ఇంద్రుడు మరల విప్ర వేషమున నేతెంచి చతురోక్తులతో నతనికి వెళ్ళవద్దని పల్మారులు వారించెను. అట హరిశ్చంద్రు డతిశోకార్తుడై తన రోగము పోవునట్టి యుపాయము చెప్పమని పురోహితుడగు వసిష్ఠునడిగెను.
అంత వసిష్ఠు డిట్లనెను: ''రాజా! డబ్బిచ్చి యొక కుమారుని కొనుము. అతడు కొడుకు వంటివాడు. అతనితో యాగము చేయుము. నీ శాపము తీరిపోవును. పుత్రులు పది విధములని వేదపారగులగు విప్రుందురు. వారిలో క్రీతుడును నొక విధమగు కొడుకే.
కనుక రాజా! డబ్బున కమ్ముడుపోయిన వానిని నీ కొడుకుగ జేసికొనుము. నీ దేశములోని యే విప్రుడైన డబ్బున కానపడి తన కొడుకు నమ్ముకొనును. అట్లు చేసినచో వరుణుడు తప్పక ప్రసన్నుడై నీకు మేలు చేకూర్పగలడు.'' అనిన వసిష్ఠుని వచనములచే రాజు చోదితుడై యొక విప్రకుమారుని కొనితెచ్చుటకు మంత్రిని బంపెను.
హరిశ్చంద్రుని యేలుబడిలో ఆజీగర్తుడన నొక బీదబ్రాహ్మణుడు గలడు. అతనికి మువ్వురు కొమరులు.
మంత్రి బీద బాపనితో నిట్లనెను: మారాజు చేయు యాగమునకై నీకుగల శునః పుచ్చుడు శునః శేపుడు శునోలాంగూలు డను ముగ్గురు కొమరులలో నొక్కని నిమ్ము. మారుగ నూఱావు లీయగలను. అజీగర్తు డాకలిమంటతో నక నక లాడుచుండెను. అతడది విని తన కొడుకులలో నొక్కని నమ్ముటకు నిశ్చయించుకొనెను.
జ్యేష్ఠుడు కర్మాధికారి. కనుక విప్రుడతని నీయలేదు. ముద్దులకొడుకగు చిన్న వానిని తల్లి ఈయననెను. ఇక మిగిలిన నడిమివాడగు శునః శేపుని విప్రుడు నూఱావుల కమ్మెను. రాజతనిని నరయజ్ఞమునకు పశువుగ సిద్ధపరచెను.
ఆ బాలుడు యూపస్తంభమునకు కట్టబడి దీనముగ బిగ్గరగ వడకుచు వాపోవుటగని యచటి మునులెల్లురు బాధ పడిరి. ఆ నరపశువును చంపుమని రాజు శామితకు ఆజ్ఞ యీయగ నతడా సుకుమారుని చంపుటకు చేయాడక యాయుధము పట్టనేలేదు.
దీనముగ కరుణరసము పెల్లుబుకునట్టు లేడ్చుతున్న బాలుని నేను నా లోభముకొఱకు చంపజాలననీ స్పష్టముగ చెప్పి వేసెను.
ఇట్లతడు చేయరానిపని చేయుటకు నిరాకరించెను. అపుడిక కర్తవ్య మేమని రాజు సభాసదుల నడిగెను. అట్లు శునఃశేపుడు పెద్దగ బావురుమీ యేడ్చుచుండగ సభాజనులలో పెద్ద గగ్గోలు బయలుదేరెను.
అంతలో అజీగర్తుడు లేచి రాజున కిట్లనెను. రాజా! నీవు నిశ్చింతగ నుండుము. నీ పని నేను నెఱవేర్పగలను. నేను ధనార్ధిని. కాన నిబ్బడి ధనమిమ్ము. నేనితనిని చంపినీ యాగము పూర్తి గావింతును. ధనాశచే పీడితుడైన వానికి పుత్రుల యందును ద్వేషబుద్ది పుట్టును.
విప్రుని మాటలు విని హరిశ్చంద్రుడు సంతోషించెను. అంత రాజు నీకు మఱియొక నూరావు లిత్తునని పలుకగనే బ్రాహ్మణుడు తన కొడుకును చంపబూనుకొనెను. అట్లు విప్రుడు ధనాశకు లోబడి తనకున్న కొడుకును చంపుటకు తలపడుట సభలో వార్లెల్లరును చూచిరి. వారు మిక్కిలిగ దుఃఖించుచు హాహారవములు మిన్ను ముట్ట విల్లనిరి.
ఇతుడు విప్రరూపముదాల్చిన పీశాచమో! పాపి! క్రూరుడు. కులము చెడబుట్టిన తండాలుడా! ఎంతటిపాపకర్మకొడి గట్టితివిరా! నీకన్నకొడుకునే చంపదలతివిరా! పాపాత్ముడా: కన్న కొడుకునే చేతులార చంపుకొని డబ్బుమూట గట్టి యేమి సుకమనుభవింపదలంచితివిరా! నీ యంగాల నుండి నీ యాత్మగ కొడుకుగ పుట్టెనని వేదమనునుగదా! పాపమతీ! నీ కన్నకోడుకు నెట్లు చంపదలంచితివి.
