నహుషు డింద్రాసన మెక్కుట
అటు పిమ్మట విష్ణువు వృత్రహత్యవలని భయముతో తన మదిలో శంకించుచు వైకుంఠమేగెను. ఇంద్రుడును భయభ్రాంతితో స్వర్గమేగెను. వృత్రుడు చనిపోగా మునులును భయోద్విగ్నమానసులై యిట్లు దలంచిరి :
ఇంద్రుని సాంగత్యము చేత మన మునిశబ్దము వ్యర్థమైనది. వైరిని వంచించి మనమును పాపము మూటకట్టుకొంటిమి. వృత్రుడు మన మాటల మీద నమ్మకముంచుకొని యుండెను. విశ్వాసఘాతుకుని గూడుటచే మనమును విశ్వాసఘాతుకులమైతిమి. ఛీ! ఈ మమకార మెంత చెడ్డది. ఇది పాపమూలము. అనర్థదాయకము.
దానివలననే మన మసురునిచేత ప్రతినలు చేయించి యతని కన్ను మొఱగితిమి. పాపాత్మునిపక్ష మవలంబించువాడును అతనిని పాపమునకు పురికొల్పువాడును పాపబుద్ధి గలిగించువాడును పాపాలోచనలు చేయువాడును పాపమనుభవించి తీరుదురు. విష్ణువు సైతమింద్రునకు సాయము చేయుట కతని వజ్రములో దాగి వృత్రుని చంపించి పాపము చేసెను.
విష్ణునంతటి వాడింద్రునకు సైదోడుగ నిలిచి పాపము చేసెనే! ఇక స్వార్థపరుడగు ప్రాణి పాపాచరణమేలచేయడు? ఈ లోకములందలి నాల్గు పురుషార్థములలో మొదటిది ధర్మము. చివరిది మోక్షము. ఈ రెండును దుర్లభములు. ఇవి నేడు మాసిపోయినవి. ప్రతి ప్రాణికి నర్థకామములు గొప్పవి. ప్రీతిపాత్రములు. ఎంతగొప్పవాడైనను ధర్మపన్నాలు వల్లించుచు దంభాచారి యగును.
ఇట్లు మునులు పశ్చాత్తాపముజెంది దిగులుతో చేయునదిలేక తమ తమ యాశ్రమముల కరిగిరి. ఇట విశ్వకర్మయును తన పుత్రుడింద్రునిచేతిలో చచ్చుటెఱిగి వగచి వగచి నిర్వేద మొందెను. విశ్వకర్మ వృత్రుడు చచ్చిపడిన చోటికేగిచూచి యతనికి యథావిధానముగ నూర్ధ్వలోక సంస్కారములొనరింప జేసెను.
విశ్వకర్మ స్నానమొనర్చి తర్పణాది కర్మలొనరించిన పిమ్మట శోకార్తుడై మిత్రద్రోహిపాపియగు నింద్రునిట్లు శపించెను : నా సుతుడెట్లు శపథములతో వంచింపబడి చచ్చెనో యింద్రుడు నట్లే విధివశమున దుఃఖములందుగాక! ఇట్లు విశ్వకర్మ యింద్రుని శపించి తాపస వృత్తిలో మేరు శిఖరములందు ఘోరతపమాచరించెను.
జనమేజయుడిట్లనెను : పితామహా! సురేశుడు వృత్రుని సంహరించి సుఖపడెనా? దుఃఖములనుభవించెనా? నాకు తెల్పుము. అన
జనమేజయుడిట్లనెను : పితామహా! సురేశుడు వృత్రుని సంహరించి సుఖపడెనా? దుఃఖములనుభవించెనా? నాకు తెల్పుము. అన
వ్యాసుడిట్లనెను : మహాత్మా? నీవే మడుగుచున్నావు? నీ సందేహమేమి? ఏ ప్రాణియైన శుభాశుభకర్మముల ఫలము తప్పక అనుభవించవలసినదే! నరులుగాని సురులుగాని బలశాలిగాని దుర్బలుడుగాని యతడు చేసిన కర్మము కొలదిదైనను గొప్పదైనను దానిఫల మతడనుభవించవలసినదే. ఇంద్రుడు వృత్రుని చంపుటకు పూనుకొనెను.
అంతలో శ్రీహరి యింద్రుని బుద్ధిని ప్రేరేచి యతని వజ్రమునజేరి సాయపడెను. కాని, యింద్రుడాపదలలో తలమున్కలుగ నున్నప్పుడు వాసుదేవుడు సాయపడలేదు. కనుక రాజా! ఈ లోకమునందు సమయమున కాదుకొనువాడే స్వజనుడనబడును. దైవము ప్రతికూలించినచో సాయపడు వాడొక్కడు నుండడు. తల్లి తండ్రి భార్య సోదరుడు సేవకుడు-మిత్రుడు-ఔరసులు వీరిలో నేయొక్కడును దైవము ప్రతికూలించినో తోడుపడడు. పాపముగాని పుణ్యముగాని దానినిజేసినవాడే యనుభవించగలదు. వృత్రుడు చావగ సురలెల్లరు వెళ్లిరి.
