Thursday, April 16, 2026

Chapter 131 Karmagati - అధ్యాయము 131 కర్మగతి

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము - అధ్యాయము 131

కర్మగతి


జనమేజయు డిట్లనియె : ''ఓ మహనీయా! ఇంద్రు డద్భుత చరిత్రుడు. అతని స్థానభ్రంశము దుఃఖప్రాప్తి మరల నింద్రత్వమందుట వివరించి తెల్పితివి. అందు దేవాధిదేవియగు శ్రీమాతృదేవి మహిమము విపులముగ వెల్లడించితివి. కాని నాకొక్క సందేహము గల్గుచున్నది. అదేమన, ఇంద్రుడు మహాతపస్వి. అతడింద్రత్వమునకై నూరుయాగము లొనరించియు దేవాధిపత్యము బడసియును ఘోరక్లేశము లనుభవించెను. 

అతడు దేవేశత్వమందియును పదభ్రష్టుడెట్లు గావలసివచ్చెను? దయామయా! వీటి హేతువులన్నియును నాకు తెల్ల మొనరింపుము. నీవు బహుపురాణకర్తవు. మునిప్రవరుడవు. సర్వజ్ఞుడవు. మహాత్ములకు శ్రద్ధాళురగు శిష్యులకు చెప్పరానిదుండదు గదా! మహానుభావా! నా యీ సందేహము దీర్పుము.'' 

అని యిట్లు జనమేజయుడడిగిన ప్రశ్నములను వ్యాసుడు విని ప్రసన్నుడై యీ ప్రకారముగ క్రమముగ నతనికి చెప్పసాగెను. 

'నృపవరా! నీవడిగిన వానికద్భుతములగు హేతువులు గలవు. వానినన్నిటిని సమగ్రముగ నాలకింపుము. తత్త్వవిదులు కర్మము ముత్తెఱంగులుగ నుండునందురు. అవి సంచితము వర్తమానము ప్రారబ్ధమనబడును. ఈ కర్మగతి గహనమైనది. ఈ కర్మము మరల సాత్త్వికము రాజసము తామసమునని మూడువిధములుగ నలరును. పెక్కు పూర్వజన్మములలో జేసిని కర్మము సంచితమనబడును. 

కర్మము మంచిదైనను చెడుదైనను. నేనాటిదైనను జీవుడు తప్పక ఆ పుణ్యపాపముల ఫలము లనుభవించవలసినదే. ఇట్లు జన్మజన్మల సంచితకర్మఫలము శతకోటి కల్పములకైన జీవులనుభవింపక తప్పదు. ఇప్పుడిక్కడ చేయబడుచున్న పని వర్తమాన మనబరగును. దేహముదాల్చిన ప్రతి దేహియు నిచటి మంచిచెడ్డ లాచరించవలసినదేకదా! ఈ తనువు దాల్చునపుడు జీవుడు సంచితములోని కొంతభాగ మనుభవించుటకు ప్రేరింపబడును. దానిని ప్రారబ్ధమందురు.

ప్రారబ్ధమనుభవించిన గాని తీరదు. ప్రాణులీప్రారబ్ధకర్మము నిస్సంశయముగ ననుభవింతురు. ఇట్లు జీవులు తాము మునుపుజేసిన మంచిచెడ్డలను తప్పక యనుభవింపవలయును. ఈ కర్మమే సుర-అసుర-దేవ-గంధర్వ-కిన్నర-నర తనువుల దాల్చుటకు మూలకారణము. కర్మము నశించినచో ప్రాణికిక జన్మములేదు. బ్రహ్మ-విష్ణు-రుద్ర-ఇంద్రాది దేవతలును-దానవులు-యక్ష-గంధర్వులెల్లరును కర్మవశులే. 

ఇట్టి కర్మములేనిచో కర్మబంధ సంబంధ మెట్లు గల్గును? జీవులు సుఖదుఃఖము లనుభవించుట కిట్టి కర్మబంధము ముఖ్య హేతువు. సంచిత కర్మములు తొంటి పెక్కు జన్మములకు సంబంధించి యుండును. అందుండి కాలవశమున గల్గిన కర్మవేగము ప్రారబ్దమగును. దానినిబట్టి జీవుడు పుణ్యము లాచరించును. లేక యతడు పాపము లొనర్చును. 

