Friday, April 17, 2026

Chapter 151 Mayagunamula Vivarana - అధ్యాయము 151 మాయాగుణముల వివరణ

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము - అధ్యాయము 151

మాయాగుణముల వివరణ 

నారదుడిట్లనెను : మునీశా! ఆ తర్వాత తాలధ్వజరాజు నన్ను నారదునిగ నెఱింగి తన భార్య యెక్కడి కేగెనో! ఇదేమి వింత యని యబ్బురమందెను. 

రాజిట్లు వాపోవసాగెను : హా నా ప్రియా! నీ విరహాగ్నిలో కుములుచున్నాను. నన్ను విడనాడి నీవెక్కడి కేగితివి? హా విపులశ్రోణీ! హా కమలాక్షీ! హా శుచిస్మితా! నీవులేని నా బ్రదుకు వ్యర్థము. అంధకారమయము. నే నింకేమి చేతును? నీ వియోగ భారమున నా ప్రాణములు సైతము వెళ్ళిపోవు. 

నీవులేని బ్రదుకు బ్రదుకుగాదు. ప్రయోజనము లేదు. నా ప్రేమమున ధర్మము నష్టమైనటులే సుమా! హా విశాలాక్షీ! నీకై యింతగ రోదిల్లుచున్నాను. ప్రియముగ నాతో మాఱుపలుకవేమి? ఆ నాటి మన హృదయాల ప్రేమగీతి యేమయ్యెను? హా సుందరీ! నీవు నీట మునిగిపోతివో? నిన్ను చేపలు తాబేళ్ళు మ్రింగెనో? కాక నా దౌర్భాగ్యముకొలది వరుణుడు నిన్ను లేవనెత్తుకొని పోయెనో? హా! 

అమృత భాషిణీ! హా సుందరీ! నీకు పుత్రుల యెడల గల వాత్సల్యముబట్టి నీవును వారివెంట నరిగితివో? నీవెంత ధన్యురాలవు! నీవు పుత్రవాత్సల్యమునకు బద్ధురాలవు. నేను నీ పతిని - విలపించుచున్నాను. నన్ను వదలి దివికేగుట నీకు తగదు. హా ప్రియా! నేనిపుడు రెండందాల నష్టపోతిని. నా పుత్రులు పోయిరి - నా ప్రాణవల్లభవు నీవును పోతివి. ఐనను దుఃఖితుడనగు నాకు చావు రాకున్నదేమి? 

రఘునందనుడగు శ్రీరామునకు స్త్రీ వియోగదుఃఖములోని బాధ తెలియును. ఆ రాముడిప్పుడు లేడే! నేనింకెక్కడి కేగుదును? ఎవరితో చెప్పుకొందును? మనమీడు జోడు భావాలుగల దంపతులము. ఐనను నీ మరణము భిన్నవిధముగ జరిగినదే! 

క్రూరవిధి మనకెంతటి విపరీత మొనర్చెనుగదా! భార్య పతితో సహ గమనము చేయవచ్చునని మునులు ధర్మశాస్త్రములందు చెప్పి స్త్రీలకుపకారము చేసిరి. కాని, పురుషుడు స్త్రీతో సహగమించుట చెప్పలేదేమి? అని రాజు దురపిల్లుచుండగా భాగవానుడగు హరి యుక్తి యుక్తములగు వచనములతో నతని నిట్టు లోదార్చెను:

రాజా! ఏల యేడ్చెదవు? నీ ప్రియురాలెక్కడికి పోయెను? నీవు పెద్దల సాంగత్యము చేయలేదా? శాస్త్రములయిన వినలేదా! ఆమె యెవతె? నీవెవరు? మీ యీ సంయోగము లెటువంటివి? సాగరమున నావలో ప్రయాణించు జనులు కలసి విడిపోదురు. అటులే యీ కపట సంసారమున ప్రాణులు పాయుచు గూడుచుందురు. 

రాజా! ఇక నీ యేడుపు చాలించి నీ యింటి మొగము పట్టుము. ప్రాణుల సంయోగ వియోగములు దైవాధీనములు. నాకామెతో సంయోగ మిచ్చటనే జరిగినది. మరల నా విశాలాక్షియగు సుందరిని నీవిచటనే పోగొట్టుకొంటివి. ఆమె తలిదండ్రు లెవరో నీకు తెలియదు! ఆమె నీకు కాకతాళీయముగ కొలనిలో లభించినది. ఆమె యెట్లు వచ్చెనో యట్లు అదృశ్యమయ్యెను. 

