్గున మండితివి. 

కనుక నీ దేహమును పడి పోవుగాక! ఇట్లు మునిచేత రాజు రాజుచేత మునియు శపింపబడిరి. ఇట్లు వారు పరస్పరము శపించుకొని తిరని దుఃఖము లనుభవించిరి. అంత వసిష్ఠుడు వంతజెంది బ్రహ్మను శరణు వేడెను. తన్ను రాజు శపించిన విధమును విసిష్ఠు డిట్లతనికి తెలిపెను : 

నీ శరీరము పడిపోవుగాక అని నేను నిమిచే శపింపబడితిని. తండ్రీ! ఇపుడీ దేహపతనమున పెద్ద యిక్కట్టువచ్చి పడినది. నే నిపుడేమి చేతును? నాకు జన్మ మొసగు తండ్రి యెవడో తెలుపుము. నాకు పూర్వ దేహమే కలుగవలయును. ఈ దేహ మందున్న జ్ఞానము వేరొక దేహమునందును గలుగవలయును. నా మీద దయజూపుట కీవే సమర్థుడవు' అను వసిష్ఠుని దీనవచనములువిని 

బ్రహ్మ తన తనయునితో నిట్లనెను : నీవు మిత్రావరుణి తేజములో ప్రవేశించి స్థిరముండుము. అంత సుకాలమున తప్పక నయోనిజుడవై వెలుగొందగలవు. ఆ దేహము బడసి నీవు విశ్వాభూతాత్మకుడవు ధర్మయుతుడవు వేదవిదుడవు సర్వజ్ఞుడవు సర్వపూజితుడవు గాగలవు.'

అపుడు వసిష్ఠుడు పితామహునకు ప్రదక్షిణ నమస్కారము లాచరించి వరుణాలయ మేగెను. అచట వసిష్ఠుడు తన దేహము చాలించి జీవరూపముతో మిత్రావరుణుని దేహములో ప్రవేశించెను. 

ఒకప్పుడూర్వశి తన చెలియలు వెంటరాగా రాగము లొలికించుచు స్వేచ్ఛా విహారములు సల్పుచు వరుణాలయము జేరెను. ఊర్వశి రూప¸యవనసంపన్న. వియచ్చర దేవకామిని. ఆ సొబగులాడిని గాంచగనే మిత్రావరుణుల హృదయములు మదన పరవశము లయ్యెను. వారు కామపీడితులైరి. వారిర్వురు మనోరమ సర్వాంగసుందరి వేల్పుకన్నియ యగు 

నూర్వశితో నిట్లు పలికిరి : శోభనాంగీ! మమ్ము వరింపుము. వరవర్ణినీ! మాతో నీ యిచ్చమెచ్చునట్లు విహరించుము. అని వారు పలుకగనే యూర్వశి వారియందనురాగవతియై మిత్రావరుణుల యింటిలో నివాస మేర్పరచుకొనెను. ఆమె యచట వారి భావముల కనుకూలముగ మసలుకొనుచుండెను. అంతలో దైవయోగమున మిత్రావరుణుల వీర్య మొక మూతలేని కుండలో పడెను. 

అందుండి యిర్వురు సుకుమారముని కుమారులుద్భవించిరి. వారిలో మొదటివాడగస్త్యుడు, రెండవవాడు వసిష్ఠుడు. ఇట్లు మిత్రావరుణుల వీర్యమువలన ఋషిసత్తములగు తాపసు లుద్భవించిరి. అగస్త్యుడు బాల్యమునందే తపమునకు వనముల కరిగెను. వసిష్ఠు డిక్ష్వాకు రాజునకు పురోహితుడుగ వరింపబడెను. రాజతనిని తన పూర్వ వసిష్ఠునిగ నెఱిగి ప్రీతితో తన వంశము మేలుకొఱ కతనిని గౌరవించుచుండెను. 

రాజా! నీ కీ విధముగ వసిష్ఠుని పూర్వ చరిత్రము తెలిపితిని. అతడు శాపవశమున మిత్రావరుణులకు సుతుడగుటయు తేటతెల్ల మొనరించితిని.

అధ్యాయము 136 నిమి చరిత్రము

No comments:

Post a Comment

Chapter 137 History of the Haihayus - అధ్యాయము 137 హైహయుల చరిత్ర

శ్రీ దేవీ భాగవతం  షష్ఠ స్కంధము  - అధ్యాయము 137 హైహయుల చరిత్ర జనమేజయు డిట్లనెను : వ్యాసమునీంద్రా ! హైహయులను క్షత్రియులు బ్రహ్మహత్యాపాపమునకు ...