Friday, April 17, 2026

Chapter 147 Naradudu Svavrttantamu Thelputa - అధ్యాయము 147 నారదుడు స్వవృత్తాంతము తెల్పుట

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము - అధ్యాయము 147

నారదుడు స్వవృత్తాంతము తెల్పుట

అను నా మాటలాలకించి పరమార్థవిదుడగు నారదుడు మోహకారణమడుగుచున్న నన్ను జూచి చిర్నగవునగి నాతో నిట్లు పలికెను : 

పారాశర్యా! పురాణవేత్తా! మోహమునకు మూలకారణము నన్నేల యడుగుదువు? ఈ ప్రపంచమున మోహవశుడుగాని జీవుడెవ్వడును లేడు, బ్రహ్మ విష్ణురుద్రులును సనక కపిలాదులును మాయకులోనై యీ సంసార మార్గమున పల్మారులు గ్రుమ్మరుచుందురు. నన్ను లోకులు జ్ఞానిగ దలంతురు. 

కాని నేనును ప్రాకృతునివలెన భ్రాంతచిత్తుడనే. నా మొదటి మోహవృత్తాంతము చెప్పుదును వినుము. 

వ్యాసమునీశా! నేను తొల్లి భార్యను గూర్చిన స్వయంకృతమైన మోహము జంజా టములో కొట్టుమిట్టాడి తీరని దుఃఖము లనుభవించితిని. మున్నొకప్పుడు పర్వతుడు నేను పవిత్రభారత ఖండమును గాంచు తలంపున దివినుండి భువికి దిగివచ్చితిమి. మేమిర్వురము పావనములు శుభములు నగు పుణ్యతీర్థములు మున్యాశ్రమములు సందర్శించుచు 

ఈ కర్మభూమియెల్ల పర్యటించుచుంటిమి. మేము భూతలమున తిరుగుటకు మునుపు దేవలోకమునందు మాలో మేము కొన్ని నేమము లేర్పరచుకొంటిమి. మాలో నెవరికైన మంచిదైన చెడుదైన ఎట్టి భావమైన గల్గినచో దానిని దాచక రెండవ వారికి వెల్లడించవలయును. రతి - భోజనము - ధనము - వీనిలో దేనియందు కోర్కి పుట్టినను దానిని తప్ప కింకొకరికి చెప్పవలయును. 

మేము ఇట్లు కట్టుబాటులు చేసికొని దివినుండి భువికేతెంచి యొకేమనస్సుతో ముని వృత్తితో నెల్లెడల నిచ్చవచ్చినట్లు తిరుగుచుంటిమి. అట్లు మేము భూలోకమున సంచరించుచుండగ నంతలో వర్షాకాలము సమీపించెను. 

మేము సంజయుడను రాజుయొక్క సుందరనగరము జేరితిమి. ఆ రాజు మమ్ము భక్తితో బూజించి సత్కరించెను మేమామహాత్ము నింట నాల్గు నెలలుంటిమి. వానకాలము నాల్గునెలలు త్రోవ సుగమముగ నుండదు. కనుక నపుడు పండితులొక్క చోటనే యుండవలయును.

విప్రుడెనిమిది నెలలవఱకంతట తిరుగవచ్చును. కాని వానకాలము నాల్గునెలలు మాత్రము సుఖము గోరువాడెచ్చటికిని గదలగూడదు. ఇట్లు మేము నిశ్చయించుకొని సంజయునింటనుండి యా మహాత్మునిచేత నాతిథ్య సత్కారములు పడయుచుంటిమి. 

ఆ రాజునకు 'దమయంతి' యనునొక గారాపు చక్కని చుక్క గలదు. రాజా యందాల సుదతిని మా యిర్వురి సేవలందు లగ్నయై యుండెడిది. ఆ పడతి మాకు సముచితకాలమునకు స్నానమునకు వేన్నీళ్లు తినుటకు భక్ష్య భోజ్యములు తాంబూలము నింక మాకేది ఇష్టమైన నది ముచ్చటగ దెచ్చుచుండెను. 

