Friday, April 17, 2026

Chapter 140 Hari's son is born to Yashvin - అధ్యాయము 140 హరి యశ్వినియందు పుత్రుని బడయుట

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము - అధ్యాయము 140

హరి యశ్వినియందు పుత్రుని బడయుట

ఆ విధముగ సాంబసదాశివుడు లచ్చికి వరమిచ్చి సురలతో శోభిల్లు కైలాసమునకు వేగముగ నేగెను. అట కేగిన పిదప శివుడు లక్ష్మీ కార్యసిద్ధికి చిత్రరూపుడను కార్యవిశారదుని వైకుంఠమును పంపుచు నిట్లనెను. : 

'చిత్రరూపా! నీవు హరిని దర్శించి నా మాటగ నిట్లు పలుకుము. నీ భార్య విరాహార్తయై రోదించుచున్నది. ఆమె దుఃఖము మానుపుమని హరితో ననుము అని హరుడనగనే చిత్రరూపుడు సత్వరమే వైష్ణవ గణములతో నిండిన దివ్యధామమగు వైకుంఠధామము జేరెను. వైకుంఠము సుమనోహరమైన పెక్కు చెట్లతో బావులతో హంస - కారండ - మయూర - శుక పికములతో పొలు పారుచున్నది. 

అందు మందార తరులతో నలరుచు నృత్యగీతకళలతో నినదించుచు పెక్కు టెక్కములతో నొప్పుచు నెత్తైన దివ్య భవనములు సొబగు మీరుచున్నవి. చెవుల కింపైన పెక్కు పక్షుల కలరవములతో చెన్నొందు వకుళ - అశోక - తిలక - చంపక తరువు లున్నవి. పరమపదమగు విష్ణుమందిరము దివ్యమహస్సు లీనుచున్నది. ఆ మందిర ద్వారమందు జయవిజయులు వేత్రధారులై యున్నారు. 

చిత్రరూపుడు వారిని గాంచి కైమోడ్చి వారి కిట్లనెను శూలపాణియగు శివుడు పంపగ నొక దూత యేతెంచెనని మీరు విష్ణునితో వెంటనే తెలుపుడు. అతని మాటలు విని బుద్ధిమంతుడగు జయుడు వెళ్ళి చేతులు మోడ్చి హరికిట్లు విన్నవించెను : 

దేవదేవా! రమాకాంతా! కరుణాకరా! కేశవా! శంకరుని దూతవచ్చి ద్వారమున నిలుచుచున్నాడు. అతడు చిత్రరూపుడట. ఏల వచ్చెనో యెఱుగను. గరుడధ్వజా! అతనిని లోనికి ప్రవేశపెట్టుమందురా, వలదా? అను మాటలు విని హరి యతని రాకకు కారణ మెఱిగెను. కనుక నతనిని లోనికి ప్రవేశపెట్టుమని జయునితో ననెను. అది విని జయుడు వెంటనే వెళ్ళి శివదూతయగు చిత్రరూపుని రమ్మనెను. అట్లు చిత్రరూపుడు జయునిచేత లోన ప్రవేశపెట్టబడి విష్ణునకు దండ ప్రాణమము లొనర్చికైమోడ్చి నిలుచుండెను.

శివదూతయగు చిత్రరూపుడు వినయము రూపొందినట్లు నిలుచుండగ హరిగని యచ్చెరు వందెను. పిమ్మట శ్రీపతి మొలకనవ్వులు చిందించుచు చిత్రరూపున కిట్లనెను : 

ఓ యనఘా! మహాదేవునకు నతని కుటుంబమునకు కుశలమే కదా? హరునకు నా వలన గావలసిన కార్యమేమి? అతడు నిన్నేల పంపెను? కానిచో నాతో దేవతల కేదైన పని యుండెనా? తెలుపుము. 

