Wednesday, April 22, 2026

Harihara's pride is broken - హరిహరులకు గర్వభంగం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - హరిహరులకు గర్వభంగం

జనమేజయ డిట్లనెను: పూర్వము శ్రీపరాంబిక గౌరీ-లక్ష్మీ-సరస్వతులను వరుసగ శివ-విష్ణు- బ్రహ్మలను త్రిమూర్తుల కొసంగెను. మఱి దక్షునకు-హిమవంతునకు గల్గిన కన్య గౌరి యెవరు? మఱి పాలసంద్రము కూతురు మహాలక్ష్మి యందురు గదా! గౌరీలక్ష్మలకు మఱల కన్యాత్వ మెట్లు గల్గెను. 

ఓ మునీశా! ఇదంతయు నసంభవమని నాకు దోచుచున్నది. ఇందు సందియమును గల్గుచున్నది. నీ జ్ఞానఖడ్గముతో నా యీ సందేహము బాపుము. 

వ్యాసు డిట్లనెను : రాజా! శ్రీదేవీ భక్తుడవగు నీకు చెప్పరాని దొక్కటియు నుండదు. నీ వడిగిన పరమాద్బుత రహస్యము వెల్లడింతును. అవధరింపుము. శ్రీపరాంబిక పూర్వము దేవీత్రయమును త్రిమూర్తుల కొసంగెను. ఆనాటినుండి త్రిమూర్తులు తమతమ సృష్టి కార్యములు సాగించిరి. 

రాజా! మునుపు హాలాహలులను దైత్యులు మహావిక్రములు. వారొకప్పుడు క్షణములో ముల్లోకములు గెలిచిరి. వారు బ్రహ్మవరమున బలిసి కైలాస వైకుఠములపై దండెత్తిరి. వారితో హరిహరులును యుద్ధమునకు సిద్ధపడిరి. అట్లు వారికి ఘోరముగ నారు వేలేండ్లు సమరము జరిగెను. 

అపుడు దేవదానవ సేనలలో హాహాకారములు మిన్ను ముట్టెను. హరిహరులచేత నెందఱందఱో రక్కసు లుక్కడంగిరి. అంత హరిహరులు తమ తమ నెలవుల కరిగి తమ తమ భార్యల యెదుట తమ వలననే రక్కసులు మడిసిరని గొప్పలు చెప్పుకొనిరి. వారి స్వాహిమానమునకు లక్ష్మీగౌరులు కపటముగ నవ్విరి. హరిహరులు వారి నవ్వు చూచిరి.

వారాది మాయాశక్తికి మోహితులై వారిపై మిక్కిలిగ కోపము జెందిరి. వారు వారి కవమానము గల్గునట్లుగ నోటికి వచ్చునట్లు మాటలాడిరి. ఆ క్షణముననే లక్ష్మీగౌరు లందర్ధానము జెందిరి. అపుడు పెద్దగ కలకలము బయము దేరెను. లక్ష్మీగౌరుల నవమానించుటవలన హరిహరులు తేజము-శక్తి-చేతనము-గోల్పోయి చపలచిత్తులైరి. 

అంత బ్రహ్మ యిట్లు చింతించెను: ఏమి ఈ వింత! దేవతలలో ప్రముఖులు హరిహరులు గదా! నేడు వారు కార్యదక్షులు గాకుండి రేల? ఈ కాలముగాని కాలమునందేమి ఈ వైపరీత్యము. ఏ పాప మెఱుగని యీ జగమునకు ప్రళయము ముంచుకొని రాలేదు గదా! దీని కారణమో తెలియక ప్రతి క్రియ యెట్లు జరుపగలను? అని యీ రీతిగ చింతించి బ్రహ్మ కనులు మొగిడ్చెను. 

