Friday, April 17, 2026

Chapter 152 The Effect of Illusion - Narada's Story - అధ్యాయము 152 మాయాప్రభావము - నారద వృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము - అధ్యాయము 152

మాయాప్రభావము - నారద వృత్తాంతము

వ్యాసు డిట్లనెను : ఓ మహారాజ! శ్రీమాయాదేవీ మాహాత్మ్యము నేను నారదునివలన వింటిని. దాని నంతయు నీకు తేటపరతును. చక్కగ నాలకింపుము. అట్లు నారదుడు నారీరూపము దాల్చిన కథయంతయు నతని నుండి నేను వింటిని. 

ఆ పిదప నేను సకలవిదుడగు నారదుని మరల నిట్లు ప్రశ్నించితిని : మునీశా! అటు పిమ్మట నారాయణుడు నీతో నేమి పలికెను? మాధవుడగు జగన్నాథుడు నిన్ను గూడి యెచటి కరిగెను? 

నారదు డిట్లనెను : ఆ విధముగ శ్రీహరి నాతో మనోహరమగు సరస్సుచెంత బలికిన పిమ్మట నతడు గరుత్మంతునెక్కి వైకుంఠమేగ నివ్చయించుకొనెను. అపుడు హరి నాతో నారదా! నీవు నీ యిచ్చవచ్చినచోటి కేగుము లేదా నా లోకమునకైన రమ్ము. ఇందు నీకేది యిష్టమో దాని నొనరింపు' మనెను. 

నేను మాధవునకు నమస్కరించి బ్రహ్మలోకమున కేగితిని. దేవదేవుడగు హరి వెంటనే గరుడాసన మధిరోహించెను. అట్లు హరి నన్ను సాగనంపి తను వైకుంఠధామము జేరెను. జనార్దనుడరిగిన తరువాత నేను నలువకొలువు కూటమున కేగితిని. నే నట నా తండ్రికి ప్రణమిల్లితిని. నేననుభవించిన మహాద్భుతములగు సుఖదుఃఖములు తలపోయుచు నేను నా తండ్రిముందు నిలుచుంటిని. చింతాతురుడనగు నన్నుగాంచి 

నా తండ్రి నాతో నిట్లనెను : ఓ మునీ! మహాత్మా! నీ వింతవఱకెక్కడి కేగితివి? ఏల దిగులుతో నున్నావు. మునిసత్తమా! నీ చిత్తమేలకో నేడు కొందలమందుచున్నట్లు దోచుచున్నది. నిన్నెవరేని వంచించిరా? కాకేదేని యవ్యక్తమైన మహాద్భుత విషయము గనుగొంటివా? కుమారా! నీవు వ్యాకులునివలె జ్ఞానహీనునివలె నేల కనబడుచున్నావు? అని నా తండ్రి యడుగగ నేను దర్భాసనముపై గూరుచుండి ఆ పిమ్మట కాలాత్మకమగు మాయబలమునకు గురియైన నా వృత్తాంతమంతయు నతని కిట్లు పూసగ్రుచ్చినట్లు చెప్పితిని : 

తండ్రీ! నేను ప్రభ విష్ణువగు విష్ణుని చేతిలో మోసపోతిని.

నేను పెక్కేండ్లు స్త్రీ రూపము దాల్చిన పుత్రశోకముతో తీరని దుఃఖ మనుభవించితిని. పిమ్మట కొన్నాళ్లకు మరల విష్ణుని మేలి వచనములకు తెలివొంది కొలనిలో గ్రుంకి నారదుడనైతిని. నేను మయామోహము పొందుటకు కారణమేమి? నేను వట్టి మాయకు లొంగి పూర్వ విజ్ఞానమంతయు గోల్పోతిని. 

ఈ మహామాయా ప్రభావము దాటరానిది. జ్ఞానమును నశింపజేయునది. ప్రమోహమున కిది మూలకందము. ఇట్టి మాయను నేనెన్నడు నెఱుంగనైతిని. మాయలోని మంచిచెడ్డలన్నియు ననుభవించితిని. 

తండ్రీ! నీవు కాల మాయాపరీక్షలో నే తీరుగ నిగ్గు దేలితివో యా యుపాయము నాకు కొంచెము సెలవిమ్ము అని నేను పలుకగ బ్రహ్మ ప్రేమతో నలతినగవు తళుకొత్త నాతో బలికెను : 

మాయ సకల సురమునులకును జ్ఞానులకును తాపసులకును గాలి యాహారముగల వారికిని యోగులకును తెలువరానిది. ఈ మాయాశక్తి బల మెఱుంగుటకు నే నశక్తుడను. అటులే విష్ణువుగాని శివుడుగాని దాని పుట్టుపూర్వోత్తరము లెఱుగరు. ఏమియులేని మాయ తానంతయు నాయెను. అది కాల-కర్మ-స్వభావములతో నిమిత్త కారణములతో గూడియుండును. 

