Thursday, April 30, 2026

Virat Svarupudu - విరాట్‌ స్వరూపుడు

విరాట్‌ స్వరూపుడు

నారదా ! కృష్ణాదేవి విసిరివేసిన ఆ మగ శిశువు ఒక బ్రహ్మకల్ప పర్యంతం మహాజలార్ణవంలో ఏకాకిగా అలా తేలుతున్నాడు. అటుపైని రెండుగా అయ్యాడు. ఆకలితో అలమటించాడు. రోదించాడు. పాలుతాపే తల్లి లేదు. తండ్రి లేడు. నిరాశ్రయుడై అనాథబాలుడుగా పరితపించాడు. ఆకాశంవైపు చూస్తున్నాడు. ఆ శిశువు అణోరణీయాన్‌, మహతో మహీయాన్‌. తేజస్సులో కృష్ణపరమాత్మకు ఇతడు పదహారవ అంశ. సర్వవిశ్వానికీ అతడే ఆధారం. ప్రాకృత రూపంలో ఉన్న మహావిష్ణువు. మహావిరాట్‌ స్వరూపుడు.

ఇతడి రోమకూపాలలో ఎన్ని విశ్వాలు ఉన్నాయో లెక్కపెట్టి చెప్పడం కృష్ణుడికికూడా సాధ్యం కాదు. అలాగే బ్రహ్మవిష్ణుశివాదుల సంఖ్యకూడా అనంతం. ప్రతి విశ్వంలోనూ వీరున్నారు. పాతాళం నుంచి బ్రహ్మలోకాంతంవరకూ దాన్ని బ్రహ్మాండం అంటారు. దానికి పైని ఉన్నది వైకుంఠం. అది బ్రహ్మాండానికి ఆవల ఉంది. దానికి పైని పంచాశత్కోటియోజనదూరంలో గోలోకం ఉంది. కృష్ణుడు ఎలా నిత్యసత్యస్వరూపుడో అలాగా ఈ గోలోకమూ నిత్యసత్యస్వరూపం.

ఇంక భూగోళం సప్తద్విప పరిమితం. సప్తసాగరపరివృతం. ఒకటి తక్కువగా యాభై ఉపద్వీపాలున్నాయి. పర్వతాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. ఈ భూగోళానికి పైని బ్రహ్మలోకంవరకూ ఎడు స్వర్గలోకాలున్నాయి. కింది భాగాన సప్తపాతాళాలున్నాయి. ఇదంతా కలిపి బ్రహ్మాండం. భూర్లోక భువర్గోక స్వర్లోక జనలోక తపోలోక సత్యలోకాలకుపైని తప్తకాంచన సన్నిభమై బ్రహ్మలోకం ఉంది. ఇదంతా కృత్రిమం. బాహ్యాభ్యంతర వినాశంతో సర్వమూ నశిస్తుంది. ఈ విశ్వసమూహం జలబుద్బుదం లాంటిది. అనిత్యం. మొత్తం అన్నిలోకాలలోకీ నిత్యమైనవి రెండే రెండు - గోలోకమూ వైకుంఠమూ. ఇవి రెండూ అకృత్రిమాలు.

రోమరూపాలనుంచి ఆవిర్భవించిన అసంఖ్యాక బ్రహ్మాండాలలో అసంఖ్యాక త్రిమూర్తులుంటారనీ అసంఖ్యాకంగా దేవతలుంటారనీ (ఒక్కొక్క బ్రహ్మాండంలోనూ ముక్కోటి చొప్పున) దిక్పాల. నక్షత గ్రహాదులుకూడా అసంఖ్యమనీ చెప్పాను గుర్తుందికదా ! ఆది అలా ఉండనీ. ఈ భూలోకంలో చతుర్వర్థాలవారూ అసంఖ్యాకంగా ఉన్నారు. ఆధోలోకాలలో నాగజాతివారుంటారు.

నారదా ! ఆకలిగొన్న ఆ శిశువు జలార్జవంలో ఎకాకిగా తేలుతూ ఆకాశంవైపు చూస్తున్నాడు. తాను తప్ప ఎక్కడా ఎమీ కనిపించడం లేదు. దిగులు పడ్డాడు. రోదించాడు. కొంతకాలానికి జ్ఞానోదయమయ్యింది. పరమ పురుషుడైన కృష్ణుణ్ణి ధ్యానించాడు. సనాతన బ్రహ్మజ్యోతి ప్రత్యక్రమయ్యింది, అది తొలకరిమబ్బులాగా నీలంగా ఉంది. పీతాంబరం ధరించి చిరునవ్వులు చిందిస్తోంది. ఒక చేతిలో మురళి. మరొకటి అభయహస్తం. ఆ తేజస్సును చూడటంతోనే బాలకుడు సంతృప్తి చెందాడు. ఆ పరమేశ్వరుడూ ఆనందించాడు. సమయోచితంగా ఒక వరం ప్రసాదించాడు.