అపుడా పరాశక్తి కోపముననే యంతయును జరిగినదని యెఱిగి బ్రహ్మ సావధానుడయ్యెను. అపుడు తపోనిధియగు బ్రహ్మ తన సుతులగు మున్వాదులను సనకాదుల నాహ్వానించెను. వారు వచ్చి నమస్కరింపగ 

బ్రహ్మ వారి కిట్లనెను: నే నిపుడొక పనిలో మునిగియున్నాను. నేను తపము చేయజాలను. హరిహరులు శ్రీపరాశక్తి కోపమునకు గురియై శక్తిహీనులైరి. ఆమె సంతోషించుట కీ జగద్బారమంతయు నేనే వహింపగలను. కనుక మీరలైకాంతిక భక్తితో నత్యద్బుతమైన తప మాచరించి పరాంబికను సంతోషపెట్టుడు. 

ఓ నా పుత్రులారా! హరిహరులు తిరిగి శక్తియుక్తు లగునటుల చేయుడు. మీ కీరితి వర్ధిల్లు గాత. ఆ యిర్వురు మహాశక్తులెవని యింట నుద్బవింతురో యా వంశలో లోకముల నెల్ల పవిత్ర మెనర్చును. ఆ కన్న వారును ధన్యజీవు లగుదురు. అను బ్రహ్మ వాక్కులు విని దక్షాదు లెల్లరును నిర్మలమనస్కులై శ్రీజగదంబ నారాధింపగోరి వనముల కేగిరి.

అటుపిమ్మట వారలెల్లరును హిమాలయముల వనములకేగి శ్రీమాయాబీజజప పరాయణులై నిశ్చలముగ తపమారంభించిరి. రాజా! వారొక లక్షయేండ్లు పరాశక్తిని ధ్యానించిన పిమ్మట శ్రీదేవి ప్రసన్నయై వారికి దర్శనభాగ్యమొసంగెను. ఆ సచ్చిదానంద స్వరూపిణి యగు త్రిలోచన దయారసముపూర్తిగ వెల్లివిరియగ తన నాలుగు చేతులందు పాశము-అంకుశము-వరాభయముద్రలు దాల్చెను. ఆ యెల్లలోకాలు పరిపాలించు జననినిగని నిర్మలమనస్సులు గలమును లిటుల దేనిని సన్నుతించిరి! 

ఓ వైశ్వానర స్వరూపిణి! ఓ విశ్వరూపిణి! నీకు మా ప్రణామములు. ఏ చిద్రూపిణియం దెల్ల లింగదేహములు నిండియుండునో యా సూత్రాత్మ స్వరూపిణికి జలరూపిణికి మా ప్రణమములు. ఎల్ల దేహములందునిండియున్న యవ్యా కృతరూపిణి- ప్రాజ్ఞస్వరూపిణి- ప్రత్యక్స్వరూపిణి-యగు బ్రహ్మమూర్తికి మా ప్రణమములు. సర్వస్వరూపిణి-సర్వలక్ష్య స్వరూపిణ-యగు జగదంబికకు మాప్రణమములు. ఆ తల్లిని మధుర భక్తితో సన్ను తింతుము. 

అని దక్షాదులు ములు నిర్మలచిత్తులు దేవి చరణకమలములకు ప్రణమిల్లిరి. పిదక పికభాషణియగు శ్రీదేవి సుప్రసన్నయై వారి కిట్లనెను: ఓ మహాత్ములారా! నేను వరదాయినిని. ఏదేని వరము గోరుకొనుడు. అను దేవి మాటలు విని వారు హరిహరులకు మేలు గల్గవలయునని కోరిరి. హరిహరులు మరల తమ తమ శక్తులను గలియవలయునని వారు గోరిరి. 

అపుడు దక్షుడు ప్రత్యేకముగ నిట్లనెను: నా వంశమున నీవు జన్మింపుము తల్లీ. అంబ! నీవు నా యింట జన్మించుము. నేను కృతకృత్యుడను గాగలను. నిన్ను గూర్చి జపము-ధ్యానము పూజలు నీ వివిధ నివాసస్థానములు తెల్పుము. ఓ పమమేశానీ! వీని నన్నిటిని నీ ముఖము నుండి వెల్లడించుము. 

