అపుడు శునఃశేపుడు దోయిలించి సభాసదుల కిట్లనెను: ధర్మనిర్ణేతలగు సభ్యులారా! వేదశాస్త్రను సారముగ సత్యము బల్కువారలారా? మీరిపుడు నాకు ధర్మమార్గము చెప్పుడు.
ఓ సర్వజ్ఞులారా! నా కిపుడు పూజ్యతము డగు తండ్రి యెవడు? నేనెవని కుమారుడను? మీ పెద్దలమాట చొప్పున మీ చెప్పినవాని నాశ్రయింతును. అని బాలుడు పలుకగనే సభ్యులెల్లరును తమలోతా మిట్లనుకొనిరి.
అతడజీగర్తుని కుమారుడు. ఇత డితరుని కొడుకెట్లు గాగలడు? ఇత డజీగర్తుని ప్రత్యంగమునుండి పుట్టి యతనిచేత చక్కగ పెంచబడెను. ఇతడితరుని కొడుకెట్లగును? ఇతడతని కొడుకే యగు ననిరి. వారి మాటలు విని
వామదేవుడను నతడు వారలకిట్లనెను: ఇతడు ధనాశగల తన తండ్రిచే నమ్ముడుపోయెను. కనుక నితడు తన్ను డబ్బిచ్చి కొన్న రాజు కొడు కగును. కానిచో బంధముక్తి గల్గించిన వరుణుని కొడుకైన గావలయును.
అన్నము పెట్టినవాడు భయము బో గొట్టినవాడు చదువు చెప్పినవాడు ధనమిచ్చినవాడు ననువారు తండ్రులని చెప్పబడుదురు. అట్లా బాలుని కొంద ఱజీగర్తుని కొడుకని మఱికొందరు రాజు కొడుకని వేరొక కొందఱు వరుణుని కొడుకని పలుకసాగిరి.
ఈ విధముగ సభ్యులు తమలోతాము సందేహములతో వాదించుకొనుచుండగ సర్వపూజితుడు సర్వజ్ఞుడు నగు వసిష్ఠుడు వారి కిట్లనెను.
ఈ విధముగ సభ్యులు తమలోతాము సందేహములతో వాదించుకొనుచుండగ సర్వపూజితుడు సర్వజ్ఞుడు నగు వసిష్ఠుడు వారి కిట్లనెను.
మహాత్ములారా! వేదసమ్మతమగు నిర్ణయము వినుడు. ఈ బాలుని తండ్రి దయమాలి యితనిని డబ్బున కమ్ముకొనెను. ఇతని తండ్రి ధనాశాపరుడు. కనుక నితని కితని తండ్రితో సంబంధము తెగిపోయెను. హరిశ్చంద్రుడితనిని కొనుటవలన నితడతనికి కొన్నకొడుకే యగును.
హరిశ్ఛంద్రు డితనిని యూపస్తభమునకు గట్టుటవలన నితడు రాజు కొడుకు గాడు. ఇతడు వరుణుని నుతించుటవలన వరుణు డితనిని విడుదల గావించెను. మహాశయులారా: అందుచే నితడు వరుణుని కుమారుడు గాజాలడు. ఏలన నే మంత్రమున నే దేవుడు స్తుతింపబడునో యతడు సంతసించును. ఆ దేవుడు తన్ను సుతించువానికి ధనప్రాణములు-పశురాజ్యములు కామమోక్షములు ప్రసాదించును.
కనుక నితడు విశ్వామిత్రుని కొడుకే. ఏలన నతనిచేత నితడాపదలో రక్షింపబడెను. విశ్వామిత్రుడు వరుణమంత్ర మొసంగి యతనిని గాపాడెను గదా! అను వశిష్ఠుని వాక్కులు విని సభ్యులెల్లరు సమ్మతించిరి.
అంత విశ్వామత్రు డా బాలుని కుడిచేయి పట్టుకొని నాయనా! ఇంటికి పోదము ర్మని ప్రేమ పులకితుడై పలికెను. శునఃశేపుడు వెంటనే విశ్వామిత్రునివెంట నరిగెను. వరుణుడును ప్రసన్నుడై తన నిలయమున కరిగెను. ఋత్విజులును సభ్యులును తమ తమ నెలపుల కరిగిరి. హరిశ్చంద్రుడును రోగ ముక్తుడై సుఖముండెను.
రాజు ప్రసన్నుడై ప్రజలను కన్నబిడ్డలవలె పాలించెను. అపుడు రోహితుడు జరిగిన వరుణుని వృత్తాంతమంత యును వినెను. అతడు సంతోషించి దుర్గమవన పర్వతములు విడిచి తన యింటి కేతెంచును.
రాజు ప్రసన్నుడై ప్రజలను కన్నబిడ్డలవలె పాలించెను. అపుడు రోహితుడు జరిగిన వరుణుని వృత్తాంతమంత యును వినెను. అతడు సంతోషించి దుర్గమవన పర్వతములు విడిచి తన యింటి కేతెంచును.
అపుడొక దూత రాజుతో రాకొమరుని రాక వెల్లడించెను. కోసలాధిపతి ప్రమోదమున తన కొడుకున కెదురేగెను. తండ్రిని చూడగనే రోహితునిలో ప్రేమ సంభ్రమము లొక్కుమ్మడి పెల్లుబికెను. అతడు కన్నీట తడిసిన మోముతో తన తండ్రికి దండప్రమాణమము లాచరించెను.
రాజు తన కొడుకును లేవనెత్తి పుత్రగాత్ర పరిష్వంగసుఖము బడసెను. తనకొడుకు శిరము మూర్కొని కుశల మడిగి తొడపై నిడుకొని ప్రమోదభరితు డయ్యెను. వెచ్చని కన్నీట తన కొడుకు నభిషేకించెను. తన ముద్దులకొడుకుతో చక్కగా రాజ్యమేలెను.
నరమేధ వృత్తాంతమంతయును తనకొడుకుతో జెప్పెను.
No comments:
Post a Comment