సృష్టి స్థితి సంహార కార్యము లొనర్చును. ఎంతటి వారికిని తెలువ సాధ్యముగానిది. మాయా మహాబలముగూర్చి యింతగ నబ్బురమొంద నేల? మే మెల్లరము మాయా శక్తికి మోహితులమై యున్నవారమే అని నా తండ్రి వచింపగ నేనచ్చెరువందక నా తండ్రి యనుమతినొంది పుణ్యతీర్థములు దర్శించుచు నిచటి కేతెంచితిని. 

కనుక వ్యాసా! నీవును కౌరవ నాశనము గల్గిన శోకము విడనాడి యిచ్చట నిశ్చింతగా కాలము గడుపుము.

జీవుడు తాను జేసికొన్న మంచిచెడ్డలను తప్పక అనుభవించి తీరవలయునని మదిలో నిశ్చయించుకొని స్వేచ్ఛగ తిరుగుము. 

రాజా! ఈ ప్రకారముగ నారదుడు పలికి నాకు కనువిప్పు గలిగించెను. పిమ్మట నేను నారద వచనములు నెమ్మది తలపోయుచుంటిని. అపుడు నా బ్రదుకు క్రొత్త మలుపును తిరిగెను. అంత నేను సారస్వత కల్పమునం దీ సరస్వతీ తీరమందున వసించి ప్రొద్దుపోవుట కీ శ్రీదేవీ భాగవతము రచించితిని. 

రాజా! ఈ మహాదేవీ పురాణము సర్వసంశయములు పాపును. అత్యుత్తమము. పెక్కుపాఖ్యానముల కూడలి. వేద ప్రామాణ్యము నాశ్రయించినది. 

నృపవర్యా! దీనిని గూర్చి నీకు సందియ మావంతయు వలదు. ఒక గారడివాడొక కట్టెబొమ్మను తనచేత నుంచుకొనును. అది యతనికి వశమగును. అతడు దానిని తన యిచ్చ వచ్చిన రీతి నాడించును. అదే విధముగ మహామాయ యీ చరాచర జగముల నాటాడించును. ప్రతి ప్రాణికి పంచేంద్రియములు-మనస్సు-చిత్తమునుండును. 

కనుక బ్రహ్మాదిస్తంబమువఱకు గల దేవ-దనుజ-మనుజులను మాయాశక్తి యాడించును. ఈ యంతటి కన్నివిధముల మాయా త్రిగుణములే కారణములు. కారణము లేక కార్య మెప్పుడును గలుగదనుట నిజము గదా! జీవుల స్వభావములు భిన్న భిన్నములుగ నుండును. 

కనుక జీవుల పుట్టుకలు మాయాత్రిగుణముల బలమువలన గలుగును. గుణముల కారణమున నొకడు శాంతుడుగ నొక్కడు ఘోరుడుగ మఱొక్కడు మూఢుడుగ బుట్టును. ఈ ప్రపంచమునందు గుణముల మేళనమున బుట్టిన నరుడు గుణరహితు డెట్లు గాగలడు? దారములు లేక వస్త్రము లేదుగదా! 

అట్లే త్రిగుణములు లేనిచో సంసారియు లేడనుట నిక్కము. మట్టిలేక కుండలేదు. అటులే గుణములు లేక ప్రాణి లేడు. బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులు మువ్వురును త్రిగుణబద్ధులే.

వీరు ఆయా గుణములవలన నొకప్పుడు శాంతులుగ వేరొకప్పు డుగ్రులుగ నింకొకప్పుడు విషాదభరితులుగ నుందురు. బ్రహ్మ సత్వగుణములతో తేజరిల్లునపుడు శాంతుడు జ్ఞాని సమాధియుతుడు సర్వభూత ప్రీతిసహితుడునై వర్తించును. 

సత్త్వము గోలుపోయినప్పుడతడు రజోగుణమున రాగిల్లి ఘోర తీవ్రరూపముతో దయమాలి యుండును. అతడు తమోగుణముతో గ్రుడ్డియైనపుడు పలువిధములగు విషాదములతో మూఢుడగును. ఇది యథార్థము. 

విశ్వాధారుడగు మాధవు డెల్లవేళల సత్త్వప్రకాశము నాశ్రయించి యుంటవలన నిత్యశాంతుడు నిత్యప్రియుడు నిత్యజ్ఞానియై విరాజిల్లును. లక్ష్మీకాంతుడు రజోగుణ పరాధీనుడైనపుడెల్ల భూతములందు దయమాలి ఘోరరూపమున వర్తిల్లును. పరమశివుడును సత్త్వసంపన్నుడై నపుడు శాంతి ప్రియములు గురియును. 