దేవి యిట్లనెను: నా శక్తుల నవమానించుటవలననే హరిహరుల కా దురవస్థ వాటిల్లెను. అట్టి యపరాథ మిక ముందెన్నడు నెవ్వరును చేయరాదు. ఇపుడు నా దయాలేశమున వారి శరీరము కారోగ్యము చేకూరగలదు.

ఆ యిర్వురు శక్తలలో నొకతె నీ యింట మఱియెకతె క్షీరసాగరమున జన్మింపగలరు. హరిహరులు నాప్రేరణ వలన తిరిగి వారిని బడయగలరు. నా ముఖ్యమంత్రము శ్రీమాయాబీజము. అది నాకత్యంతము ప్రియకరమైనది. 

కనుక నా విరాట్స్వరూపమునగాని యీ త్రిభువనేశ్వరీ స్వరూపముగాని ధ్యానించవలయును. లేక సకల జగముల నిండిన నా సచ్చిదానంద స్వరూపమునైన ధ్యానింపవలయును. మీరు సతతము నన్ను పూజించి ధ్యానింపుడు. ఈ ప్రకారముగ పలికి మణిద్వీపాధివాసినియగు దేవి యంతర్దాన మొందెను పిమ్మట దక్షాదిమునులు మరల బ్రహ్మను చేరిరి. వారు జరిగిన వృత్తాంతమంతయును బ్రహ్మకు నివేదించిరి. 

హరిహరు లంతట స్వస్థులై తమ తమ కార్యములు తామే నిర్వహింప గలిగిరి. ఆనాటినుండి హరిహరులు పరాంబ దయవలన గర్వము మాని శాంతితో నుండిరి. ఒకానొక సమయన పరాశక్తి యవతరించెను. మహారాజా! దేవి దక్షునింట నవతరించెను. అపుడు ముల్లోకము లుత్సవములు జరుపుకొనెను. 

అమరులు ప్రమోదభరితులై పూలసోనలు కురిసిరి. రాజా! స్వర్గధామమున సురలు తమ చేతులందలి కోణములను సాధనములచేత దేవదుందుభులు మ్రోగించిరి. సాధుసజ్జనులు మనస్సులు నిర్మల ప్రసన్నములయ్యెను. నదు లువ్వెత్తుగ ప్రవహించెను. సూర్యుడు మేలు వెల్గులు విరజిమ్మెను. సర్వమంగళ యవతరింపగ నెల్లెడల మంగళ సర్వస్వ మొప్పారెను. 

ఆ పుట్టినట్టి బాల సత్యస్వరూపిణియే యగుటవలన సత్యజ్ఞానులామెను సతి యనిరి.ఆదక్షుని కూతురు మరల శివునకే యీయబడెను. ఆ దాక్షాయణి దక్షునపరాధమునకు దైవయోగమున నగ్నిలో దుమికెను. 

జనమేజయు డిట్లనెను: ఓ మునివరా! ఎంతటి యనర్థ కరమైనమాట వినిపించితివే! ఏ త్రిభువనేశ్వరి నామము స్మరించినంత మాత్ర నెల్లవారి సంసారాగ్ని భయము తొలగిపోవునో యట్టి మహాదేవి యేల నగ్నిలో దగ్దమయ్యెను. దక్షు డేమి యపరాధము చేసెనని యామె యగ్ని కాహుతి యయ్యెను? 

వ్యాసు డిట్లనెను: రాజా! సతీదేవి దగ్దయగుటకుగల కారణము వెల్లడింతు నవధరింపుము.

దక్షుడు చేసిన అపరాధం

No comments:

Post a Comment

Devatakrta Devistuti - దేవతాకృత దేవీస్తుతి

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవతాకృత దేవీస్తుతి ఆ దయామతల్లిని దర్శించి దేవత లెల్లరును నమస్కరించిరి. వారికనులనిండ నందబాష్ఫములు నిండగ నోట...