వత్సా! జ్ఞానయుక్తుడవై నాతో సమానుడవవుతావు. ఆకలి దప్పికలు ఉండవు. ఈ అసంఖ్యాక బ్రహ్మాండాలు నీ నిలయాలు. లయపర్యంతం ఇది నీకు వరం. నిష్కాముడవూ నిర్భయుడవూ, అందరికీ వరదుడవు. జరా మృత్యు రోగ శోక పీడా వివర్జితుడవు - అని ఆశీర్వదించి ఆ శిశువు చెవిలో షడక్ష్తరమహామంత్రాన్ని ముమ్మూరు ఉపదేశించాడు. అది సర్వవిఘ్నహరమైన మహామంత్రం. ప్రణవాది. చతుర్థ్యంతమైన కృష్ణ శబ్దం. స్వాహాంతం. ఓం కృష్ణాయ (నమః) స్వాహా -

మంత్రాన్ని ఉపదేశించాక ఆ శిశువుకి ఆహారాన్ని కల్పించాడు పరమాత్మ ఆ విశేషమూ చెబుతాను తెలుసుకో. ఈ లోకంలో విష్ణుభక్తుడు నైవేద్యంగా సమర్పించినదాంట్లో పదహారవవంతు మాత్రమే వైకుంఠ నాథస్వామికి చెందుతుంది. తక్కిన పదిహేనువంతులూ విరాడ్రూపుడైన ఆ శిశువుకే చెందుతుంది ఆని కృష్ణపరమాత్మ నియమం చేశాడు. నిర్గుణుడూ పరిపూర్ణతముడూ కేవలం ఆత్మస్వరూపుడూ అయిన కృష్ణపరమాత్మకు నైవేద్యాలతో పనిలేదు. ఎవరు ఏ నైవేద్యాలు సమర్పించినా అటు లక్ష్మీనాథుడైవ వైకుంఠుడూ ఇటు విరాడ్రూపుడైన శిశువూ - ఇద్దరే ఆస్వాదిస్తారు.

ఇలా మంత్రం ఇచ్చి, వరం ఇచ్చి, ఆహారం ఏర్పరచి కృష్ణపరమాత్మ ఆ బాలకుణ్ణి ఇంకా ఏమైవా కావాలా, అడుగు - అన్నాడు. ఆప్పుడు ఆ డింభకుడు వినయంగా పలికాడు.

పరమాత్మా ! నీ పాదపద్మాలపట్ల నాకు నిశ్చలమైన భక్తిని ప్రసాదించు. నా జీవితం క్షణమో శాశ్వతమో, అంతవరకూ నీ భక్తుడుగావే నేనుండాలి. ఈ లోకంలో నీ భక్తుడు జీవన్ముక్తుడు. నీపట్ల భక్తిలేవి జీవచ్చవం.

కృష్ణభక్తి లేనివాడు తపస్సు చేసినా యజ్ఞాలు చేసినా పూజలు చేసినా వ్రతాలు చేసినా ఉపవాసాలు చేసినా తీర్థయాత్రలు చేసినా అంతా వ్యర్థం. అతడొక మూర్ఖుడు. అతడి జీవితం వ్యర్థం. అతడి ఆత్మ అతడిని నిందిస్తుంది. అతడి శరీరంలో ఆత్మ ఉన్నంతకాలం అతడు శక్తియుతుడుగా కన్పిస్తాడు. ఆత్మ వెళ్ళిపోయాక సర్వశక్తులూ నిష్క్రమిస్తాయి. అవ్వి సర్వతంత్ర స్వతంత్రాలు. కృష్ణపరమాత్మా! ఆ ఆత్మవు నువ్వే. సర్వాత్మవు. ప్రకృతికన్నా పరుడవు. స్వేచ్చామయుడవు. సర్వాద్యుడవు. బ్రహ్మజ్యోతివి. సనాతనుడవు.

బాలకుడి మాటలకు కృష్ణపరమాత్మ మురిసిపోయాడు. మధురంగా బదులు పలికాడు. బాలకా! నాలాగే నువ్వూ చిరకాలం సుస్థిరంగా ఉండు. ఎందరు బ్రహ్మలు నశించినా నీకుమాత్రం నాశనం లేదు. ప్రతిబహ్మాండంలోనూ నువ్వు అంశమాత్రుడుగా లఘువిరాడ్రూపంలో ఉండు. నీ నాభికమలంనుంచి విశ్వస్రష్ట అయిన బ్రహ్మ అవతరిస్తాడు. ఆ బ్రహ్మకు ఫాలభాగం నుంచి ఎకాదశ రుద్రులు ఆవిర్భవిస్తారు. వారంతా శివాంశలు. సృష్టిసంహారకారణులు. వారిలో ఒకడైన కాలాగ్నిరుద్రుడు విశ్వసంహారకారకుడు. విశ్వసంరక్షకుడుమాత్రం విష్ణువే. అతడూ రుద్రాంశమే. బాలకా! నాపట్ల నీకు భక్తి నిశ్చలంగా ఉండేట్టు వరమిస్తున్నాను. ధ్యానంలో నిత్యమూ నన్నూ నావక్షః స్థలనివాసినినీ చూడగలుగుతావు. వత్సా! నా లోకానికి నేను వెడుతున్నాను. ఇక నువ్వు ఉండు - అని కృష్ణపరమాత్మ అంతర్ధానం చెందాడు.