రాజేంద్రా! శోకింపకుము. కాలము దాటరానిది. ఇంక నింటికేగి వెనుకటి వలె కాలయోగమున భోగములనుభవింపుము. ఆ వరవర్ణిని యెట్లు వచ్చెనో యట్లే వెళ్ళిపోయెను. నీవిక తొంటివలె నీ రాచకార్యములు చక్కబెట్టుము. నీ వెంత యేడ్చినను నీ భార్య తిరిగి రాదుగదా! ఇంకూరక యేడ్వనేల? 

ఇపుడు యోగ మవలంబింపుము. ఈ భోగభాగ్యములు కాలవశమున గలిగి తిరిగి వెళ్ళిపోవును. ఈ సంసార మార్గము నిష్ఫలమైనది. శోకముడుగుము. ఒకేచోట సుఖముల కలయికగాని దుఃఖముల కలయికగాని జరుగదు. ఈ సుఖదుఃఖములు నీరుతోడు యంత్రమువంటివి. అని నిత్యము పరిభ్రమించు చుండును. 

ఇక శ్రద్ధగ చక్కగ నీ రాజ్యమేలుకొనుము. లేదా, నీ రాజ్యము దాయాదుల కొప్పగించి యిపుడే వనముల కేగుము. ఈ మానవ జన్మము కడు దుర్లభమైనది. ఎల్లరికి క్షణభంగురమైనది. మనుజుడై పుట్టిన ప్రతివాడు తప్పక ఆత్మ విచారము చేసి తీరవలయును. పశువులకు సైతము జిహ్వోపస్థల చాపల్యముండి తీరును. 

ఆత్మజ్ఞాన మొక్క మానవులలోనే వెలుగొందును. నీచ జన్మలకది దుర్లభము. కనుక కాంత మూలమున గల్గిన శోకము బాయము. ఇంటికేగుము. ఇదంతయు శ్రీభగవతీ దేవి మాయా విలాసమే. ఈ జగమంతయును మాయాశక్తిచేత సమ్మోహితమై మాయగ నుండును.

ఇట్లు హరి యనునయింపగ రాజు విష్ణునకు ప్రణమిల్లి స్నాన మొనరించి నిజమందిరమున కేగెను. అతడు తన మనుమలకు రాజ్యభార మప్పగించి తీవ్ర వైరాగ్యముతో వనములకేగి తత్త్వజ్ఞాన మొందెను. ఆ తర్వాత అధోక్షజుడగు జగన్నాథుడు మాటిమాటికి ముసిముసి నగవులు నగుచుండగ నే నతనితో నిట్లంటివి : 

నీవు నన్ను వంచించితివి. మాయాబలము చాల శక్తిమంతమైనదని నా కిపుడర్థమైనది. నేను స్త్రీగ నున్నప్పుడు చేసిన పనులన్నియు నాకొక్కొక్కటిగ నిపుడు జ్ఞప్తికి వచ్చుచున్నవి. నే నా సరోవరమునందు మునిగి స్నానమాడిన పిమ్మట నా పూర్వజ్ఞాన మేల నశించెనో తెలుపుము. 

జగద్గురూ! నేను స్త్రీ రూపము దాల్చి శచి యింద్రుని బడసినట్లు భర్తను బడసి మోహసముద్రమున మునిగితిని. నా మనస్సు చిత్తము దేహము లక్షణమున వెనుకటివే కదా! మఱి నాకు పూర్వస్మృతి యేల లోపించెను? రమకాంతా! నాకు పూర్వజ్ఞానము లేకపోవుట వింతగ నున్నది. దాని కారణమేమో నాకు తెలుపుము. నే నాడుదాననై పెక్కు భోగము లనుభవించితిని. 

