Tuesday, April 21, 2026

Death penalty for Harishchandra's wife - హరిశ్చంద్రుడి భార్యకు మరణదండన

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - హరిశ్చంద్రుడి భార్యకు మరణదండన

అయ్యో కొడుకా! హా శిశూ! ఓ వత్సా! అయ్యయ్యో సుందర బాలకా! అను నామె విలాపములను నగరపాలకులు వినిరి. వారు త్వరగ మేల్కొని యామె చెంతకేగి విస్మయముతో నిట్లనిరి. నీవెవరవు? ఈ బాలు డెవనివాడు? నీ పతి యెవరు? ఎక్కడున్నాడు? నీ వొంటరిగ నిర్బయముగ నడిరేతిరి శోకింతు వేల? అని వారెంత యడిగినను నామె మారు పలుకలేదు.

అట్లు వారు పెక్కుసారు లడిగిన నామె పలుకక మిన్న కుండెను. ఆమె దుఃఖార్తితో శోకాశ్రులు కన్నుల నిండగ కుమిలి యేడ్చెను. పిమ్మట వారి కామెపై ననుమానము గల్గెను. వారు భయపడి మేనులు పుల్కరింప నాయుధములు చేతబూని తమలోతా మిట్లనుకొనిరి. ఈమె స్త్రీ కాదు. అందులకే మాటలాడుట లేదు.

ఈమె తప్పక మాయావి-రక్కసి-బాలఘాతిని-గావచ్చును. ఈమె మంచిదైనచో నింత రాత్రిలో నెవని పిల్లవానినో తెచ్చి యూరిబయట తినదలచునా! అని కొంద ఱామె వెండ్రుకలు పట్టి-మఱికొందరు మెడపట్టి-యింక కొందఱు చేతులుపట్టి-లాగిరి. ఇదొక ఖేచరి. ఎటకో పోవుచున్నదని శస్త్రపాణు లామె నీడ్చుకొనిపోయి చండాలున కప్పగించి యిట్లనిరి :

ఓ చండాలా! ఈ బాలఘాతిని మాకు బయట కనిపించెను. ఈమెను శీఘ్రముగ బయటకు గొనిపోయి చంపుము-చంపుము. అపుడు చండాలుడు వారిని చూచి యిట్లనెను. ఈమె యందరికి తెలిసినదే. ఎఱుగనివారెవరున లేరు. ఈమె యెందరనో పిల్లలను తిన్నది.

ఈమెను చంపిన మీకు పున్నెము కీరితి శాశ్వతముగ గల్గును. కనుక మీరు సుఖముగ వెళ్ళుడు. ఎవడు విప్రుని - స్త్రీని-బాలురను-ఆవులను-చంపునో బంగారము దొంగలించునో-నిప్పుపెట్టునో-బాటలు చెడగొట్టునో-మద్యము త్రాగునో-గురుతల్ప మెక్కునో-ఎవడు సాధులతో వైరము బూనునో-యట్టివానిని చంపుట పుణ్యము.

ఈ పనులు చేసినవారు విప్రులైనను-స్త్రీయైనను-వారిని చంపిన దోషము రాదు. కనుక నీమెను చంపుట మంచిదే యనుకొని చండాలు డామెను గట్టిగ బంధించి త్రాళ్ళతో గట్టి పటిలాగి జుట్టుపట్టికొట్టెను.

అతడు హరిశ్చంద్రునితో పరుశముగ నిట్లనెను. ఓరి దాసుడా! నీ వీ దుష్ఠురాలిని ముందువెనుకలు చూడక చంపివేయుము. అను పిడుగుపాటువంటి మాట విని హరిశ్చంద్రుడు స్త్రీ వధ నను మానించి వణకుచు చండాలున కిట్లనెను:

ఈ పని మాత్రము నాచేత గాదు. ఇంకే పనియైనను చెప్పుము. అదెంత యసాథ్యమైనదైనను తప్పకచేయగలను. అను మాటలువిని చండాలుడు మరల నిట్లనెను. భయపడకుము. కత్తి చేతబట్టుకో, దీనిని చంపిన నీకు పున్నెమే కల్గును. ఇది చిన్న పిల్లలను భయపెట్టునది. దీనిని దయతలచి వదలరాదు.

