Monday, April 20, 2026

Katikapariga Harishchandrudu - కాటికాపరిగా హరిశ్చంద్రుడు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - కాటికాపరిగా హరిశ్చంద్రుడు

రాజు చండాలు నింటి కేగిన పిమ్మట యేమి చేసెను? ఓ సూతవర్యా! అదంతయును నిన్నడుగుచున్నాను. సత్వర ముగ నాకు దెల్పుము అని శౌకనుడడగు 

సూతు డిట్లనెను: చండాలునినుండి ధనముగొని విశ్వామిత్రుడు వెళ్ళిపోయెను. చండాలుడు సంతోషముతో నరపతిని బంధించెను. అసత్యమేల పల్కితివని యతడు రాజును కట్టెతో గొట్టెను. కట్టె దెబ్బలకు రాజు బాధపడి కలత జెందిన మనస్సుగలవాడయ్యెను. తన యిష్ట బంధుల వియోగమునకు కుందుచున్న రాజును చండాలుడు తన యింటికి తెచ్చి యతనిని గొలుసుల చేత కట్టి నిశ్చింతగ నిద్రించెను. 

చండాలు నింట రాజు సంకెళ్ళలో బద్ధుడై యన్న పానములు వదలి యీ రీతిగ చింతింపసాగెను. ఇపుడు నా భార్య దీనయై తన ముందు దీన వదనుడై యున్న బాలునిగాంచి నేను వచ్చి తమ్ము తప్పక కాపాడుదునని యిటుల నన్నామె స్మరించుచుండును. 

'నా పతి ధనము సంపాదించి తన మాట ప్రకారము మునికి ధనమిచ్చి వచ్చి యేడ్చుచున్న కొడుకును గని నాకు జాగృతి గల్గించగలదు. నేను నాయన దగ్గఱకే పోయెద. ఓ నాయనా! నామనా! యని కన్నీరు గార్చుచున్న చిన్నారి బాలుని నా పతి వచ్చి యోదార్చగలడు. నేను నా మంత్రులను విడిచి భార్యా పుత్రుల నమ్ముకొని రాజ్యము గోల్పోయి చండాలత్వమందుట నా భార్యకు తెలియదా: అక్కటా : ఏమి యీ చండాలత్వబాధ! అయ్యో! కష్టాల మీద కష్టాలు దాపురించెనే!' అని రాజు అనుదినము తన భార్యాపుత్రులను దలంచును. 

అట్లు రాజు విధి పీడితుడై సంకెళ్లలో నాల్గు నాళ్ళునుండి అయిదవనాడు సంకెలల బాధ నుండి ముక్తుడయ్యెను.

పిదప చండాలుడు కోపముతో మాటిమాటికి పరుషముగ రాజును బెదిరించుచు శవములపై గప్పిన వస్త్రములు లాగుటకు రాజు నాజ్ఞపించెను. ఈ కాశికి దక్షిణమున గొప్ప శ్మశాన భూమి గలదు. అందు మనకు న్యాయముగ వచ్చునది తీసికొనుము. ఎంత మాత్రము వదలకుము. ఈ ప్రాత దండమును తీసికొని శీఘ్రముగ వెళ్ళుము. ఇది వీరబాహుని దండమని యంతట ప్రకటించుము. 

సూతుడిట్లనెను: ఈ విధముగ హరిశ్చంద్ర మహారాజంతటి వాడొకనాడు చండాలునకు వశుడై శ్మశానమున శవ వస్త్రములు గ్రహించుటకు నియమింపబడెను. ఇట్లు శవ వస్త్రములు లాగుటకు చండాలునిచే నాదేశింపబడి రాజు వల్లకాటికి వెళ్ళెను. 