ఆ శివుడే రజోరంజితుడై కరుణమాలి ఘోరరూపమున నుగ్రుడగును. శివుడు తమోగుణమయుడై నపుడు విషాదమున మూఢత నందును. ఈ విధముగ బ్రహ్మ - విష్ణు - మహేశులను గుణబద్ధులగుదురు. 

ఇక సూర్యచంద్రవంశజులు యుగయుగమందలి చతుర్దశమన్వాదుల విషయము చెప్పనేల? ప్రపంచమందు వీరుగా కితరుల విషయ మింక చెప్ప బనిలేదు. ఈ విశ్వవిశ్వమంతయును దేవ - దానవ - నర - ప్రాణులతో నిండి నిబిడమై మాయాధీనమై ఎసంగును. 

ఇంక మాయను గుఱించి సంశయింప బనిలేదు. ప్రతి జీవుడు మాయకు వశుడై భ్రాంతుడై తత్పరుడై వ్యవహరించును. మాయ సచ్చిదానందలహరియగు పరతత్వమునకు వశ##మై తదధీనమై ప్రేరితయై యెల్లజీవులందు బాయకుండును.

కనుక జ్ఞాన ప్రకాశము గోరువాడు మాయేశ్వరి పరమేశ్వరి అఖిలేశ్వరి మాయావిశిష్ట సచ్చిదానందమయియగు భగవతిని గొలువవలయును. శ్రీదేవిని ధ్యానించవలయును. శ్రీమాత నారాధింపవలయును. శ్రీమహారాజ్ఞికి మోకరిల్లవలయును. శ్రీరాజరాజేశ్వరిని జపించవలయును. 

దాని ఫలితముగ దయామతల్లియగు లోకాలనేలు తల్లి ప్రసన్నురాలయి దయతో జీవులను బంధముక్తులుగ జేయును. జగదంబ తన దివ్యానుభూతిని తన భక్తులకు గలిగించును. జీవకోటిని మాయనుండి దాటించును. ఈ భువనములన్నియు మాయామయములు. జగదీశ్వరి భువనైక నాయిక. 

అందువలననే త్రైలోక్య సుందరియగు దేవి త్రిభువనేశ్వరీ నామమున వన్నె గాంచినది. రాజా! ఆ చిద్రూపిణియందు చిత్తము నిలుపవలయును. అట్టి వానిని సదసద్రూప యగు మాయ యేమియు కదలింపజాలదు. కనుక మాయను దాటి దాటించుట కితర దేవతలు సమర్థులుగారు. దానికి కేవలము సచ్చిదానందమయియగు శ్రీమాతయే సమర్థురాలు. పెంజీకటిని జీకట్లు పోగొట్టజాలవు గదా! 

కాని సూర్యచంద్రాగ్నుల కాంతులును మెఱపుకాంతులును చీకట్లను పాపగలవు. కనుక శ్రీదేవి స్వయంప్రకాశస్వరూపిణి - మాయాధీశ్వరి - సంవిద్రూపిణి - జగదంబ. మాయాగుణములు తొలగుటకు పరమప్రీతితో దేవి నారాధింపవలయును. 

ఈ ప్రకారముగ నీకు వృత్రాసురవధ మున్నగు ఆఖ్యానములు చక్కగ విరవించితిని. రాజా! ఇంక నీ వే విషయము వినదలతువో తెలుపుము. ఓ సత్యవ్రతా! నీకింతవరకును శ్రీకరంబగు శ్రీదేవీ భాగవతమునందలి పూర్వార్ధము వివరించితిని. ఇందు పరదేవి మాహాత్మ్యము విపులముగ తేనెలొలుకునట్లు వర్ణింపబడినది. 

శ్రీమాతృదేవీరహస్యము ప్రతివానికి చెప్పకూడదు. దీనిని దేవీభక్తుడు-జ్యేష్ఠపుత్రుడు-గురుభక్తిగల శిష్యుడునగు వారికి తెలుపవచ్చును. ఇది సకల కథలకు సారభూతమగు పురాణము. సమస్త వేదములతో సమానము. సముచితములగు ప్రమాణములతో సమకూర్చబడినది. ఈ లోకమున ఎవడు దీనిని పరమభక్తి భావమున వినునో చదువునో అతడీ లోకమున ధనవంతుడును జ్ఞానవంతుడును నగును.

శ్రీ దేవీ భాగవత పూర్వార్ధము సమాప్తము

No comments:

Post a Comment

Kings of the Surya Dynasty - Sukanya Vritthanamu - సూర్య వంశ రాజులు - సుకన్యా వృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము -  సూర్య వంశ రాజులు - సుకన్యా వృత్తాంతము జనమేజయు డిట్లనెను : ఓ మహానుభావా ! సూర్యవంశమునందు బుట్టిన ధర్మజ్ఞులగ...