ఇంద్రుడు తేజోహీనుడయ్యెను. సురలంద ఱింద్రుడు బ్రహ్మఘాతుకుడని యతనిని నిందించిరి. ఇంద్రుడు శపథములుచేసి సత్యవాక్కులు పలికెను. అతడు తనకు మనసిచ్చి నమ్మిన మునిపుత్రుని వంచించి వధించెనని గంధర్వులు సురోద్యానములందు గుమిగూడి గుసగుసలాడుకొనిరి. వారెల్లెడల నింద్రుని నిందించుచుండిరి. ఆ వార్త యంతట ప్రాకెను.
ఇంద్రు డెంతటి దుష్కార్య మాచరించెను! ఇంద్రుడు వృత్రుని కంట దుమ్ముకొట్టి యతనిని పొట్టనుబెట్టుకొనెను. ఇంద్రుడు వేదప్రమాణమును మంటగలిపెను. అతడు బుద్ధ మతమును స్వీకరించెను గాబోలు! ఇంద్రుడుగాబట్టి తన శత్రునకు మాట యిచ్చియు నతనిని మోసగించి చంపెను కాని, మరెవ్వడును మాటయిచ్చి యింతటి ఘోరవైపరీత్యమునకు తలపడడు. ఇంతటి పనికి బూనుకొనుట కింద్రునకు విష్ణునకు దక్క మరెవ్వనికి గుండెలుండును? అనుమాటలు సమాజము లందు వినవచ్చుచుండెను.
ఇట్టి మాట లింద్రుని కీర్తికి మచ్చ గల్గించునట్టివి. వీని నింద్రుడును వినెను. ఎవ్వని కీరితి లోకమున నిందల పాలయ్యెనో వాని బ్రదుకొక బ్రదుకా? అట్టి నష్టకీర్తిగలాడు త్రోవను నడుచుచుండగ గని వైరులు పరిహసింతురు.
ఇట్టి మాట లింద్రుని కీర్తికి మచ్చ గల్గించునట్టివి. వీని నింద్రుడును వినెను. ఎవ్వని కీరితి లోకమున నిందల పాలయ్యెనో వాని బ్రదుకొక బ్రదుకా? అట్టి నష్టకీర్తిగలాడు త్రోవను నడుచుచుండగ గని వైరులు పరిహసింతురు.
తొల్లి యింద్రద్యుమ్నుడను రాజర్షియుండెను. అతని యశమునకు హాని గల్గుట వలన నతడు స్వర్గపతితు డయ్యెను. కనుక పాపచారి యేల పతితుడు గాకుండును? మునుపు కొలది యపరాధమునకే యయాతి రాజు స్వర్గచ్యుతుడయ్యెను. అతడు పదునెనిమిది యుగములవఱకు కర్కట యోనిలో పుట్టెను.
పూర్వ మచ్యుతుడగు జనార్దనుడు భృగుపత్ని శిరమును ఖండించెను. విష్ణువు బ్రహ్మశాప ఫలితముగ వరాహదిపశు యోనులం దుద్భవించెను. అతడు బిచ్చమెత్తుటకు వామనుడై బలి యింటికేగెను. ఇక పాపాత్ముడగు నరుడు వీరికంటే మిక్కుటమైన దుఃఖము లందకుండునా? అలనాడు దశరథరాముడు సైతము వనములందు సీతావియోగ దుఃఖము లందెను. ఈ రఘురాముడును ఘోరదుఃఖము లనుభవించెను. అదియును భృగుశాపముననే కలిగెను.
అట్లే యింద్రుడును బ్రహ్మహత్యాపాపముతో భయవిహ్వలు డయ్యెను. అతడు తన భవనమందును సుఖముగ వసింపలేకుండెను. అతడు తేజోహీనుడగుటగని శచీదేవి యిట్లనెను :
'ఓ స్వామీ! నీవు చేష్ట లుడిగి భయభ్రాంతుడవై నిట్టూర్పులతో నేల లోలోన కుములుచున్నావు నీ శత్రువు మడిసెను గదా! కాంతుడా! నీ కిక దిగు లేల? ఒక పామరుని వలె నిట్టూర్చుచు శోకింతువేల? నీ కింక ప్రబలశత్రు వెవ్వడును లేడు. ఇక నీ కెవ్వరును చింత గల్గించరు.'
