Sunday, April 19, 2026

Story of Viswamitra Svapachula - విశ్వామిత్ర - శ్వపచుల కథ

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - విశ్వామిత్ర - శ్వపచుల కథ

రాజిట్లనెను: రాజాజ్ఞవలన హరిశ్చంద్రుడు మంత్రులచే రాజుగ చేయబడెను. మరి త్రిశంకుడు చండాలదేహము నుండి యెట్లు ముక్తుడయ్యెను. అతడు నట్టడవిలో మరణించెనా? గంగలో కొట్టుకొనిపోయెనా? లేక గురుడు దయదలచి యతనిని శాపముక్తుని జేసెనా? ఈ త్రిశంకు వృత్తాంతమంతయును విన వేడుకగుచున్నది. నా కా రాజు చరిత్ర సమస్తము తేటపఱచుము. 

వ్యాసుడు ఇట్లనెను: తన కుమారు డభిషిక్తుడుగుటవిని త్రిశంకుడు ప్రమోదమొంది శ్రీశివకుటుంబినియగు శివదేవిని స్మరించుచు కాలము గడిపెను. ఇట్లు కొంతకాలము సాగిన పిమ్మట విశ్వామిత్రుడు నియమముతో తప మొనర్చిన పిదప తన భార్యను సుతులనుజూడ నేతెంచెను. 

విశ్వామిత్రుడుడేతెంచి సుఖముగనున్న తన వారిని చూచి ప్రమోదమొంది తనకు సేవ చేయదలచిన భార్యతో నిట్లనెను. 

సులోచనా! అప్పటి కరవుకాటకముల కాలమెట్లు గడిపితివి? అన్నములేక మలమలలాడు బాలుర నెవరు పోషించిరో తెల్పుము. 

సుందరీ! శోభనాంగీ! నేను ఘేరతపమున మునిగియుండుచే రాజాలకపోతిని. నీ యొద్దధనము లేదు గదా. అందులకు నీవేమి చేసితివి? అంతటి కరవుకాలము దాపురించినపుడు బీద వాడనగు నేను వచ్చి మాత్రము ఏమ వెలుగబైట్టుదునని తలచి రాలేదు. 

వామోరూ! నేను వనమందొకనాడాకలి మంటకు తాళలేక శ్వపచుడి(చండాలునింట) దొంగవలె ప్రవేశించితిని. చండాలుడు నిదురించుటగని యాకలి బాధ కోర్వజాలక వంటశాల లోని తినుబండారములు వెదకితిని. అపుడొక కుండలో వండి కుక్కమాంసము చూచి తినుటకు తీసుకొను నంతలో నింటి వాని కంటబడితిని. 

నీవెవరవు? ఈ నడిరేయి నాయింటి కేల వచ్చితివి? ఈకూటికుండ నేల తీసికొంటివి? నీ కేమి పని తెల్పుమని చండాలు డనెను.

సుకేశీ! చండాలుడట్లడుగగ నా కట నకనకలాడుచు డగ్గుత్తికతో తొట్రుపడు మాటలతో నేనతని కిట్లంటిని. 

మహాత్మా! నేను బ్రాహ్మణుడను. తాపసుడను. పేరాకట బాధపడువాడను. అందుచే దొంగవలె నన్నము కుండ వెదకుచున్నాను. 

మహామతీ ! నేను నీ యింటికి దొంగగ వచ్చిన యతిథిని. ఆకలిగొన్నవాడను. వండిన మాంసము దినుట కనుమతి యిమ్ము అంటిని. ఆ చండాలుడు నా మాటలు విని నిశ్చయించుకొని యిట్లనెను: 

''ఓ బ్రాహ్మణుడా! ఇది మాలయిల్లు, తనకుము. మానవ జన్మము దుర్లభమైనది. అందును ద్విజత్వము లభించుట కడు దుర్లభతరము. ద్విజత్వము నందుబ్రాహ్మణత్వము దుర్లభతమమని తెలియదా! 

ఉత్తమ లోకములు గోరుకొనువాడు నీచజాతుల వారి యన్న మెప్పుడును తినరాదని మనువు మున్నగువారు తెలిపిరి. 

విప్రా! నేను కర్మచే చండాలుడను. దూరముగ నుండదగినవాడను. అందువలన నిన్ను తినవద్దనుచున్నాను. కాని లోభమున గాదు.

ద్విజోత్తమా వర్ణసంకర దోషము నీకు గల్గరాదు. అనెను. 

నేను (విశ్వామిత్రుడు) ఇట్లంటిని: ధర్మజ్ఞా ! నీవు చండాలుడవైనను నీ బుద్ది నిర్మలమైనది. నీకు ధర్మ సూక్ష్మము చెప్పుచున్నాను వినుము. ఆపద్ధర్మ మొకటి గలదు. దాని వలన తప్పకాపదలందు దేహమును పోషించుకొనవచ్చును. 

పాపము చేసిన పిదప నివృత్తి కొఱకు ప్రాయశ్చిత్తముచేసి కొనవచ్చును. ఆపద లేనపుడు పాపము చేసిన దానివలన దుర్గతి గల్గును. 

ఆకలిచే చచ్చినవానికి నరకము గల్గును. ఇది నిజము. కనుక మేలు కోరుకొనువాడేదియో విధముగ నాకలి మంట చల్లార్చుకొనవలయును. 

కనుక చండాలుడా! నేను దొంగ వృత్తితో నా శరీరమును పోషించుకొనదలచితిని. వానలు లేనపుడు దొంగతనము చేయుట పాపమని పండితులందురు. మేఘము వానకురియనిచో నా దోషము మేఘునిదే. 

కాంతా! నేనిట్లు పలుకగనే వెంటనే మేఘము వర్షించెను. ఆకసము నుండి యేనుగు తొండము లావు ధారలతో వానపడెను. ఉఱుములు మెఱుపులు మొయిళ్ళు వాన-చూచినేనెంతయో ముదమొందితిని. 

అపుడు నేనా చండాలుని యిల్లు వదలి బయటికి వెళ్లితిని. వరారోహా! ఇంక నీవెట్లు కాలము గడిపితివో తెలుపుము. ఈ కరవు చాల ఘోరమైనది. ఈ వనము మలమల మాడినది. ప్రాణుల కాహారము దొరకుటలేదు. అను మాటలు విని యామె తన పతి కిట్లనియెను

త్రిశంకుడికి విశ్వామిత్రుని ప్రత్యుపకారం

No comments:

Post a Comment

Varuna Deva kind to Sunashshepa - శునశ్శేపుడికి వరుణకటాక్షం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - శునశ్శేపుడికి వరుణకటాక్షం వ్యాసుడిట్లనెను:  అట్లు దుఃఖార్తితో విలపించున్న శునఃశేపుని గని విశ్వామిత్రుడు దయా...