ఇట్లు పెద్ద కోలాహలము బయలుదేరగ నంతలో విశ్వామిత్రుడరుగుదెంచెను.
విశ్వామిత్రుడు రాజు తెంతకేగి దయతో నతని కిట్లనెను. రాజా! ఈ శునఃశేపుడు మిక్కిలి విలపించుచున్నాడు. ఇతనిని విడిచిపెట్టుము. నీ యాగము పూర్తియగను. నీ రోగనాశమును జరుగును. దయతో సనునమైన ప్యుణము హింసతో సమమైన పాపము లేదు. తన దేహము గాపాడుకోనుట కితర దేహములను పీడించిహింసించుట పేరాస లోఘము గల వారి కిష్టమైన పనియని యెఱుగుము.
రాజా! విశ్వకల్యాణము గోరువాడెవ్వడు నిట్టి నీచమైన పని చేయరాదు. ఏ విధముగనైన నెల్ల భూతములందు దయ బూనవలయును. సకలేంద్రియములు వశములో నుంచుకొనిన వానియెడ భగవంతునకు దయ గల్గును.
రాజా! సర్వప్రాణుం లాత్మసములని యెఱుగుము.ఎల్లవారి కెల్లెడల ప్రియము చేకూర్చుచు జీవింపవలయును. ఇక నీ వీ విప్ర బాలుని చంపి నీ దేహసుఖము గోరుకొనుచున్నావు. నీవలె నితడును తన దేహసౌఖ్యము తాను చూచుటకొనును గదా!
రాజా! వెనుకటి జన్మములోని పగ మఱుజన్మములో తీర్చబడును. ఏ పాప మెఱుగని యి బాలుని నీ వెట్లు చంపదలచితివో అట్లే అతడును మఱొక జన్మములో నిన్ను చంపదలడు. కొందఱు పగ లేకున్న నునితరులను తమ మేలునకు హింసితురు చంప బడినవాడు వేరొక జన్మములో తన్ను చంపినవానిని చంపును.
ఈ విప్రుడు ధనాశచే దుష్టుడై తన కొడుకునే యమ్ముకొనెను. ఇతుడు ధనాశచే నింటి పాపాచారి-దుర్మతి-యయ్యెను. పెక్కురు కొడుకులు పుట్టవలయునని కోరుకొనువలయును. ఏలన నొకడైన గయకు వెళ్ళగలడు. వారిలో నొకడైన నశ్వమేధము చేయును. ఆబోతు నచ్చువేయును అని తలంచవలయును.
దేశములో నెవడైన పాపము చేయవచ్చును. ఆ పాపములోని యారావపాలుతప్పక రాజనుభవించును. కనుక పాపము చేయ రాదని రాజు పావులను శాసించవలయును.
విప్రుడు తనకొడుకు నమ్ముకొనుచుండగ నీ వతనిని నివారింపలేదు. నీవు త్రిశంకు తనుయుడు. అంతేకాక సూర్యవంశసంజాతుడవు. రాజా! నీ వార్యుడవు. అనార్యుడు చేయుపని చేయకుము. ఈ విప్రబాలుని నదలుము. నా మాట పాటించుము. నీ శరీరమునకు తప్పక సుఖము గల్గును. మున్ను నీ తండ్రి శాపవశమున చండాలుడయ్యెను.
అతడు తన దేహముతో స్వర్గమున కేగెను. దానికి నేనే కారణము. రాజా! అట్టి ప్రేమతో నీవును నా మాట నమ్ముము. ఇచట భోరున నేడ్చుచున్న బాలుని విడిచిపెట్టుము ఈ రాజసూయయాగమున నేను నిన్ను కోరునది దొక్కటే.
రాజా! నా యీ విన్నప మాలింపనిచో దానివలన నీకు దోషము తగులును. ఏలన నీ జన్న ముందు యాచుకుని కోర్కి తప్పక తీర్చవలయును గదా. నే చెప్పినట్లు చేయనిచో నీకు పాపము తగలును. అను విశ్వామిత్రుని వాక్కులు రాజు వినెను.
అపుడు రాజు మునిసత్తముడగు విశ్వామిత్రునితో నిట్లనెను. ఓ విశ్వామిత్రమునీ! నేను జలోదరవ్యాధిచే మిక్కిలి బాధ పడుచున్నాను. కనుక నేనీ బాలుని వదలను. వేరొకటి కోరుకొనుము. ఈ సమయమన నీ పట్టుదల సడలింపుము. నా పని కడ్డు రాకుము. అను రాజు మాటలువిని విశ్వామిత్రుడు కోపోద్రిక్తుడై దీనాతిదీనుడైన విప్రబాలకునిగనిమిక్కిలి బాధ పడెను.
No comments:
Post a Comment