నిత్యము మద్యము సేవించితిని. నిత్యానుష్ఠానము లేకయె తినరాని కూడు తింటిని. ఇపుడప్పటి వన్నియు దెలిసినవి. అపుడు నేను నారదుడనని స్పష్టముగ తెలియకపోయెను. అన 

విప్రుడి విట్లనెను : నారదా! మహామతీ! చూడుము. ఇదంతయును మాయా శక్తి లీలావిలాసము సుమా! ఎల్లప్రాణుల దేహములందలి దశలు పెక్కురీతుల సాగుచుండును. ఎల్లజీవుల కీదేహమునందు జాగ్రత్త - స్వప్నము - నిద్ర - తురీయమను నాల్గు దశలు గల్గుచుండును అట్లే యివి మఱొక దేహమందును గల్గుచుండును. 

ఇది నిస్సంశయము. నిదురించిన ప్రాణి యేమియు నెరుగడు - వినడు - పలుకడు. మేలుకొనిన పిమ్మట నెల్లవిషయములు తెలిసికొనగలడు. నిద్రలో చిత్తము చలించును. కలలో మనస్సులో పెక్కు రీతుల పెక్కు భావములు గల్గును. 

కలలో నేనుగును జూచి ఇది నన్ను చంపవచ్చుచున్నది. నేను పరుగెత్తలేకున్నాను. ఏమి చేతును? ఇపు డెట కేగుదు' నను తలపులు గల్గును.

ఎప్పుడో చనిపోయిన తన తాత తన యింటికి వచ్చినట్లు నతనినిగాంచి మాటాడి యతని సరసను భోజనము చేసి నట్లును కల రావచ్చును. మేలు కాంచినవాడు తన కలలో గాంచిన సుఖదుఃఖము లెఱుగగలడు. అతడు కలలోనివన్ని తలంచి జనులకు విప్పి చెప్పగలడు. కల గనుచున్నవాడు దానిని భ్రమగ దలంపడు. 

అటులే యీ మాయాసంసారము మాయా సంపదయంతయు నొక కల. భ్రమ మాత్రమే. దాటరానిది. 

ఓ నారదా! ఈ మాయాగుణములు దుర్గములు. బ్రహ్మగాని నేను గాని శివుడుగాని మాయా ప్రభవ మెఱుగజాలము. ఇంక మందమతియగువాడు మాయ నెట్లెఱుగ గలడు? ఈ మాయా స్వభావ మెంతటివానికిని తెలియబడదు. ఈ చరాచర ప్రపంచమంతయును త్రిగుణములు లేనిచో మాయా సంసారమే లేదు. 

నామటుకు నేను సత్వగుణప్రధానుడను గదా! ఐనను నాలో నప్పుడప్పుడు రజస్తమస్సులు వెఱ్ఱి తలలెత్తును. నేను త్రిగుణములను మించిన భువనేశ్వరుడ నెన్నడు గాజాలకపోతిని. నీ తండ్రియు నటులే రజోగుణప్రధానుడు. ఐనను సత్వతమస్సులతని యందును గలవు. అత డీ మూటిని దాటిన వాడు మాత్రముకాడు. 

అట్లే శివుడు తమః ప్రధానుడు. ఐన నతనిలోను సత్వరజస్సులు నిండుగ నున్నవి. కనుక గుణత్రయములులేని పురుషోత్తము డెవ్వడును లేడు. 

కనుక దేవర్షీ! ఈ సంసారము వట్టి మాయా నిర్మితము-సారహీనము-అపారము-దుస్తరము-మోహజనకము-దీనిలో దేనియందును మోహ మెట్టివానికిని తగదు సుమా! 

మహాత్మా! ఆ మాయ మెట్టిదో నీవిపుడే చవిచూచితివి గదా! పెక్కు భోగముల లనుభవించితివి గదా! ఇక మహా మాయాదేవి యొక్క విచిత్ర చరిత్ర నన్నేల యడిగెదవు?

ఇది శ్రీదేవి భాగవతమందలి షష్ఠస్కంధమందు నారదుడు మాయామోహితుడగుటయను ముప్పదవ యధ్యాయము.

No comments:

Post a Comment

Kings of the Surya Dynasty - Sukanya Vritthanamu - సూర్య వంశ రాజులు - సుకన్యా వృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము -  సూర్య వంశ రాజులు - సుకన్యా వృత్తాంతము జనమేజయు డిట్లనెను : ఓ మహానుభావా ! సూర్యవంశమునందు బుట్టిన ధర్మజ్ఞులగ...