దూత యిట్లనెను : గరుడధ్వజా! నీవు త్రికాలవేదివి. ఈ ప్రపంచమందు నీకు తెలియని దేమున్నది? నేను దెల్పునవి నీకు తెలియనివి కావు. జనార్దనా! శివుడు నీతో నొకమాట తెల్పుమని నన్నంపెను. ప్రభూ! హరుని పలుకులుగా నేను పలుకుచున్నాను : 

విభూ! కమలయగు నీ భార్య కాళిందీ తమసా నదుల సంగమమున తపము తీవ్రముగ నాచరించుచున్నది. ఆ శ్రీదేవి సర్వార్థప్రదాయిని. ఆమె దేవ - కిన్నర - నర - యక్షుల చేత నారాధింపబడ దగినది. ఐన నే డామె గుఱ్ఱము రూపుదాల్చి యున్నది. అట్టి లక్ష్మి దేవిని గొలువనిచో లోకమం దెవ్వడు సుఃఖింపగలడు? ఆ సిరులదేవిని విడనాడి నీవేమి సుఖ పడుదువు? 

భర్త యెంతటి దుర్బలుడైనను పేదపడినను నతడు తన భార్యను పోషించుకొనును. నీవే తప్పులేని జగదీశ్వరి నేల వదలితివి? ఈ లోకమందెవ్వని భార్య దుఃఖముల పాలగునో వాని శత్రులు వానిని దుయ్యబట్టుదురు. ఇపుడు సిరులొసగు లక్ష్మినే కష్టాలు ముసరుకొనినవి. నీ శత్రువు లామెను గాంచి మోహపరవశులైరి. నీ లచ్చికి బ్రతుకునీడగ నీవు లేనందున వారు రేయింబవళ్ళు నిన్ను పరిహసించుచున్నారు. 

లక్ష్మి సాధ్వి - సుశీల - సురూప - సుగుణ - సకల లక్షణ సంపన్న - ఆమెను ప్రసన్నురాలిని జేసికొని నీ మధుర సంగతి నామెకు గలిగించుము. ఆమె చారుహాసిని. నీ ప్రియురాలు. ఆమెను నీ దానిగ జేసికొని సుఖపడుము. నా వెనుకటి కాంతావియోగము తలపునకు వచ్చినపు డెల్ల నా గుండె బరువెక్కును.

దక్షయజ్ఞములో నా సతియగు సతీదేవి మరణించినపుడు నా పడిన విరహ వదేన యింతింనరానిది. అపుడు నేను భార్యావియోగమున తపించితిని. ఈ ప్రపంచమున నావలె నెవ్వడును భార్యతో నెడబాటు జెందకుండుతమని నే నపుడు తలచితిని. సతీదేవి రోషము కొలది దక్షయాగమందు భస్మమైనది. నే నామెకై పెక్కులేండ్లు ఘోర తపమాచరించితిని. పిదప నామె గిరిజారూపము దాల్పగ నామెను బడయగల్గితిని. 

హరీ! నీవు నీ వల్లభను విడనాడి యొంటరిగ వేలేండ్లు గడుపుచున్నావు. ఇందుచే నీవేమి సుఖ మొందుచున్నావు? కనుక నీవు వెంటనే వెళ్ళి నీ సౌభాగ్యలక్ష్మిని నీ యింటికి తెచ్చుకొమ్ము. ఈ లోకమునందు లక్ష్మిలేనివాడెవ్వడు మనజాలడు గదా! నీ వశ్వరూపముతో నశ్వనిని గూడి కొడుకును గని తిరిగి నీ భార్యను వెంటగొనిపొమ్ము అను చిత్రరూపుని పలుకులు విని హరో యట్లే యగుత' మని శంకరుదూతను సాగనంపెను. 

అట్లు దూత వెళ్ళిన పిదప విష్ణువు వైకుంఠము వదలి యందమైన గుఱ్ఱము రూపము ధరించెను. అతడాడు గుఱ్ఱము రూపున తపము చేయుచున్న లక్ష్మిచెంత కరిగి యామెను కంటి కింపుగ గాంచెను. సాధ్వి లక్ష్మి హయరూపమున వచ్చిన వానిని తన పతి యగు గోవిందునిగ తెలిసికొని యెడద గగుర్పొడువ బాష్పములు కనులనిండ నిలిచెను. 