తన లోకానికి వెళ్ళీవెళ్ళడంతోనే బ్రహ్మనూ శంకరుణ్డీ పిలిచాడు. వత్సా! చతుర్ముఖా! సృష్టిని ఆరంభించు. శిశువు నాభికమలంనుంచి ఆవిర్భవించు. నాయనా! మహాదేవా! బ్రహ్మకు ఫాలభాగంనుంచి నువ్వు అవతరించు. చిరకాలం తపస్సు చెయ్యి - అని ఆజ్ఞాపించాడు. ఇద్దరూ కృష్ణపరమాత్మకు నమస్కరించి బయలుదేరారు.

బ్రహ్మాండగోళంలో మహాజలార్ణవంలో శిశురూపంలో ఉన్న విరాడంశమూర్తిని దర్శించారు. నీరదశ్యాముడు. యువ. పీతవాససుడు. జలతల్పం మీద శయనించి ఉన్నాడు. ప్రసన్నవదనుడు, చిరువవ్వులు చిందుతున్నాడు. అతడు విశ్వవ్యాపి - జనార్దనుడు. అతడి నాభికమలంనుంచి బ్రహ్మ అవతరించాడు. పద్మనాళంలోకి దిగాడు. సృష్టి లక్షణమేమిటో తెలుసుకుందామని అన్వేషించాడు. ఎంతదిగినా ఆ పద్మనాళానికి అంతం కనిపించలేదు. మళ్ళీ పద్మంలోకి వచ్చాడు. ఎమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి ? చింతాపరవశుడయ్యాడు. కృష్ణపాదపద్మాలు ధ్యానించాడు. దివ్యచక్షువులకి - జలతల్పంమీద శయనించి ఉన్న బాలుడే కనిపించాడు. అతడి రోమకూపంలో బ్రహ్మాండం కనిపించింది. అటు పైని కృష్ణపరమాత్మ కనిపించాడు. గోలోకంలో గోపగోపీ సమన్వితుడై కనిపించాడు. అతడిని స్తుతించి వరం పొంది సృష్టి ఆరంభించాడు చతుర్ముఖుడు.

బ్రహ్మదేవుడికి సనకసనందనాదులు మానసపుత్రులుగా జన్మించారు. ఎకాదశరుద్ర కళలు ఫాలభాగంనుంచి ఆవిర్భవించాయి. వామభాగంనుంచి విష్ణువు రక్షకుడుగా అవతరించాడు. అతడు చతుర్భుజుడు. శ్వేతద్వీపంలో నివాసం ఎర్పరుచుకున్నాడు.

అటుపైని విరించి విశ్వాన్ని సృష్టించాడు. స్వర్గమూ మర్త్యలోకమూ పాతాళమూ చరాచరజగత్తునీ కల్పించాడు. ఇలా ప్రతిరోమకూపంలోనూ ఒక్కొక్క విశ్వాన్ని ఒకొక్క బ్రహ్మ సృష్టించాడు. ప్రతి విశ్వంలోనూ త్రిమూర్తులున్నారు.

నారదా ! ఇది కృష్ణపరమాత్ముని గుణకీర్తనం. ఇది శుభప్రదం. మోక్షప్రదం. ఇంకా ఏమి వినాలనుకుంటున్నావో అడుగు అన్నాడు నారాయణమహర్షి.

శౌనకాది మహామునులారా! నారదనారాయణ సంవాదం శ్రద్ధగా వింటున్నారుకదా! అని సూతుడు హెచ్చరించాడు. నారదుడు మళ్ళీ నారాయణమహర్షిని అడుగుతున్నాడు. వినండి 

సరస్వతీ పూజ


No comments:

Post a Comment

Virat Svarupudu - విరాట్‌ స్వరూపుడు

విరాట్‌ స్వరూపుడు నారదా ! కృష్ణాదేవి విసిరివేసిన ఆ మగ శిశువు ఒక బ్రహ్మకల్ప పర్యంతం మహాజలార్ణవంలో ఏకాకిగా అలా తేలుతున్నాడు. అటుపైని రెండుగా అ...