అది కాశీపురికి దక్షిణ భాగమున దుర్వాసనలతో చచ్చినవారి యొముకలతో పీనుగుల పెంటగ రోతగ నుండెను. అట నక్కలు - కుక్కలు - రాబందులు - గ్రద్దలు - గుంపులు గుంపులుగ గుమి గూడి మాంస విహారములతో ఘోరముగ నఱచుచుండెను. అటు క్రుళ్ళిన యొముకల ప్రోగులు దుర్గంధము నిండియుండెను. 

ఒక చోట సగము కాలిన శవములు నోళ్ళు తెఱచుకొని యుండెను. అవిఎల్లవారునిట్లే నిప్పు మంటలలో కావలసిన వారే యని పరిహసించు చున్నట్లుండెను. అట మృతుల బంధుల యేడ్పుల కోలాహల మితింతనరాదు. హా కొడుకా! హా మిత్రమా! అయ్యో నా బంధువా! ఓ సోదరా! ఓ బావా! హా మేనమామ! హా తాత! ఓమాతామహా! ఓ తండ్రీ! హా! మనుమడా! ఎక్కడకు పోతివి. మఱొక్కమాఱు రమ్ము. అను ప్రాణుల భెరవ శబ్దములు వ్యాపించియుండెను. 

చితుల మంట లందు శవముల మాంసము - మెదడు - మజ్జలు భూ భూ చిటపట చప్పుళ్ళు చేయుచు మహా భయంకరముగ నుండెను.

ఆశ్మశానము కల్పాంతమందువలె నుండెను. ఆ చోటికి రాజువెళ్ళి దుఃఖముతో పలురీతుల నిట్లు వలవల యేడ్చెను. ఓ నా మంత్రులారా! భృత్యులారా! మీరెచట నున్నారు నా కులోచితమైన రాజ్య మెక్కడ! హా! ప్రియురాలా! హా కుమారా! మందభాగ్యుడనగు నన్ను వదిలి వెళ్ళితిరా : 

మీరు మునిశాపమునకు గురియై యెంత దూరతీరాలనుంటిరో కదా! ధర్మ మాచరింపని మానవులకు లోకాన మేలు గలుగదు. కనుక పురుషు డెల్ల భంగుల ప్రయత్నించి ధర్మ మాచరింపవలయును. అనుచు తలంచునుంతలో రాజునకు చండాలుని మాటలు జ్ఞప్తికి వచ్చెను. 

రాజు పూచికపుల్లవలె సన్నని మేనితో మురికి పట్టిన తనువుతో పీనుగులను చూచుట కటునిటు పరుగెత్తెను. అంతలో రాజొక శవమునుగని దీనికి నూఱుముద్రల వెల పొందుదును. వీనిలో - నిది రాజునకు - ఇది చండాలునకు - ఇది నాకు. అని తనలో తానూహించుకొనుచు నొక చినిగిన చిల్లుబొంతను మీద కప్పుకొని తీరని దురవస్థ పాలయ్యెను. 

చితిబూడిద-ధూళి- రాజుయెక్క వేగమున చేతులపై - పొట్టపై - కాళ్ళపై నిండగ పెక్కు శవాల మేదస్సు - మజ్జ-వస-తన వ్రేళ్ళకంటుకొంటవలన రాజు పెక్కు శవాన్నములు తిని యాకలిమంట చల్లార్చుకొనుచు నెముకల దండలు మెడనిండ వ్రేలాడ వేసికొనుచుండెను. పగలుగాని రేతిరిగాని కంటికి కునుకైన పట్టనందున అయ్యో! అయ్యో-యని మొత్తుకొనుచు రాజు వందలయేండ్లు గడపినట్లు పండ్రెండు నెలలు గడపెను.

రోహితుడిమరణం

No comments:

Post a Comment

Katikapariga Harishchandrudu - కాటికాపరిగా హరిశ్చంద్రుడు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - కాటికాపరిగా హరిశ్చంద్రుడు రాజు చండాలు నింటి కేగిన పిమ్మట యేమి చేసెను? ఓ సూతవర్యా! అదంతయును నిన్నడుగుచున్నాన...