Friday, April 17, 2026

Chapter 148 Narada's marriage - అధ్యాయము 148 నారదుని వివాహము

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము - అధ్యాయము 148

నారదుని వివాహము

నారదుడిట్లనెను : రాజు దాసినోట తన కూతు భావము లెఱిగెను. అతడు తన చెంత కమలనయనములతో కైకేయియను బార్యతో నిట్లనెను : 

ఓ కాంతా! దాసి పల్కిన పల్కులు నీవును వింటివి గదా! ఆ కోతి మొగపు నారదుని మన కూతురు కోరి వరించినదట. మన కూతురెంత తెలివిమాలిన పని తలపెట్టినదో చే మనము నల్గురిలో తల యెత్తుకొని తిరుగలేకున్నాము. ఆ కోతిమొగము వానికి నా కన్నె నెట్లు కట్టబెట్టగలను? ఆ బిచ్చగాడు - కురూపి - జడదారి యెక్కడ! నా యందా దమయంతి యెక్కడ! ఇట్టి శాస్త్ర విపరీత కార్య మెప్పుడును చేయరాదు. నీ కూతరు కడు ముద్దరాలు. ఆమె నొంటరిగ పిలిచి చెప్పి చూడము. శాస్త్ర - వృద్ధ - సమ్మత వచనములతో నుపాయముతో వారింపుము. అను తన పతి మాటలు విని 

కైకేయి తన కూతునకిట్లనెను : నీ యింత మిసమిసలాడు సురూప మెక్కడ! ఆ పేదకోతి మొగము వాడెక్కడ! నీవింతటి నెఱజాణవు గదా! ఆ బిచ్చగాని నెట్లు వలచితివే! నీవు తీగె మేనుగల విరిబోడివి. అతడు బూదితో మొరటువారిని మొద్దు. నీ కా కోతిమొగము వానితో సరససల్లాపము లెట్లు సాగునే! 

ఆ రోతు పుట్టు సన్యాసి మొగముపై నెందుకే నీకింత వలపు. నీ వొక చక్కని రాజపుత్రుని వరింపుము. నీ కంత మొండిపట్టు తగదు. నీ తండి నీవన్న మాటలు దాసినోటవిని యెంతయో కుములుచున్నాడు. తుమ్మచెట్టుచుట్టు మెత్తని మాలతీలత పెనవేసికొనుట జూచిన యే సహృదయుని మనస్సు బాధపడదు? 

ఈ నేలపై నెంతటి మూర్ఖుడైన తీయని కమ్మతమ్ములము నొంటెనోటి కందించునట్లే. వివాహ శుభవేళలో నీ చేయి నారదుని చేయి గలియుటగని యెవని మది యుస్సురనదు! మోమందములేని మగనిని పల్కరించుటకు నీ మనసెట్లొప్పునే! ఇక నీముందు జీవితమంతయు నతని ముందెట్లు గడుపుదువే? అను తన తల్లి హితములాలించి తనుమధ్యయగు దమయంతి నాయందే లగ్నమైన మనస్సుతో కాతరభావముతో తల్లితో నిట్లనెను :

అమ్మా! ఎవడు చతురత తెలియడో యట్టి మూర్ఖునకు గొప్ప రూపము ధనము సుముఖముండి యేమి? లేకేమి? మాతా! : మంజులనాదరాగమునకు లేళ్ళు సైతము పరవశతనంది ప్రాణులు వదలుకొనును. అవి కడు ధన్యములు. ఈ నేలపై మూర్ఖులు వట్టి పనికిమాలిన వారు. 

తల్లీ! ఈ నారదుడు సప్తస్వరముల గానమాధురిని చక్కగ నెఱింగినవాడు. పరమశివుడు తక్కనితరుని కింత సంగీతస్వర జ్ఞానములేదు. మోజకునితోడి చెలికారము క్షణక్షణము మరణము గల్గుచుండును. సరసగుణహీను డెంతటి రూపధనములు గలవాడైనను వానిని వదలవలయును. 