అంత వారిర్వురు లోక ప్రసిద్ధమై పవిత్రమైన కాళిందీ తమసల సంగమమున నిండారిన తమకముతో మధుర సంగమములో నొకటి యైరి. అపు డశ్వినియగు హరివల్లభకు గర్భము నిలిచెను. ఆమె యొక యందాల సుగుణాల రాశియగు బాలుని గనెను. పిమ్మట హరి నవ్వి సమయోచితముగ గుఱ్ఱము రూపు వదలి తొంటి రూపము ధరించుము. మనము మన నిజరూపములతో తిరిగి వైకుంఠ మేగుదుము. నీకు గల్గిన యీ కుమారు డిచ్చటనే యుండుగాత!'' మని లక్ష్మితో ననెను.

లక్ష్మి ఇట్లనెను : 'నాథా! నా కడుపున పండిన యీ చిన్నారిని వదలి యెట్లు రాగలను? సంతానము మీది ప్రేమ తప్పించుకొన నలవి గాదు సుమా! మహాత్మా! ఈ యనదుడీ నదీతటమున నొంటిగ పడియున్నాడు. ఇతడసమర్థుడు. అర్భకుడు. ఈ బాలుని గతి యేమి కావలయును? స్వామీ! ఈ దిక్కులేని బాలుని విడనాడిపోవుటకు నా మనసొప్పుటలేదు. ఇతడు మన యంతఃకరణ ప్రకాశము.' 

అంతలో లక్ష్మీనారాయణులు దివ్యరూపములు దాల్చిరి. వారు సురగణముచే సంస్తుతింపబడుచు దివ్య విమానమెక్కిరి. వారు వెళ్ళిపోదలచిరి. 

అపుడు లక్ష్మి విష్ణుతో నిట్లనెను : ఈ నీ కొడుకును తీసికొనుము. ఇతనిని వదలి నేను రాజాలకున్నాను. మధుసూదనా! నా కొడుకు నా ప్రాణములకన్న ప్రియతరుడు. ఇతని దచ్చముగ నీ రూపే. ఇతడు మన స్నేహబంధము. మన యానందగ్రంథి. కనుక మన మితనిని వెంటగొని వైకుంఠ మేగుదము. 

హరి యిట్లనెను : ఓ సులోచనా! నీవు శోకింపకుము. ఇతని సుఖమున కిక్కడ నెట్టి లోటు లేదు. ఇతని రక్షణభారము నాది. ఈ నేలపై నితని వలన నొక యద్భుత కార్యము జరుగనున్నది. అందులకే యితని నిచట వదలుచున్నాను. దాని గూర్చి నీకు తెల్పుదును, వినుము. ఈ భూమిపై యయాతి కొడుకు తుర్వసు డనువాడు పేరుగాంచెను. అతని కతని తండ్రి హరివర్మ యని పేరిడెను. అతడీ తీర్థమున పుత్రునిగోరి నూరేండ్లు తప మొనర్చెను. అతని కొఱకే నే నీబాలుని కంటిని. నే నా రాజు చెంతకేగి యతనిని ప్రేరింతును. ఆ పుత్రకామున కీ పుత్రు నీయగలను. అత డీ బాలుని తన యింటికి తీసికొని వెళ్ళగలడు. ఇట్లు విష్ణువు తన ప్రియురాలగు పద్మనోదార్చి బాలకునకు రక్షణ గల్పించి తన ప్రియతో విమానమెక్కి వెళ్ళెను.

No comments:

Post a Comment

Kings of the Surya Dynasty - Sukanya Vritthanamu - సూర్య వంశ రాజులు - సుకన్యా వృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము -  సూర్య వంశ రాజులు - సుకన్యా వృత్తాంతము జనమేజయు డిట్లనెను : ఓ మహానుభావా ! సూర్యవంశమునందు బుట్టిన ధర్మజ్ఞులగ...