Friday, April 17, 2026

Daksha's curse on Narada - నారదుడికిదక్షుడి శాపం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - నారదుడికిదక్షుడి శాపం

జనమేజయా! విష్ణుమూర్తికి నాభికమలం నుంచి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. గొప్ప తపస్సు వేసి మహాదేవిని ఉపాసించి వరాలు పొంది జగత్తును సృష్టించడానికి ఉద్యుక్తుడయ్యాడు. అన్నింటినీ సృష్టీంచాడు కానీ మానవుణ్ణి సృష్టి చెయ్యడానికిమాత్రం అతడికి శక్తి చాలిందికాదు. ఎంతగానో ఆలోచించాడు. ఒక ఉపాయం తట్టింది. అశేషప్రజానీకాన్ని ఒక్కసారిగా సృష్టించలేను కనక శక్తి మేరకు కొందరినే సృష్టిద్దామనుకున్నాడు. ఏడుగురిని మానసపుత్రులుగా ఆవిర్భవింపజేశాడు. “ససర్జ మానసాన్‌ పుత్రాన్‌ సప్తసంఖ్యాన్‌ ప్రజాపతిః”. మరీచి, అంగిరసుడు, అత్రి, వసిష్ఠుడు, పులహుడు, క్రతుడు, పులస్త్యుడు అని వారి పేర్లు. వీరు కాక రోషసముద్భవుడైన రుద్రుడు, ఒడినుంచి పుట్టిన నారదుడు, బొటనవేలు నుంచి ఆవిర్భవించిన దక్షుడు - బ్రహ్మదేవుని కుమారులే. సనకసనందనాదులు మరికొందురు మానసపుత్రులున్నారు. వీరందరూ పురుషులేకాగా, ఎడమ బొటనవేలునుంచి ఒక స్త్రీ ఆవిర్భవించింది; ఆవిడే దక్షవత్ని. సర్వాంగసుందరి. ఈవిడపేరు వీరిణి. అసిక్ని అనికూడా మరొక పేరు. వీరిణీదక్షులకు నారదుడు జన్మించాడు. దేవర్షి అయ్యాడు.

జననేజయు డిట్లనెను : మహాతపస్వియగు నారదుడు దక్షునివలన వీరిణికి జన్మించెనంటివి. ఇది నాకు సందియముగొల్పుచున్నది. నారదుడు బ్రహ్మపుత్రుడు-తాపసుడు-ధర్మజ్ఞుడు గదా! అతడు దక్షుని భార్యయగు వీరిణి గర్బ మందెట్లు జన్మించెను? దక్షునివలన వీరిణికి నారదుడు సంభవించెనను విషయము నాకు విచిత్రముగ నున్నది. ఆ కథ యేమి? నాకు తేటతెల్ల మొనరింపుము. మునీశా! బ్రహ్మజ్ఞుడగు నారదు డేమహత్ముని శాపకారణమున పూర్వదేహము చాలించి మరొక జన్మమెత్తెను? అనగా 

వ్యాసు డిట్లనెను: 'స్వయంభువగు ప్రజాపతి సృష్టిక్రమము నిరంతరాయుముగ సాగవలయునను తలంపుతో ప్రజాసృష్టి చేయుమని దక్షుని ఆదేశించెను. అంత దక్ష ప్రజాపతి తన వీరిణియందు వీర్యవంతులగు నైదు వేలమంది పుత్రులను కనెను. 

వారెల్లరును ప్రజాసృష్టి తామరతంపరగ జేయదలచిరి. వారినిగాంచి నారదుడు కాలప్రేరితుడె నవ్వుచు నిట్లు పలికెను: 

మీరీ భూమి పరిమాణమెంతయో తెలిసికొనకయే ప్రజలను సృజింప పట్టుపట్టితిరి. ఇందుచే ప్రజలకు నిలువ తావుండదు. మీరు లోకమున పరిహాసపాత్రులగుదురు. కనుక మీరు భూపరిమాణ మెఱింగి సృష్టిరచనకు బూను కొన్నచో మీకు సిద్ది గల్గును. లేనిచో గలుగదు. మీరందఱును మూర్ఖులు. ఈ భోగోళచరిత్రము తెలిసికొనకయే ప్రజా రచనకు గడంగుటవలన మీ కెట్లు సిద్ధి చేకూరగలదు? అని నారదుడు పలుక గనే 