ఆ కన్నియ మా యిర్వురికి విసనకఱ్ఱలు సుఖాసనములు కమ్మని పూసెజ్జలు మున్నగు కామ్యవస్తువులన్నియు సమకూర్చుచుండెను. అట్లు మేము రాజప్రాసాదమునందు రాజమర్యాదలందుకొనుచు వేదవ్రతులమై వేదాధ్యయన శీలురమై యుంటిమి. 

నేను చేత వీణియబూని మేలైన స్వరరాగములీను సామగానము చెవులపండువుగ గానము చేయుంచుంటిని. ఆ కోమలి సంగీతజ్ఞురాలు. ఆమె నా తేనెకన్న తియ్యనగు సామగానమాలించి నాయందెక్కడలేని మక్కువతో బద్ధానురాగయయ్యెను. ఆమె నాపై చూపు ప్రేమభావాలు పెరిగి పెరిగి రాగానబడెను. 

ఆనాటినుండి కన్నెపడుచు భోజన భాజనములు సమకూర్చుటలో నాకు పర్వతునకు నడుమ భేదభావము జూపుచుండెను. ఆమె నాకు స్నానమునకు వేన్నీళ్ళు పర్వతునకు చన్నీళ్ళు నాకు తెల్లని గడ్డ పెరుగు పర్వతునకు నీళ్ళ చల్ల వేర్పాటుతో నేర్పాటు చేయుచుండెను. 

ఆ మగువ నాకు వలపుచిల్కరించిన కమ్మని పూలసెజ్జ గూర్చెను. అతని కట్టిది లేదు. ఆ వాలుగంటి కన్నుసన్నల నన్నోరచూపుల జూచుచుండెను. పర్వతునట్లు చూడకుండెను. నాయందామెకు గల యనురాగ కారణమును పర్తతుడర్థము చేసికొనెను.

పర్వతుడు నింతలో నిదేమాయని యాలోచించి నాతోనొక నాడొంటి - నిట్టులనియెను : 'నారదా! నీ వెల్ల భంగుల నున్నదున్నట్లు పల్కుము. ఆని రాచపట్టి స్నేహ భావమున నీకు భోక్ష్య భోజ్యములు సమకూర్చు చున్నదే కాని యామె నాకిట్లు తినబెట్టదు. 

ఇట్టి భేదము వలన నాకేదో సందేహము గల్గుచున్నది. ఆమె నిన్ను తప్పక తన వానిగ జేసికొనునని తలంతును. కనుసైగలు ఇతర లక్షణములు చూడచూడగ నామెయందున నీ మనస్సు తగుల్కొనెనని నాకు దోచుచున్నది. 

మునివర్యా! మనము స్వర్గము వెడలునప్పుడు కొన్ని నియమము లేర్పరచుకొంటిమి. ఇప్పుడు వట్టి మాటలు కట్టిపెట్టి నిజము పల్కుము'' అని పర్వతుడు నన్ను కారణమడుగగ నేను మిక్కలి సిగ్గిలి యతని కిట్లంటిని : 

పర్వతా! ఈ విశాల కామాక్షి నన్ను పతిగ జేసికొనదలచి యున్నది. నా మనస్సునందలి భావము కూడ విశేషముగ నామెయందు నిలిచియున్నది. అను నా నిక్కమగు వాక్కులాలించి పర్వతుడు కోపముతో పల్మరు నాతో నిట్లనెను : 

నారదా! నీకు ధిక్కారము ధిక్కారము. మిత్ర ద్రోహీ! మొదట శపథము చేసి పిదప నన్ను మోసగించితివే! నా శాపమున నీవు కోతిమొగము గలాడ వగుదువు గాత! అని కూపితుడగు ప్వతుడు వపింపగనే నేను వికారము గల కోతి మొగముగలాడనైతిని. అతడు నా సోదరి కొడుకు. ఐన నేనది లెక్కింపక కోపముతో నీకు స్వర్గమేగు శక్తి నశించుగాక అని శపించితిని. 

