Sunday, April 19, 2026

A physical paradise for Trishanku - త్రిశంకుడికి సశరీర స్వర్గం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - త్రిశంకుడికి సశరీర స్వర్గం

అపుడు మహాతపస్వియగు విశ్వామిత్రుడు తన మదిలో నాలోచించుకొని యజ్ఞ ద్రవ్యములు కూర్చుకొని మునుల కాహ్వానములు పంపెను. మునులెల్లరును విశ్వామిత్రుని మంత్రితులై యాగముగూర్చి వినిరి. కాని వసిష్ఠుడు వారింపగ వారు యాగమునకు వెళ్ళలేదు.

ఇదంతయును విశ్వామిత్రుడు విని మనసు కలతజెందగ బాధపడి త్రిశంకు రాజున్న చోటి కరిగెను. ''రాజా! వసిష్ఠుడాటంకము చేయగ బ్రాహ్మణు లెల్లరును నీ యజ్ఞమునకు వచ్చుట మానివేసిరి. ఐన నేమి నేను నాతపశ్శక్తి వలన నిన్నపుడే స్వర్గమున కంపి నీ కోర్కి దీర్చగలను. అని మునివరుడు దోసిట నీళ్ళు దీసికొని గాయత్రితో నభిమంత్రించి తన గాయత్రీ జప పుణ్య మతనికి ధారపోసెను. 

ముని రాజునకు తన పున్నెము ధారపోసి రాజా! నీ విపుడు స్వేచ్ఛగ స్వర్గమున కేగుము. రాజేంద్రా! నేనెంతయో కాలము శ్రమము వెచ్చించి సంపాదించిన గాయత్రీ జప పుణ్య మున స్వర్గమేగుము. అట నీకు మేలగునని మునియనెను. 

విశ్వామిత్రుడు ఇట్లు పలికిన వెంటనే త్రిశంకుడు ముని తపో బలముతో పక్షివలె పైకెగిరెను. అట్లు రాజు స్వర్గ పురమున కెగయగనే దేవగణములు క్రూర చాండల రూపముననున్న రాజును చూచిరి.

దేవతలింద్రున కిట్లనిరి: దేవతవలె వాయువేగమున నాకాశమున చండాల రూపమున వచ్చువాడెవడు? ఇంద్రుడు వెంటనే లేచి వచ్చుచున్న పురుషాధముని జూచి యతనిని త్రిశంకునిగ నెఱిగి తిరస్కారముతో నిట్లనియెను. 

'ఓరి చండాలుడా! ఈ కంపుగొట్టు రూపముతో దేవలోకమున కేల వచ్చుచున్నావు? నేలమీదికి వెళ్ళుము. ఇచట నుండుటకు నీవు తగవు'. 

రాజా! అటు లింద్రునివలన పున్నెము నశించిన అమరునివలె త్రిశంకుడు స్వర్గసీమనుండి క్రిందపడు చుండెను. 

అపుడు విశ్వామిత్రా : కాపాడుకాపాడుము. దుఃఖార్తితో స్వర్గమునుండి క్రిందపడుచున్నాను. అని రాజు బిట్టురోదించెను. అట్లు పెద్దగ నేడ్చుచున్న రాజుని గని విశ్వామిత్రముని ఆగుమాగుమని పలికెను. 

త్రిశంకుడు స్వర్గమునుండి భ్రష్టుడైనను మరల ముని తపః ప్రభావమున నాకాశమున నడుమ నాగెను. అపుడు విశ్వామిత్రు డచట రెండవ స్వర్గలోకము నిర్మింపదలచి యజ్ఞము చేయుటకు నీరుముట్టి సంకల్పించెను. ముని పూనిక తెలిసికొని యింద్రుడు త్వరితముగ విశ్వామిత్రుడున్నచోటికేగి యిట్లనెను. 

ఓ బ్రాహ్మణోత్తమా! సాధూ! మునివర్యా! ఈ కోపమేమి? ఈ చేయునదేమి ఇక నీ ప్రతిసృష్టి చాలించుము. నీకేమి కావలయునో కోరుము.

విశ్వామిత్రు డిట్లనియెను : ఓ విభూ ! త్రిశంకురాజు స్వర్గచ్యుతుడయ్యెను. దుఃఖించుచున్న త్రిశంకుని ప్రీతితో మరల నీ లోకమునకంపుము అనెను. విశ్వామిత్రుని తపోబల మింద్రునకు తెలియును. అందుచే నింద్రు డతనికెదురాడలే కటులే యని యంగీకరించెను. 

ఇంద్రుడు త్రిశంకుని దివ్యదేహునిగజేసి వామానమున గూర్చుండబెట్టి విశ్వామిత్రు ననుమతి పడసి స్వర్గమేగెను. ఇంద్రుడు త్రిశంకుని వెంటతీసుకొని స్వర్గమేగిన పిమ్మట విశ్వామిత్రుడు తన యాశ్రమములో సుఖము లతో నుండెను. 

విశ్వామిత్రుని మహోపకారమున తన తండ్రి స్వర్గమేగుట విని హరిశ్చందుడు సంతోషించి దేశమును చక్కగ నేలెను. అయోధ్యాపతియగు హరిశ్చందుడు సంప్రీతితో రూపము నిండుపరువము నేర్పగల తన భార్యతో సుఖముల తేలి యాడుచుండెను. ఎంత కాలమైనను రాణి గర్బిణి గాలేదు. అందులకు రాజు చింతాక్రాంతుడై లోలోన మిక్కిలి విచారించుచుండెను. 

హరిశ్చంద్రుడి పుత్రవ్యామోహం

No comments:

Post a Comment

Varuna Deva kind to Sunashshepa - శునశ్శేపుడికి వరుణకటాక్షం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - శునశ్శేపుడికి వరుణకటాక్షం వ్యాసుడిట్లనెను:  అట్లు దుఃఖార్తితో విలపించున్న శునఃశేపుని గని విశ్వామిత్రుడు దయా...