వివేకము గోల్పోయి కన్ను మిన్ను గానని మూర్ఖరాజుతో నేస్తము పనికిమాలినది. గుణజ్ఞుడు బిచ్చగాడైనను నెయ్యము తీయనైనది. వాని తీపి మాటలవలన నెడదకు పరమశాంతి చేకూరును. సప్త స్వరజ్ఞానము - ఆరోహణావరోహణ జ్ఞానము - రాగాధి విజ్ఞానము నెఱింగిన యష్టవిధరజ్ఞుఔఔం - డెంత దుర్బలుడైనను సబలుడే. 

గంగా సరస్వతీ నదులు తమలో మునిగినవానిని తమ మహిమతో కైలాసము చేర్చును. అట్లు సర్వజ్ఞాన విశారదుడు శ్రోతలకు కైలాసానందము గల్గించగలడు. స్వరతాల లయరాగము లెఱింగినవాడు నరుడైనను దేవుడే. స్వరభేద మెరుగనివాడు దేవుడైనను పశుతుల్యుడే. 

సంగీతములోని తీయని బాణిని తానమార్గము నారోహణాదులను విని ప్రమోదమందని వానినెల్ల భంగుల పశువుగ నెన్నవలయును. కాని, హరిణములను పశువులుగ నెన్నజనదు. విషధరములగు ఫణులు చెవులు లేనివైనను మనోజ్ఞనాదమునకు తన్మయత్వమొందును. 

కాని, చెవులున్న నరులు వానికంటె తక్కువవారు. శిశువు సైతము సుస్వరముగల పాట విని కేరింతలు గొట్టును. కాని, జగము లుఱ్ఱూతలూగించు రాగాల డోలయగు సంగీత మెఱుగని వృద్ధులు వ్యర్థులు. నారదునిలోని మేలి గుణములు నా తండ్రికి తెలియనివా! ఈ ముల్లోకములందు నతని కెనయగు సామగాయనుడు వేరొక్కడును లేదు గదా! 

కావుననే నేనా కళాభిజ్ఞుని మొదట నా పతిగ నెమ్మది వరించితిని. ఆ గుణాకారున కటు పిమ్మట శాపవశమున కోతి మొగము ప్రాప్తించెను. కిన్నరు లశ్వముఖులు. గాన విద్యలో నేర్పరులు. వారెవరికి ప్రియులు గారు? మంచి మొగముతో నేమి పని?

అమ్మా! నే నా మునిప్రవరుని మనసార వరించితిని. కనుక పట్టుదల వదలి మొదముతో నన్నా ముని కిమ్మని నా తండ్రితో నీవు చెప్పుము. 

నారదు డిట్లనెను : ఇట్లు తన కూతురు నారదునందే బద్ధానురాగయై యుండుటగని యామె మాటలు విని 

రాణి రాజుతో నిట్లనెను : రాజేంద్రా! ఒక శుభముమూర్తమున మునితో దమయంతీ వివాహము జరిపించుము. ఆ రసజ్ఞు నామె యెపుడో మదిలో వరించినదట అని రాణి పలుకగ సంజయరాజు పత్నీ ప్రేరితుడై వివాహ విధులు యధావిధానముగ జరిపించెను. అట్లు వానర ముఖముగల నేను పెండ్లి చేసికొని నిత్యము మంటలు చెలరేగు మనస్సుతో నచ్చట నెట్టులో యుంటిని. 

ఆ రాజపుత్రి నా సేవకు నన్ను సమీపించునపుడు నేను నా కోతిమొగము దలచుకొని మిక్కిలి కుమిలి కృశించిపోవుచుంటిని. కాని, దమయంతి మాత్రము నా కోతిముఖము చూచియు నిట్టూర్పక విప్పారిన తమ్మి మోముతో నొప్పారు చుండెను. అట్లు పెక్కు దినములు గడచెను. 

పిదప పర్వతముని పెక్కు తీర్థములాడియాడి నన్ను చూచుట కేతెంచెను. నే నతనిని ప్రేమతో పూజించి సత్కరించితిని. నే నొసంగిన ఉన్నతాసనమున కూర్చున్న తరువాత అతడు నన్ను చూచి దుఃఖితుడయ్యెను. నేనతని మేనమామను. నేను కోతిమొగముతో నున్నను పెండ్లి చేసికొని దీనుడనై కృశుడనై చింతాతురుడనై యుండుటగని నాపై నతనికి జాలిగల్గి యిట్లనెను. 