అను మాటలువిని రాజు చండాలున కిట్లనెను : స్త్రీలు రక్షింపదగినవారేగాని చంపబడదగినవారు గారు. స్త్రీవధ మహాపాపమని ధర్మతత్పురులు-మునులు-వక్కాణింతురు. తెలిసియో-తెలియకో యొక స్త్రీని చంపినవాడు తప్పక ఘోర రౌరవనరకములందు గూలును.

చండాలు డిట్లనెను : ఈ మాటలు కట్టిపెట్టుము. మెఱపుతీగవంటి వాడి కత్తి చేపట్టుము. ఈ యొక్క దానిని చంపినందున పెక్కురకు సుఖము గల్గును సుమా. ఈ దుష్టురాలు లోకమందలి పెక్కురు చిన్న పిల్లలను పొట్టను పెట్టుకొన్నది. దీనిని చంపినందున నీకు పుణ్యమే కల్గును.

కనుక దీనిని తప్పక చంపుము. లోకము సుఖముండుగాత. రాజిట్లనెను: ఓ చండాలాధిపతీ! నేను స్త్రీవధ చేయనని తీవ్రవ్రతము బూనితిని. కనుక నేను స్త్రీ వధకు తలపడకున్నాను. నేను పుట్టిననాటినుండి స్త్రీవథ చేయలేదు.

చండాలు డిట్లనెను: ఓరి దుష్టుడా! స్వామి కార్యమును మించిన కార్య మింకేమి గలదు. నా యుప్పుపులుసుతిని నా చెప్పిన పని యేల చేయవురా! తన స్వామిజీతముతిని స్వామి పని నెఱవేర్చవలయును. అట్లు చేయనివానికి వేయికల్పములకైనను నరకమునుండి ముక్తిలేదు.

రాజిట్లనెను: ఓ చండాలనాయకా! నాకు సుదారుణమైన యింకొక పని చూపుము. నీ కెవడైన పగవాడున్నచో చెప్పుము. అట్టి నీ శత్రుని చంపి యీ భూమి యంతయును నీ కైవసము గావింపగలను. దేవ-ఉరగ-సిద్ధ-గంధర్వులను వెంటబెట్టుకోని దేవేంద్రు డేతెంచినప్పటికీ నా వాడి బాణములతో నతని నోడింపగలను.

అను హరిశ్చంద్రరాజు మాటలువిని చండాలుడు కోపాతిరేకముతో వణకుచు నతని కిట్లనెను. నీవు పలుకు మాట లొక దాసునకు తగినవి గావు. నీ వొక చండా లునకు దాసుడవయ్యు పెద్ద దేవతల పల్కులు పల్కుచున్నావు. ఓరి దాసుడా! పెక్కేల ! నా మాట నమ్ముము. ఓరి సిగ్గు మాలినవాడా! నీ యెడదలో పాపభీతి యున్నచో నొక చండాలునకు దాసుడ వెందుల కైతివి? ఇదిగో! ఈ కత్తి తీసికొ. దాని తల తెగ నఱకుము. అని పలికి చండాలుడు రాజు చేతికి కత్తి యిచ్చెను.

హరిశ్చంద్రుడు భార్యాపుత్రులను గుర్తించడం

No comments:

Post a Comment

The appearance of Brahma and the gods to Harishchandra - హరిశ్చంద్రుడికి బ్రహ్మాదిదేవతలు ప్రత్యక్షమవ్వడం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - హరిశ్చంద్రుడికి బ్రహ్మాదిదేవతలు ప్రత్యక్షమవ్వడం సూతు డిట్లనెను: అటుతర్వాత హరిశ్చంద్ర నరపతి చితిపై తనకొడుకు...