పర్వతా! ఈ కొద్ది తప్పునకు నీవు నన్ను శపించితివి. ఓ మందాత్మా! దానివలన నీకిక మృత్యులోకమే నివాసమగు గాక! ఆ పిదప పర్వతుడు చలించిన మనస్సుతో నగరు వెడలెను. నేనదే క్షణముగ కోతిమొగము గలవాడనైతిని. నా వీణారాగము వినటలో మక్కువగల చతుర రాజకుమారి యానాటినుండి నన్ను కుటిల వానరునిగ జూచి వికల మనస్కురాలయ్యెను. 

నేను (వ్యాసముని) ఇట్లంటిని : నారదా! పిమ్మట నీ శాపమెట్లు తొలగెను. నీకు పిదప నరముఖమెట్లు ప్రాప్తించెనో తెలుపుము. ఆ పర్వతుడెచటి కేగెను? ఆ పిమ్మట మీ యిర్వురి కలయిక యెచట నెపుడు జరిగెనో విపులముగ దెలుపుము.

అనగా నాతో నారదుడిట్లనెను : మహాత్మా! మహాహాయా శక్తి విచిత్ర చరిత్రమేమని చెప్పుదును? పర్వతుడట్లు కోపముతో వెళ్ళిన పిమ్మట నతడెన్నియో కష్టాలు పడెను. ఆ రాకుమారి మరల నా పరిచర్యలో మునిగిపోయెను. పర్వతుడు వెళ్ళినప్పటికి నేనదే యింటనుంటిని. అట్లు నేను వానరముఖముతో దుఃఖార్తుడనై దీనుడనై యుండి యిక ముందేమి మాయ జరుగనోయని వెతజెందుచుంటిని. 

సంజయరాజు తన కూతునకు పెండ్లి వయస్సు వచ్చుట గని యామె వివాహమునకై మంత్రితో నిట్లు సంప్రతించెనుః ''ఇపుడు నా కుమార్తెకు పెండ్లికి దగిన యీడు వచ్చెను. కనుక నొకచక్కని రూపవంతుని తెలుపుము. ఉదారుడు గుణవంతుడు శూరుడు కులీనుడునగు వరునితో నా కూతునకు యథావిధిగ పెండ్లి చేతును. అట్టి వరుని దెలుపుము.'' 

మంత్రి యిట్లనెను : రాజా! అన్ని విధముల నీ కూతునకు దగిన సుగుణములు గల చక్కని రాకుమారులీ భూమిపై పెక్కురు గలరు. ఏ రాచపట్టి తగిన వరుడని మీరు భావింతురో యతని నాహ్వానించి గజాశ్వరరథములతో సత్కరించి కన్యాదానము చేయుము. 

నారదుడిట్లనెను: అపుడు దమయంతి దాసివలన తన తండ్రి యభిప్రాయమెఱింగి దాసి వలన తన కోర్కి తన తండ్రి కిట్లు వెల్లడి చేసెను. 

దాసి యిట్లనెను : 'మహారాజ! నీ కూతురగు దమయంతి యొంటరిగ నున్న నా తండ్రితో నా మాటగ నిట్లు చెప్పుమని నాతో చెప్పెను. నేను నారదుని మహతీనాదమునకు సమ్మోహితనైతిని. నేను నారదుని మనసార ప్రేమించితిని. నే నితరు నెవ్వరిని వివాహము గాను. 

ధర్మజ్ఞా! నా పెండ్లి యా మునివరునితోడనే జరిపింపుము. ఆ నారదుని తప్ప నేను మరెవ్వరిని పతిగ వరింపను. నేను నాదకళాభరితము సరసము పరిపూర్ణము బ్రహ్మానందమయమునైన నారదుని నాదసముద్రమున మునిగితిని. అది అపారము ఆనందపూర్ణము. దానిలో మొసళ్ళు తిమింగిలములు లేవు.

No comments:

Post a Comment

Kings of the Surya Dynasty - Sukanya Vritthanamu - సూర్య వంశ రాజులు - సుకన్యా వృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము -  సూర్య వంశ రాజులు - సుకన్యా వృత్తాంతము జనమేజయు డిట్లనెను : ఓ మహానుభావా ! సూర్యవంశమునందు బుట్టిన ధర్మజ్ఞులగ...