హర్యశ్వుడు మున్నగువారు నారదముని చక్కగా బలికెనని దైవయోగమున తమలో తామిట్లనుకొనిరి. వారు తొలుత భూపరిమాణము తెలిసికొనిన పిదప సృష్టి జేయుదమని తలంచి భూతలమంతయు పరిభ్రమించుటకు బయలుదేరిరి. వారిలో గొందఱు నారదుని మాట చొప్పున భూతలము నెఱుగుటకు తూర్పుగ వెళ్ళిరి. మఱికొందరు దక్షిణ దిశగ తరలిరి. ఇంక కొందరు పశ్చిమముగ వేరింక కొందరు ఉత్తరముగ మహోత్సాహముతో బయలుదేరిరి. అట్లు తన పుత్రు లెల్లరును వెళ్ళుటవలన దక్షుడతి శోకార్తు డయ్యెను.

అపుడు దక్షుడు మరల మఱికొందఱిని ప్రజాసృష్టికై పుట్టించెను. వారును ప్రజాసృష్టికి ప్రయత్నశీలురైరి. నారదుడు వారిని జూచి పూర్వమువలె వారి కిట్లనెను. మీ రెంతటి మూఢులు. మీ కీ భూపరిమాణమెంతయో తెలియదు. మీరు ప్రజల నేల సృజింప బూనుకొంటిరి అను ముని మాటలు విని. 

నిజమే యనుకొని వారును మోహితులైరి. వీరును తమ సోదరులు వెళ్ళిన త్రోవనే వెళ్ళిరి. వీరును వెళ్ళుటవలన దక్షునకు శోకము తీవ్రకోపము గలిగెను. దక్షుడు పుత్ర శోకపీడితుడై రోషావేశముతో నారదు నిట్లు శపించెను. 

నా కొడుకు లెట్లు నశించిరో నీవు నట్లే నశింతువు గాక. ఓ దుర్బుద్ధీ! ఈ పాప ఫలితముగ నీవు గర్బవాస దుఃఖ మనుభవింతువు గాక. నా సుతులు నష్టులైరి కనుక నీవు నాకు పుత్రుడవై పుట్టుము. ఇట్లు నారదుడు శపింపబడి వీరిణి గర్బమున జన్మించెను. దక్షుడు వీరిణియందరువదిమంది కన్యలను గనెను. దాని మూలమున దక్షునకు పుత్రవియోగశోకము కొంత తగ్గెను. 

ఆ పిదప ధర్మవిదుడగు దక్షుడు తన పదుముగ్గురు కన్యలను కశ్యప మహాత్మున కిచ్చెను. అతడు మఱి పదిమందిని ధర్మున కిచ్చెను. ఇరువదేడుగురిని చంద్రున కొసంగెను. ఇర్వురిని భృగువున కిచ్చెను. నల్వురి నరిష్టనేమి కొసంగెను. వారి వారికి కొడుకులు మనుమండ్రు గల్గిరి. 

ఆ పుట్టిన వారే దేవదానవులైరి. దేవదానవులు మిక్కిలి బలశాలురు. రాగద్వేష పరులు. మోహాంధులు శూరులు మాయామయులు. తమలోదాము పగలు పెంచుకొనువారునైరి. 

సూర్య వంశ రాజులు - సుకన్యా వృత్తాంతము

No comments:

Post a Comment

Kings of the Surya Dynasty - Sukanya Vritthanamu - సూర్య వంశ రాజులు - సుకన్యా వృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము -  సూర్య వంశ రాజులు - సుకన్యా వృత్తాంతము జనమేజయు డిట్లనెను : ఓ మహానుభావా ! సూర్యవంశమునందు బుట్టిన ధర్మజ్ఞులగ...