ఈ పుణ్యపాపములు నరులెట్టు లాచరింతురో దేవతలు నట్టులే యాచరింతురు. తొల్లి ధర్మపుత్త్రులగు నరనారాయణు లుండిరి. వారు కర్మవశమున కృష్ణార్జునులుగ నవతరించిరి. వీరు నారాయణాంశజులని మునులు పురాణములందు కీర్తించిరి. అధిక విభుత్వముగల వానిని దేవాంశ సంభూతుడని యెఱుగుము. ఋషిగానివాడు కవి గాజాలడు. రుద్రుడు గానివాడు రుద్రునర్చింపజాలడు. దేవాంశసంభూతుడుకానివా డన్న దానము చేయజాలడు. విష్ణునంశలేనివాడు రాజుగాలేడు. 

రాజా ! ఈ దేహమింద్ర - అగ్ని - యమ - విష్ణు - కుబేరుల వలన గలిగెను. ఈ మేను వారినుండి వరుసగ ప్రభుత్వము - ప్రభావము - కోపము - పరాక్రమము - వైభవము గ్రహించి యేర్పడును. ఈ లోకమునందు బలము భాగ్యము భోగము చదువు గలవాడు దేవాంశ సంజాతుడని పేరెన్నిగ గాంచును. 

కనుకనే పాండవులు దేవాంశజులని ప్రఖ్యాతి వహించిరి. ప్రతిభా ప్రభావశాలియగు వాసుదేవుని నారాయణ స్వరూపినిగ భావింపుము. ఈ ప్రాణుల శరీరము సుఖదుఃఖములకు నిలయము. దేహి సుఖ దుఃఖము లొకదాని వెంట నొకటి యనుభవించుచుండును.

ఏ దేహికిని స్వాతంత్య్రమెప్పుడు నుండదు. అతడు దైవాధీనుడు. అతడు పరాధీనుడై జన్మమరణములు సుఖదుఃఖములు ననుభవించుచుండును. పాండవులడవులందు జన్మించిరి. పిదప తమ గృహముల కరిగి. మరల వారు రాజసూయయాగమాచరించిరి. పిమ్మట దుఃఖకరములగు వనవాస క్లేశము లనుభవించిరి. 

అర్జునుడు ఘోరతమొనర్చెను. దానికి సంతోషించి దేవతలతనికి వరములు ప్రసాదించిరి. వారు వనములందు బుట్టి జేసిన పుణ్యమంతయు నేమయ్యెనోకదా! తొల్లి నరుడు బదరికాశ్రమమం దుగ్రతపమాచరించెను. దాని ఫలితమతనికేల దక్కకుండెను? 

కనుక ప్రాణిగణముల దేహ సంబంధముతో గలుగు కర్మగతి యెవరికిని బోధపడదు. వాసుదేవుడు సైతము బాధాకరమగు కారాగృహమును బుట్టి వసుదేవునిచేత నందునింటికి గొనిపోబడెనుగదా! అచట కృష్ణుడు పదునొకండేండ్లు గడపి పిదప మధురకేగి కంసుని సంహరించెను. కృష్ణుడు దుఃఖితులగు తన తల్లిదండ్రులను బంధముక్తులనుజేసి మధురకుగ్రసేనుని రాజుగనొనర్చెను. వ్లచ్ఛరాజగు కాలయువనునకు వెఱచి ద్వారక కేగెను. 

అట్లు కృష్ణుడు దైవవశమున పౌరుషమవలంబించెను. అతడు ద్వారకలో నతిమానుషము లత్యద్భుతములునగు కార్యములాచరించి ప్రభాసతీర్థమున వైకుంఠమేగెను. కృష్ణుని పుత్రపౌత్రులు మిత్రులు భాత్రలు మున్నగువారెల్లరు విప్రశాపమున నశించిరి. రాజా! ఇట్లు నీకు తెలియరాని కర్మగతి గూర్చి వివరించితిని. వాసుదేవుడు సైతము తుదకొక వ్యాధుని బాణముచే ప్రాణములు వదలెను.

అధ్యాయము 132 శ్రీదేవీ నామ మాహాత్మ్యము

No comments:

Post a Comment

Chapter 137 History of the Haihayus - అధ్యాయము 137 హైహయుల చరిత్ర

శ్రీ దేవీ భాగవతం  షష్ఠ స్కంధము  - అధ్యాయము 137 హైహయుల చరిత్ర జనమేజయు డిట్లనెను : వ్యాసమునీంద్రా ! హైహయులను క్షత్రియులు బ్రహ్మహత్యాపాపమునకు ...