'నారద మునివరా! తెలియని కోపముతో నిన్ను శపించితిని. శాప మోక్షణము దెల్పుదును. వినుము. ఆ రాజపుత్రికను చూడగనే నా మదిలో నామెపై దయ పొంగులు పారినది. కనుక నా పుణ్యబలమున నీ మోమందముగ నొప్పుగాక!' 

పర్వతుని మాటలు వినగనే నా మనస్సు సైతము చెమ్మగిల్లినది. వెంటనే నే నిచ్చిన శాపము ద్రిప్పదలచి యిట్లంటిని : ఓయీ మేనల్లుడా! పర్వతమునీ! ఇపుడు నీ శాపమోచనము గల్గించితిని. ఇక నీకు స్వర్గమేగు శక్తి గల్గుగాక !

పర్వతుని మాట మాత్రమున నెల్లరు చూచుచుండగనే నా ముఖమందముగ పొదటు మీరెను. రాకుమారి సంతోషముతో వేగమే యీ సంగతి 

తన తల్లి కిట్లు తెల్పెను : తల్లీ! పర్వతముని దయవలన నీ యల్లునకు శాపము దీరెను. అతని ముఖము పూర్వమువలె కళలు విరజిమ్ముచున్నది. అను కూతు మాటలు విని రాణి రాజుతో చెప్పెను. అంత సంజయుడు నెమ్మితో నా మునిని (నన్ను-నారదుని) దర్శింపనరిగెను. 

అపుడు మహాత్ముడగు రాజు హర్షముతో నాకు పర్వతునకు పెక్కు ధనరాసులు కానుకగా నిచ్చెను. ఇట్లు నేను సొంతముగ ననుభవించిన మాయాశక్తి మహత్తంతయు పురాణకథగ నీకు వివరించితిని. 

మహాత్మా! ఈ ప్రపంచమున నింద్రజాలమువంటి మాయామోహమువలన సుఃఖించిన - సుఃఖించుచున్న - సుఃఖింపగల మానవుడెవ్వడును లేదు. కామ - క్రోధ - లోభ - మోహ - మద - మత్సరములు మమతాహంకారములు తీవ్రశక్తిగలవి. వాని ముందెంతటి వాడును తలవంచవలసినదే. 

మునీ! సత్వము - రజము - తమము - అను మూడు గుణశక్తు లెల్లప్రాణుల దేహధారణకు మూలకందములు. నే నొకప్పుడు శ్రీవిష్ణుమూర్తితో హాస్యవినోదములు జరుపుచు నొక వనమున సంచరించుచుంటిని. ఆనాడు నేను క్షణములో నాడుదాననైతిని. నేను మాయామోహితుడనై యొక రాజపత్నినై రాజునింట పెక్కురు కొడుకుల గటంటిని. అని నారదు డన 

వ్యాసుడిల్లనెను : నారదా! నీవొక స్త్రీవైతివను మాట నాలో సంశయము రగుల్కొల్పుచున్నది. నీవు జ్ఞానివి గదా ! ఎట్లు స్త్రీగ మారితివి? నీ వే రాజు నింట కొడుకుల గంటివి? తిరిగి యెట్లు పురుషుడవైతివి? ఈ చరాచరజగముల బ్రదుకు లే మాయాశక్తిచేత మోహితములో యా మాయాశక్తి బలవత్తర చరిత్ర వినవలతును. శ్రీమాతృదేవి దివ్య కథాసుధారసము సకల గ్రంథార్థసారము సర్వసంశయ నాశకము. అట్టి దేవి చరిత మెంతగ చెవుల పండువుగ గ్రోలినను తనివితీరుట లేదు.

అధ్యాయము 149 నారదుడు మాయావశుడగుట

No comments:

Post a Comment

Kings of the Surya Dynasty - Sukanya Vritthanamu - సూర్య వంశ రాజులు - సుకన్యా వృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము -  సూర్య వంశ రాజులు - సుకన్యా వృత్తాంతము జనమేజయు డిట్లనెను : ఓ మహానుభావా ! సూర్యవంశమునందు బుట్టిన ధర్మజ్ఞులగ...