ఇంద్రుడిట్లనెను : నాకు ప్రబలశత్రువు లేడు. కాని నాకు శాంతి సుఖములు కొరవడినవి. రాణీ! బ్రహ్మహత్యాభీతిచే దురపిల్లుచున్నాను. నా కీ నందన వనము అమృతము గంధర్వగానములు అచ్చరల నర్తనములు పెక్కు దేవకామినులు నీవును కల్పవృక్షము కామధేనువును నిందేదియును నాకు చిత్తశాంతి గల్గించుటలేదు. ఇక నేమి చేతును? ఎక్కడి కేగగలను? నాకు సుఖమెక్కడిది?
కాంతా! ఇట్టి తీరని వంతలో మునుగుట వలన సుఖముగ నుండలేకున్నాను. ఇట్లింద్రుడు చింతాతురయగు తన పత్నితో బలికి తన గృహము వెడలి మానస సరోవరముజేరి యందొక పద్మనాళమునం దార్తితో కృశించి దాగియుండెను. పాపము చేసి తిరస్కృతు డగుటచే నింద్రు నెవ్వరును గుర్తింపజాలకుండిరి. ఇట్లతడు కదలని పామువలె పడియుండెను.
కాంతా! ఇట్టి తీరని వంతలో మునుగుట వలన సుఖముగ నుండలేకున్నాను. ఇట్లింద్రుడు చింతాతురయగు తన పత్నితో బలికి తన గృహము వెడలి మానస సరోవరముజేరి యందొక పద్మనాళమునం దార్తితో కృశించి దాగియుండెను. పాపము చేసి తిరస్కృతు డగుటచే నింద్రు నెవ్వరును గుర్తింపజాలకుండిరి. ఇట్లతడు కదలని పామువలె పడియుండెను.
అతడు నిస్సహాయుడై దీనుడై వికలుడై నీట దాగియుండెను. బ్రహ్మహత్యా భయమున నింద్రు డిట్లు వెడలుట సురలు తెలిసికొని చింతామగ్నులైరి. ఉత్పాతములు పెక్కులు సంభవించెను. ఋషులు సిద్ధ గంధర్వులు భయార్తులైరి.
ఇట్టి యుపద్రవముల వలన జగమంతయు నరాజకమయ్యెను. నేలపై వానలు లేవు. పంటలు పండుట లేదు. నదులు పిల్లకాల్వలయ్యెను. కాసారము లెండిపోయెను. ఇట్టి యరాజకములు పెక్కులుప్పతిల్లగ మునులు సురలు తమలోతా మాలోచించుకొనిరి. వారు నహుషు నింద్రునిగ చేసిరి.
నహుషుడు ధర్మిష్ఠుడే కాని రజోగుణమున కన్నుమిన్ను గాననివాడు. అతడు మదనబాణపీడితుడై విషయలోలు డయ్యెను. నందనోద్యానము నం దచ్చరలతోగూడి విచ్చల విడిగ క్రీడింపసాగెను. ఇంద్రాణి సుగుణములు విని యామెను మదిలో కాంక్షించెను.
నహుషుడు ఋషుల కిట్లనెను : 'ఇంద్రాణి నన్ను జేరరాదేల? మీరు దేవతలందఱు కలిసి నన్ను సురపతిగ జేసితిరి గదా! కనుక మీరు నాకు ప్రియము గూర్ప దలంచినచో మీ రామెను నా సేవలకు పంపుడు. ఇపు డీ దేవతలకు లోకములకు నింద్రుడను నేను. ఈశ్వరుడను నేను. వెంటనే శచి నా చేరువకు రావలయును.' అను నహుషుని మాటలు దేవతలు దేవర్షులు వినిరి.
అపుడు వారు చింతార్తులై యింద్రాణిని జేరి ప్రణమిల్లి యిట్లనిరి :
అపుడు వారు చింతార్తులై యింద్రాణిని జేరి ప్రణమిల్లి యిట్లనిరి :
'ఓ యింద్రాణీ! నహుషుడు దురాచారి. నిన్ను కోరుచున్నాడు. అతడు కోపముతో నిన్ను తన చెంతకు పంపుడని మమ్ము పంపెను. మే మతని నింద్రునిగ జేసితిమి. ఇపుడు మన మతని చేతిలోనివారము. ఇంకేమి చేయగలము?' అన విని దీనయునార్తయునై
శచీదేవి బృహస్పతి కిట్లనెను : 'ఓ బ్రాహ్మణోత్తమా ! నిన్ను శరణు వేడుచున్నారు. నన్ను నహుషుని బారినుండి కాపాడుము' అన
బృహస్పతి యిట్లనెను : ఓ దేవీ! నహుషుడు పాపి. కామమోహితుడు. అతనికి వెఱవకుము. నేను సనాతన ధర్మమును కాదని నిన్నతని కప్పగించను. శరణాగతుడగు దుఃఖార్తుని విడిచినవాడు ప్రళయపర్యంతము దుర్విపాక నరకము గూలును.
No comments:
Post a Comment